మాండొలిన్ గురించి మరికొంచెం

1

క్రితంసారి మాండొలిన్ శ్రీనివాస్ గురించి రాసినదానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలను తెలియజెప్పాలనే కోరికే నాచేత మళ్లీ యిలా రాయిస్తున్నది.

మాండొలిన్ శ్రీనివాస్ సెప్టెంబర్ 19 నాడు యీ లోకాన్ని వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. రెండు రోజుల తర్వాత – అంటే సెప్టెంబర్ 21 ఆదివారం రోజున – రాత్రి తొమ్మిదిన్నర నుండి పదకొండు గంటల వరకు గంటన్నర సేపు ఆకాశవాణి జాతీయ సంగీత కార్యక్రమంలో మాండొలిన్ శ్రీనివాస్ సంగీతాన్ని ప్రసారం చేశారు. ప్రతి శని ఆది వారాల్లో దేశంలోని అన్ని ప్రధాన రేడియో కేంద్రాల ద్వారా యిలా సంగీతాన్ని ప్రసారం చేస్తారు ఆకాశవాణి వాళ్లు. అయితే you tube, raaga.com, gaana.com, music India online, surgyan.com మొదలైన ఎన్నో వెబ్ సైట్లలో సాధారణంగా దొరకని కొన్ని రాగాలను – శ్రీనివాస్ వాయించినవాటిని – ఆనాటి కార్యక్రమంలో వినగలిగారు రసికులైన శ్రోతలు.

అందులోని రెండు ప్రత్యేక రాగాలు చాలా మనోహరంగా, ఆకర్షించే విధంగా ఉన్నాయి ఆ రోజున. ఆ రెండింటిలో మొదటిది స్వరరంజని రాగంలోనిది. కర్ణాటక సంగీతంలో వున్న రంజని, శ్రీరంజని రాగాలే తప్ప ఈ కొత్త రాగాన్ని నేను అంతకు ముందెప్పుడూ విని ఉండలేదు. కర్ణాటక సంగీతంలో 72 మేళకర్త రాగాలు లేక జనక రాగాలు వున్నాయి. మళ్లీ ఒక్కొక్కదాంట్లోంచి మరికొన్ని రాగాలు ఉద్భవిస్తాయి. కాని వాటన్నిటిలోంచి చాలా తక్కువ రాగాలను మాత్రమే కచేరీల్లో గానం చేస్తారు లేక వాదనం చేస్తారు. ఈ కారణంవల్ల సంగీత రసికులకు కొన్ని రాగాలే తెలుస్తాయి. హిందుస్తానీ సంగీతంలో పది రకాల ఠాట్ లు (జనక రాగాలు) మాత్రమే వుండటం చేతా, వాటిలోని చాలా రాగాలను కచేరీల్లో వినటం చేతా, సాధారణ శ్రోతలకు తెలియని రాగాల సంఖ్యతక్కువే అని చెప్పవచ్చు. మళ్లీ వెనక్కి వస్తే, ఈ స్వరరంజని రాగం అచ్చం కదన కుతూహలం రాగంలాగానే ఉన్నది. స్వరాల స్వభావాన్ని బట్టి రాగాలను గుర్తించగలిగేటంత సంగీత జ్ఞానం నాకు లేదు. ఉదాహరణకు ఇదిగో ఇది శుద్ధగాంధార స్వరం, ఇది చతుశ్రుతి దైవతం, ఇది కాకలి నిషాదం అంటూ గుర్తు పట్టలేను.

ఎన్నోసార్లు చూసిన ఒక ముఖాన్ని పోలిన మరో ముఖాన్ని మనం యెలా గుర్తించగలుగుతామో అలానే పోల్చుకోవటం అన్న మాట. ఇట్లా పోల్చుకోవటానికి రెండు అంశాలు బాగా ఉపకరిస్తాయి. మొదటిది ఆ రాగపు నడక. దీన్నే హిందుస్తానీ సంగీత పరిభాషలో ‘చలన్’ అంటారు. ఇక రెండవ అంశం ఆ రాగంలోని కొన్ని ప్రధాన స్వరాల ప్రత్యేకమైన మేళవింపు. దీన్ని ‘పకడ్’ అంటారు. ఈ రెండింటి మధ్య వుండే భేదం అతి స్వల్పమైనది కావటంచేత, వీటిని ఒకదానికి మరొకదాన్ని పర్యాయ పదాలుగా వాడుతారు. స్వరరంజని రాగం కదన కుతూహలం లాగా వుంటుందన్నాం కదా. ఈ రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ అనే వాగ్గేయకారుడు స్వరపరచిన ‘రఘువంశ సుధాంబుధి’ చాలా ప్రసిద్ధమైనది. ‘చూడాలని వుంది’ సినిమాలోని యమహా నగరి కలకత్తా పురీ అన్న పాట రఘువంశ సుధాంబుధికి అచ్చు గుద్దినట్టుగా వుంటుంది. ఆ సినిమా పాట కదన కుతూహలం రాగంలోనే వున్నది. అయితే అందులో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ పేరును సూచించకుండా ‘చిరు త్యాగరాజు’ అన్నారు గీత రచయిత – త్యాగరాజంతటి సంగీత నైపుణ్యాన్ని కలిగిన మన హీరో చిరంజీవి అనే అర్థంలో, సరదాగా. అది సముచితంగానే వుంది. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ అంటే చాలా మంది ప్రేక్షకులకు తెలియదు కదా.

ఇక ఆనాటి రేడియో కార్యక్రమంలోని రెండవ అరుదైన ‘కృతి’ స్వర సమ్మోదిని రాగంలో వుంది. ఈ రాగాన్ని కూడా చాలా మంది సాధారణ శ్రోతలలాగా నేనూ మొదటిసారిగానే విన్నాను. ఇది జనసమ్మోహిని అనే మరో రాగానికి దాదాపు అచ్చు గుద్దినట్టుగా వుంది. జనసమ్మోహిని రాగం హిందుస్తానీ సంగీతంలో కూడా ఉన్నది. అయితే అందులో దానికి జన్ సమ్మోహిని అని పేరు. ఈ జన్ సమ్మోహిని అద్భుతమైన, అతి మధురమైన, సమ్మోహహకరమైన రాగం. పండిత్ వసంతరావు దేశ్ పాండే ఈ రాగం లో గానం చేసిన ‘నిసే దిన్ హరికా గుణ్ గా’ ఖయాల్ అద్భుతంగా వుంటుంది. మొదట్లో అయితే దాన్ని వినప్పుడల్లా నాకు పారవశ్యంతో ఒళ్లు జలదరించి, కళ్లలో నీళ్లు తిరిగేవి.

కాని ఆ కన్నీళ్లకు కారణం దుఃఖం కాదు, ఆపుకోలేని మానసిక ఉద్వేగం మాత్రమే. సరోద్ వాదకురాలు విదుషి జరీన్ దారూవాలా కూడా ఈ రాగాన్ని ఎంతో మనోహరంగా వాయించింది. మన దురదృష్టంకొద్దీ జన్ సమ్మోహిని రాగాన్ని రేడియో మీద కాని, ఇంటర్నెట్ మీద కాని, కచేరీల్లో కాని చాలా అరుదుగా మాత్రమే వినగలుగుతాం. కారణం తెలియదు. కారణం చెప్పగలిగేటంత సంగీత జ్ఞానం, అవగాహన, ఆకళింపు నాకు లేవు. ఒకవేళ అది క్లిష్టమైన రాగం అయి, అందువల్ల దాన్ని పాడటానికి చాలా మంది సాహసించరా? ఏమో. జన్ సమ్మోహిని రాగం కళావతి అనే మరో హిందుస్తానీ రాగానికి అతి దగ్గరగా వుంటుంది. కళావతి రాగంలో విదుషి ప్రభా అత్రే పాడిన ‘తనా మన ధన తోపె వారు’ ఖయాల్, ఆమెదే మారూ బిహాగ్ రాగంలోని మరొక ఖయాల్ – ఈ రెండూ నేను పాతికేళ్ల క్రితం హిందుస్తానీ సంగీతంలో మొట్టమొదటి సారిగా విన్న సంగీత ఖండికలు. ఇట్లా చెప్తూ పోతుంటే తీగలాగా ఎటెటో పోతూనే వుంటుంది. కనుక యిక్కడే ఆపేద్దాం.

-ఎలనాగ

మీ మాటలు

  1. Rammohan Thummuri says:

    చక్కని సంగీతం ముచ్చట్లు వినక చాలా రోజులయ్యింది.బాగుంది ప్రస్తావన.శాస్త్రీయ సంగీతం గురించి తెలిసిన వాళ్లు తక్కువగా ఉంటారు . వినేవాళ్ళు ఇంకొంచం తక్కువ .పాడే వాళ్లు మరి తక్కువ.సృజనకారులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.అలాంటి అరుదైన విలువైన కళా మర్మాలు తెలిసి ఉండటం ఒక వరం.ఇలాంటి విషయాలు తెలియజేసినందుకు సంతోషిస్తూ ఇంకా విరివిగా ఇలాంటి విషయాలు తెలుపుతూఉండాలని కోరుకుంటున్నాను.

మీ మాటలు

*