పెద్రో పారమొ-౩

pedro1-1

“.. నేను

చెపుతున్నాయన మెదియా లూనా కొట్టం దగ్గర గుర్రాలను మాలిమి చేసి దారికి తెస్తుండేవాడు. తన పేరు ఇనొసెంసియో ఒజారియో అని చెప్పేవాడు. గుర్రమెక్కితే దానికి అతుక్కుపోతాడంతే. అందరూ చికిలింతగాడనే పిలిచేవాళ్ళు. అతను గుర్రాల్ని లొంగదీసేందుకే పుట్టాడనేవాడు మా పేద్రో. అసలు సంగతేమిటంటే అతని దగ్గర ఇంకో విద్య ఉంది: మంత్రాలేయడం. కలల్ని మంత్రించేవాడు. నిజానికి అతని అసలు పని అదే. మీ అమ్మకూ వేశాడు చాలా మందికి వేసినట్టే. నాక్కూడా. నాకు వొంట్లో బాలేనప్పుడు ఒకసారి వచ్చి ‘నీకు నయం చేయడానికి వచ్చాను ‘ అని చెప్పాడు. దానికర్థం ఏమిటంటే మొదట రుద్దడమూ, మర్దనా చేయడమూ: ముందు నీ వేళ్లకొసలూ, తర్వాత నీ అరిచేతులూ, ఆపైన చేతులూ. నీకు తెలిసేలోగా నీ కాళ్ళ మీద మొదలెడతాడు గట్టిగా రుద్దుతూ. కాసేపట్లో వొళ్ళంతా వేడి పుడుతుంది. అలా రుద్దుతూ తోముతూ దువ్వుతున్నంతసేపూ నీకు నీ జాతకం చెపుతూ ఉంటాడు. మైకంలో పడిపోయి గుడ్లు తిప్పుతూ ఉమ్మి తుంపర్లు చుట్టూ చిందేట్టు ఆవాహన చేస్తూ, శాపనార్థాలు పెడుతూ – చూస్తే ఏ సంచారజాతి మంత్రగాడో అనుకుంటావు. కొన్నిసార్లు చివరికి దిసమొలతో మిగిలిపోతాడు; అట్లా కావాలనే చేశాననేవాడు. కొన్నిసార్లు అతను చెప్పేవి నిజమయ్యేవి. గుప్పెడు రాళ్లు విసిరితే ఒకప్పటికయినా ఏదో ఒకటి తగలకపోదు.
“ఇంతకీ ఏమయిందంటే మీ అమ్మ ఆ రోజు ఈ ఒజారియోని చూడబోయింది. చంద్రుడు సరియైన స్థానంలో లేడు కాబట్టి ఆ రాత్రి ఆమె మగాడితో కలవడం కూడదని అతను చెప్పాడు.
“ఏం చేయాలో తెలియక డలోరిస్ వచ్చి నాకు అంతా చెప్పింది. పేద్రోతో పడుకునే ప్రశ్నే లేదని చెప్పింది. అది అమె శోభనం రాత్రి. నేనేమో ఆ మోసకారి, అబద్ధాలకోరు ఒజారియో మాటలు పట్టించుకోవద్దని నచ్చచెప్పచూశాను.
“ ‘నా వల్లకాదు.’ చెప్పిందామె. ‘నా బదులు నువ్వెళ్లు. అతనికి తెలియదులే!’
“ఆమె కంటే నేను చాలా చిన్నదాన్నే అనుకో! ఆమె అంత రంగు తక్కువా కాదు. అయినా చీకటిలో నీకు ఏం కనిపిస్తుంది?
“‘అది కుదిరేపని కాదు డలోరిస్, నువు వెళ్లక తప్పదు.’
“‘నాకీ ఒక్క సాయం చేయి. నీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను.’
“ఆ రోజుల్లో మీ అమ్మకు సిగ్గులొలికే చక్కటి కళ్లుండేవి. ఆమెను చూడగానే కొట్టొచ్చినట్టు కనిపించేది ఆమె కళ్లే. అవి నిన్ను పూర్తిగా జయించేయగలవు.
“‘నా బదులు నువ్వెళ్ళు ‘ అని అడుగుతూనే ఉంది.
“అందుకని నేను వెళ్లాను.
“చీకటి కొంత ఊతమిచ్చింది, ఇంకొంత మరొకటి – మీ అమ్మకి తెలియనిది ఏమిటంటే పేద్రో పారమొ అంటే మీ అమ్మకొక్కదానికే కాదు ఇష్టం.
“అతని పక్కలో దూరాను. సంతోషంగా, ఇష్టంగానే. అతన్ని వాటేసుకుని పడుకున్నా. కానీ ఆ సంబరాల బడలికతో ఆ రాత్రంతా గుర్రుపెట్టి పడుకున్నాడు. నా కాళ్ల మధ్య తన కాళ్లు జొనపడం తప్ప ఏం చేయలేదతను.
“పొద్దు పొడిచేలోగానే లేచి డలోరిస్ దగ్గరకు వెళ్ళాను. ఆమెకి చెప్పాను ‘ఇప్పుడు నువ్వెళ్ళు. ఇది మలిరోజు కదా!’
” ‘ఏం చేశాడు నిన్ను?’ ఆమె నన్నడిగింది.
“’నాకింకా తెలియడం లేదు.’ చెప్పాను.
“మరుసటి ఏడు నువ్వు పుట్టావు కానీ మీ అమ్మను నేను కాదు, వెంట్రుక వాసిలో తప్పిపోయావు.
“మీ అమ్మ సిగ్గుపడిందేమో ఈ సంగతి నీకు చెప్పడానికి”
పచ్చటి మైదానాలు. వంపు తిరిగే రేఖల్లా కురుస్తున్న వానతో అలలవుతున్న మధ్యాహ్నం గోధుమ పొలాల్లో గాలి సుడి తిరుగుతుండగా దిగంతం లేస్తూ పడుతూ ఉంటే చూస్తూ. నేల రంగూ, అల్ఫాల్ఫా, రొట్టె వాసనా. తొణికిన తేనెల వాసనొచ్చే ఊరు…
“ఆమెకి పేద్రో పారమొ అంటే ఎప్పుడూ గిట్టేది కాదు. ‘డలోరిటస్! నాకు నాస్తా పెట్టమని వాళ్ళకి చెప్పావా?’ ప్రతి రోజూ తెల్లారకముందే లేచేది మీ అమ్మ. బొగ్గులు రాజేసేది, ఆ వాసనకి పిల్లులు లేచేవి. వెనకే పిల్లుల్నేసుకుని ఇల్లంతా అటూ ఇటూ తిరుగుతూ. ‘దోన డలోరిటస్!’
“ఆ పిలుపు ఎన్ని సార్లు విందో లెక్కలేదు. ‘దోన డలోరిటస్, ఇది ఆరిపోయింది. తీసెయ్!’ ఎన్ని సార్లు! గడ్డుకాలానికి అలవాటు పడి, ఆమె సిగ్గు పడే కళ్లు కుదురుకున్నాయి.
వేసవి వేడిమిలో నారింజ పూత వాసనలు కాక మరేదీ చవి చూడకపోవడం.
“అప్పుడు నిట్టూర్పులు విడవడం మొదలు పెట్టింది.
“’ఆ నిట్టూర్పులెందుకు డలోరిటస్?’
“ఒక మధ్యాహ్నం వాళ్ళతో వెళ్ళాను. పొలం మధ్యలో ఉన్నాం పిట్టలబారును చూస్తూ. రాబందు ఒకటి బద్ధకంగా ఆకాశంలో ముందుకీ వెనక్కీ ఎగురుతుంది.
“’ఎందుకు నిట్టూరుస్తున్నావు డలోరిటస్?’
“’నేనూ రాబందునయితే ఎగిరి మా అక్క దగ్గరికి వెళ్ళేదాన్ని.’
“’ఇక చాలించు దోన డలోరిటస్! సరే, మీ అక్కని చూస్తావు, ఇప్పుడే. మనమిప్పుడు ఇంటికి వెళదాం, నువు నీ పెట్టెలు సర్దుకో. ఇంక నావల్ల కాదు.’
“మీ అమ్మ వెళ్లిపోయింది. ‘నిన్ను త్వరలో చూస్తాను డాన్ పేద్రో!’
“’గుడ్ బై, డలోరిటస్!’
“ఆమె మళ్ళీ మెదియా లూనాకి తిరిగి రాలేదు. కొన్ని మాసాలయ్యాక పేద్రో పారమొని ఆమె గురించి అడిగాను.
“’ ఆమెకి నాకంటే వాళ్ళక్క అంటేనే ఇష్టం. అక్కడే హాయిగా ఉన్నట్టుంది. అదీ కాక ఆమె అంటేనే విసుగు పుడుతూ ఉండింది. ఆమెని తిరిగి రమ్మనే ఉద్దేశమేదీ లేదు నాకు – నువ్వడగాలనుకున్నది అదేగా?’
“’ఎట్లా గడుస్తుంది వాళ్లకి?’
“’ఆ దేవుణ్ణే చూసుకోనీ!’
..బదులు చెల్లించనీ, కొడుకా, ఇన్నేళ్ళూ మన పేరుగూడా తలవనందుకు.
“నువ్వు నన్ను చూడడానికి వస్తున్నావని ఆమె నాకు చెప్పిందాకా అంతే. ఆమె సంగతేమీ తెలియలేదు ఆ తర్వాత.
“చాలా జరిగింది ఆ తర్వాత.” ఎదువిజస్ కి చెప్పాను. “కొలీమ లో ఉండేవాళ్లం. మా పెద్దమ్మ హెర్త్రూడిస్ వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చింది కానీ మేము తనకెంత భారమో చెపుతూనే ఉండేది. మా అమ్మనెప్పుడూ అడిగేది ‘మీ ఆయన దగ్గరకెందుకు వెళ్లవు?’
” ‘తీసుకురమ్మని ఎవర్నయినా పంపాడా? నన్ను అడిగిందాకా వెళ్లను. నిన్ను చూడాలని వచ్చాను. నువ్వంటే ప్రేమ కనుక. అందుకు వచ్చాను.’
” ‘అది నాకు తెలుసు. కానీ నువ్వు వెళ్ళే సమయమొచ్చింది. ‘
“’అది నా చేతుల్లోనే ఉంటే….’”
ఎదువిజస్ నా మాటలు వింటుందనుకున్నాను. కానీ ఆమె ఎక్కడి మాటలో ఆలకిస్తున్నట్టు తల వంచి ఉండడం గమనించాను. అప్పుడామె అంది:
“ఇంకెప్పుడు శాంతి కలిగేను నీకు?”

నువు వెళ్లిపోయిన రోజే నాకు తెలుసు మళ్ళీ నువ్వెప్పటికీ కనపడవని. సంధ్య ఆకసాన్ని నెత్తుటితో నింపుతుంటే నీపై ఎరుపు మరకలు పడుతున్నాయి. నువు నవ్వుతున్నావు. నువు వదిలిపోతున్న ఆ ఊరి గురించి నువు తరచుగా అనేదానివి “నీ వల్లే ఇష్టపడ్డాను దీన్ని. మిగతాదంతా చీదర ఇక్కడ-ఇక్కడ పుట్టడం కూడా.” నాకనిపించింది – ఈమె తిరిగి రాదు; ఈమెని ఇక ఎప్పటికీ చూడబోను.
“ఈ వేళలో ఏం చేస్తున్నావిక్కడ? పని చేయడం లేదా?”
” లేదు నానమ్మా! రొహెలియో వాళ్ల చిన్నబ్బాయిని చూడమని చెప్పాడు. వీణ్ణి అటూ ఇటూ నడిపిస్తున్నాను. ఈ పిల్లాడూ, టెలిగ్రాఫూ – రెండు పనులూ చేయలేను. ఆయనేమో ఆ పూల్ రూంలో బీరు తాగుతూ కూచుంటాడు. ఇంతా చేసి మళ్ళీ నాకేమీ ఇవ్వడు.”
“సంపాదించడానిక్కాదు నువ్విక్కడుంది, నేర్చుకోవడానికి. ఒకసారి ఏదయినా నేర్చుకుంటే అప్పుడు ఏమనా డిమాండ్ చేయడానికన్నా ఉంటుంది. ఇప్పుడు నువ్వొక పని నేర్చుకునేవాడివి. ఒక రోజు నువ్వే యజమాని కావచ్చు. కానీ దానికి ఎంతో ఓపిక కావాలి, వినమ్రంగా ఉండాలి. వాళ్లు పిల్లాడిని నడిపించమంటే ఆ పని చేయి. వోపిగా ఉండడం నేర్చుకో!”
“ఇంకెవర్నయినా నేర్చుకోమను నాయనమ్మా వోపిగ్గా ఉండడం! నా వల్ల కాదు.”
“నువ్వూ నీ తలతిక్క ఆలోచనలూ! నీకు ముందు ముందు కష్టాలు తప్పవురా పేద్రో పారమొ!”

“ఇప్పుడు నేను విన్నదేమిటి దోన ఎదువిజస్?”
కలలోంచి మేలుకుంటున్నట్టు తల విదిలించిందామె.
“అది మిగెల్ పారమొ గుర్రం, మెదియా లూనాకి వెళ్ళే దారిలో దవుడు తీస్తూంది.”
“అయితే అక్కడ ఎవరయినా ఉంటున్నారా?”
“లేదు, ఎవరూ ఉండడం లేదు అక్కడ.”
“మరి?”
“అది అతని గుర్రమొక్కటే. వస్తూ పోతూంటుంది. అదీ, మిగెల్ ఎప్పుడూ విడిగా కనపడేవారు కాదు. ఊళ్ళ వెంటబడి తిరుగుతూ ఉంటుంది అతని కోసం చూస్తూ. ఈ వేళకి తిరిగి వస్తుంది. ఆ వెర్రి జీవి పశ్చాత్తాపంతో బతకలేకపోతుందేమో! జంతువులకీ తెలుస్తుంది కాదూ తాము ఏదయినా తప్పు చేస్తే?”
“నాకర్థం కావడం లేదు. గుర్రం చేసే చప్పుళ్ళేవీ వినపడలేదు నాకు.”
“లేదా?”
“లేదు.”
“అయితే నాకు అతీంద్రియ శక్తి ఉండి ఉండాలి. దేవుడిచ్చిన వరం – లేక శాపమో! నాకు తెలిసిందల్లా దాని మూలాన బాధలు పడటమే.”

Pedro_Páramo
కాసేపటి దాకా ఏమీ అనలేదు. మళ్ళీ చెప్పింది:
“అదంతా మిగెల్ పారమొతో మొదలయింది. అతను చనిపోయిన రాత్రి జరిగిందంతా నాకొక్కదానికే తెలుసు. అతని గుర్రం మెదియా లూనా వైపు దవుడు తీస్తున్న చప్పుడు వినపడేసరికి నేను పక్క ఎక్కాను. నాకు ఆశ్చర్యమేసింది, ఎందుకంటే మిగెల్ ఆ వేళకి ఎప్పుడూ వచ్చేవాడు కాదు. అతనొచ్చేసరికి ఎప్పుడూ వేకువజాము అయ్యేది. ప్రతి రాత్రీ అతను కాస్త దూరంలోనే ఉన్న కోంట్ల వెళ్ళేవాడు తన ప్రేయసి కోసం. తొందరగా వెళ్లి ఆలస్యంగా వచ్చేవాడు. కానీ ఆ రాత్రి అతను తిరిగి రాలేదు..నీకు వినిపిస్తుందా ఇప్పుడు? నీకు వినిపిస్తుందిలే! అది అతని గుర్రం; తిరిగి వస్తుంది.”
“నాకు ఏమీ వినపడటం లేదు.”
“అయితే అది నాకే వినిపిస్తుందేమో! సరే, నేను చెపుతున్నట్టు అతను రాకపోవడం కాదు అసలు కథ. అతని గుర్రం అటు వెళ్ళిందో లేదో ఎవరో నా కిటికీ తట్టడం వినిపించింది. నువ్వే చెప్పు అది నా భ్రమో కాదో! నాకు తెలిసిందల్లా ఎవరా అని చూడడానికి లేచి వెళ్లడమే. అది అతనే. మిగెల్ పారమొ. అతన్ని చూసినందుకు ఆశ్చర్యమేదీ కలగలేదు నాకు. ఎందుకంటే ఒకప్పుడు ప్రతి రాత్రీ నా ఇంట్లోనే గడిపేవాడు నాతో పడుకుని – అతని నెత్తురు తాగిన ఆ పిల్లని అతను కలిసిందాకా.
” ‘ఏమయింది?’ మిగెల్ పారమొని అడిగాను. ‘ఆ పిల్ల తన్ని తరిమేసిందా నిన్ను?’
“’లేదు, నన్నింకా ప్రేమిస్తూనే ఉంది.’ అతను చెప్పాడు. ‘సమస్య ఏమిటంటే ఆమె ఎక్కడుందో తెలియడం లేదు. ఆ ఊరికి వెళ్లడానికి దారి దొరకడం లేదు. అంతా పొగో, మంచో ఇంకేదో ఉంది. కోంట్ల ఇక అక్కడ లేదన్నది మాత్రం తెలుస్తుంది నాకు. అదెక్కడ ఉండాలో దాని మీదుగా వెళ్లాను కానీ అది కనపడలేదు. నువు అర్థం చేసుకుంటావని తెలుసు కనక నీకు చెప్పటానికి వచ్చాను. కోమలలో ఇంకెవరికయినా చెప్తే నన్ను పిచ్చాడని అంటారు – ఎప్పటిలానే.’
“’లేదు, పిచ్చి కాదు మిగెల్. నువు చచ్చిపోయి ఉండాలి. గుర్తుందా, ఆ గుర్రం వల్లే నీకు మూడుతుందని అనేవాళ్లంతా. గుర్తు చేసుకో మిగెల్. నువ్వేమన్నా పిచ్చి పని చేశావేమో కానీ, అది కాదు విషయమిప్పుడు..’
“’నేను చేసిందల్లా మా నాన్న కొత్తగా కట్టిన రాతి చుట్టుగోడ దూకించడమే. రోడ్డుమీదికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్లవలసి వస్తుందని ఎల్ కొలొరాడోని దూకమన్నాను. దూకిన గుర్తుంది, తర్వాత స్వారి చేయడం కూడా. కానీ నీకు చెప్పినట్టు అంతా పొగ, పొగ, పొగ.’
“’రేపు పొద్దున మీ నాన్న దిగులుతో ఏమవుతాడో!.’ నేను అతనితో చెప్పాను. ’పాపం! ఇక వెళ్ళు ప్రశాంతంగా సేదదీరు మిగెల్. నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.’
“కిటికీ మూశాను. తెల్లారకముందే మెదియా లూనా నుంచి జీతగాడొకడు వచ్చి చెప్పాడు ‘పెద్దాయన నీకోసం అడుగుతున్నాడు. మిగెల్ చచ్చిపోయాడు. డాన్ పేద్రోకి తోడు కావాలి.’
“’నాకు ముందే తెలుసు.’ అతనికి చెప్పాను. ‘నీకు ఏడవమని చెప్పారా?’
“’అవును, నీకు చెప్పేప్పుడు ఏడవమని డాన్ ఫుల్గోర్ చెప్పాడు.’
“’సరే, నువు డాన్ పేద్రోకి చెప్పు నేనొస్తున్నానని. అతన్ని తీసుకొచ్చి ఎంతసేపయింది?’
“’అరగంట కూడా కావడం లేదు. అతన్ని చూసిన డాక్టర్ చనిపోయి చాలాసేపయిందని చెప్పాడు కానీ కొంచెం ముందయితే బతికి ఉండేవాడేమో! ఎల్ కొలొరాడో ఖాలీ జీనుతో వచ్చి ఎవర్నీ నిద్రపోనీయకుండా ఒకటే కదం తొక్కుతూంటే తెలిసింది మాకు. డాన్ పేద్రో కంటే గుర్రమే ఎక్కువ బాధపడుతుందనిపిస్తుంది, నీకు తెలుసుగా అదీ అతనూ ఒకర్నొకరు ఎంత ప్రేమగా చూసుకునేవారో! అది తినదు, నిద్రపోదు. కల్లం తిరుగుతూ ఉంది. లోలోపల అంతా విరగ్గొట్టి, నమిలేసినట్టు దానికి అనిపిస్తుందేమో!’
“’వెళ్ళేప్పుడు మర్చిపోకుండా తలుపు వేయి.’
“మెదియా లూనా జీతగాడు వెళ్ళిపోయాడు.”
“చచ్చిపోయినవాడి మూలుగు ఎప్పుడయినా విన్నావా?” ఆమె నన్నడిగింది.
“లేదు, ఎదువిజస్.”
“అదృష్టవంతుడివి.”

మీ మాటలు

*