రాదే చెలీ … నమ్మరాదే చెలీ ..(అనబడు ) త్రిబుల్ స్టాండర్డ్స్ కథ

Kadha-Saranga-2-300x268

“ఎక్కడికలా వెళ్తున్నారు స్వామీ.. తమరు ? “ అరిషడ్వర్గాలను దాటి, స్వర్ణ స్వర్గ ద్వారాలను, దాటుతున్న నారదుడు ఆగి వెనక్కు చూసాడు. ద్వారకాపరి , ఎక్సేక్యూటివ్ సూట్ లో , మెడలో వో ఐడెంటిటీ కార్డ్ ఉన్న తాడు తో , ఉన్న అతన్ని విచిత్రంగా చూసాడు నారదుడు. .. ఒక్క సారిగా ఉలిక్కిపడ్డట్టు , తన వేషధారణ ను చూసుకున్నాడు.

నేనే నారదుడ్ని ! గుర్తు పట్టలేదా ? “ అన్నాడు నారదుడు, సంకోచంగా ..

“ అయ్యో .. గుర్తుపట్టకేం స్వామీ.. రెగ్యులర్ విజిటర్స్ లిస్టు లో మీ పేరుంది. మా డేటా చాలా ఆప్డేటెడ్ ..” గర్వంగా చెప్పాడు ద్వారకాపరి.
“ డేటా.. రెగ్యులర్ విజిటర్స్ ..!” ఏదో ఆలోచిస్తూ గొణుక్కున్నాడు నారదుడు. “ ఈ మధ్య మా పద్ధతులు అన్నీ మార్చాం స్వామీ.. మీరు ఎటు వెళ్ళాలో చెప్తే , నేను లే అవుట్ డీటైల్స్ ఇస్తాను. మొత్తం తిరుగుతారా.. ఇంద్రుల వారి కార్పొరేట్ ఆఫీసు చాలా బాగా వచ్చింది లెండి.. అలాగే నరకంలో , స్వర్గంలో అన్ని క్లాసుల వాళ్ళకీ తగిన ఏర్పాట్లు చేసారు.

నారదుడికి కొంచం తల తిరిగినట్టు అయి, తమాయించుకొని, తెలివిగా అడిగాడు “ అన్నీ చూస్తాను , చూడొచ్చు కదా “
రెట్టించిన ఉత్సాహంతో ద్వారకాపరి – “ చూడొచ్చు గానీ స్టేజిల వారీగా పాస్సెస్ ఉంటాయి. ఒక్క నిమిషం మా కస్టమర్ కేర్ వాళ్లకి మాట్లాడి కనుక్కుంటా ఉండండి”

నారదుడి అయోమయం ఎక్కువైంది.. ఇంక పిలవకుండా, చెప్పా పెట్టకుండా వచ్చి.. నారాయణ నారాయణ అంటూ తిరగటానికి వీలు లేదా.. హ్మ్మ్.. మొన్నటిదాకా బానే ఉన్నారు కదా ఏమైంది వీళ్ళకి.. !
నారదుడి కళ్ళల్లో ఆశ్చర్యం గమనించినట్టే ఉన్నాడు అతను. చెప్పటం మొదలెట్టాడు .. “ చాలా శిక్షలకి ఇప్పుడు భయపడే పాపులూ.. స్వర్గం అంటే ఉత్సాహపడే పుణ్యాత్ములూ తగ్గిపోయారు స్వామీ.. ఆ ప్రకారం మా సర్వే లో తేలింది. యమ ధర్మరాజుల వారికి ఇది కొంచం నామోషీగా తోచి, పూర్తి వ్యవస్థాగత మార్పులు చేద్దామని అనుకున్నారు. దానిలో భాగంగా స్వర్గ నరకాల లే అవుట్ మార్చేసారు ..!”

“కానీ.. ఇంత వేగంగా “– నారదుడి మాట పూర్తి అయ్యేలోగా అందుకున్నాడు అతను.
మా యమ కాలం ప్రకారం పెద్ద కష్టం అవలేదులే స్వామీ.. నేను లాగిన్ అయి టైం కౌంట్ అయింది, ఎక్కువసేపు మీతో మాట్లాడితే, నా జాబు లో నాకు ఇబ్బంది .. మీకోసం అన్ని డిపార్టుమెంటుల కీ , ఆక్సెస్ తీసుకున్నాను. వెళ్తారా లోపలి? “-
ముందు ఎటు వెళ్ళమంటావు నాయనా .. ఇప్పటికే నాకు, ఇక్కడ మార్పులకి తల తిరుగుతోంది, – అన్నాడు నారదుడు నీరసంగా .
ఎవర్ని ముందు చూడాలనుకుంటున్నారో , వాళ్ళతో మొదలెడితే బెటర్ , ముఖ్యంగా ప్రోపర్ టైం మేనేజ్మెంట్ వల్లనే ఎఫిషిఎన్సీ బాగా పెరుగుతుంది, విజిటర్స్ కి సులువు అవుతుంది అని మా ట్రైనింగ్ లో చెప్పారు – అతను ఇంకేదో చెప్పబోయేటంతలో , నారదుడు అడ్డుకున్నాడు , ఇంకెంత క్లాస్ పీకుతాడో అని భయపడ్డట్టుగా..
“ సతీ సుమతి దగ్గరకి వెళ్తాను నాయనా , ఆ మహా తల్లిని చూసి చాలా కాలం అయింది .. తర్వాత, ఇంద్రుల వారి దగ్గరికి “ – అన్నాడు సాలోచనగా నారదుడు.
చకచకా తన ముందున్న కంప్యూటర్ మీద ఏదో టక టక కొట్టి , ఒకసారి నారదుడి కి ఒక ఫోటో తీసాడు అతను, తన చేతి లో ఉన్న చిన్న మెషీన్ తో, వెంటనే , నారదుడి ఫోటో ఐడెంటిటీ కార్డ్ ప్రింట్ తీసి , నారదుడికి ఇచ్చి- వెళ్ళండి స్వామీ.. మీ టైం మొదలు, మీవరకూ ఇంత టైం అని లేదు గానీ, ఎన్ని గంటలు ఎవరితో ఉన్నారు అనేది , రికార్డు మాత్రం అవుతుంది , కొన్ని కొన్ని సార్లు, కొన్ని సంభాషణలు , క్వాలిటీ పర్పస్ కోసం రికార్డు చేస్తాం . ముందే చెప్పటం మా విధి – అని చెప్తూ నారదుడి మొహం కూడా చూడకుండా , విధుల్లోకి వచ్చే యమ కింకరుల జాబ్ కార్డ్ లు పంచ్ చేయటంలో , అది చూడటంలో ములిగిపోయాడు.
నీరసంగా నారదుడు అలవాటైన దారిలో కదిలాడు .. నారాయణ నారాయణ అనటం మరచి ..!

***

తన డీలక్స్ కాటేజ్ తలుపు తీసిన సుమతి మొహం విప్పారింది. “ ఎన్నాళ్ళకు స్వామీ , దర్శనం , మీరీమధ్య రావటం మానేశారు “ – నారదుడ్ని అభిమానంగా ఆహ్వానిస్తూ పలికింది సుమతి .
వస్తూనే ఉన్నానమ్మా .. మిమ్మల్ని చూడటం పడలేదు .. ఈ మధ్య అన్నీ యేవో మార్పులు జరిగినట్టు ఉన్నాయి ..!”- సందేహంతో నారదుని గొంతు
“ మంచి మార్పులేలెండి .. నాకు కొంచం ఊసు పోతోంది.. మా గదిలో టీవీ కూడా పెట్టించారు యమ ధర్మరాజుల వారు.”- సంతోషంతో పలికింది సుమతి గొంతు
“ అవునా.. శుభం ..మీ శ్రీవారేరీ.. ?” అల్ట్రా మోడరన్ గా ఉన్న గదిలోకి అడుగు పెడుతూ అడిగాడు నారదుడు.
‘ ఏదో మూల ఉండి ఉంటారు.. ఆయనతో ఒక బాధ కాదు కదా స్వామీ నాకు ..?” జీరలాంటి గొంతుతో ఆవేదనగా పలికింది సుమతి స్వరం.
“ ఈ దిక్కుమాలిన స్వర్గం లో , పూర్వకాలపు పతివ్రతలతో , బాధ పడుతున్నది .. నువ్వా ..నేనా ..?”
‘- చికాకైన , గరుకైన స్వరం వినవచ్చి, వెంటనే నారదుడు త్రుళ్ళిపడి సర్దుకున్నాడు. – “ బాగున్నావా నాయనా .. ?” అని పలకరించగానే ఖస్సుమన్నాడు సుమతి మొగుడు ..!
“ ఏం బాగో, పతివ్రత మొగుడ్నయిన పాపానికి ఇలా స్వర్గంలో ఏడుస్తున్నాను .. ఇక్కడ అందరూ నీతులు చెప్పేవాళ్ళే తప్ప మామూలు మనుషులు లేరు … ఏ చెట్టూ పుట్ట ని కదిపినా , విలువలో , విలువలో అని ఏడుస్తాయి .. చూడండి ఎంత కళా విహీనంగా ఉన్నాయో.. సహజాతాలని అణచుకొని.. ఉంచుకున్నవాళ్ళు , ఊహించుకున్న వాళ్ళు నరకంలో పడి ఉంటె .. నా వరకూ ఇది స్వర్గం ఎలా అవుతుందీ ??” – అతను లావాలా వెళ్ళగక్కిన ఆవేశం వింటూ, సుమతి ఇచ్చిన తులసి టీ తాగుతున్నాడు నారదుడు.
“ అది కాదు నాయనా .. !” – ఏదో చెప్పబోయాడు నారదుడు
‘ ఇదిగో.. ఇదంతా ఈవిడ వల్లే వచ్చింది.. ఏం లాభం ఈవిడ పాతివ్రత్యం.. ఇక్కడ టీవీ పెట్టుకొని చూడటానికి తప్ప.. ఈవిడేమో నన్ను సానివాడలకి నెత్తినెట్టు కొని తీసుకెళ్ళి, బోల్డంత పుణ్యం మూటగట్టుకుంది.. కనీసం వయసైపోయిన రంభా ఊర్వశి కూడా చూడనీయకుండా ..ఇక్కడో ప్రత్యక డీలక్స్ కాటేజ్ .. దానికితోడు, రోజూ టీవీ లో కొత్త కొత్త అమ్మాయిల ప్రత్యక్షం ..ప్రత్యక్ష నరకం అంటే ఇదే స్వామీ ..!” – వెళ్ళబోసుకున్నాడు .. సుమతి మొగుడు.
ఏదో చెప్పబోయిన నారదుడ్ని మాట్లాడనీయకుండా .. ఒక వెల్లువలా మాట్లాడటం మొదలెట్టాడు, సుమతి మొగుడు..
“ స్వామీ.. ఇక్కడ పిచ్చెక్కిపోతోంది, ఏమీ తోచదు . ఆవిడేమీ మాట్లాడదు. ఇక్కడ జనాలు నన్ను పురుగులా చూస్తారు. ఈ కాలపు ఆడవాళ్లకి ఉన్న మోడరన్ అవుట్ లుక్ లేదు, అంతా పాత రాచ్చిప్ప భావాలు. పై పై కి, కంప్యూటర్లు పెట్టుకొని పని కానిచ్చేస్తున్నారు .. అంతే .! ఈ కాలంలో పుట్టి ఉండి, భూలోకంలో ఎలాంటి బతుకు బతికినా , బాగుండిపోయేది ..లేదా ఈవిడ నన్ను తన పుణ్యం నుండి విముక్తి చేసినా, బాగుండేది !!”
“ఏమన్నారూ… ?”—కీచుగా ప్రశ్నించింది సుమతి
“ ఇప్పటికాలం లో బ్రతికేద్దామనా.. ఒకసారి ఇది చూడండి .. స్వామీ మీరు కూడా చూడండి .. !” అంటూ చేతిలోకి రిమోట్ తీసుకొని టకా టకా ఏదో నొక్కింది సుమతి ..!
“ఏమిటమ్మా ..ఇదంతా ?” గాభరాగా అడిగాడు నారదుడు.
“మీరుండండి స్వామీ.. ఇక్కడ నాకున్న ప్రివిలేజెస్ లో ఒకటి , లైవ్ టీవీ .. చూపిస్తా ఉండండి ..!! “ అంటూ ఏదో స్పీడ్ గా నొక్కింది ఆ రిమోట్ లో ..
నారదుడు , సుమతి మొగుడు చేష్టలుడిగిన వాళ్ళల్లా , టీవీ కి కళ్ళు అతికించారు ..
చిత్రం అయ్యారే విచిత్రం .. చిత్రం భళారే విచిత్రం “ – పాట రీమిక్స్ లో దూరంగా వినిపిస్తోంది

 

దృశ్యం-1 – పాయకరావు పేట , శ్రీనిధి ఇంటర్మీడియట్ కాలేజ్ వరండా

“ఏమే దొరికిందా ఆ లెక్కకి ఆన్సర్ .. చేసావా ?” రాగ ని అడిగింది ఆమె ఫ్రెండ్ సునీత
“———————-“ – పూర్తి నిశ్శబ్దం రాగలీన నుండి
మాట్లాడవేమే, షోకేస్ లో బొమ్మలా , అందంగా కనబడి భలే విసిగిస్తావు నీ నిశ్శబ్దంతో – నారింజ , తెలుపు కలిపిన చూడీదార్ లో , పసిమి ఛాయతో మిసమిసలాడుతున్న రాగలీన ఒక రంగుల హరివిల్లు లా ఉంది, వొత్తైన కనుబొమలు , తీర్చినట్టు ఉండే తలకట్టూ, ముఖ కవళికలు , – ఒక నిమిషం ఆగి చూడాలనిపించెంత సౌందర్యం , అంతే బేలతనం కూడా పోటీపడుతున్నట్టు ఉంటుంది రాగ .
“ అది కాదె , నాకా కామర్స్ లెక్కలు రావటం లేదు “ – బెదురుగా అన్నది రాగ
“ సర్లే, ఇది సంవత్సరం మొదటినుండీ ఉన్న పాటేగా, కొత్తేముంది ? వచ్చినట్టే చేయి ..ఇంకేం చేయగలం !” –సాలోచనగా అంది సునీత
“ కాదు ,ఈసారి అమ్మ వార్నింగ్ ఇచ్చింది. సెకండ్ ఇయర్ కూడా , ఫస్ట్ ఇయర్ లా తక్కువ వస్తే , CA ఎంట్రన్స్ వాటికి వెళ్ళలేవు, ఎలాగైనా CA చేయాల్సిందే అని , నాన్న కూడా అమ్మ ముందు చేతులెత్తేశారు .. ఇప్పుడు సెకండ్ ఇయర్ స్కోరింగ్ రాకపోతే , అమ్మ చంపేస్తుంది నీతా !” – కాస్త వణుకుతున్న గొంతుతో అంది రాగ
“ మరి ఏం చేయగలం ? ఆకాశంలో దేవుళ్ళని ప్రార్ధించు .. లేకపోతే …. – ఒక నిమిషం ఆగి , – అవినాష్ గాడ్ని పట్టుకో “ – అంది సునీత
“ హే .. మాస్టార్ని పట్టుకొని గాడు , గీడు అంటావేంటి ? , అయినా సారేం చేస్తారు ?” అడిగింది రాగ
“మన చున్నీలు పట్టుకొని తిరిగేవాడు, వాడు సారేంటి ? వాడో కుక్క ..!” కసిగా అంది సునీత
“ ఏంటే .. ఆ మాటలు ?” – వింతగా అడిగింది రాగ
“ వాడు మన క్లాసులో రేవతి తోని, ఇంకా సీనియర్స్ తో ఎలా ఉంటాడో నీకు తెలీదూ.. మీద మీద పడుతూ.. వాళ్లకి వూరికే రేంకులు వస్తున్నాయా .. ఇంటర్నల్స్ లోనూ, ఆ తర్వాత .. వాడు మీద పడతాడు, వీళ్ళు వయ్యారాలు పోతూ డవుట్లు అడుగుతారు. వాడు సాయంకాలం ఇంటికి రమ్మంటాడు. వాడి పెళ్ళాం ఊరెళితే సండే స్పెషల్ క్లాసులు ఎటూ ఉండనే ఉన్నాయి . మనకి రాని సబ్జెక్ట్ లో రాణి అవ్వాలంటే ఇదే మార్గం మరి, లేదా వచ్చినన్ని మార్కులు వస్తాయి అనుకొని నాలా ఊరుకో .. ఆ కుక్కని చూస్తేనే కంపరం , వాడిని ఎలా భరిస్తున్నారో వీళ్ళంతా “- విసుగ్గా అంది సునీత
“ కానీ అమ్మ చంపేస్తుందే, ఇప్పటికే తను CA అవ్వాలనుకుంది , CA గారి దగ్గర అకౌంటెంట్ అయిన మా నాన్న పెళ్ళాం అయింది.. నా మార్కులు చూసి పిచ్చెక్కిపోతోంది , ఏ రోజూ తిట్టకుండా భోజనం పెట్టటం లేదు నీతా..ఇప్పుడు మార్కులు రాకపోతే చచ్చిపోవటమే ఇంక!” ఒక్కసారి బావురుమంది రాగ
“పోవే పిచ్చీ .. నువ్వెందుకు చావాలి “ – సునీత గొంతు కూడా ఏదో అడ్డుపడ్డట్టు అయింది
“ఇదిగో రాగా, ఇది అవినాష్ గాడి నంబర్ .. నువ్వు కూడా కామర్స్ చదువుకున్నావు కదా .. Virginity doesn’t have a Depreciation.. శీలానికి తరుగుదల వేల్యూ లేదే పిల్లా .. నీ ఇష్టం చేస్తే చేయి వాడికి ఫోన్ .. చచ్చిపోయే పిచ్చి ఆలోచనలు చేయకు ..!” – ఒక్కసారి రాగ భుజం తట్టి, వెళ్ళిపోయింది సునీత
శిలలా కూర్చున్న రాగ కి, ఎప్పుడు సాయంత్రం అయిందో కూడా తెలీదు.. లాంగ్ బెల్ కొట్టేసారు . అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు
చేతిలో ఫోన్ నంబర్ రాసిన చీటీ , రాగకి తన ఫ్యూచర్ లా అనిపిస్తోంది. ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తోంది
వణుకుతున్న చేతుల్తో డయల్ చేసింది .. నంబర్ రింగ్ అవుతోంది, పెట్టేయనా అనుకుంది .. అంతలో “ హలో ఎవరు? “ అవినాష్ సార్ గొంతు
‘నేను రాగలీనాను సర్, కామర్స్ లో డవుట్లు ఉన్నాయి సర్.. మీరే హెల్ప్ చేయాలి సర్ .. CA చేయమని మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారు .. మీరే ఆదుకోవాలి సర్ “
పూర్తిగా చీకటి పడిపోయింది బయటంతా …!!

మరి ఏమంటారు స్వామీ.. ఇప్పటి అమ్మాయిల గోడు చూడండి , – దృశ్యం చేరిగిపోగానే నారదుడ్ని అడిగింది సుమతి.
“ వరం పని చేస్తోందో లేదో, అని కుంతి కనలా ఒకర్ని .. అప్పటినుంచీ సరదాకి, చిన్న చిన్న ఇబ్బందులకి శరీరాన్ని అడ్డుపెట్టుకోవటం అమ్మాయిలకి అలవాటేగా !”- హేళనగా అన్నాడు సుమతి మొగుడు.
‘ హ్మ్మ్.. మీకు అర్ధమైంది అంతే ..బలహీనత గల వ్యక్తులేగా మీలాంటి రసికులకి గొప్ప ప్రియురాళ్ళు ..” అని విసిరినట్టే చెప్పి.. “ పోనీ ఈ అమ్మాయి విషయం చూడండి స్వామీ.. !”

 

దృశ్యం -2 – డాట్ సర్వీసెస్ , కుకట్ పల్లి, హైదరాబాద్

తొమ్మిది గంటలు లాగిన్ టైం.. వచ్చానో లేదో అనుకుంటూ డాట్ సర్వీసెస్ మెట్లేక్కుతోంది తనూజ. ఇవాళ పోద్దుటినుండీ ప్రహసనమే .. లేవటం లేట్ అయింది , రాత్రి ఫణీంద్ర ఇంటికి వచ్చేసరికి రెండు.. తాగేసి పాకుతూ ఇంటికి తీసుకురాబడిన అతన్ని , మంచం మీదకు చేర్చేసరికి, రెండున్నర. అతను తిన్నది, తన మీద ఉన్న కోపం కక్కి, పడుకోనేసరికి మూడు. అప్పుడు హాల్లో దీవాన్ కాట్ మీద ఇలా నడుం వాల్చిందో లేదో, అప్పుడే – “అయ్యో.. అప్పుడే ఏడు అయిపోయిందా అంటూ “ అని వెలువడబోయిన కేకని ..ఇష్టం లేని పదార్ధం నోట్లో కుక్కుకున్నట్లు, నోట్లోనే మింగేసి లేచేసింది తనూజ.
అప్పటినుండీ, అష్టావధానం , శతావధానం లా అన్ని పనులూ చేసేసరికి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి, హాట్ప్యాక్ లో సర్ది, వీలైనంత రాత్రి చేసిన వీరంగం సర్ది, కొన్ని పనమ్మాయికి అప్పచెప్పి బయట పడేసరికి, ఎనిమిదిన్నర. సెల్ ఫోన్ మర్చిపోయింది. చేతికి అందిన చూడిదార్ వేసుకుంది. పైన టాప్ ఒక డ్రెస్ లోనిది, క్రింద కుర్తా మరొక డ్రెస్ లోనిది, నిజానికి దీని కింద కుర్తా లేదు లేగ్గింగ్స్ కదూ కొనుక్కున్నది .. అనుకుంది, మళ్ళీ –“ ఎందుకా లేగ్గింగ్స్? నీ తొడల లైనింగ్స్ మీ ఆఫీసు లో కనపడాలా ..? “ అని వ్యంగ్యం గా అనే , ఫణీంద్ర మాట గుర్తొచ్చి .. ఇంత హడావిడి లో కూడా , మళ్ళీ లూస్ కుర్తా వేసుకున్నానే ..అనుకొంది. ముసురు పట్టినట్టు ఒక నవ్వు మొలకెత్తింది , ఆమె అందమైన మోహంలో.
తనూజ వయసు ఇరవై ఏడు. పెళ్ళయి, ఏడేళ్ళు. పిల్లలు లేరు. ఫణీంద్ర , ఐ టీ లో పెద్ద ఉద్యోగంలో ఉండేవాడని, తనూజని ఇచ్చి పెళ్లి చేసారు. తనూజ తండ్రి, రాజమండ్రి దగ్గర ఒక చిన్న గుడిలో పూజారి. తనూజని, బి ఎస్సీ కంప్యూటర్స్ చేయించటం, వాళ్ళ కొంప కదిలినంత పనయింది. ఇంకా ఒక చెల్లెలు, తమ్ముడు చదువుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో, ఫణీంద్ర సంబంధం వాళ్లకి అనుకోకుండా , ఒక పెద్ద దక్షిణ దొరికినట్టు దొరికింది- తనూజ తండ్రి మాధవ శర్మ మాటల్లో చెప్పాలంటే.
ఏడేళ్ళలో మొదటి రెండేళ్ళు, తను ఎంత కట్నాలు వదులుకొని .. తనూజ ని చేసుకున్నాడో చెప్పి దెప్పటమే సరిపోయింది ఫణీంద్రకి. వీలున్నప్పుడల్లా.. వాళ్ళ ఫ్రెండ్స్ భార్యలు ఎంత సోషల్ గా ఉంటారో వర్ణించి , ఊదరగొట్టేవాడు.
ఫణి కి డబ్బు మీద ఆశ పెరిగింది, ఉన్న ఐ టీ జాబ్ మానేసి, బిజినెస్స్ పెట్టాడు. సౌత్ ఆఫ్రికా కొలాబరేషన్ అన్నాడు, అంతన్నాడు, ఇంతన్నాడు .. మొత్తానికి సేవింగ్స్ అంతా అవజేసి, అవశేషం గా  , సోషల్ డ్రింకింగ్ నుండి , బింజ్ డ్రింకింగ్.. అక్కడినుండి ఆల్కహాల్ అనబడే మెట్లు చకచకా ఎక్కేసాడు. తనూజ కి తన జీవితం తనే సినిమా లా చూసినంత పనయింది. డబ్బు కష్టాలు మొదలవగానే, ఫణి , తనూజని తన ఫ్రెండ్ కంపెనీ లోనే ఉద్యోగం లో చేర్పించాడు. గత ఆర్నెల్లుగా , తనూజ ఉద్యోగానికి అలవాటు పడుతూ ఉంది.
“ ఓహ్.. అప్పుడే వచ్చేసావే .. హడావిడిగా తయారయినా బావుంటావు నువ్వు “- మేనేజర్ గిరి నవ్వుతూ అన్నాడు. అక్కడ ఇంకో ఇద్దరు కొలీగ్స్, వ్యంగ్యం గా నవ్వుతూ .. పావుగంట లేట్ అయిందని అర్ధం అయింది తనూజ కి .
“బస్-కొంచం లేట్ “ తనూజ ఏం మాట్లాడుతోందో తనకే అర్ధం కాలేదు. “ఏం.. లేవటం లేట్ అయిందా.. మా ఫణి గాడు ఇంట్లో ఉన్నాడా ..?” సగం నవ్వునీ, హేళన నీ మిక్సీ లో వేసినట్టు ఒక నవ్వు నవ్వి అన్నాడు గిరి తనూజ కి అక్కడే కూలబడి ఏడవాలి అనిపించింది. కళ్ళు మూసుకుంది, చిన్నప్పటి గోదావరి గట్టు గుర్తొచ్చింది. సగం పేదరికం లో సంతోషం గుర్తొచ్చింది. ఇప్పటి ఉద్యోగపు అవసరం కూడా.
“ లేదు సర్ – రేపటినుండీ టైం కి వస్తాను ‘ – సిస్టం లో లాగిన్ అవుతూ చెప్పింది.
అప్పటిదాకా వాళ్ళ వాళ్ళ కన్సోల్స్ దగ్గర పని చేసుకుంటున్న మిగతా వాళ్ళు, తమ కంప్యూటర్ల వైపు తిరిగారు . ఏదో చేప వలలో పడ్డ సంతోషం కనిపించింది వాళ్ళల్లో తనూజ కు .
గిరి అటూ ఇటూ చూసి, దగ్గరగా వచ్చాడు , కంప్యూటర్ మానిటర్ మీద తానో ఫోటో ఫ్రేం లా వాలాడు. రెండు చేతులూ, దగ్గరగా అతని గడ్డం క్రింద పెట్టుకుంటూ .. !
“ ఏంటి తనూ.. ఎందుకింత కష్టపడటం.. ఇంత చిన్న ఉద్యోగంలో – అంత అందంతో – అవసరమా ? నేనెప్పుడో చెప్పాను , నాకు ఎక్జేక్యూటివ్ అసిస్టెంట్ గా చేరమని , ఒకేసారి పాతిక శాతం హైక్, పర్మనెంట్ కూడా అయిపోతావు, కంపెనీ లో నాకున్న పట్టు నీకు తెలుసుగా..ఇంకేం కావాలి ? మధ్య మధ్యలో , ఒక్కోసారి నాతో బెంగుళూరు , ధిల్లీ తిరగటమే గా ..మరీ వొళ్ళు అలసిపోయే పనులేం చెప్పనులే – ఫణి తో మాట్లాడతాను , అతను నిన్ను ప్రశ్నలు అడగకుండా చూసే బాధ్యత నాది .. ఒక రెండేళ్ళు నీవి కావు అనుకుంటే, ఒక ఫ్లాట్ కొనుక్కుందువు గానీ, కావాలంటే మీ తమ్ముడు , చెల్లి చదువు బాధ్యత కూడా చూసుకోవచ్చు ..ఏమంటావు ?”
నిశ్శబ్దం తనూజ మనసులో .. తల దించుకొనే ఉంది. క్షణకాలం ఆగిన గిరి
“ హ్మ్మ్.. నేను చెప్పవలసింది చెప్పాను . నీ ఇష్టం ఇక- అన్నట్టు నీకిష్టం అయితే ఇదిగో ఇక్కడ ఎక్స్తేన్స్హన్ ఫోన్ లో నా నంబర్ కలుపు, నా దగ్గర లేగ్గింగ్స్ ఉన్నాయోయ్, కావాలని అడుగు ..అయినా, ఈ ముసలి డ్రెస్ లు మానాలోయ్ నువ్వు – అందమైన శరీరం ఉండి ఏం లాభం ఏ రేఖ ఎలా ఉందొ తెలియకపోతే ?” – అని భళ్ళుమని తన జోక్ కి తనే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
కంప్యూటర్ చేతులు చాచి, వొళ్ళంతా తడిమినట్టు ఒక జలదరింపు తనూజ లో.
షిఫ్ట్ అవుతూ ఉంది. తనూజ పని చేస్తూనే ఉంది.. దూరంగా అద్దాల పార్టిషన్ నుండి గిరి కనిపిస్తూనే ఉన్నాడు.
సాయంత్రం అవుతూ ఉండగా ఎక్స్తేన్స్హన్ ఫోన్ డయల్ చేసింది తనూజ.
“ చెప్పు తనూ.. “ ఆత్రంగా గిరి గొంతు, – “ నేను ఈ వూరిలో లేగ్గింగ్స్ వేసుకోలేను !” తెలీని కంపన తనూజ లో
‘ ఓయ్.. తనూ.. మనం ఉన్నప్పుడు వేసుకుందువుగానిలే .. యు అరె స్మార్ట్ గర్ల్ .. తెలివిగా జీవితం నడుపుకోవటం నీకు తెలుసు ..!” ప్రశంశగా అన్నాడు గిరి .
షిఫ్ట్ పూర్తయింది. అందరూ ఒకేసారి లాగ్ అవుట్ అయి సిస్టమ్స్ షట్ డౌన్ చేస్తున్న శబ్దం , మాటలూ కలగాపులగం అయి, వురుముల్లా వినిపిస్తున్నాయి తనూజకి.
మెడలో బరువుగా ఉన్న, ఇంకా మిగిలి ఉన్న బంగారు మంగళ సూత్రాలు , బాగ్ లో వేసేసి , తను కూడా సిస్టం ఆపేసింది తనూజ ..!!
చూసారా స్వామీ.. ఇబ్బందులూ, మగవారూ, ఒకేసారి ఎలా చుట్టుముడతారో ఆడవాళ్ళని .. “ వేదనగా అడిగింది సుమతి ..!
‘ అవునమ్మా.. ఎటూ పోలేని స్థితి ,వివాహం అంటే .. కానీ , మరీ కొన్ని సౌఖ్యాల కోసం, శీలం వదులుకోవాల్సిందేనా.. ? ఎందుకో మనసు వొప్పుకోవటం లేదమ్మా .. “ ఆలోచనగా అన్నాడు నారదుడు ..!
“ ఊరుకో స్వామీ.. బ్రహ్మచారివి నీకేం తెలుసు .. వంశం నిలబడాలనో, మరే దరిద్రమో, వాళ్ళ కోడళ్ళని, పనిమనుషుల్ని , వ్యాసుడి దగ్గరకి పంపి, సంసారం చేయించలేదా .. విదుర నీతి ఆ ఉదారత లోంచి పుట్టిందే కదా ..!” పగలబడి నవ్వుతూ అన్నాడు సుమతి మొగుడు..
ఒకేసారి విచిత్రం, ప్రశంశ కలగలిపినట్టు మొగుడ్ని చూసి, చూపు తిప్పుకుంటూ చెప్పింది సుమతి – ‘ కష్టాలు, సరళ రేఖల్లా రావు స్వామీ.. వక్ర రేఖలూ, ఒక్కోసారి వికృత కోణాల నుండి కూడా వస్తాయి.. ఇది చూడండి .. మరో దృశ్యం “ అని రిమోట్ నొక్కింది ..!

 

దృశ్యం– 3 , అనాహైం , కాలిఫోర్నియా, అమెరికా

“జింగిల్ బెల్స్ , జింగిల్ బెల్స్ , జింగిల్ అల్ ది వే .. “ దూరంగా డిస్నీలాండ్ నుండి మ్యూజిక్ వినిపిస్తోంది.. వాష్ రూమ్ లో కూలబడి ఏడుస్తున్న పల్లవి .. ఒక నిమిషం ఏడుస్తున్నది తనేనా అనుకుంది.
గెస్ట్ వాష్ రూమ్ , కమ్మోడ్ లో , ముక్కలు ముక్కలైన పల్లవి పాస్ పోర్ట్ తేలుతోంది… తీద్ద్దామా అనుకుంది ఒక నిమిషం.. మళ్ళీ అందులో చేయిపెట్టి తీయాలన్న అసహ్యానికి , ఒక్కసారిగా వాంతి వచ్చినట్టు అయింది. వాష్ బేసిన్ లో , భళ్ళున వాంతి చేసుకుంది. నిన్న రాత్రి తిన్న , పాస్తా , ఇవాళ తినని నాస్తా రెండూ కడుపులో చేసిన గాభరా ఇంతా అంతా కాదు.
పల్లవి పాస్పోర్ట్ ని ముక్కలు ముక్కలు గా చేసి, విసిరేసి ఉమాకాంత్ ధడాల్న తలుపేసి , వెళ్ళిపోయి అప్పటికి రెండు గంటలయింది. ఈ మధ్య కాలంలో, వాళ్ళిద్దరి మధ్యా గొడవలు, అమెరికాలో వాతావరణంలా చాలా కంట్రోల్డ్ గా ఉంటున్నాయి. దానికి కారణం, ఉమాకాంత్ కి టైం లేకపోవటం. ఎం ఐ టీ లో మాస్టర్స్ చేసిన ఉమాకాంత్, చదువులో మేధావి. కేంపస్ లో నే జాబ్ ప్లేస్మెంట్ వచ్చిన అతనికి, ఉద్యోగం కూడా తనకి కావలసిన లాస్ అంజలిస్ ఏరియా లోనే వచ్చింది. వెంటనే ఉమాకాంత్ కి కంపెనీ వాళ్ళు ఒక మంచి లీజుడ్ హవుస్ ఇవ్వటం, ఒక పెద్ద సూట్ట్కేస్ తో ఉమాకాంత్ మూవ్ అయినప్పటికీ, వర్క్ వల్ల సగం ఆఫీసు లోనే ఉండటం కూడా జరిగింది. వెంటనే , అంతే సహజంగా వాళ్ళ అమ్మా, నాన్నాకి , ఉమా పాపం వండుకోలేడు అని గుర్తొచ్చి , పల్లవి ని సెలక్ట్ చేసారు.
పల్లవి , స్కూల్ లో ఫస్ట్, చదువుల్లో ఫాస్ట్ , బిహేవియర్ లో బెస్ట్ .. అని అనేవాళ్ళు, తనకి తెలిసిన వాళ్ళు. పల్లవి తండ్రి, ఇండియాలో మంచి ఉద్యోగమే చేస్తున్నారు. తల్లీ, తండ్రీ , మధ్య తరగతి మంచితనానికి ట్రేడ్ మార్క్ లా ఉంటారు. పల్లవి, తర్వాత ఇంకో అమ్మాయి వాళ్లకి. వీళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతే , ఒక కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ లో జాయిన్ అవుదామని తండ్రీ, అదేంటి..పిల్లలకి మన అవసరం ఉంటుంది అని తల్లీ .. నిత్యం ఆనందంగా కొట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో వచ్చిన , ఉమాకాంత్ సంబంధం వాళ్ళకి “సూటబుల్ బాయ్’ సంబంధం , పల్లవి తండ్రి మాటల్లో చెప్పాలంటే . కంప్యూటర్స్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న పల్లవికి, ఎంత వేగంగా , అమెరికా వెళ్లి మాస్టర్స్ చేద్దామా అని ఉండి, నో చెప్పటానికి కారణం కనిపించలేదు. వెంటనే , ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు , ప్రోవిజనల్స్ సంపాదించే పని తన బెస్ట్ ఫ్రెండ్స్ కి అప్పచెప్పి, వెంటనే షాపింగ్ లో పడిపోయింది.
ఎంత వేగంగా , పెళ్లి కోసం ఎదురు చూసి ..మెహందీ పెట్టించుకుందో, ఆ రంగు ఇంకా వెలవకుండానే కలల తీరం అమెరికాలో అడుగుపెట్టింది. కారణం ఉమాకాంత్ కి సెలవు దొరకదు, అసలు అంత పెద్ద పోస్ట్ లలో ఇండియన్స్ ఉండటమే తక్కువ ..అన్నారు మావగారు దీర్ఘాలు తీస్తూ.. సరే ఎప్పటికన్నా వెళ్లేదే కదా అని, ఆవకాయలూ, పచ్చళ్ళతో సహా పల్లవి ని ప్యాక్ చేసి పంపించేసారు వాళ్ళ అమ్మా వాళ్ళు. లాస్ ఏంజల్స్ అనగానే.. చూసిన ఇంగ్లీష్ సినిమాలు గుర్తొచ్చి తెగ సంబరపడింది. అందులోనా డిస్నీ ల్యాండ్ పక్కనే ఇల్లు అని , ఉమాకాంత్ కజిన్ వాళ్ళూ పెళ్లిలో అనుకుంటుంటే విని, ఇంక ఏదో సినిమాలోలాగ గంతులే గంతులు.
గెంతి, గెంతి, గోతిలో పడ్డానని తెలుసుకోవటానికి, పల్లవికి ఆట్టే సమయం పట్టలేదు. ఉమాకాంత్ ది అదో తరహా .. జీవితం అంటే, ఒక ప్రాజెక్ట్ మానేజ్మెంట్ లాంటిది, తను దానికి టీం లీడర్. ..అంతవరకూ పర్వాలేదు కానీ, పెళ్ళాం టీం లో చాలా క్రింది లేయర్ లో ఉంది అనుకోవటం లోనే వస్తుంది ఇబ్బంది అంతా.. క్రింది లేయర్ లో ఉన్నవాళ్ళు అతని స్థాయికి రావాలంటే, ఒక జీవితం పడుతుంది, అయినా, సరిగ్గా వంట రాకుండా , ఇల్లు క్లీన్ చేయటానికి రాకుండా, నీకు ఏం వచ్చు ? అని అడిగితే , రెండు కేంపస్ ఇంటర్వ్యూ లు , యిట్టె క్లియర్ చేసిన పల్లవికి మాట పెగల్లేదు. అదే విషయం అమెరికాలో ఎం. ఎస్, చేస్తున్న తన ఫ్రెండ్ గౌతమీ ని అడిగితే .. “ నిజమే, అక్కడ ఇంటర్వ్యూయర్ మొగుడు కాదు కాదే.. అక్కడ మాట పెగుల్తుంది.. ఇక్కడ జీవితకాలపు బాస్ కదా !” అంది నవ్వేస్తూ.. తేలిగ్గా నవ్వినా ఆ నవ్వులో ఎన్నో వినిపించాయి పల్లవికి. ఆ అమ్మాయికి పెళ్ళయి రెండేళ్ళు, భర్త చదివిస్తున్నాడు ఎమ్మెస్ ఆమెని.
ఉమాకాంత్ ది నిశ్శబ్దమైన శాడిజం . అతని మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. మహా తెలిస్తే వాళ్ళ అమ్మకి తెలియాలి, ఆమె కోడల్ని ఎలా కంట్రోల్ లో పెట్టాలో చెప్పటం తప్ప మిగతా విషయాలు అంతగా పట్టవు. ఉమా సంపాదించిన డాలర్లతో, ఆస్తులు కొనటం , వాళ్ళ చెల్లెళ్ళ తమ్ముళ్ళ పిల్లలతో , ఉంటూ “డాలర్ అమ్మ” స్టేటస్ ఎంజాయ్ చేయటం తప్ప.
ఉమాకాంత్ తో గొడవలు రావు ఎవ్వరికీ.. పెళ్ళయిన ఈ మూడు నెలలలో, పల్లవి ని ఎక్కడికీ తీసుకువెళ్ళలేదు. ఎవరూ వాళ్ళ ఇంటికి రాలేదు. అసలు ఉమాకాంత్ కి పెళ్లయింది అనే విషయం మిగతావాళ్ళకి , ఆఫీసులో తెలుసో లేదో తెలియదు. పొద్దున్న ఏడింటికి టిఫిన్ చేస్తే , ఆ టిఫిన్ తిట్టుకుంటూ తిని ఆఫీసుకి వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చేది టంచనుగా ఆరింటికి. ఏడుకల్లా డిన్నర్ రెడీ చేయాలి అతనికి. అప్పుడు కూడా కామెంట్స్ చేసుకుంటూ తినేస్తాడు. ఇంచుమించు ఏదో ఒకటి అని పల్లవి కళ్ళల్లో నీళ్ళు చూసి మొహం తిప్పుకొని పడుకుంటాడు.
పెళ్ళయి వచ్చిన రోజునే చెప్పేసాడు. తను తన గదిలో ఒక్కడే పడుకోవటం అలవాటు అని. ఆమె బట్టలు వస్తువులు , వేరే గదిలో సర్దుకోమని. తల్లికి ఫోన్ చేసింది పల్లవి, ఇలాంటివి నెమ్మదిగా సర్దుకుంటాయి , సర్దుకోమని చెప్పింది తల్లి. బట్టలతో పాటు, మనసు కూడా సర్దుకుంది పల్లవి. ఉమా ఆఫేసు పార్టీకి వెళ్లి, అక్కడ ఉమా సాన్నిహిత్యం , రాబర్ట్ తో చూసేదాకా, అనుకున్నంత వీలుగా అన్నీ సర్దుకోవటం , ముఖ్యంగా భర్త “ మగ ఫ్రెండ్” తో వ్యవహారం, అనుకున్నంత ఈజీ కాదని అర్ధమైంది .
ఆ పార్టీ అయినప్పటి నుండీ, ఉమా ఇంకా మాట్లాడటం తగ్గించాడు. ఎలాగన్నా నిలదీయలనుకున్నప్పుదల్లా , ఒకటీ, ఒకటీ , మొదట టీవీ కనెక్షన్, తర్వాత ఇంటర్నెట్, తర్వాత ల్యాండ్ లైన్ తీసేసాడు. ఎలా జరుగుతున్నాయో తెలిసేలోగా, వారంలో వొంటరి అయిపొయింది పల్లవి.
మొదటిసారి భయం వేసింది. కోపం, ఉక్రోషం, అన్నీ కలగలిపి వచ్చాయి. తర్వాత, చిన్నప్పటి నుండీ తాను ఎలా ఉండేదో, ఎంత ధైర్యంగా ఉండేదో తలచుకొని కొంచం ధైర్యం వచ్చింది. ఆఫీసుకి వెళ్తున్న ఉమాని నిలదీసింది. అంతే నిశ్శబ్దంగా చెప్పాడు – “ నాకు రాబర్ట్ అంటే ఇష్టం. అమ్మాయిల మీద నాకు ఇష్టం లేదు. మా పేరెంట్స్ మాట కాదనలేక , అమ్మ పరువు పోతుందని ఏడిస్తే చేసుకున్నాను. కానీ, ఈ పెళ్లి నాకో జంజాటం. నేను , రాబర్ట్ రెండు వారాల బిజినెస్స్ ట్రిప్ మీద యూరప్ వెళ్తున్నాము. ఆలోచించుకో, అప్పుడు చూద్దాం ఏం చేద్దామో.. ! ఈలోగా, మీ వాళ్లకి చెప్పటం ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే, మర్యాదగా ఉండదు. ఇక్కడ నిన్నేమన్నా చేసినా, అడిగే దిక్కే లేదు ” అన్నాడు.
పల్లవికి కడుపు రగిలిపోయింది. కోపంతో తిట్టింది. అలాంటప్పుడు తనని ఎందుకు పెళ్లి చేసుకోవాలి.. ఆక్రోశంతో ఆ అమ్మాయి నిలువునా కాలిపోయింది.. నా పాస్పోర్ట్ నాకిచ్చేయి , నేను వెళ్ళిపోతాను, మీ మీద కంప్లైంట్ చేస్తాను ‘- అని అరచింది. మొదటిసారి , అతని కళ్ళల్లో కాస్త భయం కనబడింది. తమాయించుకొని, పల్లవి చూస్తుండగానే, ఆమె పాస్పోర్ట్ తన జేబు లోంచి తీసాడు. ఆశ్చర్యపోయింది ఆమె, తన పాస్పోర్ట్ జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడా ? –అని .
ఇదిగో పల్లవీ..నీ పాస్పోర్ట్ అని .. దాన్ని రెండు ముక్కలుగా చించి .. కమోడ్ లో పడేసి వెళ్ళిపోయాడు.
పల్లవికి ఇప్పుడు ఏడుపు రావటం లేదు. కన్నీళ్ళతో, సాయంత్రం ఎపుడయిందో కూడా గమనించలేదు. ఆ ఇల్లు తనని, కరుస్తున్నట్టు గా అనిపించింది. బయటకి వచ్చి, దగ్గరలో ఉన్న సిమెంట్ బెంచీ మీద కూలబడింది. ఈ క్షణం ఈ పెళ్లి అనే ఆక్సిడెంట్ నుండి బయటపడి, మళ్ళీ ఇండియాలో అమ్మానాన్న దగ్గరకి వెళ్ళిపోతేనో అనుకుంది. ఆకలి, నీరసం, నైరాశ్యం ముప్పేటగా ఉండి ముడుచుకొని కూర్చొంది పల్లవి.
“ హే .. వాట్స్ అప్.. కెన్ ఐ హెల్ప్ యు ???” – మొహం మీద పడిన టార్చ్ లైట్ రాత్రి అయిందానికీ సాక్ష్యంగా.. ఎదురింటి అమెరికన్ అబ్బాయి. ఒక్కోసారి ఆ ఇంట్లో నుండి మ్యూజిక్ వినిపిస్తుండేది. పల్లవికి వెళ్లి, పరిచయం చేసుకోవాలి అనిపించినా.. ఉమాకాంత్ తిట్లు గుర్తొచ్చి ఎప్పుడూ వెళ్ళలేదు..
“ హ.. నో.. హ ఎస్.. “ పల్లవి గొంతు, నిస్సహాయంగా
“…………..” పల్లవి ని చూస్తూ నిలబడ్డాడు అతను. కరుణగా ఉంది చూపు. ఒక్కసారి అతన్ని పట్టుకొని ఏడవాలని అనిపించింది పల్లవికి .
“ నా భర్త, నా పాస్పోర్ట్ చింపేసాడు, డబ్బు లేదు, ఫోన్ లేదు, ఎవరూ తెలియరు .. ఏం చేయాలో తెలీటం లేదు ..” ముక్కలు ముక్కలు గా మాట్లాడుతున్న పల్లవికి , తను మాట్లాడుతున్నది అతనికి అర్ధం అవుతోందో లేదో తెలీదు.
“ నా పేరు జార్జ్ .. నీకంటే ముందు మీ ఇంట్లో ఉన్న రాబర్ట్ నాకు తెలుసు. మీరు ఎవరు ?” – అడిగాడు జార్జ్
అయోమయంగా ఉంది .. పల్లవికి.. “ నేను ఉమాకాంత్ వైఫ్ ని “ చెప్పింది పల్లవి..
అదిరినట్టు చూసాడు అతను.. తమాయిన్చుకుంటూ.. “ ఓహ్.. అవునా .. రాబర్ట్ , ఉమా కపుల్ కదా .. మీకు తెలియదా ?” – నెమ్మదిగా అడిగాడు జార్జ్
నక్షత్రాలు లేని చీకటిలో , మాట్లాడుకోలేని నిశ్శబ్ద నీడల్లా ఉన్నారు ఆ ఇద్దరూ.. సిల్హవుట్ లో, పెద్ద నీడలా ఆ ఇల్లు భయపెడుతూ ఉంది.. ఎక్కడి నుంచో సిండీ లూపెర్ “ ట్రూ కలర్స్ “ వినబడుతోంది.

స్వర్గలోకం –ప్రస్తుతం

హ్మ్మ్… చూసారా స్వామీ.. ఇప్పటి అమ్మాయిల ఇబ్బందులు .. !- ఆవేదనగా పలికింది సుమతి స్వరం
“ముగ్గురి జీవితాల ముప్పేట.. చదువుకున్న, అందమైన , తెలివైన వాళ్ళ జీవితాలు ఏమిటమ్మా ఇలాగ .. “అన్నాడు నారదుడు.
హ్మ్మ్ .. భానుమతి, లీలావతి లాంటి వాళ్ళు కూడా పతివ్రతలే స్వామీ.. తల వెంట్రుక వాసంత , తప్పు మనుషుల్ని పెళ్లి చేసుకున్నారంతే..! మా తరం ఆడవాళ్ళ సమస్యల కన్నా ఇవి మరీ జటిలం .. కుటిలం కూడాను.. !- నిట్టూరుస్తూ పలికింది
“ అవునమ్మా .. నిజమే “ అన్నాడు నారదుడు.
అంతలో ప్రక్కనుండి ,
“ సడేలే సంబరం.. ఇంకేమన్నా చూపిస్తావేమో అనుకున్నాను .. అమ్మాయిలందరూ భలే అందంగా ఉన్నారు… పోనీ వాళ్ళల్లో ఎవరినన్నా.. ఎవరి దగ్గరకైనా … !”- అర్దోక్తిగా ఆగాడు సుమతి మొగుడు.
మూడులోకాల అసహ్యాన్ని కళ్ళల్లో పోగుచేసి , చూసే ప్రయత్నం చేసింది సుమతి.
స్వర్గలోకపు సాయంత్రాన , “ రాదే చెలీ నమ్మరాదే చెలీ ..!!” పాట భాంగ్రా రీమిక్స్ లో వినబడుతోంది ..!!

–సాయి పద్మ

saipadma

మీ మాటలు

  1. ఆర్.దమయంతి. says:

    మీ కథ చదివాక నాకు చలం గుర్తొచ్చారు.
    స్త్రీకి శరీరమే కాదూ, మనసు, మతీ వుందనీ అంటవూ గుర్తొచ్చిందీ.

    స్త్రీకి మెదడున్నా, డబ్బునా, అధికారమున్నా.. ఈ కంప్యూటర్ యుగంలో సైతం ఆమె కేవలం తన శరీరంతో మాత్రమే అన్ని చోట్లా నెగ్గుకొస్తోందనీ, కాదు కాదు.. బ్రతుకీడ్చుకొస్తోందనీ ఎంచక్కా అద్దం పట్టి మరీ చూపారు. అర్ధమయ్యేలా చెప్పారు.
    కసి తీరిందా?
    :-)
    మీకు నా అభినందనలు పద్మ.

    • కసి ఏమీ లేదు.. ఇందులో , అవసరాలకి, బేసిక్ కంఫర్త్స్ కీ లైఫ్ తాకట్టు పెట్టిన వాళ్ళ మీద ఒక జాలి లాంటి బాధ ..అంతే .. దొరికే దానికన్నా , కోల్పోయేది ఎక్కువ కదా ..!
      థేంక్ యు సో మచ్

      • సతీ సుమతి కి ఈ కధకి సంబంధం అర్థం కాలేదు. అయితే కధలో కాస్త హాస్యరసం జోడించడం కోసం స్వర్గనరకాలు , నారదుడు, సుమతి ఇత్యాది పౌరాణిక పాత్రలను ఎంచుకున్నట్టున్నారు. సుమతికి పాతివ్రత్యం సహజ లక్షణం. నారదుడు త్రిలోక సంచారి. స్వర్గంలో యమధర్మరాజు ప్రస్తావన, నరకంలో ఉన్నట్టుంది అనుకోవడం ,రంభా ఊర్వశులకు ముసలితనం వంటివి ఉండవు. మూడు లోకాలలోని అసహ్యాన్నంతా నింపుకుని సుమతి భర్త వైపు చూసింది అన్నది ఆమె సహజ లక్షణానికి విరుద్ధం . నారదుడు నిరంతర సంచారి. ఆయనకు టి వి ద్వారా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వారి వారి సహజ లక్షణాలని ఉంచి వాటిని హాస్యంగా చెప్పడం ఒక పధ్ధతి. లేని లక్షణాలని ఆపాదించ కూడదు. ఆడపిల్లలు ప్రలోభ పడకుండా సుమతి లా పవిత్రంగా ఉంటే బాగుండునని చెప్పాలనుకున్నారా? రచయిత్రి.
        కధలో ఆంతర్యం స్పష్టంగా లేదు.

      • లలితా రాణి గారూ.. నిరంతర సంచారికి కూడా ఇప్పటి ఆడవాళ్ళ మనసులో మాటలు తెలీవు అనే అర్ధంలో రాసాను అది ..
        సుమతికి సహజం కావచ్చు, పాత్రివ్రత్యం.. కానీ ఈ కాలపు ఇబ్బందుల్లో ఉన్న అమ్మాయిని కోరుకుంటే ఆమె రియాక్షన్ ఊహించి రాసిందే ..

        ఇక్కడ పవిత్రత కాదు ఇబ్బంది. నచ్చని పని చేస్తే వచ్చే వేదన , రక్తం కనబడని హింస .. పారిపోలేని నిస్సహాయత

  2. సాయి పద్మ మీ కథ బాగుంది. ముఖ్యంగా కధనం బాగుంది. ఆడవారి వేదనే ఎక్కడి కెళ్ళినా ఏమి చేసినా వర్ణించారు బాగానే ఉంది కానీ కొన్ని సక్సెస్ఫుల్ స్త్రీల గురించి కుడా రాసి ఉంటె బాగుండేది. స్త్రీ శరీరం ఒక్కటే ఒకప్పుడు వ్యాపార వస్తువు ఇప్పుడు మగడు కుడా ఒక వ్యాపార వస్తువే అయినాడు. ఎంతగా వర్ణించినా వేదన సమాధానం కాదు సందేశం కాదు కనుక ప్లీస్ ఈ సరి రాసే కథల్లో ఆత్మాభిమానం తోనూ ధైర్యం తోనూ తన జీవితాన్ని దిద్ది తీర్చుకున్న్న వారి కథలు కూడా రాయండి . మీరు ఇంకా మంచి కథలు రాయగలరని ఆసిస్తూ …ప్రేమతో …జగద్ధాత్రి

    • జగతి మా.. వీళ్ళు కూడా సక్సెస్ ఫుల్ అనుకోని మొదలెట్టిన పనులే కొన్ని.. ఉదాహరణ కి , అమెరికా లో జీవితం కోసం ఏమీ తెలీకుండా ,పెళ్లి చేసుకోవటం లాంటివి .. తప్పకుండా మీ సూచన గుర్తు పెట్టుకుంటాను

  3. సాయి పద్మ గారూ !
    సంఖ్యాశాస్త్రంగా తొమ్మిది (9) మంచి నంబరు అనే నమ్మకం అంటారు
    బహుశ మీ కథా జగత్తును మలుపు తిప్పుతోందా అనిపిస్తోంది
    అభినందనలు…

  4. సాయి పద్మ గారూ,
    బేసిక్ కంఫర్ట్స్ కోసం తమ జీవితాన్నే కాక పిల్లల జీవితాల్ని, భర్త జీవితాన్ని తాకట్టు పెట్టే వారి కోణం కూడా మరొక సన్నివేశంలో చూపించి వుండాల్సింది.

    • ఈసారి రాస్తాను. శిశిరానంతర వేళ కథ లో రాసింది అదే ..

  5. mythili abbaraju says:

    Narada being given ‘ Tulasi tea ‘ by Sumathi – hilarious !!! Enjoyed that whole episode a lot.
    I do agree with the comment of Jagaddhatri garu.
    For a change at least , please come out with a story of different kind – you can , seriously.

  6. will keep that in mind. what i tried to do is, despite many options .. still women are not taking hard route of walking away.. rather submission and losing their values for material comforts

    • Sivakumara Sarma says:

      This response confuses the reader a bit and raises more questions about the story. Sumati did not walk away, and neither did the characters in the first two episodes. The 3rd character was kind of forced to walk away – unless the implication is that the fact the passport is torn and is thrown in the toilet kind of forces her to stay with her “husband”. The ladies in the first two episodes at least got what they wanted (but, the story implies that it is not “swargam”) by using their bodies. What about the last one? She didn’t seem to have that option.

  7. Sivakumara Sarma says:

    ఓల్డ్ వైన్ ని కొత్త బాటిల్లో పోసేటప్పుడు ఆ బాటిల్ ని కొంచెం పక్కాగా తయారుచెయ్యాలి అనేది స్వాభిప్రాయం.
    “మా గదిలో టీవీ కూడా పెట్టించారు యమ ధర్మరాజుల వారు” అంటుంది స్వర్గలోకంలో వున్న సుమతి. స్వర్గాధిపతి ఇంద్రుడు కదా! మరి యమధర్మరాజుల వారు టీవీ ఇవ్వడంలో ఆంతర్యమేమిటి? స్వర్గలోకంలో వుంటూనే నరకాన్ని అనుభవించమనా? కానీ, సుమతికి నరకం కూడదు కదా! అలాగే, “ ఏం బాగో, పతివ్రత మొగుడ్నయిన పాపానికి ఇలా స్వర్గంలో ఏడుస్తున్నాను,” అంటాడు ఆవిడ భర్త. అంటే నరకాన్ననుభవిస్తున్నట్లే కదా! స్వర్గంలో వుంటూనే నరకాన్ని అనుభవించడమనేది కొత్త వ్యూ పాయింటే. కానీ, అదే కథకి ఆయువుపట్టుగా చెయ్యడం అనేది రచయిత్రి అభిమతమయితే, ఉదహరించిన మూడింట్లో రెండు ఎపిసోడ్లు మాత్రం “చేస్తోంది తప్పు” అని తెలిసినా చేసేవాటికి సంబంధించినవే. మొదటిది తల్లిదండ్రుల వత్తిడిని తగ్గించుకోవడానికి. రెండవది పనికిమాలిన మొగుడిది. మూడవది కూడా పనికిమాలిన మొగుడిదే కానీ, అమెరికా సంబంధాన్ని చేసుకోవడంలోగానీ తరువాత ఆ మొగుడు పనికిరానివాడని తేలడమ్లోకానీ ఆమె తెలిసి చేసిన తప్పేమిటో నాకు అర్థం కాలేదు.
    కథ శీర్షికలో “త్రిబుల్ స్టాండర్డ్స్” అని వుండడం కూడా నాకు అర్థం కాని విషయం. డబుల్ స్టాండర్డ్స్ అంటే, మనకొక విలువనీ, అదే ఎదుటివాడికయితే వేరొక విలువనీ ఆపాదించడమని కదా అర్థం? మరి ఇక్కడ త్రిబుల్ స్టాండర్డ్స్ కి అర్థమేమిటో వివరించగలరా?

    • శివకుమార్ శర్మ గారూ, ముందుగా కథ అంత శ్రద్ధగా చదివినందుకు చాలా థాంక్స్. హ్మ్మ్..కొంతవరకూ స్వర్గం నరకం అన్నీ ఒకటే మేనేజెమెంట్ లో ఉన్నాయి అనే అర్ధం లో రాసాను .. మొగుడూ పెళ్ళాలు , ఒకరు స్వర్గం ఒకరికి నరకం అల్లోట్ అయినప్పుడు, ఒకే చోట ఉండాలంటే ..ఎలాంటి కాటేజ్ ఉంటుంది అనే అర్ధం లో .. నేను అది సరిగా చెప్పలేకపోయి ఉండవచ్చు .. వోప్పుకున్తున్నాను ..
      ఇకపోతే , త్రిబుల్ స్టాండర్డ్స్, ఇక్కడ ముగ్గురు వనితలకీ ,, వేరే వేరే ఆప్షన్లు ఉన్నాయి ..
      రాగలీన- కావాలంటే పరీక్ష ఫెయిల్ కూడా కావచ్చు , కానీ , తనని కోల్పోయి మరీ, ఎలాగో ఒకలాగా పాస్ అయితే బాగుంటుంది అని
      తనూజ – భర్తని వదలవచ్చు .. కానీ , భర్త తాగుడు ని భరిస్తూ, ఆఫీసులో హరస్మేంట్ సహిస్తూ కూడా, అందులోంచి బయట పదాలని అనుకోకుండా, ఉన్న దాంట్లో ఉండటానికే ప్రాధాన్యత ఇచ్చింది.
      పల్లవి- అమెరికా లో ఉండటం ఒకటే గోల్, చాలా మంది అమ్మాయిల్లా.. అంతే తప్ప , ఇంకేమీ ఆలోచించలేదు
      త్రిబుల్ స్టాండర్డ్స్ వాళ్ళ , ఆర్ధిక పరిస్థితుల్లో కూడా, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి .. ఇంతే ఆలోచించాను .. ఏదైనా సరిగా లేకపోతే అది నేను ఇంకా ఎడిటింగ్ లో శ్రద్ధ పెట్టాలి అని అర్ధం .. పెడతాను ఈ సారి తప్పక

  8. Srinivasa Rao says:

    The flow is excellent. the three examples are the reality of modern life. women do suffer more than man for the same social norms. The writer may not have the answer / solution for all the issues. But has a great responsibility of presenting them to readers in very interesting way. You are sucussful as before ! Keep writing, One day you may writer about minority sufferers – men.

    • Sai Padma says:

      Thank you Srinivas Garu,
      Yes, who knows one day its women writers turn to write and present men in real light …. without any perspective glasses.. thank you so much for your encouragement !

  9. Srinivasa Rao says:

    The flow is excellent. the three examples are the reality of modern life. Women do suffer more than men for the same social norms. The writer may not have the answer / solution for all the issues. But has a great responsibility of presenting them to readers in very interesting way. You are successful as before ! Keep writing, One day you may write about minority sufferers – men.

  10. కొందరి స్త్రీల బాధాతప్త జీవితాలని బాగానే వెలుగులోకి తెచ్చారు. ఏవో చిన్న చిన్న పొరపాట్లు దొల్లినా కధ కధనం బాగుంది . మీకు అభినందనలు, ఎడిటర్ మహాశాయులకి ధన్యవాదాలు

మీ మాటలు

*