చరిత్రకి దర్పణం “కొల్లేటి జాడలు”

kolletiకొల్లేరు చుట్టూ జరుగుతున్న రాజకీయాలు కోకొల్లలు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొల్లేటి సమస్య మెడకి చుట్టుకున్నట్టుగా ఉంది. ఎన్నికల సమయంలో ఆ ప్రాంతంలో నివసించేవారికి “కొల్లేరు అభయారణ్యం పరిధి తగ్గించి.. మిగిలిన భూముల్లో మీకే పట్టాలు ఇస్తాం” అని ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. తీరా ఇప్పుడు పరిస్థితి రివర్స్‌ అయ్యేలా ఉంది.

ఎందుకంటే… కొల్లేరు అభయారణ్యం పరిరక్షణకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ సుప్రీం కోర్టు నుంచి రాష్ట్ర పెద్దలకు నోటీసులు అందాయి. దీంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. నిజానికి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే సావధానంగా ఆలోచిస్తే, చిత్తశుద్ధి ఉంటే ఎంచక్కా దొరుకుతుంది. కానీ అంత ఓపిక, తీరిక, సహనం పాలకులకు ఉండటం లేదు. ఈ నేపథ్యంలోంచి చూస్తే అక్కినేని కుటుంబరావు తాజా నవల “కొల్లేటి జాడలు”కి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నవల గురించి మాట్లాడుకోవడం సందర్భోచితం కూడా..!

ప్రకృతిని నమ్ముకుంటే మనిషికి మనుగడ సమస్య రాదు. కానీ, అదే ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే, విధ్వంస పోకడలతో పర్యావరణాన్ని నాశనం చేస్తే మాత్రం కష్టాలు తప్పవు. అక్కినేని కుటుంబరావు “కొల్లేటి జాడలు” నవల సారాంశం ఇదే. పైకి సింపుల్‌గా అనిపిస్తున్న ఈ విషయాన్ని అర్థంచేయించడం అంత తేలిక కాదు. క్లిష్టమైన ఈ కసరత్తుని సునాయాసంగా చేస్తూ పాఠకులకు ఈ ఎరుక కలిగించగలిగారు రచయిత.

ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఉన్న ఆ సరస్సు చుట్టూ వందలాది లంక గ్రామాలు.. అందులో నివసించే లక్షలాది ప్రజలు.. ఇదీ కొల్లేటి సరస్సు నిజ స్వరూపం! మరి, ఆరు దశాబ్దాల క్రితపు రోజుల్లో కొల్లేరు ఎలా ఉండేది..? అక్కడి జీవకళ ఏ తీరుగా ఉట్టిపడేది..? లంకగ్రామాల ప్రజలు ఎలా బతికారు..? వారి వృత్తులు, జీవనాధారాలు ఏమిటి? కొల్లేటితో, అక్కడి ప్రజలు ఎలాంటి సాంగత్యం కలిగి ఉండేవారు? ఆ జీవనచిత్రం ఇచ్చిన సందేశం ఏమిటి..? అన్న విషయాలు విపులంగా తెలుసుకోవాలంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొల్లేటి జాడలు నవల చదువుకోవడం ఉత్తమం. ఈ నవల చదువుతున్నంతసేపు పాఠకులు కొల్లేటి యాత్ర చేస్తారు. అక్కడి గతంలోకి జారుకుంటారు. తలమున్కలవుతారు. నవల ముగిసే సరికి చిక్కిశల్యమవుతున్న కొల్లేటి సరస్సు వర్తమానస్థితిని తలుచుకుని నిట్టూర్పు విడుస్తారు. ఇదీ ఈ నవల ద్వారా అక్కినేని కుటుంబరావు సాధించిన పరమార్థం.

akkineni kutumba rao

శ్రీనివాసరావు, రాధాకృష్ణలనే రెండు పాత్రల ద్వారా పాఠకులను కొల్లేటి తీరంలోకి ప్రవేశపెడతారు కుటుంబరావు. వారిద్దరూ అరవయ్యేళ్లు పైబడినవారు. చిన్నప్పుడు అక్కడి లంకల్లో పెరిగి పెద్దయి వేరే ప్రాంతాలలో స్థిరపడిన వారిద్దరూ తిరిగి కొల్లేటి ఒడ్డును దర్శించుకుని… అక్కడి పరిస్థితిని చూసి చిన్నబోతారు… బాధపడతారు. తమ బాల్యస్మృతులలోకి జారుకుంటారు. ఆ స్పందనల పరంపరే ఆసాంతం నవలలో ప్రతిఫలిస్తుంది.. ఒక్కసారి ఆ లోకంలోకి ప్రవేశించాక.. ఒక తేరుకోవడం సులువు కాదు. సహజసిద్ధమైన పరవళ్లతో అలరించే కొల్లేరు… అందులోని జీవరాశి…అక్కడి జీవన సరాగాలు… వలస పక్షుల గానాలు.. కొల్లేటి లంకల్లోని బతుకు లయలు నిలువెల్లా అల్లుకుపోతాయి. ఎంతగా ఈ నవల మనల్ని సంలీనం చేసుకుంటుందంటే.. చదువుతున్నంత సేపు కొల్లేటి తరంగాలు మనసు నిండా ముసురుకుంటాయి.

శ్రీనివాసరావు, రాధాకృష్ణలతో మొదలైన ఈ కథలో తర్వాత్తర్వాత పదులకొలదీ పాత్రలు పలుకరిస్తాయి. వాటి ద్వారా వందలాది తలపోతలు సంగమిస్తాయి.  అందులో కులమతాల రంగులంటాయి. కలుపుగోరు కబుర్లుంటాయి. వెలివేతల గాయాలుంటాయి. ఊరుమ్మడి కథలుంటాయి. అమాయక పిల్లల ఆటపాటలుంటాయి. పెత్తనాలు చేసే పెత్తందారులు, ఔదార్యం చూపే పెద్దమనుషులు ఉంటారు. కష్టాలు ఇష్టాల కలనేతగా వారి బతుకులు సాగిపోతుంటాయి. ఇలా రకరకాల పాయలుగా ఉన్నవారికి, భిన్న సమూహాలుగా ఉన్నవారికి సాగరాన్ని తలపించే కొల్లేరే పెన్నిధి. అదే వారి భుక్తికి ఆధారం. అక్కడే పంటలు పండిస్తారు. అక్కడే చేపలు పడతారు. అక్కడ మేత మేసి పశువులు జీవిస్తాయి. సాగినంతకాలం ఆ చల్లని తల్లిని నమ్ముకుని సుఖంగా, సంతుష్టిగా బతికేస్తారు. సాధరణ రోజుల్లో ఇదీ కొల్లేటి వాసుల ఆనాటి బతుకు చిత్రం.

అబ్బు! ఎంత హాయో కదా ఇలాంటి జీవితం అనుకుని సంబరపడకనక్కర లేదు. ఎందుకంటే… అప్పుడప్పుడూ కొల్లేరు ఉగ్రరూపం దాలుస్తుంది. వానలు, వరదలు ముంచుకొచ్చి… కొల్లేటి లంకలు జలదిగ్బంధానికి గురవుతాయి. అలాంటి సమయంలో అక్కడి ప్రజల కడగండ్లు చెప్పతరం కాదు. చేతికి అంది వస్తుందనుకున్న పంటని కొల్లేరు తన గర్భంలో కలిపేసుకుంటుంది. ప్రజలకి నిద్రాహారాలు లేకుండా చేస్తుంది. బతుకు తెరువుకి భరోసా దొరకదు. అయినా సరే కొల్లేటి వాసులు నిబ్బరం కోల్పోరు. ఆ విపత్తు తగ్గుముఖం పట్టగానే ఆ కొల్లేటి తల్లికి ఓ దండం పెట్టి మళ్లీ దైనందిన జీవితంలోకి అడుగుపెడతారు. ఇదీ సాధారణంగా అక్కడి ప్రజల అనుభవంలో మరో పార్వ్శం.

మనిషి ప్రకృతిశక్తి ఎదుర్కొంటూ సహజీవనం చేసే అద్భుత సాహస కృత్యమే కొల్లేటి లంకల్లోని జీవితమని ఈ నవల ద్వారా చెప్పుకొచ్చారు అక్కినేని కుటుంబరావు. ఇచ్చే శక్తితోపాటు తీసుకునే శక్తి కూడా ఒక సహజ వనరుకి ఉంటుందన్న ప్రకృతి ధర్మాన్ని సుబోధకంగా తెలియజేశారు. ఈ సహజ సూత్రంలో ఎక్కడ సమతౌల్యం లోపించినా అది మొదట ప్రకృతి మీద… ఆ తర్వాత మనిషి మనుగడ మీద ప్రభావం చూపుతుంది. ఈ చారిత్రక దృక్పథం లోపించిన స్వార్థపర శక్తుల చర్యలు కొల్లేటి జీవలయని ఎలా ధ్వంసం చేస్తూవచ్చాయో ఈ నవల చివరి అంకంలో ఆవిష్కరించారు రచయిత. తొలినాళ్లలో తమకు ఎన్ని కష్టాలు వచ్చినా కొల్లేరునే నమ్ముకుని బతుకు తెరువు సాగించారు అక్కడి లంకగ్రామాల ప్రజలు. అయితే అదంతా గతం. ప్రస్తుత పరిస్థితి వేరు. వర్తమాన సందర్భంలో మనుషులకి నిగ్రహం లేదు.

సొంత లాభం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చెట్టూ పుట్టా చెరువులు సరస్సులు అనే విచక్షణ లేకుండా ధ్వంసం చేస్తున్నారు. వ్యాపార, లాభాపేక్షల కోసం పచ్చని కొల్లేటిలో చేపల చెరువుల పేరిట చిచ్చుపెట్టారు. సహజ మత్స్య సంపదకి నిలయమైన కొల్లేటి ఒడ్డునే చెరువులు తవ్వి… చేపల పెంపకం చేపట్టడం అనే వికృత చర్యలను ఏమనాలి చెప్పండి..? ఏది జరగకూడదో అదే జరిగింది. చేపల అధిక దిగుబడుల కోసం మందులు- మాకులు వాడి నీటిని కలుషితం చేశారు. సహజ మంచినీటి సరస్సు అయిన కొల్లేటికే చేటు తెచ్చారు. ఈ విపరిణామానికి తోడు మరోవైపు కొల్లేటి అభయారణ్యం చాలా మేరకు ఆక్రమణలకు గురైంది. ఫలితంగా సరస్సు పరిధి కుంచించుకుపోయింది. ఈ మొత్తం పరిస్థితికి కొల్లేటి జాడలు నవల అద్దంపట్టింది. ఇక ప్రస్తుతంలోకి వస్తే ఇప్పుడు కొల్లేరు అభయారణ్యం పరిధి తగ్గించి.. ఆక్రమణలకు గురైన ప్రాంతంలో ఇళ్లపట్టాలు ఇవ్వాలన్న డిమాండ్‌ స్థానికుల నుంచి వినిపిస్తోంది. రాజకీయలబ్ది కోసం కొందరు నాయకులు ఆ డిమాండ్‌ని సమర్థించడంతో సమస్య మరీ జటిలంగా మారింది. ఇదీ ప్రస్తుతం కొల్లేటి తాజా చిక్కుముడి.

ఈ సమస్యకు పరిష్కారం దొరకడం కొంత కష్టమే కావచ్చు కానీ… అక్కినేని కుటుంబరావు తన నవలలో ఓ ప్రతిపాదన చేశారు. ప్రకృతి ప్రసాదితమైన కొల్లేరుకి ఏ హాని కలుగకుండానే… దానిపై ఆధారపడి ఎలా బతకవచ్చునో వివరించారు. అట్లూరి పిచ్చేశ్వరరావు పాత్ర ద్వారా చెప్పించిన అంశం అదే. కొల్లేటిలో సమష్టి వ్యవసాయం చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చునన్నదే ఆ ప్రతిపాదన. నిజంగా జరిగిందో…. కల్పనో తెలీదు కానీ…అది నిజంగానే కొల్లేటి కాపురాలను నిలబెట్టగలిగే గొప్ప ఆలోచన.

దానికి అధికారికమైన ఒక కట్టడి లేకపోబట్టి… కొనసాగలేదేమో అనిపించేలా నవలలో ఆ ప్రయోగం ముగిసింది. కానీ ఇప్పటి పరిస్థితులకు అన్వయించుకుని చూస్తే కొల్లేటి సమస్యని తీర్చగలిగే ఉపాయం మాత్రం తప్పక దొరుకుతుందని ఈ నవల ద్వారా అక్కినేని కుటుంబరావు సూచించారు. అంటే అదే తరహా ప్రయోగం ఇప్పుడు చేపట్టమని అర్థం కాదు. ఉభయ కుశలోపరిగా ఉండే ఆలోచన చేస్తే మాత్రం మంచి ఫలితం ఉంటుందన్నదే రచయిత ఉద్దేశం కావచ్చు. మొత్తంగా చెప్పాలంటే.. అక్కినేని కుటుంబరావు రాసిన కొల్లేటి జాడలు నవల… ఆ ప్రక్రియా పరిధిని అధిగమించి ఒక హిస్టారికల్‌ డాక్యుమెంట్‌గా కూడా కనిపిస్తోంది.

(నవల: కొల్లేటి జాడలు
రచయిత: అక్కినేని కుటుంబరావు
వెల: 100 రూపాయలు
నవోదయ, విశాలాంధ్ర, ప్రజాశక్తి, కినిగె
పుస్తకాల షాపులలో ప్రతులు లభిస్తాయి)

– ఒమ్మి రమేష్‌బాబు

 

మీ మాటలు

*