పర్షియన్ రాముడు, గ్రీకు హనుమంతుడు!

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)మనిషికీ, కాలానికీ మధ్య కనిపించని పెనుగులాట నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది కాబోలు…

మనిషి అనే చిన్నపిల్లవాడు ఇసుక గూళ్ళు కట్టుకుంటూ ఉంటాడు. అదిప్పుడు సైకతశిల్పాలనే ఒక కళారూపంగా కూడా ఎదిగి ఉండచ్చు, అది వేరే విషయం. ఇసుక గూడు కట్టినంతసేపూ స్థిరంగానూ, నిజంగానూ అనిపిస్తుంది. కానీ కాలం ఆ వెంటనే, లేదా మరునాడో దానిని కూల్చివేస్తుంది. అలాగే కాలగతిలో మనిషి తను ఉండే ప్రాంతానికీ, దేశానికీ సరిహద్దులూ, తనకు కొన్ని రకాల గుర్తింపులూ(identities) కల్పించుకుంటూ ఉంటాడు. కానీ కాలం వాటిని చెరిపివేస్తూ ఉంటుంది. కొత్త సరిహద్దులు, గుర్తింపులు ఏర్పడుతూ ఉంటాయి.

సారాంశం…కాలం దేనినీ స్థిరంగా ఉండనివ్వదు!

కాలం దేనినీ స్థిరంగా ఉండనివ్వదన్న సంగతిని గ్రహించడమే మనిషి పరిణతికి ఒక కొలమానం కావచ్చు. లేదా, ఎప్పటికప్పుడు కొత్త సరిహద్దులను, గుర్తింపులను కల్పించుకుంటూ సాగడమే మనిషి పరిణతికి నిజమైన కొలమానం అని కూడా ఎవరైనా భావిస్తూ ఉండచ్చు. వీటిలో ఏది కరెక్టు అన్న వివాదంలోకి దిగడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ మొదటిదే కరెక్టు అనుకుంటే పురాచరిత్రలోకి వెళ్ళడం ఆ పరిణతికి ఏ కొంచెమైనా దోహదపడుతుందా…?

నేను ఇంతకు ముందు ఒకసారి నా అనుభవాన్ని రాశాను. అది, ఒక టీవీ చానెల్ లో కొందరు కాశ్మీరీ యువతీ యువకులు రెండు పక్షాలుగా విడిపోయి ఒక చర్చలో పాల్గొన్న సందర్భం. మొదటినుంచీ ఆ కార్యక్రమాన్ని చూడకపోవడంతో ఎవరు ఏ పక్షమో వెంటనే తెలియలేదు. ఎందుకుంటే, వారి రూపురేఖలు, ఆహార్యమూ ఒక్కలానే ఉన్నాయి. క్రమంగా వారిలో ఒక పక్షంవారు ముస్లింలనీ, ఇంకో పక్షంవారు కాశ్మీరీ పండిట్లనీ తెలిసింది. ఆ క్షణంలో నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక జ్ఞానశకలమూ మెరుపులా నా మెదడును తాకింది. దాంతోపాటు అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే, కాశ్మీరీలను కాశ్మీరీలుగానే తప్ప ముస్లింలుగానో, పండిట్లుగానో గుర్తించకూడదని! ఎవరేమనుకున్నా నా నిర్ణయస్వేచ్ఛ నాది.

రెండు పక్షాలవారూ రక్తసంబంధీకులని వారి రూపురేఖలే చెబుతున్నాయి. చర్చ సందర్భంలో వాళ్ళలో కొందరు ఆ మాట అన్నారు కూడా. కానీ మధ్యలో వాళ్ళలో కొందరు మతపరమైన కొత్త గుర్తింపు తెచ్చుకున్నారు. మతపరమైన వేర్వేరు గుర్తింపులతో వారిద్దరి ప్రపంచాలూ వేరై పోయాయి. భౌగోళికంగానూ, మనుషుల పరంగానూ వారికి పరస్పర భిన్నమైన భావాలు, బంధాలు, విశ్వాసాలు ఏర్పడ్డాయి. అయితే, గుర్తింపులు వేరయ్యాయి కానీ, ఉనికి మారలేదు. ఫలితంగా… ఘర్షణ!

ఇంతకీ ఈ గుర్తింపుల ప్రస్తావన దేనికంటే…

బైబిల్ లో ఒక ప్రసిద్ధమైన కథ ఉంది. అది, డేవిడ్ అండ్ గోలియత్. డేవిడ్ ఒక యూదు. బలంలోనూ, ఆకారంలోనూ సామాన్యుడు. గోలియత్ ఒక ఫిలిస్తీన్. బలంలోనూ ఆకారంలోనూ అసామాన్యుడు. పన్నెండు అడుగులవాడు. ఇప్పుడు ఇజ్రాయిల్, పాలస్తీనా అని పిలుచుకునే ప్రాంతాలపై ఆధిపత్యం కోసం ఫిలిస్తీన్లు, యూదులు పోరాడారు. ఉభయ సైన్యాలూ ఎదురెదురుగా నిలిచాయి. ఫిలిస్తీన్ సైన్యంలో అతి భీకరంగా ఉన్న గోలియత్ ముందుకు వచ్చాడు. అతన్ని చూడగానే యూదులు బెదిరిపోయి వెనకడుగు వేశారు. ఇలా గోలియత్ ముందుకురావడం, యూదు సేనలు భయపడి తోకముడవడం నలభై రోజులు సాగింది. అప్పుడు యూదురాకుమారుడు డేవిడ్ ధైర్యం చేసి గోలియత్ తో తలపడడానికి ముందుకొచ్చాడు. గోలియత్ ది భుజబలం అయితే, డేవిడ్ ది బుద్ధిబలం. ఒడిసెల్లోంచి రాళ్ళు విసరడంలో అతను నిపుణుడు కూడా. డేవిడ్ ఒక గులకరాయిని ఒడిసెల్లో పెట్టి గోలియత్ కణతకు తగిలేలా విసిరాడు. అంతే, గోలియత్ మొదలు తెగిన చెట్టులా కూలిపోయాడు.

untitled

ఈ కథ వినగానే మనకు రామాయణంలో కుంభకర్ణుడు గుర్తుకొస్తాడు. అతనిది కూడా భీకరమైన ఆకారం. అతను యుద్ధరంగంలోకి అడుగుపెట్టగానే వానరులు భయంతో తలోవైపుకీ చెదిరిపోతారు. వారు కూడా అప్పుడు రాళ్ళతోనూ, చెట్లతోనూ యుద్ధం చేశారు. చివరికి రాముడు బాణప్రయోగంతో కుంభకర్ణుని చంపేశాడు.

రాంభట్ల వెర్షన్ (వేదభూమి)ప్రకారం, ఫిలిస్తీన్లు మొదట క్రీటు దీవిలో ఉండేవారు. ఆవిధంగా వారు ఏజియన్లు. భూకంపం, అగ్నిప్రమాదం, గ్రీకు దాడుల ఫలితంగా వారు అప్పట్లోనే నేటి ఇజ్రాయిల్-పాలస్తీనా ప్రాంతంలోకి వచ్చి స్థిరపడ్డారు. వారిని ‘పులిసేతు’ లనేవారు. అదే ఫిలిస్తీన్ అయింది. మన దగ్గర మ్లేచ్చులు, అప్రాచ్యులు అనే మాటల్లానే, ఫిలస్తీన్ కూడా తిట్టుపదంగా మారింది.

హెచ్. జి. వెల్స్ ప్రకారం కూడా ఫిలిస్తీన్లు ఆసియా మైనర్ కు పశ్చిమంగా ఉన్న ఏజియన్ ప్రాంతం నుంచి మధ్యధరా సముద్రపు ఆగ్నేయ తీరంలోకి వలస వచ్చి నగరాలు కట్టుకున్నారు. వీరి వలసకు కారణం, ఇంతకుముందు వ్యాసంలో చెప్పుకున్న మూడు ముఖ్యరకాలకు చెందిన సంచారజీవులలో ఒకరైన ఆటవిక నోర్డిక్ జాతివారు వచ్చి పడడం. ఇది క్రీ.పూ. 1200, లేదా ఒకింత ముందు జరిగింది. వీరితో పురాతన రేఖాపటం మీదికి కొత్త పేర్లు వచ్చాయి. వీరి చేతుల్లో ఇనప ఆయుధాలు ఉన్నాయి. వీరు గుర్రాలు పూన్చిన రథాలు వాడుతున్నారు. ఉత్తర సరిహద్దులలో వీరు ఏజియన్, సెమెటిక్ నాగరికతలకు ముప్పుగా మారారు. వీరే మీదులు, పర్షియన్లు, కిమ్మెరియన్లు, ఆర్మేనియన్లు, ఫ్రిజియన్లు, గ్రీకులు, తదితరులుగా చరిత్రకు పరిచయమయ్యారు. వేర్వేరు పేర్లతో ఉన్నా వీరంతా ఆర్యులు. ఒకే మూలభాషనుంచి చీలిపోయిన వేర్వేరు ఆర్యభాషలు మాట్లాడేవారు. వీరు ఒకవైపు పశువులను కాచుకుంటూ, ఇంకోవైపు నగరాల మీద దాడులకు, దోపిడీలకు పాల్పడేవారు. క్రమంగా మరింత బలపడి పశ్చిమాన ఉన్న నాగరికులైన ఏజియన్ల నగరాలను ఆక్రమించుకుని వారిని తరిమివేయడం ప్రారంభించారు. దాంతో ఏజియన్లు కొత్త ప్రదేశాలు వెతుక్కున్నారు. కొంతమంది నైలు నదీ డెల్టాలో స్థిరపడాలని చూశారు కానీ ఈజిప్షియన్లు వాళ్ళను తరిమేశారు. ఎట్రూస్కన్లు గా పరిచయమైన కొందరు ఆసియామైనర్ నుంచి జలమార్గంలో ఇటలీ మధ్యభాగంలోని అడవుల్లోకి వచ్చి స్థిరపడ్డారు. ఈ వలసల్లో భాగంగా మధ్యధరా ఆగ్నేయ తీరానికి వచ్చినవారే ఫిలిస్తీన్లు.

ఈ చారిత్రక సమాచారం విసుగు పుట్టించచ్చు కానీ, ఎంతో అవసరమయ్యే ఈ వివరాలను ఇక్కడ ఇవ్వాల్సివస్తోంది. ఎందుకంటే, పైన చెప్పుకున్న అనేక పేర్లతో భారత దేశపురాచరిత్రకు కూడా సంబంధముంది. ఈ పేర్లు భిన్న ఉచ్చారణతో మన పురాణ, ఇతిహాసాలకు కూడా ఎక్కాయి. దీని గురించి ముందు ముందు చెప్పుకోవలసి రావచ్చు.

ప్రస్తుతానికి వస్తే, రాంభట్ల ఉద్దేశంలో పులిసేతులు లేదా ఫిలిస్తీన్లు ఆర్యులే! అంటే, వారు ఏజియన్ ప్రాంతంలోకి ముందే వచ్చి స్థిరపడినవారై ఉండాలి. చరిత్రకాలంలో వాళ్ళు ఇస్లాంలోకి మారారు. వారే కాదు, పురాకాలంలో మధ్య ఆసియా, పశ్చిమాసియాలకు చెందిన ఆర్యతెగలు అనేకం ఇస్లాంలోకి మారాయి. ఫిలిస్తీన్ల విషయానికే వస్తే, ఆర్యులుగా వారు పాశ్చాత్యప్రపంచానికీ, కొంతవరకు మనకూ యూదుల కంటే ఎక్కువ దగ్గర కావాలి. కానీ ఇస్లాం మతస్తులుగా వారు పాశ్చాత్యప్రపంచానికి విరోధులయ్యారు. పాశ్చాత్య క్రైస్తవ ప్రపంచానికీ, ఇస్లామిక్ ప్రపంచానికీ క్రూసేడ్ల కాలంనుంచి, ఇప్పటివరకు జరుగుతున్న ఘర్షణలను ‘సంస్కృతుల మధ్య ఘర్షణ’ గా చెప్పుకుంటున్నాం. ప్రపంచ స్థాయిలో నేడు జరుగుతున్న అతి పెద్ద ఘర్షణ ఇదే కూడా.

అంతమాత్రాన పాశ్చాత్యప్రపంచానికి యూదులు నెత్తి మీది దేవుళ్లేమీ కారు. ‘ఆర్యత్వం’ ఒక ఉన్మాదంగా ప్రకోపించి హిట్లర్ యూదులపై సాగించిన ఊచకోత ఇటీవలి చరిత్రే. అయితే, ముస్లింలు అనే ‘పెద్ద శత్రువు’తో పోల్చితే యూదులు ‘చిన్న శత్రువు’ కనుకా; ‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అనే సూత్రరీత్యా పాశ్చాత్యులకు యూదులు ఇప్పుడు మిత్రవర్గం అయ్యారు.

మన విషయానికి వస్తే, ఇస్లాం ప్రపంచం వెలుపల ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న దేశం కావడంవల్ల; మొదటి నుంచీ జాతుల విముక్తి పోరాటాలను సమర్థించే విధానం వల్ల మన దేశం పాలస్తీనా పక్షం వహిస్తూ వచ్చింది. కానీ క్రమంగా దేశీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ తొంభై దశకం నుంచే యూదుల దేశమైన ఇజ్రాయెల్ కు దగ్గరవడం ప్రారంభించింది. కాంగ్రెస్ అనుసరిస్తూ వచ్చిన ముస్లిం అనుకూలతా, దేశీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చే వైఖరీ—రెండూ కలసివచ్చి, బీజేపీ మొదటినుంచీ ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపుతూ వచ్చింది. ఈ మధ్య పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్ పెద్దయెత్తున దాడులు జరిపి వందల సంఖ్యలో పౌరులను చంపడాన్ని ఖండిస్తూ తీర్మానం చేయాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు పట్టుబట్టడం; ఎన్డీయే ప్రభుత్వం అందుకు తిరస్కరించడం తెలిసినదే.

కాలగమనంలో పాత గుర్తింపులు పోయి కొత్త గుర్తింపులు ఎలా ఏర్పడుతూ ఉంటాయో; దాంతోపాటే మిత్రత్వశత్రుత్వాలు జాతిభేదాలను, ప్రాంత భేదాలను ఎలా అధిగమిస్తాయో చెప్పడానికే ఈ వివరణ. అదలా ఉంచితే, కాలం కల్పించిన అన్ని రకాల హద్దులను ముంచేస్తూ పురాచరిత్ర వర్తమానంలోకి ఎలా ప్రవహిస్తుందో గ్రహించడానికి చక్కని ఉదాహరణ—నేటికీ కొనసాగుతున్న పాలస్తీనా-ఇజ్రాయెల్ ఘర్షణ. అలాగే, అతిపురాతన కాలం నుంచి నేటివరకు నిరంతర ఘర్షణకేంద్రంగా కొనసాగుతూ కాలానికి సవాలుగా నిలిచిన ఏకైక ప్రాంతం, బహుశా పశ్చిమాసియా.

ఫొనీషియన్ల గురించి చెప్పుకుంటూ యూదుల దాకా వచ్చాం. ఫొనీషియన్లు, యూదుల మిత్రత్వంతోపాటు ప్రత్యేకంగా యూదుల గురించే చెప్పుకోవలసింది ఉంది. అందులోకి వెళ్ళే ముందు…

***

ఇంతకుముందు వ్యాసంలో సుమేరుకు చెందిన గిల్గమేశ ఇతిహాసం(Epic of Gilgamesh)లోని ఎంకిడు పాత్రతో మన రామాయణ, భారతాలలోని ఋష్యశృంగుడికి పోలిక ఉందని చెప్పాను. పైన చెప్పిన గోలియత్, కుంభకర్ణుని గుర్తు తెస్తాడన్నాను. ఈ సందర్భంలో రామాయణ సంబంధమైన మరికొన్ని పోలికలూ గొలుసుకట్టుగా గుర్తొస్తున్నాయి. విషయం పక్కదారి పట్టే మాట నిజమే కానీ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చెప్పుకునే అవకాశం రాదన్న శంకతో ఇప్పుడే చెప్పాలనిపిస్తోంది.

చరిత్రకు తెలిసినంతవరకు తొలి అతిపెద్ద సామ్రాజ్యం(క్రీ.పూ. 500 ప్రాంతం) పర్షియన్లది. పర్షియన్లు కూడా ఆర్యులేనని పైన చెప్పుకున్నాం. వారిది జొరాష్ట్రియన్ మతం. భారత్ సరిహద్దులవరకు విస్తరించిన పర్షియన్ సామ్రాజ్యంలో మధ్యాసియా, పశ్చిమాసియాలు కూడా అంతర్భాగాలు. అంతటి మహాసామ్రాజ్య పాలకుల మతం నేడు భారత్ లోని కొద్దిమంది పార్శీలకు మాత్రమే పరిమితమవడం కాలవైచిత్రులలో ఒకటి. ఆనాడు పర్షియన్ ఆధిపత్యాన్ని ఎదిరించి నిలబడింది చిన్నదేశమైన గ్రీస్ ఒక్కటే. పర్షియన్లలానే గ్రీకులు కూడా ఆర్యులే. పర్షియన్ చక్రవర్తి డరియస్ ‘ది గ్రేట్’ 1200 యుద్ధనౌకలతో పర్షియాను ఒక సముద్రశక్తిగా మార్చాడు. అందుకు ఫొనీషియన్ల సహకారం తీసుకున్నాడు. 300 నౌకలు ఫొనీషియన్లు సమకూర్చినవే.

అంతటి బలవత్తరుడైన డరియస్ కూడా గ్రీసును లొంగదీసుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. హెరడోటస్ అనే చరిత్రకారుడు రాసిన ఆ వివరాలు ఎంతో ఆసక్తిగొలిపేవే కానీ ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేం. డరియస్ కొడుకు క్జెరెక్సెస్ ఎట్టకేలకు గ్రీసును జయించగలిగాడు. కానీ అది తాత్కాలిక విజయమే అయింది. చివరికి గ్రీకులే పర్షియన్ సామ్రాజ్యానికి చరమ గీతం పాడారు. అప్పటినుంచే అలెగ్జాండర్ ‘ది గ్రేట్’ చరిత్రలోకి వచ్చాడు.

సృష్టిలో రెండు విరుద్ధశక్తులు ఆధిపత్యం కోసం సంఘర్షిస్తూ ఉంటాయనీ, వాటిలో ఎటువైపు ఉండాలో మనుషులు నిర్ణయించుకోవాలనీ జొరాష్ట్రియన్ మతం చెబుతుంది. మొదటిది, మంచితోనూ, వెలుగుతోనూ నిండినదైతే; రెండోది, చెడుతోనూ, చీకటితోనూ నిండినది. అలాగే, ప్రతి కర్మకూ ఫలితం తప్పదన్న కర్మసిద్ధాంతాన్ని కూడా ఈ మతం చెబుతుంది. పర్షియన్లు మిత్రుని, అంటే సూర్యుని ఆరాధించేవారు. సూర్యుడు వెలుగుకు ప్రతీక.

రామాయణానికి వస్తే, రాముడు సూర్యవంశ క్షత్రియుడు.

పర్షియన్ల గురించి H.A. Davies అనే చరిత్రకారుడు (AN OUTLINE HISTORY OF THE WORLD) ఇంకా ఇలా అంటాడు: The Persians were, in many ways, a highly civilized people, and they had many admirable qualities, of which perhaps the most striking were their love of truth, their belief that it was disgraceful to fall into debt, and their courage.

రామాయణంలో, మొదటి సర్గ లోని రెండవ శ్లోకం (కో న్వస్మిన్ సాంప్రతం లొకే గుణవాన్ కశ్చ వీర్యవాన్/ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః) ప్రకారం రాముడు గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్కు, దృఢవ్రతుడు. గమనించండి…సూర్య సంబంధంతోపాటు; గుణగణాలలోనూ రాముడికీ, పర్షియన్లకూ మధ్య పోలికలు అచ్చుగుద్దినట్టు ఎలా ఉన్నాయో! ఇవి యాదృచ్ఛికం అనుకుంటారేమో, కాదు. పర్షియన్లకు, రామునికే కాక; రాజ్యస్థాపకులైన సారగాన్, హమ్మురాబీలకు కూడా ఇవే గుణగణాలనూ, సూర్యసంబంధాన్ని ఆపాదించారు. ప్రస్తుతం ఇందులోకి లోతుగా వెళ్లలేం.

untitled

ఇంతకంటే స్పష్టమైన ఇంకో పోలిక చూద్దాం. రాముడు రావణ సంహారం కోసం వానరసైన్యంతో కలసి లంకకు బయలుదేరితే, క్జెరెక్సెస్ గ్రీకుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు. ఇద్దరికీ సముద్రం అడ్డు వచ్చింది. సముద్రంలో వారధి నిర్మించి లంకకు వెళ్లాలని రాముడు అనుకున్నాడు. వారధి నిర్మాణానికి సహకరించమని కోరుతూ మూడురోజుల పాటు సముద్రుని ప్రార్థించాడు. ఆ మూడు రోజులూ దర్భలు పరచుకుని సముద్రతీరంలోనే పడుకున్నాడు. అయినా సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. అప్పుడు రాముడికి ఆగ్రహం కలిగింది. భయంకరులైన దానవులతో నిండిన ఈ సముద్రాన్ని అల్లకల్లోలం చేసేస్తాను అంటూ విల్లు అందుకుని ధనుష్టంకారం చేసి సముద్రునికి గురిపెట్టి బాణాలు ప్రయోగించాడు. అయినా సముద్రుడు లొంగలేదు. దాంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించదానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై వారధి నిర్మాణానికి దారి ఇచ్చాడు.

ఇక హెరడోటస్ నమోదు చేసిన చరిత్ర ప్రకారం, క్జెరెక్సెస్ గ్రీకుల మీదికి యుద్ధానికి వెడుతూ సముద్రానికి అడ్డంగా వారధి నిర్మింపజేశాడు. దానికి మద్దతుగా కొన్ని నౌకలను ఉంచారు. అంతలో పెద్ద తుపాను సంభవించి ఆ నౌకలను చెదరగొట్టేసింది. దాంతో క్జెరెక్సెస్ కు సముద్రం మీద కోపమొచ్చింది. పర్షియన్ చక్రవర్తినైన తనను ఇలా అవమానించడానికి సముద్రానికి ఎంత ధైర్యం అనుకున్నాడు. సముద్రుని బంధించినట్టుగా కొన్ని సంకెళ్ళను సముద్రంలోకి వేయించి, దానికి మూడు వందల కొరడా దెబ్బలు తినిపించవలసిందిగా ఆదేశించాడు.

పర్షియన్లకు, గ్రీకులకు జరిగిన యుద్ధాల చరిత్రలో మన హనుమంతుడి లాంటి పాత్ర కూడా ఒకటి ఉంది. అతని పేరు, ఫిలిప్పైడ్స్. గ్రీసు దేశస్థుడు. మారథాన్ అనే చోట పర్షియన్లకు, గ్రీకులకు జరిగిన తొలి యుద్ధంలో అతనొక ముఖ్యపాత్ర పోషించాడు. ఒలింపిక్స్ తో పరిచయమున్నవారికి మారథాన్ అనే పేరు పరిచితమే. పరుగుపోటీకి అది పర్యాయపదమైంది. హనుమంతుడికి మారుతి అనే పేరు ఉంది. అత్యంత వేగంగా ప్రయాణించగలవాడిగా హనుమంతుడు ప్రసిద్ధుడు. అతడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడు. సీతను చూసిన తర్వాత రావణుని కూడా చూసి, రాముని సందేశం అందించాడు.

ఇప్పుడు ఫిలిప్పైడ్స్ ఏం చేశాడో చూద్దాం. గ్రీసులో స్పార్టా, ఏథెన్స్ అనే రెండు ప్రాంతాలు ఉన్నాయి. స్పార్టాన్లు భూయుద్ధంలో నిపుణులు. ఏథేనియన్లు నౌకాయుద్ధంలో నిపుణులు. పర్షియన్ల దాడి గురించిన భోగట్టా అందడంతో సాయం కోరుతూ స్పార్టాన్లకు ఏథేనియన్లు కబురు పంపించారు. సమయం తక్కువగా ఉండడంతో అత్యంత వేగంగా వెళ్లగలిగినవాడు కావాలి. ఎక్కువ దూరం పరుగెత్తడంలో శిక్షణ పొందిన ఫిలిప్పైడ్స్ ను అందుకు నియోగించారు. అతను ఏథెన్స్ లో బయలుదేరాడు. స్పార్టా అక్కడికి 150 మైళ్ళ దూరం. పైగా దారి అంతా కొండలు, గుట్టలు, సెలయేళ్ల మయం. ఫిలిప్పైడ్స్ మరునాటికల్లా స్పార్టా చేరుకుని కబురు అందించాడు. సాయం అందించడానికి సిద్ధమే కానీ, పౌర్ణమి తర్వాత, అంటే ఆరురోజులకు కానీ తాము బయలుదేరలేమని వారు చెప్పారు. ఆ సమాచారం అందుకుని ఫిలిప్పైడ్స్ అంతే వేగంగా తిరుగు ప్రయాణం సాగించి ఏథెన్స్ చేరుకున్నాడు. దారిలో పార్థెనియాస్ అనే కొండ దగ్గర పాన్ అనే దేవుడు అతనికి కనిపించి మీకు విజయం కలుగుతుందని చెప్పాడట. ఆ తర్వాత ఫిలిప్పైడ్స్ మారథాన్ చేరుకుని యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. ఆ యుద్ధంలో ఏథేనియన్లు గెలిచారు. స్పార్టాన్లు ఆరు రోజుల తర్వాత బయలుదేరి వచ్చేసరికే యుద్ధం అయిపోయింది.

గెలుపు వార్తను కూడా ఫిలిప్పైడ్సే ఏథెన్స్ కు పరుగు పరుగున మోసుకెళ్ళాడు. ఏథెన్స్ చేరుతూనే తీవ్ర ఉద్వేగానికి లోనై చేతిలోని డాలు విసిరేసి, “మనం గెలిచాం” అంటూ ఆనందంతో ఒక్క గావుకేక పెట్టి, అప్పటికప్పుడు గుండె ఆగి కుప్పకూలి పోయాడు.

 

 

 

 

మీ మాటలు

 1. Needless to say that this article too is wonderful. Somehow, it reminded me the War epic movie Troy!
  W/Regards – Saikiran

 2. Bhaskaram గారు,

  మీరు రాసే వ్యాసాలు చాల ఆసక్తి గ వున్నాయి . రాముడికీ, పర్షియన్లకూ మధ్య పోలికలు చెప్పారు కదా , నది ఒక చిన్న సందేహం , రాముడి చాయ నలుపు. పార్శి లు తెల్లగా వుంటారు కదా ఒకటే జాతికి చెందినా వాళ్ళు శారీరకంగా ఒకలాగే వుండాలి కదా.

 3. kalluri bhaskaram says:

  శ్రీదేవి గారూ… మీరు అలా అర్థం చేసున్నారా? రాముడు, పార్శీలు ఒకే జాతికి చెందినవారని చెప్పడం నా ఉద్దేశం కాదండీ. అంత పురాతన కాలంలోనే కొన్ని కథలు, లేదా కథల్లోని కొన్ని ఘట్టాల మధ్య ఆసక్తికరమైన పోలికలను సూచించడమే నా ఉద్దేశం.

 4. Epic of Gilgamesh కి భారత ఇతిహాసాలకి చాలా పోలికలున్నాయి. నోవా కధలో చెప్పే జలప్రళయం దాదాపు అన్ని సంస్కృతులలో కనపడుతుంది కొన్ని చిన్న చిన్న తేడాలతో. అలాగే అడవికి వెళ్ళిన పెద్ద కొడుకు గురించి కూడా చాలా కధల్లో ఉంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది, రామాయణం లాంటి సంఘటన జరిగి ఉండవచ్చని, అదే కాలక్రమంలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా రూపొందినదని. తరతరాలుగా చెప్పబడుతూ ఉండటంవల్ల అనేక సాంస్కృతిక మార్పులకి లోనై ప్రస్తుతం ఉన్న రూపాలలోకి వచ్చిందేమో అని.

 5. Giridhar reddy says:

  సర్, మీ రచనా శైలి అద్భుతం…. మీచరిత్ర పై knowledge తిరుగు లేనిది.
  మీ తో స్వయంగా సంభాషించాలని ఉవ్విళ్లూరుతున్నాను.
  దయచేసి మీ no. ఇవ్వండి
  -గిరిధర్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్, మహబూబ్నగర్

మీ మాటలు

*