‘ఎగిరే పావురమా!’ – 14

egire-pavuramaa14-banner

డాక్టర్ తో మాట్లాడి, పది నిముషాల్లో తిరిగొచ్చాడు జేమ్స్…

“అంతా సెటిల్ అయింది, నీ కొత్తకాలు కూడా రెండు వారాల్లో వచ్చేస్తుందట. మన ‘అనాధాశ్రమం’ నర్సుతో కూడా మాట్లాడింది డాక్టరమ్మ. నీతో రోజూ వ్యాయామం చేయించమని, అవసరాన్ని బట్టి కట్టు మార్చమని చెప్పింది,” అన్నాడు.

 

“అన్నీ హ్యాపీ న్యూసులే,” నవ్వుతూ తను తెచ్చిన జిలేబి ప్లేట్లో పేర్చాడు.

ఆ ప్లేటు నాకందిస్తూ, “మంచి అవకాశం – కరెక్ట్ సమయం నీతో మాట్లాడ్డానికి,” అంటూ కుర్చీ మంచానికి దగ్గరగా లాక్కొని కూచున్నాడు.

 

“చూడు గాయత్రి, నువ్వంటే నాకు ఇష్టం, పిచ్చి కోరిక. మొదట్లో తెలీకుండానే, నీకు కిచన్ లో పనిచ్చి, ఆకలిదప్పుల నుండి కాపాడాను.   లేదంటే, నిన్ను రైల్వే స్టేషన్లోనో, గుడిమెట్ల పైనో ఓ బోర్డ్ పెట్టి బిక్షాటన చేయించేది కమలమ్మ.

తరువాత కూడా నిన్ను ఎన్నో మార్లు ఎన్నో రకాలుగా కాపాడాను. ఎలా అంటే విను.

నీకు ఆ   దద్దమ్మ గోవిందుతో పెళ్ళి చేస్తానంటే, పద్దెనిమిదేళ్ళు నిండని పిల్లకి పెళ్ళి చేసి కష్టాల పాలవ్వద్దని కమలమ్మకి చెప్పి ఆ పెళ్ళి ఆపించానని   నీకూ తెలుసుగా.

మీ తాత నుండి ఆస్తిపై హక్కుకి గాని, పెళ్ళికి గాని మేజర్ అయి ఉండాలన్న విషయం ఆమెకలా చెప్పి, భయపెట్టి, నిన్ను మూడేళ్ళు కాపాడుకున్నాను.

ఇక మూడోది. నాకు ‘మదర్ తెరెసా’ వాళ్ళ పర్మనెంట్ కాంట్రాక్ట్ వచ్చాక కూడా, నిన్ను నా కళ్ళెదుట ఉంచుకోడానికనే మీ అందరికీ క్యాంటీన్ లో కొలువులిచ్చి,   నాకాడే పెట్టుకున్నా,” క్షణం ఆగాడు.

 

నా మీదకి వంగి, నా గడ్డం పట్టుకుని ముఖం పైకెత్తాడు. నా కళ్ళలోకి చూస్తూ, “వింటున్నావా? నువ్వంటే నాకెంత ఇష్టమో అర్ధమయిందా? ఇంకా చెప్పాలా?” అడిగాడు.

 

దుఖాన్నిఆపుకోవడానికి ప్రయత్నిస్తూ తల వంచుకున్నాను.

నడవలేను, పలకలేను. అలాంటి నాకు ఏమిటీ గోల??? నాకంటే సరయిన ఆడపిల్లే దొరకలేదా వీడికి? వీడి బుద్ధి వక్రించింది.   మామూలు ఆలోచన కాదు వీడిది, అని భయము, గుబులు కలిగాయి….

గొంతు సవరించి మళ్ళీ మొదలెట్టాడు.

“ముఖ్యంగా నీ కాళ్ళకి చికిత్స గురించి   ఆలోచన చేసాను. మనం పనిచేస్తున్నది ధార్మిక సంస్థ కాబట్టి, ముందుగానే, అర్జీ పెట్టి నీ విషయం చర్ఛ్ ఫాదర్లతో మాట్లాడాను. నువ్వు నా సొంత మనిషివని, నేను తప్ప నీకు ఆసరా లేదనీ   వాళ్ళకి చెప్పాను. నీకు కాళ్ళకి వైద్యం అవసరమని విన్నవించాను…

నువ్వు మతం పుచ్చుకొని, నామమాత్రపు జీతానికి రెండేళ్లు పనిచేస్తావని వాళ్ళకి నేను హామీ ఇచ్చాను. వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకొని ఈ కాడికి తెచ్చాను,” అంటూ   మళ్ళీ నా వంక చూసాడు.

 

“ఇకపోతే, అతి ముఖ్యమైన విషయం… నాకు రాబడుంది. ఊళ్ళో రెండు క్యాంటీన్ల అద్దెలొస్తాయి. నేవేసుకున్న నగలు నీకు క్షణంలో ఇచ్చేస్తా. నీకిప్పుడు పద్దెనిమిదేళ్ళు. నువ్వు నా సొంతమవ్వాలి. నిన్ను నాకాడ ఉంచుకొని రాత్రింబవళ్ళు ప్రేమిస్తా, కామిస్తా.

నీవు కుంటివి, మూగవి అయినా పర్వాలేదు. నిన్ను ఉద్దరిస్తాను. నన్ను ప్రేమించి ‘సరే’ అను. చాలు,”   అంటూ ముగించాడు.

లేచి మంచం చుట్టూ పచార్లు చేయసాగాడు…….

 

తమ తమ స్వార్ధాల కోసం కమలమ్మ, జేమ్స్ – వారి ఇష్టానుసారంగా నన్ను బంధించాలని చూడ్డం ఏమిటి…ఈ రకమైన ఇక్కట్లతో బతకాలని కూడా అనిపించడంలేదు.

 

“ఎల్లుండి నేను మళ్ళీ రావాలి ఇక్కడికి. నీ బిల్లు సెటిల్ చేయడానికి జలజ మేడమ్ నన్నే పంపుతారు. ఈ లోగా, నేను చెప్పే మరో సంగతి కూడా విని, మన విషయంగా నీ నిర్ణయం తీసుకో…” అన్నాడు జేమ్స్ మంచానికి దిగువున నిలబడి….

 

చుట్టూ చూశాను. ఎవ్వరూ లేరు.. మూలనున్న ఇద్దరు ముసలి రోగులు కదలకుండా అటు తిరిగి పడుకునున్నారు.

‘ఇంకా ఏమి సంగతని’ వింటున్నాను….

 

తిరిగొచ్చి, జేమ్స్ మళ్ళీ నా మంచం పక్కన కుర్చీలో కూచున్నాడు.

“నీవు ఇక్కడ ఆసుపత్రిలో చేరిన రెండోరోజు, మీ రాంబాబాయి ఈ ఊరొచ్చాడు. కమలమ్మతో గొడవ పెట్టుకొన్నాడు. చిన్నపిల్లవైన నిన్ను తప్పుడు దోవ పట్టించిందని కేకలేశాడు.

మీ తాత పొలం, కొట్టాం స్వార్జితమంట. కాబట్టి   పోట్లాడి దక్కించుకునే అవకాశం నీకైనా లేదని,   ఏదేమైనా నిన్ను వెంటబెట్టుకొని ఇంటికి తీసుకెళతానని ఆమెతో బాగా గొడవపడి గాని ఈడనుండి వెళ్లలేదు,” చెప్పడం ఆపి నా చేయి తన చేతిలోకి తీసుకోబోయాడు.

చేయి వెనక్కి లాక్కున్నాను.

 

ఓ క్షణం మౌనం తరువాత నా వంక సూటిగా చూసాడు….

“అంటే, నీ ముందు మూడే దారులున్నాయి…మార్పే లేకుండా – మీ తాతతో అదే పాత బికారి జీవితం. లేదా నా కింద నౌకరీ చేస్తున్న ఆ దద్దమ్మ గోవిందుని పెళ్ళాడి, బతుకుతెరువు కోసం నా క్యాంటీన్ లో చాకిరీ కొనసాగింపు. ఈ రెండూ కాదని, తెగించి నాకాడ నా ప్రియురాలిగా మంచి రంజైన జీవితం… ఏది కావాలో ఎన్నుకో,” అన్నాడు వికారంగా నవ్వుతూ వాడు.

“పోతే, మీ బాబాయికి నీ కాలు-చికిత్స గురించి వివరించి, మళ్ళీ నాలుగు వారాలకి రమ్మన్నాను. సర్దిచెప్పి నేనే ఆ రోజు బస్ స్టాండు వరకు దింపానతన్ని. లేదంటే ఇక్కడే తిష్టేసి కమలమ్మతో యుద్దానికి సిద్దమయ్యాడు,” చెప్పడం ముగించి, మళ్ళీ ఎల్లుండి కనబడుతానంటూ వెళ్ళిపోయాడు… జేమ్స్ గాడు….

 

నా మనస్థితి అల్లకల్లోలమయ్యింది…రాంబాబాయి రాక, జేమ్స్ పోకడ – అంతా అయోమయం. … తాత ఎలా ఉన్నాడో? ఎవరు చెబుతారు? కమలమ్మతో బాబాయి గొడవపడ్డాడా? ఏమన్నాడో? నెల రోజులకి తిరిగి మళ్ళీ వస్తాడా బాబాయి?

తాతదంతా స్వార్జితమంటే? చెప్పుడు మాటలు నమ్మి, అప్పట్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానా? నా జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నానా?

‘తాత నుండి మళ్ళీ కబురు’ అంటూ మొన్న గోవిందు ఏదో అనబోయాడు … అని గుర్తొచ్చింది.

గోవిందు ఏమన్నా చెబుతాడేమో…. అడగాలి… ఆగి చూడాలి ఏమి జరుగుతుందో?

వళ్ళంతా చెమటలు పట్టేసింది…

egire-pavuramaa-14

“ఇదిగో పట్టమ్మాయి, కాస్త నీ అంతట నువ్వు పక్కకి తిరగ్గలవేమో చూడు, కాఫీ తాగి మందేసుకో,” అంటూ వచ్చింది ఆయమ్మ.

**

వారం రోజులుగా మళ్ళీ క్యాంటీన్ పనిలోకొచ్చాను.   కాలు నొప్పి తగ్గింది. మరో వారమో రెండో గడిస్తే, నాకు కొత్తకాలు కూడా వస్తుంది.

రోజూ మార్కెట్ నుండి కూరలు, వెచ్చాలు దింపి వెళ్ళిపోయే గోవిందు, ఇప్పుడు కిచెన్లో నా కాడికొచ్చి, ఎలా ఉన్నానని కనుక్కుని పోతున్నాడు.

అనాధాశ్రమం నర్స్ వచ్చి రోజూ నా కాలు ఓ మారు చూసి, డాక్టరమ్మ సూచనలందుకొని బ్యాండేజీ మార్చి వెళుతుంది.

జేమ్స్ మాత్రం రెండు రోజులుకోసారి దగ్గరగా వచ్చి, నా భుజం మీద చేయి వేసి, “ఎలా ఉంది కాలు నొప్పి,” అంటూ నా కాలు, పాదాలు వొత్తి పళ్ళికిలించి వెళ్తున్నాడు.

నేనేదో తన సొంత ఆస్థినన్నట్టు మాట్లాడి కళ్ళెగరేసి పోతాడు.

 

ఓ మధాహ్నం గోవిందుని దగ్గరికి రమ్మని పిలిచాను…వచ్చి పక్కనే నిలుచున్నాడు.

“తాతనుండి ఏదన్నా జవాబు వచ్చిందా? బాబాయి ఓ సారి వచ్చెళ్ళాడని తెలుసు… మళ్ళీ కబురేమన్నా అందిందా?” సైగలతో వాకబు చేసాను.

 

“ఇదిగో, సూడు, నీవేమీ బెంగెట్టుకోకు. మీ బాబాయి మళ్ళీ తప్పక   వస్తాడు.   అన్నీ సర్దుకుంటాయి,” అనగానే ఒక్కసారిగా ఏడ్చేసాను.

నన్ను ఓదార్చడానికి చాలా కష్టపడ్డాడు గోవిందు….

“ఏడవమాకు గాయత్రీ.   అన్నీ బాగానే ఉంటాయిలే. నేను సెపుతున్నాగా. నా మాట ఇని కళ్ళు తుడుచుకో,” అంటూ సముదాయించాడు గోవిందు.

**

నాకు కొత్త కాలు పెట్టే రోజు.

కమలమ్మని తోడు తీసుకొని, ‘అనాధాశ్రమం’ వారి వాన్ లో ఆసుపత్రికి బయలుదేరాను. ‘మదర్ తెరెసా’ వారి ఇతరత్రా పనులు కూడా ఉన్నాయంటూ జేమ్స్ కూడా ఆఖరి నిముషంలో వాన్ ఎక్కాడు.

కొంత దూరం వెళ్ళాక మాటలు మొదలు పెట్టింది కమలమ్మ.

 

“చూడు గాయత్రీ, నీవు రాసిన ఉత్తరం అందుకొని మీ బాబాయిని పంపాడు మీ తాత. నీవు ఆపరేషనయి ఆసుపత్రిలో ఉన్నప్పుడు వచ్చి సచ్చాడులే మీ రాంబాబాయి.   కల్లు తాగిన కోతిలాగా నానా యాగీ చేసి నా మీద రంకలేసి పోయాడు. నీ తాత ముసలాడు నీకు ఒక్క కానీపైసా కూడా ఇచ్చేది లేదంట,” కోపంతో ఊగిపోయింది కమలమ్మ.

 

మంచినీళ్ళు సీసా అందించి, ఆమెని నెమ్మది పరిచే ప్రయత్నం చేసాడు జేమ్స్…నీళ్ళ సీసాలో నుండి గుక్కెడు తాగిందామె.

 

“వాడట్టా అన్నంతమాత్రాన ఏంకాదు… నువ్విప్పుడు మేజర్ కాదా…నివ్వు గట్టిగా నీ మాట మీద నిలబడితే, ఆ దిక్కుమాలిన పొలం, కొట్టాం నీకొచ్చి తీరుతాది… నువ్వు గాక ఎవరున్నారు వాడికి?” క్షణమాగింది..

 

“అయినా గాయత్రి, ఇదంతా ఒకెత్తైతే – నేను, గోవిందు ఎంత త్యాగం సేసి నిన్ను ఈ కాడికి తెచ్చామో నువ్వు గుర్తెట్టుకోడం మరో ఎత్తనుకో….నీ డబ్బు, దస్కం వచ్చాక కూడా నీ కాడ ఊడిగం సేస్తాం మేము. ఇప్పటి వరకు మేము సేసిన కష్టం మరిసిపోమాకు.

మళ్ళీ ఎప్పుడో దాపురిస్తాడు నీ బాబాయి.   గట్టిగా తిప్పికొట్టి రానని నిక్కచ్చిగా సెప్పేయి. నీ డబ్బు ఇప్పించుకో,” అని ముగించింది…

అలిసిపోయి వెనక్కి వాలింది.

 

“ఆ అమ్మాయికి అన్నీ అర్ధమవుతాయిలే కమలం.   సరయిన నిర్ణయం తీసుకుంటుంది,”   నా వంక చూసి కన్ను గీటి ఇకిలించాడు జేమ్స్.

నేనూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను.

 

కమలమ్మ మాటలు చెవుల్లో గింగిర్లు తిరుగుతున్నాయి.

‘నాకన్నీ గుర్తే కమలమ్మా’ అనుకున్నాను.   మరువలేని సంఘటనలు ఒకటా రెండా?’ ఈ ఊరు చేరిన మొదటి వారం, ఎప్పటికైనా మరువగలనా?

కొత్తూళ్ళో రైలు దిగి సత్రంలో చేరాక,   మొదటి రెండు రోజులు మాత్రమే నాతో మామూలుగా మసిలారు అక్కాతముళ్ళు. తరువాత నా పాటికి నన్నొదిలి రోజంతా వెళ్ళిపోయేవారు….

వారం పాటు ఆకలితో మాడిపోయాను…గది బయట ఉన్న నీళ్ళకుండ నుండి తాగునీరుతో దప్పిక, ఆకలి కూడా తీర్చుకున్నాను.

 

వారమయ్యాకే నోరు విప్పి నాతో మాట్లాడింది కమలమ్మ.

నాకు మేలు చేయాలని ఉన్నట్టుండి అన్నీ వదిలి ఊరు మారడంతో, తమ జీవనం దిక్కులేకుండా అయిందని, అందుకే బతకుతెరువు వెతుక్కోడానికి తిరుగుతున్నామని, ఎడంగా కూచుని పెద్ద గొంతుతో   చెప్పింది.

 

నీరిసించిపోయున్న నన్ను, ఆ రోజు గోవిందే దగ్గరగా వచ్చి పలకరించాడు. తనకి సత్రంలోనే ఏదో పని దొరికేలా ఉందని చెప్పి, తన వద్దున్న అరడజను అరటిపళ్ళ నుండి రెండు నాకిచ్చాడు.

నాకు తెలిసి వారంపాటు తిండిలేకుండా ఉన్నది అదే మొదటి సారి..

 

ఆ రాత్రి పడుకునే ముందు నా పక్కన చేరింది కమలమ్మ…

”ఇదో సూడు గాయత్రీ, వాడా ఏదో సంపాదిస్తాడు. నేను పక్కనే ఉన్న అమ్మగార్ల కాన్వెంట్ లో స్వీపర్ గా సేరాను. నన్నాడ కొలువులో పెట్టినాయన ప్రహ్లాద జేమ్స్. ఆయన ఈడ సత్రం కాంటీన్ తో పాటు ఎదురుగా ఉన్న టీ బడ్డీ కూడా నడుపుతాడు. అతనే సొంతదారు, వంటవాడు కూడా.

అతని కాడ వంటింట్లో నీవు పని సేస్తావని ఒప్పుకున్నాను. అలాగైతే, మనకి రెండు పూటలా తిండి ఆడనుండే ఇస్తాన్నాడు. కాఫీలు టిఫిన్లు అన్నీ ఫ్రీ. రేపు పొద్దున్న ఐదు గంటలనుండే పప్పులు రుబ్బడంతో నీపని మొదలని అన్నాడు.   ఇక పడుకో,” అంటూ నా పక్కనే అటు తిరిగి పడుకొంది.

అట్లా ప్రహ్లాద్ జేమ్స్ మా జీవితాల్లో ప్రవేశించాడు….

 

శబ్దం చేస్తూ వాన్ ఆసుపత్రి ముందు ఆగడంతో నా ఆలోచనల నుండి బయట పడ్డాను.

**                                                                          (ఇంకా ఉంది)

 

 

మీ మాటలు

*