బొమ్మలోంచి సినిమాలోకి నడిచొచ్చిన ‘బాపూ తనపు’ హీరోయిన్!

 

1

రెండు జెళ్ళ సీతల్నీ, బుడుగునీ, సీగాన పెసూనాంబనీ, బక్కచిక్కిన ముగుడు గార్లనీ, లావుపాటి పక్కింటి పిన్నిగార్లనీ, గిరీశాన్నీ, రాధనీ, గోపాళాన్నీ, ఇంకా తెలుగు కథల, నవలల నాయికా నాయకులనీ, దుష్ట విలన్లనీ, బొర్ర రాజకీయ నాయకుల్నీ అవిశ్రాంతంగా గీతల్లో బంధించి మనకందించి, చిరకాల స్నేహితుడి దగ్గరకు వెళ్ళిపోయారు మన బాపు. అంతేనా? ‘నవ రసాలంటే నా కుంచె నుంచి జాలువారినవే’ అన్నారు. ‘అష్ట విధ నాయికల పోకడలిలానే ఉంటాయ’ని బొమ్మలు కట్టారు. రాముడూ, సీతా, తిరుమలేశుడూ, ఇంకా సమస్త దేవీ దేవతల రూపాల్ని ఇంతకంటే గొప్పగా ఎవరు గీయగలరో నేనూ చూస్తానంటూ కాపీరైట్ చేసేసుకుని మరీ పయనం కట్టారు. రావిశాస్త్రి, శంకరమంచి సత్యం, నామిని వంటివారు రాసిన ఒక్కొక్క కథనూ అద్దంలో కొండలా ఒక్కొక్క బొమ్మలోనే పట్టి చూపించిన ఈ ఘనుడి విస్తృతి మన తెలుగువారికే సొంతం అనుకోవటం మనకు ఒకింత గర్వంగానూ ఉంటుంది.

తెలుగు నేల మీద బాపు సినిమాలంటే ప్రాణం పెట్టే అభిమానులకూ, బాపు స్పెషలిస్ట్ లకూ తక్కువలేదు. కానీ సినిమాల్లో ఆయన పెట్టిన ఒరవడిని అందుకున్న దర్శకులెవరూ కనిపించరు. ఆయన స్ఫూర్తితో సినిమాలు తీశానన్న విజయనిర్మల కూడా పెద్దగా చేసిందేమీ లేదు. బాపు చిత్రకళ అంత స్థాయిలో కాకపోయినా ఆయన సినిమా కూడా కొంతవరకూ ప్రత్యేకంగానే ఉండిపోయిందీ అంటే, దానిక్కారణం ఒకటే అనిపిస్తుంది. బాపును సినిమాల్లో అందుకోవాలంటే కావలసిన దినుసు హాలీవుడ్ లో లేని మనదైన visual literacy మరియూ రస దృష్టి.

2

 

3

ఆయన ప్రపంచ సినిమా చాలానే చూశాడు. ఐసెన్ స్టెయిన్ లా, సత్యజిత్ రాయ్ లా బొమ్మలతో స్టోరీ బోర్డ్ తయారు చేసుకుని సినిమాలు తీశాడనీ అందరికీ తెలుసు. అరుదైన ఈ పద్ధతిలో, బాపూకి మాత్రమే చెందిన ఇంకా అరుదైన రీతి ఏమిటంటే, తన నాయికల కదలికలను తన చిత్రాల్లోని గీతల పరిధిలోనే ఉండేటట్టుగా శాసించటం. కట్టూ, బొట్టూ, మాటతీరు, నడక, నవ్వు, పెదవి విరుపూ, చురుకు చూపూ… బాపు హీరోయిన్ అంటే అచ్చం బాపు బొమ్మలాగే ఉంటుంది. ఆ stylization అనితర సాధ్యం. విజయనిర్మల, వాణిశ్రీ, హలం, జయప్రద, జ్యోతి, మాధవి, గీత, సంగీత, దివ్యవాణి, ఆమని, స్నేహల నుంచీ చివరకు ఛార్మి వరకూ కూడా ఆ మూసలో ఒదగవలసిందే. బాపు సినిమాల బ్రాండ్ కు వీరంతా అంబాసడర్స్. వినయపు, వందనపు బొమ్మల్లాంటి వాణిశ్రీ, సంగీతల నుండి, నేటికాలానికి వస్తున్నకొద్దీ అమ్మాయిల్లో వచ్చే మార్పులు దుస్తుల్లోనూ బాడీ లాంగ్వేజ్ లోనూ కొద్ది కొద్దిగా చేస్తూనే ఇవి తన బొమ్మలేనని ముద్ర వెయ్యటం బాపు ప్రత్యేకత.

4

బాపు నాయికల విషయంలో ఇది పూర్తిగా తెలుగుతనం మాత్రమేనని చెప్పలేం. ఆహార్యంలో తెలుగుతనం ఉట్టిపడుతూనే ప్రత్యేకంగా కనిపించే ‘బాపూతనం’ ఇది. స్మితా పాటిల్ గుజరాతీ పల్లె పడుచుగా (మంథన్, మిర్చ్ మసాలా), శ్రామికురాలిగా ఆదివాసీగా (చక్ర, ఆక్రోష్), తమిళ యువతిగా (చిదంబరం) ఆయా వర్గాలకూ, ప్రాంతాలకూ చెందిన స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన కదలికలు నటనలో ప్రదర్శిస్తుంది. తన నాయికల్లో అటువంటి సహజత్వానికంటే స్త్రీత్వానికే పట్టం కడతాడు బాపు. అమ్మాయికి కాటుకా, బొట్టూ పెట్టి, వాలు జడలో పూలు తురిమి, పాదాలకు పట్టీలు పెట్టి, చక్కని చీర కట్టి ముస్తాబు చేసి, వయ్యారపు నడక నేర్పి, ఇక చూడండని మనల్ని మురిపిస్తాడు. ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ప్రతీ మగవాడూ కలలు కనేటట్టు చేసేస్తాడు. బాపు కెమెరా కాటుక కళ్ళనీ, నల్లని పొడుగాటి వాలు జడనీ, వింత భంగిమల్లో నడుము వంపునీ చూడకుండా వదలదు. వాలు జడ అంటే, దాని మీద పాట రాయించుకుని చిత్రీకరించేంత ఇష్టం బాపుకి (రాధా గోపాళం). ఇంతటి Indulgent కొంటె camera కూడా సభ్యత గీత దాటిన సందర్భాలు తక్కువే. Celebration of the body beautiful, దాంపత్య శృంగారం, బాపు సినిమాల్లో ఉన్నంత అందంగా ఇంకెక్కడా ఉండవేమో!   బాపు తరువాత ఈ రెండిటిలో బాగా ఒడుపును సాధించిన దర్శకుడు తమిళ మణిరత్నమే.

అయిదు నిముషాలపాటు సజ్జాద్ హుస్సేన్ చేత మాండొలిన్ సంగీతం రికార్డ్ చేయించుకుని సంగీత, శ్రీధర్ మీద బాపు తీసిన హనీమూన్ దృశ్యాలు 1975లో ముత్యాలముగ్గులో చూసిన వారికి ఒక ఆశ్చర్యకరమైన కొత్త అనుభూతి. ఒక క్షణంపాటే ఎక్కుపెట్టినట్టున్న సంగీత పాదాన్నీ (పట్టీలూ, పారాణీ మామూలే), మొహం లో అరనవ్వునీ చూపిస్తూ మన ఊహకే ఎంతో వదిలేస్తాడు. పెళ్లి పుస్తకంలో అమ్ముకుట్టి, రాజేంద్ర ప్రసాద్ ల సరసాలు చూసి మురవని తెలుగు జంట ఉండదు.

తన నాయికలను తెల్లని రంగూ, సాంప్రదాయకమైన అందంతో తూచకుండా ఎన్నుకోవటం బాపులో ఉన్న అనేక సద్గుణాలలో ఒకటి. వాళ్ళు కాస్త బొద్దుగా ఉన్నా తన గీతలోకి వొదగటం ఒక్కటే ప్రధానం. తీరైన నల్లని శిల్పంలాంటి ముక్కూ మొహమూ గల వాణిశ్రీ ‘గోరంత దీపం’ లో ఉన్నంత అందంగా ఇంకే సినిమాలోనూ ఉండదు. విజయనిర్మల, రాధిక, జ్యోతి, సంగీత, దివ్యవాణి లాంటి సాధారణమైన అందంగల నాయికలను తక్కువ మేకప్ తోనే కావ్యనాయికల్లా మలిచాడు బాపు. బాపు హీరోయిన్ లను చూస్తుంటే, తెలుగు అమ్మాయిలను కాదని తెల్ల తోలు భామల్ని ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకొనే వెర్రితనంనుంచి మన తెలుగు సినిమా ఎప్పటికైనా బయట పడుతుందా అని దిగులేస్తుంది.

56

 

బాపు సినిమా గురించి చెప్తూ దర్శకుడు తేజ “మేమంతా ఏవో ఫ్రేములు తీస్తుంటాం గానీ బాపు ఫ్రేములు వేరు, అవి ఎవరికీ రావ’న్నాడు. ఒక గొప్ప చిత్రకారుడు సినిమా తీస్తే అలవోకగా జరిగే ప్రక్రియ ఇది. ఛాయాగ్రాహకులతో సహా చాలా మందికి ఈనాటికీ లేదీ visual sense. బాపు ఫ్రేముల్ని సరైన కాంతిలో, రంగుల్లో చూపించగలిగిన సత్తా గల   ఛాయాగ్రాహకులు ఇషాన్ ఆర్య, బాబా అజ్మీలిద్దరే. ఇషాన్ ఆర్యను వెదికి తెచ్చుకొనేవరకూ బాపు ఫ్రేముల అందం కూడా అప్పటి సినిమాటోగ్రాఫర్ల జూమ్ షాట్ల, క్రేన్ షాట్ల, Uncle Tom whitewash photography పనితనం ముందు వెలవెలబోయేది. ముత్యాల ముగ్గు నుంచీ బాపు ఫ్రేములు మిలమిలా మెరవటం మొదలెట్టాయి. ముత్యాల ముగ్గు, స్నేహం, గోరంత దీపం, తూర్పు వెళ్ళే రైలు … ఇషాన్ ఆర్య చేస్తే, వంశవృక్షం, మరికొన్ని సినిమాలు బాబా అజ్మీ చేశాడు. Long lens వాడకంతో పాత్రల ముఖకవళికల్ని స్ఫుటంగా మన కన్నుల్లో ముద్రిస్తాడు బాపు. పెళ్లి పుస్తకంలో ‘శ్రీరస్తు శుభమస్తు’ పాట మొత్తం long focal lens తో నడిపిస్తాడు. పెళ్లి పుస్తకం నాటికి తెలుగు నేల మీద సినిమాటోగ్రఫీ కూడా కాస్త మెరుగు పడింది.

హాలీవుడ్ సినిమాల ప్రభావం సత్యజిత్ రాయ్ వలే బాపు మీద కూడా ఎక్కువగానే ఉన్నా, వీళ్ళిద్దరూ కూడా సొంత నేల మీద వేళ్ళు తన్నుకున్న వృక్షాలే. ఈ లక్షణమే వీళ్ళ సినిమాల సౌందర్యం కూడా. కథ చెప్పడం వరకూ మాత్రమే వీళ్ళు హాలీవుడ్ ను అనుసరించారు. హాలీవుడ్ వెస్టర్న్ ‘High noon’ కథను సూత్రప్రాయంగా అనుసరించిన బాపు మొదటి సినిమా ‘సాక్షి’ లో కనపడే పల్లెటూరితనం, అమాయకపు పాత్రలూ, అతి తెలివి పాత్రలూ, దాన్ని అచ్చ తెలుగు సినిమాను చేశాయి. మొదట కాస్త పిల్లాటలా అనిపించిన సినిమా చివరలో రాత్రి లైటింగ్ లో మంచి పట్టుగా సాగుతుంది. కృష్ణ చేత కూడా నటింపజేయటానికి ప్రయత్నించాడు బాపు.

7

చాలా వరకూ బాపు సినిమాలు పౌరాణికాలయితే రామాయణం. సాంఘికాలైతేనూ రామాయణమే. ఇది ఆయన బలం అవునో కాదో గానీ బలహీనత మాత్రం ఖచ్చితంగా అవును. సినిమా ఎలా తీయాలో చాలా బాగా తెలిసిన పెద్దాయన రామాయణానికీ, మధ్య తరగతి దాంపత్యాలకీ, జమిందారీలకీ సంబంధించిన కథనాలకే ఎక్కువగా పరిమితం కావటం ఒక దురదృష్టమే. ప్రపంచ స్థాయి కథలను అర్ధం చేసుకుని, మెచ్చుకుని, వాటికి అర్ధవంతమైన బొమ్మలు వెయ్యగల సామర్ధ్యం ఉన్న పెద్ద మనిషి సినిమాల్లో వస్తు వైవిధ్యం ఇంత తక్కువగా ఉండటమేమిటో !

బాపు తన కథలకు పూర్తి విరుద్ధంగా చేపట్టిన సీరియస్ సినిమా ‘వంశవృక్షం’. ఎస్.ఎల్. బైరప్ప ప్రసిద్ధ నవలను అనుసరించిన కన్నడ సినిమాకంటే కూడా ఈ తెలుగు సినిమా బరువు ప్రేక్షకుల గుండెలనిండా నిండిపోతుంది. ఆ విషాద కావ్యాన్ని అంతటి అనుభూతితోనూ మనకందించిన బాపు సమర్ధత, మరిన్ని విభిన్నమైన కథా వస్తువులను స్వీకరించి ఉంటే, ముక్కలూ మెరుపులుగా కాకుండా ఇంకా కొన్ని సమగ్రమైన చక్కని సినిమాలు వచ్చుండేవి ! ఇలా ఆశించటం కూడా తప్పేమో! ఆయన మార్కెట్ బాధలు ఆయనవి.

బాపు సినిమాలకు ప్రాణమైన ఒకటో రకం హాస్యాన్నీ, అచ్చతెనుగు మాటనీ ఆప్త మిత్రుడు రమణ మూటగట్టి అందించాడు. చక్కని పాటలూ, సంగీతానికి తొంభైల వరకూ తెలుగులో తిరుగులేదు. ఈ కేన్వాసుల మీదుగా భక్తీ రక్తులలో ముంచిన కుంచెలతో బాపు అలవోకగా గీసిన కొన్ని సినీకళాకృతులు ప్రేక్షకుల మనసుల్లోంచి ఎప్పటికీ చెరగని బొమ్మలు.

                                                                                                        –   ల.లి.త.

lalitha parnandi

మీ మాటలు

  1. అందరిలానే బాపు చిత్రించిన తెలుగమ్మాయి, తెలుగుదనం గురించిన పొగుడుతూ రాసిన మీ వ్యాసంలో చివరికి ఆయనలో వైవిధ్యం లేకపోవడం, మధ్యతరగతి దాంపత్యాన్నే ఆయన చూపించడం గురించి రాసినందుకు అభినందనలు. బాపు ఒక చిత్రకారుడిగా, దర్శకుడిగా గొప్పవారే. కానీ ఆయనలోని లిమిటేషన్స్ ను కూడా పట్టించుకొనంతగా ఆయనను అతిగా పొగడ్తలతో ముంచెత్తెస్తున్నారు. బాపు, ముళ్ళపూడి విగ్రహాలను స్థాపిస్తామనేవరకు వెళ్ళిపోయారు. వారిని కారణజన్ములుగా చిత్రిస్తూ వారు ఉన్న కాలంలో ఉండడం పూర్వజన్మ సుకృతం అనడం బేలన్స్ లోపించిన అంధ అభిమానానికి నిదర్శనం. పరికిణీలు, ఓణీలు, వాలుజడతో తెలుగమ్మాయి వేషం ఒకప్పుడు బాగుండేదేమో కానీ, జీన్స్ ఫాంట్లు, షర్టులు, ఇతర దుస్తులతో అమ్మాయిలను చూడడానికి అలవాటుపడ్డాక తెలుగుదనం అనుకున్న పరికిణీలు, ఓణీలు, వాలుజడ వేషంలో మగవాడిలో కాముకత్వాన్ని రెచ్చగొట్టే వల్గారిటీయే కనిపించింది. బాపుగారి రాధా-గోపాళం సినిమా పబ్లిసిటీ బొమ్మల్లో నాకైతే ఆ వల్గారిటీయే కనిపించింది. కాలంలో వచ్చిన మార్పుల్ని గమనించకపోవడమే ఆయన లిమిటేషన్లలో ఒకటి, అందుకే ఆయన ఇటీవలి సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. బాపు ప్రతిభను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఆయన లిమిటేషన్లను సూచించడమే.

    • pavan santhosh surampudi says:

      // బాపు, ముళ్ళపూడి విగ్రహాలను స్థాపిస్తామనేవరకు వెళ్ళిపోయారు. //
      స్థాపించకూడదాండీ?

      • బాపు గొప్పా కళాకారులు అన్నంతవరకు బాగానే ఉంది ! విగ్రహాలను స్థాపించాడానికి వారు దేవుల్లాండీ!

    • Lalitha P. says:

      నేను హీరోయిన్ లోని తెలుగుతనాన్ని పొగడలేదు రమణ గారూ! అది తెలుగుతనం కంటే కూడా ఒక ‘మూస’ అని చెప్పాను. అది stylization . నచ్చటం, నచ్చకపోవటం వ్యక్తిగతం. వ్యక్తిగతంగా stylization కంటే సహజత్వమే నాకూ ఇష్టం. కానీ తెలుగు సరిగ్గా మాట్లాడలేని హీరో హీరోయన్ల కంటే బాపు stylization ఎంతో మెరుగు. సౌలభ్యం కోసం పల్లెటూళ్ళలో కూడా ఆడపిల్లలు సల్వార్ కుర్తాలు ధరిస్తున్నఈ కాలంలో లంగా, ఓణీలు పాతవై exotic అయిపోయాయి. మగవాళ్ళు వస్త్రధారణలో తెలుగుతనాన్ని ఎప్పుడో వదిలేసినా, ఆడవాళ్ళు సంస్కృతిని చాలా కాలం నెత్తినే మోసి, ఇప్పుడిప్పుడే వదిలేస్తున్నారు. చిన్నతనంలో చూస్తూ పెరిగి, తరువాత మనం వదిలేసిన వేషాలు కనీసం సినిమాల్లో, చిత్రకళలో కూడా ఉండకపోతే తరువాతి తరాలకు (ఆసక్తి అంటూ ఉంటే) పంచె కట్టు, లంగా ఓణీలు ఒకప్పటి తెలుగు జాతి వేషధారణ అని తెలిసేదెలా? సరిగ్గా అక్కడే బాపు ఉపయోగపడతాడు. nostalgia తో బాపును ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. అయితే చరిత్ర కోసం ఫ్యూడల్ ఆర్ట్స్ ను కూడా పదిలపరచాలిసే ఉంది. బాపు పరిమితులు సినిమా విషయంలో చాలానే ఉన్నా, తన నాయికలను ఆయన చిత్రించే తీరు, మిగతావారు తీసిన పధ్ధతి పోల్చిచూడవలసి ఉంటుంది. ఆయన సినిమాలు తీసే రోజుల్లోనే బాలచందర్ స్త్రీల సమస్యల మీద అంతకంటే మంచి సినిమాలే తీసాడు. చెత్తగా తీసిన వాళ్ళు బోలెడుమంది ఉండేవారు. కాలంతో పాటు బాపు మారాడు కాబట్టే ఆడా మగా సమానత్వం అన్న టాపిక్ కనీసం ఎత్తుకున్నాడు మిస్టర్ పెళ్ళాం, రాధా గోపాళంలో. ఇప్పటి మన తెలుగు సినిమాల్లో హీరోయిన్ ల వ్యక్తిత్వ వైభవం చూస్తూనే ఉన్నాం.

  2. తెలుగు సాహిత్యం, సినిమా మాదిరే తెలుగు చిత్రకళ కూడా. వాస్తవికత తక్కువ. సాహిత్యంలో కొన్ని మినహాయింపులతో. బాపు కళకు దక్షిణ భారత కుడ్య చిత్రకళ పునాది. దాన్ని ఆయన అతిగా పాలిష్ చేశాడు. వాస్తవానికి అన్వయించకుండా పాత మూసలకు బదులు కొత్త మూసలతో, మహా పాత వాసనలతో ముంచెత్తాడు. అది ఆయన పరిమితి. అలా కాకుండా ప్రాచీన మెక్సికన్ కళకు కొత్త నెత్తురు ఎక్కించిన డియాగో రివేరా, సికీరో, ఒరోజ్కోల మాదిరో, తమ ముందటి తరాల జపాన్ కళను మూలాలు మరవకుండా విశ్వజనీన కవితా సౌందర్యంతో రంగరించిన హోకుసై, హిరోసిగేల్లానో వాస్తవానికి దగ్గరికొచ్చి ఉండుంటే మన కళకు మహర్దశ పట్టుండేది. ఇది బాపుపై ఫిర్యాదు కాదు. తెలుగు కళపై కలత..

    • Lalitha P. says:

      లేపాక్షిలోని కుడ్య చిత్రాలను చూస్తూ ‘అరె, బాపు ఇక్కడ బొమ్మలు వేశాడేమిటి?’ అని అప్రయత్నంగా అనుకున్నాను. అంటే ఆ కుడ్య చిత్రకళను, దక్షిణాది శిల్పకళను ఆయన అంతగా తన చిత్రకళలోకి తెచ్చేసాడు కదా! దానిని కాంటెంపరరీ ఆర్ట్ లోకి తర్జుమా ఎంతవరకూ చేశాడు లేదా చెయ్యలేకపోయాడు అని ఆర్ట్ క్రిటిక్స్ ఎవరైనా ఒక అథారిటీ తో చెప్తే తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలం. అదే సమయంలో మన దేశంలోని ఇతర illustrators తో పోల్చి బాపు కళను అధ్యయనం చెయ్యాల్సిన అవసరం లేదంటారా మోహన్ గారూ! తైలవర్ణ చిత్రాలకున్న స్థాయి illustrations కి ఇవ్వకపోవటం కూడా నాకు అర్ధం కాని విషయం. కథలకు బాపు వేసిన బొమ్మలు చాలా అర్ధవంతమే కాకుండా కథ విలువను పెంచేవిగా లేవంటారా? Realism కూడా ఒక స్టైల్ మాత్రమే కదా!

  3. సుమనస్పతి says:

    “తెలుగు కళపై కలత..”. చక్కని పదబంధం! కళ కింద దాదాపు అన్ని కళలనూ, సాహిత్యాన్నీ చేర్చుకుంటే ఇంకెంతో కలత!

  4. మీ ఆసక్తి అభినందనీయం లలిత గారు. నాకూ తెలుసుకోవాలనే. కానీ తెలుగులో కళావిమర్శ లేదు. అన్నీ పొగడ్తలే. విమర్శలేనిదే ఏదీ వికసించదు. బాపు కళను మధ్యతరగతి కళాభిమానులకు చేరువ చేశారనడంలో సందేహంలేదు. అతని illustrations కూడా బావుంటాయి. మన సంప్రదాయ కళను అంతగా జీర్ణించుకున్న ఆయన ఆయిల్స్, గ్రాఫిక్స్, ఇతర మాధ్యమాల్లో చిత్తప్రసాద్ లాగానో, నేటి తెలంగాణ చిత్రకారుల్లానో నేటివిటీకి, కళ్ళముందటి మనుషులకు దగ్గరగా వచ్చివుండాల్సింది. రియలిస్టే అవ్వాలని లేదు. రవివర్మ పాక్షాత్య సంప్రదాయాన్ని అనుసరించినా మన కథలను యూనివర్సల్ అప్పీల్తో(కొన్ని లోపాలున్నా) చూపాడు. బహుశా అందుకేనేమో దేశమంతా జనం పటాలు కట్టుకున్నారు. బాపు బొమ్మాలనూ పటాలు కడుతున్నారు కానీ అవి ఎంతవరకు మనసుకు ఎక్కుతున్నాయో తెలీదు.

    ni

  5. Kalki R. Krishnamurthy’s Ponniyin Selvan సిరీస్ navalalaku A. V. Ilango వేసిన illustrations లో తమిళ నైసర్గికత కన్నుల పండువలా వుంటుంది.

మీ మాటలు

*