స్త్రీల సాహిత్యంలో సరికొత్త చైతన్యం ప్ర.ర.వే.

banner31

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక – ప్ర.ర.వే- ఇటీవల ఒక సాహిత్య చైతన్య కెరటం. వెల్లువలా రచయిత్రులని సమీకరించిన మేలుకొలుపు గీతం. ప్రాంతీయ స్థాయిలో మొదలైన ఈ వేదిక ఇప్పుడు జాతీయస్థాయిలో జయకేతనం ఎగరేయబోతోంది. ఈ విజయోత్సవ వేళ వేదిక నేతలతో సారంగ ముఖాముఖి.

1. ప్రప్రరవే మొదలుపెట్టి ఎంత కాలమయింది? ఈ సదస్సు లో ఎంత మంది సభ్యులున్నారు?

unnamedపుట్ల హేమలత :

2008 జనవరి 10,11తేదీల్లో అనకాపల్లి లో జరిగిన చర్చావేదిక ప్రరవే’ ఏర్పాటుకు నాంది పలికింది .
ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి రచయిత్రుల్ని అనకాపల్లి ఆహ్వానించి రెండు రోజులు చర్చలు జరుపుకున్నాం. ఆ సభల్లో స్త్రీవాద ఉద్యమాలు , స్త్రీలకు సంబంధించి అన్ని అస్తిత్వ వాదాలను గుర్తించి కలిసి పని చేయటం, స్త్రీల పై జరుగుతున్న దాడులకి వ్యతిరేక పోరాటాలు చేయటం , రచయిత్రులంతా ఎవరి అస్తిత్వాల్ని,భావజాలాన్ని వాళ్లు కాపాడుకుంటూ ఒకే వేదికపై కలిసి పని చేయటం అనే అంశాలపై సాధ్యా సాధ్యాల గురించి మాట్లాడుకోవటం జరిగింది . అనేక చర్చలు, అభిప్రాయాల అనంతరం దామాషా పద్దతి ప్రకారం అన్ని వర్గాల నుంచి అధ్యక్షులు, కార్య వర్గ సభ్యుల్ని ఎన్నుకోవటం జరిగింది . ఆ తాత్కాలిక కమిటీని ‘ మనలో మనం’ అని పిలుచుకున్నాం . దాన్నే ‘ ప్రజా స్వామిక రచయిత్రుల వేదిక’గా రూపొందించుకొని ఇప్పటి వరకు విజయ వంతంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం . ఇప్పటికి ఈ వేదికలో వంద మంది వరకూ సభ్యులున్నారు. ఈ జాతీయ సదస్సు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మరింతమంది సభ్యులు పెరుగుతారు. దీని ఫలితంగా స్త్రీల సమస్యలపై మంచి అవగాహన , కార్యక్రమాలు , ఆలోచనాత్మకమైన సాహిత్యం వెలువడే అవకాశం వుంది.

 

dscn0414

2. ప్రఇప్పటి వరకూ వేదిక ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించింది ?

DSC04676మల్లీశ్వరి :

2009 జనవరి 10,11 తేదీల్లో అనకాపల్లి లో మొదటిసారిగా ” సవాలక్ష సవాళ్ళ మధ్య భిన్న అస్తిత్వాలు – ఒక ఉమ్మడి ఆకాంక్ష ”, ” గతానుభవాలు ఎలాంటివైనా ఆశ లెపుడూ నిత్య నూతనమే ” అన్న ఆశతో అవగాహనతో ఉత్తరాంధ్ర రచయితలు, బుద్ధిజీవులు మనలో మనం నిర్వహణ కమిటీగా ( కె. ఎన్. మల్లీశ్వరి, కె. అనురాధ, ఇ పి యస్ భాగ్యలక్ష్మి, వర్మ, నారాయణ వేణు ) ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రచయిత్రులతో సంభాషణ చేసారు. అందరి ఆలోచనలూ ఒక్కటి కావడంతో వందమందికి పైగా రచయిత్రుల చర్చల ఆలోచనల అనంతరం మనలో మనం తాత్కాలిక కమిటీ ఏర్పడి కాత్యాయనీ విద్మహే ప్రతిపాదనను అంగీకరించి ఒక సంవత్సరం పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య సదస్సులను నిర్వహించింది.

 

IMG_0109

దళిత , తెలంగాణా స్త్రీల అస్తిత్వ సాహిత్యం పై వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో, ముస్లిం, రాయలసీమ స్త్రీల అస్తిత్వ సాహిత్యం పై కడప యోగి వేమన విశ్వ విద్యాలయంలో, బిసి,క్రైస్తవ మైనార్టీ, కోస్తాంద్ర స్త్రీల సాహిత్యంపై గుంటూర్ నాగార్జున విశ్వవిద్యాలయంలో సదస్సులను జరుపుకుని తిరిగి ఉత్తరాంధ్ర చేరుకొని , గిరిజన , ఉత్తరాంధ్ర స్త్రీల అస్తిత్వ సాహిత్యం పై ఆంధ్ర విశ్వవిద్యాలయం లో సదస్సుని నిర్వహించాము. అదే రోజు 2010 ఫిబ్రవరి 28వ తేదీన మనలో మనం తాత్కాలిక కమిటీ రద్దయ్యి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పడింది. రంగనాయకమ్మ తో చర్చా కార్యక్రమం , అరుంధతీ రాయ్ తో గోష్టి లాంటి వాటితో పాటు నరసాపురం వై ఎన్ కళాశాలలో , రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో, వరంగల్ కాకతీయలో ముమ్మారు, ఒంగోలులో, ఇంకా అనేక చోట్ల స్త్రీల సాహిత్యంపై అనేక రచయిత్రుల సహకారంతో సదస్సులు నిర్వహించుకున్నాము. ఇదంతా ఒకవైపు అకడమిక్ గా జరిగిన కృషి అయితే మరోవైపు దేశ వ్యాప్తంగా జరుగుతున్న అనేక సామాజిక ఉద్యమాలతో స్త్రీల సాహిత్యాన్ని అనుసంధానించాలన్న ఆశయంతో కొంత కృషి చేసాము . ముజఫర్ నగర్ మారణ కాండ, నిర్భయ ఘటన , వాకపల్లి అత్యాచార ఉదంతం, సోంపేట కాల్పుల ఘటన ,లక్షిం పేట దళితులపై దాడి, ఉత్తరాంధ్ర లో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనుల పోరాటాలకు సంఘీభావంగా నిలబడటం, రాష్ట్రవ్యాప్తం గా మైనింగ్ కి వ్యతిరేకంగా పోరాడటం , రాష్ట్ర విభజన సమయంలో ఒక చర్చా కార్యక్రమం ద్వారా రెండు ప్రాంతాల రచయిత్రులూ కలిసి మాట్లాడుకుని చిన్న చిన్న అపోహలను తొలగించుకుని తమ ప్రణాళికలో రాసుకున్నట్లుగానే తెలంగాణా ఏర్పాటును స్వాగతించడం లాంటి కార్యక్రమాలు జరిగాయి. కొత్త తరాన్నిగుర్తించడంలో భాగంగా ఉత్తరాంధ్రలో ఇంపాక్ట్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకి తన పూర్తి సహకారాన్ని అందించింది సాహిత్యం ప్రధాన రంగం కనుక సామాజిక చలనాలను వివిధ ప్రక్రియల ద్వారా అక్షర బద్ధం చేయడం, వీధినాటకాల ద్వారా సామాన్య ప్రజలకు చేరువలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాము. రచనా శిల్పం మీద కొంత చర్చ ,కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో దాని మీద కూడా ధ్యాస పెడతాము.

3. ప్ర ప్రరవే ప్రచురణల వివరాలు చెప్తారా?

DSC04676మల్లీశ్వరి :
ప్రచురణ రంగంలో ప్రరవే అవసరానికి,ఆసక్తికి,బాధ్యతకి తగినంత కృషి చేసిందని చెప్పలేము. కానీ తన ఆర్ధిక శక్తికి మించి ప్రచురణలు చేసింది. వివిధ సెమినార్లు,వివిధ సాహిత్య సామాజిక సందర్భాల్లో ఇంచుమించు 300 వందల వరకూ వ్యాసాలు వెలువడ్డాయి. కథ, కవిత్వం లాంటి సృజనా తక్కువేమీ కాదు.
ఇప్పటి వరకూ 5 పుస్తకాలు ప్రరవే ప్రచురణలుగా వెలువడ్డాయి.

కవిని – పోరాడితేనే రాజ్యం -తెలంగాణా ఉద్యమ గాధలు
మల్లీశ్వరి – మల్లీస్వరం – సాహిత్యవ్యాసాలు , కాలమ్స్
మల్లీశ్వరి – ఓల్గా నవలలు – ప్రభావశీలత – పరిశోధనా గ్రంథం
అనిశెట్టి రజిత, బండారు విజయ – ముజఫర్ నగర్ మారణ కాండ- నిషిద్ధ మేఘాల్లోకి మా యాత్ర
అనిశెట్టి రజిత,కొండేపూడి నిర్మల,శివలక్ష్మి, టి.నళిని,కె. సుభాషిణి సంపాదకులుగా – అగ్నిశిఖ – స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించి రచయిత్రుల స్పందన –
సంకలనం

4. ప్ర ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి లో ఉన్న ప్రరవే ఇప్పుడు జాతీయ స్థాయి కి ఎదిగిందని ఈ సదస్సు ప్రకటన వివరాలు చూస్తె తెలుస్తోంది . ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ స్థాయి లో సమావేశాలు నిర్వహించటం ఇదే మొదటి సారా?

dscn0573కాత్యాయని విద్మహే :

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ట్ర స్థాయి నిర్మాణం గా ప్రారంభం అయిందే కానీ రాష్ట్రానికి పరిమితం కాదు . ప్రజాస్వామిక చైతన్యంతో తెలుగులో రాస్తున్న స్త్రీలు ప్రపంచం లో ఎక్కడ ఉన్నా దీనిలో సభ్యులు కావచ్చు . వేదిక లక్ష్యాలకు ,విలువలకు అనుగుణం గా తమ తమ ప్రాంతాలలో పని చేయవచ్చు . ఇతర రాష్ట్రాలలోని తెలుగు రచయిత్రులతో పరిచయాలు పెంచు కొనాలని ,అక్కడ వేదిక శాఖలు ఏర్పడేలా చూడాలని ముందు నుండి అనుకుంటున్నదే . అయితే అందుకు సమయం ,సందర్భం తెలంగాణా రాష్ట్రం ఏర్పడటం తో కలిసి వచ్చాయి. 2014ఏప్రిల్ లోఒంగోలు లో జరిగిన రెండవ మహా సభలో రెండు రాష్ట్రాలకు రెండు శాఖలు ఏర్పడటంతో ఇది జాతీయ స్థాయి వేదిక అయింది . ఢిల్లీ సాహితీ మిత్రుల సహకారం తో ఇప్పుడిలా జాతీయ స్థాయిలో మొదటిసారి సమావేశాలు నిర్వహించ గలుగుతున్నాం .

 

1078762_311578862328506_6767211798998622755_o

5. ప్రఈ జాతీయ సదస్సు లో ఓల్గా, మృణాళిని, కుప్పిలి పద్మ, ఎం. విమల లాంటి వారు తప్ప మిగతా వారంతా మీ ప్రరవే సభ్యులే కదా! సాధారణం గా ప్రరవే సభ్యులు కాని రచయితలకు మీ సదస్సు లలో పాల్గొనే అవకాశం ఉంటుందా?

dscn0573కాత్యాయని విద్మహే :

అవును . ప్రరవే సభ్యులే . ఆసక్తి తో, ఉత్సాహంతో, ప్రరవే నిర్మాణం లో భాగమై పనిచేస్తున్న వాళ్ళను స్త్రీల సాహిత్య అధ్యయన విశ్లేషణలో సుశిక్షితులను చేసుకొనటం ,మరీ ముఖ్యంగా ఆదిశలో కొత్త తరాన్ని తయారు చేసుకోనటం అవసరం అని వేదిక భావిస్తుంది . అందుకే ఒక్కొక్క సమావేశం లో కొందరు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తుంది .సాధారణం గాఒక సదస్సు అనుకున్నప్పుడు ఆయా అంశాలలో నిష్ణాతులైన వారిని గుర్తించి ఆహ్వానించటం జరుగుతుంది . వాళ్ళను వినటం ద్వారా ప్రరవే సభ్యుల జ్ఞాన చైతన్యాలు వికసిస్తాయి అని మా నమ్మకం . ప్రరవే సభ్యులు కాని వాళ్ళు ఆ రకం గా మా సదస్సులలో పాల్గొంటుంటారు .

6. ప్రఈ భారతీయ భాషల స్త్రీల సాహిత్యం అనేది విశాలమైన అంశం. దాన్ని ఒక రెండు రోజుల సదస్సు కు కుదించటం కొంత ఇబ్బందికరమైన విషయమే . అయినప్పటికీ ఇందులో తమిళం, కన్నడం , ఒరియా లాంటి ముఖ్యమైన భాషల స్త్రీల సాహిత్య ప్రస్తావన లేకపోవటం ఒక ప్రధాన లోపం గా కనిపిస్తోంది. మీరేమంటారు?

unnamedపుట్ల హేమలత :
ఈ ప్రశ్నకి సమాధానం మీ ప్రశ్న లోనే వుంది కల్పన గారూ! రెండు రోజుల వ్యవధిలో జరుగబోయే అయిదు సమావేశాల్లో బెంగాలీ , హిందీ. మలయాళం, మరాఠీ , తెలుగు భాషల సాహిత్యాన్ని పరిచయం చేస్తున్నాం .ఈ సభల్ని డిల్లీ తెలుగు సంఘం వారు , ప్రజా స్వామిక రచయిత్రుల వేదిక, కేంద్ర సాహిత్య
అకాడెమీల సంయుక్తం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం .
ఈ సభల ముఖ్యోద్దేశ్యం తెలుగు మహిళల సాహిత్యాన్ని, భావజాలాన్ని,వివిధస్త్రీవాదఉద్యమసాహిత్యాన్ని మన తెలుగు రచయిత్రుల గళం తోనే దేశ రాజధాని వేదిక మీద వినిపించటం . ఆ ప్రాంతానికి తగినట్టుగా మరాఠి , బెంగాలీ , హిందీ భాషా సాహిత్యాల పరిచయంకూడా జరుగుతుంది . దక్షిణాది నుంచి తెలుగు మలయాళం భాషల సాహిత్యం ఎలాగూ ఉంది . భారత దేశంలో అన్ని ముఖ్యమైన భాషలలోను స్త్రీల సాహిత్యం విస్తృతంగా వచ్చింది. ఆ మాటకొస్తే అస్సామి , ఉర్దూ భాషల్లో కూడా బోలెడంత స్త్రీ సాహిత్యం ఉంది .ఏ భాషలో స్త్రీవాద సాహిత్యం వచ్చినా అధ్యయనం చేసి తీరాల్సిన విషయమే.
మీరుచెప్పిన దక్షిణాది భాషల సాహిత్యాన్ని ఈ సదస్సులో ఇప్పటికి పెట్టలేక పోవటం పెద్ద లోటే అనిపించినా కూడా ప్రరవే భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు అనేకంచేపట్టగలదని భావిస్తున్నాను.అప్పుడు తప్పని సరిగా అన్ని భారతీయ భాషలలో సదస్సులు ఏర్పాటు చేసే ఉద్దేశం వుంది .

7. ప్ర గతం లో స్త్రీవాద ఉద్యమ తోలి దశ లో అన్వేషి, అస్మిత లాంటి సంస్థలు స్త్రీల అస్తిత్వ సాహిత్యం కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహించాయి. మంచి పుస్తకాలు ప్రచురించాయి. వాటికి, ప్రరవే కి సిద్దాంత పరంగా కానీ, ఇతరత్రా గానీ ఎలాంటి పోలిక లేదా వైరుధ్యం ఉన్నది?

DSC04676మల్లీశ్వరి :
అన్వేషి అస్మిత లాంటి సంస్థలు ప్రచురించిన పుస్తకాలు స్త్రీవాద సాహిత్యానికి,ఉద్యమానికి చాలా దోహదపడ్డాయి. విస్మృత చరిత్రలను వెలికితీయడంలో కొత్త తోవలను నిర్మించాయి. స్త్రీవాదాన్ని ఒక ప్రాపంచిక దృక్పథంగా తెలుగు సమాజానికి పరిచయం చేసాయి.

మిత్ర సంస్థల మధ్య పోలికలు, వైరుధ్యాలన్న ప్రశ్నే కొంత ఇబ్బందికరం. ప్రరవే నిర్మాణయుతమైన స్వతంత్ర సంస్థ. ఇప్పటి వరకూ రచయిత్రుల సొంత ఖర్చుతో నడుస్తున్నది. సెమినార్ల నిర్వహణకు విశ్వవిద్యాలయాలూ,కొన్ని కళాశాలలు, ప్రభుత్వ సాహిత్య సంస్థలు, ప్రజాసంఘాలు, సాంస్కృతిక సంస్థల సహకారం తీసుకున్నాము. ఇక్కడ రచయిత్రులు తమకీ, తమ సంస్థ అంతర్గత నిర్మాణానికీ సమాజానికీ,తమ రచనకీ మాత్రమే జవాబుదారులు.

అట్లాగే పార్లమెంటరీ రాజకీయ పార్టీల సభ్యులు , స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అయిన రచయిత్రులకి ప్రరవేలో సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంటుందని నాలుగేళ్ళ కిందటి ప్రణాళికలో రాసుకున్నాము. పాటిస్తున్నాము.

ప్రరవే నిర్మాణం విభిన్నమైనది. జండర్ అస్తిత్వం సమాన సూత్రంగా అణచివేతకి గురైన అస్తిత్వాలకు ఉప అస్తిత్వాలకు దామాషా ప్రాతినిధ్యం ఉండటం వల్ల స్త్రీల మధ్య సమానత్వ సాధనకి బీజాలు పడతాయి అన్నది ఒక అవగాహన. స్త్రీవాదం అన్న మాట స్త్రీలందరి సమస్యలనూ రిప్రజెంట్ చేసేలా లేదని, వాడుకలో దాని పరిధి తగ్గిందన్న విమర్శతో దళిత రచయిత్రులు కొంత చర్చ చేస్తున్నారు.

8. ప్ర మరో ముఖ్యమైన ప్రశ్న –మీ సదస్సు టైటిల్ భారతీయ భాషల స్త్రీల సాహిత్యం నిన్న –నేడు – రేపు. కానీ సదస్సు వివరాలు చూసినప్పుడు కేవలం “ నిన్న “ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉంది. సదస్సు లో ఆఖరి సమావేశం మాత్రమే “ వర్తమాన స్త్రీల సాహిత్యం నేడు- రేపు” కు సంబంధించినది. అందులో వక్తల ప్రసంగ అంశాలు చూస్తే ఒక ప్రధాన లోపం స్పష్టం గా కనిపిస్తోంది. స్త్రీల అస్తిత్వ సాహిత్యం అందులోని సాదృశ్య వైరుధ్యాలు , దళిత స్త్రీల సాహిత్యం, మైనార్టీ స్త్రీల సాహిత్యం, రేపటి స్త్రీల సాహిత్యం, కొన్ని ప్రతిపాదనలు. అస్తిత్వ సాహిత్యం అంటే అందులో వర్తమాన స్త్రీల సాహిత్యం లోని అన్నీ ప్రధాన ధోరణులు వస్తాయి. అయినప్పటికీ ప్రత్యేకంగా దళిత, మైనార్టీ స్త్రీల సాహిత్యం ప్రముఖంగా చర్చించటం బావుంది. కానీ వర్తమాన సాహిత్యం లో ప్రక్రియలకు ( అంటే కథ, కవిత్వం, నవల లేదా సాహిత్య విమర్శ) సరైన చోటు కనిపించటం లేదు . అలాగే సాహిత్య విమర్శా అనేది ప్రధాన అంశం. స్త్రీల సాహిత్యం బలాబలాలు సరైన సాహిత్య విమర్శ వల్లనే తెలుస్తుంది. స్త్రీల సాహిత్య విమర్శ కొంత బలహీనంగా ఉన్నప్పటికీ ఈ సదస్సు లో అసలు స్థానం కల్పిం చకపోవటం గురించి మీరేమంటారు?

 

dscn0573కాత్యాయని విద్మహే :

భారతీయ భాషలలో స్త్రీల సాహిత్యం; నిన్న -నేడు -రేపు అనే శీర్షికతో సదస్సునిర్వహిస్తూ నిన్నకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారేమిటి అన్న్స్ది మీ ప్రశ్నలలో ఒకటి . స్త్రీల సాహిత్య చరిత్ర గతిని నిరూపించటం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. నిన్న అంటే ప్రాచీన యుగమని ,నేడు అంటే ఆధునిక యుగం అని నిర్వచించుకొని ఈ రెండు యుగాలలో వచ్చిన సాహిత్యం ప్రాతిపదికగా రేపటి స్త్రీల సాహిత్య స్వరూప స్వభావాలను సంభావించాలనే తలంపు తో రూపొందించిన సదస్సు ఇది.
ఆధునిక యుగ స్త్రీల సాహిత్యాన్ని విస్తృతి దృష్ట్యా 1857నుండి 2000ల సంవత్సరం వరకు- రెండు సమావేశాలలో చర్చిస్తున్నాం . 2000వరకు సాహిత్యం అంటే అందులో నేటి సాహిత్యం ఉంటుంది కదా! ఇక మిగిలినది 14 సంవత్సరాల కాలం . ఈకాలపు సాహిత్యాన్ని కూడా కవిత్వం ,కధ ,నవల,నాటకం, అని
ప్రక్రియ పరం గా చర్చిస్తే బాగుండేదని మీరు అంటారు . బాగానే ఉండేది కానీ రేపటి సాహిత్యం గురించి ఊహలు ,ప్రతిపాదనలు చేయటానికి అది సరిపోదు . మొత్తంగా స్త్రీల సాహిత్య ధోరణులు ,స్త్రీల సాహిత్యంలో సాధారణంగా ఉండే అంశాలు ,ప్రత్యేకతలు ,దృక్పధాలు ,వాటిల్లోని వైవిధ్యం తెలియటం అవసరం .

గత పది పన్నెండేళ్ళ గా వీటి గురించిన చర్చ సంఘర్షణ ,సంవాదమూ తీవ్రం గ జరుగుతున్నది కనుక ఆ వైవిధ్యం పై దృష్టి పెట్టి ఈ చివరి సమావేశాన్నిఈ విధం గా ఏర్పాటు చేసాం . ఒక సదస్సు కు రూపకల్పన చేసేటప్పుడు వీలయినంతవరకు ఇంతకు ముందు జరిపిన అంశాలు పునరావృత్తం కాకుండా చూసుకుంటాము . 2012 లోప్రరవే మహాసభ సందర్భంగా రెండు దశాబ్దాల (1990-2010) స్త్రీల సాహిత్యం పై- కొందరు రచయిత్రులను ఎంపిక చేసుకొని వారి సాహిత్య విశ్లేషణ లతో – సదస్సునిర్వహించాం . అలాంటి సదస్సులు ఇంకా అనేక మంది రచయిత్రుల రచనలను పరిచయం చేస్తూ జరగాల్సే ఉంది . ప్రస్తుత సదస్సు చట్రంలో అందుకు అవకాశం లేక పోయింది . దళిత బహుజన మైనారిటీ స్త్రీల సాహిత్యం పై పత్రం ఉంది కదా !అందువల్ల లోటు ఉండదనే అనుకుంటాను .

స్త్రీల సాహిత్య విమర్శకు ఈ సదస్సు లో చోటు లేక పోవటం గురించి అడిగారు … స్త్రీల సాహిత్య విమర్శ శ్రద్ధ పెట్టాల్సిన ప్రక్రియ అని మేము కూడా భావిస్తాం .” రెండు దశాబ్దాల స్త్రీల సాహిత్య గమనం గమ్యం అనే సదస్సు (2012)లో స్త్రీల సాహిత్య విమర్శ పై మూడు పత్రాలకు అవకాశం కల్పించాం కూడా . అయితే ఈ సదస్సును సృజన సాహిత్య ప్రక్రియలకే పరిమిత చేసాము . వ్యాసం , విమర్శ ఆలోచనకు సబంధించినవి కనుక వాటిపై ఎప్పుడైనా ప్రత్యేకం గా సదస్సు నిర్వహించాలని అనుకుంటున్నాం .

 

9. ప్ర గత కొద్ది కాలం గా కొందరు రచయిత్రులు స్త్రీ వాద ముద్ర కు దూరం గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అదే తరహాలో రచనలు చేస్తున్నారు కూడా. మరి అలాంటి వారి సాహిత్యానికి మీ సదస్సు లో చోటు ఇచ్చినట్లు నాకు కనిపించలేదు. మీరేమంటారు?

unnamedపుట్లహేమలత :

ప్రరవే సదస్సులో పాల్గొంటున్న రచయిత్రులంతా స్త్రీవాద ముద్ర ఉన్నవారే అని మీరు చెప్పకనే చెప్పారు :) స్త్రీవాద సాహిత్యాన్ని అర్ధం చేసుకోవటంలో సంప్రదాయక పాఠకుల్లోకి ఒక విరుద్ద భావజాలం ప్రవేశించిందేమో అనిపిస్తుంది.శరీర స్పృహ , లైంగిక స్పృహ , స్వతంత్ర భావజాలం వంటి అంశాలు పత్రికల్లో పదే పదే బహిరంగ చర్చకి రావటం ,ఆధునికులు ,అభ్యుదయ వాదులే తీవ్ర విమర్శలు చేయటం వల్ల రచయిత్రులు స్త్రీవాదులమని చెప్పుకోవటానికే భయ పడుతున్నారు . అందువల్లే నేను రచయిత్రిని అని చెప్పుకోవడానికి గర్వ పడేవారు , స్త్రీవాదిని అని చెప్పుకోవటానికి సిగ్గు పడుతున్నారు . తరతరాలుగా స్త్రీల అంగాంగ వర్ణనల్ని,శృంగారాన్ని సాహిత్యం పేరుతో చదువుతున్న సాంప్రదాయ వాదులకి ఈ తరం స్త్రీలు శరీర స్పృహతో తమ మనోద్వేగాలను కవిత్వీకరిస్తే అది వాడ కవిత్వం , నీలి కవిత్వం లా కనిపించింది.మనిషికి శరీరమూ, మనసూ వేర్వేరు కాదు. స్త్రీకి కూడా అంతే. శరీరపు ఉద్వేగాలు, బాధలూ కవిత్వానికి పనికి రావంటే గృహ హింస , ఆసిడ్ దాడులు, చంపి తగలబెట్టటం వంటి చర్యలతో ఎంతో మంది స్త్రీల శరీరాల్ని హింసించినప్పుడల్లా లింగబేధం మరిచి ఎందుకు ఉద్యమాలు చేస్తున్నాం?

దళిత బహుజన , మైనార్టీ స్త్రీల అస్తిత్వ సాహిత్యం రావటం మొదలయ్యాక వారి రచనల్లో కొత్త వస్తువు , ధోరణులు చోటు చేసుకున్నాయి.అట్టడుగు సమాజంలోని స్త్రీల మట్టి బ్రతుకులూ,ఇంటా బయటా అణచివేతలూ ,కాయకష్టం, ఆకలి పోరాటాలూ తమ సొంత గొంతులతో వినిపించారు. ఈ సాహిత్యం చదివి స్త్రీని అర్ధం చేసుకున్న వారు స్త్రీవాదులమని చెప్పుకోవటానికి సిగ్గుపడరు. ఇప్పుడు ప్రరవే తరపున మేము నిర్వహిస్తున్న సదస్సులన్నింటి లో అస్తిత్వ స్త్రీవాదాలు కేంద్రంగా ఎన్నో పత్ర సమర్పణలు జరిగాయి . పత్రాలు సమర్పించిన వారితో పాటు , పాల్గొన్న వారు కూడా స్త్రీ వాదం పై ఒక అవగాహన ఏర్పరుచుకుంటున్నారు . ఆ స్పృహ తో రచనలు చేయటం కూడా జరుగుతూ ఉంది . ప్రతి రచయిత్రీ తన రచనల్లో ఏదో సందర్భంలో తన ఆత్మ గౌరవాన్నీ , హక్కుల్నీ ప్రశ్నించి తీరుతుంది. అందుకని ప్రరవేలో అన్ని వర్గాల రచయిత్రులూ ఉన్నారనే భావిస్తున్నాను.

 

 

Kalpana profile2ఇంటర్వ్యూ : కల్పనారెంటాల

మీ మాటలు

 1. ప్రసాద్ says:

  ప్రరవే సిస్టర్స్‌కి అభినందనలు, ఇంకా Best Wishes..
  స్త్రీవాద ముద్ర పట్ల విముఖతను గురించి,
  స్త్రీవాదాలలో కొత్త చైతన్యాన్ని గురించీ
  Feminism: A Very Short Introduction అన్న ఈ పుస్తకంలో
  (పేజీలు 3-5; 137-141) బ్రిటిష్ స్త్రీవాదుల అనుభవం ఉంది.
  బహుశ పనికొస్తుంది:
  http://wlxt.whut.edu.cn/new/ddxfzzsc/attachments/2/6/Feminism.pdf

  ప్రసాద్

 2. sumana koduru says:

  ప్రరవే ఆహ్వానాన్ని అందుకుని ఎంతో ఉత్సాహంతో కొత్తగా ప్రరవే కుటుంబంలో చేరి అందరితో కలిసి ఆనందంగా వచ్చాను.
  అద్భుతమైన ఆతిద్యం అనంత సాగరం లాంటి సాహిత్యం పై ఒక గోదారంత అవగాహన ఏర్పరుచుకుని అంతులేని మానసిక ఆనందంతో , మేధో వికాసంతో మరలుతున్నాను.

మీ మాటలు

*