మాండొలిన్ ఇప్పుడు వొంటరి మూగ పిల్ల!

         srinivas-01

మాండొలిన్ తీగల మాయాజాలానికి తెర పడింది. కణకణంలో కర్పూర పరిమళాల తుఫానుల్ని రేపే కమనీయ వాద్యమొకటి పైలోకాలకు పయనమైంది. ఏ తంత్రులనుండి వెలువడే రాగాలను వింటే వసంత సౌఖ్యాలు మన చెవులనూ మనసునూ కమ్ముకుంటాయో, ఏ చేతివేళ్లు తీగలమీద విద్యుల్లతల్లా నర్తిస్తుంటే స్వరఝంఝలు ఉవ్వెత్తున ఎగసి నాట్యమాడుతాయో, ఏ నాదవైభవం నిండిన నదీతరంగాల మీద తెప్పలా తేలిపోతుంటే జీవనసార్థక్య భావన హృదయపు లోతుల్లోకి ఇంకిపోతుందో, ఆ తీగల చేతుల తరంగాల మెస్మరిజం మనకిక లేదు.

పాలకొల్లులో ప్రభవించిన పసిడిరాగాల పాలవెల్లీ. నీ మరణవార్తకన్న పిడుగుపాటు ఎంత మృదువైనది! బ్రతుకుబాటలో మధ్యలోనే కూలిన సంగీత శిఖరమా. నీ మాండొలిన్ స్వరాల విందుకు దూరమైన అసంఖ్యాక రసికుల దురదృష్టాన్ని ఏమని వర్ణించడం. నీ పాదాలకు ప్రణమిల్లితే తప్ప నివాళి అన్న పదానికి నిజంగా అర్థం వుందా. సరస్వతీ పుత్రుడా, శయనించు హాయిగా స్వర్గసీమలోని శాంతిపవనాల నడుమ.

*         *         *

మాండొలిన్ శ్రీనివాస్ ప్రతిభకు నోరెళ్లబెట్టని సంగీత రసికులుండరంటే అది అతిశయోక్తి కాదు. అసలు మాండొలిన్ అనేది ఒక పాశ్చాత్యసంగీత వాద్యం. దానిమీద పాశ్చాత్య సంగీతాన్ని పలికించడమంటే ఏమో అనుకోవచ్చు. కాని శుద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నిసర్గసౌందర్యంతో – అదీ అత్యంత పిన్న వయసులో – ధారాళంగా జాలువారించటం ఊహకందని ప్రతిభాపాటవాలను సూచించే విషయం. పూర్వం ఈమని శంకర శాస్త్రి గారు కమ్ సెప్టెంబర్ సినిమాలోని ఇంగ్లిష్ పాటలను వీణ మీద పలికించటం గురించి సంగీత రసికులు ఉత్సాహంగా మాట్లాడుకునేవారు.

మాండొలిన్ శ్రీనివాస్ సంగీతాన్ని ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్లు మళ్లీమళ్లీ వింటూ నాదసాగరంలో ఓలలాడానో లెక్క లేదు. నళిన కాంతి రాగంలో ఆయన వాయించిన ‘మనవి యాలకించ’ అద్భుత కౌశలానికి నిదర్శనం. కలియుగ వరదన (బృందావన సారంగ రాగం) అనే మరో కృతి అత్యంత మనోహరమైనది. రేవతి రాగంలో ఒక జావళిని కూడా ఆయన గొప్పగా వాయించాడు (ఈ రాగానికి హిందుస్తానీ శైలిలో బైరాగీ భైరవ్ అని పేరు). మార్గళి సంగీతోత్సవంలోనో లేక త్యాగరాజ ఆరాధనోత్సవంలోనో ఒకసారి ఒకే వేదిక మీద శ్రీనివాస్, అతని అన్న అయిన రాజేశ్ ఇద్దరూ కలిసి యుగళవాద్య కచేరీ ఒకటి చేసారు. కచేరీ మధ్యలో తన తమ్ముడు శ్రీనివాస్ పలికించిన అద్భుత తంత్రీనాదానికి ముగ్ధుడైన రాజేశ్ వెంటనే అతనికి సల్యూట్ చేయడం రెండుమూడేళ్ల క్రితం యూ ట్యూబ్ లోని విడియో క్లిప్ లో వీక్షించాను. ఆ విడియో మాత్రమే కాక మరికొన్ని మంచి విడియోలు శ్రీనివాస్ వి ఇప్పుడు యూ ట్యూబ్ లో లేవు. కారణం తెలియదు. శ్రీనివాస్ వాయించిన మంచి నంబర్స్ ను వరుసగా పేర్కొంటే ఒక పెద్ద జాబితా తయారవుతుంది. స్వరరాగ సుధా (శంకరాభరణం), సిద్ధి వినాయకం (మోహన కల్యాణి), మామవ సదా జనని (?కానడ), సరసిజాక్ష (కాంభోజి), నిరవతి సుఖద (?కదన కుతూహలం), ఇంతకన్నానందమేమి (బిలహరి), రఘువంశ సుధాంబుధి (కదన కుతూహలం), దరిని తెలుసుకొంటి (శుద్ధ సావేరి) నారాయణతే నమో నమో (బేహాగ్), నగుమోము (అభేరి), బంటు రీతి (హంసనాదం), గజవదన – ఇలా ఎన్నెన్నో.

అంతటి అనన్య ప్రతిభను సొంతం చేసుకోవటం మానవమాత్రుల వల్ల అయ్యే పని కాదనిపిస్తుంది. ఆయన మరో రెండుమూడు దశాబ్దాల పాటు జీవించి, అతని బ్రతుకు సాఫీగా సాగివుంటే భారతరత్న పురస్కారాన్ని కూడా దక్కించుకునేవాడేమో.

                                                                  –  ఎలనాగ

elanaga

 

 

 

మీ మాటలు

*