అతనూ నేనూ

నాకేం తొందరలేదు అతని లాగే

నన్ను నేను పరుచుకుని కూర్చున్నాను తననే  చూస్తూ
నాలోంచి చూపుల్ని వెనక్కి లాక్కుని
రెప్పల కింద అతను దాచుకున్నపుడు
కొలుకుల్లోంచి కణతల మీదుగా నాచు పట్టిన చారికలు
మళ్ళీ కొత్తగా తడిసిన చప్పుడు
ఉండుండీ  అతని లోపలి కఫపు అలికిడి
మా చుట్టూ కోట కట్టుకున్న నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేస్తూ
ఏ జ్ఞాపకాలు ఆత్రంగా తడుముకున్నాయో
వట్టి పోయిన  పెదాల మీద చెమ్మ చెమ్మగా చిరునవ్వు
గుప్పెడు గుండె చేస్తున్న ఒంటరి పోరాటం
అతని మెదడు మెలికల్లోకి మంచి రక్తాన్ని ఎగదోస్తూ
చిక్కుల దొంతరల మధ్యన ఆశగా నిలబడి
ఓర్పు పాఠాన్ని దొంగిలిస్తున్న నేను
శరీరం పై తేరిన ముడతల అడుగున
వయసుతో బరువెక్కిన అతని స్పష్టమైన చరిత్ర
వేళ్ళ వంకర్ల మధ్య నుండి స్వేచ్ఛగా
రాక పోకల్ని సాగిస్తూ గాలీ వెలుతురూ
ఇద్దరివీ ఎదురు చూపులే
తన ప్రాణాన్ని తీసుకెళ్ళే యమ పాశం కోసం అతను
నాకోసం ప్రాణాలిచ్చే అల్ప జీవి కోసం నేను
ఎటొచ్చీ అతనిది ముసలి శరీరం, నాది బలమైన సాలె గూడు అంతే తేడా
                                                             – సాయి కిరణ్ 

మీ మాటలు

  1. నిశీధి says:

    మంచి ఫిల్ ఉన్న కవిత . kudos .

  2. తిలక్ బొమ్మరాజు says:

    ఎంత బాగా రాసారో ఒక తపనను,తత్వాన్ని మనసులో ఉన్న భావాలు ఇదిగో ఇక్కడిలా అక్షరాలుగా పోసి కట్టి పడేసారు మమ్మల్ని మీ కవిత్వంతో.అభినందనలు సాయి కిరణ్ గారు.

  3. dasaraju ramarao says:

    తన ప్రాణాన్ని తీసుకెళ్ళే యమ పాశం కోసం అతను
    నాకోసం ప్రాణాలిచ్చే అల్ప జీవి కోసం నేను…………భేదం అభేదం చేస్తూ కొనసాగిన కవిత …..బాగుంది..

  4. madhavi mirapa says:

    సాయి కిరణ్ గారు!
    కవిత చాలా బావుంది. వట్టిపోయిన పెదాల మీద చెమ్మ చెమ్మగా చిరు నవ్వు ‘గుప్పెడు గుండే చేస్తున్న ఒంటరి పోరాటం’ వేళ్ళ వంకరల మధ్య నుంచి స్వేచ్చగా రాక పోకల్ని సాగిస్తున్న గాలి వెలుతురు’ ఎటొచ్చీ అతనిది ముసలి శరీరం, నాది బలమైన సాలె గూడు అంతే తేడా .
    ఒక జీవి తానికి సరిపడా ఎదురు చూపుల పోరాటంలో అలసిపోయిన ప్రాణం’ బంధాల కొసం పోరాడి పోరాడి శరీరం అలసి పోయిన ప్రాణం ఓకరిది. అలాంటి బలమైన సాలెగూడు బంధాల్లొం ఛి బయటకు రాలేని నిస్సహాయత ఇంకొకరిది చాలా బాగా చెప్పారు. అనుభవాల వయసు పెరిగే కొద్దీ ఎ స్థితినైనా వంకర వెళ్ళ మధ్య నుంచి స్వేచ్చగా పోనిచ్చే గాలి వె లుతురులే జీవితం.

  5. సాయి కిరణ్ says:

    Thank You all

  6. S. Narayanaswamy says:

    లోతైన కవిత

Leave a Reply to santhisagar reddy Cancel reply

*