అతడు ఈ నేల మీది వాడల ఆస్తి!

10527627_758258257546728_5310203278332013818_n

 

‘ తెరేష్ ఈస్ నో మోర్ ‘ …. మొన్న సెప్టెంబర్ 29 న కవి మోహన్ రుషి పంపిన మెసేజ్ చూడగానే లోపలెక్కడో కాస్త అపనమ్మకంగానే కట్టుకున్న చిన్న ఆశ ఏదో ఒక్కసారిగా కుప్పకూలి పోయిన బాధ ! వార్త తెలిసిన వెంటనే  ఆఫీస్ నుండి సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి వెళ్ళడం అయితే వెళ్లాను గానీ తెరేష్ అన్నని ఒక విగత జీవిగా దగ్గరనుండి చూసే ధైర్యం లేకపోయింది. బహుశా, తెరేష్ అన్నని కాస్తో కూస్తో సమీపంగా తెలిసిన ఎవరికైనా ఇదే అనుభవం ఎదురై వుంటుంది. ఎప్పుడు కలిసినా గొప్ప జీవకళతో వెలిగిపోతూ, మనుషుల్ని ఆలింగనం చేసుకునే మనిషిని ఒక్కసారిగా అట్లా చూడవలసి రావడం మనసుకి ఎంత కష్టం !

 

అంతకు క్రితమే నేను పాల్వంచలో ఉద్యోగం చేసే కాలంలో కవి మిత్రుడు ఖాజా ద్వారా తెరేష్ కవిత్వం గురించి విని వున్నప్పటికీ, 1996 లో తన ‘అల్పపీడనం ‘ కవితాసంకలనం విడుదల సందర్భంలో తెరేష్ అన్నతో నా తొలి పరిచయం. తెలుగు కవిత్వంలో నాకు పరిచయమైన కవులలో తొలి పరిచయ కాలంలోనే నేను ‘అన్నా ‘ అని పిలిచిన అతి కొద్దిమంది కవులలో తెరేష్ ఒకడు! … తను కూడా ఎట్లాంటి అనవసర మర్యాదలు లేకుండా ‘విజయ్ ‘ అనే పిలిచాడు.  పరిచయమైన కొద్దికాలం లోనే మనుషులు దగ్గరి వాళ్లై పోయే గొప్ప మానవాంశ ఏదో తెరేష్ అన్నలో వుండేది !

తెలుగు కవిత్వం నిండా దళిత కవిత్వం పరుచుకున్న కాలంలో ఆ దళిత కవిత్వ జెండాని రెప రెప లాడించిన ఇద్దరు బాబుల్లో ఒకరు తెరేష్ బాబు అయితే మరొకరు మద్దూరి నగేష్ బాబు. అప్పుడప్పుడే హైదరాబాద్ కి వొచ్చి కవిత్వాన్ని సీరియస్ గా చదువుకుంటూ వున్న నాకు ఆ ఇద్దరి కవితలు, దళిత జీవితంలోని అవమానాలనీ, దళితులు సవర్ణ వ్యవస్థ పైన ప్రదర్శించే ధర్మాగ్రహం వెనుక వున్న నిత్య గాయాల పుళ్లనీ చిత్రిక కట్టాయి.  ముఖ్యంగా, తెరేష్ ఎంచుకున్న మార్గం కొంత విభిన్నం! …. కొన్ని తరాల పాటు తనని అవమానాల పాలు చేసిన ఈ సవర్ణ వ్యవస్థ సిగ్గుతో చితికి బిక్క చచ్చి పోయేలా చేయడానికి ఉపయోగించవలసిన సాధనం ‘తిట్లూ – శాపనార్థాలూ ‘ కాదనీ, పోలీసు దెబ్బల్లా పైకి మరకలేవీ కనిపించకుండా కొట్టాలంటే అందుకు పదునైన వ్యంగ్యమే సరైనదని అతడు భావించినట్టు తోస్తుంది. అతడి చాలా కవితలు ఎంతో కసితో రాసినట్టు తెలిసిపోతూ వుంటుంది.  ఎవరో గాట్టిగా తంతే పెద్ద సింహాసనం ముక్కలు ముక్కలై గాల్లోకి ఎగిరిపోతున్నట్టుగా వుండే ‘అల్పపీడనం‘ కవర్ పేజి ఇందుకు మంచి ఉదాహరణ! తన ‘నిశానీ’ కవితా సంకలనం లో బూతులు యధేచ్చగా దోర్లాయని ఫిర్యాదులు వొస్తే, ‘కమలా కుచ చూచుకాల్లో / వేంకటపతికి అన్నమయ్య పట్టించిన సురతపు చెమటల్లో / నీకు బూతు అగుపడదు ‘ అని దూకుడుగా జవాబు చెప్పిన కవి తెరేష్ !

తెరేష్, తెలుగు భాష పైనే కాదు – ఉర్దూ పైన కూడా మంచి పట్టు వున్న కవి. ముఖ్యంగా పాత హిందీ సినిమా పాటలు, గజల్స్ అంటే తనకు ఎంతో యిష్టం. తనదైన శైలిలో అద్భుతమైన దళిత కవిత్వం మాత్రమే కాదు – సగటు టి వి ప్రేక్షకులని ఉర్రూతలూగించిన సీరియల్స్ కూడా రాసాడు. అంతేగాక గొప్ప గాయకుడు. తెలుగులో తాను రాసిన గజల్స్ లో ‘నీ ప్రేమలేఖ చూసా – నే గాయపడిన చోటా ‘ కి వున్న అసంఖ్యాకమైన అభిమానులలో నేనూ ఒకడిని! … ఆ మధ్యన ఎక్కడో కలిసినపుడు ఆ గజల్ టెక్స్ట్ కావాలని అడిగితే గుర్తు పెట్టుకుని మరీ పేస్ బుక్ లో ‘విజయ్ – ఇది నీకోసం’ అని పోస్ట్ చేసాడు.

మరీ ముఖ్యంగా, తెలంగాణ ఉద్యమానికి తెరేష్ తన కవితల ద్వారా యిచ్చిన సపోర్ట్ మరిచిపోలేనిది. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్ర కవులు తెచ్చిన కవితా సంకలనానికి పెట్టిన పేరు ‘కావడి కుండలు‘, తెరేష్ రాసిన కవిత శీర్షిక నుండి స్వీకరించినదే ! …. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ముందుకు సాగే క్రమంలో తెలంగాణ కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలను హేళన చేస్తూ పేస్ బుక్ లో క్రమం తప్పకుండా ‘విభజన గీత’ శీర్షికతో తెరేష్ పోస్ట్ చేసిన పద్యాలు / వ్యాఖ్యానాలు పెద్ద హిట్ ! చాలా మంది తెలంగాణ కవులలో కూడా లుప్తమైన గొప్ప రాజకీయ పరిజ్ఞానంతో అప్పుడు జరిగిన సంఘటనల వెనుక దాగిన కుతంత్రాలని తన విభజన గీత పద్యాలలో విప్పి చెప్పాడు!

కొంతకాలంగా తెలుగు కవిత్వంలో ‘దళిత కవిత్వం ఎక్కడుంది ?’ అని ఒక ఫిర్యాదు వుంది. నగేష్ , తెరేష్ , యువక లాంటి కవులని అభిమాంచిన నా లాంటి వాడికి కూడా ‘ఉధృతంగా సాగిన దళిత కవిత్వం పూర్తిగా మందగించింది. అచ్చమైన దళిత కవిత్వం రాయగలిగిన తెరేష్ లాంటి కవులు విస్తృతంగా రాయడం లేదు’ అన్న ఒక ఫిర్యాదు వుంది. తనకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి, ఐదు నెలల క్రితం ఇంటికి వెళ్లి పలకరించినపుడు… ఈ ఫిర్యాదుని తన ముందు పెడితే, ‘నేను మళ్ళీ విజ్రుంభిస్తా!’ అని తనదైన శైలిలో గొప్ప ఆత్మ విశ్వాసంతో చెప్పాడు. అతడే కాదు … నా లాంటి మిత్రులు చాలా మందిమి విశ్వసించాము … కాదంటే, ఆశపడ్డామేమో ?! …. ఇంతలోనే ఇట్లా జరిగిపోయింది !

ఈ నేల మీది కొన్ని లక్షల మంది దళిత వాడల తల్లులు ఎన్నెన్ని పురిటి నొప్పులు పడితే, ఆ వాడల అవమానాల గాయాలని గానం చేసే, వాడలలో సృష్టించే అల్ప పీడనంతో ఊళ్ళ లోని సింహాసనాలని కూల్చి వేసే,  ఒక తెరేష్ లాంటి కవి జన్మిస్తాడు. ఆ దళిత వాడల అపురూప ఆస్తి కదా అతడు! ….ఇంకా చేయవలసిన యుద్ధాలు ఇన్నేసి మిగిలే వున్నా, ఇట్లా తొందర పడి, ఈ నేలని విడిచి వెళ్ళిపోయే హక్కుని ఆ కవికి ఎవరిచ్చారు ?

కోడూరి విజయకుమార్    

ఫోటో: కాశిరాజు   

 

మీ మాటలు

  1. buchireddy gangula says:

    Great poet— miss him
    gone soon— why anna ???????
    ———————————-
    buchi reddy gangula

  2. Satyanarayana Rapolu says:

    తేరేశ్ బాబు ఆత్మీయ కవి, ఆత్మగౌరవం ఉన్న కవి. ఆసుపత్రి తెలుగు పదం కాదు; హాస్పిటల్ అనే ఇంగ్లిష్ పదానికి అనుకరణ! హాస్పిటల్, వైద్యశాల, దవాఖాన సరియైన పదాలు. సాహితీవేత్తలు, రచయితలు ఈ విచిత్ర పదాలను ఎందుకు రాస్తరో

  3. balasudhakarmouli says:

    హైద్రాబాద్ వచ్చినప్పుడు చాలా ప్రేమ చూపారు. నా నివాళి.

  4. balasudhakarmouli says:

    మీ కవిత్వం కావాలంటే.. హైద్రాబాద్ వచ్చినప్పుడు ఆర్.ఎస్ కి వచ్చి తీసుకో.. అని ఎంతో ప్రేమతో మాట్లాడారు.

  5. దేశానికి హిందుత్వం ఒక జాతీయ గుర్తింపు అని మతోన్మాదులు పెట్రేగుతున్న వర్తమానానికి తెరేష్ లాంటి మనుహన్తకుల అవసరం చాలా వుంది..

  6. ఈ నేలను మరింత నివాసయోగ్యం చేసేందుకు స్వప్నించిన,రాసిన,యుద్దం చేసిన వాడు..-అవే కలలు కంటున్న అందరికీ ఆస్తి నే గదా!

Leave a Reply to balasudhakarmouli Cancel reply

*