ఎగిరే పావురమా! – 11

egire-pavuramaa11banner
“విననంటే ఎలా గాయత్రి? నువ్వేమౌతావో అనే నా బెంగ. నీ డబ్బంతా పెట్టి పట్నంలో వైద్యం సేయిస్తే నడక, మాట వచ్చేస్తాయి. నీకు పదిహేనేళ్ళు కదా! సరయిన వయసు.
నీకు మేమున్నాము. మా వెంట వచ్చేసేయి. అన్నీ సేస్తాము.
నేనూ, గోవిందు కూడా అండగా నిలబడి నీ మీద ఈగ వాలనివ్వం. అన్నీ సూసుకుంటాం. ఇప్పుడు మేమే నీకు సాయం సేయగలం.
నీ తాత నుండి నీ కొట్టాం, పొలం కూడా అడిగి ఇప్పించుకోవచ్చు. జీవనం ముగిసిపోతున్నవాడు నీ తాత. జీవనం ఇంకా మొదలెట్టని దానివి నువ్వు,” , “ఆలోసించుకో నీ ఇష్టం,” అనేసింది కమలమ్మ.

నా చేయి వదిలేసి, ఎంగిలి చేతిని కంచంలోనే కడిగించి అక్కడినుండి వెళ్ళిపోయింది ఆమె.
దుఖాన్ని అపుకునే ప్రయత్నంలో అక్కడినుంచి లేచి, ఎలాగో నా పక్క మీదకి చేరాను.
ఏనాడు లేనిది, నన్ను కని కాలువగట్టున పారేసిన ఆ నా కన్నతల్లిని తలుచుకున్నాను. నా రోదన వినబడకుండా గొంతు బట్టతో చుట్టిన ఆమె నిర్దయ నిజమేనా అనుకున్నాను. అసలు నన్ను ఇలా దిక్కు మొక్కు లేకుండా చేయడానికి ఆమెకి అధికారం ఉందా? నా ఈ దుస్థితికి ఆ అమ్మ కాదా కారణం? అని తిట్టుకున్నాను…
లేచి మంచినీళ్ళు తాగాను. మరో పక్కకి ఒత్తిగిల్లాను. కమలమ్మ గురకతో అసలు నిద్ర రావడం లేదు. ఆలోచన ఆమె మీదకి మళ్ళింది. మా జీవితాల్లోకి కమలమ్మ వచ్చి మూడేళ్ళవుతుంది. ఆమె ఎసుమంటి మనిషో అంతగా అర్ధం కాలేదు. నా మీద ప్రేమ చూపిస్తది. నా మంచి కోరుకుంటది.
తాతకి అమె నచ్చదు. ఎందుకు?
ఆలోచన తాత మీదకి మళ్ళింది. గుండెలు చల్లగా అయిపోయాయి. గుండెలు జారి నేలకొరిగినట్టుగా అనిపించింది. తల మొద్దుబారింది. నిజంగా నా జీవితం ఇలా అవ్వడానికి తాత కారణమా? నా అవిటితనం తాత వల్ల ఏర్పడిందా?
మరి చంద్రమ్మతో నేను తనకి దొరికినప్పుడు కాళ్ళు, పాదాలు దెబ్బ తిన్నాయని, ఊపిరి కూడా అందకుండా గొంతుకి గుడ్డ చుట్టి ఉందని అన్నాడే?
కన్నతల్లే నిర్దయగా అలా వదిలేసిందేమో అని బాధపడ్డాడే? అది అబద్దమా?

కమలమ్మ మాటలు తలుస్తూ మితిమీరిన బాధతో, కోపంతో వణికిపోతున్న నా వొంటిని, అవిసిపోతున్న గుండెల్ని సముదాయించే ప్రయత్నంలో తెల్లారిపోయింది.
**
నా బాధ, ఆందోళన పట్టనట్టుగా మామూలుగా తెల్లారింది. కమలమ్మ చెప్పిన విషయాలు గుండెల్ని మండిస్తున్నా ఎప్పటిలా నేను గుళ్ళో నా స్థానంలో కూచుని, నా పని చూసుకుంటున్నాను.
పూలపని, వత్తులు, కుంకుమ పొట్లాల పని అయ్యేప్పటికి తొమ్మిదిన్నరయ్యింది.

పదిగంటల సమయంలో, గుడి ఆవరణలోనే దూరంగా ఓ మూలకి పెద్ద బస్సు వచ్చి ఆగింది. కొద్దిసేపట్లో హడావిడి మొదలైంది. అప్పటికే గుడి బయట – చూపు లేని వారు, వికలాంగులు – పిల్లలు, పెద్దలు, వారి వెంట వచ్చిన వారు ఒక పాతిక మందైనా కూడారు.

మరో పది నిముషాలకి పూజారయ్య, ఉమమ్మ, నేను ఆ బస్సు దగ్గరకి వెళ్ళాము. వైద్య సదుపాయాలున్న ఆ బండి చిన్న ఆసుపత్రి లాగానే ఉంది. ఇద్దరు డాక్టరమ్మలు, ఒక డాక్టరయ్య ఉన్నారు.

ముందుగా నన్నే లోనికి తీసుకెళ్ళారు.
వారు నిర్వహించబోయేది – రక్త పరీక్షలతో మొదలెట్టి –
‘అంగవైకల్య సంబంధిత ప్రాధమిక పరిశీలన’ – అన్నారు.
కాళ్ళలో – కదలిక పరిధి, స్పందన – నమోదు చేసారు
గొంతు బయట-లోపల ఫోటోలు, ఎక్సురేలు తీసారు
స్వతహాగా గొంతునుండి వెలువడే ధ్వనులు పలికించి విన్నారు.
నెలక్రితం వంశీ సంస్థతో తాత దాఖలు చేసిన అర్జీ నా ముందుంచారు. నా పేరు రాసున్న దస్త్రం – నా తరఫున తాత దరఖాస్తు పెట్టిన కాగితాలవి. ఉమమ్మ దాన్ని చదవమని నా పక్కన కూచుంది.

అభ్యర్ధి: గాయత్రి సాయిరాం – వయస్సు: 15 సంవత్సరాలు – 6 వ తరగతి విద్యార్ధిని.
సంరక్షకుడు – (తాత) సత్యం సాయిరాం – వయస్సు: 73 సం – గంగన్న పాలెం వాస్తవ్యులు
సంక్షిప్త ఫిర్యాదు : అంగవైకల్యం – (నడక, మాట లేకపోవడం)
వివరణ: 15 యేళ్ళ క్రితం, ఉధృత పరిసరాల్లో – కాళ్ళు, పాదాలు, మెడ, గొంతు భాగాలు నలిగి, శారీరికంగా గాయపడి, తీవ్ర వొత్తిడికి లోనయిన పసిబిడ్డ.
ప్రస్తుత పరిస్థితి: కదలిక లేని కాళ్ళు, సామాన్య మాట సామర్ధ్యం లేని వాక్కు (మూగి).
జరిపిన చికిత్స: కాళ్ళకి, అరికాళ్ళకి ఆకు పసర్ల పూత, ఆయుర్వేదం.
పై విషయమంతా ఆ దస్త్రం లోని వివరణాపత్రికలో స్పష్టంగా రాయించాడు తాత ….
దానితో పాటుగా —
తమ ఆర్ధికస్థితి దృష్ట్యా ఉచిత వైద్యసహాయం కోరుతున్నామని కూడా….తాత చేసిన ఆభ్యర్ధనా పత్రం – ఆ దస్త్రంలో ఉంది.
**
నాతో పాటు మొత్తం ఐదుగురికి మాత్రమే డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు.
ఆ పరీక్షల వివరాలు సాయంత్రానికల్లా చెబుతామన్నారు.
నేను, ఉమమ్మ గుళ్ళోకి వెళ్ళిపోయాము.
**
గుడిలో పని ముగించుకొని ఐదింటికి మళ్ళీ వైద్యుల్ని కలిశాము.
వారు జరిపిన ప్రాధమిక పరీక్షల ఫలితాల పత్రం మా చేతికిచ్చారు.
కదలిక పరంగా :
కాళ్ళల్లో ఎదుగుదల – 80% (ఎనభై శాతం) ఉంటే, స్పందన – 40% (నలభై శాతం) ఉందంట.
అరికాళ్ళల్లో స్పర్సజ్ఞానం – 20% (ఇరవై శాతం)గా.. నిర్దారణయ్యిందంట.
పాక్షిక ప్రతిస్పందనకి కారణం వైజ్ఞానికంగా కనుగొనవలసిన అవసరం ఉందని ప్రస్తావించారు.

కంఠధ్వనుల పరంగా:
నేటి సాధారణ పరీక్షా ఫలితాలు అసంపూర్ణం అని, ప్రత్యేకంగా సున్నితమైన ‘స్వర పేటిక’ వైద్య పరీక్షలు జరపవలసుందని తెలియజేశారు.
యేడాది సమయం పట్టే ఆ వైద్యానికి, ‘వంశీ సంస్థ’ నివాసిగా నమోదైన రుజువు అవసరం అని కూడా సూచించారు ఆ సంస్థ వైద్యులు.

వొత్తిడి పడని మిగతా ప్రమేయాలు సవ్యంగానే ఉండడంతో, సరయిన వైద్యం అందితే, పరిస్థితి మెరుగుపడే అవకాశం హెచ్చుగానే ఉందని కూడా నిర్ధారించారు.
వాళ్ళతో సంప్రదింపులు అయేప్పటికి సాయంత్రం నాలుగయింది.

ఆ తంతు ముగుస్తూనే ఉమమ్మ ఆ వివరణాపత్రం మళ్ళీ చదువుతూ అరుగు మీద నా పక్కనే కూచుంది. సమాచారమంతా సరోజినిగారికి ఫోనులో వివరించి, వంశీ వారి సౌకర్యంలో నివశించే వారికి మాత్రమే, అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారని కూడా ఆమెతో చెప్పింది.
ఫోను పెట్టేసి ఆలోచనలో పడింది ఉమమ్మ.
“అంటే నువ్వు ఈ ఊరునుండి వెళ్లి కనీసం ఓ ఏడాది పాటు అక్కడ గుంటూరులో వాళ్ళ వసతిలో ఉండాలన్నమాట. అలా కాకుండా ఇంకే విధంగానైనా ఆ వైద్య పరీక్షలు చేయించవచ్చేమో, సరోజినిగారి సాయంతో కనుక్కుంటానులే,“ అంది ఉమమ్మ.

egire-pavurama-11
**
పొద్దున్నుంచి జరిగిన విషయాలు తలచుకుంటూ మధ్యానం కమలమ్మ ఇచ్చిన పులిహోర తిన్నాను.
వంశీ సంస్థ వారితో, తాత ద్వారా నమోదైన నా వివరాలు పదే పదే గుర్తొస్తున్నాయి. పసిపిల్లగా నా కాళ్ళు చితికిపోతే, గాయాలు మానిన గుర్తులు చూడంగా గుర్తులేదే? మరి మాట ఎందుకు రాకుండా పోయినట్టు? పుట్టుకతో వచ్చిన మూగతనమా?

వెన్నంటే కమలమ్మ మాటలు కూడా పదే పదే గుర్తొస్తున్నాయి. ఇన్నేళ్ళ ‘గాయత్రి’ హుండీ డబ్బు ఎంత? నా కోసం పిన్ని తన వద్ద దాస్తుందేమో? ఆ డబ్బుతో పట్నంలో పెద్దాసుపత్రికి వెళ్ళలేమా? వెళ్ళి వైద్యం చేయిస్తే, నా కాళ్ళు బాగయిపోతాయేమో… నడవగలుగుతానేమో, అది చాలు నాకు…
తాత రిక్షానో, ఆటోరిక్షానో నడిపి సంపాదించిన డబ్బుతో కొట్టాం, పొలం కొనలేడని కమలమ్మ అంటుంది. మరి తాతకెలా ఉన్నాయవి?
జవాబు లేని ఎన్నో విషయాలు.

మా రాబడి – మా తిండికి, జీవనానికి అయిపోతుందేమో.. నాకు వైద్యం చేయించడానికి సరిపడా డబ్బు లేకనే, వికలాంగుల సంస్థలో నన్ను నమోదు చేశాడేమో తాత…
తాతని అడిగి కనుక్కునే స్థితి లేదిప్పుడు. జబ్బు పడిపోయాడు.
నన్ను బాగు చేసే ఓపిక ఇక తాతకి లేదేమో! నా జీవనం నేనే బాగు చేసుకోవాలి. డబ్బు దగ్గర మాకు ఎప్పుడూ కొదవే అని పిన్ని మాటల వల్ల తెలుస్తుందిగా.
నాకు మంచి వైద్యం తాత చేయించలేడేమో. సాయంత్రం వరకు ఆలోచనల్లో మునిగి తేలాను.
కొన్ని నిర్ణయాలు వెంటనే తీసుకోవాలి.

ఎవరి సాయం లేకుండానే, ఇప్పుడు మెల్లగానే అయినా కర్రల సాయంతో మెసలగలను, కదలగలను. ఇప్పుడు నా కదలిక నా అధీనంలోనే ఉంది కూడా…
పనయ్యాక గోవిందు రిక్షాలో తాతని చూడ్డానికి ఆసుపత్రికి వెళతానని కమలమ్మకి తెలియజెప్పాను.
“అయితే నన్ను దారిలో గోవిందు పాకలో దింపెళ్ళండి,” అని నాతో పాటే బయలుదేరింది కమలమ్మ.
**
నేను ఆసుపత్రికి వెళ్ళేప్పటికి తలగడని ఆనుకుని కూచోనున్నాడు తాత. కాస్త తేరుకున్నట్టే కనబడ్డాడు. పక్కన చేరి ఆ రోజు అప్పటివరకు జరిగిన విషయమంతా తెలియజెప్పాను తాతకి.
వంశీ సంస్థ డాక్టర్లు వచ్చారని, నన్ను పరీక్షించారని సైగలతో వివరించాను.
నా వైద్యం విషయం ఏమన్నారని అడిగాడు తాత. మరిన్ని పరీక్షలకి వెళ్ళాలన్నారని తెలియజెప్పాను. నాకు ఏడవ తరగతి పుస్తకాలతో రెండో తరగతి ఇంగ్లీషు కూడా అందాయని తెలిపాను. సంతోషంతో తాతకి కళ్ళల్లో నీరు తిరిగింది.

మొద్దుబారిన నా బుర్ర తాతతో కూడా ఎప్పటిలా ఉండనివ్వలేదు. తాత నన్ను ప్రేమతో పదిహేనేళ్ళగా పెంచాడా? లేక అవిటిని చేసి, నా అవిటితనం ఫణంగా పెట్టి తను బతుకుతున్నాడా? అన్న తలంపే బాధపెట్టింది.

చిక్కిపోయి కళ తప్పిన తాత రూపాన్ని చూసి గుండెలు బరువుగా అనిపించాయి. నన్ను సాకిన ఆ పెద్దాయన నా పాలిట దేవుడో? కసాయివాడో? అన్నదానికి జవాబు దొరకేనో? లేదో?

లోతుగా ఊపిరి తీసి తాత రూపాన్ని నా గుండెల నిండా ఎప్పటికీ చెరగనంత బలంగా నింపుకున్నాను.
తాతకి చెప్పి బయలుదేరాను.
హోరున గాలివాన. తగ్గుముఖం పడుతుందేమోనని కాసేపు వరండాలో వేచి చూసాను.
నిముష నిముషానికి వర్షం ఎక్కువవ్వడం చూసి, గోవిందు నేనున్న కాడికి వచ్చాడు. “నాకు వానలో రిక్షా నడపడం కొత్తేమీ కాదు,” అన్నాడు.
**
రిక్షాలో వొదిగి కూచున్నా, రెండువైపుల నుండి వాన తాకిడి ఉధృతంగా ఉంది. గోవిందుకి అలవాటేగా! తడవకుండా పొడవాటి ప్లాస్టిక్ చొక్కా, తలకి ప్లాస్టిక్ టోపీ వేసుకొని రిక్షా నడుపుతున్నాడు.

ఉరుములు – మెరుపులు – గాలి – వాన – హోరెత్తిపోతున్నట్టుగా ఉంది. నా అలోచనలు కూడా అదే విధంగా ఉన్నాయి.
కోపం, అసహనం, భయం, అనుమానం, అంతలోనే మొండి ధైర్యం గుండెల్ని చుట్టేసాయి.

ఇదే సమయం. తాత ఉంటే ఈ తెగింపు రాదు.
ఆ ప్రేమ నిండిన ముఖం చూస్తూ అనుమాన పడలేను.
నేను ఇలా తెగించలేను.
అందుకే కొట్టాం చేరగానే, గోవిందుని ఆగమన్నాను, సాయం అడిగాను. ఇకనుండి నిబ్బరంగా నడుచుకోవాలి. ధైర్యంగా ముందుకి సాగాలి అని నాకు నేను మరీ మరీ అనుకున్నాను.

అంతే! వెనుతిరిగి చూడకండా పిచ్చిధైర్యంతో, దృఢనిశ్చయంతో, పెట్టెబేడా సదురుకొని – తాతని, అక్కడి నా జీవితాన్ని వదిలేసి, కమలమ్మని కలవడానికి గోవిందుతో అతని పాకకి బయలుదేరాను.

దారిపొడుగునా నా మదిలో మెదిలింది – ప్రేమని పంచిన తాత రూపమే.
ప్రతి పొద్దు నాకోసమే అన్నట్టుగా నాముందు వాలి నాకెంతో ఆనందాన్నిచ్చే నా పావురాళ్ళు, నాకు చదువు చెప్పి ప్రేమతో ఆదరించే ఉమమ్మ రూపం కూడా నా గుండెల్లో కదిలాయి.
ఓ పావురంలా గూడు వీడి పోతున్నానా? అనిపించింది ఓ క్షణం.

‘పావురం శాంతికి చిహ్నంగా ఆకాశంలో సంచరిస్తుందంట’… ‘నేను మాత్రం మదినిండా ఎంతో అశాంతిని నింపుకొని ఓ విహంగంలా గూడు వీడుతున్నాను’ అనిపించింది.

(ఇంకా ఉంది)

మీ మాటలు

  1. ఆ అమ్మాయి అడుగుతప్పటడుగు కాకమంచికే అవ్వాలని కోరుతున్నాను..

  2. కమలమ్మ అమ్మాయిని ట్రాప్ లో పడేసిందా ???

Leave a Reply to Anupama Cancel reply

*