పెద్రో పారమొ-4

pedro1-1
నీటి చుక్కలు నిలకడగా రాతి దోనె మీద పడుతున్నాయి. తేట నీరు రాతిమీదినుంచి తప్పించుకుని కలశంలోకి పడుతున్న చప్పుడును గాలి మోసుకొస్తూంది. అతనికి చప్పుళ్లన్నీ వినిపిస్తున్నాయి. నేలను రాపాడుతున్న పాదాలు, ముందుకూ వెనక్కూ, ముందుకూ వెనక్కూ. విడుపులేకుండా బొట్లు బొట్లుగా జారడం. కలశం నిండి నీరు తడినేలమీదికి పొంగడం.
“లే!” ఎవరో లేపుతున్నారు.
అతనికి ఆ గొంతు వినిపిస్తూంది. గుర్తు పట్టడానికి ప్రయత్నిస్తూనే నిద్రమత్తు బరువుకు మునిగిపోతూ ఉన్నాడు.దుప్పటి వేడిలో కుదురుగా ముణగదీసుకున్నాడు.
“లే!” మళ్ళీ ఎవరో పిలుస్తున్నారు.
ఆ ఎవరో భుజాలు పట్టుకు కుదుపుతున్నారు. అతన్ని లేపి కూచోబెడుతున్నారు. అతను కళ్ళు సగం తెరిచాడు. రాతి మీద నుంచి పొంగుతూ కలశంలోకి పడుతున్న నీటి చప్పుడు అతను మళ్లీ విన్నాడు. అటూ ఇటూ పడుతున్న అడుగుల చప్పుడు. ఇంకా ఏడుపు.
అప్పుడు అతను ఎవరో ఏడవడం విన్నాడు. అతన్ని లేపింది అదే – మెత్తగా ఉన్నా చొచ్చుకునిపొయే ఏడుపు- అంత పదునుగా ఉండబట్టే అతని నిద్ర కంచె దాటుకుని అతని లోలోపలి భయాన్ని తట్టి లేపగలిగింది.
నెమ్మదిగా పక్కమీదినుంచి లేచాడు. ద్వారానికి ఆనించి ఉన్న ఒక స్త్రీ ముఖం కనిపించింది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూంది.
“ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అతను అడిగాడు. నేలమీద అడుగు పెట్టగానే తల్లి మొహం గుర్తు పట్టాడు.
“మీ నాన్న చనిపోయాడు.” ఆమె అంది.
అప్పుడు చుట్టలు చుట్టుకున్న ఆమె దుఃఖం ఒక్కసారిగా విప్పుకుంది .తట్టుకోలేక ఆమె గుండ్రం గుండ్రంగా అక్కడక్కడే తిరిగింది. చేతులతో భుజాలు పట్టుకుని ఆ వ్యధిత దేహం తిరగడం ఆపేదాకా.
వాకిలిగుండా ఉదయ సంధ్య కనిపిస్తూంది. పైన చుక్కలేమీ లేవు. ఇంకా రవికిరణాలు సోకని బూడిద రంగు ఆకాశం ఒక్కటే. పొద్దుపొడుపు కంటే పొద్దుగూకడాన్నే సూచిస్తున్నట్టు మసక చీకటి.
బయట వరండాలో అడుగుల చప్పుడు మనుషులు అక్కడికక్కడే గుండ్రంగాతిరుగుతున్నట్టు. మెత్తటి చప్పుడు. లోపల వాకిలికడ్డంగా ఆమె రాబోయే రోజును ఆపేస్తున్నట్టు. ఆమె చేతుల సందుల్లోంచి ఆకాశం ముక్కలూ, పాదాల కిందనుంచి స్రవిస్తున్న వెలుతురు. తడి వెలుతురు, కింద నేలంతా ఆమె కన్నీటి వరద ముంచేసినట్టు. ఆపైన వెక్కిళ్ళ ఏడుపు. మళ్ళీ అదే మెత్తటి కోసుకుపోయే ఏడుపు. ఆమె శరీరాన్ని మెలికలు తిప్పుతున్న బాధ.
“వాళ్ళు మీ నాన్నను చంపేశారు.”
మరి నిన్నో అమ్మా? నిన్నెవరు చంపేశారు?
గాలీ, పొద్దూ ఉన్నాయి, మబ్బులూ ఉన్నాయి. పైపైన నీలాకాశం, ఆపైన పాటలున్నాయేమో, తీయటి గొంతుకలు. ఒక్కమాటలో, ఆశ. మనందరికీ ఆశ,ఉంది, మన బాధలు తీర్చే ఆశ.
“కానీ నీకు కాదు మిగెల్ పారమొ! నీకు క్షమాపణ దొరక్కుండానే చనిపోయావు. దైవకృప నీకెన్నటికీ తెలియదు.”
ఫాదర్ రెంటెరియ మృతజీవుల ప్రార్థన చేస్తూ శవం చుట్టూ తిరిగాడు.తొందరగా ముగించేసి, చర్చి నిండా చేరిన వాళ్లకి చివరి దీవెన అందించకుండానే వెళ్ళిపోయాడు.
“ఫాదర్, మీరు అతన్ని దీవించాలని మా కోరిక.”
“లేదు!” గట్టిగాతలూపుతూ చెప్పాడు. “నేను దీవెన ఇవ్వను. అతను దురాత్ముడు. ప్రభువు రాజ్యం చేరడానికి వీల్లేదు. అందుకు నేను పాల్పడితే ప్రభువు నాపట్ల దయచూపడు.”
మాట్లాడుతూ, చేతులు గట్టిగా కట్టుకున్నాడు వణుకుతున్నట్టు తెలియకుండా ఉండాలని. కుదరలేదు.
ఆ శవం అక్కడున్న వారందరి ఆత్మల మీదా పెద్ద బరువై నిలిచింది. చర్చి మధ్యలో వేదికపైన ఉందది చుట్టూ కొవ్వొత్తులూ, పూలతో. తండ్రి అక్కడే నిల్చున్నాడు, వొంటరిగా, ప్రార్ధన అయ్యేదాకా.
ఫాదర్ రెంటెరియ పేద్రో పారమొ ని దాటుకుని వెళ్ళాడు, అతన్ని తాకకుండా జాగ్రత్తపడుతూ. పరిశుద్ధజలాన్నుంచిన పాత్రను నెమ్మదిగా పైకెత్తి శవపేటిక పైనుంచి కింద దాకా చిలకరించాడు పెదాలనుంచి ప్రార్థనలాంటిదేదో గొణుగుతూ. అతను మోకరిల్లగానే అందరూ మోకరిల్లారు.
“భగవంతుడా, ఈ నీ సేవకుడి మీద దయ చూపు!”
“అతని ఆత్మకు శాంతి కలుగు గాక! తధాస్తు!” అందరి గొంతులూ ఒక్కటై పలికాయి.
మళ్ళీ అతని లోపలి క్రోధం రేగుతూంది. మిగెల్ పారమొ శవాన్ని మోసుకుంటూ అందరూ చర్చి బయటికి వెళుతున్నారు.

pedro_paramo1
పేద్రో పారమొ అతని వద్దకు వచ్చి పక్కనే మోకరిల్లాడు.
“మీరు వాడిని అసహ్యించుకుంటున్నారని తెలుసు ఫాదర్! దానికి కారణమూ ఉందనుకోండి. మీ అన్నని మావాడు చంపాడన్న వదంతి ఉంది. మీ అన్న కూతురిని వాడు చెరిచాడనీ మీరు నమ్ముతున్నారు. ఆపైన వాడు చేసిన అవమానాలూ, ఎవరినీ లెక్కచేయకపోవడమూ. ఆ కారణాలు ఎవరయినా అర్థం చేసుకుంటారు. కానీ అవన్నీ మరచిపొండి ఫాదర్! అతన్ని క్షమించండి, బహుశా దేవుడు క్షమించినట్టుగానే!”
గుప్పెడు బంగారు నాణేలు అక్కడ ఉంచి పైకి లేచాడు. “మీ చర్చికి వీటిని బహుమతిగా తీసుకోండి.”
చర్చి ఖాళీ అయింది అప్పటికి. వాకిలి దగ్గర ఇద్దరు పేద్రో పారమొ కోసం ఎదురు చూస్తున్నారు. అతను వాళ్ళతో కలవగానే అంతా కలిసి అప్పటిదాకా వాళ్ళ కోసం ఆగి ఉన్న శవపేటిక వెంట నడిచారు. మెదియా లూనాకి చెందిన నలుగురు పనివాళ్లు మోస్తున్నారు దాన్ని. ఫాదర్ రెంటెరియ ఆ నాణేలు ఒక్కొక్కటే ఏరుకుని దైవపీఠం వైపు నడిచాడు.
“ఇవి నీవి.” అతను చెప్పాడు. “అతను విముక్తిని కొనుక్కోగలడు. ఇది సరయిన ధర అవునో కాదో నీకే తెలియాలి. నావరకూ, దేవా, నీపాదాల మీద పడి న్యాయమో అన్యాయమో వేడుకుంటాను అందరిలాగే… వాణ్ణి నరకంలో తోసేయి!”
ప్రార్థనామందిరాన్ని మూశాడు.
పాతసామాన్ల గదిలోకి వెళ్ళి ఒక మూలన కూలబడ్డాడు. బాధతో, వ్యధతో కన్నీరు ఇంకిందాకా అక్కడే కూచుని ఏడ్చాడు.
“సరే ప్రభూ, నువ్వే గెలిచావు!”

భోజనాల సమయానికి, ప్రతి రాత్రీ తాగినట్టుగానే వేడి చాకొలేట్ తాగాడు. మనసు నెమ్మదించింది.
“అనీతా, ఇవాళ ఎవరిని పూడ్చారో తెలుసా నీకు?”
“తెలియదు బాబాయ్!”
“మిగెల్ పారమొ గుర్తున్నాడా?”
“ఆఁ”
“వాణ్ణే!”
అనీత తల వేలాడేసింది.
“కచ్చితంగా వాడేననని నీకు నమ్మకమేగా?”
“ఏమో బాబాయ్! అతని మొహం నేను చూడలేదు. ఒక్కసారిగా మీద పడ్డాడు. చీకటి.”
“మరి అది మిగెల్ పారమొ అని నీకెలా తెలుసు?”
“ఎట్లా అంటే అతను చెప్పాడు: ‘అనా నేను మిగెల్ పారమొని. భయపడకు.’ అదీ అతను చెప్పింది.”
“ కానీ వాడే మీ నాన్న చావుకు కారణమని తెలుసు కదూ?”
“తెలుసు బాబాయ్!”
“మరి నువ్వేం చేశావు వాణ్ణి వెళ్లగొట్టడానికి?”
“నేనేమీ చేయలేదు.”
ఇద్దరూ మాట్లాడకుండా ఉండిపోయారు. మర్టిల్ ఆకుల్ని కదుపుతున్న వేడి గాలి చప్పుడు ఇద్దరి చెవులా పడుతూంది.
“అతనందుకే వచ్చానని చెప్పాడు – అందుకు సారీ చెప్పి నన్ను క్షమించమని అడగడానికి. నేను మంచం మీద కదలకుండా పడుకునే కిటికీ తెరిచే ఉందని చెప్పాను. అతను లోపలికి వచ్చాడు. ముందుగా నా చుట్టూ చేతులు వేశాడు, అతను చేసిన తప్పుకు క్షమాపణ అడగడానికి అదే అతని పద్ధతి అన్నట్టు. నేను అతని వంక చూసి చిరునవ్వు నవ్వాను. మనం ఎవరినీ అసహ్యించుకోకూడదని నువు చెప్పింది నాకు బాగా గుర్తుంది. అందుకే, ఆ విషయం అతనికి తెలియడానికే నవ్వాను కానీ ఆ చీకటిలో అది అతనికి కనపడదని వెంటనే తెలియలేదు. అతని శరీరం నామీద పడటం, చీదర పనులు చేయడం మాత్రమే తెలుస్తూంది.”
“నన్ను చంపబోతున్నాడని అనుకున్నాను. అదే గట్టిగా అనుకున్నాను బాబాయ్! ఆ తర్వాత ఆలోచించడం మానేశాను అతను చంపేలోగానే చనిపోదామని. అంత ధైర్యం చేయలేకపోయాడనుకుంటాను.”
“అతను చంపలేదని నేను కళ్ళు తెరిచి పొద్దుటెండ కిటికీలోంచి పడటం చూసినప్పుడు తెలిసింది. అప్పటిదాకా నేను నిజంగానే చనిపోయాననుకున్నాను.”
“ఏదో రకంగా నీకు కచ్చితంగా తెలిసే ఉండాలి. అతని గొంతు. అతని గొంతు బట్టి గుర్తు పట్టలేదా?’”
“నేనతన్ని అసలు గుర్తు పట్టలేదు. అతని గురించి నాకు తెలిసిందల్లా నాన్నను చంపాడనే. అతన్ని అదివరకెన్నడూ చూడలేదు, ఆ తర్వాతా చూడలేదు. అతని ఎదురుపడగలిగేదాన్నా బాబాయ్?”
“కానీ అతనెవరో నీకు తెలుసు.”
“అవును. అతనేమిటో కూడా. ఇప్పుడు నరకబాధలు అనుభవిస్తుంటాడని కూడా తెలుసు. సెయింట్స్ అందరినీ నా మనసుతో, ఆత్మతో ప్రార్థించాను.”
“అంత నమ్మకం పెట్టుకోకు అమ్మాయ్! అతనికోసం ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారో ఎవరికి తెలుసు? నువ్వొక్క దానివే. వేల ప్రార్థనలకు ఎదురుగా ఒక్క ప్రార్థన. అందులోనూ కొన్ని నీ ప్రార్థన కంటే తీవ్రమైనవి, అతని తండ్రి ప్రార్థనలాంటివి.
“ఏమయినా నేను అతన్ని క్షమించేశాను.” అనబోయాడు. కేవలం అనుకున్నాడు. ఛిద్రమయిన ఆ అమ్మాయి ఆత్మను మరింత బాధకు గురి చేయడం ఇష్టం లేకపోయింది. అందుకు బదులు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని చెప్పాడు “ప్రభువైన మన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం ఇంత కీడు చేసిన వాణ్ణి ఈ భూమ్మీదనుంచి తీసుకు పోయినందుకు. తన స్వర్గానికి తీసుకుపోయాడో లేదో మనకెందుకు?”
కోంట్లా రోడ్డును పెద్ద బజారు కలిసేదగ్గర ఒక గుర్రం పరుగులు తీస్తూ ఉంది. దాన్నెవరూ చూడలేదు. అయితే ఊరి బయట దేనికోసమో ఎదురుచూస్తూన్న ఒక స్త్రీ ఆ గుర్రాని చూచాననీ, అది బొక్కబోర్లా దొర్లబోయినట్టు దాని ముంగాళ్లు వంగబడిపోయాయనీ చెప్పింది. అది మిగెల్ పారమొ టేకుమాను రంగు గుర్రం అని గుర్తుపట్టిందామె. అది తన మెడ విరగ్గొట్టుకుంటుందేమోనన్న ఆలోచన ఆమె మనసులో మెదిలింది. తరవాత అది దాని కాళ్లమీద నిలబడి కింద వదిలేసినదాన్నేదో చూసి భయపడుతూ ఉన్నట్టు మెడ మాత్రం వంచి మామూలుగానే పరుగులు తీయడం మొదలుపెట్టింది.
ఖననం జరిగిన రాత్రి శ్మశానాన్నించి అంత దూరమూ నడిచివచ్చి మగవారంతా విశ్రాంతి తీసుంటూ ఉండగా ఈ కథ మెదియాలూనా చేరింది. జనాలు పడుకునేముందు కబుర్లు చెప్పుకునేట్టు వాళ్ళూ మాట్లాడుకుంటూ ఉన్నారు. “ఈ చావు నన్ను నాలుగు రకాలుగా బాధిస్తూంది.” టెరెన్సియో లుబియానెస్ అన్నాడు “ నా భుజాలింకా తీపులు పుడుతూనే ఉన్నాయి.”
“నావి కూడా!” అన్నాడు అతని అన్న ఉబియాడో. “నా మడమలు అంగుళమన్నా వాచి ఉంటాయి.ఇదేదో పవిత్ర దినంఅయినట్టు ఆ పెద్దాయన మనల్ని బూట్లు వేసుకోమనబట్టే, కదా టోరిబియో?”
“నన్నేం చెప్పమంటావు? ఇంత తొందరగా పైకి పోవడమే నయం!”
ఇంకొన్ని రోజులకు కోంట్లా నుంచి ఇంకో వార్త వచ్చింది. అది ఒక ఎడ్ల బండితో.
“అతని ఆత్మ అక్కడే తిరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఒక స్నేహితురాలి కిటికీ తట్టడం చూశారు. అంతా అతని లాగే ఉంది.”
“కొడుకు అట్లా ఆడోళ్ళ కిటికీలు తడుతూంటే డాన్ పేద్రో వదిలేస్తాడనుకున్నావా? అతనికి తెలిస్తే – ‘సరే నువ్వు చనిపోయావు, నీ సమాధిలో నువ్వుండు. ఇవన్నీ మాకు వదిలేయి.’ అనడూ! అట్లా తిరిగేప్పుడు పట్టుకుంటే సమాధిలోంచి మళ్ళీ లేవకుండా పూడ్చిపెట్టడూ?”
“నువు చెప్పేది నిజమే ఇసయ్యస్. ఆ ముసలాయన దేన్నీ భరించలేడు”
బండి తోలే అతను తన దారిన తను వెళ్ళిపోయాడు “నేను విన్నదే మీకు చెపుతున్నాను” అంటూ.
తారాజువ్వలు. ఆకాశాన్నుండి నిప్పుల వాన కురుస్తున్నట్టు.
“అటు చూడండి.” టెరెన్సియో అరిచాడు “ మనకోసం ఆట మొదలుపెట్టారు చూడండి!”
“మిగెలిటో తిరిగొచ్చాడని సంబరాలు చేసుకుంటున్నట్టున్నారు.” జీసస్ అన్నాడు. “అపశకునం కాదా అది?”
“ఎవరికి?”
“మీ చెల్లి ఒంటరిగా ఉందేమో, అతను తిరిగి రావాలని కోరుకుంటుందేమో!”
“ఎవరితో మాట్లాడుతున్నావు?”
“నీ తోటే!”
“ఇక పదండి, పొద్దుపోయింది. ఇవాళ్టి తిరుగుడుకి సాలిపోయింది. మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలి.”
చీకట్లో నీడల్లా కలిసిపోయారు వాళ్ళు.
తారా జువ్వలు. ఒక్కటొక్కటిగా కోమలాలో దీపాలు ఆరిపోయాయి.
ఇక రాత్రిని అకాశం ఆక్రమించుకుంది.
ఫాదర్ రెంటెరియా నిద్రపట్టక పక్క మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు.
అది నా తప్పే అనుకున్నాడు. జరిగేదంతా. నా బాగోగులు చూసే వాళ్ళను బాధించాలంటే కలిగే భయం వల్ల. అది నిజమే, నా జీవనాధారానికి వాళ్ళకి రుణపడి ఉన్నాను. పేదవాళ్ళనుంచి చిల్లిగవ్వ రాదు, ప్రార్థనలు పొట్ట నింపవని ఆ పైవాడికీ తెలుసు. ఇప్పటిదా అట్లాగే గడిచింది. దాని పర్యవసానం ఇప్పుడు తెలుస్తూంది. అంతా నా తప్పే. నన్ను ప్రేమించినవారికీ, నాపై నమ్మకముంచి తమ తరఫున దేవుడిని ప్రార్థించమని అడగవచ్చిన వారికీ ద్రోహం చేశాను. నమ్మకం ఏం సాధించింది వాళ్ళకి? స్వర్గమా? వాళ్ల ఆత్మల పారిశుధ్ధ్యమా? వాళ్ళ ఆత్మలను పరిశుద్ధం మాత్రం చేయడమెందుకు చివరి క్షణాల్లో.. వాళ్ల చెల్లి ఎదువిజస్ ను కాపాడమని వచ్చిన మరియా ద్యాడ మొహాన్ని ఎప్పటికీ మరవలేను.
“ఆమె ఎప్పుడూ తోటివాళ్ళకి సాయం చేస్తూ ఉండేది. వాళ్ళకి తనకున్నదంతా ఇచ్చింది. వాళ్ళకు కొడుకుల్నీ ఇచ్చింది. అందరికీ. పసిపాపలని వాళ్ళ తండ్రుల దగ్గరకు గుర్తుపట్టడానికి తీసుకు వెళ్ళింది. ఎవరూ పట్టించుకోలేదు. ‘అయితే వాళ్ళకి తండ్రినీ నేనే అవుతాను, తల్లివి కమ్మని విధి రాసినా.’ అని చెప్పిందామె వాళ్ళకి. ఆమె మంచితనాన్నీ, ఆదర స్వభావాన్నీ ప్రతివాళ్ళూ వాడుకున్నవారే. ఆమె ఎవరినీ బాధించాలనుకోలేదు, ఎవరితో గొడవా పెట్టుకోదలచలేదు.”

“కానీ ఆమె తన ప్రాణం తనే తీసుకుంది. దైవాజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించింది.”
“అంతకంటే ఏం చేయగలదు? అది కూడా ఆమె మంచితనం వల్లే చేసింది.”
“చివరి గడియలో ఆమె పుణ్యం చాలకపోయింది.” మరియా ద్యాడతో చెప్పాను.
“చివరి క్షణంలో. ముక్తి కోసం అన్ని మంచిపనులూ చేసి అంత పుణ్యమూ మూటగట్టుకుని అంతా ఒక్కసారిగా ఎట్లా పోగొట్టుకుంటుంది?”
“అదంతా ఎక్కడికీ పోదు. ఆమె దుఃఖం వల్ల మరణించింది. ఆ దుఃఖం… దుఃఖం గురించి నువ్వెప్పుడో నాకు చెప్పావు గానీ నాకు గుర్తు రావడం లేదు. ఆమె దుఃఖం వల్ల ఆమె పోయింది. ఆమె రక్తమే గొంతుకడ్డం పడి ఊపిరాడక చనిపోయింది. ఆమె ఎట్లా అగపడేదో ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉంది.అంత విషాదగ్రస్తమయిన మొహం నేనెప్పుడూ చూడలేదు.”
“కాస్త ఎక్కువ ప్రార్థనలు చేస్తే ఏమన్నా..”
“మేము చాలా ప్రార్థనలు చేస్తూనే ఉన్నాము ఫాదర్!”
“పోనీ, బహుశా, గ్రెగోరియన్ ప్రార్థనలు. కానీ అవి చేయాలంటే మన వల్ల కాదు. ఇంకా మతాచార్యులని పిలిపించాలి. దానికి ఖర్చవుతుంది.”
నా కళ్ళ ఎదుట, పిల్లలతో పండి పేదదయిన మరియా ద్యాడ మొహం.
“నాదగ్గర చిల్లి గవ్వ లేదు. ఆ సంగతి నీకు తెలియదా ఫాదర్!”
“సరే ఇట్లాగే వదిలేద్దాం. భగవంతుని యందు విశ్వాసాన్ని ఉంచుదాం.”
“సరే ఫాదర్!”
అలా వదులుకోవడంలోనూ ఆమె ఎందుకంత ధైర్యంగా కనిపించింది? సునాయాసంగా ఒకటో అరో మాట – ఒక ఆత్మను కాపాడడానికి వంద అవసరమయితే వంద – చెప్పడంలో, క్షమాభిక్ష ప్రసాదించడంలో తనకి పోయిందేముంది? స్వర్గనరకాల గురించి తనకేం తెలుసు? ఒక పేరులేని ఊళ్ళో ఒక ముసలి మతగురువుకు కూడా స్వర్గానికెవరు అర్హులో తెలుసు. ఆ వరస అంతా తనకి తెలుసు. క్రిస్టియన్ సెయింట్స్ పట్టికలో కేలెండర్లో ప్రతిరోజుకూ ఉండే సెయింట్స్ తో మొదలు పెట్టాడు – సెయింట్ నునిలోన, కన్య,వీర మరణం పొందినది, అనెర్సియో పెద్ద మతాధికారి, సలోమి, విధవ, అలోదీ, నులీన కన్యలు, కోర్డుల, దోనాటొ” అదే వరసలో ఇంకా కిందికి. అతను నిద్రలోకి జారుకోబోతూ లేచి తిన్నగా పక్క మీద కూచున్నాడు. “నిద్ర పట్టడానికి గొర్రెల్ని లెక్క పెడుతున్నట్టు నేను సెయింట్స్ పేర్లు అప్పచెబుతున్నాను.”
అతను బయటికి వెళ్ళి ఆకాశం వంక చూశాడు. చుక్కలు కురుస్తున్నాయి. ఆకాశం ప్రశాంతంగా కనపడక అతను విచారించాడు. రాత్రి దుప్పటి భూమిని కప్పుతున్నట్టు అనిపించింది. “నరక కూపం” ఈ భూమి.

మీ మాటలు

*