తెలుస్తూనే ఉంది

 Rekha

నాకు తెలుస్తోంది

నా వీపు తాకుతున్న ఆ కళ్ళు
తడిబారి ఉన్నాయని,

ఒక్క అడుగు వెనక్కి వేసినా ,
ఆమె కన్నీటి సరస్సులో నా మునక తప్పదని

ఒక్కసారి, ఇంకొక్కసారి అనుకొని
లెక్కలేనన్ని సార్లు చూపుల తడిమి తడిమి
నా రూపుని తన కంటి పాపపై చెక్కుకొని
తనివి తీరక చివరికి,
కన్నీరై కరుగుతోందని తెలుస్తోంది

వేల వేల భావగీతాలు పంచుకున్న తర్వాత
వీడ్కోలుకు ముందు ఇరువురం స్తబ్దుగా మిగిలిన
ఆ కొన్ని క్షణాల్లోనే ఉంది ఆర్ద్రత అంతా
ఆ కాసిన్ని నిరక్షర కవనాలలోనే ఉంది వేదనంతా
ఆమె నన్ను ఆపకుండా ఎలా ఉంటుంది ?
ప్రాణం పోతుంటే పోరాడని వారు ఎవరుంటారు?

మరోసారి, ఎన్నోసారో మరి
ఆ చేయి నొక్కి ధైర్యాన్ని ఇస్తున్నానో, తీసుకుంటున్నానో
తెలియని శూన్యావస్థలో వెనుదిరిగాను

ఆఖరి కరచాలనంలో
వేళ్ళ చివరనుంచి జారిపోతున్న ప్రాణాన్ని పట్టుకొని,
విడవలేక, విడవలేక మళ్ళీ పట్టుకొని
చివరికి, ఓ సాలీడు తన గూడు లో నుంచి
జర్రున జారిపోయినట్టు వెనుదిరిగాను

నాకు తెలుస్తూనే ఉంది

పెనుగాలికి రాలిన పొగడ పూలను
భద్రంగా మాల గుచ్చుకుంటుందని,
ఈ దూరాన్ని కుదిపి కుదిపి గాయం చేసుకొని
దాచుకుంటుందని తెలుస్తోంది

చేయగలిగిందేమీ లేదు,
తల వంచుకొని ఈ వీధి మలుపు తిరగడం తప్ప

నిజానికి
ఆమె కళ్ళెత్తి చూసినప్పుడు విరిసే ఓ కాంతి పుంజంలో
నన్నూ నా జీవితాన్ని ఒక్క క్షణం చూసుకుంటే చాలు అనుకొని వచ్చాను

ఇదేంటి? ఈ వెలుగు శాశ్వతం కాలేదని నిరాశతో వెనుదిరుగుతున్నాను

రాక రాక ఆమె వాకిలికొచ్చి పొందానా?
మరోసారి నన్ను నేను పోగొట్టుకున్నానా?

– రేఖా జ్యోతి

మీ మాటలు

  1. ఎంత హృద్యంగా రాసారూ..!

  2. పెనుగాలికి రాలిన పొగడ పూలను
    భద్రంగా మాల గుచ్చుకుంటుందని,
    ఈ దూరాన్ని కుదిపి కుదిపి గాయం చేసుకొని
    దాచుకుంటుందని తెలుస్తోంది

    నిజానికి
    ఆమె కళ్ళెత్తి చూసినప్పుడు విరిసే ఓ కాంతి పుంజంలో
    నన్నూ నా జీవితాన్ని ఒక్క క్షణం చూసుకుంటే చాలు అనుకొని వచ్చాను

    ఇదేంటి? ఈ వెలుగు శాశ్వతం కాలేదని నిరాశతో వెనుదిరుగుతున్నాను

    రాక రాక ఆమె వాకిలికొచ్చి పొందానా?
    మరోసారి నన్ను నేను పోగొట్టుకున్నానా?

    అక్షర లక్షలండి….అల్ ది బెస్ట్

  3. ఎంత సుందరమైన కవితండీ.

  4. aaj jaaneki jidd naa karoo, mere pehloo me baithe rahooo……..chala bagundi mee kavitha. wah. hrudayanni thakindi.

  5. అమ్మా, చక్కటి అనుభూతిని కలిగించింది మీ కవిత. ప్రియమైన వారు దూరం అవుతుంటే అనుభవించే నిశ్శబ్ద వేదన అంటా ఇందులో చక్కగా చూపారు. కొన్ని పాదాలు గుండెను పట్టుకునేలా ఉన్నాయి.
    కన్నీరై కరిగినది ఎవరి కంటిపాపో కానక్కరలేదు, చదివిన హృదయం కూడా అలానే ద్రవించేలా వ్రాసారు.
    ఇందులో కొన్ని మహాద్భుతంగా ఉన్నవి:

    ‘నా రూపుని తన కంటిపాపపై చెక్కుకుని …కన్నీరై కరుగుతోంది’
    ‘ఆ కాసిన్ని నిరక్షర కవనాలోనే ఉంది వేదనంతా’ (నిరక్షర కవనాలు – ఎంత బాగుంది ఈ మాట!)
    ‘వీడ్కోలుకు ముందు ఇరువుర స్తబ్దుగా మిగిలిన ఆ కొన్ని క్షణాల్లోనే ఉంది ఆర్ద్రత అంతా’
    ‘ఆమె కళ్ళెత్తి చూసినప్పుడు విరిసే ఓ కాంతిపుంజం లో నన్ను, నా జీవితాన్ని ఒక్క క్షణం చూసుకుంటే చాలు’
    ‘ఆఖరి కరచాలనం లో వేళ్ళ చివరినించి జారిపోతున్న ప్రాణాన్ని పట్టుకొని’

    ఆ వీడుకోలు మీరు ఎవరికీ చెప్పారో వారు ఎంత స్నేహశీలో కదా!
    చాలా మంచి కవిత చదివించారు , తరుచూ రాస్తుండవచ్చు కదా! శుభమ్.

  6. narayana sharma says:

    ఈకాలపు కవిత్వంపై మనోవైఙ్ఞానిక ప్రభావం ఎంతగా ఉందో మీ కవితచెబుతుంది..వీడుకోలు యాంత్రికంగా జరుగుతుందనుకునే ఆఒక్క క్షణాన్ని అనేక శకలాలుగా అనుభవించడం..అంతే గొప్పగా కవిత్వీకరించడం బావుంది..ప్రతి వాక్యం హృదయాన్ని ఆవిష్కరించింది..
    నాకు తెలిసి ఈ సంఘటన వెనుక ఉండే స్తబ్దదృశ్యాన్ని కవిత్వం చేసిన కవులు/కవయిత్రులు,సాహిత్యం తక్కువే.బహుశ: లేరేమో..పదిలంగా ఒక స్త్రీ గొంతుక ధ్వనిస్తుంది అన్ని వాక్యాలలో…

    మీరు కవితకు ఎన్ను కున్న శీర్శిక ఈ కవిత హృదయాన్ని ప్రసారం చేగలగలేదనిపిస్తుంది..

  7. మైథిలి అబ్బరాజు says:

    ” వేళ్ళచివరనుంచి జారిపోతున్న ప్రాణం ” ఇటువంటి ఎన్ని- చెప్పే వీలు లేని భావాలకి , అక్షరాలు ఇచ్చారు రేఖా… అపురూపమైన హృదయం , అది కరిగి నీరైన మాటలు…ఈ గాయాన్ని దాచుకుంటాను.

  8. కవిత బాగుంది. అభినందనలు.

  9. అద్భుతంగా వ్రాశారు …
    అభినందనలు …

  10. rachakonda srinivasu says:

    చాల బాగుంది .భావాలూ జాలువారాయి

  11. రసవత్తరమైన కవిత. హృదయపూర్వక అభినందనలు.

  12. Adbhuthamaina hrudhyamaina padaprayogam… Mee nunchi inka illantivi chala kavithalu aasisthunnam Akka…

  13. ” పొందానా?
    పోగొట్టుకున్నానా?” – చాలా బావుందండీ కవిత. అభినందనలు

  14. నిశీధి says:

    చాల కాలం కి ఒక మంచి పోయెమ్ చదివిన ఫీలింగ్ .

  15. చాలా మంచి కవిత రాశారు. అబినందనలు.

  16. madhavi mirapa says:

    రేఖ గారు కవిత చాల బావుంది. పొందడం పోగొట్టుకోవడం ఒకేసారి జరిగినపుడు కలిగే ఆనందం బాధ మధ్య దూరాన్ని కుదిపి కుదిపి గాయం చేసుకోవడం ఎంతమందికి సాధ్యమవుతున్దంటారు ? నిరక్షర కవనాలలోనే ఉంది వేదనంతా… ప్రియమైన వారిని వీడి పోయే ముందు ఉండే ఆర్ద్రతంతా మీ కవితలోనే ఉంది …….చేయగలిగింది ఏమి లేదు వీధి మలుపు తిరగడం తప్ప …..మనల్ని నిత్యం వెంటాడే కవితల్ని గుండెల్లో దాచుకోవడం తప్ప…చేయగలిగినది ఏమి లేదు…… వేళ్ళ చివరనుంచి జారిపోతున్న ప్రాణాన్ని పట్టుకొని…

  17. AMAZING పోయెమ్!!
    మొదటినించీ చివరివరకూ అద్బుతం!!!

  18. ‘వీడ్కోలుకు ముందు ఇరువుర స్తబ్దుగా మిగిలిన ఆ కొన్ని క్షణాల్లోనే ఉంది ఆర్ద్రత అంతా’ – కుదిపేసే క్షణాన్ని మాటలో పట్టుకున్నారు.

    చాలా బాగుంది రేఖా గారు!

  19. లలిత says:

    కవితలు జీవితంనుండే వస్తాయి. అనుభవాలు ……. మన
    గతాన్ని అద్దం లో పట్టి చూపే క్షణాలవి.
    బాగుంది

    • నిజమేనేమో లలితా ! అంత లోతైన బంధాల్ని అల్లుకోవడం నేర్పిన వారికి నమస్సులు. TQ

  20. యార్లగడ్డ రఘుబాబు says:

    “తడిబారి” మనసు ముద్దయింది !!!

  21. ఉమాదేవి says:

    ఎంత అందమయిన భావాలు! ప్రతి పదంలోోను, పాదంలోనూ మనసుని తట్టి లేపే స్పర్శ ! చాలా చక్కగా వ్రాశారు.

    • చాలా సంతోషంగా ఉంది మీకు నచ్చినందుకు, రెండేళ్ల తర్వాతఈ కవిత మళ్ళీ మేలుకున్నందుకు! Thank you ఉమాదేవి గారూ

  22. prasad rao says:

    మనసును మనోహరంగా….గీశారు సారీ రాసారు……… ఎంత అద్భుతంగా రాసారు చాల బాగుంది

  23. కె.కె. రామయ్య says:

    ” నువ్వొచ్చిన వసంతంలో నుంచి
    నువ్వు లేని గ్రీష్మంలోకి జారిపోవడానికి, నాక్కాస్త సమయం పడుతుంది ! ”

    రేఖజ్యోతి గారు మీరు ఇంతకుమునుపు అక్షరీకరించిన ఆ కవనాల వేదనను నేనింకా తలుచుకుంటూనే ఉన్నాను.
    ధన్యవాదాలు.

    • ఎప్పటివో కొన్ని వాక్యాలు మీరు గుర్తుపెట్టుకొని చెప్పడం చాలా చాలా సంతోషాన్నీ, మరోసారి రాసే ధైర్యాన్నీ ఇచ్చాయి సార్ , ధన్యవాదాలు !!

Leave a Reply to రేఖాజ్యోతి Cancel reply

*