కొత్త అనువాద నవల ప్రారంభం: పేద్రో పారమొ-1

pedro1-1

పేద్రో పారమొ అనే పేరుగల మా నాన్న ఇక్కడ ఉన్నాడని చెప్పబట్టే ఈ కోమలాకి వచ్చాను. చెప్పింది మా అమ్మే. ఆమె చనిపోయాక వెళ్ళి ఆయన్ని కలుస్తానని మాట ఇచ్చాను. తప్పకుండా వెళతానంటూ అందుకు సూచనగా ఆమె చేతుల్ని గట్టిగా నొక్కాను కూడా. ఆమె చావుకు చేరువలో ఉంది; ఆమెకి ఏ మాట అయినా ఇచ్చి ఉండే వాణ్ణి. “ఆయన్ని కలవకుండా ఉండొద్దు” గట్టిగా చెప్పిందామె “ఆయన్ని కొంతమంది ఒకటంటారు. మరికొంతమంది మరొకటి. ఆయనకీ నిన్ను చూడాలని తప్పకుండా ఉంటుంది.” అప్పుడు నేను చేయగలిగిందల్లా ఆమె చెప్పినట్టు చేస్తానని చెప్పడమే. అదే వాగ్దానాన్ని తరచుగా చేసీ చేసీ, బిగిసిన ఆమె గుప్పిటనుంచి నా చేతుల్ని విడిపించుకున్నాకా అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండిపోయాను.
అంతకుముందు ఆమె చెప్పింది:
“ఆయన్ని ఏమీ అడక్కు. నీకేం రావాలో అంతవరకే. నీకివ్వాల్సి ఉండీ నీకు ఇవ్వనిది.. బదులు చెల్లించనీ నాయనా, ఇన్నేళ్ళూ మన పేరుగూడా తలవనందుకు.”
“అలాగే అమ్మా!”
నా మాట నిలుపుకునే ఉద్దేశం లేదు నాకు. కానీ నేను గమనించేలోపే నా బుర్ర కలల్లో తేలడమూ, ఊహలకు రెక్కలు రావడమూ మొదలయింది. నా తల్లికి భర్త అయిన పేద్రో పారమొ అనే వ్యక్తి కేంద్రంగా పెరిగిన ఆశ చుట్టూ కొద్దికొద్దిగా ఒక ప్రపంచాన్ని నిర్మించుకోసాగాను. అందుకే కోమలాకి రావలసి వచ్చింది.

గస్టు గాలులు వేడిగా సపొనారియా పూల కుళ్ళు కంపుతో విషపూరితమై వీచే వేసవి కాలపు రోజులు.
దారంతా ఎగుడు దిగుడు. ఎగుడా దిగుడా అన్నది నువ్వు వస్తున్నావా పోతున్నావా అన్న దాని బట్టి ఉంటుంది. వెళ్ళేప్పుడు ఎగుడు, వచ్చేప్పుడు దిగుడు.
“ఆ దిగువన కనిపించే ఊరును ఏమంటారన్నావూ?”
“కోమలా అయ్యా!”
“కచ్చితంగా తెలుసా నీకది కోమలాయేనని?”
“బాగా తెలుసయ్యా!”
“అంత దీనంగా ఉంది, ఏమయింది దానికి?”
“రోజులట్లాగున్నాయయ్యా!”

మా అమ్మ జ్ఞాపకాలకు చెందిన ఊరిని చూడబోతున్నానని తెలుసు నాకు. నిట్టూర్పులతో నిండిన జ్ఞాపకాలు. ఆమె జీవితమంతా కోమలా గురించీ, అక్కడికి తిరిగి వెళ్ళటం గురించీ తలపోస్తూ నిట్టూరుస్తూ గడిపింది. అయితే ఆమె వెళ్లలేకపోయింది. ఇప్పుడు ఆమె స్థానంలో నేను వచ్చాను. నేను ఆమె కళ్లతో, ఆమె చూసినట్లుగా చూస్తున్నాను. చూడడానికి తన కళ్లను ఆమె నాకిచ్చింది. లాస్ కొలిమోట్స్ గేటు దాటగానే మొక్కజొన్న పసుపు అంచుతో అందమైన ఆకుపచ్చని మైదానం కనిపిస్తుంది. అక్కడినుంచి కోమలా కనిపిస్తుంది, నేలను తెల్లబరుస్తూ, రాత్రి దాన్ని వెలిగిస్తూ. ఆమె గొంతు రహస్యం చెపుతున్నట్టుగా, తనలో తను మాట్లాడుకుంటున్నట్టూ…అమ్మ.
“అడుగుతున్నానని అనుకోవద్దు గానీ ఇంతకీ మీరు కోమలా ఎందుకు వెళుతున్నట్టు?” ఆ మనిషి ప్రశ్నించడం వినిపించింది.
“నా తండ్రిని చూడడానికి వచ్చాను” జవాబిచ్చాను.
“ఊఁ” అన్నాడు.
మళ్లీ నిశ్శబ్దం.
కంచరగాడిదల గిట్టల చప్పుడుకు అనుగుణంగా నడుస్తూ గుట్ట దిగుతున్నాము. ఆగస్టు వేడికి వాటి నిద్రకళ్ళు ఉబ్బి ఉన్నాయి.
“మీకు మంచి మర్యాదలు జరుగుతాయిలే” మళ్లీ నా పక్కన నడుస్తున్న మనిషి గొంతు వినిపించింది. “ఇటువైపు ఇన్నేళ్ళుగా ఎవరూ రాలేదు. ఇప్పుడయినా ఒకరిని చూసి సంతోషిస్తారు”
కాసేపయ్యాక పొడిగించాడు: “మీరెవరయితేనేం గానీ, మిమ్మల్ని చూసి సంతోషిస్తారు”
తళతళలాడే సూర్యకాంతిలో మైదానమంతా బూడిదరంగు దిగంతాల్ని కప్పిన పొగమంచును కరిగిస్తున్న పారదర్శక కాసారంలా ఉంది.అంతకంటే దూరంగా పర్వతశ్రేణులు. ఇంకా దూరంగా నిస్త్రాణమైన ఒంటరితనం.
“మీరేమీ అనుకోకపోతే, మీ నాయన ఎలాఉంటారు?”
“నేనెప్పుడూ చూడలేదు” అతనికి చెప్పాను. “ఆయన పేరు పేద్రో పారమొ అన్నదే నాకు తెలిసింది.”
“ఊఁ అట్లాగా?”
“అవును. కనీసం నాకు చెప్పిన పేరు అదీ!”
మళ్లీ ఆ కంచరగాడిదలు తోలేవాడి గొంతునుంచి ఇంకో “ఊఁ”.
లాస్ ఎన్క్వెంట్రోస్ కూడలి దగ్గర కలిశాడితను. అక్కడ ఎదురు చూస్తూ ఉంటే చిట్టచివరికి ఇతను కనిపించాడు.
“ఎక్కడికి వెళుతున్నావు?” నేనడిగాను.
“ఆ దిగువకు పోతున్నానయ్యా!”
“నీకు కోమలా అనే ఊరు తెలుసా?”
“అటువైపే నేను పోతుంది!”
అతని వెంటబడి పోయాను. అతనితో కలిసి నడవాలని ప్రయత్నిస్తూ వెనకపడినప్పుడల్లా నేను వెనకే వస్తున్నట్టు గుర్తొచ్చినట్టు కొంచెం నెమ్మదిగా నడిచాడు. ఆ తర్వాత మేం పక్కపక్కనే మా భుజాలు దాదాపు తాకేంత దగ్గరగా నడిచాము.
“పేద్రో పారమొ నాతండ్రి కూడా” అన్నాడతను.
పైన శూన్యాకాశంలో కాకుల గుంపు ఒకటి కావు కావుమంటూ పోయింది.
ఎగుడు దిగుడుగా ఉన్నా మొత్తానికి దిగుతూనే ఉన్న బాట వెంట నడిచాము. వేడిగాలిని వెనకే వదిలేసి, గాలిలేని అచ్చమైన వేడిలోకి దిగుతున్నాము. ఆ నిశ్చలత్వం దేనికోసమో ఎదురుచూస్తున్నట్లుంది.
“ఇక్కడ వేడిగా ఉంది” నేనన్నాను.
“నీకనిపిస్తుందేమో. ఇది పెద్ద లెక్కలోది కాదు” నా తోటిమనిషి అన్నాడు.”తేలిగ్గా తీసుకో. మనం కోమలా కి వెళ్ళేసరికి నీకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఆ ఊరు బొగ్గుల కుంపటి మీద నరకం వాకిలి దగ్గర ఉన్నట్టు ఉంటుంది. ఊరి జనం చచ్చి నరకానికి వెళ్ళినప్పుడు దుప్పటి కోసం తిరిగి వస్తారని చెప్పుకుంటారు.”
“పేద్రో పారమొ తెలుసా నీకు?” అడిగాను.
అతని కళ్లలో మినుకుమనే స్నేహభావం చూసి అడగొచ్చనిపించింది.
“ఎవరాయన?”
“మనిషి జన్మెత్తిన రాక్షసుడు” చెప్పాడతను.
కారణం లేకుండానే దిగుడుబాట వెంట చాలా ముందుగా వెడుతున్న గాడిదల్ని కర్ర ఊపుతూ అదిలించాడు.
నా జేబులో ఉన్న మా అమ్మ ఫొటో నా గుండెకి వేడిగా తగులుతుంది ఆమెకు చెమట్లు పోస్తునట్టు. అది అంచులు నలిగిన పాత ఫొటో. అదొక్కటే నాకు తెలిసి ఆమె ఫొటో. వంటగదిలో ఎండిన నిమ్మతొక్కా, చాస్టియా మొగ్గలూ, సదాప రెమ్మలూ ఉన్న మట్టి పాత్రలో దొరికింది నాకది. అప్పటి నుంచీ అది నాతోనే ఉంది. నాకున్నదల్లా అదే. మా అమ్మకి ఫొటో తీయించుకోవడం అసలు ఇష్టం లేదు. అది చేతబడి కోసం వాడతారని చెప్పేది. అది నిజమేననిపిస్తుంది ఫొటో అంతా సూదులతో గుచ్చిన గుర్తులూ, గుండె దగ్గర మధ్యవేలు పట్టేంత రంధ్రమూ చూస్తుంటే.
మా నాన్న నన్ను గుర్తు పట్టేందుకు ఆ ఫొటో నాతోపాటు తెచ్చాను.
“అటు చూడు” గాడిదల కాపరి చెప్పాడు ఆగిపోయి. “ఆ గుండ్రంగా పంది పొట్టలా కనిపిస్తున్న గుట్ట చూశావా? మెదియా లూనా దాని వెనకే ఉంటుంది. ఇప్పుడు ఇటు తిరుగు. ఆ కొండ కొమ్ము చూడు. సరిగ్గా చూడు. మళ్ళీ ఈవంక చూడు. ఆ కొస కనిపిస్తుందా? అట్లా అదుగో దూరంగా కనపడీ కనపడకుండా? అదుగో ఆ అల్లదంతా మెదియా లూనా. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. కనుచూపుమేరా అంటారే అంత దాకా. ఆ భూమంతా ఆయనదే. మనం పేద్రో పారమొ కొడుకులమే గానీ మన అమ్మలు మనల్ని చింకి చాపలమీదే కన్నారు. ఇంకా పెద్ద తమాషా ఏమిటంటే ఆయనే మమ్మల్ని బాప్టిజం చేయడానికి తీసుకెళ్ళాడు. నీకు కూడా అంతేనా?”
“నాకు గుర్తు లేదు”
“నీ మొహం లే!”
“ఏమన్నావు?”
“దగ్గరకి వచ్చేశాం అని చెపుతున్నానయ్యా!”
“అవును. నాకు కనిపిస్తుంది.. ఏమయ్యుంటుంది?”
“కరెకామినోస్ అయ్యా! ఆ పిట్టల్ని ఆ పేరుతో పిలుస్తారిక్కడ.”
“అది కాదు. ఊరికి ఈ గతి ఎందుకు పట్టిందా అని ఆలోచిస్తున్నాను. జనసంచారం లేకుండా, అంతా ఎటో వెళ్ళిపోయినట్లు. అసలు ఎవరూ ఉంటున్నట్లే లేదిక్కడ.”
“ఉంటున్నట్లు లేకపోవడం కాదు, ఎవరూ ఉండరిక్కడ”
“మరి పేద్రో పారమొ?”
“పేద్రో పారమొ పోయి ఏళ్ళవుతూంది”

xinmortal-del-bronce.jpg.pagespeed.ic.9TAvf_tMeK

ప్రతి చిన్న ఊళ్ళో పిల్లలు ఆడుకోవడానికివీధుల్లోకి చేరి సాయంత్రాల్ని వాళ్ళ కేకలతో నింపే సమయం. ముదురు గోడలు లేత పసుపు ఎండని ప్రతిఫలించే సమయం.
కనీసం నేను నిన్న సాయంత్రం ఈ సమయానికి సయులాలో చూసింది అదీ. రెక్కలు టపటపలాడించుకుంటూ ఈ దినం నుంచి తప్పించుకుంటున్నట్టు ఎగిరిపోయే పావురాలు భగ్నం చేసిన కదలని గాలిని చూశాను. అవి ఒక్కసారిగా పైకి లేచి ఇళ్ళ కప్పుల మీద వాలిపోయాయి. పిల్లల కేకలు సుడి తిరుగుతూ పైకి లేచి సందె ఆకాశపు నీలంగా మారిపోయాయి.
ఇప్పుడు ఈ సద్దు మణిగిన ఊళ్ళో ఉన్నాను. కింద పరిచిన రాతిపలకల మీద నా అడుగుల చప్పుడు వినిపిస్తూంది. బోలు అడుగులు కుంకే పొద్దులో ఎర్రబారిన గోడల వల్ల ప్రతిధ్వనిస్తూ.

చూస్తే ఆ సమయానికి మెయిన్ రోడ్ మీద నడుస్తున్నాను. వదిలేసిన ఇళ్ళూ, అడ్డు లేకుండా పెరిగిన గడ్డి కప్పిన వాకిళ్ళూ తప్ప ఏమీ లేవు. వాటిని ఏమని పిలుస్తారని చెప్పాడతను? “గోబర్నడోర అయ్యా! క్రియోసోట్ పొదలు. బయటికి వెళితే నిమిషంలో ఇల్లంతా మహమ్మారిలా ఆక్రమిస్తుంది. చూస్తావుగా!”

ఒక వీధి మలుపు తిరుగుతుండగా ఒక స్త్రీ శాలువా కప్పుకుని కనిపించింది; అంతలోనే మాయమయింది. తలుపుల్లేని ఇళ్ళలోకి తొంగి చూస్తూ ముందుకు నడిచాను. మళ్ళీ ఆ శాలువా కప్పుకున్న ఆమె నాకెదురుగా వచ్చింది.
ఆమె పలకరించింది.
ఆమె వంక చూశాను. “దోన (మేడం) ఎదువిజస్ వాళ్ళ ఇల్లెక్కడ?” అరిచాను.
ఆమె చేయెత్తి చూపించింది. “అదుగో ఆ వంతెన పక్క ఇల్లు”
ఆమె గొంతులో మానవ స్వరమే పలుకుతున్నట్టూ, నోటినిండా పళ్ళూ, మాట్లాడుతున్నప్పుడు కదిలే నాలుకా, ఈ భూమి మీద నివసించే మనుషులకున్న కళ్ల లాంటి కళ్ళూ గమనించాను.
అప్పటికి చీకటి పడిపోయింది.
సెలవని చెప్పడానికి వెనక్కి తిరిగింది వెళుతూ. ఆడుకునే పిల్లలూ, పావురాలూ, కప్పుల మీద నీలపు రంగు పెంకులూ లేకపోయినప్పటికీ ఈ ఊరు బతికిఉన్నట్టు అనిపించింది. నిశ్శబ్దమే చెవులపడుతున్నదంటే, అందుకు కారణం ఇంకా నాకు నిశ్శబ్దం అలవాటు కాలేదన్న మాట. బహుశా నా బుర్రంతా శబ్దాలతోనూ, గొంతులతోనూ నిండి ఉండటం వలనేమో.
అవును, గొంతులు. ఇక్కడ, గాలి ఆరుదయిన చోట, అవి నాకు బలంగా వినిపిస్తున్నాయి. అవి నాలో బరువుగా నిండి ఉన్నాయి. మా అమ్మ చెప్పింది గుర్తుంది: “అక్కడ నీకు బాగా వినిపిస్తుంది. నేను నీకు ఇంకా దగ్గరగా ఉంటాను. నా జ్ఞాపకాల గొంతు నా చావు గొంతుకంటే బలంగా వినిపిస్తుంది, చావుకు గొంతు అంటూ ఉంటే” అమ్మ.. బతికి ఉన్నట్టే.
ఆమె ఇక్కడ ఉండి ఉంటే బావుండేది; “ఆ ఇంటి గురించి పొరబాటు పడ్డావు. నువ్వు చెప్పిన చోటు తప్పు. దిక్కూ దివాణం లేని ఊరికి పంపావు. బతికిలేని వాళ్ల కోసం వెతకడానికి” అని ఆమెతో చెప్పడానికి.
నది చేస్తున్న చప్పుడును అనుసరించి వంతెన పక్కనున్న ఇల్లు కనుక్కోగలిగాను. తలుపు కొట్టడానికి చేయెత్తాను కానీ అక్కడేమీ లేదు. గాలి తలుపును బద్దలు కొట్టినట్టు నా చేతికి శూన్యం తగిలింది. ఒకావిడ అక్కడ నిలుచుని ఉంది. ఆమె “లోపలికి రా” అంది. నేను లోపలికి వెళ్ళాను.

ట్లా నేను కోమలాలో ఆగిపోయాను. గాడిదలతో వచ్చినతను తన దారిన వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు చెప్పాడు:

“నేనింకా చాలా దూరం వెళ్ళాలి. అదుగో వరసగా కొండలు కనిపిస్తున్నాయే వాటవతలికి. నా ఇల్లుందక్కడ. నీకు రావాలని ఉంటే సంతోషం. ఇప్పటికి నీకు ఇక్కడ ఉండాలనిపిస్తే ఉండు. ఇక్కడొక చుట్టు తిరిగివస్తే పోయేదేమీ లేదు, ఇంకా బతికి ఉన్న వాళ్ళెవరయినా తగలొచ్చు.”
నేనుండిపోయాను. నేనొచ్చిందే అందుకు.
“ఉండటానికి చోటెక్కడ దొరుకుతుంది?” దాదాపు అరుస్తూ అడిగాను.
“ఎదువిజస్ కోసం చూడు, ఇంకా ఆమె బతికిఉంటే. నేను పంపానని చెప్పు”
“నీ పేరేమిటి?”
“అబుందియో” బదులిచ్చాడు అతను. అతని ఇంటి పేరు వినపడనంత దూరం వెళ్ళిపోయాడు అప్పటికే.

(వచ్చే వారం…)

అనువాదం: చందూ

మీ మాటలు

  1. తిలక్ బొమ్మరాజు says:

    ఇలా వివిధ భాషల నవలలను అనువధించి సారంగలో ప్రచురించడం చాలా ఆనందకరం ,ముఖ్యంగా రష్యన్ మరియు స్పానిష్ నవలలు కానీ,సాహిత్యం కానీ ఒక కొత్త అనుభూతినిస్తాయి,వాళ్ళ ఆలోచనా విదానాన్ని మనం ఊహించడం కష్టం,ఇలా కూడా అందంగా రాస్తారా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు,అంత అద్భుతం వారి సాహిత్యం ,ఇంత గొప్ప నవలను పరిచయం చేస్తున్న మీకు ధన్యవాదములు అఫ్సర్ గారు.

  2. అనువాద సూత్రాలకు కడుదూరంగా అనువాదం జరిగింది. వాక్యాల వారీగా అనువదించుకుపోవాలనే తపన కనిపించింది. అనువాద అలంకార ధర్మమే కనిపించలేదు.( గుండ్రంగా పంది పొట్టలా కనిపిస్తున్న గుట్ట చూశావా). కీ,కు ప్రయోగాల్లో స్థానభ్రంశాలు రచయితకు నగుబాటు తెచ్చేదే

  3. అఫ్సర్ గారూ,

    ఒక అరుదైన రకానికి చెందిన నవలను అనువదించినందుకు చందు గారినీ, దాన్ని ప్రచురిస్తున్నందుకు మిమ్మల్నీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే యిదొక మంచి ప్రయత్నం.

  4. చొప్ప వీరభద్రప్ప says:

    చాలబాగావుంది అనువాదం ఇంకాముందుముందు ఏం జరుగుతుందోననే వుత్సుకత రేకెత్తిస్తూ నడక సాగింది .మొత్తంగా చదివింటే బాగుండు ననిపించే తియ్యదన ముందీ రవ్వంత కథలో .సందర్భనుసారంగా అలంకారాల ఉపమానాల వుదాహరణలు కథ సొబగుకు సౌందర్యాన్ని తాపినట్లుందీకథాను వాదం. ఇలాంటి దేశ దేశాల కథాపరిచయం ఆనందదాయకం.

మీ మాటలు

*