‘ఎగిరే పావురమా!’ – 10

egire-pavuramaa10-banner
సినిమా కథ మొదట్లో అంతగా అర్ధం కాలేదు. సినిమాలో ఓ కొండంత మీసాలవాడు అనాధ పిల్లల్ని వీధుల్లోంచి తీసుకొచ్చుకొని, కొన్నాళ్ళు సాకిన తరువాత వాళ్ళని అవిటిగానో, మూగగానో, గుడ్డివాళ్లగానో చేస్తాడు.
ఆ తరువాత ఇక వాళ్ళని బిచ్చగాళ్ళగా మార్చి, ఆ అవిటోళ్ళతో బిక్షాటన చేయించే యాపారం మొదలెడతాడు. ఆ మీసాలాడి నుండి తప్పించుకొని పారిపోయిన ఇద్దరబ్బాయిల కథే ఆ సినిమా.

నాకు అస్సలు నచ్చలేదు. సినిమా అయ్యాక ఇంటికెళ్ళినంత సేపూ సినిమాలో నాకు నచ్చని ఆ మీసాల వాడి కథే గుర్తుండిపోయి చాలా విసుగ్గా, కోపంగా అనిపించింది.

“ఏమో గుబులుగా ఉన్నావే గాయత్రి? సినిమా నచ్చలేదా? అడిగింది కమలమ్మ.
నా ఆలోచనలో నేనున్నాను.

“ఏం సినిమానే పాడు సినిమా. అట్టా ఏడన్నా జరుగాతాదా?” అన్నాడు రిక్షా నడుపుతున్న గోవిందు, మాకు వినబడేలా ఓ మారు ఎనక్కి తిరిగి..

“పిచ్చోడా, విజయవాడ లాంటి నగరాల్లో అవిటి యాచకుల నెలసరి సంపాదన నాలుగైదు వేల రూపాయలంట. ఈ రోజుల్లో బతుకుతెరువు కోసం యాచించే వాళ్ళు, వడ్డీలకి అప్పులిచ్చే స్థాయిలో ఉండారంట. అందుకే ఈ సినిమాలో మల్లేనే ఇట్టాంటివన్నీ నిజంగానే జరుగుతున్నాయిరా,” అంది కమలమ్మ పెద్దగా గొంతెత్తి, గోవిందుకి వినబడేలా.

“సరేలేవే అక్కా, ఇట్టాంటి సినిమా సూపించాలా ఏంది?” విసుక్కున్నాడు గోవిందు.
“పోనీలే గాని, ఆ సినిమాలో అమ్మాయి కంటే మన గాయత్రి ఎంతో అందంగా కళగా ఉందా లేదా? నువ్వు సెప్పు. నాకైతే, సినిమా యాక్టర్ కంటే గాయత్రి సక్కంగా ఉంది. వైద్యం చేయించి నడక వచ్చేస్తే,” అంది కమలమ్మ మళ్ళీ బిగ్గరగా….
అవసరం లేని మాటలు ఆమెకి అలవాటే అని చిరాగ్గా అనిపించింది.

“అరేయ్ గోవిందు, ఈ సారి మన కొత్తపాక సూపెట్టాల గాయత్రికి,” అంది మళ్ళీ పెద్దగా…నవ్వుతూ కమలమ్మ.
రద్దీ లేని దోవవడంతో ఆమె గొంతు ఆమడ దూరానికి వినబడుతుంది….
“సర్లేవే, ఓ తడవ ఆదివారం అట్టాగే సూపెడదాములే,” అన్నాడతను.
మరి కాసేపటికి, నన్ను కొట్టాంలో వదిలెళ్ళారు కమలమ్మా వాళ్ళు.

సినిమా గురించి తెలీజెయ్యాలని తాత కోసం చూస్తే, నులక మంచం మీద అటు తిరిగి తొంగొనున్నాడు. నేనొచ్చేవరకు కాసుకొని ఉండకుండా తొంగున్నాడని కాస్త బాధేసింది.
తాతకి ఇష్టంలేని మనిషితో తిరగడం నాకూ కష్టంగానే ఉంది. ‘తాతకి కమలమ్మ మీద కోపం పోతే బాగుణ్ణు’ అనుకుంటూ సినిమా గురించే ఆలోచిస్తూ నేనూ పక్క మీద చేరాను.
**
పొద్దున్నే గుడికి బయలుదేర బోతుంటే తాత కడుపునొప్పితో మెలికలు తిరిగిపోయాడు. దగ్గు, వాంతులు ఒకదాని వెంట ఒకటి తాతని ముంచెత్తాయి. పిన్ని, బాబాయి తాతని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. నన్ను గుడికి వెళ్ళిపొమ్మన్నారు.
‘తాత మళ్ళీ నీరసించాడన్నమాట. అందుకేనేమో రాత్రి అలా పెందరాళే తొంగున్నాడు.
**
దినమంతా తాత విషయం చాల దిగులుగా ఉంది. మధ్యానం నాలుగింటికి గుడికొచ్చిన చంద్రం పిన్ని ముఖంలో ఆదుర్దా, బాధ, నిరాశ కనిపించాయి. నాలో కూడా తాత గురించి గుబులు, భయం పెరిగాయి.
“తాత వారం రోజులు ఆసుపత్రిలో ఉండాలి. ఉన్న రోగాలకి తోడు చిన్నపేగు మెలిక పడిందంట. పెద్దాపరేషను చేసి లోపలి మెలిక తీయాల్సిందేనంట. నేను తాతకి తోడుగా ఆడనే ఉండాలి. ఈ వారం రోజులూ నీకు పగళ్ళు సాయంగా, రాత్రిళ్ళు తోడుగా మనోళ్ళు ఎవరన్నా ఉండేలా సూడాలి.
నీకీ విషయం చెప్పి పెందరాళే తీసుకెడదామని ఈడకొచ్చా. పనయ్యాక రాత్రికి తాత కాడికెళ్తాను,” అని చెబుతూ నన్ను బయలుదేర దీసింది పిన్ని.

అన్నీ వింటున్న కమలమ్మ, “అయ్యో అదేంది? నేను లేనా? మా గాయత్రిని నేను సూసుకోలేనా? తాతని మీరు బాగు చేసి ఇంటికి తెండి. గాయత్రికి నేనుంటాను తోడుగా.
రేపటినుంచి నా మకాం గాయత్రి దగ్గరే. సొంత బిడ్డలా సూసుకుంటాను. సరేనా? ఇక మీరెళ్ళండి. నేను అవసరమైనవి సర్దుకొని రేత్రికి వస్తాలే,” అంది చంద్రం పిన్నితో.
**
మౌనంగా కొట్టాం చేరాము. నాకు దిగులుగా ఉంది. రాగి జావ కాసి పళ్ళెంలో పోసి తెచ్చిచ్చింది పిన్ని.

“ఇదిగో గాయత్రి, మాకు ఈ కమలమ్మ యవ్వారం, మాట నచ్చవు. చాలా బధ్రంగా ఉండు ఆమెతో. గత్యంతరం లేక ఈ ఒక్క తడవ నీకు తోడుగా ఉండనీ,” అంది తాత బట్టలు సంచికేస్తూ ఆమె.
అర్ధమయింది అన్నట్టు తల ఊపాను.
ఇంకా అప్పటికి బట్టలవీ తెచ్చుకొస్తానన్న కమలమ్మ రాలేదు.
కొట్టామంతా ఓ సారి చీపురుతో చిమ్మింది. మరచెంబుడు నీళ్ళు నాకు తెచ్చిచ్చి కమలమ్మ కోసం చూస్తూ, పక్కనే కూచుంది పిన్ని.
తాత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఇంటికాడ నేను తీసుకోవల్సిన జాగ్రత్తలు మళ్ళీ చెప్పింది.

మరో ఐదు నిముషాలకి పెట్టెబేడాతో కమలమ్మ వచ్చాకే పిన్ని వెళ్ళింది.

egire-pavuramaa-10
**
తాత ఆసుపత్రిలో జేరి వారమయింది. తాత దగ్గరలేని వెలితి బాగా తెలుస్తుంది.
రోజు మార్చి రోజు తాతని చూడ్డానికి, పిన్నితోనే ఆసుపత్రికి పోతున్నాను. నాలుగు రోజులైనా తాత మగతలోనే ఉన్నాడని చంద్రం పిన్నికి గాబరాగా ఉంది. నాకైతే ఏమీ తోచడం లేదు.
**
గుడి నుంచి కొట్టాం చేరి పుస్తకాలు ముందేసుకొని చదువుతూ కూచున్నా. మనసు లగ్నం చేయలేక చదువు సాగడం లేదు.

చీకటి పడ్డాక చంద్రం పిన్నొచ్చింది. “ఈ పూటే తాత లేచి మాట్లాడుతున్నాడంట. రాంబాబాయి ఇప్పుడే తాతని చూసొచ్చాడు. ఇక నీకోసం అడుగుతాడు. పద చూసొద్దాము,” అని నన్ను బయలుదేరదీసింది.
**
మేమెళ్ళేప్పటికి తాత తెలివిగానే ఉన్నాడు. మమ్మల్ని చూసి ఆనందపడ్డాడు.
మందులకి బిల్లు కట్టాలని నర్సు చెబితే, తాతని పలకరించి బయటకెళ్ళింది చంద్రమ్మ.

“ఈ పూటే కాస్త కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడు మీ తాత,” అంది తాతకి బ్యాండేజీ మార్చడం ముగించిన నర్సు.

“కట్టు మార్చానులే. ఇక్కడకొచ్చి కూర్చో. నీ గురించే చెబుతున్నాడు. నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నట్టున్నాడు. అదృష్టవంతురాలివే గాయత్రి,” అంటూ తాతతో మందు మింగించి వెళ్ళిందామె.
తాత మంచం కాడికెళ్ళి కూచున్నాను. గోడకి నిలబెడితే జారుతాయని ఊతకర్రలు తాత మంచమెనక్కి పెట్టాను.

మెల్లగా లేచి తలగడ కానుకుని కూర్చున్నాడు తాత.
“నా ఆరోగ్యం అంతంతగా ఉంది తల్లీ. నీ గురించేనమ్మా నా దిగులు. ఈ వారంలో ‘వంశీ వికలాంగుల సంస్థ’ వాళ్ళు మన ఊరికి రావచ్చు. వాళ్ళ రాక విషయం పూజారయ్యకి ముందుగానే తెలుస్తుంది. మన ఊళ్ళోకి వచ్చినప్పుడు మన కాడికి వస్తామన్నారులే.
నిన్ను చూసి, వాళ్ళ వైద్యుల చేత పరీక్ష చేయించాకే – నీ చికిత్స విషయంగా సాయం చేయగలరంట,” అని వివరంగా చెప్పాడు తాత.
విని సరేనని తలూపాను.
**
మరునాడు పూలపని చేస్తుండగా, పూజారయ్య వచ్చి నాకెదురుగా అరుగు మీద కూచున్నారు. నా పక్కనే తమలపాకులు శుభ్రం చేస్తున్న కమలమ్మ, తన పనిని కాస్త దూరంగా వెనక్కి జరుపుకొంది.
“చూడమ్మా గాయత్రి, “ ‘వంశీ’ సంస్థ వారు రేపు మన ఊళ్ళోకి వస్తున్నారు. మీ తాత వెళ్ళి వాళ్ళతో నీ విషయం మాట్లాడిన సంగతి తెలుసుగా! తీరా వాళ్ళు మన దగ్గరికి వచ్చే సమయానికి ఇలా ఆసుపత్రిలో ఉన్నాడు పాపం సత్యం. అయినా పర్వాలేదులే. నేను, ఉమా ఉన్నాముగా నీకు సాయం,” అన్నారాయన.
ఔననట్టుగా తలూపి వింటున్నాను.

“వాళ్ళ వైద్యుల్ని వెంట బెట్టుకొని మరీ వస్తారుట. ఇక్కడ మన గుడి ఆవరణలోనే వాళ్ళ బస్సు పెట్టుకుంటారు. మన పల్లెలో ఇంకా అంగవైకల్యం ఉన్న పసివాళ్లని కొందరిని చూస్తారట.
నువ్వైతే రెడీగా ఉండు,” అంటూ తాత గురించి అడిగారు పూజారయ్య.

“మీ రాంబాబాయి వచ్చి వెళ్ళాడులే. నిన్ననే కళ్ళు తెరిచాడటగా సత్యం? వంశీ సంస్థతో మన పని కూడా అయ్యాక, అతన్ని చూడ్డానికి వెళతాము,” అంటూ లేచి గుడిలోకి వెళ్లారు పూజారయ్య.
**
తరువాత అరగంటకి ఉమమ్మ వచ్చింది. “నీ పనులన్నీ మెల్లగా ఒక్కోటి అవుతున్నాయిగా! రేపు నీకు వైద్యపరీక్షలు జరిగే అవకాశం ఉందంట. నేను ఆ సమయానికి నీతోనే ఉంటానులే,” అంటూ నా పక్కనే కూచుందామె.

శుభ్రం చేసిన తమలపాకులు లోనికి తీసుకెళుతూ కమలమ్మ మా కాడికి వచ్చింది. మరునాడు సంస్థ వాళ్ళు వచ్చే సమయానికి ఏ సాయం చేయడానికైనా, తను అందుబాటులోనే ఉంటానని ఉమమ్మకి, నాకు చెప్పి వెళ్ళింది.

ఎప్పటిలా పర్సు నుండి చాక్లెట్టు తీసిస్తూ, “మాస్టారుగారు పంపిన కొత్త పుస్తకాలు ఇవ్వడానికే వచ్చాను,” అంటూ సంచి నుండి ఒక్కో పుస్తకం నా చేతుల్లో పెట్టింది ఉమమ్మ.
“ఇవి ఏడవ తరగతి లెక్కలు, సాంఘికం, సైన్స్ పుస్తకాలు. రెండో తరగతి ఇంగ్లీష్ కూడా తెచ్చాను. ఎల్లుండి నుంచి మొదలు ఈ చదువు,” అని నా భుజం మీద తట్టింది మెచ్చుకోలుగా.

సంతోషంగా, గర్వంగా అనిపించింది. ఆశించినట్టు వంశీ వారు మా ఊరు రావడం, నేనేమో ఏడవ తరగతి చదువు మొదలెట్టడం, రెండు సంగతులూ తాతకి ఆనందాన్ని కలిగించేవే….రేపే చెప్పాలి అనుకున్నాను.
**
సాయంత్రం ఇంటికాడ పనులు చేసుకొని కొత్త పుస్తకాలు ముందేసుకోగానే చంద్రం పిన్నొచ్చింది.

“గండం నుండి బయటపడి మొత్తానికి తాత మరో మూడురోజుల్లో ఇంటికి వచ్చేస్తాడు,” అని చెపుతూ నా పక్కనే కూచుని, సంతోషంతో నా చెంపలు నొక్కి ముద్దెట్టుకుంది.
‘ఎప్పటిలా మా కొట్టాంలో, మళ్ళీ తాత నా కళ్ళ ముందు’ అన్న తలంపే ఎంతో తృప్తిగా అనిపించింది.

“నాకూ కాస్త ఈ తిరగడం తగ్గుతుందిలే. మళ్ళీ రేపొస్తా ,” నవ్వుతూ పనుందంటూ వెళ్ళింది పిన్ని.

ఇదంతా చూస్తూ, మా మాటలు వింటూ వంట ముగించిన కమలమ్మ నన్ను బువ్వ తినడానికి రమ్మంది. పుస్తకాలు పక్కనెట్టి వెళ్ళి తినడానికి కూచున్నా.
కమలమ్మ కొసరి కొసరి వడ్డించింది.
“చూడు గాయత్రి, ఎప్పటినుంచో నేను తెలుసుకొన్న కొన్ని ఇషయాలు నీకు సెప్పాలనుకున్నా. ఇప్పటివరకు నోరు తెరవలేదు. నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు,” అని తానొక ముద్ద తిని నీళ్ళు తాగి మళ్ళీ మొదలెట్టింది కమలమ్మ.
ఆమె అనేది వింటూ తింటున్నాను.

“ఇది నీ అవిటితనం గురించి, నీ బతుకుతెరువు గురించి, నువ్వు దేవుడనుకుంటున్న నీ తాత గురించి,” మళ్ళీ ఆగి నా వంక చూసింది.

“మీ తాత ఉప్పరోడిగానో, రిక్షావాడిగానో బతికే టైములో నువ్వు దొరికావంట. దిక్కులేని దానవేనంట. ఎత్తుకొచ్చుకొని సాకాడు, సరే! ఎందువల్లో మరి నీకు నడక, మాట రాడం ఆలస్యమయితే, వైద్యం సేయించాల్సింది పోయి, అవిటిదని ముద్రేసి, ఆ నాటి నుంచి ఈ నాటి వరకు, నిన్ను ఆ గుడి మెట్ల మీద కూకోబెట్టి డబ్బు సంపాదిస్తున్నాడు.
అసలు నన్నడిగితే, ఆ ముసలాడే నిన్ను కసాయి ముఠా వాళ్ళ చేత అవిటిదానిగా సేయించుంటాడు.. మనం మొన్న చూసిన సినిమాలో లాగా,” అన్న కమలమ్మ మాటలకి ముద్ద మింగుడు పడలేదు నాకు.

తల వంచుకునే ఉన్నాను. గుండెలు బరువెక్కి, కడుపులో దేవేసినట్టయింది. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి.
నా వంక చూస్తూనే మళ్ళీ మొదలెట్టిందామె.
“ఎంతో కాలంగా మీ తాత స్నేహితులే ఆ కూరలబడ్డీ వాళ్ళు, నాయుడన్న వాళ్ళు. వాళ్ళ మాటల్ని బట్టే తెలిసింది.
మీరుండే కొట్టాం కాక ఆరెకరాల వరిపొలం ఉందంట నీ తాతకి.
నీ డబ్బుతోనే కాదా ఇంత మంచి కొట్టాం, పొలం సంపాదించుకున్నాడు ఆ ముసలాడు?.
కాని ఏదీ నీది కాదు. ఇన్నేళ్ళ నీ చాకిరీ ఏమైంది? నీ వైద్యానికి సరిపడా డబ్బు ఉన్నా, ఉచిత వైద్యం కోసం వికలాంగుల సంస్థకి నిన్ను అప్పజెప్పాలని చూస్తున్నాడంట ఆ ముసలాడు,” క్షణం ఆగింది.

నేనేమి వింటున్నానో, అర్ధమవుతుందో లేదో కూడా తెలీడం లేదు…

“మొన్ననెళ్ళి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాడంట నీ తాత. ఆ సంస్థ వాళ్ళేమో తిన్నగానే ఉన్న నీ కాళ్ళని మోకాళ్ళ వరకు తీసేసి, కుత్రిమంగా కాళ్ళు పెట్టి నీతో వెట్టి చాకిరీ చేయిస్తారంట.
అందుగ్గాను మీ తాతకి డబ్బులిస్తారంట,” నా వంక సూటిగా చూసింది.
ఆపుకోలేని కన్నీళ్ళని తుడుచుకోను ప్రయత్నిస్తున్నాను…
“అసలా ముసలాడు చేసేది పెద్ద నేరమంట. పసిపిల్లతో పని చేయించి డబ్బులు దోచుకుంటున్నాడని నా బోటిది ఫిర్యాదు చేస్తే, ‘బాల కార్మికం’ నేరం మీద పోలీసోళ్ళు నీ తాతని జైల్లో తోస్తారంట కూడా,” అంది ఆవేశంగా.
ఆమె మాటలతో నా కడుపు ఉడికిపోయింది. నా గుండె ఆగిపోతుందేమో అన్నంత బాధ కలిగింది. చేతినున్న మెతుకులని పళ్ళెంలోకి వదిలేసి ఎడమ చేత్తో ఆగని కన్నీళ్లు తుడుచుకున్నాను.

మళ్ళీ అందుకుందామె.
“ఇయ్యాలో రేపో అన్నట్టయిపోయాడు నీ తాత. నీ సంపాదన, తోడు లేందే ఆ ముసలాడి జీవనం జరగదు. ఆయన చికిత్స, మందులు అంతా నీ సంపాదనే. పూజరయ్యకి కూడా ఇందులో భాగముందని నా అనుమానం,” అన్న ఆమె మాటలకి తల మొద్దెక్కిపోయింది.

నా కింద భూమి జారినట్టయింది. ఎలాగో అక్కడి నుంచి జరిగాను.
ఇంక చాలు అన్నట్టు కమలమ్మని వారించబోయాను. నా చేయి ఆమెవైపు చాచి, ‘ఇంకేమీ నాకు చెప్పొద్దన్నాను.
నా చేయి తన చేతిలో బిగించింది కమలమ్మ.

(ఇంకా ఉంది)

మీ మాటలు

  1. అసలు కథ ఇప్పుడు మొదలవుతున్దనిపిస్తుంది. ఇప్పుడు కుతూహలం ఇంకా పెరిగింది.

మీ మాటలు

*