అనగనగా ఒక అనిల్…అతని మరో ప్రపంచమూ…!

01_ANIL BATTULA photo

బహుశా సోవియట్ ప్రచురణల గురించి ఎక్కువగా తెలిసిన వారికి నా తాపత్రయం ఇంకా బాగా అర్ధం అవుతుందేమో.

1950 నుండి 1990 వరకు వచ్చిన ప్రచురణల్లో పుస్తకాలు చదివినవారందరూ సోవియెట్ ప్రచురణల గురించి తెలిసినవారై ఉంటారు. కొందరి ఉద్యమ జీవితాలను ఈ ప్రచురణలు వెలిగిస్తే, కొందరి బాల్యాన్ని ప్రత్యేకమైన అనుభవం గా మార్చాయి ఈ పుస్తకాలు. కాని ప్రస్తుతం ఇవి అందుబాటులో లేవు. ఈ పుస్తకాలు నాస్టాల్జియాగా మాత్రమే పనికొస్తాయి అనుకుంటున్న సమయంలో అదాటున అనిల్ బత్తుల పీకలదాకా సోవియెట్ ప్రచురణల మత్తులో మునిగిపోయాడు. అది మనవంటి వారికి మంచిదైంది. అతన్ని పరిచయం చేద్దామనే నా ఉత్సాహమంతా!

ప్రేమలో పడ్డ పిచ్చివాడిలా కనిపిస్తాడు అనిల్ బత్తుల. పుస్తకాలంటే ఇంత పిచ్చి వున్నవాణ్ణి ఇప్పటివరకూ చూడలేదు. facebook లో ఒక ఉదయాన హఠాత్తుగా సోవియెట్ పుస్తకాల గురించి మాట్లాడుతూ నాకు దొరికిపోయాడు. ఆ పుస్తకాల గురించి మాట్లాడి జ్ఞాపకాల తేనెతుట్టెని కదిలించాడు.

అంతే…ఝామ్మంటూ…జ్ఞాపకాల పొరల్లోంచి బోల్డన్ని రంగురంగుల పుస్తకాలు బయటపడ్డాయి. తర్వాత అనిల్ తన పుస్తక భాండాగారాన్ని ఒకరోజు బయట పెట్టాడు. దానితో ‘సారువారు ఎంతో గొప్పవారు’ అనుకున్నాను.. తర్వాత ‘పెద్ద ప్రపంచంలో చిన్నపిల్లడు’ నవలా పరిచయం చేసాను మన సారంగలో. అప్పుడే ఒక మెసేజ్ పెట్టాను…’ఇదిగో ఇలా మీకిష్టమైన సోవియెట్ పుస్తకాలలో ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్నానని.’ సంతోషపడ్డాడని అర్థమైంది.
ఇక అసలు కథ అప్పుడు మొదలైంది. మరి రాసాను కదా…గొప్పగా అనిల్ ని టాగ్ చేసాను. ఆయన సంతోషించి ఫోన్ లో మాట్లాడడమేకాకుండా కొన్ని పుస్తకాలు ఇస్తానని మాటఇచ్చాడు. నిజంగానే తర్వాత ఇంటికొచ్చి చాలా పుస్తకాలిచ్చాడు. అవన్నీ ఒరిజినల్ పుస్తకాలు కావు. జిరాక్స్ చేసి స్పైరల్ బైండ్ చేసినవి. ఒక ఇరవై పుస్తకాల దాకా ఉన్నాయ్. బాగానే ఖర్చయ్యి ఉంటుందని డబ్బులు ఇస్తానన్నా వద్దన్నాడు. రెండే మాటలు చెప్పాడు. “ ఈ పుస్తకాలు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటంటే ఇవి మీరు చదివి ఒక నాలుగు మాటలు ఎక్కడో నలుగురికీ కనపడే చోట రాయండి. ఇలాంటి పుస్తకాలు ఉన్నాయని తెలియాలి” అని. అతనికి ఆ పుస్తకాల మీదున్న ప్రేమ చూసి నేనూ, మా ఆయనా అశ్చర్యపోయాం.

06_Ikathiyandar_A.Beliayev_001

సండే వస్తే దొరకడు అనిల్. ఆబిడ్స్ సండే మార్కెట్లో ఎనిమిదింటికి తేల్తాడు. కాసేపు అక్కడ పుస్తకాల మధ్య మహా ఆనందంగా తిరిగి, కొన్ని పుస్తకాలను స్వంతం చేసుకుని వెనక్కు మళ్ళుతాడు. రెండున్నరేళ్ళ క్రితం ఇలా మొదలైన కార్యక్రమం నిర్విరామంగా ప్రతి ఆదివారం నడుస్తూనే ఉంది. కాలం జర్రున జారింది. ఇదిగో ఈ రోజు ఇతని దగ్గర ఇంచుమించుగా రెండువందల పైనే సోవియెట్ పుస్తకాలున్నాయి.

ఇటువంటి అనిల్ బత్తుల గురించి ఓ నాలుగు మాటలు రాయాలని ఎప్పటినుంచో కోరిక ఈ రోజుకు తీరింది. ఈ ‘సెప్టెంబర్ పది’ న లామకాన్ లో తన పుస్తకాల కలెక్షన్ మొత్తాన్ని ఎగ్జిబిషన్ పెట్టడమే కాకుండా, ఎవరో ఒక మంచి ‘రాదుగ పబ్లికేషన్’ పుస్తకాన్ని(ఇకితియాందర్) సినిమాగా(యామ్ఫిబియన్ మాన్) తీస్తే, దాన్ని ప్రదర్శించాలన్న కార్యక్రమం కూడా ఇందులోనే ఇమిడ్చాడు.

ఆ సందర్భంలోనే నా ఇంటర్వ్యూ ను కూడా చేర్చాను. ఇదిగో ఇలాంటి కొన్ని ప్రశ్నలడిగి!

సొవియట్ పుస్తకాలతో ఎలా ప్రేమలో పడ్డారు?

నాకెప్పుడు అందిరిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఉండేది. తెలుగంటే చాల ఇష్టం. స్కూల్ లో ఆరవక్లాసులో ‘సంపూర్ణ మద్యనిషేదం’ మీద ఎలక్యుషన్ పెడితే వేరేవారితో స్పీచ్ ప్రిపేర్ చేయించుకున్నాను. ఎనిమోదోతరగతికి వచ్చేసరికి నెమ్మదిగా నేనే స్వంతంగా రాయడం మొదలుపెట్టాను. ఏదో ఎడిటోరియల్ లో శ్రీశ్రీ లైన్లు చూసి ప్రాస బావుందని నా స్పీచ్ లో ఇరికిస్తే జనాలు అది విని విపరీతంగా చప్పట్లు కొట్టారు. “ఎవరు వీడు. నేనింత మాట్లాడినందుకు కన్నా ఇతని మాటలకు చప్పట్లు ఎక్కువ పడ్డాయి,” అని చాలా కోపం వచ్చింది నాకు. తర్వాత ఇంటర్ లో విశాలాంధ్ర వాళ్ళ స్టాల్ కాలేజీ దగ్గర పెట్టగానే కొందామా, వద్దా అని అరగంట కొట్టుకలాడి, ‘శ్రీ శ్రీ మహాప్రస్థానం’ కొన్నా… అప్పటికే పుస్తకం గురించి కాస్త విన్నా. నెమ్మదిగా ఆ కవిత అర్థం కాకపోయినా ఆ చదివే లిరికల్ సౌండ్ నాకు చాల గొప్పగా అనిపించింది.

తర్వాత బి. సి. యే చదవడానికి హైదరాబాద్ వచ్చా. నారాయణగుడాలో మా హాస్టల్ దగ్గరలోనే సుందరయ్య విజ్ఞాన భవన్, నవయుగ బుక్ హౌస్ ఉండేవి. సాయంత్రం ఆ ఏరియా లో ఎక్కడైనా ప్లాట్ఫారం మీద పుస్తకాలు దొరికేవి. అలా మొదలై శ్రీశ్రీ తర్వాత శివారేడ్డిగారిదీ, ఇలా మిగిలినవారిదీ…కవిత్వం అంటే నచ్చింది. తర్వాత కే. శ్రీకాంత్ కవిత్వం నచ్చి కలిసాను. అప్పుడే తన దగ్గర ఉన్న కొన్ని పుస్తకాలు ఇచ్చాడు. అందులో ‘జమీల్య’ ఉంది!

Kondagaali Kotta Jeevitham_001

కాని మొదటిసారి సోవియెట్ పుస్తకాలు ఎప్పుడు చూసారు?

మా హాస్టల్ దగ్గర ‘చిక్కడపల్లి లో ఉన్న ప్రజాశక్తి బుక్ హౌస్లో మొదటిసారి చూసాను. అక్కడ సొవియట్ పుస్తకాలు ఒక మూల రాక్ లో ఉండేవి. ఆ బుక్ కవర్స్ ఇప్పటికీ గుర్తు. తండ్రులు-కొడుకులు, పేద జనం, శ్వేతరాత్రులు….ఈ కవర్ పేజీలు నెమలిపింఛాల్లాగా చాలా బాగా అనిపించేవి. చాలా మంచి క్వాలిటీ, ఖరీదు తక్కువ- కాస్త సంభ్రమంగా చూసి వెళ్ళిపోయేవాణ్ణి. తర్వాత, కోఠీ గాంధీ జ్ఞాన్మందిర్ పక్కన విశాలాంధ్ర వాళ్ళు బుక్ ఎగ్జిబిషన్ పెట్టేవారు. ఒక మూల సొవియట్ పుస్తకాలు కుప్పగా పోసి అమ్మేవాళ్ళు. ఓసారి ఎనీ బుక్ టెన్ రుపీస్, థర్టిరుపీస్ అని సేల్ లో చూసాను. ౩౦ రూపాయలకు నాలుగొందల పేజీలు – రష్యన్ చరిత్ర కథలు, గాధలూ ఆ పుస్తకం. తెగించి ఆ రోజు కొన్న పుస్తకం నా జీవితాన్నే మార్చేసింది.

పుస్తకం చదవడం గొప్ప అనుభవమేమో మీకు?

నాకు పుస్తకం అంటే జ్ఞానం సంపాదించడం అని ఎప్పుడు ఉండదండి. పుస్తకం చదవడం అనేది నావరకు నాకు ఒక ఆనందాన్ని పొందడమే..ఒక పుస్తకం నాకు నచ్చిందంటే నేను అందులో ఏదోదో విధంగా కనిపిస్తాను. నా అనుభవం కావచ్చు, ఏదైనా కావొచ్చు. నాకు పుస్తకం అంటే ఆనందం…కాని పుస్తకం అంటే ఆనందం అనే స్థాయిని దాటి, పుస్తకం తో మోహంలో పడి, పుస్తకంతో పిచ్చిలో పడిపోయి, తర్వాత పుస్తకమే జీవితమేమో అన్న స్థితికి వెళ్ళిపోయాన్నేను. అదృష్టవశాత్తు నా భార్య మాధవిలత కూడా అర్థం చేసుకునే స్థితి లో ఉంది కాబట్టి నాకు పర్వాలేదు(నవ్వు).నాకు తెలుసండి. నేను ఫైనల్ స్టేజిలో ఉన్నాను…నేను పుస్తకంపిచ్చి నుండి ఇంక బయటపడలేను. పుస్తకం ఉంటే చాలు నాకేమి అవసరం లేదు అనిపిస్తుంది.. బహుశా నాకు జీవితంలో చాల పెద్ద సమస్యలు వచ్చి అన్ని కోల్పోయినా…అందరిలా భయపడతాను, ఏడుస్తాను కాని..’చేతిలో పుస్తకం ఉంది దాని చూస్తూ చచ్చిపోతాను కదా’ అన్న తృప్తి తో కళ్ళు మూస్తాను.

ఈ పుస్తకాలు సేకరించాలనే ఆలోచన మీకెలా వచ్చింది?

“ఉక్రనియన్ జానపద గాధలు” అనే పుస్తకం గురించి ‘మనసులో మాట’ సుజాతగారు రాసారు. ఆ పరిచయం చదవగానే నచ్చింది.వెబ్ సైట్ లో కామెంట్లు చదివాను. వాటిలో కామెంట్ చేసిన వాళ్ళ చిన్నతనం గురించి తెలుస్తుంది. చాలా పుస్తకాల పేర్లు ప్రస్తావించారు. అందరూ సేకరించాలి అంటారు కాని ఎవరు మొదలుపెడతారు? ఎవరు ఇవ్వడానికి ఇష్టపడతారు? ఎందుకంటే పుస్తకాలు దొరకవు. చిన్నప్పటి జ్ఞాపకాలను ఎవరు వదలుకోగలరు? తర్వాత ఇంకొన్ని పుస్తకాల లిస్టు సంపాదించాను. నా ఆఫీస్ విజిటింగ్ కార్డ్ ల వెనుక సోవియెట్ పుస్తకాల లిస్టు రాసి, పుస్తకాలు చదివే వారిని కలిసాక, లిస్ట్ లో బుక్ ఉందా అని అడిగి టిక్ పెట్టుకునే వాణ్ణి. కవి ఐలా సైదాచారి గారు నాకు ఏడు రష్యన్ క్లాసిక్స్ ఇచ్చారు. ఆర్టిస్ట్ మోహన్ గారి దగ్గర రిటైర్డ్ లైబ్రేరియన్ గంగాధర్ రావు గారు పరిచయం అయ్యారు. ఆయన ముందు ఆ బుక్ లిస్టు చదువుతుంటే ఇంచుమించుగా అన్నిటికీ ‘ఉంది’ అనే చెప్పారు.ఎప్పుడు రమ్మంటారో అడిగి వెళ్ళాను. గంగాధర్ గారిని కలవగానే నేనడిగిన పుస్తకాలు ఉన్నాయని చెప్పారు. తర్వతరోజు ఎనిమిదింటికి రమ్మంటే…నేనే ముందే రెడీ అయిపోయి ఉన్నా.

Ukrainian Jaanapada Gaathalu_000

నన్ను నమ్మడానికి కొన్ని పుస్తకాలు దగ్గర పెట్టు తీసుకువెళ్ళా. ఆయన పుస్తకాలు ఒకేసారి అన్నీ ఇచ్చారు. జాగ్రత్తగా జిరాక్స్ తీసుకుని ఇచ్చేసా. తర్వాత రచయత అజయ్ ప్రసాద్ పరిచయం అయ్యారు, మోహన్ గారు కొన్ని పుస్తకాలు ఇచ్చారు. ఇలా చాలామంది సాయం చేసారు. అలానే కేవీఎల్ఎన్ మూర్తి అని విజయవాడ లో ఉండే ఒకాయనకు డిటెక్టివ్ నవలలు ఇష్టం. కాబట్టి నేను అతనికి కావాల్సిన నవలలు సండే మార్కెట్ లో కొని పంపేవాడిని, అతను విజయవాడలో దొరికిన పాత సోవియెట్ పుస్తకాలు నాకు పంపేవాడు. మనసు ఫౌండేషన్ రాయుడుగారి గురించి విన్నాను. అక్కడున్న శ్యాం నారాయణ గారి దగ్గర చాల పుస్తకాలు స్కాన్ చేసుకున్నాను.

అయితే మీ సేకరణలో కథలు నవలలే ఉన్నాయా?

మొదట్లో కథలు నవలలు దొరికితే చాలనుకున్నా. కాని నెమ్మదిగా అనిపించింది. నాకు కథలెంత ముఖ్యమో ఇంకొకరికి ఈ సైన్సు వ్యాసాలూ కూడా అంతే ముఖ్యమై ఉండొచ్చుకదా అని. ఇలాంటి పుస్తకం చిన్నతనంలో ఒకడు చదివి వాడు పెద్దయ్యాక కెమిస్ట్రీ లో గొప్ప శాస్త్రవేత్త అయి ఉండొచ్చేమో. అటువంటివాడికి మళ్ళీ ఆ బుక్ కావాలంటే ఎలా వస్తుంది? అది నేనెందుకు చేయకూడదు? అనే ఆలోచనతో ఇంకా చాలా కమ్యూనిజం, సోషలిజం, ఫిలాసఫీ, వ్యాసాలూ, ఇంకెన్నో డిక్షనరీలూ సేకరించా. రాదుగ, ప్రగతి, విదేశి భాషా ప్రచురణ సంస్థ, మీర్ ప్రచురణలు ఈ నాలుగు సంస్థల పుస్తకాలు కలిపి- రెండొందల పుస్తకాల వరకూ ఉంటాయి.

సినిమాలు సాహిత్యం గురించి చెప్పండి.

నాకు అక్షరాలెంత ఇష్టమో, విజువల్స్ అంత ఇష్టం. గికోర్, జమీల్య,  యామ్ఫిబియన్ మాన్, చైల్డ్ హుడ్ ఆఫ్ మాక్సింగోర్కీ నాకు బాగా ఇష్టమైన సోవియెట్ సినిమాలు. తెలుగు లిటరేచర్ లో దొరకనిదీ, సోవియెట్ లిటరేచర్ లో దొరికేది- లిటరేచర్ ని సినిమాలల్లో చూడడం! ఒక పుస్తకం చదవగానే దాని లింక్ ఇంటర్నెట్ లో దొరికేస్తుంది. కథ మనకి నచ్చి కనెక్ట్ అయితే మన ఊహలో ఆ పాత్రలకు రక్తమాంసాలు చేకురుతాయి. అవన్నీ నిజంగా ప్రేమించగలిగితే పాత్రలు మనముందే కదులుతూ ఉంటాయి. ముఖ్యంగా నేను చాలా సోవియెట్ పుస్తకాలతో, ఇలా చూడగలిగా. నచ్చిన పుస్తకం చదివాక, ఒక వారం, పది, నెల రోజులు వరకు ఏమి చదవను.. కాఫీ తాగాక నోటిలో కాఫీ రుచి పోతుందని ఏమి తినన్నట్టు. సోవియెట్ లిటరరీ అడాప్టేషన్స్ గా చాల సినిమాలు వచ్చాయి. తెలుగులో రాజు పేద, కన్యాశుల్కంలాంటి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కాని భారీస్థాయిలో సాహిత్యం సినిమాగా మారలేదు. సినిమాలుగా తీయగలిగే మునెమ్మ లాంటివి లిటరరీవర్క్స్ తెలుగులో చాలా ఉన్నాయి. మన సాహిత్యం చాలా భాగం సినిమాల్లోకి కన్వర్ట్ కాలేదు. బావుంది, బాలేదు అని కాదు…సినిమాలుగా అడాప్ట్ కాలేదు. తెలుగులో గొప్ప సాహిత్యం సినిమాల్లోకి కన్వర్ట్ కాకపోవడం, సినిమాల్లో వచ్చే దానికీ జీవితానికీ సంబంధం లేకపోవడము, సినిమాకి సాహిత్యానికి సంబంధం లేకపోవడం, జీవితానికీ సాహిత్యానికీ సంబంధం ఉండడము, జీవితాని ప్రతిబింబించే సాహిత్యం సినిమాగా మారకపోవడము, జీవితాన్ని ఏ విధంగా సంబంధం లేని యుటోపియన్ విషయంగా సినిమాల్లో చూపించడం….బేసికల్ గా మన సాహిత్యానికి మన సినిమాలకూ మధ్య చాలా ఎడం ఏర్పడింది.

మీకిష్టమైన పుస్తకాలూ, రచనలూ, నచ్చే రచయితలూ…

శారద(ఎస్. నటరాజన్). ఈయన మీద ఒకలాంటి అబ్సెషన్ తో బతికాను. ఒకానొక టైం లో శారద పాత్రలు నా గదిలో అలా తిరుతున్నట్టు విషువల్స్ కనిపిచేవి. గోర్కి ఆత్మకథ- మూడు భాగాలు. ఆలూరి భుజంగరావు గారి ఆత్మా కథ రెండు భాగాలూ- గమనాగమనం, గమ్యం దిశగా గమనం. గోర్కీ ప్రతిరూపం ఆలురిలో కనిపిస్తుంది. ఆత్మకథ అంటే పరనిందా ఆత్మా స్తుతి, వాళ్ళెవరో అప్పు తీసుకుని ఎగ్గొట్టారులాంటివి వివరాలు గాక, స్వచ్చతతో వచ్చిన ఆలోచనలు ఉంటాయి వీటిలో. ఇంకా రచయితలలో శారద, ఆలూరి భుజంగరావు, ఆలూరి బైరాగి, బెల్లంకొండ రామదాసు, చెకోవ్, టాల్ స్తోయ్, దోస్తోవిన్స్కి, ఇంకా చాలా మంది. అనువాదకులలో ఉప్పల లక్ష్మినారాయణ రావు, ఆర్వియార్, రారా. ఇక సోవియెట్ పుస్తకాలలో నాకు ముందు సైన్సు ఫిక్షన్, తర్వాత చిన్నపిల్లల పుస్తకాలు తర్వాతే పెద్దవాళ్ళ కథలు, నవలలు ఇష్టం.

బాలసాహిత్యం గురించి ప్రత్యేకంగా ఏం చెప్తారు?

సోవియట్ వాళ్ళు బాలసాహిత్యం ఎక్కువగా వేయడానికి కారణం- బహుశా కమ్మ్యునిజాన్ని ప్రపంచవ్యాప్తి చేయడానికయ్యి ఉంటుంది. లిటరేచర్ ద్వారా పెద్దలను, పిల్లలను చేరదామనుకున్నారు. బాలసాహిత్యానికి చాల శ్రద్ధ తీసుకున్నారు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే మంచిగా తీర్చిదిద్దుదాం, వాడు పెద్దయిన తర్వాత సమాజానికి ఉపయోగ పడతారనుకున్నారని కూడా నా వ్యక్తిగతాభిప్రాయం.

బ్లాగ్ గురించి చెప్పండి.

ఈ పుస్తకాల వెతుకులాటలో వేరే భాషల్లో అనువాదాల గురించి ఏమన్నా తెలుస్తుందేమోనని ఇంటర్నెట్ లో వెతికితే కొన్ని బ్లాగులు బయటపడ్డాయి. చూస్తే చాలా బావున్నాయి. అలా మన భాషలో కుడా చెయ్యాలని బ్లాగ్ మొదలుపెట్టాను. ఒక్కరోజు ఎనభై పుస్తకాలు అప్డేట్ చేశా. కాని ఈ బ్లాగ్ పెట్టి నలుగురి దృష్టి పడ్డాకా చాల రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది వాళ్ళదగ్గరున్న బుక్స్ నాకు పంపారు. కాని అన్నీ అప్లోడ్ చెయ్యలేదు. రీప్రింట్ అయ్యేవి కొన్నివున్నాయి. అవి కొంటేనే మంచిది అనుకుని పెట్టలేదు. ఇంకా చాలమంది నాగురించి విని, నా బ్లాగ్ చూసి వారిదగ్గర ఉన్న పుస్తకాలు పంపారు. అప్పటిదాకా పంచుకోవాలనున్నా, తిరిగి వస్తాయో లేదో అన్న భయం తో ఇవ్వలేదన్నాళ్ళు. దీన్నిబట్టి నాకేమర్థం అయ్యిందంటే పుస్తకాలు చదివేవాళ్ళున్నారు. కాని అంతగా మంచి పుస్తకాలు రావడం లేదు. మరి అప్పుడు పాతవే చదువుకోవాలి. అంటే కదా! అన్నట్టు నా బ్లాగ్ అడ్రస్ http://sovietbooksintelugu.blogspot.in/

వేరే భాషల పుస్తక ప్రేమికులు ఎలా పరిచయం అయ్యారు?

బెంగాలీ బ్లాగ్, మలయాళం బ్లాగ్ చూశా. facebook లో మరాఠీ బ్లాగ్ నుంచి నిఖిల్, రాజ్ లు, రాజారాం మలయాళం నుంచి, వసుదేవులు బెంగాలి నుంచి పరిచయం అయ్యారు. ఉకైనియన్ గాధలు అన్ని భాషల్లో అనువదించబడ్డాయి. సోవియెట్ వాళ్ళు కొన్ని స్టాండర్డ్ అనుకున్నసాహిత్యాన్నే అనువాదం చేయించారని అర్థమైంది.

అనువాదాల గురించి చెప్పండి.

అనువాదాలు చాలా ఇష్టం. ఇంటెన్సిటీ ఎక్కువ. ప్రతి భాషలో వచ్చిన అన్ని కథలూ అనువాదం కావు, కొన్ని మంచి కథలను మాత్రమె ఎంచుకుని అనువదిస్తారు. అందుకే అనువాదకథలు బావుడక పోవడం జరగదు. శ్రీశ్రీ  అనువదించిన మిచెల్ చోలహేవ్ రాసిన ‘మానవుడి పాట్లు’ చాలా ఇష్టం. ఎంత స్లోగా చదివితే అంత బావుంటుంది. చదివే అనుభవం చాల బావుంటుంది. చిన్నప్పుడు త్వరగా చదివేవాణ్ణి కాని ఇప్పుడు నెమ్మదిగా చదువుతుంటే చాలా ఎంజాయ్ చేస్తున్నా. శాంతారాం పుస్తకాలు చదివేడప్పుడు, ఇంగ్లీషు పుస్తకం ఇలా ఉండాలి అనిపించింది. గొప్ప రచయితలందరిలో అందం ఏంటంటే సిక్స్త్ క్లాసు తెలుగు మీడియం పిల్లవాడు కూడా హాయిగా చదువుకునే భాష వాడతారు. సోవియెట్ పుస్తకాలు కూడా అటువంటివే, పంటికింద రాల్లలాంటి పుస్తకాలు కావవి, హాయిగా చదువుకోగలిగేవే. ఈ అనువాదాలు ఎంత బావుంటాయంటే తెలుగు ఎలా చదివానో, అలాగే రష్యన్ అనువాదాలు కూడా అంతే అలవోకగా చదివాను.

1950 నుంచి 1980 వరకు చాలా అనువాదాలు వచ్చాయి. ప్రతి ఒక్కటి గొప్పదే. ఒక కథ బావుందంటే ఎక్కడ అన్వయించుకుంటే ఎక్కడైనా ఆదరణ అలభిస్తుంది- ఆర్మేనియాలోనైనా, ఇండియాలోనైనా. ఎందుకంటే మానవజీవితం సార్వజనియమైనది. అలాగే అనువాదం మక్కికి మక్కి చేయకూడదు. అనుభూతిని అందించడం ముఖ్యం. ఇంతకన్నా నాకు ఎక్కువగా తెలియదు.

AgniKanam+Nunchi+AnuVidyuth+Daka_000

అనువాదకుల గురించి ?

బెల్లంకొండ రామదాసుగారు, రెంటాల గోపాలకృష్ణగారు వీళ్ళిద్దరూ యుద్దము- శాంతి మూడు భాగాలు అనువదించారు. అలాగే అట్లూరి పిచ్చేశ్వరరావు గారు! వీళ్ళందరూ బంగారాల్లాంటి అనువాదాలు చేసారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళ వారసులకు వారి వర్క్స్ ఎంత విస్తృతమో తెలీదు. వారి వారసులకు నా విజ్ఞప్తి ఒకటే. వారితో మీకున్న అనుబంధం వివరిస్తూ, వారు వర్క్ చేసిన పుస్తకాల లిస్టు అందరికి అందుబాటులో- ఒక బ్లాగ్ లోనో ఎక్కడో అందుబాటులో ఉంచగలిగితే చాలు. ఇదే నిజంగా వారిని స్మరించుకోవడమంటే అని నా నమ్మకం.

సండే మీ రొటీన్ ఎలా ఉంటుంది?

సండే రోజు- ఏడింటికి బయల్దేరి అమీర్పేట్ వస్తాను. అక్కడ అజయ్ కలుస్తాడు. ఇద్దరమూ సండే మార్కెట్ వెళ్తాం. “ఈ రోజు ఏ చేపలు పడతాయి” అన్నట్లు మాట్లాడటం. అన్నకరేనినా, ఉక్రేనియన్ జానపద గాధలు… దొరకవు…కానీ దొరుకుతాయేమోనన్న కలలు కంటూ పదకొండింటికి వెళ్తాం- ఐదింటికి వెనక్కివస్తాం.

ఈ పుస్తకాల కథ ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. పాత పుస్తకాలు కొన్నవాడు, కండిషన్ చూసి, ఏరియా వైస్ ఏజెంట్ కి అమ్మితే. వాళ్ళు ఇంట్లో బుక్స్ స్టోర్ చేస్తారు. ఆదివారం పొద్దున్నే మార్కెట్ చేరేందుకు ఒక ట్రాలీ మాట్లాడుకుంటారు. పొద్దున్నే ఆరింటికి అక్కడికి చేరకపోతే వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఉండదు. తర్వాత యునిక్ బుక్ సెంటర్, బెస్ట్ బుక్ సెంటర్ వాళ్ళు టోకున కొంటారు. వీరే పాత పుస్తకాల మీద ఎక్కువగా ఫోకస్ చేసేది. ఎందుకంటే ఇవి సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లు. ఒకరోజు అదృష్టం తిరిగి కళాతపస్వి యోగోరి- ఒక పెయింటర్ పుస్తకం దొరికింది. ఇలాగే ఇంకొన్ని గొప్ప పుస్తకాలు. ఇప్పుడు వీళ్ళతో ఎంత సంబంధం పెరిగిందంటే నాకోసం ప్రత్యేకంగా పక్కకు తీసిపెడతారు. యునిక్ బుక్ సెంటర్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడో ఫ్యామిలీ మెంబెర్ లా అయ్యాను. వాళ్ళ వెబ్ సైటు కూడా నేనే చేసిచ్చాను. ఇంకో విషయం ఏంటంటే, వేరే రాష్ట్రాల వాళ్లు ఆన్లైన్ లో కలుస్తారు కదా వాళ్లకి వీళ్ళ స్టాల్ అడ్రస్ ఇస్తే బోల్డన్ని పుస్తకాలు ఆర్డర్ చేసి తీసుకెళతారు.

సైన్సు పుస్తకాలకి చాల డిమాండ్ ఉంది. ఇప్పుడు మెట్రోపాలిటన్ యంగ్ క్రౌడ్ బాగా చదువుతారు., మీర్ పబ్లికేషన్స్ సైన్సు మాత్రమె పబ్లిష్ చేస్తుంది… ద్మిత్రి అనే అతనుఈ పుస్తకాలు ఆన్లైన్ లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఒక మూడు వేలమంది మెంబర్లు- ఒకొక్కరు కనీసం ఒక్క పుస్తకమైన అందించి ఉంటారు.

Aelita_Puppala Lakshmanarao(ed)_001

ఇక ముందు లక్ష్యాలు…

తెలిసో తెలియకో కొన్ని మంచి పనులు చేసాను…కానీ ఎంతోమంది బాల్యానిన్ని వెనక్కివ్వగాలిగాను…ఈ పుస్తకాల ద్వారా. చాల మంది అన్నారు…ఈ పుస్తకాలు వచ్చేప్పటికి నువ్వు పుట్టి కుడా ఉండవయ్య అని. చాల మంది రీడర్స్ విశాలాంధ్ర వాన్స్ ద్వారా చదివినవాల్లె. దీనివల్ల నాకు రుపాయికుడా రాదు కాని నేను సంపాదించింది చాల ఎక్కువ.

ఈ సోవియెట్ రచనలూ కొన్ని విశాలాంధ్రవాళ్ళు ప్రింట్ చేసారు. బీదల పాట్లు అని, 1950 ల్లలోనే మహీధర జగన్మోహన రావు గారు గోర్కీ జీవిత కథ వేసారు, తర్వాత చెకోవ్, మపసా, టాల్ స్తాయ్ ఇదంతా 1957 లోనే. విశ్వ సాహిత్యమాలా, దేశి ప్రచురణ సంస్థ తర్వాత ప్రేమ చంద్ ప్రచురణ సంస్థ, దక్షిణభారత ప్రచురణ సంస్థ, ఎమెస్కో. ఇట్లా సొవియట్ ప్రచురణలు ప్రింట్ అయినవి చాలా ఉన్నాయండి. కాని అవన్ని బ్లాగ్ లో పెట్టలేను కొన్ని కాపీ రైట్ గోడవలవల్ల. కొన్ని నాకు నేను పెట్టుకున్న పరిధులవల్ల- నాకొకటే కోరిక సోవియెట్ యూనియన్ లో ప్రింట్ అయినా ప్రతి తెలుగు అక్షరాన్ని నేను చనిపోయిన కుడా భద్రంగా ఎత్తిపెట్టుకోవాలని. సోవియట్ బుక్స్ సోవియెట్ లో ప్రింట్ అయినవి కాకున్నా కూడా కనుక్కుంటే సోర్స్ చెప్పగలను. పబ్లిషర్స్ కి ప్రింట్ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉంటె ఫ్రీగా ఇవ్వగలను కాపీ రైట్ ఇస్స్యూస్ పెద్దగా ఉండకపోవచ్చు.

సిపిఎం , సిపిఐలా…రష్యా, చైనా లిటరేచర్. చైనా రచనల కలెక్షన్ నా నెక్స్ట్ లక్ష్యం. ఇప్పటికే కొన్ని ఉన్నాయి నా దగ్గర. చైనా లిటరేచర్ కుడా ఒక బ్లాగ్ పెట్టి మనం పెట్టాలి. ఎవరైనా సహాయం చేయగలితే చాలా సంతోషం. విశాలాంధ్ర వాళ్ళవి 1970 తో 1980 వరకు కేటలాగ్ కావాలి. మిగిలినవి నా దగ్గరున్నాయి. ఎవరికైనా పబ్లిష్ చేసే ఆసక్తి ఉంటె నేను నా వంతుగా ఆ పుస్తకం సంపాదించి సహాయపడగలను.

 

మరిన్ని చదివిన మిమ్మల్ని కమ్యునిజం ఆకర్షించలేదా?

ఎందుకు లేదు? మొదట్లో ఎరుపురంగు సాహిత్యమే చదివాను. కౌముది, చెరబండ రాజు, అనామకుడు, అలిసేట్టి ప్రభాకర్ మొదలైనవారిని విపరీతంగా చదివేవాణ్ణి. అరుణతార విపరీతంగా క్రమం తప్పకుండా చదివేవాణ్ణి. తర్వాత నా స్నేహితుడు చెప్పాడు. ఎరుపే కాదు, వేరే రంగులు కూడా ఉన్నాయి, చూడరా అని… కాలేజీలో నా నిక్ నేమ్ శ్రీశ్రీ. అందరికి శ్రీ శ్రీ పిచ్చివాణ్ణిగానే తెలుసు.

పుస్తకాలకు, ముందు వెనుక జీవితం.

చిన్నప్పటినుంచి దేనికో ఎప్పుడు వెతుకులాట ఉండేది. ఈ పుస్తకాలు దొరికాక వెతుకులాట తీరింది. ఈ పుస్తకాలు ఎంతటి మానసిక ధైర్యాన్నిస్తాయంటే ప్రపంచం కూలిపోయినా, నాకు అక్షరం అనేది తోడున్తుంది. అనిపిస్తుంది. పుస్తకం నాకో మంచి స్నేహితుడైపోయాడు. స్నేహితుడితో గొడవ పడొచ్చు, దూరం వెళ్ళొచ్చు, కోపం తెచ్చుకోవచ్చు. కాని పుస్తకం అదేమీ చేయదు. పుస్తకాలతో లెక్కలుండవు. పుస్తకం ఎప్పుడు నన్ను ప్రేమిస్తుంది. నాతో అలగదు, కోపగించుకోదు. నా జీవితం లో పరిపూర్ణతనేది చూడగలిగాను నేను. ఈ పుస్తకాల వల్ల. నాకొక ఆసరా ఉన్న స్నేహితుల్లా పుస్తకం నాకోసం ఎప్పుడు నిలబడి ఉంది. ఉంటుంది కూడా!

—–
ఇంతలా పుస్తకాన్ని ప్రేమించేవాడు మనకు మళ్ళి దొరుకుతాడా? మళ్ళీ ఇన్ని పుస్తకాలూ గుప్పుమన్న జ్ఞాపకాలతో మనముందుకు వస్తాయా…? ఈ రెండింటినీ ఆస్వాదించాలంటే ఒక్కసారి సెప్టెంబరు పదిన లామకాన్ వైపు అడుగెయ్యండి. ఇదిగో ఆహ్వానం. అడ్రెస్ కోసం అసలు ఇబ్బంది పడకండి. ఇదిగో మ్యాపు ఇంకా కష్టమైతే 9676365115 కు ఫోన్ చెయ్యండి. అనిల్ మీకు స్వయంగా సాయపడతాడు!

lamakaan map

Anil battula Invitation_10 sep 2014_Hyderabad

మీ మాటలు

 1. ఇంత చిన్న వయసు వాళ్ళలో తెలుగు సాహిత్యం పట్ల మమకారం పెంచుకోవటం, ప్రచారం చేయటం అరుదుగా కనిపిస్తుంది. అనిల్ కి మనందరి సహకారం ఇద్దాం., ఆయనకు పాతపుస్తకాలు పంపి… ఆయన సరఫరా చేస్తున్న సాహిత్యం చదివీ. నేను రెండోది చేస్తాను.

 2. ఆర్.దమయంతి. says:

  ఇంటర్వ్యూ బావుంది.
  పుస్తక ప్రియులు శ్రీ అనిల్ గారి గురించి అనేకానేక ఆసక్తి కరమైన విషయాలను తెలుసుకోవడం జరిగింది.
  ధన్యవాదాలు.

 3. నా దగ్గర కొన్ని వుండాలి , లిస్ట్ రాయడానికి ప్రయత్నిస్తాను, ఆ బస్ వెనకాల్తే పరుగెట్టుకెళ్లే వాడిని,. పుస్తకాల కొనడం కంటే వాటిని తాకి,. తెరిచి చూడటం గొప్పగా అనిపించేది,. అన్నా కెరినా,( రెండు పార్టులు).. ఓ ఫ్రెండ్కి ఇచ్చాను, మళ్లీ రాలేదిక.. సోవియట్ లాండ్, సోవియట్ భూముల అన్ని అట్టలైపోయాయి టెక్స్ట్ బుక్స్ కి ,. అప్పటకది ఆనందం,.. ఇప్పుడు అవి వుంచుకుంటే బావుండేదనిపిస్తుంది.

 4. ముందు సారంగ సంపాదక వర్గ సభ్యుడు అఫ్సర్ కి దండాలు చెప్పాలి.
  “నగరంలో నేడు” అని ఒక శీర్షికపెట్టేసే..రాజివ్ గాంధీ భవన్ లో పుస్తకాల ప్రదర్శన, ఎన్ టీ ఆర్ మార్గ్, ఇందిరాగాంధి పేట అని పడేస్తే ఈ అనిల్,అపర్ణ, సుజాత గారు లాంటి వాళ్లు వాళ్ళ బాధలు పడుతూ లేస్తూ, వెతుక్కుని వెళ్ళి డబ్బులు వదుల్చుకుని వాళ్ల సంసారాలు నడుపుకుంటూ, పిల్లలకి చదువులు చెప్పుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ బ్లాగులు వ్రాసుకుంటూ ఉంటారు. .అలా రాసుకుంటూ ఊరుకుంటారా అంటే ఊరుకోరు. మరో పదిమందిని ఊరిస్తారు..ఇక్కడో అద్భుత ప్రపంచం ఉంది రండి రండి అంటూ.

  ఆఫ్‌లైన్‌లో కాని ఆన్‌లైన్ కాని స్పేస్ లేదండి అని వ్రాసిందేమైనా సర అది కథ ఐనా, అ కవిత అయినా సరే దానిని నిర్దాక్షణ్యంగా పరపరా కోసేసి, ఒక నియంతలాగ అడ్డంగా నరికేసే రోజుల్లో, సారంగా అలా స్పేస్ లేదు అనకుండా..పుస్తకాల మీద ఒక చక్కని కార్యక్రమం, దానికి ఒక అహ్వాన పత్రం, సంప్రదించడానికి ఒక ఫోను నెంబరు, వేదిక ఎక్కడో తెలుసుకోవడానికి ఒక గూగుల్ మాప్ ని పుస్తకానికి దానిని ప్రాణపదంగా తలచుకునే పాఠకుడిని ఇంత గొప్పగా గౌరవించడం ఎంతో సంతోషదాయకం.

  సారంగ ఒంటి చేత్తో ఇటువంటిది చేయలేదు. సుజాత, అపర్ణ , అనిల్ బత్తుల లాంటి పుస్తక ప్రేమికులుంటేనే ఇలాంటి ముఖాముఖీలు కార్యక్రమాలు చేయగలుగుతుంది. తలా ఒక చెయ్యి వెయ్యకపోతే పుస్తకాల మనుగడ ఎలా?

  సుజాత గారు లెనిన్ సెంటర్లో ఉక్రేనియన్ జానపద గాధలుa> ఎలా పట్టేసారో అప్పుడే చదివేసాను కూడా. నా ఆనందం నాకే తెలుసు.

  అపర్ణ పరిచయం చేసిన పెద్ద ప్రపంచంలో చిన్నపిల్లడుa> ని చదివాను. ఎంత అందంగా వ్రాసింది అనుకున్నాను.

  ఇదిగో ఇప్పుడు ఇక్కడ అనిల్ బత్తుల పుస్తకాల మీద మనసు పారేసుకున్న వైనం చదివాను. ముచ్చటేసింది. అనిల్ బత్తుల లాంటి ప్రేమికులుంటే వుండగా తెలుగు భాషకి, తెలుగు పుస్తకానికి మరణమే లేదు.
  బ్లాగర్‌గా ఒక పాఠకుడిగా అనిల్ అభిప్రాయలు అనిల్‌వి.

  మళ్ళీ అనిల్ బత్తుల కి, అపర్ణ కి, అనిల్ ని ప్రోత్సాహించిన “మనసులో మాట” బ్లాగరి సుజాత గారికి, సారంగ సంపాదకవర్గ సభ్యుడు అఫ్సర్ కి రానున్న కాలంలో కూడా సారంగ ఇదే మూసలో పుస్తకాలకి తగిన ఆదరణ ని చూపించి వాటి వ్యాప్తికి తోడ్పడమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.

  You all made me my day. Thank you all !

 5. ఇంటర్వ్యూ బావుంది. కొంత సమాచారం తప్పా నాకు కొత్త విషయాలు ఏమి లేవు. అయినా
  విషయాలేముంటాయి..అనిల్ పుస్తకాల పిచ్చి,తపన తెల్సుకోవటం తప్పా.
  ఆ తపన ఏంతో కొంత చూసి, విని, లాభ పడ్డవాన్ని.
  సుఖీభవ. సొవ్యట్ బుకీభవ. :)

 6. ఎన్ వేణుగోపాల్ says:

  అనిల్ కు, అనిల్ పనిని అద్భుతంగా ఆవిష్కరించి నలుగురి దృష్టికి తెచ్చిన అపర్ణ కు ఎన్నెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. పుస్తకాల గురించి తలచుకున్నప్పుడల్లా, ‘ఇంతకాలవూ కాయితాల్తోనే గడిచిపోయింది. కన్నీటి కాయితాల్తోనే గడిచిపోయింది’ అనే మో మాటలు గుర్తొస్తాయి. అది కన్నీరే కాని ఆ కన్నీటి కెరటాల వెన్నెలా, ఆ కన్నీటెనకాల ఇంద్రధనుస్సులూ కనిపిస్తాయి. సోవియట్ యూనియన్, అది సాధించిన ప్రగతీ, అది ప్రపంచ సాహిత్యానికీ, ప్రపంచ పాఠకలోకానికీ చేసిన మేలూ గుర్తుకొచ్చి కన్నీరు సుళ్లు తిరుగుతుంది. కాని అనిల్ వంటి వాళ్ల కృషి వల్ల అక్కడ వెన్నెలా, ఇంద్రధనుస్సులూ వెలుగుతున్నాయి. బోలెడు బోలెడు కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు…

 7. పెద్ద ప్రపంచంలో చిన్నపిల్లడు…!

 8. ns harenadh says:

  చాలా గొప్ప కృషి. మంచి పరిచయ వ్యాసం. అనిల్ కృషి కొనసాగాలి.
  హరినాథ్
  సూర్యా డైలీ న్యూస్ పేపర్
  హైదరాబాద్

 9. anil garu mee gurinchi chadavagaane maa balyam gurtochindi. chinnappudu meeru cheppina pustakalanne dadapuga tirigesina vallame danlo emundi ani teliyakapoyina aa pustakaala patla aa pustakaala loni bommala patla adbhutamina premalo padda vaallame manchu shubram chese papanu maa mastishkamlo nilupukunna vallame.bala red guard nu muripam ga chusukunna vallame. malli aa jnaapakaalanu gurtu chesinanduku ippati taraaniki maa chinnappati mana chinnappati sahityaanni parichayam chestunnanduku abhinandanalu.

 10. anil garu malli okasari balyanni gurtu chesinanduku abhinandanalu

 11. అక్షరాన్ని హత్తుకునే వారు, పుస్తకాన్ని ప్రేమించే వారికి మాత్రమే సాధ్యమయ్యే విద్య ఇది . ఈ విద్యను నిలువెల్లా వొంటబట్టించు కున్నాడు కాబట్టే అనిల్ బత్తులకిది సాధ్యమయ్యింది . ఇంటర్వ్యు ఆసక్తి గా ఉంది . కొంత అనిల్ గారి అంతరంగం కూడా బోధపడింది. ఈ నెల 10 న లామకాన్ సభ విజయవంతం కావాలని కోరుతూ – గొరుసు

 12. ‘రాదుగ అనిల్’ మరో ప్రపంచాన్ని ఇంటర్ వ్యూతో కూడా కలిపి బాగా పరిచయం చేసినందుకు అపర్ణ గారికి అభినందనలు! పుస్తకాల మీద ఆసక్తీ, ప్రేమా ఉన్నవాళ్ళు అరుదైపోతున్నఈ రోజుల్లో అనిల్ లాంటివాళ్ళను చూస్తుంటే, ఇలాంటి విశేషాలు వింటుంటే సంతోషంగా ఉంటుంది.

  పుస్తకాల సేకరణ విషయంలో అనిల్ అసమాన ప్రతిభ గురించి ఓసారి శ్యామ్ నారాయణ గారి నోట విన్నాను. వాళ్ళిద్దరి కాంబినేషన్ గురించి ఆలోచించినపుడు ‘అగ్నికి వాయువు (అనిలం)’ తోడైన సామెత నాకు గుర్తొస్తుంది.

  సెకండ్ హ్యాండ్ స్టాళ్ళకు వేళ్ళాడే పుస్తకాలను చేజిక్కించుకోవటంలో పట్టువదలని విక్రమార్కుడు అనిల్! ఇతడి పుస్తకాల ‘పిచ్చి’ చిరకాలం వర్థిల్లాలని నా కోరిక!

 13. అబ్బా! ఇన్ని మాటలెందుకు. ఏమన్న పి డి ఎఫ్‌ రూపంలో ఎమన్న దొరుకుతాయేమో చెప్పండి?

 14. ఓ పుస్తకాలను ప్రేమించే మనిషి గురించి తెలుసుకోవడం బావుంది. నా చిన్నప్పటి సోవియట్ పుస్తకాలతో అనుబంధం ఇంకోసారి గుర్తుకొచ్చింది. అవి దాచుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ కలగలేదు. పిల్లలకి గుర్తు తెచ్చుకుని చెప్పడం వరకే ఉండేది ఇన్నాళ్ళూ. ఇపుడు అనిల్ గారు పంచుకున్న వాటి నుండి కొన్నయినా నా పిల్లలకి చదివి వినిపించోచ్చు అని సంతోషంగా ఉంది.

  –నాకు పుస్తకం అంటే జ్ఞానం సంపాదించడం అని ఎప్పుడు ఉండదండి. పుస్తకం చదవడం అనేది నావరకు నాకు ఒక ఆనందాన్ని పొందడమే..
  ఈ వాక్యాలూ , ఆఖరి పేరాలో పుస్తకం ముందూ వెనుకా జీవితం గురించీ చెప్పిన మాటలూ బాగా నచ్చాయి.
  అనిల్ గారికీ, అపర్ణ గారికీ, సారంగకూ ధన్యవాదాలు.

 15. అనిల్ గారూ, పుస్తకాల పట్ల, పుస్తకాల సేకరణ పట్ల మీకున్న ఆసక్తి అభిలషణీయం. యువకులకి, యువతులకి ఆసక్తి ఉంటుంది కాని ఆ పని పట్ల ఆరాధన ఉండటం లేదు. ఆసక్తి, తపన (passion ) ఉన్నంత మాత్రాన సరిపోదు దానికి ప్రత్యేకాన్ని(imortance ) ఇవ్వాలి. అప్పుడే ఏదైనా సాధ్యం అవుతుంది. ఉదాహరణే మీరు. అభినందనలు.

 16. సాయి పద్మ says:

  పుస్తకాల నుంచి దూరంగా నిజమైన మనుషులకి మరింత దూరంగా వొంటరితనం అనే గ్లోబలైజేషన్ లోకి వచ్చేసాం మనం .. అలాంటప్పుడు కూడా మనకి ఉపయోగపడేది ..గతంలోని బాల్యపు అక్షరాల కుప్పలే .. యేరుకోవాలి, ముళ్ళూ రాళ్ళూ చూడకుండా … ఆల్చిప్ప దొరికినా, వాడేసిన అగ్గిపెట్టె దొరికినా సంతోషపడే పిల్లాడి కుతూహలం తో.. అలాంటి పిల్లాడి కథే .. ఈ ఇంటర్వ్యూ .. ఆ పిల్లాడి పేరు అనిల్ బత్తుల .. మంచి ఇంటర్వ్యూ అపర్ణా ..చాలా చాలా కొత్త విషయాలు తెలిసాయి.. ముఖ్యంగా గతం వెతుక్కొని అర్ధం చేసుకొని వాళ్లకి భవిష్యత్ లేదన్న సంగతి… భలే ఉండి ..

 17. kalluri bhaskaram says:

  అభినందనలు అనిల్…ఎంతోమంది బాల్యాన్ని వెనక్కి ఇవ్వగాలిగానన్న మీ మాట నిజం. నా చిన్నప్పుడు చాలా ఏళ్ళు సోవియెట్ భూమి పోస్ట్ లో ఇంటికి వచ్చేది. నేను ఏదో ప్రశ్న రాస్తే వారి దగ్గరి నుంచి జవాబు కూడా వచ్చింది. అప్పుడు నేను ఎంత థ్రిల్ అయ్యానో చెప్పలేను. ఎందుకో తర్వాత ఆగిపోయింది. నాకు ఏదో పోగొట్టుకున్నట్టు అయిపోయింది. ఎందుకు పంపడం లేదంటూ ఉత్తరం రాస్తే, చందా కడితే పంపుతామని రాసినట్టు గుర్తు. మా పిల్లలకు కూడా సోవియెట్ బాలసాహిత్యం పరిచయమయింది. ఇప్పుడు మీ గురించి చదివాక నా దగ్గర ఉన్న సోవియెట్ పుస్తకాలు ఎంతో అపురూపంగా కనిపిస్తున్నాయి. తీరిక చేసుకుని వాటిలోకి ఒకసారి తలదూర్చాలి. మిమ్మల్ని, మీ ఆసక్తిని ఎంతో హృద్యంగా పరిచయం చేసిన అపర్ణగారికి కూడా అభినందనలు.

 18. sunkojidevendrachari says:

  Anil Battula gariki abhinandanalu.. school rojullo vyasam rayadamto modalu petti pustakalu chadavadamlo kuruku poyaru.. e anubhavamto kathalo navalalo raste baguntundi.. anuvadalato agopokandi.., telugulo vstunna manchi rachanalanu kuda fallow kandi?

 19. Usha S Danny says:

  అనిల్ బత్తుల గారికి, అపర్ణా తోట లకు ధన్యవాదాలు.

  అంతకు ముందు నేను ఏవేవో పుస్తకాలు చదివేవాడిని. నా ఇరవయ్యవ యేట సోవియట్‍ పుస్తకాలు చదవదం మొదలెట్టాను. ఆ తరువాత ఇతర పుస్తకాలు చదవడానికి మనసయ్యేదికాదు. దాదాపు ఒక దశాబ్దంన్నర కాలం మమ్మల్ని సోవియట్‍ పుస్తకాలు కమ్ముకున్నాయి. ఆ భావోద్వేగాల్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  సెప్టెంబరు 10 సాయంత్రం మిమ్మల్ని కలుస్తాను.

 20. పుస్తకాన్ని పరిచయం చేసినట్లుగా ఒక ఒక పుస్తక ప్రేమికున్ని పరిచయం చేయడం బాగుంది.
  ఒక మంచి కథ కలిగించినంతగా అనిల్ ఇంటర్వ్యూ నాలో బావోద్వేగాన్ని కలిగించింది.
  నేనేరుకొన్న కొన్ని మంచి ముత్యాలు.
  “నాకు పుస్తకం అంటే జ్ఞానం సంపాదించడం అని ఎప్పుడు ఉండదండి. పుస్తకం చదవడం అనేది నావరకు నాకు ఒక ఆనందాన్ని పొందడమే.”
  “నాకు కథలెంత ముఖ్యమో ఇంకొకరికి ఈ సైన్సు వ్యాసాలూ కూడా అంతే ముఖ్యమై ఉండొచ్చుకదా అని.”
  “నచ్చిన పుస్తకం చదివాక, ఒక వారం, పది, నెల రోజులు వరకు ఏమి చదవను.. కాఫీ తాగాక నోటిలో కాఫీ రుచి పోతుందని ఏమి తినన్నట్టు. ”
  “జీవితాన్ని ఏ విధంగా సంబంధం లేని యుటోపియన్ విషయంగా సినిమాల్లో చూపించడం….బేసికల్ గా మన సాహిత్యానికి మన సినిమాలకూ మధ్య చాలా ఎడం ఏర్పడింది.”
  “ఒక కథ బావుందంటే ఎక్కడ అన్వయించుకుంటే ఎక్కడైనా ఆదరణ అలభిస్తుంది- ఆర్మేనియాలోనైనా, ఇండియాలోనైనా. ఎందుకంటే మానవజీవితం సార్వజనియమైనది. ”
  “నా జీవితం లో పరిపూర్ణతనేది చూడగలిగాను నేను. ఈ పుస్తకాల వల్ల.”

  అనిల్ గారి కృషిని మరింత మందికి పరిచయం చేసిన అపర్ణ గారికి ధన్యవాదాలు.

 21. Chakrapani Ananda says:

  ” సోవియెట్ లిటరరీ అడాప్టేషన్స్ గా చాల సినిమాలు వచ్చాయి. తెలుగులో రాజు పేద, కన్యాశుల్కంలాంటి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కాని భారీస్థాయిలో సాహిత్యం సినిమాగా మారలేదు. సినిమాలుగా తీయగలిగే మునెమ్మ లాంటివి లిటరరీవర్క్స్ తెలుగులో చాలా ఉన్నాయి. మన సాహిత్యం చాలా భాగం సినిమాల్లోకి కన్వర్ట్ కాలేదు. బావుంది, బాలేదు అని కాదు…సినిమాలుగా అడాప్ట్ కాలేదు. తెలుగులో గొప్ప సాహిత్యం సినిమాల్లోకి కన్వర్ట్ కాకపోవడం, సినిమాల్లో వచ్చే దానికీ జీవితానికీ సంబంధం లేకపోవడము, సినిమాకి సాహిత్యానికి సంబంధం లేకపోవడం, జీవితానికీ సాహిత్యానికీ సంబంధం ఉండడము, జీవితాని ప్రతిబింబించే సాహిత్యం సినిమాగా మారకపోవడము, జీవితాన్ని ఏ విధంగా సంబంధం లేని యుటోపియన్ విషయంగా సినిమాల్లో చూపించడం….బేసికల్ గా మన సాహిత్యానికి మన సినిమాలకూ మధ్య చాలా ఎడం ఏర్పడింది.”

  చాలా చక్కటి విశ్లేషణ. తెలుగు సినిమాకి సాహిత్యానికి సంబంధం లేకపోవడం విచారకరమైన విషయం. ఇందుకు ప్రధాన కారణం సినిమాలు తీసేవాళ్ళు సాహిత్యం చదవకపోవడమే. సాహిత్యం చదివినవాడు ఎవ్వడూ సినిమాని ఇప్పుడున్న స్థాయికి దిగజార్చే సాహసం చెయ్యలేడు. ఇంకొక కారణం తెలుగు సినిమా కొందరు వ్యాపారస్తుల చేతుల్లో బందీ అయిపోవడం. డబ్బున్న వాడికి కళాత్మకత లేకపోవడం – కళాత్మకత వున్న వాడికి డబ్బు దొరకకపోవడం.

  ఏదేమైనా పై విశ్లేషణ నన్ను బాగా కుదిపేసింది. మంచి సినిమాలు తియ్యాలనే నా చిరకాల వాంఛ కేవలం స్వప్నంలానే కొనసాగడం బాధించింది. తెలుగు సాహిత్యంలో నుంచి ఒక మంచి కథావస్తువు తీసుకుని సినిమా తీయాలనే కోరిక బలపడింది. ఆ దిశగా నాకు మార్గదర్శనం చేసిన ఈ ఇంటర్వ్యూ అందించిన అపర్ణ, అనిల్ గార్లకు ధన్యవాదాలు.

 22. కోల్పోయిన నా బాల్యాన్నితిరిగి ఇచ్చినందుకు అనిల్ మీకు రుణపడి వుంటాను

 23. అనిల్ నాకు ఒక అరుదైన పుస్తకాన్ని ఇటీవల పంపారు. ఆ పుస్తకం చదివి కొన్ని రోజులుగా వేరే ప్రపంచంలో ఉన్నాను. థాంక్స్ అనిల్

 24. మమత కొడిదెల says:

  నిజంగానే అనిల్ గారు చాలా మందికి బాల్యాన్ని వెనక్కి ఇచ్చారు. Amazing effort. Thank you again Anil garu.

  Aparna, Thank you for this thoughtful interview. It is one of the memorable ones.

మీ మాటలు

*