మీరు ఒకసారి ఆగి చదవాల్సిన నరేష్ కవిత!

కవిత్వం కొన్ని సార్లు అలవాటుగా చదివేస్తూ పోలేం. అక్కడక్కడా కొద్ది సేపాగి మనల్ని మనం తడుముకుంటూ దాగి వున్న కాసింత నెత్తుటి గాయపు తడిని స్పర్శిస్తూ ఒక్కో పాదం అంచునుండి కిందకు పోగలం. వెళ్తూ మరల పైకి ఒకసారి చదవాలనిపిస్తుంది. చదివి కనుల తడిని తుడుచుకోబుద్ధి కాదు. అలాంటి కవిత్వం ఈ మధ్య యువ కవి కెరటం నరేష్ కుమార్ రాస్తున్నాడు. కవిసంగమం ద్వారా పరిచయమయిన ఈ అబ్బాయి కవిత్వం తనలాగే నిటారుగా నిబ్బరంగా మనముందు నిలిచి వుంటుంది.

nareshkumarచాన్నాళ్ళుగా కవిత్వం చదువుతున్న మీరు, రాస్తున్న మీరు ఒకసారి ఆగి చదవాల్సిన కవిత్వం నరేష్ కుమార్. వ్యక్తిగత పరిచయంలోనూ తన నవ్వు వెనక వుండే ఒక విషాదపు జీర ఈ కవి అక్షరంలో కూడా ఒదిగి వుంటుంది. ధిక్కార స్వరంలా గర్జించేటపుడైనా ఒక మార్థవం మూర్తీభవించడం గమనించవచ్చు. ప్రతి పాదంలోనూ స్వేచ్చగా ప్రతీకలకోసం తపన పడకుండా ఒక్కో పదం అల్లుకుపోతూ సూటిగా సరళంగా హృదయాన్ని తాకేట్టు చెప్పడం నరేష్ కవిత్వంలో మనకు ఎరుకవుతుంది.

ఇది ఇప్పుడు రాస్తున్న యువ కవుల ధారగా మనం గుర్తించ వచ్చు. కవిత్వాన్ని సుళువుగా నిస్సంకోచంగా నిర్భయంగా రాస్తున్న నేటి యువకవితరంలోని వాడిగా ఇటీవల ‘వాకిలి’లో వచ్చిన ఈ కవిత చదివి మరొక్క మారు అందరం చదువుదామని ఈ పరిచయం.

 

నిరాసక్తం

ఎందుకు వెలిగించి ఉంటారు
ఎవరైనా ఆ దీపాన్ని..!?
కంటి కొలకుల్లో మసిని తుడిచి వెచ్చని వెలుతురు
స్రవించేలా ….
జిగటగా కారే వెలుతుర్లో చేతిని ముంచాక
స్వచ్చమైన చీకటితో
మనసుని కడిగేసి
ఎవరో
వెలిగించే ఉంటారు ఆ దీపాన్ని..
ఎవరివో
కొందరు బాటసారుల
నిర్నిద్రా సమయాల
నిరాసక్త నిరామయపు
నిశ్శబ్దాన్ని కరిగించి
కర్పూరపు పొడిగా
రాల్చుకున్నాక
స్వచ్చంగా
స్వేచ్చగా
వెలుగుని ఎగరెసేందుకు
వెలిగించి ఉంటారు
కొన్ని పగిలిపోయిన
ఆకాశాల
ముక్కలని వెతికేందుకు
ఏవో ప్రమదా వనాల
చిత్తడి దారుల్లో
ఈ ప్రమిదని
వెలుగుల కాగడాగా
వాడేందుకేమో
ఏమో మరి…
ఎందుకోమరి
వారా దీపాన్ని ఒక
దేహంగా వెలిగించి ఉంచారేమో
బహుశా…
ఒకనాటి అనామక
పాదాలకంటిన
ఎర్రని పారాణి గానో
పోరాటపు వెలుగుల
నెత్తుటి గుర్తుగానో
ఆ దీపాన్ని
ప్రజ్వలించి ఉండవచ్చు
లేదంటావా…
కొన్ని అస్పృశ్యపు
ఆత్మ కథలు
రాయబడగా మిగిలిన
సిరాని ఎవరైనా
అక్కడ వొంపిఉండొచ్చు…
ఆ వెలుగుతో
ఒక కౄర
ద్వాంతపు దంతాన్ని
ద్వంసం చేసి
ఉండొచ్చు
ఐనా మిత్రుడా…!
ఎవరు వెలిగిస్తేనేం
ఆ వెన్నెల దీపం
అమ్మ గోరుముద్దా కావొచ్చు
ఒకనాటి ప్రేయసి గోటి ముద్రా
ఐ ఉండనూ వచ్చు..
శాశ్వతత్వపు చీకటిని
కాసేపు మరిచేందు కైనా
ఆ దీపాన్నలా వెలగనీయ్
ఏమో…!
ఒకవేళ
ఆ దీపం నీ నుండి
వేరైపోయిన
నువ్వె అయి ఉండొచ్చు….

ఈ కవిత చదివాక కవితను గురించి మరల విడమర్చి చెప్పనక్కరలేదు. తను కోరుకుంటున్న వెలుగు మనలోనే మనతోనే వుండి మాయమయి పోవచ్చనే ఆర్తిని ప్రదర్శిస్తూ మనకు ఓ జలదరింపును కలుగజేస్తుంది. చదివాక ఒక నిట్టూర్పు మనలనుండి బయటపడి ఒక జాగరూకతను గుర్తుచేస్తుంది. ఇలా యింత సూటిగా రాసే కవిత్వం నేటి అవసరం. అది నరేష్ కుమార్ కు పట్టుబడింది. మరిన్ని కవితలను ఈ కవి నుండి ఆశిస్తూ అభినందనలతో.

-కేక్యూబ్ వర్మ

varma

 

 

మీ మాటలు

 1. నిత్యా ప్రసాద్ says:

  నిజమే….మనసు స్పందింపచేసే కవిత, అంతకన్నా చక్కని విశ్లేషణ

 2. నిశీధి says:

  కవిత ఎలాగు బాగుంది దాని పై మీ విశ్లేషణ ఇంకా బాగుంది సర్ జీ ఎప్పటిలానే అయితే ఈ మొత్తం లో నాకు తెలిసి నరేష్ గారు వెబ్ మాగజైన్స్ కి బహు దూరం మానసికంగా, అలాంటి వ్యక్తి కవిత విశేషణ
  సారంగాలోనే అచ్చవటం నిజానికి చాలా బాగుంది . పిల్లల దారి సరి చేయాల్సింది పెద్ధలేగా. క్యుడోస్.

 3. విశ్లేషణ బావుంది వర్మ.నరేష్ కవిత్వంలోని రహస్యాలు విప్పిచెప్పావు

 4. Thank you నిత్యా ప్రసాద్ గారు..

  మీరన్నది నిజమే కానీ వాళ్ళొప్పుకోనిది ఏం చేయలేం కదా నిషీజీ.. స్వేచ్చగా ఎగరనీయడమే…

  ధన్యవాదాలు రాజారాం గారు…

 5. మంచి కవితకు ఆత్మీయమైన పరిచయం చాలా బావుంది వర్మగారూ, నరేశ్ నుండి మరెన్నో మంచికవితలు రావాలని కోరుకుంటున్నాను.

 6. కవిత చాలా బాగుంది. మనకు తెలిసినవాళ్ళే మహాకవులని భావిస్తూ ఉంటాం. అజ్ఞాతంగా ఇలా ఎంతమంది కవులు మనకు తెలియకుండా అద్భుతంగా వ్రాస్తున్నారో!

  వర్మగారు – ఓ మంచి కవితని, కవిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

 7. ఎం నారాయణ శర్మ says:

  చాలాబాగుంది సార్..నిజానికి కొత్తతరాన్ని విశ్లేషించికోవటం సాహిత్య లోకం మానేసి చాలా యేళ్లయింది.(బహుశ: నాకు తెలిసి కొన్ని తరాలు ఇలా స్పందనలు/ప్రతిస్పందనలు లేకనే వెళ్లిపోయాయేమో). నరేశ్ కవిత్వాన్ని మీరుపంచుకున్నతీరు అతనికి బలాన్నిస్తుందని నమ్ముతున్నాను.

 8. Thank you Katta Srinivas gaaru, Sai kiran gaaru,

  మీరన్నది నిజమే కదా సార్. పత్రికలు కొన్ని గుత్త సంస్థలకో ప్రాంతాలకో పరిమితమైపోయి రక రకాల ప్రభావాలతో వున్న కాలం దాటి నేడు అందుబాటులోకొచ్చిన వెబ్ పరిజ్నానం వలన ఇలా నలుగురికీ చేరుతుండడం వలన ఇంతమంది యువతీ యువకులు కొత్త గళాలు పరిచయమవుతున్నాయి. సాహిత్యం సార్వజనీనం కావాలని కోరుకుందాం. మీ స్పందన స్ఫూర్తిదాయకం. ధన్యవాదాలు నారాయణ శర్మ గారు…

 9. SAI ANVESHI says:

  వర్మ గారు …మీ విశ్లేషణ బాగుంది …నిజం^గానే నేటి తరం కవులలో ఒక ప్రత్యేకత కలిగిన వాడు ఈ నరేషు…ఇకపై మరిన్ని కవితలు ఆ యువకవి నించి ఆశిస్తున్నాను …

 10. Yes he deserves it

 11. Dr.Pasunoori Ravinder says:

  మంచి క‌వికి…మ‌రిచిపోలేని ప‌రిచయం. ఇద్ద‌రికీ అభినంద‌న‌లు…జ‌య‌హో క‌విత్వం

 12. sreeramoju Haragopal says:

  నరేశ్కుమారుని కవిత్వం అట్లనే వుంటది.దీపం నుండి వెలుగే ఆత్మగత సంభాషణ చేస్తున్నట్టు.కన్నీటి దేహశిఖ మండిపోతున్నట్టు.కెక్యూబ్ గారి కవిత్వవిశ్లేషణ అంతే ఆత్మీయంగా వుంది.కవికి,కవివిమర్శకుల కిద్దరికి అభినందనలు

మీ మాటలు

*