మగకాలువ

katta pic

 

 

 

 

 

నారాయణ.. నారాయణ బ్రహ్మలోకం లో తల్లిదండ్రులకు నమస్కరించాడు నారదుడు
అప్పుడు కూడా తాతగారి పేరును ఉచ్చరించడం మర్చిపోనేలేదు.
కుశల ప్రశ్నలయ్యాక భూలోకం ఎలాగుందని అడిగారు బ్రహ్మ, సరస్వతులు.
వాళ్ళకు తెలియక కాదు కానీ. కొడుకుతో ముచ్చటించడంలో వున్న సంతోషం కోరుకుంటున్నారో లేక నిజంగానే లోతైన కారణంవుందో.

‘‘ అది తప్పకుండా చెపుతాను అమ్మా నాన్నలూ ముందుగా నాదో సందేహం తీర్చండి. మీరు నిరంతరం జీవులను తయారు చేసే పనిలోవున్నారు కదా? అసలు జీవికీ నిర్జీవికీ ముఖ్యంమైన తేడా ఏమిటి? లోకం లో సంచరించేటప్పుడు నాకు చాలా సార్లు ఈ సందేహం కలిగింది. నిర్జీవ పదార్ధాలకు మీరు ఏ ముఖ్యమైన లక్షణాన్ని చేర్చడం ద్వారా వాటిని మీరు జీవులుగా మార్చుతున్నారు.’’ మరోసారి మోకరిల్లుతూ అడిగాడు.
‘‘దేవ రహస్యమే అడిగావు నారదా. కానీ నీవడిగాక చెప్పక తప్పుతుందా? అయినా త్రిలోక సంచారివి నీకు తెలియనిదా? నీవేమనుకుంటున్నావో ముందొక మాటచెప్పు’’ నాలుగు ముఖాల్లో ఒక ముఖం మాత్రం నారదుడివైపు ప్రశ్నిస్తే, మరో ముఖం దేవివారివైపు సాలోచనగా చిద్విలాసంగా నవ్వటం నారదుడి కళ్ళలోంచి తప్పుకోలేదు. అయినా ఈ ప్రతిభోధనా పద్దతి  గురించి ఎరిగిన వాడే కావడంతో తనకు తెలిసింది చెప్పటం ప్రారంభించాడు నారదుడు. ‘‘బహుశా చలనాన్ని కలిగివున్నాయా లేదా అనేదాని ఆధారంగానే స్థావర, జంగమాలంటున్నాం కాబట్టి దీన్నే ప్రధాన వ్యత్యాససూత్రంగా తీసుకోవచ్చనుకుంటాను’’ కొంచెం అనుమానంగానే నసిగాడు నారదుడు.
‘‘కాదు’’ అనుకున్నంతా అయ్యింది తప్పనేసాడు బ్రహ్మ తన వివరణతో పాటుగా ‘‘ గ్రహగతులూ, సాగరకెరటాలూ చలనాన్ని కలిగే వుంటాయి అయినా అవి నిర్జీవుల జాబితాలోనే వున్నాయి కదా అలాగే వృక్షాలు స్థానచలనం లేకున్నప్పటికీ అవి జీవులే… మరింకేమైనా ఆలోచించగలవేమో చూడు నారదా?..’ రొట్టె ఇవ్వడం కాదు తయారుచేసుకోవడం నేర్పాలన్న సూత్రంలాగా నారదుడికి విషయాన్ని భోధించే పనిలో పడ్డాడు బ్రహ్మ. ‘‘సరే మరోక్క ప్రయత్నం మాత్రం చేస్తాను. ఈసారి దోషముంటే, సమాధానం మీరే చెప్పాలి మరి’’ నారదుడు ముగింపు ముహూర్తాన్ని కూడా సిద్దంచేస్తూ చెప్పాడు. ‘‘ ఆహారాన్ని తీసుకోవడం అంటే జీర్ణక్రియ, గాలిని పీల్చుకోవడం అంటే శ్వాసక్రియ అయ్యింటాయి అంతేనంటారా? ’’ ఈ సారి కొంచెం పెరిగిన ధైర్యంతో కలగలిసిన సమాధానం వచ్చింది. ‘‘ సరే కొంత మేరకు ఇది సమంజసమే కానీ ఇవే ప్రధాన మూల వ్యత్యాసాలు మాత్రం కాదు కుమారా. ఎందుకంటే ఒక పదార్ధాన్ని లోపలికి తీసుకుని కావలసినంత మేరకు మాత్రమే ఉపయోగించుకుని మిగిలినది వదిలేసే పనిని చాలా ఫ్యాక్టరీలూ, యంత్రాలూ కూడా చేస్తున్నాయి అయినా అవి జీవుల కోవలోకి రావు.అలాగే కొన్ని జీవులు అవాయు శ్యాసక్రియ ప్రక్రియలో మనుగడ సాగిస్తుంటాయి అంటే వాటికి గాలిపీల్చుకోవలసిన అవసరమే లేదు. అదే విధంగా మొక్కల్లో గాలి పీల్చుకునే పద్దతికీ, జంతువుల్లో గాలి పీల్చుకునే పద్దతికీ మధ్య చాలాచాలా తేడా వుంది’’ అంటూ తప్పుని ఎత్తి చూపినట్లుగా కాక విషయాన్ని విశదం చేస్తూ తప్పొప్పుల అవగాహన కలిగిస్తున్నాడు బ్రహ్మ.

Kadha-Saranga-2-300x268
‘‘ ఇంతకీ ఈ విషయానికి ఇన్ని బైట్ల సమయం కేటాయించడానికి కారణం తెలుసా? ఈరోజు జరగబోయే మన సంభాషణంతా ఈ కేంద్రంగానే విస్తరిస్తుంది నారదా. ఇది తెలిస్తేనే అది బాగా అర్ధం అవుతుంది.మొత్తానికి జీవినీ నిర్జీవినీ వేరుచేస్తున్న ప్రధాన కారకం ‘‘ ప్రత్యుత్పత్తి’’.
‘‘ప్రత్యుత్పత్తి మాత్రమేనా’’ నారదుడు బృకుటి ముడిచాడు.
‘‘ అవును నేను చేసే పనే ‘సృష్టించటం’, అదే పనిని నా తర్వాత అచ్చంగా నాలా కొనసాగించే గుణం వున్నవే జీవులు, అంతేకాదు తనలాంటి జీవిని తనంటిది సృష్టించలేదు అందుకోసమే పెరుగుదల దానికోసం ఆహారసేకరణ, సంతానపాలన, రక్షణకోసం సామాజికీకరణ ఇవ్వన్నీ ఏర్పడ్డాయి.’’ ముడి విప్పుతున్నాడో, మరేదైనా ముడివేయటం కోసం అవసరమైన సామగ్రిగా ఇస్తున్నాడో అర్ధంకాలేదు నారదుడికి అయినా అసలైన తేడా ఇదేనని తెలిసేసరికి కొంచెం మనసు తేలిక పడింది. మరికొంత పరిశీలించుకుంటూ పోతే కానీ ఆ సమాధానం మనసుకి సరిగా జీర్ణం కాదు.

‘‘ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నారదా, భూలోక విశేషాలను ఏవో చేత.పట్టుకొచ్చినట్లున్నావు కదా అవేమిటో చెప్పు దీనిపై మరింత విపులంగా అవసరం మేరకు తర్వాత మాట్లాడుకుందాం’’ సంభాషణను కొనసాగించమన్నట్లు నారదుడి వైపు చూసాడు బ్రహ్మ.
అవును తండ్రిగారూ భూలోకంలో మీరు తయారు చేసిన జీవరాశి ఎలా వున్నారో, అమ్మదయతో చదువులనూ సాహిత్యాన్నీ అవపోసన పడుతున్నవారు ఎలా వున్నారు అనే రెండు విషయాలనూ కలిపి చెప్పేందుకు చిన్న ప్రయత్నం చేస్తాను. భూలోక సాహిత్య ఢింభకుడొకడు అక్కడి ప్రధాన సమస్యపైనా, మీరిచ్చిన శక్తులను వారెట్లా దుర్వినియోగం చేస్తున్నారన్న దానిపైనా ఒక కథలా రాసాడు. దానిని మీరే స్వయంగా చదువుకుంటే అటు విషయం చెప్పినవాడినీ అవుతాను. దానిపై భూలోక వాసుల అభిప్రాయాన్ని చూపిన వాడినీ అవుతాను. అవధరించండి అంటూ తనచేతిలోని అచ్చుకాగితాలను అమ్మ చేతిలో పెట్టాడు నారదుడు.
కొద్దిగా ఒక తలను అందులోకి వంచి తను కూడా ఆ కథను చదవటం ప్రారంభించాడు బ్రహ్మ.
*****
భారత వంశపు జనసభ
అందంగా వుండి నిండుగా కొలువు తీరివుంది. కానీ అక్కడ రాజుతో సహా ప్రధాన సలహాదారులంతా విషణ్నవదలైవున్నారు. అయితే ఆ ఆందోళనకు కారణం యుద్ధప్రమాదమో, అంతర్గత తిరుగుబాట్ల అలజడో కాదు ఆర్ధికలేమో ఎంతమాత్రమూ కాదు చాలా చిన్నగా కనిపిస్తున్నప్పటికీ పైన చెప్పుకున్న వాటికంటే చాలా రెట్లు ప్రమాదకరమైన అంశం మీద ఆందోళన పడుతున్నారు వారంతా.
‘‘ మహామంత్రీ ఈ మధ్యకాలంలో మరింకేవైనా అంటువంటి ఉన్మాద కృత్యాలు సంభవించాయా?’’ విచారిస్తున్నారు ఈ మధ్యనే ప్రజాస్వామిక పద్దతిలో ఎంపికకాబడ్డ రాజు నరేంద్రజోడీ.
‘‘ లేకేం మహారాజా మరింతగా పెచ్చరిల్లుతున్నాయి కూడా, మహిళల చర్మం కళ్ళబడినా, వారి వంటినుండివచ్చే గజ్జెలు, గాజుల వంటి శబ్దం వినబడినా కృరమైన తోడేళ్ళుగా దేశపు మగవారు మారపోయే మహమ్మారి గుణం అలాగే వుంది. హటాత్తుగా కోరలు పెరిగిపోవటం, కళ్ళు ఎరుపెక్కిపోవడం, ఒక మృగంలా చుట్టూ ఏముందో అనే విషయాన్ని సైతం గమనించకుండా ఆమెను ఆక్రమించేందుకో ఆతర్వాత హత్యచేసేందుకో తెగబడుతున్నారు వీళ్ళు, రాజధానుల్లోనే కాదు మారుమూల పల్లెల్లోనూ ఈ తీవ్రపరిణామాలు చోటుచేసుకున్నాయి మహారాజా’’ ఏకబిగిన వాస్తవ పరిస్థితులను ముందుపరిచాడు మంత్రివర్యుడు.
‘‘ అలాగయితే వెంటనే రక్షకభటుల గస్తీ పెంచండి. మంచి ఆయుధాలూ, అత్యాధునిక వాహనాలూ, మంచి రంగుల్లో సైనికదుస్తులూ, సరికొత్త చిహ్నం కూడా ఏర్పాటు చేయండి’’ ఇంకా కదలరేం అన్నట్లు చూసాడు మంత్రివైపు మహారాజు నరేంద్రజోడీ.
‘‘క్షమించాలి మహారాజా, ఇలా తోడేళ్ళుగా మారుతున్న వారిలో రక్షకభటులుకూడా కొందరున్నారు.’’ లోగొంతుతో చెప్పినా ధృడంగా విషయాన్ని చేరేసాడు మంత్రి. ‘‘

అప్పటివరకూ నిలబడి ఆవేశంతో మాట్లాడుతున్న రాజు నరేంద్రజోడీ ఒక్కసారిగా కుంచించుకుని కాళ్ళలో సత్తువ లేనట్లు సింహాసనంమీద కూలబడిపోయాడు. కనిపించని ఈ శత్రువుని ఎలా ఎదుర్కోవాలో తెలీక నిండుసభ మొత్తం ముఖాలను క్రిందకి దింపుకుని చూస్తున్నారు.
కొంతసేపటికి గొంతుపెగల్చుకుంటూ సాలోచనగా నరేంద్రజోడీనే అన్నాడు ‘‘ పోనీ చట్టపు రక్షణకంటే భద్రమైన కుటుంబ రక్షణకు ప్రాధాన్యత పెంచుదాం. ఎవరికుటుంబంలోని వారే వారివారి ఆడపిల్లలకు రక్షణకల్పించే పద్దతులను గురించి మరింత ప్రచారం చేద్దాం. ’’ తేలికగా ఊపిరి పీల్చుకుంటూ మంచి పరిష్కారమే తాత్కాలికంగా దొరికిందన్నట్లు చెప్పాడు మహారాజు.
‘‘ మరోసారి మన్నించాలి మహారాజా మనుసు ధృఢం చేసుకోండి. నిజాలను చెప్పక తప్పటంలేదు. అసలు చిక్కేమిటంటే ఇలా తోడేళ్ళుగా మారిపోతున్నవారిలో స్వంత కుటుంబం వారుకూడా వున్నారు. తాతలు, మామలు, అంకుళ్ళు ఆ..ఖ..రి..కి.. తండ్రులు సైతం ఈ పిశాచం భారిన పడుతున్నారు, ’’ మంత్రి ఆచితూచి తన మాటల్ని మహారాజుకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాడు.
రాజుకు ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మినట్లు, తలంతా బరువెక్కినట్లూ అయిపోయింది. మొత్తం రాజమహల్ తల్లక్రిందులుగా మారిపోయినట్లూ అనిపిస్తోంది. మంత్రిమాటలకు రెండుచేతులూ చెవులపై ఉంచుకుంటూ ‘‘ అమంగళం ప్రతిహతమగుగాక’’ అంటున్నాననుకుంటూనే ఆసనం మీదనుంచీ జారిపడుతూ మూర్చిల్లాడు మహారాజు.
* * *
కళ్ళింతగా చేస్తూ కథను చదువుతున్న బ్రహ్మ తను సృష్టించిన మానవజన్మలో ఇటువంటి వింతలక్షణాలు ఎందుకు కనిపిస్తున్నాయబ్బా అన్నట్లు ఆశ్చర్య పోతూ మిగిలిన తనపనిని కొద్దిసేపు ఆపి సరస్వతిదేవి చేతుల్లోని ఆ కథా కాగితాలవైపే కన్నార్పకుండా చూస్తున్నాడు.
* * *
వైద్యులూ, అంత: పురవాసమూ రాజుగారి మెలకువకోసం ఆయన ముఖంలోకే చూస్తున్నారు.
కొద్దిగా మెలకువతో రాజు అటూ ఇటూ మెసలగానే చుట్టూవున్న వారిలో చిన్న కలకలం. కళ్ళు తెరవగానే మళ్ళీ అదే ప్రశ్నతో మహామంత్రివైపు తిరిగాడు జోడీ. ‘‘ అసలు అటువంటి వారి అంగాంగాలనూ ఛేదించండి, నడిబజార్లో దారుణంగా కొట్టి చంపేయండి, మిగిలిన వారికి బుద్దొస్తుంది’’ మాటల్లో ఆవేశం కనబడక పోయినా ఆలోచనలో మాత్రం మరుగుతున్న కోపానిని మంత్రి గమనించాడు. ‘‘విషయం అదికాదు మహారాజా ఈ మృగాల భారినుంచి మహిళలను రక్షించడం కోసమే ఆలోచిస్తున్నాం కానీ. కొందరు మృగాలుగా మారకుండా చూడాల్సిన భాద్యతా మనదీ సమాజానిదే. వారిని శతృవులుగా రాక్షసులుగా కాక దుష్టులుగా కాక వ్యాధిగ్రస్తులుగా చూడాలి మనం. వారిని ఆ ఊబినుంచి బయటకు తీసేందుకు కనీసం కొత్త వారు అలా మారకుండా ఏం చేయాలి అనేవి ఆలోచించాలి.’’ మంత్రి ఒక్కో చిక్కుముడి విప్పుతున్నట్లు విపులంగా మాట్లాడుతున్నాడు.
‘‘ఇలాగే జరిగితూ వెళితే మన ప్రభుత్వపు పరువు, విధేశాలతో సంభందాలూ ఏమైపోవాలి. ముఖ్యంగా ప్రతిపక్ష వైరివర్గం మనల్ని ఎండగట్టవా? దానికేంచేద్దాం చెప్పండి మహామంత్రీ’’
‘‘ మీరన్న సంక్షోభం మాట నిజమే కానీ వైరి వర్గానికి అంత దృశ్యం లేదు మహారాజా, వాళ్ళలోనూ చాలామంది మంత్రులు ఈ తీవ్రతకు నలిగిపోయినవారే, మొన్నటి వరకూ అధికారంలో వున్న మదనమోహనుడిని ఈ సమస్య ఇబ్బంది పెట్టలేదు కానీ, యువరాజు రాహుల్దేవుడిపై ఈ ప్రభావం వుంది. చాలాసార్లు దగ్గరదాకా వచ్చి తృటిలో తప్పిపోయిందని వేగుల సమాచారం. మీరు వారిని తలచుకొని ఆందోళనచెందాల్సిన పనిలేదు.’’
‘‘ఇకపోతే రెండవ విషయం ఇది ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు వైధ్యులూ, నేరపరిశోదకులూ, శాస్త్రవేత్తలతో కూడిన ఒక ‘‘నిర్భయ’’ పేరుతో నిపుణుల బృందాన్ని మొన్న మీరు స్పృహకోల్పోయిన రోజే నియమించాం మహారాజా. బహుశా వారి పరిశీలనాత్మక నివేదిక కారణాలను కనుగొని కర్తవ్యాలను సూచిస్తుందనుకుంటున్నాము. అప్పటివరకూ మీరు కొంత విశ్రాంతి తీసుకోండి మహారాజా. ’’ అంటూ వెళ్ళేందుకు అనుమతి కోరుతున్నట్లు కొంచెం వంగి నమస్కరించి బయల్దేరాడు మంత్రి.
మొన్నటినుండి స్పృహలో లేనా? స్వగతంలో అనుకున్నట్లు పైకే అనేశాడు.
పర్వాలేదు రాజా పరిపాలనలో వున్నా నిద్రలోనే వుండే చాలామంది కంటే మీరు మెరుగే అందామనుకున్నాడు మంత్రి కానీ అనకుండానే బయటికెళ్ళాడు.

katta illus
* * *
‘‘నిర్భయ’’ బృందం సమస్య మూలాలను శోధించేందుకు తీవ్రపరిశ్రమ చేస్తోంది. ఇప్పటివరకూ తోడేళ్ళుగా మారిన వారు. వారు నేరం జరిపిన ప్రాంతం. మొదలైన వివరాలను స్పష్టంగా తెలిసేలా వేరు వేరు రంగు ఇంకులతో దేశపటంలో గుర్తిస్తున్నారు, నేరం చేసినవారి నివాసాలను మరోరంగు ఇంకు తోనూ చిత్రం గీస్తూ సంభంధిత వివరాలను అంశాల వారీగా నమోదు చేస్తూ ముందుకు వెళుతున్నారు. చిన్న తీగయినా దొరకకపోతుందా అన్న ఆశ వారి పనిలో శ్రమతెలియనివ్వడం లేదు.
దేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ మరకల్లా ఏర్పడిన నేరపు చుక్కల్ని చూస్తూ ఆలోచిస్తున్న బృందానికి నిస్సత్తువ వస్తోంది. ఆ చుక్కలు శాపగ్రస్తుడైన ఇంద్రుడి వంటిపై వేయి కళ్ళలాగా, ఒక్కో నేరప్రాంతం మరిన్ని నేరాల పిలకలతో రావణుడి తలల్ని మరిపించేలా పదింతలై విచ్చుకుని కీచకగుండాలై నవ్వుతున్నాయి.
వాళ్ళకి పాపం చాలా రోజుల నుంచి సరైన ఆహారం, నిద్రకూడా లేదు. ఈ నేర కారణం దుష్టశక్తి కాకపోవచ్చనీ ఆహారపదార్ధాలో, క్రిమికీటకాలో కలిగించే వ్యాధికూడా కావచ్చనేది వారి ప్రాధమిక అంచనా. అందుకే పరిశీలించిన ఆహారాన్నే తింటున్నారు, ప్రత్యేకమైన దుస్తులను ధరించి జాగ్రత్తగా పరిశీలనలు కొనసాగిస్తున్నారు. కానీ ఆధారాలు దొరకటం లేదన్న అసహనం వల్లనే మరింతగా అశక్తులైపోతున్నారు.
దేశానికి సంభందించిన ఈ అరిష్టాన్ని అరికట్టేందుకు తమవంతు కృషి చేయలేక పోవడంతో తమ ముఖాలను మహారాజుకో ప్రజలకో చూపించే ధైర్యంలేక తమ పాత్రలని ‘మరపు’ నదిలోకి తోసేసుకుని ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్న సమయంలో కనిపించాడతను. పేరుకూడా చెప్పలేదు పరిష్కారాన్ని మాత్రం లీలగా చూపించేశాడు.

పటాన్ని తెరవమని చెప్పి తన వేలితో ఒక గీతలాగా గీసుకుంటూ వచ్చాడు దేశం ఆ కొసనుంచి ఈ కొస వరకూ.
‘‘ ఏమిటి స్వామీ ఇది?’’ నిర్భయ బృందం నాయకుడు అర్ధంకాక సందేశాన్ని వెలిబుచ్చాడు.
‘‘ ఇదే మీ సమస్యకు కారణం అయిన నది……’’
‘‘నదా??’’
‘‘ అవును నదే…. చూడండి అన్ని సంఘటనలూ ఈ నది చుట్టుపక్కలే జరిగాయి. నిజానికి ఈ నదినీటిని తాగిన కొంత సేపటికే వాళ్ళు మృగాలుగా మారారు ‘ప్రతిసారీ’. ఇది కళ్ళకు మాత్రమే కనిపించే నదికాదు. అలాగని చరిత్రకు ముందే అంతర్ధానం అయిన సరస్వతీ నది లాంటిదికూడా కాదు. ఇప్పుడు ఈ కాలంలోకూడా ప్రవహిస్తూనే వుంది అప్పుడెప్పుడో ఎక్కడో పుట్టింది. ఇది కాలం నుంచి కాలంలోకి ప్రవహించే నది. మధ్యలో మనుషులగుండా వేగాన్ని మార్చుకుంటుంటుంది. ఒక్క సారి స్థిమితులై శ్రద్ధగా చూడండి’’ మార్ధవత పోకుండానే కఠినమైన ఆజ్ఞలా చెప్పాడతను.
వాళ్ళకప్పుడే మంచుపొరలు తొలగుతున్నట్లు కొత్తగా అదేపటంపై ఒక నదిలాంటి రూపం కనిపిస్తోంది. పటం మీదనే కాదు ఎక్కడినుంచో వస్తూ తమచూట్టూ ఆక్రమించినట్లు మొత్తంగా కనిపిస్తున్న ఏదో ఆకారం వుంది.
‘‘ దీన్ని గురించి మరికొంచెం చెప్పండి స్వామీ. నివారణోపాయాలు తెలిసే లాగా’’ అడగాల్సిన ప్రశ్నవేశాడు నిర్భయబృంద ప్రధానసభ్యుడొకరు.
‘‘ మాతృస్వామ్య వ్యవస్థ కాలంలో ఈ ప్రవాహం సన్నగా ఉండిలేనట్లుగా, ఉనికే లేనట్లుగా ప్రవహించేది. అప్పట్లో దీనిపేరు ‘మూగ కాలువ’, ఆ తర్వాత పురుషులకి క్రమంగా కుటుంబమూ, సమాజమూ హస్తగతమవుతున్న రోజుల్లో దీని ఉధృతి పెరిగింది అప్పడిది ‘మగకాలువ’ . మగకాలువగా పిలిపించుకునే కాలానికే ఈ నీటికి ప్రాధమిక రోగలక్షణాలు వచ్చాయి. కొంచెం త్రాగగానే పెత్తందారీతనపు ఘాటు నషాళానికి అంటుతుండేది, కానీ దాన్ని వారు రోగలక్షణంగా భావించక సమాజం లెక్కచేయకపోవడం వల్ల వ్యాధి మరింత ముదిరింది. ఇప్పుడు ఏకంగా మనుషులపై దాడిచేసేలా, మనుషుల రక్తమాంసాలనూ వ్యాపారపు, ఆనందపు సరుకుగా చూసేలా చేస్తోంది ఈ మురికి పట్టిన ప్రవాహం. ఇక ఇప్పుడు దీనిపేరు ‘‘మృగకాలువ’’. బుల్ ఫైట్ లో ఎర్రగుడ్డను ఎలాగైతే చూపించి ఎద్దును రెచ్చగొడతారో, అలాగే డబ్బు నడిచొచ్చేందుకు చర్మాన్ని విశాలంగా పరచి వ్యాధిని రెచ్చగొట్టారు. పసికళ్ళలోకి నీలిరంగును వంపుతూ మందులే పనిచేయని ముర్ఖవ్యాధిగా ముదరబెడుతున్నారు. దీనిలో నిరంతరంగా మరిన్ని కలుషితాలు కలుస్తూ పోతున్నాయి. మరీ ప్రవాహాన్ని మీరు ‘సంస్కృతి’ అని కూడా బ్రమపడుతుంటారేమో.
‘‘అయితే ఈ నీళ్ళను ఎవ్వరూ త్రాగకుండా చేయమంటారా స్వామీ? ’’ బృందసభ్యుల మూకుమ్మడి ప్రశ్న.
‘‘దాహంతో నయినా చావడమే శరణ్యం అవుతుంది మేధావులారా, తప్పు నీళ్ళలో లేదు. దానిలో కలుస్తున్న కలుషితాలలోవుంది. ఆ మూలాలను పూర్తిగా నిర్మూలించండి. నీటిని స్వచ్చంగా మార్చితే తాగటం మేలు చేస్తుంది కూడా. మనసు పెడితే ఒకతరం చదువులు పూర్తిచేసుకునే సరికి మొత్తం కాలువనే తేటగా మార్చేయోచ్చు, నాకిక సెలవిప్పించండి వచ్చిన పని పూర్తయ్యింది.’’ ఎవరి సమాదానం కోసం చూడకుండానే వీళ్ళు ఆశ్చర్యంతో విషయాన్ని ఆకలింపు చేసుకునే లోగానే అతను వడివడిగా నడుచుకుంటూ దూరంగా వెళ్ళిపోయాడు.
‘‘ మరి ఆడవాళ్ళు తాగుతున్నారు కదా అటువంటి ప్రభావం ఎందుకు చూపడం లేదు’’ అడుగుదామనుకున్నారు. యంత్ర వైవిధ్యం ఏదో సమాధానాన్ని స్పరింపజేస్తున్నట్లే అనిపిస్తోంది. అయినా మిగిలినవి మీరే కనుక్కోండి అన్నట్లు అతడు వెళ్ళిపోయాడు అప్పటికే.
నిపుణుల బృందం ఈ అంశాలన్నింటిపై ఒక క్రమంలో పరిశీలనాత్మక రిపోర్టును మహారాజు ముందుంచింది.
‘‘హల్లో… మీరే నండీ… ఈ కథని చదువుతున్న ప్రియమైన పాఠకులూ’’ ‘‘ అనుకోకుండా అదే కాపీ ఇలా మీముందుకు కూడా వచ్చింది. ‘మృగజలం’ నుంచి కాపాడాల్సిన అవసరం మీమీద, నామీద కూడా వుంది. ఎవ్వరి కోసమో కాదు. బతికుండేందుకు మనం ఈ నీళ్ళే గుటకేస్తున్నాం. రేపు మన బిడ్డలూ ఇవే నీళ్ళు తాగాలి, ఈ నీళ్ళను తాగుతున్న వారిమధ్యే బ్రతకాలి. పట్టండి శుధ్ధిచేసే పని మొదలెడదాం. నిజానికి నేను అందులో భాగంగానే ఇదంతా రాసాను ’’

*-*-
కథ అయిపోయింది.

అయినా బ్రహ్మ, సరస్వతి మౌనంగా అవే కాగితాల వైపు చూస్తూనే వున్నారు.
‘‘నీ దీవెనలున్నట్లున్నాయి దేవీ అతని కలంపై, నా సృష్టిలో వెర్రిమొగ్గలేస్తున్న సంస్కృతిని గమనించి జాగ్రత్తగా ఉపమించి ఉపదేశించాలని చూడటం, నిజంగా సాధ్యమా అనిపిస్తుంది కానీ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నాను.’’ బ్రహ్మ నాలుగు ముఖాలూ సుప్రసన్నంగా వున్నాయి.
‘‘మీరు సమాజంలో స్థూలభాగంగా ఒక ప్రవాహ దర్శనాన్ని గమనించారేమో స్వామీ, కానీ శరీరంలో భాగంగా ప్రవహించే అంతస్స్రావీ వ్యవస్థా ప్రవాహమూ, దానిపై ‘మెదడు అదుపు’ కూడా దీనిలో నిర్ధేశించినట్లనిపించింది నాకయితే ఆ విషయాన్ని మరికొంచెం స్పష్టంగా కథలోనే చెప్పివుండాల్సింది.’’ ఏమంటారు అన్నట్లు సర్వస్వతీ దేవి ప్రశ్నించింది.
‘‘ అవును కదా సృష్టికార్యపు భారాన్ని నాతర్వాత భారం తెలియకుండా జీవులు మోసేందుకు పనికిఆహారం పథకంలా తాయిలపు పొట్లాన్ని అలా అంతస్స్రావీ వ్యవస్థలో నేను దాచిపెడితే, దాన్ని అంగడి సరుకుగా చేసి అనవసరపు పందేలతో రెచ్చగొట్టి ఇలా వక్రీభవించి ఉపద్రవంగా మారేలా చేసుకున్న మానవనైజం ఎంత దౌర్భల్యమైంది’’ అశ్చర్యపోతున్నట్లే తిట్టేశాడు స్వామివారు.
నారదుడు అడ్డొస్తూ తన ప్రశ్న వేశాడు ‘‘ కథలో క్రమాన్ని రాజుకి అప్పగించి ముగించకుండా పాఠకుడిని కూడా అందులోకి లాగటం కొత్తగానే వుంది కానీ స్వామీ నాదొక సందేహం. తప్పుగా అనుకోనంటే అడుగుతాను’’ తన సహజ శైలిలో మాటల ప్రవాహం మొదలెట్టాడు.
‘‘ అటు రాజో, రాజరికమో లేదా పాఠకుడు, రచయితా లేదా వారిలా ఉత్సాహమూ,భాద్యతా వున్నవారు ఎవ్వరూ స్పందించలేదను కోండీ లేదా చాలినంత స్పందనే రాలేదనుకోండి. అప్పుడు ఈ కాలువ పరిస్థితి, జనం పరిస్థితి ఏమవుతుందంటారు?’’ ప్రధానమయినదే అయినా పిడుగులాంటి ప్రశ్న వేశాడు నారదుడు.
ముక్తాయింపు మాటలుగా సమాధానం చెప్పే భాద్యతను తీసుకున్నాడు బ్రహ్మ, నెమ్మదిగా తనపనిలోకి వెళ్తూ రెండు చేతులు మాత్రం ఖాళీగా వుంచి ఈ సమాధానానికి అనువుగా ఆ రెండు చేతులూ కదువుతూ వివరించాడు.
‘‘ ఏముంది నాయనా అదే జరిగితే ప్రకృతి లేదా కాలచక్రం తనపని తనుచేసుకు పోతుంది. సృష్టిక్రమ పరంగా బలహీనుడైన పురుషుడు తనే ఈ విషయంలో అధిపతిననుకుంటున్నాడు. సామ్రజ్య దురాక్రమణలు చేసుకుంటూ పోతున్నాడు. కానీ కట్టుబాట్ల గదిలో బంధించ బడిన స్త్రీ తన శక్తిని తెలుసుకుంటుంది. మూసిన గదిలో ఎదురు తిరిగే పిల్లిలా ఎదురుతిరగాల్సిన పరిస్థితి వస్తుంది. తన సామర్ధ్యాన్ని అవగాహన చేసుకున్న స్త్రీ అప్పుడు తను కొన్ని విషయాలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇక శీలాలను కాపాడుకునే పనిలో గగ్గోలు పెట్టడం పురుషుల వంతవుతుంది. ఆ కాలువ మౌనకాలువగానో, అవసాన కాలువగానో ఎక్కడో ఇంకి పోతుంది.’’
‘‘ ధన్యోస్మి తల్లిదండ్రులారా, మరిన్ని వివరాలు ముచ్చటించుకునేందుకు మిమ్మల్ని మరోసారి కలుస్తాను’’
‘నారాయణ…. నారాయణ….’
**-
కొనసాగుతూ వున్న కలలో అనుకోని మలుపుకి కుదిపేసినట్లై ‘అతనికి’ మెలకువ వచ్చింది. కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసాడు. మరికొంచేపు పడుకోవాలా? లేక చెయ్యాల్సిన పని ప్రారంభించొచ్చా అన్నట్లు.

మీ మాటలు

  1. mohan.ravipati says:

    కథ బాగుంది శ్రీనివాస్ గారు ; కొంచెం అధివాస్తవికతను కలిపి, కథను బాగా నడిపించారు, అయితే స్త్రీలు తిరగబడి ఈ మృగ కాలువను పూద్చేయాలంటారు, కానీ అది జీవనది అయిపోయిందే, అంత త్వరగా అంతర్ధానం అవుతుంది అంటారా

    • Mohanగారూ అయ్యో పూడ్చమంటానా, గంగానది ప్రక్షాళనలాగానే దీన్నీ త్రాగునీటివనరుగా మార్చుకోవాలి. లేదంటే అసలుకే దాహం తీరదు. మరోకోణంలో మీరన్నట్లు ‘మృగ’కాలువ లక్షణాలను పూడ్చేయటం మాత్రం తక్షణావసరం. ముందుగా మీ స్పందనకు ధన్యవాదాలు..

    • మోహన్ గారూ మొదటిగా మీ స్పందనకు ధన్యవాదాలు,
      నిజమేనండీ పూడ్చితే మొత్తానికే దాహం తీరదు. ఆ నదిని ప్రక్షాళన చేయాలి.
      సనాతనంగా ప్రవహించుకుంటూ వస్తున్న సాంస్కృతిక ప్రవాహం అనుకున్నప్పటికీ
      లేదా
      అంతస్స్రావిగా (ఎండొక్రైనల్) ప్రవహిస్తున్న వినాళ గ్రంధి అనుకున్నప్పటికీ దాన్ని పూడ్చటం కాక శుద్ధి చేయాల్సిన అవసరం వుందనీ, అవసరంగా దాహాన్ని తీర్చుకోవలసిన చోట, అధికంగా మోహాన్ని రగిలించుకునేతనం తగ్గితే చాలనేదే నా ప్రాధమిక సూచన కూడా …

  2. emta adbhutamgA rAshAru SrinivAsugArU . idivaraku amtarjAlam lenappudu inni viparIta kriyalu telisevi kAvu. ippudu chustumte tala sigguto vAlipotomdi. yii nadi eppatikainaa shudhdhi autundantaaraa?
    AlochanAtmaka kadhanu vrAsina miikuu, prachurinchina editor mahAshayulakii dhanyavaadaalu
    Lakshmi

  3. ఎంత అద్భుతంగా రాసారు సార్ !ఆ కాలువ ఎప్పుడు శుద్ది అవుతుందో, ఎప్పుడు ప్రపంచం బాగుపడుతుందో?, ఈమధ్య ఈ అన్తర్జాలాలూ, ముఖపుస్తకాలూ లో పెడుతున్న వార్తలు చూస్తుంటే ,ఒళ్ళు గగుర్పొదుస్తొంది . మీకు అభినందనలు ఎడిటర్ జీ కి dhanyavaadaalu

Leave a Reply to శ్రీనివాస్.కట్టా Cancel reply

*