వాళ్ళకు నా అక్షరాలిస్తాను..

 

రాఘవ రెడ్డి

రాఘవ రెడ్డి

ఎందుకో మరణం గుర్తొచ్చిందివాళ

ఇటీవల కాస్త అనారోగ్యం చేసింది

ఏదో ఒకనాడు చనిపోతాను గదూ-

 

చెప్పో చెప్పకుండానో కాస్త ముందుగానో వెనగ్గానో

తాపీగానో తొందరగానో మొత్తానికి చనిపోతాను

అయితే బ్రతికి చనిపోవడం నాకిష్టం

బ్రతుకుతూ చనిపోవడం నాకిష్టం

 

కొంచెం కొంచెం చనిపోతూ మిగిలుండడం

అప్పుడెప్పుడో చనిపోయీ ఇంకా ఇక్కడే

చూరుపట్టుకు వేలాడటం

చనిపోవడం కోసమే బ్రతికుండటం..

అసలిష్టం లేదు నాకు

 

***

ఎప్పుడు ఎలా చనిపోయామన్నది ముఖ్యం కాదు

ఎప్పుడు ఎలా బ్రతికామన్నది ముఖ్యం

చావుకంటే బ్రతుకు ముఖ్యం

 

***

ఎవడి పొలానికి వాడు గెనాలు వేసుకుని

ఎవడి స్థలానికి వాడు తెట్టెలు కట్టుకుని

ఎవడి పెట్టెకు వాడు తాళాలు వేసుకుని

ఎవడి పశువుకు వాడు పలుపు గట్టుకుని

ఎవడి చావు వాడు చస్తున్నప్పుడు

ఎవడి ఏడుపు వాడేడవాల్సిందే-

 

***

కానీ

వాళ్ళ చావులకు నాకేడుపువస్తున్నది

చంపబడుతున్న వాళ్ళకోసం ఏడుపు వస్తున్నది

గెనాలను దున్నేసే వాళ్ళ కోసం

తెట్టెలు కొట్టేసే వాళ్ళకోసం

యుద్ధాన్నొక పాటగా హమ్ చేస్తున్నవాళ్ళకోసం

కళ్ళు సజలమవుతున్నవి

-కానీ ఒట్టి రోదనలతో ఏమిటి ప్రయోజనం..

 

దుఃఖించడం నాకిష్టం లేదు

ఏడుస్తూ ఏడుస్తూ చనిపోతూ బ్రతకడం

ఇష్టం లేదని ముందే చెప్పానుగా-

 

బ్రతుకుతాన్నేను

బ్రతకడం కొంత తెలుసు నాకు

మాటలే చెబుతానో

పాటలే కడతానో

కధలే అల్లుతానో

వాళ్ళకోసం దారులేస్తాను

వాళ్ళను ప్రేమించేవాళ్ళను ప్రోది చేస్తాను

వాళ్ళకు నా అక్షరాలిస్తాను-

వెదురువనం పాడుతోన్న అరుణారుణ గేయానికి

సంపూర్ణ హృదయం తో ఒక వంతనవుతాను.

 

-ఆర్. రాఘవ రెడ్డి

మీ మాటలు

 1. నిజమైన బ్రతుకు అర్థం స్ఫురింప చేసిన మీ కవిత బాగుంది రాఘవరెడ్డి గారు

 2. నిశీధి says:

  చావులో కూడా బ్రతికి ఉండటం అంటే ఇలాగేనేమో ? మంచి ఆర్ద్రత నిండిన కవిత .

 3. రాజారాం గారూ..నిశీధి గారూ…ధన్యవాదాలు.

 4. Sadlapalle Chidambara Reddy says:

  బతకడం తెలిసిన వారికి ఏడ్పు గాని,చావుగానీ రావు…వచ్చినా అవి జీవితంలో భాగాలే–మదిలోతులు తాకేలా గొప్పగా రాశారండీ.

 5. ఈ సమయం అవసరమైన కవిత.. రాఘవ గారూ అభినందనలు..

 6. Rajasekhar Gudibandi says:

  “వాళ్ళకు నా అక్షరాలిస్తాను-

  వెదురువనం పాడుతోన్న అరుణారుణ గేయానికి

  సంపూర్ణ హృదయం తో ఒక వంతనవుతాను.”

  బ్రతకడమంటే ఎవరికోసమో చావడం కూడా….
  నిజంగా బ్రతికుండాల్సిన ఆ అవసరం తెలిపారు… చాలా గొప్ప కవిత రాఘవ గారూ

 7. బ్రతకడం తెల్సిన మిత్రులందరికీ..ఎంతో ప్రేమతో…

 8. knvmvarma says:

  vanam nimdima kavita

 9. buchireddy gangula says:

  రెడ్డి గారు
  బాగుంది సర్

  ———————బుచ్చి రెడ్డి గంగుల

 10. వాళ్ళకే కాదు మాకు కూడా ఇవ్వాలి సుమా….

 11. చాలా బాగుంది. ఈ మధ్య మీ కవితలలో నాకు బాగా నచ్చింది, ఒక కవి ఏం చెయ్యొచ్చో చెప్పారు. నేల విడువకుండానే సాముచేసారు.
  .

 12. lakshmi.p.s. says:

  mii kavitha chaalaa aalochanaatmakamgaa undhi

 13. “వాళ్ళను ప్రేమించేవాళ్ళను ప్రోది చేస్తాను” ఎంత గొప్ప పని చేయబోతున్నారు!

 14. Thirupalu says:

  అవును బ్రతుకుతూ కాలాలి! చస్తూ బ్రతకడం కంటే.
  వాళ్లను ప్రేమిచే వాళ్లను ప్రోది చేస్తూ!
  చాలా ఇమ్ప్రెస్సివ్ రాఘవ గారు.

 15. i s t sai says:

  proodi చయటం అయిపొఇన్ద రాఘవ రెడ్డి గారు mee kavitaku hatsaf

 16. D. Subrahmanyam says:

  బ్రతుకుతాన్నేను

  బ్రతకడం కొంత తెలుసు నాకు

  మాటలే చెబుతానో

  పాటలే కడతానో

  కధలే అల్లుతానో

  వాళ్ళకోసం దారులేస్తాను

  వాళ్ళను ప్రేమించేవాళ్ళను ప్రోది చేస్తాను

  వాళ్ళకు నా అక్షరాలిస్తాను-

  వెదురువనం పాడుతోన్న అరుణారుణ గేయానికి

  సంపూర్ణ హృదయం తో ఒక వంతనవుతాను.” చాలా మంచి మాటలు , ఇంకా మంచి కవితలో చెప్పరి రాఘవరెడ్డి గారు. పైన వర్మ గారు చెప్పినట్టు ఇప్పటి పరిస్తుల్లో ఇలాంటి మాటల కూర్పులే కావాలి. అఫ్సర్ గారూ ఇలాంటి మాటలు ఇంకా ఎన్నో ఎన్నో కావలి . అప్పటికైనా …….

 17. శాంతిశ్రీ says:

  వాళ్ళకోసం దారులేస్తాను
  వాళ్ళను ప్రేమించేవాళ్ళను ప్రోది చేస్తాను
  వాళ్ళకు నా అక్షరాలిస్తాను

  ఎంత బాగా చెప్పారు.. ఇదే చేయాల్సింది.. మన ముందున్న కర్తవ్యం కూడా.. మంచి కవిత..రాఘవరెడ్డిగారు.. ఇలాగే మరిన్ని కవితలు రాయాలి.. మనమంతా అలాంటివారికి దారులు వేస్తూ.. వారిని ప్రేమించేవారిని ప్రోదిచేస్తూ.. అక్షరాలను ఇద్దాం..

 18. సత్యవతి says:

  హాత్ మిలావొ దోస్త్
  సత్యవతి

 19. మహాద్భుతం…. యెంత గొప్పగా వ్రాసారో ……ధన్యవాదాలు

Leave a Reply to శాంతిశ్రీ Cancel reply

*