మోహ దృశ్యం

hari 

జన్మ జన్మాల మోహాన్ని అంతా
నీలి మేఘం లో బంధించాను-
వాన జల్లై కురుస్తోంది
శతాబ్దాల ప్రేమనంతా
హిమాలయ శిఖరంపై నిలబెట్టాను –
జీవ నదియై పొంగుతోంది
అనంత సమయాల అభిమానమంతా
నేలపై ముగ్గులుగా వేసాను-
మొక్కై చిగుళ్ళేసింది
వేల కాలాల అనురాగాన్నంతా
చిటారు కొమ్మల్లో నిక్షిప్తం చేసాను-
పత్ర హరితమై పల్లవిస్తోంది
నీకై నిరీక్షణ నంతా
గాలిలోకి వెదజల్లాను-
పూల పరిమళమై గుబాళిస్తోంది
నువ్వు నిత్య సంజీవినీ మంత్రం
మళ్ళీ మళ్ళీ
నీ పెదవి పైకే నా పయనం
నువ్వు సచ్చిదానందం
ప్రవహించి, ఎగిరెళ్లి, ఘనీభవించి, ఆవిరై
మళ్ళీ మళ్ళీ
నీ ఒడిలోనే నా శయనం
మామిడి హరికృష్ణ 
mamidi harikrishna

మీ మాటలు

  1. చాలా రొమాంటిక్ గా ఉంది సర్ కంగ్రాట్స్ “ఆమె” అదృష్టవంతురాలు …ప్రేమతో జగతి

  2. Gopala Bala Raju says:

    సర్, సాహిత్యంపై మీ ఊహా దృశ్యం మళ్లీ ఆవిష్కృతమైంది- 1992 లాల్ బహదూర్ రోజులు గుర్తొచాయి- మీ గోపాల బాలరాజు,

  3. అనంతమైన ఆలోచనల్ని, ఊహల్ని అద్బుతంగా మోహ దృశ్యీకరించడం / అక్షరీకరించడం, కొందరికి మధుర జ్ఞాపకాల స్మరణ మరికొందరికి కొత్త ఊహల చిత్రీకరణ.. బాగుంది మిత్రమా!

  4. harikrishna mamidi says:

    ధన్య వాదాలు జగద్ధాత్రి గారూ.. అవును నిజమే గోపాల బాల రాజు , మన కాలేజ్ రోజులలో మన కాలేజ్ మ్యాగజైన్ మళ్ళీ గుర్తు చేసినందుకు థాంక్స్… and thank u ashoke

  5. ఆధిరెడ్డి says:

    అన్నయ్య నేను ఆధిరెడ్డి , మల్లయ్య రూమ్ ప్రక్కన బాల సముద్రం లో వుండేవాడిని , అప్పుడప్పుడు మీరూ , సిద్దారెడ్డి అన్న వున్న రూమ్ కి వచ్చేవాడిని , సాహితి వినీలాకాశంలో మీరో దృవ తార అన్నయ్య

మీ మాటలు

*