అందాల వీధులన్నీ అంతమయ్యే చోటు.. రోమ్ నగరం!

rome1

రోమ్! ఈనాటి రోమ్ నగరం!
ఇటలీ దేశానికి రాజధాని!
రోమ! ఇటాలియన్, లాటిన్ భాషల్లో రోముని రోమ అంటారు!
ప్రపంచాన్ని ఆనాడు గడగడలాడించిన రోమన్ సామ్రాజ్యం!
జూలియస్ సీజర్, మార్క్ ఆంటోనీలను తన పాదాల దగ్గర కూర్చోబెట్టుకుని ఆడించిన, ఈజిప్ట్ ఫారా క్లియోపాట్రా! క్లియోపాట్రా అందానికి బానిసగా మారిన రోమ రాజ్యం!
నేను చదువుకున్న అన్ని దేశ చరిత్రల్లోనూ, నాకెంతో ఉత్సాహాన్ని కలిగించిన ఆనాటి రోమన్ సామ్రాజ్య రాజధానికి వెళ్లటం. ఒక రకంగా అదో అనిర్వచనీయమైన అనుభూతి!
౦ ౦ ౦
పది వేల సంవత్సరాల క్రితమే అక్కడ దొరికిన రాతి ఆయుధాల ఆధారంగానూ, ఇతరత్రా జరిగిన పరిశోధన ద్వారానూ, రోములో దాదాపు 14,000 సంవత్సరాల క్రితమే ఆది మానవులు వుండేవారని తెలుస్తున్నది. మనకి వున్న పురాణాల కథల లాగానే, వీరికీ ఎన్నో పురాణ కథలున్నాయి. (Roman Mythology). రోములస్, రేమస్ అనే అన్నదమ్ములు ఒక తోడేలుకి పుట్టారనీ, తర్వాత రోములస్ రేమసుని చంపి అధికారం చెలాయించాడనీ ఒక కథ వుంది. అతని పేరుతోనే ఆ స్థలానికి రోమ్ అని పేరు వచ్చి వుండవచ్చు. రోమన్ చరిత్ర చాల ప్రాచీనమైనది కనుకా, ఈ వ్యాసానికి ఆ వివరాలు అనవసరం కనుకా, ఆ వివరాలు మీ పరిశీలనకే వదిలేస్తున్నాను.
౦ ౦ ౦
మేము ఎయిర్పోర్టు నించీ హోటలుకి వెళ్ళేసరికీ చీకటి పడింది. సామాను గదిలో పెట్టి, ముందు ఆఫీసులో బల్ల వెనుక వయ్యారంగా నుంచున్న బంగారం జుట్టు సోనియాని అడిగాను, ‘ఇక్కడ దగ్గర్లో ఏమైనా ఇండియన్ రెస్టారెంట్లు వున్నాయా, అమ్మడూ!’ అని.
“ఈ పక్కసందులోనే వుంది గాంధీ అని ఒక ఇండియన్ రెస్టారెంట్. బావుంటుంది” అంది సోనియా.
ఆమె దగ్గరే కొన్ని మ్యాపులు, చూడవలసిన విశేషాలు, వాటి వివరాలు తీసుకున్నాం.
భోజనానంతరం, తర్వాత మూడు రోజులు ఏమేమిటి, ఎప్పుడెప్పుడు చూడాలో ప్లాన్ చేసుకున్నాం.

౦ ౦ ౦
మర్నాడు ప్రొద్దున్న తొమ్మిదింటికి బయల్దేరి వాటికన్ వున్న ప్రదేశానికి వెళ్ళాం. హోటలుకి దగ్గరే. ఒక అరగంట నడక.

వాటికన్ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. దేశంలో దేశం. ఇటలీ దేశంలోని ఒక స్వతంత్ర దేశం. రోమ్ నగరంలో వున్న ఒక చిన్న దేశం! ఇలా అనటానికే వింతగా వుంది కదూ! 109 ఎకరాల్లో, 800మంది జనాభా వున్న దేశం. కాథలిక్ క్రిస్టియన్ మతానికి రాజధాని. 1929లో ఇటలీ దేశంనించీ బయటికి వచ్చి స్వతంత్ర దేశం అయింది. ప్రతి రోజూ ప్రపంచం నలుమూలల నించీ యాత్రీకులు కొన్ని లక్షల్లో ఇక్కడికి వస్తుంటారు.

మేము వాటికన్ వెళ్ళేటప్పటికి సమయం దాదాపు తొమ్మిదీ నలభై ఐదు అయింది. అప్పటికే ఎన్నో వేల మంది జనం, కొన్ని వరుసల్లో నేల మీద బారులు తీర్చి కూర్చునివున్నారు. ఒకావిడని అడిగితే చెప్పింది. ప్రతి బుధవారం, ప్రొద్దున్న పదిగంటలకు పోప్ బెనెడిక్ట్ బయటికి వచ్చి, అందరి మధ్య నించీ వెడుతూ దర్సనమిస్తాడని.
మేము ముందు అనుకోకపోయినా, మా అదృష్టవశాత్తూ ఆరోజు బుధవారం. మేము అక్కడే సైంట్ పీటర్స్ స్క్వేర్లో సర్దుకుని కూర్చుంటున్నప్పుడు, దూరంగా పోప్ ఒక గోల్ఫ్ కారులో రావటం చూసాం. మధ్య మధ్యలో ఆగుతూ అందరినీ పలకరిస్తూ వస్తున్నాడాయన. చూడటానికి వచ్చిన వాళ్ళందరూ, ఉత్సాహంగా ఫోటోలు తీస్తున్నారు. మాకు ఒక వంద గజాల దూరంలో నించి కనపడ్డాడు. చేతులు పైకెత్తి, నవ్వుతూ అక్కడవున్న వాళ్ళని పలకరిస్తున్నాడు. శ్రీమతి ఆనందంతో గంతులు వేసింది. అమెరికాలోని మా పిల్లలకి, వాళ్లకి అర్ధరాత్రి అవుతుందని తెలిసి కూడా, వెంటనే టెక్స్ట్ మెసేజీలు పంపించింది, పొప్ కనపడ్డాడు అని.
అక్కడే వుంది సైంట్ పీటర్స్ బసీలికా చర్చి. దాని పక్కనే వాటికన్ మ్యూసియం, సిస్టిన్ చాపల్ వున్నాయి. ఇవన్నీ చూడటానికి పూర్తిగా ఒక రోజు పడుతుంది. ఇక్కడ ఎన్నో రకాల ప్రఖ్యాత చిత్రాలూ, శిల్పాలూ వున్నాయి. మైకలాంజేలో, పెరూజినో, బాట్టిచెల్లీ మొదలైన వారి కళాఖండాలు చూడవచ్చు. అన్నీ బైబిల్ పురాణ గాధల చిత్రాలు, శిల్పాలు. ఒక దానిని మించి ఇంకొకటి. వాటికన్ మ్యూసియంలో 1400 గదులు వున్నాయి. ఇక్కడ కొన్ని చిత్రపటాలు 3000 సంవత్సరాల క్రితంవి కూడా వున్నాయి. సిస్టిన్ చాపల్ 1473-1481 ప్రాంతంలో కట్టారు. ఇక్కడే పోప్ ఎన్నికలు జరిగేవి. 1506లో స్విస్ కాపలాదార్లు బసీలికా చర్చి తలుపు దగ్గర కాపలా కాసేవారుట. కానీ ఇప్పుడు కాపాలాదారులు స్విస్ వారు కాకపోయినా, స్విస్ దుస్తులు వేసుకుని కదలకుండా అలా నిల్చుని వుంటారు.
ఇక్కడ చెప్పవలసినదొకటివుంది. ప్రతి దానికీ లోపలి వెళ్ళటానికి ఎంతో పెద్ద క్యూలు. మన తిరపతిలో దొంగ దర్శనంలా, కొంతమంది ఏజెంట్లు డబ్బులు ఎక్కువ తీసుకుని లైన్లను తప్పించి లోపలికి కొంచెం త్వరగా తీసుకువెడుతుంటారు. అది ఇక్కడ న్యాయ సమ్మతమే! లేదా ప్రొద్దున్నే ముందుగా వెడితే లైన్లు తక్కువగా వుంటాయి.

rome2

మర్నాడు మేము రోమన్ సామ్రాజ్య శిధిలాలను చూడటానికి వెళ్ళాం. రోమన్ కలోసియం క్రీస్తు శకం 70వ శతాబ్దంలో కట్టిన పెద్ద స్టేడియం. అది ఎంతో పెద్ద కట్టడం. ఇటుకలతో కట్టారు. కొన్ని చోట్ల నాలుగు/ఐదు అంతస్తులు కూడా వుంటుంది. అక్కడే గ్లాడియేటర్ పోట్లాటలు, జంతువులతో మనుష్యుల చెలగాటాలూ జరిగేవి. రాజులు రాణులూ అవి చూసి ఆనందిస్తూ వుండే వారు. పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణసంకటం అనే సామెత గుర్తుకి వచ్చింది నాకప్పుడు.

rome3

పక్కనే పాలటిన్ హిల్. అక్కడ ఆరోజుల్లో చక్రవర్తులు కొందరు వుండేవారుట. ఇలా శిధిలమైపోయిన చర్చిలూ, ఆర్చిలూ, ఇతర కట్టడాలూ, ఆ చుట్టుపక్కల ఎన్నో వున్నాయి. వాటిని అన్నిటినీ కలిపి రోమన్ ఫోరం అంటారు. నడవటం ఇబ్బంది లేకపోతే, అవన్నీ చూస్తూ నడవవచ్చు.
చూడవలసిన ఇంకొక కట్టడం ట్రేవీ ఫౌంటెన్. అక్కడ శిల్పం బాగుంటుంది. దీన్ని 1762లో కట్టారుట. వచ్చినవాళ్ళు, వెనక్కి తిరిగి కూర్చుని, ఆ ఫౌంటెన్ నీటిలో చిల్లర పడేస్తుంటారు. అలా చేస్తే, అనుకున్నది జరుగుతుందని ఒక మూఢ నమ్మకం.
నేను మాత్రం, నా చేతిలో వున్న చిల్లర, అక్కడ దారిలో కూర్చుని అడుక్కుంటున్న ఒక నడుము వంగిపోయిన ముసలావిడకి ఇచ్చి, ఆవిడకి ఆరోజు కడుపునిండాలని కోరుకున్నాను.
ఊరు మధ్యలో కట్టిన మాన్యుమెంట్ బిల్డింగ్ రోమ్ నగరానికే ఎంతో అందాన్నిస్తుంది.

rome4

ఇక్కడ ఇంకా ఎన్నో మ్యూసియంలు, శిధిలమైన కట్టడాలు వున్నాయి. ఊరు మధ్యలో కొన్ని కాలువలూ, వాటి మీద పెద్ద పెద్ద వంతెనలు వున్నాయి. ఒక్కొక్కటి తీరిగ్గా చూసుకుంటూ వెళ్ళాలంటే, మూడు రోజులు చాలవు.
నాకు ఇక్కడ నచ్చనిది ఏమిటంటే, ఇక్కడ రోడ్ల మీద శుభ్రత కొంచెం తక్కువ అనే చెప్పాలి. కాలువల దగ్గర కొంచెం దుర్వాసన కూడా వుంది. తీర్ధయాత్రా స్థలాలలో చాల చోట్ల ఇలా వుండటం మామూలే అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే మిగతా అన్నిచోట్లా, అమెరికా, యూరప్, పసిఫిక్ ఆసియా దేశాల్లో మరి అన్నీ శుభ్రంగానే వున్నాయి!
ఇది ఒక్కటీ పక్కన పెడితే, రోమ్ చూడదగ్గ అందమైన చారిత్రాత్మక నగరం!
౦ ౦ ౦

-సత్యం మందపాటి

satyam mandapati

మీ మాటలు

  1. saratchandra says:

    Nice

  2. సత్యంగారూ,
    చక్కని వ్యాసానికి అందమైన ఫొటోలు.. ఆయా ప్రాంతాలను మాకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
    ధన్యవాదాలు.
    కొల్లూరి సోమ శంకర్

మీ మాటలు

*