ఎగిరే పావురమా! – 12

egire-pavuramaa12-banner-1

పక్కనే ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలో, పురాణ కాలక్షేపం ముగిసినట్టుంది. మైకు మూగబోయి హడావిడి తగ్గింది. రెండు రోజులుగా కళ్ళతో చూడలేకపోయినా, ఇలా పక్కమీదనుండే వినగలుగుతున్న పురాణ కాలక్షేపం చెవులకి అమృతంలా ఉంది. సాయంత్రాలు ఓ రెండుగంటల సేపైనా కాలు నొప్పిని, బాధని మరచిపోగలుగుతున్నాను… ప్రతిరోజూ నాలుగు నుండి ఆరు గంటల వరకు మరో వారమంతా జరుగుతుందంట ఆ కార్యక్రమం.

ఈ పూట వినవచ్చిన ప్రసంగంలో, ఆ అయ్యవారు చెప్పిన విషయాలు నా గుండెల్ని సూటిగా తాకాయి…

…..’కష్టనష్టాలకి, సుఖధు:ఖాలకి అతీతమైనది కాల గమనం.
కాలానికి అతీతులై కూడా ఎవరూ లేరు
’…..అన్న మాటలకి, ………..
మనసంతా గజిబిజిగా అయిపొయింది.

‘నేను – పుట్టిన ఊరిని, పెంచిన తాతని వదిలొచ్చి మూడున్నర సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయని గుర్తొచ్చింది.
ఈ మూడేళ్ళలో నా జీవనం ఎన్నో మలుపులు తిరిగి, ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని, మనస్సు అయోమయంలో కొట్టుమిట్టాడుతూనే ఉందని కూడా’ గుర్తొచ్చింది.
తాత ప్రాపకం నుండి బయటపడితేనే నా జీవనం మెరుగవుతుందని, సరైన వైద్యం చేయించుకోవడానికి వీలవుతుందని, అందుగ్గాను సాయపడతానన్న కమలమ్మని నమ్మాను అప్పట్లో…

పద్దెనిమిదేళ్ళు నిండగానే, తాతనుండి నాదైన డబ్బు, ఆస్తి ఇప్పుంచుకోవచ్చని, ఆ తరువాత పట్టణంలో వైద్యం చేయించుకొని నా బతుకు బాగుచేసుకోవచ్చన్న కమలమ్మ మాటతో ఇన్నాళ్ళూ కాలం వెళ్ళబుచ్చాను.
అదే ఆశతో, తాత మీద చాలా బెంగగా ఉన్నా, గుబులుగానే గడుపుకొస్తున్నాను.

…… ఆలోచనలతో ….. గుండెలు బరువుగా తోచాయి….. గొంతు తడారి పోతుంది. ఆపరేషనయ్యి, ఆసుపత్రి మంచంపై కదలకుండా ఉంటూ, మూడు రోజులుగా వేసుకుంటున్న మందులతో, నోరంతా చేదుగా అయిపొయింది.

మంచినీళ్ళన్నా అడుగుదామని తల పైకెత్తి చుట్టూ చూసాను. ఆసుపత్రి ఆయా గాని, నర్సు గాని కనబడలేదు. పిలవలేను…
వాళ్ళూ టైం ప్రకారంగా వస్తున్నారులా ఉంది. ఆగి చూద్దామనుకున్నాను..
నిముష నిముషానికి ఎక్కువౌతున్న కాలుపోటుకి స్పృహ పోతున్నట్టుగా అయిపోతుంటే గట్టిగా కళ్ళు మూసుకొన్నాను.
నొప్పి, దాహం, మగతగా ఉంది……
మరికాసేపటికి అలాగే నిదురలోకి జారుకున్నాను….

egire-pavurama-12-1
**
“ఇదిగో అమ్మాయ్, లేచి నీ మందులేసుకో,” గట్టిగా భుజం పట్టుకు కుదుపుతుంది ఆసుపత్రి ఆయమ్మ.
అతి కష్టంగా కళ్ళు తెరిచి, ఆయమ్మ సాయంతో, తలగడనానుకుని కూర్చుని, వేడి కాఫీ నీళ్ళతో మందేసుకున్నాను. తల భారంగా ఉంది…

“బల్ల మీద బన్ను, అరటిపండు పెట్టారుగా! తినలేదే?….. చూసుండవు…. …ఇప్పుడు తిని నీళ్ళు తాగు…. మందులతో నొప్పి, భారం తగ్గిపోతాయిలే. ఇక ఈ రాత్రికి ఇంతే….. మీ అవసరాలకి నైట్ డ్యూటీ ఆయమ్మ ఉంటది. రేపు తెల్లారుతూనే డాక్టరు వస్తారు. ఇక నేనెళుతున్నా,” అని చెప్పి వెళ్ళిపోయిందామె…

నా పక్కనే కొత్తగా వచ్చిన పేషంట్ అనుకుంటా… బాధగా ఏడుస్తూ, మూలుగుతుంది….
గదిలో ఐదారుగురు రోగులు. అందరూ ఏదో ఒక బాధతో మూలుగుతూనే ఉన్నారు….

నేను ఆసుపత్రిలో జేరి ఇవాల్టికి మూడో రోజు.
వొంటికి ఇంత నొప్పంటూ ఉంటుందని, డాక్టర్లు నా కుడి కాలు మోకాలు వరకు తీసేసినాకే తెలిసింది. నొప్పితో, వొళ్ళంతా బండబారిపోయింది…….

నా మంచం ఎదురుగా తెరిచి ఉన్న వాకిలి నుండి కాస్త చల్లనిగాలి వీస్తుంది. వర్షం మొదలయ్యేలా ఉంది..
ఈ నొప్పి ఒర్చుకోడం ఎలాగో తెలీడం లేదు… ఇప్పుడు మింగిన మందుతో నొప్పి తగ్గి నిద్ర పోతానని చెప్పింది ఆయమ్మ. కళ్ళు మూసి వెనక్కి వాలాను….

గత రెండేళ్లగా ‘మదర్ తెరెసా అనాధాశ్రమం’ కి పనిచేస్తున్నందుకు, వారు చూపుతున్న ఉదారతే, నాకు రాబోతున్న ఈ కృత్రిమ కుడికాలు.
ఈ ఉచిత వైద్యం కోసమే, క్రైస్తవ మతం పుచ్చుకోడానికి, “మదర్ తెరెసా” లోని క్యాంటీన్ కి నామమాత్రపు జీతానికి రోజంతా పనిచేయడానికి ఒప్పుకోక తప్పలేదు…

ఈ ఆపరేషన్ చేయించాలని, ఆమె స్నేహితుడు ప్రహ్లాద్ జేమ్స్ తోను, ‘మదర్ తెరెసా’ వైద్యులతోను సంప్రదించి, నిర్ణయించింది కమలమ్మే.

అప్పట్లో తాత నన్ను వంశీ సంస్థకి డబ్బు కోసం అమ్మేస్తున్నాడని, వాళ్ళు కృత్రిమ కాళ్ళు పెట్టించి వెట్టి చాకిరీ చేయిస్తారని భయపెట్టింది కూడా ఆమే.
మరిప్పుడు మోకాలి నుండి కృత్రిమ కాలే నాకు సరయిన చికిత్సని నిశ్చయించింది. అదేమని అడిగే నోరు గాని, ధైర్యం గాని నాకు లేవు.

పోయిన వారం నాకు పద్దెనిమిదేళ్ళు నిండిన సందర్భంగా కమలమ్మ, ముందుగా ఈ ఆపరేషన్ జరిగవలసిన రోజు నిర్ధారించింది. రెండో పనిగా, పొలం – డబ్బు – కొట్టాం అడుగుతూ, నా చేత తాతకి ఉత్తరం రాయించింది. మూడో పనిగా – గోవిందుతో త్వరలో నా పెళ్ళని ‘మదర్ తెరెసా అనాధాశ్రమం’ లో అందరికీ చెప్పింది,…

తాతకి ఉత్తరం పంపిన మరునాడే, ఊరికి దూరంగా ఉన్న ఈ ఆసుపత్రిలో, నా ఆపరేషన్ జరిపించేసింది కమలమ్మ.

ఈ ఆపరేషన్, మా కొలువులు, ప్రహ్లాద్ జేమ్స్ అనే వ్యక్తి చలవేనంటుంది కమలమ్మ. కమలమ్మకి స్నేహితుడు, శ్రేయోభిలాషి అయిన ప్రహ్లాద్ జేమ్స్, మూడేళ్లగా మా జీవితాలకి సూత్రధారి. అతను గీసిన గీటు దాటకుండా, అతను చెప్పింది చేస్తుంది ఆమె.

కొత్త ఊళ్ళో, సత్రంలో దిక్కు తోచక సతమవుతున్న మా ముగ్గిర్ని ఆదుకొని, ఏడాదిపాటు తన క్యాంటీన్ లో, తరువాత రెండేళ్ళగా ‘మదర్ తెరెసా’లో మమ్మల్ని కొలువులకి పెట్టింది అతనే అవడంతో, మరి అతని మాట వేదవాక్కు కమలమ్మకి…..
ఆలోచనలతో తల మరింత మోద్దుబారింది… మందువల్లేమో, నొప్పి తగ్గినట్టుగా మగతగా నిద్రలోకి జారుకున్నాను…..
**
“అమ్మాయ్, లేలే, తెల్లారుజామున నాలుగయింది. రాత్రంతా ఈ గదిలో అందరూ ఒకటే మూలుగడం. కసేపన్నా నిద్రలేదు.. ఓ వరస మీ అందరి పనులు చూసి, నిన్ను రెండో పక్కకి తిప్పి, పోయి మళ్ళీ తొంగుంటా,” అంటూ కుదిపి లేపింది రాత్రి డ్యూటి ఆయమ్మ…
బయట సన్నని జల్లు మొదలైంది. సుతిమెత్తగా గాలి గదిలోకి వీస్తుంది. తిరిగి నిద్ర పోదామనుకుంటే, మళ్ళీ కాలు నొప్పెట్టడం మొదలైంది.

‘నొప్పి’ తోచగానే కమలమ్మ గుర్తొచ్చింది…గోవిందుతో పాటు.

కమలమ్మని చూసి రెండు రోజులౌతుంది.. మనస్సుకి హాయిగా ఉంది…నిత్యం మాటలతో, చేష్టలతో కాల్చుకుతినే ఆమె నుండి విశ్రాంతి.
ఇక గోవిందు – సరేసరి..ఆమె చేతిలో కీలుబొమ్మ.
అప్పుడప్పుడు తాగి వాగుడు, అరుపులు కూడా.
అయినా అతనంటే నాకు మన్ననే. రెండేళ్లగా, చదువుకునేందుకు సాయం చేస్తున్నాడు. స్కూల్ పుస్తకాలు కావాలని అడగంగానే, నా కాడనున్న ఏడో తరగతి పుస్తకాలు పట్టుకెళ్ళి అనాధాశ్రమం టీచర్లతో నా విషయం మాట్లాడాడు. చర్చ్ లైబ్రరీ నుండి ఎనిమిదో తరగతి పుస్తకాలు పైసా ఖర్చు లేకుండా తెచ్చిపెట్టాడు.
అసలు ఈ ఊరొచ్చిన కాడినుండి కూడా ఇతరత్రా పుస్తకాలు, పత్రికలు, పేపర్లు వీలున్నప్పుడల్లా దొరకపుచ్చుకొని తెచ్చిస్తుంటాడు. కమలమ్మలా కాదు గోవిందు…

ఆలోచనల్లో మెల్లగా తెల్లవారుతుంటే, నా కాలు నొప్పిలా, బయట వర్షం మాత్రం ఉధృతంగా మారింది……
వర్షం పడ్డప్పుడల్లా, తాత గురించిన ఆలోచనలు నన్ను మరింతగా కమ్ముకుంటాయి.
‘గాయత్రీ,’ అనే తాత పిలుపులోని ఆప్యాయత ఎంతగానో గుర్తొస్తుంది. తాత మాట వినబడక యుగాలైనట్టుగా అనిపిస్తుంది.
తాతకి నేను చదువుకోడం ముఖ్యమనే, వెంట తెచ్చుకున్న ఏడవ తరగతి పుస్తకాలు మొదలుకొని వదలకుండా చదువు సాగిస్తూనే ఉన్నాను. పుస్తకాలు – చదువే నాకు ఊరటనిచ్చే తోడయ్యాయి. లోకం తీరు కాస్తైనా తెలుసుకోగలుగుతున్నాను.
వర్షంలోకి తీక్షణంగా చూసాను. తొలిపొద్దు వెలుగుల్లో మెరుస్తున్న వెండి తీగల్లా ఉన్నాయి వర్షపు ధారలు.
ఇలాంటి హోరెత్తే వర్షంలోనే నేనానాడు సొంత మనుషులని వదిలి- అంతగా తెలియని వాళ్ళతో తెలియని జీవనంలోకి పరుగెత్తాను.
అప్పటి స్థితిలో, ఆ వయస్సులో ఆ నిర్ణయం దిద్దుకోలేని తప్పుగా మారిందా?
బతుకులో పెనుమార్పులు తెచ్చి, నేనూహించని ప్రపంచంలో నన్ను నిలబెట్టిందా?
ఆ నాటి నా తలంపు సరయిందా? అని నిత్యం నిలదీస్తుంది మనస్సు.

నేనాశపడ్డట్టుగా ఏమీ జరగకపోగా, తాత కాడికి తిరిగివెళ్ళే దారి తోచక, అలవాటులేని అడ్డమైన కొలువులు చేస్తూ కమలమ్మ చేతిలో పావుగా మారిపోయాను…….ఇక ఈ ఆపరేషన్ తో అందరిలా రెండు పాదాల మీద అయితే, నడుస్తానన్న ఆశ సగం హరించుకుపోయినట్టే….ఓ కాలు కృత్రిమ కాలే మరి….

ఇలా సాగుతున్న ఆలోచనలకి ఆనకట్టు వేసింది, పొద్దున్నే డ్యూటి మారిన ఆయమ్మ బొంగురు గొంతే….

“లే పిల్లా లే, డాక్టరమ్మ వచ్చేలోగా, నీ పనంతా కానివ్వు. తిని, వేడి నీళ్ళతో మందేసుకో… అదేలే వేడి కాఫీ నీళ్ళతో మందేసుకుంటే నొప్పి, నీరసం పోతాయి,” నవ్వుతూ నన్ను పట్టి పైకి లేవడానికి సాయం చేసింది…….,.

నా చుట్టూ సర్దుతూ, “అవునూ మీ వదిన, నీ కాబోయే పెనిమిటి మళ్ళీ రాలేదే? ఇవాళ వస్తారేమోలే! మొత్తానికి, దుర్మార్గుడైన మీ తాత బారి నుండి పారోపోయొచ్చావంటగా! పోనీలే, మంచి పనే చేసావు…మనువయ్యాక కూడా నిన్ను బాగానే చూసుకుంటాడులే ఆ అబ్బాయి,” గబగబా అంటూ కదిలిందామె…
విననట్టే నేల చూపులు చూసాను….ఆమెకా సమాచారం అందించింది కూడా కమలమ్మేగా!.
ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన రోజు మధ్యానం, డ్యూటీలో ఉన్న ఈమెకి, కమలమ్మ చెప్పని సంగతి కాని, ఆడని అబద్దం కాని లేదని తెలుసు…తను చెప్పేవే నిజమని అందర్ని నమ్మించాలని చూస్తది కమలమ్మ …

“ఇదిగో, మళ్ళీ నేనొచ్చేలోగా ఈ బన్ను, పండు తినేసేయి. నీ కట్టు మార్చి మందులిస్తాను,” అని వెళ్ళింది ఆయమ్మ.

గోవిందుతో నా పెళ్ళంటూ ఆయమ్మ అన్న మాటలే గుర్తొస్తున్నాయి.
గడిచిన ఏడాదిగా మాత్రం, ఇలాగే ఎందరికో నా పెళ్ళి మాట చెబుతూ ఉంది కమలమ్మ..
..నన్ను ఉద్ధరించడానికే తనూ, తన తమ్ముడు కంకణం కట్టుకున్నామని చెబుతుంది. వయస్సుకి రాగానే, నేను తాత నుండి నా ఆస్థులు ఇప్పించుకున్నాక, నన్ను కాపాడ్డం కోసం, అదే త్యాగ గుణంతో నన్ను తమ్ముడుకిచ్చి పెళ్ళి జరిపించేస్తానని,,, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా పని కట్టుకుని చెబుతుంది.

మొదట్లో నాకు చిరాకు ఏవగింపు కలిగేవి, కమలమ్మ నోటెంట నా పెళ్ళి మాటలు..
ఇప్పుడసలు పట్టించుకోను…

“ఈ అవిటిదాన్ని నాకు కట్టబెడతానంటావ్. దీన్ని కట్టుకుంటే, నా బతుకు హాయిగా గడుస్తాదని బలవంతబెట్టి, నాకిష్టం లేందే ఊరు కూడా దాటించావు.
అది సంపాదించడమే కాక, దాని తాత పొలం, కొట్టాం వస్తాయని కానిమాటలు సెబుతుంటావు…
నాకు బతుకు మీద ఇష్టం పోయింది,” అంటూ కమలమ్మ మీద విరుచుకు పడ్డాడు పీకల వరకు తాగేసి ఒకటి రెండు సార్లు, ఈ మధ్య గోవిందు.
వల పన్ని ఈ అక్కాతమ్ముళ్ళు, నన్నో పథకం ప్రకారమే తాత నుండి వేరు జేసారని తెలిసినప్పుడు కోపంతో గుండెలు మండిపోయాయి. అప్పటికే తాతని వదిలొచ్చి రెండున్నరేళ్ళు గడిచిపోయాయి కూడా…

ఏమీ చేయలేని ఆ స్థితిలోనే, కాస్త ఊరటనిచ్చిన విషయం మాత్రం – కమలమ్మ దండోరా వేసే పెళ్ళి మాటలకి, నాతో పాటు గోవిందుకి కూడా ఎటువంటి విలువా లేదని.
(ఇంకా ఉంది)

మీ మాటలు

*