ఈ సాహిత్య నోబెల్ మరో ‘రాజకీయ’ దురాక్రమణ!

untitled

ప్రతి యేటా అక్టోబర్ మొదటి వారం రాగానే సాహితీ ప్రియులంతా ఆత్రుతగా యెదురు చూసేది, ఈ యేడు సాహిత్యంలో నోబెల్ బహుమతి యెవరికొస్తుందా అని! దాదాపు నెల రోజుల ముందు నుండే ప్రపంచ వ్యాప్తంగా నోబెల్ బహుమతి విజేతలు యెవరౌతారా అని బెట్టింగ్ ప్రారంభమౌతుంది! ఇంగ్లాండ్ కు చెందిన లాడ్ బ్రోక్స్ అనే బెట్టింగ్ సంస్థ వెబ్ సైట్ లో ప్ర్తతి యేడు లాగానే ఈ సంవత్సరం కూడా యెవరు నోబెల్ ఫేవరైట్స్ అని బెట్టింగ్ ప్రాంభమైంది . జపాన్ కు చెందిన నవలా రచయిత హారుకి మురకామి, సిరియా కు చెందిన మహాకవి అదోనిస్, అమెరికా కు చెందిన నవలా రచయిత ఫిలిప్ రాథ్ అమెరికా కవి గాయకుడు బాబ్ డిలాన్ తదితరులు దాదాఉ ప్రతి సారీ ఈ బెట్టింగ్ లలో ప్రధానంగా కనబడతారు.

కీన్య రచయిత గూగీ

కీన్య రచయిత గూగీ

అయితే ఈ సారి దాదాపు అన్ని బెట్టింగ్ లలో ప్రముఖ కేన్యా రచయిత న్గూగి వాథియాంగో ముందు వరసలో వినబడింది. గత రెండు మూడు యేండ్లుగా అదోనిస్ పేరూ వినబడింది. అమెరికన్ నవలా రచయిత ఫిలిప్ రాథ్ ప్రతి యేటా వినబడుతూనే ఉంది. బహుశా నాలాంటి వాళ్ళకు మాత్రం న్గూగి పేరు వినబడడం చాలా సంతోషాన్నిచ్చింది. ప్రజల విముక్తి కోసం నిలబడి, ప్రజా ఉద్యమాల్లో భాగమై, ప్రజాస్వామ్యం కోసం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం రచనలు చేసి, అనేక మార్లు జైలు పాలయి, ప్రవాసంలోకి నెట్టబడి , వ్యక్తి గతంగా యెన్నో ఒడిదుడుకులకు, ఇబ్బందులకు, కష్టాలకు లోనైనా వెనుకంజ వేయకుండా గొప్ప నిబద్దతతో ఉద్యమ సాహిత్యం సృష్టిస్తున్న న్గూగి కి నోబెల్ రావచ్చేమో అని ఒకింత ఆశ కూడా కలిగింది. నిజానికి గత రెండు మూడేళ్ళ నుండి అరబ్ మహాకవి అదోనిస్ కు రావాలని చాలా ఆశ కూడా ఉండింది. పాలస్తీనా మహాకవి దార్వీష్ ని (ఆయన జీవించి ఉన్నపుడు) , అదోనిస్ ని , న్గూగి ని నోబెల్ కమిటీ గుర్తిస్తుందని అనుకోవడం అత్యాశే నేమో!

అవార్డుల పట్ల మోజూ, యేవో అవార్డులొస్తేనే రచయితలు కవులు గొప్పవారనే దురభిప్రాయం లేకున్నా, ఆ అవార్డ్ ద్వారా, ముఖ్యంగా నోబెల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అవార్డు ద్వారా వారు ప్రతినిధులుగా ఉన్న ప్రజలూ వారి ఉద్యమాలూ , కన్నీళ్ళూ, కష్టాలూ, యుద్ధాలూ, జీవన్మరణ పోరాటాలు – వీటన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుందనీ, వెలుగు లోకి వస్తాయనీ ఒక ఆరాటం! వాటికి ఒక వేదిక, జాగా దొరుకుతుందని తండ్లాట!

చివరకు సాహిత్యం లో నోబెల్ ప్రకటించబడ్డది – ఫ్రెంచి రచయిత పాట్రిక్ మాడియానో కు నోబెల్ ఇచ్చారు. నాజీ దురాక్రమణలో నలిగిపోయి మరుగునపడిన జీవన ప్రపంచాల్ని , పట్టుచిక్కని మానవ అనుభవాలని ఆయన రచనల్లో గొప్ప గ్నాపక కళతో వెలికితీసినందుకు’ ఆయనకు నోబెల్ ఇచ్చినట్టు కమిటీ ప్రకటించింది. యెప్పుడూ వినలేదు చదవలేదు యెవరీ మాదియానో అని దాదాపు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది ఒక్క ఫ్రెంచివాళ్ళు తప్ప. ఫ్రాన్సు లో ఆయన బాగా ప్రసిద్ధి చెందిన రచయిత నట! కొన్ని మినహాయింపులతో ఆయన ప్రముహ ఫ్రెంచి రచయిత ప్రౌస్ట్ అంత వాడట! ‘తప్పిపోయిన మనిషి’ అనే 130 పేజీల నవల ఫ్రాన్సు లో బాగా ప్రసిద్ది చెందినదట! తన గ్నాపకశక్తి కోల్పోయిన ఒక డిటెక్టివ్ తన అస్తిత్వం కోసం చేసిన ప్రయత్నాన్ని ఆ నవల చిత్రించిదట! డిటెక్టివ్ నవలా ప్రక్రియకి (genre) చెందినదట! కోల్పోయిన జీవితాన్ని వెతుక్కోవడం లో ఉండే సమస్యలని (వెతుక్కోవడమూ, పొందడమూ, దాన్ని అర్థం చేసుకోవడమూ కాదు) మాదియానో తన రచనలలో చిత్రించాడని, చాలా సరళంగా , సులభంగా రాసినట్టున్నా మాదియానో రచనల్లో అత్యంత సంక్లిష్టమైన మానవ జీవితం ప్రతిఫలిస్తుందని పత్రికలు రాసాయి.

అయితే మాదియానో ఫ్రెంచ్ దేశస్తుడు – ఇప్పటి దాకా 14 ఫ్రెంచి రచయితలకు నోబెల్ వచ్చింది. ఈయన 15 వ వాడు. మాదియానో యూదుడు – ఇప్పటిదాకా 13 మంది యూదులకు (కేవలం సాహిత్య రంగంలోనే ) నోబెల్ వచ్చింది ఈయన 14 వ వాడు. అట్లా అని ఫ్రెంచి వాళ్ళకు యూదులకు నోబెల్ రావద్దని కాదు – కేవలం ప్రతిభనాధారం చేసుకునే నోబెల్ ఇస్తున్నారని మనమనుకుంటే అది అసాధ్యం కూడా కాకపోవచ్చు! కానీ నోబెల్ ప్రధానంగా ఐరోపా వారినే వరిస్తుందనీ, అదీ 1948 తర్వాత యూదులకే ఎక్కువసార్లు ఇచ్చారనీ (సాహిత్యమూ యితర రంగాల్లో కూడా) అపవాదు నోబెల్ కమిటీ పైనున్నది. అయితే అది పెద్ద సమస్య కాదు.

నిజంగానే యూదులు ప్రతిభావంతులు కాబట్టి వారికే నోబెల్ వస్తుందనీ అనుకోవచ్చు. నాజీ దురాక్రమణ , హోలోకాస్ట్ అనేవి మానవ జాతి చరిత్రలో పెద్ద మచ్చలే! వాటి గ్నాపకాలు వెంటాడి వేటాడుతుంటాయి నిజమే! కానీ ప్రధానంగా యూదులచే నడుపబడుతున్న పాశ్చాత్య రాజకీయార్థిక చట్రమూ (ప్రభుత్వాలూ, ఆర్థిక వ్యవస్థలూ ) దాని చే నియంత్రించబడుతూ తిరిగి దానిని ప్రభావితం చేస్తున్న సాంస్కృతిక వ్యవస్థా నాజీ దురాక్రమణనూ, హోలోకాస్టునూ విపరీతంగా ప్రచారం చేసాయి. ప్రపంచ సాంస్కృతిక చరిత్రా గమనమూ అంతా వాటిచుట్టే తిప్పాయి. అవే యింకా ప్రదాన సమస్యలుగా, అవి తప్ప ప్రపంచప్రజలకు యింక వేరే యే కష్టాలూ కన్నీళ్ళూ లేవన్నట్టుగా తీవ్రంగా ప్రచారం చేసి వాటిని ఒక సాంస్కృతిక వ్యవస్థలుగా యేరాటు చేసినయి. ఒక్క తీరుగా మనల్ని నమ్మించినయి.

ఎడోనిస్

ఎడోనిస్

నిజమే నాజీ ల దురాక్రమణలో యూదులు చెప్పనలవి కాని కష్టాలు పడ్డారు. కాదనడం లేదు. చరిత్రలో పాలకులు యెప్పుడూ ఒక పని చేస్తూ ఉంటారు. తమ చరితే ప్రజల చరిత్ర అనీ , తమ కష్టాలే అందరి కష్టాలూ అనీ, తమ సంస్కృతే అందరి సంస్కృతి అనీ ప్రచారం చేసి ఒక వ్యవస్థగా యేర్పాటు చేస్తారు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓటమి తర్వాత దేశదేశాలకు వలసపోయిన యూదులకు ఒకే దేశం పేరు మీద ‘తమ దేశం ఇజ్రాయిల్’ అని ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ఆయువుపట్టైన చమురు విస్తారంగా దొరికే మధ్యధరా సముద్ర తీర ప్రాంతాన్ని కబ్జా చేసుకోవడానికి, అక్కడి అరబ్బుల మీద ప్రత్యక్ష పెత్తనం చలాయించడానికి అమెరికా ఐరోపాలు కుట్రపూరితంగా ఇజ్రాయిల్ ని యేర్పాటు చేసారు. అప్పటిదాకా అక్కడ నివసిస్తున్న పాలస్తీనా ప్రజలని నిర్వాసితుల్ని చేసారు. పాలస్తీనా ప్రజలని తమ దేశంలోనే కాందిశీకుల్ని చేసి ఆ ప్రాంతాన్ని దురాక్రమించుకున్నారు.

యిప్పటికీ ఆ దురాక్రమణ కొనసాగుతున్నది. గత ఆరు దశాబ్దాలకు పైగా అక్కడి ప్రాంతం పాలస్తీనా ప్రజల నెత్తురు కన్నీళ్ళతో తడిస్తున్నది. నిన్న గాక మొన్న ఇజ్రాయిల్ గాజా మీద నెల రోజులకు పైగా యెడతెరిపిలేని దాడులు చేసి ఆప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసి వెయ్యి మందికి పైగా పాలస్తీనా ప్రజలను (స్త్రీలు పిల్లలు ముఖ్యంగా) హత్య చేసి లక్షలాది ప్రజల్ని నిర్వాసితుల్ని చేసింది. ఆ ప్రాంతాన్ని నేలమట్టం చేసింది. నిజానికి నాజీ దురాక్రమణ, హోలోకాస్టు గత ఆరు దశాబ్దాలకు పైగా ఇజ్రాయిల్ అమెరికా ఐరోపా దేశాల సహయంతో పాలస్తీనా ప్రజలమీద చేస్తున్న దురాక్రమణ దాడుల ముందు వెల వెల బోతాయి. ఇజ్రాయిల్ అంత దుర్మార్గంగా దాడులు హత్యలు దురాక్రమణ చేస్తూ అది ఆత్మ రక్షణకోసమే అని బుకాయిస్తోంది కూడా!

బెంజమిన్ నెతన్యాహూ ని మరో హిట్లర్ గా, హిట్లర్ కన్నా దుర్మార్గుడిగా అనేక మంది (ప్రజాస్వామ్య వాదులైన యూదులతో సహా ) వ్యాఖ్యానించారు. జియోనిజం నాజీ లకన్నా దుర్మార్గంగా ప్రవర్తిస్తుందనీ, ప్రపంచాన్ని కబళించాలని పన్నాగాలు పన్నుతుందనీ ప్రజాస్వామిక వాదులు ప్రపంచవ్యాప్తంగా యెలుగెత్తుతున్నారు. నిరసిస్తున్నారు. అయినప్పటికీ జియోనిస్టు దురాక్రమణవాదులచే నియంత్రించబడుతున్న పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నయి. వారి సాంస్కృతిక యంత్రాగాలు మాత్రం యింకా నాజీ దురాక్రమణ గురించీ, హోలోకాస్టు గురించీ, వాటిలో యూదులు పడ్డ కష్టాల గురించీ ఆ గ్నాపకాల గురించీ పదే పదే ప్రచారాలు చేసి ప్రస్తుత చరిత్రలో తాము చేస్తున్న దుర్మార్గాలని, దాడులని, దురాక్రమణలనీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

నోబెల్ కమిటీ జియోనిస్టుల నియంత్రణలో ఉన్న పాశ్చాత్య ఆధిపత్య వ్యవస్థలకు అతీతమైంది కాదు. నిస్సందేహంగా వాటి నియంత్రణ లోనే ఉండి, ఆ పరిధిలోనే పని చేస్తుంది! కేవలం ప్రతిభకే పట్టం కడతామని చెప్పుకున్నా ప్రపంచంలోని ప్రతిభ అంతా పాశ్చాత్య దేశాల్లోనే ఉంది అదీ ఒక వర్గం ప్రజలకే ఉంది అని అవార్డులు ప్రకటించడం యాదృచ్చికమేమీ కాదు. హోలోకాస్టు కి వెయ్యి రెట్లకు మించి దురాక్రమణా దాడులకు, హింసకూ ప్రపంచవ్యాప్తంగా యెన్నో దేశాల్లో ప్రజానీకం గురవుతున్నారు. వారి కష్టాలూ కడగండ్లూ ఆనాడు యూదుల కష్టాలకన్నా నిస్సందేహంగా యెన్నో రెట్లు యెక్కువ కూడా! అది పాలస్తీనా లో కావచ్చు, ఆఫ్రికా దేశాల్లో కావచ్చు, లాటిన్ అమెరికా దేశాల్లో కావచ్చు – ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించి మరో సారి హోలోకాస్టు గ్నాపకాల గురించి రాసిన ఐరోపా యూదునికే సాహిత్యం లో నేబెల్ ఇవ్వడం ఆశ్చర్యమూ అన్యాయమూ కూడా!

నిజానికి సాహిత్యం లో నోబెల్ ఇచ్చే పద్దతి చూస్తే దురాక్రమణలకూ దాడులకు గురవుతున్న దేశాల ప్రజల రచయితలకు ఆ బహుమతి ఇస్తారని ఆశించడం అత్యాశ కూడా! యెందుకంటే వారికి నోబెల్ అవార్డుల కమిటీ లలో యెటువంటి ప్రాతినిధ్యం లేదు గనక!

-నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

మీ మాటలు

  1. అవును…ఇది కొనసాగుతూ వస్తున్న రాజకీయ దురాక్రమణే…
    బాగా చెప్పారు…

  2. P. Ramakrishna says:

    ఈ ప్రాంత. వర్గ రాజకీయాల్ని కాస్తంత ప్రక్కన పెట్టి,
    మాదియానో గారి రచనల్ని చదివి, నోబుల్ కి ఆయన అర్హుడో కాదో విశ్లేషించి వుంటే బాగుండేది సార్.

  3. “నిజానికి సాహిత్యం లో నోబెల్ ఇచ్చే పద్దతి చూస్తే దురాక్రమణలకూ దాడులకు గురవుతున్న దేశాల ప్రజల రచయితలకు ఆ బహుమతి ఇస్తారని ఆశించడం అత్యాశ కూడా! యెందుకంటే వారికి నోబెల్ అవార్డుల కమిటీ లలో యెటువంటి ప్రాతినిధ్యం లేదు గనక!”
    అత్యాశ అని మీరే అంటారు. నోబెల్ ఐరోపా వారినే ఎక్కువగా వరించిందని పాత చరిత్రా చెబుతారు. ప్రజల విముక్తి కోసం, ప్రజాస్వామ్యం కోసం రచనలు చేసేవారికి ఇవ్వలేదని శాపనార్థాలు పెడతారు. నోబెల్ వచ్చిన కవులు, రచయితలే గొప్పవారనే దురభిప్రాయం లేదంటూనే మీరు ఇష్టపడే కవి రచయితలకు నోబెల్ రావాలని కోరుకుంటారు. ‘ప్రపంచ ప్రఖ్యాతి చెందిన’ నోబెల్ మీద మోజూ ఉంటుంది. మళ్ళీ అవార్డుల కోసం వెంపర్లాడుతున్నట్టు కనిపించకూడదు. ఎన్నో ఏళ్లుగా ప్లే చేస్తున్న ఈ అరిగిపోయిన పాత రికార్డును ఇంకా ఎంతకాలం ప్లే చేస్తారు? మీకు ఇది బోర్ కొట్టడం లేదా?

    నోబెల్ ఎవరికో ఇవ్వలేదని తిట్టుకునే బదులు సిరియా, పాలస్తీనా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలే నోబెల్ కు పోటీగా ఒక ప్రపంచ అవార్డును స్థాపించి నోబెల్ విస్మరించిన వాళ్ళకు ఎందుకు న్యాయం చేయకూడదు? మీలాంటి వాళ్ళు ఎందుకు ఇలాంటి ఆలోచనను ఫ్లోట్ చేయరు? నోబెల్ దగ్గర ఉన్నంత దండిగా డబ్బు లేకపోయినా ఉన్నంతలో ఆ పని చేయచ్చు. అవార్డు గొప్పతనానికి డబ్బే మెజర్మెంటు కాదు కదా? మురిక్కాలవలు ఉన్నాయని ఎప్పుడూ తిట్టుకుంటూ కూర్చోడం కాదండీ, మంచి కాలవలను నిర్మించే పనీ జరుగుతూ ఉండాలి,

    • Manjari Lakshmi says:

      చాలా బాగా రాసారండి ” మురిక్కాలవలు ఉన్నాయని ఎప్పుడూ తిట్టుకుంటూ కూర్చోడం కాదండీ, మంచి కాలవలను నిర్మించే పనీ జరుగుతూ ఉండాలి,” ఈ మాట చాలా బాగుంది.

    • Valid point on building fresh canals. But what about these dirty canals? Don’t you think these can also be built again and again by others . It is important to build fresh canals but at the same time it is equally important to recognize and condemn dirty canals otherwise no point in just building good ignoring bad.
      My response is only to this point and not related to the article or Author.

      • Dirty canals will always be there, sir. It is a part of the game. It is the law of the nature. The better way to fight them is creating the better ones only. Without doing that there is no use cursing them all the time. It will only help them prosper. The better canal can only balance the bad one.

  4. P.Jayaprakasa Raju. says:

    “`మురిక్కాలవలు ఉన్నాయని ఎప్పుడూ తిట్టుకుంటూ కూర్చోడం కాదండీ , మంచి కాలవలను నిర్మించే పనీ జరుగుతూ వుండాలి.” – బాగా చెప్పారు.

  5. సింహానికి శాంతి బహుమతి ఇచ్చి నపుడే నోబల్ విలువెంతో తెలియటం లేదా?

  6. Manjari Lakshmi says:

    చాలా బాగా రాసారండి ” మురిక్కాలవలు ఉన్నాయని ఎప్పుడూ తిట్టుకుంటూ కూర్చోడం కాదండీ, మంచి కాలవలను నిర్మించే పనీ జరుగుతూ ఉండాలి,” ఈ మాట చాలా బాగుంది.

  7. నోబెల్ బహుమతి తెల్లవారి చేత తెల్లవారి కోసం ఏర్పడ్డ సంస్థ. అది ఒక Euro-centric fanaticism plus political agenda. At the most, మహా అయితే తెల్లదేశాల అజెండాకి అనుగుణంగా రాసేవాళ్ళని/ చేసేవాళ్ళనీ ఆకాశానికెత్తుతూ బహుమతులు ప్రకటిస్తారు. నోబెల్ లో అమాయకత్వం ఏ కోశానా లేని మాట వాస్తవం. సరే, వాళ్ళకి పక్షపాతాలున్నాయని బాధపడే బదులు మన (ఆసియా వర్ధమాన దేశాల) నోబెల్ బహుమతిని మనం ఏర్పాటు చేసుకోవడం గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? వీలయితే నోబెల్ కంటే ఎక్కువ డాలర్లే ఇద్దాం.

  8. pavan santhosh surampudi says:

    నోబెల్ శాంతి బహుమతిని ఈ సంవత్సరం ఇండో పాక్ కు చెందిన మలాలా-కైలాష్ లకు ఇచ్చారన్నది అందరికీ తెలిసిన విషయమే కదా. మలాలా పాశ్చాత్య మీడియాలో పాక్ దేశపు ఉగ్రవాదుల క్రౌర్యానికి బలవ్వబోయిన వ్యక్తిగా సుపరిచితం కాగా కైలాష్ అంతర్జాతీయ సంస్థల్లో తమ ఉద్యమానికి రిలవెన్స్ ఇచ్చుకున్న వ్యక్తీ. వీరిద్దరూ కూడా కేవలం పాశ్చాత్య మీడియాలో తమకున్న పేరు ప్రఖ్యాతుల వల్లనే నోబెల్ కమిటీ దృష్టిలో పడి ఆ అవార్డు పొందారు. ఇక వీళ్ళిద్దరూ కూడా భారతదేశంలోని అనాగరిక బానిసత్వానికి, పాకిస్తాన్ లో బాలికలను కనీసం చదువుకోనియ్యని క్రౌర్యానికి గుర్తులు. వారిద్దరూ చేసే ఉద్యమాలు గొప్పవే, సమస్యలూ ప్రస్తావనార్హమే. ఐతే పాకిస్తాన్ నుంచి తోలి నోబెల్ శాంతి బహుమతి, భారత దేశంలో జన్మించిన భారతీయ పౌరునికి తోలి నోబెల్ శాంతి పురస్కారమూ ఈ రూపేణా రావడం వెనుకన ఉన్న పరమార్థం వేరు. గత ఏడాది అమెరికాలోని చట్టాల ప్రకారం తనకు వచ్చే జీతం కన్నా తన వద్ద పనిచేసే మనిషికి ఎక్కువ జీతం ఇవ్వలేదని ఓ భారతీయ దౌత్యాదికారిని చట్టాలు ఉల్లంఘించి మరీ చేసిన అరెస్టు, దానికి నిరసనగా భారతదేశం స్పందించిన తీరూ గుర్తున్నవారికి ఈ రెంటికీ మధ్య రిలవెన్స్ అర్థమౌతుంది. తమను దెబ్బకు దెబ్బ తీసినవాడిని కనీసం పిల్లలకు సరైన విద్య కూడా కల్పించలేని వాడిగా చిత్రీకరించే ప్రయత్నం. పైగా ఆ సంఘటనకూ ఈ అవార్డు నేపథ్యానికి ఉన్న పోలికలు మరువరానివి. ఇక తాలిబన్లకు పాశ్చాత్య ప్రపంచానికి మధ్య ఉన్న సమస్య, వారి సంస్కృతిలోని లోటుపాట్లు ప్రదర్శించడంలో వాళ్ళ అవసరమూ వివరణ అవసరం లేనంత తేటతెల్లం. చివరిగా పాక్-భారత్ లను శాంతిగా ఉండమని బోధించడం హైలెట్. అంతా మంచి మాటలేగా అంటే నేనేమీ చెప్పలేను. అవును. మంచి మాటలే. ఐతే అవి చెప్పింది ఎవరు అన్న రిలవెన్స్ చూసుకుంటే తెలుస్తుంది-మంచి వెక్కిరింతో.

  9. నారాయణస్వామి says:

    స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు! అయితే కొన్ని విషయాలు, బహుశా నా రాత లోని లోటుపాట్ల వల్ల అస్పష్టంగా ఉండ వచ్చు – అందుకు క్షమించండి!

    1. నేను నోబెల్ బహుమతి ఒక మురిక్కాలువ అని ఎక్కడా ఒక judgement కానీ ఒక binary categorization కానీ చెయ్యలేదు – ఆ ఉద్దేశ్యము నాకు లేదు – మంచి కాలువలు నిర్మించుకోవాలన్న సూచన మంచిదే కానీ – అది ఒక్క నోబెల్ కు సంబంధించింది మాత్రమే అవనక్కర లేదు!
    2. నోబెల్ బహుమతి పొందిన రచయితలంతా గొప్ప వారనే దురభిప్రాయం లేదన్నాను – అయితే ఒక generalization చెయ్యదల్చుకోలేదు – నా పరిమిత జ్ఞానం లో నోబెల్ పొందిన రచయితల్లో గొప్ప వారూ ఉన్నారు – నేను అంతగా గొప్పగా పరిగణించని వారూ ఉన్నారు – ఎవరి అభిప్రాయాలు వారివి కదా! ఉదాహరణకు నా దృష్టిలో మార్క్వెజ్ , నెరూడా, మిలాష్, నెల్లి సాక్స్ (ఇట్లా లిస్టు ఇస్తూ పోతే చాలా మందే) ఉన్నారు. అట్లాగే కొంత మంది గొప్ప రచయితలేమీ కాదనిపిస్తుంది నాకు – ఇది పూర్తిగా వ్యక్తిగతం కావచ్చు లేదా నా పరిమిత జ్ఞానమూ కావచ్చు.
    3. నోబెల్ బహుమతి నాకు నచ్చిన రచయితలకు రావాలనే ‘వెంపర్లాట’ నాకేమీ లేదు – అందులో నాకు ఒరిగింది యేమీ లేదని మీకూ తెలుసు – నోబెల్ పట్ల నాకెంత మోజు ఉన్నా అది నిరుపయోగమే అని నాకూ తెలుసు మీకూ తెలుసు :-)
    4. బహుశా నేను స్పష్టంగా చెప్పలేదేమో కానీ నోబెల్ బహుమతి లాంటివి ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం, అణచివేయబడుతున్న ప్రజల విముక్తి కోసం రాస్తున్న గొప్ప రచయితలకు వస్తే, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యమాలకు, ప్రజల కష్టాలను కడగండ్లను వెలుగు లోకి తేవడానికి ఒక అంతర్జాతీయ వేదిక దొరుకుతుంది – ఒక జాగా దొరుకుతుంది – గొంతు వినిపించే అవకాశం లేని ప్రజానీకానికి తమ గొంతెత్తే అవకాశం వస్తుంది – అదీ నా ఆరాటం! ఇందులో మోజూ లేదు వెంపర్లాట లేదు – ఆ రచయితలూ నాకేమీ చుట్టాలూ కారు! ఉదాహరణ కు మార్క్వెజ్ కు వచ్చి నప్పుడు ప్రపంచమంతా కొలంబియా వైపు చూసారు ఆ దేశ ప్రజల పోరాటాలూ కష్టనష్టాలు తెలుసుకున్నారు – నెరూడా కి వచినప్పుడు పెరు వైపు చూసారు – అట్లా న్గూగి కి వస్తే కీన్యా దేశపు ప్రజల గాథలు, కష్టనష్టాలు వెలుగులోకి వచ్చేవి అని ఆశ పడ్డా – అడోనిస్ కు వస్తే లేదూ మరో పాలస్తీనా రచయితకొస్తే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలు వెలుగులోకి వస్తారు అనుకున్నా! అట్లే మన తెలుగు రచయితకు వస్తే అంతకన్నా ఆనందమేముంటుంది? అయితే నేనట్లా ఆశ పడడం అత్యాశే అని తేలిపోతోంది కదా అనుకున్నా!
    5. అయితే ఇవన్నీ ఒక ఎత్తు – నేను ప్రధా నంగా చెప్పదల్చుకున్న అంశం మరొకటి – నోబెల్ బహుమతి ఇవ్వడం వెనుక రాజకీయలున్నాయని – అవి ప్రధా నంగా పాశ్చాత్య సాంస్కృతిక ఆధిపత్యాన్ని కొనసాగించే రాజకీయాలని, ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఒక ఆధిపత్య వ్యవస్థ (జియోనిస్టుల ఆధిపత్య వ్యవస్థ) ను కొనసాగించే సాంస్కృతిక రాజకీయాలని నా అభిప్రాయం. అదేమంటే, గత 60 యేండ్లకు పైగా పాశ్చాత్య సాంస్కృతిక వ్యవస్థ నాజీ ల దురాక్రమణ ను హోలోకాస్ట్ ను (నిజమే, అవి చరిత్ర లో మచ్చ లైనప్పటికీ ) పదేపదే మన ఆలోచనల మీద రుద్దడం, యూదులు పడినన్ని కష్టాలు మరెవరూ పడలేదని అందుకని ప్రస్తుతం వారి ఆధిపత్యం చలాయించడం సరైనదే నని – హోలోకాస్ట్ దుర్ఘటనలను ప్రస్తుతం జియోనిస్టులూ , ఇజ్రాయిల్ తాము చేస్తున్న దుర్మార్గాలను కప్పిపుచ్చు కోవడానికి సమర్థించు కోవడానికి వాడుకుంటున్నారు . ప్రపంచం మీద ముఖ్యంగా మధ్య ప్రాచ్యం మీద ఆధిపత్యం చలాయిస్తున్నది. నిన్న గాక మొన్న గాజా మీద దాడి చేసి అన్యాయంగా వేలాది మంది స్త్రీలు పిల్లల మృతికి కారణమై లక్షలాది మంది ని నిరాశ్రయుల్ని చేసి, స్కూళ్ళని ఆసుపత్రులని,ఇళ్ళ ని నేలమట్టం చేసి పాలస్తీనా ప్రజలకు వారి దేశం లోనే నిలవ నీడ లేకుండా చేసిన జియొనిస్టుల దుర్మార్గం మన కళ్ళ ముందే కదలాడుతున్నది. అయినప్పటికీ, మళ్ళీ పాడిందే పాటరా అన్నట్టు హోలోకాస్ట్ స్మృతుల్ని గురించి ‘జ్ఞాపక కళ’ తో రచనలు చేసిన ఒక రచయితకివ్వడం – ప్రపంచమంతా ఎవరీ రచయితా ఎప్పుడూ వినలేదే అని నివ్వెరపోయేటట్టు నోబెల్ ప్రకటించడం వెనుక సాంస్కృతిక ఆధిపత్య రాజకీయలున్నాయని చెప్పడం నా ఉద్దేశ్యం. హోలో కాస్టుని ని మించిన ఘోరాలూ దుర్మార్గాలూ ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య ఆధిపత్య రాజకీయాల కనుసన్నల్లో ఎన్నో జరిగినాయి – జరుగుతున్నాయి – పాలస్తీనా లో రోజూ జరుగుతున్నాయి – వాటి గురించి రాస్తున్న గొప్ప రచయితలెంత మందో ఉన్నారు – అయినా మళ్ళీ అదే హోలోకాస్టు ‘స్మృతి’ రచయిత కివ్వడం వెనుక జియొనిస్టుల ఆక్రమణ వాదమున్నదని నేను అనుకుంటున్నాను. జియొనిస్టులు చామ్స్కీ చెపినట్టు మనపైన తమ దుర్మార్గాలను నిశ్శబ్దంగా ఒప్పుకునే సమ్మతి ని రుద్దుతున్నారు. ఆ క్రమంలో వారి కనుసన్నల్లో నడిచె నోబెల్ కమిటీ ఈ బహుమతినిచ్చిందని నేను అనుకొంటున్నాను – అది మీకు అరిగిపోయిన రికార్డులా అనిపిస్తే అట్లా నేనడం బోరు కొట్టిస్తే – మన్నించండి – ప్రపంచ వ్యాప్తంగా ఆధిపత్య రాజకీయాలు ప్రజలపై దాడులు చేస్తూ నిరాశ్రయులని చేస్తున్నంత వరకు ప్రజలు విముక్తి కోసం పోరాడుతున్నంత వరకు, పాలస్తీనా occupation అంతం కానంత వరకు, జియొనిస్టులు కుట్రలు పన్నుతున్నంత వరకు ఇటువంటి వాటిని మళ్ళీ మళ్ళీ వేలెత్తి చూపడం తప్పు కాదనే నేను అనుకుంటున్నాను.
    నిజమే – మాదియాన రచనలు చదివి నేను రాసి ఉండాలి అని ఒక సూచన వచ్చింది – నాకు దొరికినంత వరకు చదివాను (విశ్లేషించేటంత కాదు) – నన్ను అంతగా ఆకట్టుకోలేదు – మన్నించండి!

    • Manjari Lakshmi says:

      మీరు 5 వ పాయింట్లో చెప్పిన విషయం కరక్టే కానీ అటువంటి బహుమతులిచ్చే సంస్థనే ఇంకొకటి పెట్టి వాళ్లకు వ్యతిరేకంగా పోరాడే దేశాల రచయితలకు బహుమతులిస్తే, మీరు చెప్పినట్లు ఆ దేశాల వంక జనం చూడరంటారా?. తప్పకుండా చూస్తారు. అదే కదా సుజన గారు చెప్పింది. ఆ పాయింట్ కూడా మీరు రాస్తే/ ఒప్పుకుంటే బాగుండేదని నాకనిపిస్తోంది.

    • మీరు నోబెల్ ను మురిక్కాలువ అన్నారని ఎవరూ అనలేదు. మురిక్కాలువను ఒక పోలికగానే తీసుకోవాలి. చాలా సింపుల్ విషయాన్ని మీ జవాబు ఇంకా కాంప్లికేట్ చేసింది. నోబెల్ ది మీరు ‘రాజకీయ’ దురాక్రమణ అన్నారు కదా, నోబెల్ వెనక రాజకీయం ఉన్నట్టు మీరు కొత్తగా తెలుసుకున్నారా? లేక ఇటువంటి బహుమతుల్లో రాజకీయాలు ఉండని ఆదర్శస్థితిని మీరు కోరుతున్నారా? అది సాధ్యమని అనుకుంటున్నారా? అనుకుంటే మీరు చాలా సత్తెకాలం మనిషి అన్నమాట. సాహిత్యం వెనక కూడా రాజకీయభావజాలం ఉంటుందనేది చాలా ప్రాథమిక పాఠం. నోబెల్ కమిటీ వాళ్ళు తమ రాజకీయ భావజాలానికి చెందని వాళ్లకు పురస్కారం ఎందుకు ఇస్తారండి? నేను చెప్పిన పేరలల్ పురస్కారాన్ని పెట్టినా వాళ్ళు కూడా తమ భావజాలం వాళ్ళకే ఇస్తారు. ఒకవేళ మీరే అ కమిటిలో ఉంటే మాదియానాకు ఇవ్వరని తెలిసిపోతోంది గా. అందుకే పేరలల్ పురస్కారమే దీనికి జవాబు అని నేను అంటే, అది నోబెల్ కు సంబంధించే అవక్కర్లేదని ఒక అర్థం కాని మాటతో తీసి పారేశారు. మీకు ఎన్నో అభ్యంతరాలు ఉన్న నోబెల్ పురస్కారం ద్వారా మీరు అభిమానించే ప్రజాకవులు గుర్తింపు పొందాలని మీరు కోరుకోవడం కూడా వింతగా ఉంది.

  10. P. Ramakrishna says:

    నారాయణస్వామి గారు., మీ సమాధానం నచ్చింది.

  11. “నిజానికి నాజీ దురాక్రమణ, హోలోకాస్టు గత ఆరు దశాబ్దాలకు పైగా ఇజ్రాయిల్ అమెరికా ఐరోపా దేశాల సహయంతో పాలస్తీనా ప్రజలమీద చేస్తున్న దురాక్రమణ దాడుల ముందు వెల వెల బోతాయి.”
    “హోలోకాస్టు కి వెయ్యి రెట్లకు మించి దురాక్రమణా దాడులకు, హింసకూ ప్రపంచవ్యాప్తంగా యెన్నో దేశాల్లో ప్రజానీకం గురవుతున్నారు. వారి కష్టాలూ కడగండ్లూ ఆనాడు యూదుల కష్టాలకన్నా నిస్సందేహంగా యెన్నో రెట్లు యెక్కువ కూడా!”

    నోబెల్ ఎవరికిచ్చారు, ఎందుకిచ్చారు అన్న విషయాలు ఎలాగూ గత చరిత్ర బట్టీ చూస్తే కొన్ని ఒప్పుకోళ్ళు, మెప్పుకోళ్ళూ, తప్పుకోళ్ళు వున్నాయి గనుక ఆ విశయాన్ని వదిలేస్తే హోలోకాస్టును తక్కువ చేసే పై వాక్యాలు నాకు చాలా ఆశ్చర్యంగా వున్నాయి. నాకున్న జ్ఞానాన్ని బట్టి అకృత్యాలన్నిటిలోకి హొలోకాస్టే అత్యంత క్రూరమైంది.

  12. buchireddy gangula says:

    సుజన గారు
    చాల చక్కగా రాశారు —యిక
    raajakiyaalu– కుల మత పట్టింపులు లేని దెక్కడ ??
    మన దేశం లో — మన రాష్ట్రం లో — లేదా
    పద్మశ్రీ లు
    పద్మ భూషణ్ లు —ఎలాంటి వారి కి ఇస్తున్నారో — ఒక్క సారి
    చరిత్ర తిరిగి వేయండి —
    కేంద్ర సాహిత్య అకాడమి — అవార్డు లు –(తెలుగు లో )– సరి అయిన
    రచయితల కె వచ్చిందా ఫ్రెండ్స్ ???
    naatakaalu– బూటకాలు — లోతులు లేని దెక్కడ ????
    ——————————————————
    బుచ్చి రెడ్డి గంగుల

    • //రాజకియాలు– కుల మత పట్టింపులు లేని దెక్కడ ??//
      అలాంటపుడు ఆ మాటకు ముసుగు తొలగించవచ్చు గదా? ఆ ముసుగు తొలగిస్తే ఆ బహుమతికి ఏమైనా విలువ ఉంతుందా? రాజకీయ పలుకు బడి తొ డబ్బులిచ్చి కొనుక్కోవడం లాంటివి జరినపుడు ఎవరి గుర్తింపుకోసం ఈ బహుమతులు? కేవలం నోబల్‌ బహుమతి మాత్రమే కానక్కర్లేదు. స్థానికంగా, ప్రాంతీయంగా ఇచ్చేవి కూడా! ఈ బహుమతుల్లో నైతికత అనే మాటకు ప్రమేయం లేనప్పుడు ఫేక్‌ డిగ్రీలు, ఫేక్‌ కరెంసీలకంటే వీటికి విలువ ఏమైనా ఉంటుందా?

  13. హోలోకాస్టు అసలు జరిగిందా? జరిగితే యూదులు ప్రచారం చేస్తున్నంత స్థాయిలో జరిగిందా? లేక సానుభూతి కోసమని చెప్పి వందల్లోనో వేలల్లోనో ఉన్న సంఖ్యని మిలియన్లలోకి మార్చి ప్రచారం చేస్తున్నారా? ఇవి నా ప్రశ్నలు కావు. ఈ తరం కుతూహలంగా అడుగుతున్న ప్రశ్నలు.

  14. నారాయణస్వామి says:

    నేను పైన ఒక పొరపాటు చేసాను – నెరూడా కు వచ్చినప్పుడు పెరు వైపు చూసారు అన్నాను – క్షమించండి – లాటిన్ అమెరికా వైపు చూసారు అని ఉండాల్సింది. నెరూడా చిలీ దేశ మహాకవి – అయితే మొత్తం లాటిన్ అమెరికా దేశాల ప్రజలని తన కవిత్వంలో గానం చేసారు – పెరు లో మచ్చు పిచ్చు గురించి ఒక మహా కావ్యం రాసారు. సరి దిద్దిన యెన్. వేణుగోపాల్ కు నెనర్లు.

  15. buchi reddy gangula says:

    తిరుపల గారు
    అ ముసుగు ను తోలిగించా డా నికి ప్రయత్నం చేయండి సర్ —
    నేటి కుళ్ళు వ్యవస్థ ను మార్చండి —దోషి అని కోర్ట్ తీర్పు యిచ్చినా
    జయలలిత కోసం — ఉపవాసాలు — పూజలు —ఆత్మ హత్యలు ??? అవసరమా —
    రేపు జగన్ కూడా Padma భూషణ్ రావచ్చు —-వాస్తవాల ను –ఒపినిఒన్స్ చెప్పడం
    నేరం కాదు సర్
    ———————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  16. balasudhakarmouli says:

    అవును

Leave a Reply to balasudhakarmouli Cancel reply

*