కుహనా సంస్కరణపై కొడవటిగంటి బాణం!

కొడవటిగంటి కుటుంబ రావు గారు (కొ.కు.) విడాకుల చట్టం (అప్పటికింకా దాని రూపం గురించి చర్చలు జరుగుతున్నట్లున్నాయి) గురించిన చర్చతో కథని మొదలుపెట్టారు. అసలు పాయింటు ‘భర్తలు భార్యల్ని హింసించడం’ అన్నట్టు, దాన్ని కొకు వ్యంగ్యంగా సమర్థిస్తున్నట్టూ కనిపించినా (ఏ మాత్రం శృతి కుదరని హస్తిమశకాంతరమున్న జంటల విషయంలో కనీసం) – ఆయన చెప్పదల్చుకున్నది ‘సమస్య యొక్క అసలు మూలాల దగ్గరకి వెళ్ళకుండా పైపైన పాయింట్లతో చెలరేగిపోయే సంఘసంస్కరణాభిలాషుల వల్ల కలిగే ప్రయోజనం సున్నా అనే.

ఈ కథ లోని ‘శివానందం’ పాత్ర సంస్కరణ పేరు చెప్పి పోజు కొట్టే అనేక మందికి ప్రతినిధి.
ఆనాటి నవీన విద్యావిధానంలో ఏదో అరకొరగా ఇంగ్లీషు నాగరికతా ముక్కల్ని మైండ్ లో పోగు చేసుకుని వాటన్నిటి నుంచే జీవిత సమస్యలకి పరిష్కారం దొరుకుతాయనుకునే అమాయకత్వం/మూర్ఖత్వం కలబోసిన మనిషి శివానందం.

ఇలాంటి వాళ్ళని మోసగాళ్ళు, స్వార్థపరులు అనడం సబబు కాదు. తమకే పరిష్కారాలు తెలుసునన్న దృక్పధం ఇలాంటి నవీన బుద్ధిశాలులలో చాలా ఎక్కువగా కనపడటం ఈనాడూ మనం గమనించవచ్చు.

ప్రేమ లేని శాపపు పెళ్ళిళ్ళలో వచ్చే సమస్యలన్నింటికీ (మానసిక శారీరక హింసలు, నస, అక్రమ సంబంధాలు వగైరా) అసలు పరిష్కారం వాటిని అర్థం చేసుకుని పరిష్కరించగల వివేకాన్ని తెచ్చుకోవడంలోనే ఉంటుందని వాచ్యంగా చెప్పకపోయినా సూచ్యంగా చెప్పినట్లున్నారు కొకు.

సంఘోద్ధరణకి బయల్దేరే లోతులు లేని సంస్కర్తల వైఫల్యాన్ని వ్యంగ్యంగా ఎత్తి చూపించడం లోనే ఈ సూచన ఉందనిపిస్తోంది.

లాలిత్యం – ప్రేమ మాట దేవుడెరుగు – చూడగానే కంపరం పుట్టించే రూపాలూ, అవిద్య, మూర్ఖత్వం వల్ల ముఖంలో ముద్ర పడిపోయిన కోపమూ, అసూయా, కుళ్ళుమోత్తనమూ – ఇటువంటి ‘విపరీత’ దాంపత్యాన్ని సంస్కర్తల అమాయకత్వాన్ని ఫోకస్ చేసేందుకే కథలో పెట్టాడేమో అనిపిస్తుంది.

KODAVATIGANTI-KUTUMBARAO

భారతదేశంలోని స్త్రీలందరూ పురాణాలలోని పతివ్రతలని ఫాలో అయ్యే వాళ్ళనీ, ‘సంస్కరణ యావత్తూ మగవాడికే చెయ్యవలసి ఉంది’ అనీ శివానందం నమ్మడం లోనే అతని అవివేకాన్ని, ముందు జరగబోయే కథని సూచిస్తాడు కొకు.

పెళ్ళాలని కొట్టకుండా మగవాళ్ళని ఆపడం కోసం శివానందం వేసిన ‘ప్లాన్ ఆఫ్ కాంపేన్’ (ఒపీనియన్ ఒకటి క్రియేట్ చెయ్యడం, ఉద్రేకిస్తూ ఓ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాయడం వగైరా) పెద్దగా ఫలించక చివరికి శ్రీరాములు గారనే పెద్దమనిషిని సంస్కరించబూనుకుంటాడు.

శ్రీరాములు గారు ఈ కుహనా సంస్కర్తకన్నా వెయ్యిరెట్లు తెలిసినవాడు. అయినా శివానందం తన ఉపన్యాసాయుధాన్ని శ్రీరాములు గారి మీద ప్రయోగించడం మొదలుపెట్టగానే ఆయన ‘పడిపోయినట్లు’ నటించి శివానందాన్ని అప్పుడప్పుడూ తన ఇంటికి వచ్చి తనలో కలిగిన పరివర్తనని చూసి తన కాపరాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండమంటాడు.

శివానందం తన స్నేహితుడితో (కథకుడు) కలిసి శ్రీరాములు గారి ఇంటికి వెళతాడు.

అక్కడ శ్రీరాములు గారి భార్య తన గయ్యాళితనాన్ని శివానందానికి రుచి చూపిస్తుంది. ఆడవాళ్ళని కొట్టే మగవాళ్ళని సంస్కరించబూనుకున్న శివానందం తనే ఆమెని కొట్టబోవడం, అతనికి శృంగభంగం కావడంతో కథ ముగుస్తుంది.

ఇంత జరిగినా శివానందంలో ఏమీ మార్పు రాలేదన్న విషయాన్ని చివర్లో శివానందం కథకుడితో అన్న మాటల ద్వారా సూచిస్తాడు కొకు. కొకు తను చెప్పదలుచుకున్నది ఏ ఆవేశమూ లేకుండా నింపాదిగా ఎంత బాగా చెప్పగలడు అన్న దానికి ఈ కథ ఒక ఉదాహరణ. క్రింది లింక్ లో చదవండి……

http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=14745

– రాధ మండువ

మీ మాటలు

  1. “ఒరే ఇడియట్! మొగుళ్ళు పెళ్ళాలను కొట్టడం వల్ల తప్ప, విడాకులు లభించకపోయే పక్షంలో శ్రీరాములుగారికి పెళ్ళాన్ని కొట్టడానికి ఉన్న అర్హత ఎవరికి ఉందో చెప్పు. అటువంటి వాళ్ళందరినీ నువ్వు సంస్కరించి నీ విడాకుల చట్టాన్ని ఎట్లా నిరుపయోగం చేస్తావు?”

    పిడిఎఫ్ లో ఆఖర్న ఈ పేరా సరిగ్గా కనిపించడం లేదు…. ఈ పేరాని కనీసం నాలుగైదు సార్లు చదివితే కాని అర్థం బోధపడలేదు నాకు… అందుకే మీ కోసం ఈ పేరా కామెంట్ లో పెట్టాను.

  2. రాధగారూ, నాకీ శివానందం సిరీస్ అంటే చాలా ఇష్టమండి. ఇలాంటి కథలు ఇంకొన్ని ఉన్నాయి కొకు రచనల్లో. కుదిరితే వాటిని కూడా పరిచయం చేయరూ…!

  3. చూద్దాం అపర్ణా…. కొకు కథలని పరిచయం చేయాలనే మొదలు పెట్టాను…. చూద్దాం…. Thank you

  4. కో.కు ని ఇప్పటి థరానీకి పరిచయం చెయ్యడం చాలా సులభం……….ఆఆయన కి తనకంటే 50 సంవత్సరాల ముందు
    చూసే వారు . పంచ కళ్యాణి తో మొదలు పెట్టండి.

  5. అవును. ఆయనొక గొప్ప దార్శనికుడు….. అందుకే పరిచయం చేయాలనుకున్నాను. ఇంతకుముందు కురూపి భార్య పరిచయం చేశాను. ఇది రెండో సమీక్ష… ధన్యవాదాలు

మీ మాటలు

*