చరిత్రకు ‘హిందూత్వ’ చెద

 

sangisetti- bharath bhushan photo

మొన్న పంద్రాగస్టు నాడు గోలకొండ కోటలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ జెండా ఎగరవేస్తే బిజెపికి ఎక్కడి లేని కోపమొచ్చింది. జాతీయ జెండాను అక్కడ 17సెప్టెంబర్ నాడు ఎగరెయ్యాలని ఉచిత సలహాలు కూడా ఇచ్చిండ్రు. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తే దానికి కూడా బిజెపితో పాటు కాంగ్రెస్ పార్టీలు కూడా మతం రంగు పూయడానికి ప్రయత్నించాయి. ఆఖరికి సానియాను ఏడిపిస్తేగాని వీళ్ల కండ్లు సల్లబడలేదు. హైదరాబాద్ని భారత ప్రభుత్వం ‘ఆక్కుపై’ చేసుకున్న 17 సెప్టెంబర్ విద్రోహ దినాన్ని ‘పండుగ రోజు’గా ప్రకటించాలని హిందూత్వ వాదులు పిలుపునిస్తున్నారు. 1948లో జరిగిన పోలీసు చర్యలో రెండు లక్షలకు పైగా ముస్లింలు ఊచకోతకు గురైన సంఘటనను ‘పండుగ’గా జరుపుకోవాలనడంలోనే వారి మానసిక స్థితి తెలియ వస్తుంది. వీళ్లంతా వచ్చే బల్దియా ఎన్నికల్లో లబ్ధిపొందే ఉద్దేశ్యంతో ప్రతిదానికి మతం రంగు పూస్తున్నారు.

అలాగే, రేపు జూబ్లిహిల్స్లోని కాసుబ్రహ్మానందరెడ్డి పార్క్ పేరుని ‘అసఫ్జాహీ’పార్కుగా మార్చే ఏర్పాటు జరుగుతోంది. నిజానికి చిరాన్ప్యాలెస్ పేరిట ఈ ప్రాంతం ఎప్పటి నుంచో ప్రఖ్యాతి. అయితే ఈ పార్కుకి 1969లో 369 మంది ఉద్యమకారుల్ని పొట్టనబెట్టుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి పేరు పెట్టడమంటేనే తెలంగాణను అవమానించడం. అట్లాంటిది ఈ ‘అసఫ్జాహీ’ పేరుపై అప్పుడే నిరసనలు షురువైనయి. హైదరాబాద్ గంగా`జమున తెహజీబ్కు, లౌకిక భావనలను అణచివేసేందుకు మతోన్మాద శక్తులు ఏకమవుతున్నాయి. ఇలాంటి దశలో హైదరాబాద్ అసలు చరిత్రను అందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది.

నిప్పులాంటి నిఖార్సయిన చరిత్రకు సైతం మతతత్వవాదులు చెదలు పట్టిస్తున్నారు. చరిత్రలో పరిఢవిల్లిన మతసామరస్యతకు మసి బూస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొని ప్రచారం చేస్తున్న ‘హింసోన్మాదులు’ హైదరాబాద్, తెలంగాణ ‘తెహజీబ్’ని సరిగా అర్థం చేసుకోలేదనే చెప్పవచ్చు. కుతుబ్షాహీల కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు చెదురుముదురుగా ఒకటీ అరా జరిగిన సంఘటనలనే భూతద్దంలో పెట్టి చూపిస్తూ కావాలనే ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడుతున్నారు. మతం రంగు పూస్తున్నరు. నిజానికి 450 ఏండ్ల ముస్లింల పాలనలో పరిఢవిల్లిన మత సామరస్యతను, పరమత సహనాన్ని లౌకిక ధృక్కోణంతో వెలుగులోకి తేవాల్సిన అవసరముంది. ఈ దిశలో ఇంతవరకు కృషి జరుగలేదు. కుతుబ్షాహీలు, అసఫ్జాహీల పాలన, కతుబ్షాహీల తెలుగు రాణుల స్మృతి, రాజులు తెలుగు సాహిత్యాన్ని పోషించడమే గాకుండా స్వయంగా తెలుగు కవిత్వాన్ని సృష్టించిన చరిత్ర రికార్డు కావాలి. మత విద్వేషాలకు దూరంగా ప్రజలందరినీ సమానంగా చూసిన గత వైభవానికి చిత్రికగట్టాలి.

కుతుబ్షాహీల కొలువులో అక్కన్న, మాదన్న సోదరులు కీలక భూమిక నిర్వహించారు. ఒకరు సైనికభారాన్ని వహించగా, మరొకరు ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టారు. అక్కన్న దేశభక్తిని శంకించడానికి వీలులేదు. డచ్ ఈస్టిండియా కంపెనీ వారు వ్యాపారం కోసం కొంత భూభాగాన్ని కోరినప్పుడు అక్కన్న మాట్లాడుతూ ‘‘ఇక్కడ పుట్టి పెరిగిన వారు మాత్రమే దేశ సౌభాగ్యం కోసం పాటుపడుతారు. హృదయపూర్వకంగా ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తారు. అంతేగాని వ్యాపార ఉద్దేశ్యాలతో విదేశాల నుంచి వచ్చిన వారు కాదు’’ అన్నాడు. తన దేశభక్తికి సాక్షిగా ‘డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ’ ఉద్యోగి మైఖేల్ జాంజూన్తో 1683లో అన్న మాటలివి. చివరికి అన్నదమ్ములిద్దరూ గోల్కొండ రాజ్యం కోసం కోటలోనే శత్రువుల చేతిలో ప్రాణాలర్పించారు. అంతటి త్యాగ నిరతి వారిది. అక్కన్న, మాదన్నలిద్దరూ గోల్కొండ రాజ్యంలో చాలా ప్రదేశాల్లో గుడులు నిర్మించారు. వాటి పోషణ కోసం భూములు కేటాయించారు.

సాక్షాత్తు గోల్కొండ కోటలోనే గుడిని కట్టించారు. ఆ గుడి ఇప్పటికీ పూజలందుకుంటోంది. తెలంగాణలో బోనాలు ఇప్పటికీ ఇక్కడనే ప్రారంభమవుతాయి. కూచిపూడి నాట్యాన్ని ప్రోత్సహించి సిద్ధేంధ్రయోగికి సకల వసతులతో కూడిన భూమిని సమకూర్చిందీ కుతబ్షాహీలే. ఇందులో అక్కన్న, మాదన్నల పాత్ర కూడా ఉన్నది. నిజానికి కుతుబ్షాహీల కొలువులో ‘సనదు’లను ఫార్సీలో రాయించే వారు. ఇవే విషయాలను తెలుగులో కూడా రాయించి ప్రకటించేవారు. అంటే తెలుగు భాషకు వారిచ్చిన గౌరవం అర్థమయితది.

సురవరం ప్రతాపరెడ్డి కుతుబ్షాహీల గురించి రాస్తూ ‘‘వారు స్వమతాభిమానులే గానీ బహమనీల వలె పరమతధ్వంసకులు కారు’’ అని పేర్కొన్నారు. దీనికి తగ్గట్టుగానే మొత్తం భారతదేశంలోనే ఉర్దూలో తొలి రచన వెలువడిన గోల్కొండ కోటలో నుంచే ముస్లింలు రాసిన తొలి తెలుగు సాహిత్యం వెలువడిరది. తెలుగు మండలములో తెలుగులోనే రాజ్య వ్యవహారాలను సాగించారు. మొహర్రం, విజయదశమి, కామదహనం, మృగశిర రోజుల్లో ప్రజలందరూ కలిసి వేడుకలు జరుపుకునేవారు. ఇప్పటికీ తెలంగాణలో మొహర్రం పండుగను మతాలకతీతంగా జరుపుకుంటారు. ఈ పండుగలు జరుపుకునేందుకు కుతుబ్షాహీ ప్రభుత్వమే ఖర్చంతా భరించేది. తొలి అచ్చ తెలుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ వీరి కాలంలోనే పొన్నగంటి తెలగన్న రచించారు. అలాగే కుతుబ్షాహీల ఆస్థానంలోని అద్దంకి గంగాధర కవి, సారంగు తమ్మయ మొదలైన వారంతా తెలుగు సాహిత్యంలో ఒక గుర్తింపుని తెచ్చుకున్నవారే!

కుతుబ్షాహీ రాజులు వివక్ష పాటించకుండా అన్ని మతాల వారికి ప్రభుత్వోద్యోగాల్లో ప్రాతినిధ్యాన్ని కల్పించారు. ఏ యితర ముస్లిం రాజ్యంలోనూ లేని మత స్వాతంత్య్రాన్ని హిందువులు కుతుబ్షాహీల పాలనలో అనుభవించారు. అయితే ఈ విషయాలేవి చరిత్ర పుటల్లోకి, పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కలేదు. పర్షియన్, ఉర్దూ, తెలుగు భాషా సాహిత్యాలు సమానంగా ఆదరించబడ్డాయి. తారామతి, ప్రేమావతి మొదలైన హిందూ స్త్రీల ప్రతిభకు ఆదరణ దక్కింది. భాగామతి పేరిట హైదరాబాద్ నగరమే నిర్మితమయింది.

హిందూ`ముస్లిం సఖ్యతకు అత్యంత ప్రాధాన్యత నిచ్చిన కులీకుతుబ్షా హైదరాబాద్ నగరాన్ని నిర్మింపజేయడమే గాకుండా తెలుగులో కవిత్వం కూడా అల్లిండు. ఇంతవరకెవ్వరూ ఈ విషయానికి తగిన ప్రాధాన్యతనిచ్చి చర్చించలేదు. దసరా పండుగ గురించి ఆయన ఇలా వర్ణించారు.

‘‘అందాల దసరా ఆనందముతో వచ్చినది
వనమంతా వెన్నెలమయమయినది
అందాల మనసులో బుల్ బుల్ పిట్టల పాటలు
అందాలొలుకబోసె
అంగనల పాటల వలె ఉన్నవి’’

అని కవిత్వీకరించిండు. ఇదే తెలుగులో ముస్లింలు రచించిన మొట్టమొదటి సాహిత్యం. రాజులే తెలుగును ఆదరించడమే గాకుండా స్వయంగా కవిత లల్లారు. ప్రజల్ని కన్నబిడ్డల వలె చూసుకున్నారు. కొంతమంది హిందూత్వ వాదులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాల్సిన ఘటనలకు కావాలనే స్థానం దక్కకుండా చేసిండ్రు. తవ్వినా కొద్దీ ఆనాటి వెలుగులు ఎన్నో కొత్త పుంతల్ని సంతరించుకుంటున్నాయి. ఇంత వరకూ తెలుగు సాహిత్యంలో కుతుబ్షాహీల సేవ గురించి సరైన పరిశోధన జరగలేదంటే విశ్వ విద్యాలయాల్లో ఉన్న వారి మేధో పరిధి, భావజాలం రెండూ తెలియ వస్తున్నవి.

కుతుబ్షాహీల అనంతరం అసఫ్జాహీలు కూడా ఇదే ఒరవడిని కొనసాగించారు. 1944`48లో మాత్రమే కొన్ని చోట్ల వివిధ కారణాల వల్ల మతపరమైన అలజడి చెలరేగింది. మొత్తం 225 సంవత్సరాల అసఫ్జాహీల పాలనలో కేవలం ఒకటి రెండు సంఘటనల ఆధారంగా ముస్లింల పాలన అంతా హిందూ వ్యతిరేక పాలన అని ఈనాడు కొంత మంది తీర్పులిస్తున్నారు. దీనిలో ఆరెస్సెస్ వాదులు మొదలు కమ్యూనిస్టుల వరకు చాలా మంది ఉన్నారు. ఈ విషయాన్ని గతంలో చాలా సార్లు చర్చకు పెట్టడం జరిగింది. నిజానికి ఏడో నిజామ్ మీర్ ఉస్మానలీఖాన్ తాను చేయాల్సి ఉండి చేయలేక పోయిన పనులకు ఆయనను జవాబుదారీగా నిలుపుతూనే అంతకుముందు జరిగిన అభివృద్ధి పనుల క్రెడిట్ ఆయనకు దక్కేలా చూడాల్సిన అవసరముంది.

నిజామ్ల పాలనలో తెలంగాణలోని వనపర్తి, గద్వాల, దోమకొండ, పాపన్నపేట, దుబ్బాక, రాజపేట ఇలా అనేక సంస్థానాలు హిందువుల పాలనలో ఉండేవి. వీటిలో వేటిని కూడా నిజామ్లు స్వాధీనం చేసుకోలేదు. పైపెచ్చు వీరికి కొన్ని విషయాల్లో ‘స్వయం పాలన’ అధికారాలు కూడా కట్టబెట్టారు. జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్ముఖ్లు, దేశ్పాండ్యాలు 95 శాతం హిందువులే. వీరి వల్ల నిజాం ఖజానాకు నష్టం కలుగుతుండటంతో సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్యంలో సంస్కరణలకు పునాదులు వేసిండు. దొరలు, దేశ్ముఖ్ల గుత్తాధిపత్యంలో ఉన్న కార్యకలాపాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకువచ్చారు. నిజామ్ల పాలనలో కూడా మత సహనం పరిఢవిల్లిందని చెప్పడానికి సాక్ష్యం కిర్క్ పాట్రిక్`ఖైరున్నీసాల వివాహం.

ఇప్పటి కోఠీలోని మహిళా కళాశాల, ఒకప్పటి బ్రిటీష్ రెసిడెన్సీని రెండువందల ఏండ్ల క్రితమే నిర్మించిన హైదరాబాద్లో బ్రిటీష్ రెసిడెంట్ జేమ్స్ అషిల్లిస్ కిర్క్ పాట్రిక్ నిజాం ఖాందాన్కు చెందిన ఖైరున్నీసా బేగమ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీనికి బ్రిటీష్ ప్రభుత్వాధికారుల నుంచి నిరసన వచ్చింది కానీ హైదరాబాద్లోని నిజాం ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఇదీ ఇక్కడి వాతావరణం.

నిజాం పాలనలో మొదటి నుంచీ హిందువులకు స్థానం ఉండేది. కాయస్థులు అధికారంలో రెవెన్యూ పదవుల్ని నిర్వహించే వారు. అలాగే చందూలాల్, కిషన్ పర్షాద్ తదితరులందరూ నిజాం ప్రధానులుగా వ్యవహరించారు. పక్కా ఆర్య సమాజీయుడైన కేశవరావు కోరట్కర్ని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించిన ఘనత నిజాం ప్రభుత్వానిది. భద్రాచలం, యాదగిరిగుట్ట, సీతారామ్బాగ్, రaాం సింగ్ టెంపుల్ (గుడి మల్కాపూర్) మొదలైన మందిరాలకు ప్రత్యేక వేడుకల సందర్భాల్లో రాజ లాంఛనాలతో పట్టుబట్టల్ని నిజాం ప్రభుత్వం పంపించేది. అంతేగాదు తమ రాజ్యంలోనిది కాకపోయినప్పటికీ తిరుపతి వెంకటేశ్వర మందిరానికి నిజాం ప్రభుత్వం నుంచి గ్రాంట్లు అందేవి. పూర్తిగా హిందూమతానికి సంబంధించిన మందిరాలైన అజంతా గుహల మరమ్మత్తుకు, అభివృద్ధికి గాను నిజాం ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది. హజ్కు వెళ్లే ముస్లిములతో సమానంగా కాశీయాత్ర చేసే వారి కోసం ప్రభుత్వమే ఖర్చులు భరించింది. కాశీలో బ్రాహ్మణులకు దానం చేసే రూపాయి దగ్గరి నుంచి అన్ని ఖర్చుల్ని నిజాం ప్రభుత్వమే భరించింది.

1908లో మూసీ నదికి వరదలు వచ్చి మూసీ తీర ప్రాంతమంతా కొట్టుకుపోయి అంతా అస్తవ్యస్తం కావడంతో గంగమ్మ తల్లిని శాంతింప చేయాలని పండితులు ఆరో నిజామ్ మహబూబ్ అలీఖాన్కు సలహా ఇచ్చారు. దాంతో ఆయన పసుపు బట్టలు ధరించి, ధూప దీప నైవేద్యాలతో మూసీ నదిలోకి తర్పణం చేశాడంటే పరమత సహనం, వారి నమ్మకాలకు అనుగుణంగా ఎలా నడుచుకున్నాడో అర్థమవుతుంది. అలాగే ఏడో నిజాం ఉస్మానలీఖాన్ పాలనలో హైకోర్టు కడుతున్నప్పుడు అప్పటికే అక్కడున్న ‘మాతాకా మందిర్’ అడ్డుగా ఉన్నది దాన్ని తొలగించి విశాలంగా కట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఇంజనీర్లు ఉస్మానలీఖాన్కు ప్రతిపాదనలు పంపారు. దాన్ని ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ ‘‘మనం కట్టేది న్యాయాలయం. దాన్ని అన్యాయపు పునాదులపై నిర్మించ కూడదు’’ అని మందిరానికి తగినంత చోటు వదిలి పెట్టి హైకోర్టుని నిర్మించారు. ఇప్పటికీ ఈ ఆలయం హైకోర్టు ఆవరణలో పూజలందుకుంటుంది.

అలాగే ఉస్మానలీఖాన్ పాలనలో మహాభారతం పుస్తక ప్రచురణ కోసం పూణేలోని పరిశోధనాలయానికి, బనారస్ విశ్వవిద్యాలయానికి నిజాం తన సర్ఫేఖాస్ నుంచి, ప్రభుత్వ ఖాతాల నుంచి విరివిగా విరాళాలు ఇవ్వడం జరిగింది. వాస్తవాలు ఇలా ఉంటే హిందూత్వ వాదులు, కమ్యూనిస్టులు నిజాంని కేవలం మతతత్వవాదిగానే చూస్తున్నారు. నిజాం పాలనలో బ్రిటీష్ వారు హద్దు మీరి జోక్యం చేసుకోవడం వల్ల రెవెన్యూ, పోలీస్, ఎక్సయిజ్ మిగతా ప్రాధాన్య శాఖలన్నింటికీ బ్రిటీష్ సంతతి వారే అధికారులుగా నియమితులయ్యేవారు. వారు చెప్పిందే వేదంగా సాగేది. ట్రెంచ్, టస్కర్ లాంటి వారు ఆంధ్ర మహాసభలకు అనుమతులివ్వకుండా అడ్డుకునేవారు. వీటన్నింటికి ఒక్క నిజామ్నే దోషీగా నిలబెట్టాలని, ఆయన్ని రజాకార్ల ప్రతినిధిగా చూడాలనడం సబబు కాదు. అందరితో పాటు 1944`48 సంవత్సరాల మధ్య కాలంలో జరగకూడని సంఘటనలకు, జరిగిన సంఘటనలకు నిజామ్ని బాధ్యుడ్ని చేస్తూనే ఆ కాలంలో జరిగిన సంఘటనల్ని సంయమనంతో, ఇతర అంశాలతో సమన్వయం చేస్తూ అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. 1944 ప్రాంతంలో హైదరాబాద్లో, 1927లోనే ‘మజ్లిస్’ని స్థాపించిన బహదూర్ యార్జంగ్ అల్లుళ్లు దూళ్పేట్లో జరిగిన మత కలహాల్లో మరణించారు. ఈ సమయంలో బహదూర్ యార్జంగ్ ప్రదర్శించచిన సంయమనాన్ని సరోజిని నాయుడు తన కవితల్లో నిక్షిప్తం చేసింది. మొత్తం తెలంగాణలో ఇలాంటి రెండు మూడు మత కలహాల సంఘటనలు జరిగాయి. ఈ కాలంలో అటు మజ్లిస్, మరొక వైపు ఆర్య సమాజ్, ఇంకోవైపు దళితులు, రజకార్లు తమ కార్యకలాపాలను నిర్వహించారు.

బీసీల్లో సంగెం సీతారామయ్య యాదవ్, వనమాల (హకీం) నారాయణదాసు, ధావత్ జనార్ధన్, చిరాగు వీరన్న గౌడ్, కే.రాములు, బొజ్జం నర్సింలు తదితరులు ఇక్కడి ప్రజల అభుయన్నతి కోసం కృషి చేసిండ్రు. వీరికి ప్రభుత్వం మతంతో సంబంధం లేకుండా ప్రోత్సాహాన్నిచ్చింది. వారు ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చే సమస్యలను సామరస్యంగా పరిష్కరించింది.

నిజాం పాలనలో ఆది హిందువులు అని పేరున్నప్పటికీ మాల, మాదిగలను ఏనాడు హిందువుల్లో భాగంగా జనాభా లెక్కల్లో చూపలేదు. అంతేగాకుండా సమాజంలో వెనుకబడ్డ ఈ ప్రజల కోసం నిజాం ప్రభుత్వం ప్రత్యేకమైన నిధిని కేటాయించింది. పష్తక్వామ్ పాఠశాలల పేరిట కొన్ని వందల పాఠశాలలను తెలుగు మీడియంలో దళితుల కోసం ప్రత్యేకంగా 1930కి ముందే ప్రారంభించింది.

భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బి.ఎస్.వెంకట్రావు, శ్యామ్సుందర్ లాంటి దళిత నాయకుల సలహా సంప్రదింపులకు అనుగుణంగా వారి అభ్యున్నతికి ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు. బి.ఎస్.వెంకట్రావు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ అంబేద్కర్ స్థాపించిన విద్యాలయాలకు విరివిగా గ్రాంట్లు మంజూరు చేసిండు. ఆర్య సమాజ్ `మజ్లిస్ల మధ్యన ఘర్షణ వాతావరణం తీవ్రం కావడంతో దళితులు గ్రామాల్లోని దొరలు, భూస్వాములు, దేశ్ముఖ్లు, దేశ్పాండ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిండ్రు. ఇలా ఉద్యమం చేసిన వారిలో పీసరి వీరన్న అనే దళిత నాయకుడు ముఖ్యుడు. ఈయన హైదరాబాద్లో గాంధీని బహిరంగ సభలో నిలదీసిండు. ‘హరిజనులు’ అనే పదం వాడకం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిండు. వేదిక మీద ఉన్న గాంధీ వీరన్నను సంతృప్తి పరిచే ఉద్దేశ్యంతో ఒక పండుని చేతిలో పెట్టగా ఆయన దాన్ని తిరస్కరిస్తూ మేము కష్టపడి పనిచేసి తింటాము. మీలాగా ఒకరి నుండి ఆయాచితంగా వచ్చింది త్ణీసుకోము అని తిరస్కరిస్తూ దళితుల ఆత్మగౌరవ బావుటాని ఎగరేసిండు. ఈయన ఆ తర్వాత వరంగల్లో ‘అల్లమ ప్రభువు’ పేరిట వరంగల్లో ‘‘అల్లా’’కు మందిరాన్ని నిర్మించి, నడిపించిండు. దీని కొనసాగింపుగా దేశ్ముఖ్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గౌరవంగా బతికేందుకై కొంతమంది దళితులు ‘ముస్లిం’ మతాన్ని స్వీకరించిండ్రు. అప్పటి వరకు వీరిని వేధించిన దొరలు ముస్లిములుగా మారిన వీరిని గౌరవంగా చూడడంతో అది మరికొందరికి ఆదర్శంగా మారింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ విలీన సమయంలో కొంతమంది ముస్లింలు ఖాసిం రజ్వీ నేతృత్వంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. ఇలా ఉద్యమించిన రజాకార్లలో కేవలం ముస్లింలే గాకుండా మతం మార్చుకున్న తెలుగు ముస్లింలు, నిజాం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న దొరలు, దేశ్ముఖ్లు, జాగీర్దార్లు, జమిందార్ల దగ్గర పనిచేస్తున్న కింది కులాల వాళ్లు ముఖ్యంగా దళితులు, తెనుగోళ్లు ఉన్నారు. అంటే రజాకార్లు కేవలం ముస్లింలు మాత్రమే కారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రజాకార్లను సాకుగా చూపించి హైదరాబాద్కు మతం రంగు పూయాలని బయటి వారు, హిందూత్వ వాదులు ప్రయత్నం చేస్తున్నారు. సహజీవనంతో గడిపిన కాలాన్ని విస్మరించి కేవలం ఒకటి రెండు సంఘటనల ఆధారంగా మొత్తం చరిత్రకు నెత్తురు అంటిస్తున్నారు.

బంగారు తెలంగాణ నిర్మించు కోవాలంటే ముందుగా లౌకిక పునాదుల్ని ఏర్పర్చాల్సి ఉంటుంది. తెలంగాణ వాదం ముసుగులో కొత్తగా ఆరెస్సెస్స్ దాని అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున హనుమాన్ జయంతులు, వేసవి శిక్షణ శిబిరాల పేరిట ఎక్కడి కక్కడ ప్రజల్ని మత పరంగా విడదీస్తోంది. ఇప్పుడు కేంద్రంలో కూడా బిజేపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీరికి మరింత ఊతం అందే అవకాశం ఉంది. అందుకే గతంలో కన్నా ఇప్పుడు మరింత జాగరూకతతో ‘హైదరాబాద్ ఇమేజ్’ని కాపాడు కోవాల్సిన అవసరముంది. లౌకిక భావనలను, చారిత్రక వాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా మతోన్మాదులకు చెక్ పెట్టవచ్చు.

– సంగిశెట్టి శ్రీనివాస్

మీ మాటలు

 1. ari sitaramayya says:

  “హైదరాబాద్ ఇమేజ్’ని కాపాడు కోవాల్సిన అవసరముంది.” హైదరాబాద్ ఇమేజ్ ని కాపాడడానికి నిజాం కు సున్నం కొట్టనవసరం లేదు. హిందూత్వ వ్యతిరేకతను అడ్డంపెట్టుకుని నిజాం ప్రభుత్వ స్వభావానికి సున్నం కొడుతున్నారు.

  ఆ రోజులు అంత మూడుపువ్వులు ఆరు కాయల్లాగా ఉన్నట్లయితే,
  బండెనక బండిగట్టి పదహారు బండ్లుగట్టి, ఏ బండ్లో వస్తవు కొడుకో నైజాము సర్కరోడా
  నాజీల మించినవురో నైజాము సర్కరోడా అని ఒక తెలంగాణా కవి రాయటం పొరబాటా?
  నిజాం పరిపాలన నుంచి విముక్తికోసం ప్రజలు చేసిన సాయుధ పోరాటం “ఒకటీ రెండు సంఘటనల”కు వ్యతిరేకంగా చేసింది కాదు. మీరు అస్తిత్వం అంటూ రాస్తుంటారే, ఆ నిజాం పాలన అస్తిత్వం మీద చేసిన పోరాటమే.

  “కొంతమంది ముస్లింలు ఖాసిం రజ్వీ నేతృత్వంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు.”
  నిజంగా? కొంత మందా? అంటే అది స్వచ్చందంగా జరిగిందా? నిజాం ప్రభుత్వానికీ రాజాకార్లకీ సంబంధం లేదా?
  రజాకార్లు చితగ్గొట్టింది భారత ప్రభుత్వాన్ని కాదు, తెలంగాణా ప్రజలనే.
  దాన్ని కూడా మీరు ఉద్యమం అనే అంటారా?
  రాజాకార్ల ఉద్యమం!

 2. ఒక సారి దాశరథి రంగాచార్య గారు వ్రాసిన కథలలాంటి నిజాలు చదవండి. అసలు మీరు ఏమి చెప్పాలనుకున్నారో అర్థం కాలేదు. ఇంతకీ మీరు ఎవరికీ ఈ “paid న్యూస్” వ్రాస్తున్నారు? మీరు ఒక ఆర్టికల్ పోస్ట్ చెయ్యంగానే వెంటనే కామెంట్ రావాలి “అబ్బో బ్రహ్మాండం అంటూ…”. Useless కంటెంట్

 3. srinivas sangishetty says:

  సీతారామయ్య గారు!
  ఆరోజులు మీరన్నట్లుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా లేదు. కాని ఇవ్వాల్టి కన్నా గొప్పగానే ఉండింది. అందరికి చెయ్యడానికి పని తినడానికి తిండి దొరికింది. ‘నిజాం పరిపాలన నుంచి విముక్తికోసం ప్రజలు చేసిన సాయుధ పోరాటం’ అని చెబుతున్న దాంట్లో ఎంత మంది తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు.అప్పటి మొత్తం 9 తెలంగాణా జిల్లాల్లో రెండున్నర జిల్లాల రైతులు మాత్రమే ఇందులో పాల్గొన్నారు అనే విషయాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవాలి. (అలా చెప్పడమంటే ఆ పోరాటాన్ని తక్కువ చేయడం ఎంత మాత్రం కాదు)
  ఇక పోతే బండెనుక బండి పాట విసునూర్ దేశ్ముఖ్ జెన్నా రెడ్డి ప్రతాప రెడ్డి మీద రాసిన పాట. దాన్ని ‘మాభూమి’ సినిమా కోసం నైజాము సర్కరోడా గా మార్చిండ్రు. నిజాం ప్రభుత్వానికి రజాకార్లకు సంబంధము ఉంటె వాళ్ళు తర్వాతి కాలములో (standstill agreement అనంతరం ) కమ్యునిస్టులతో కలిసి పని చేసే వారు కాదు. తెలంగాణా ప్రజల్ని అటు రజాకార్లు పెనం మీద పెడితే భారత ప్రభుత్వం ఏకంగా పొయ్యిలోనె వేసిందని తెలుసుకోవాలి.

  ప్రసాద్ గారు … దాశరధి రంగాచార్య రాసింది కొత్తగా చదవాల్సింది ఏమి లేదు వేదాలు తప్ప. అయినా ఆయన రాసినవి నవలలు. కతలు కాదు. ‘ఏమి చెప్పాలనుకున్నారో అర్థం కాలేదు.’ అన్నారు. అలాంటప్పుడు useless అనే పదం ఎందుకు సోదరా! మీ జ్ఞానాన్ని less use చేస్తే ఇదే సమస్య ఉంటది.

 4. dasaraju ramarao says:

  హిందూ అనే పదం లో అన్ని మతాలూ, కులాలు,వర్గాలు ఇమిడివున్నయి. అది మరచి, లౌకికాంశం ఆధారిత భారత దేశానికి ఒక మతాన్ని వేరుగా ,శత్రువుగా చూడవలసిన అవసరం ఇంకా ఉందంటారా ? చరిత్ర ( తెలంగాణ)లో జరిగిన నిజాల రికార్డు లేకపోవటం చేతనో, లేక బ్రాహ్మణీయ భావజాలానికి ఒక రకంగా (మూర్ఖంగా) అలవాటు పడో, ఆధారపడో విమర్శలు సాగటం విజ్ఞత కాదు.సంగిశెట్టి గారు ఖాస్ ఖాస్ చరిత్రకారులు. ముమ్మాటికి నిజాలే మాట్లాడగలరు,రాయగలరు..

 5. నేను శ్రీనివాస్ గారిలా చరిత్ర పరిశోధకుడిని , మేధావిని కాను. సామాన్య పాఠకుడిని. శ్రీనివాస్ గారు నిజాం ప్రభువుల కాలంలో జరిగిన అభివ్రుధ్ధి , మతసామరస్యం , భాషాభివ్రుధ్ధి గురించి చాలా వివరంగా చెప్పారు. గతంలో కూడా ఒకసారి నిజాం కాలంలో కాస్మోపాలిటన్ కల్చర్ తో , విదేశీ వర్తకంతో అత్యంత అభివ్రుధ్ధి చెందిన రాజ్యంగా వర్ణించారు.
  కాని నాలాటివారు చదువుకున్న , తెలుసుకున్న చరిత్ర వేరుగా వుంది. అల్లం రాజయ్య గారు , ఆళ్వార్ స్వామి గారు , దాశరధి క్రిష్ణమాచారి గారు , కాళోజీ గారు – మొదలయిన వారు వ్రాసిన కథలు , కవితలు చదువుతుంటే నిజాం కాలంలో సామాన్య ప్రజలు ఎంతగా అణగద్రొక్కబడ్డారో , వారు తిరుగుబాటుకు ఏవిధంగా ప్రయత్నాలు చేశారో తెలుస్తుంది. దాశరధి గారు ` నిజాం రాజు తరతరాల బూజు ‘ అని వ్రాసింది చదువుకున్నాము.కాళోజీ గారు కన్నడిగులయినా , బ్రతుకుతెరువు కోసం తెలంగాణా వచ్చి , తెలుగు నేర్చుకొని , నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా కవితలల్లి , పోరాటంలో పాల్గొని జైలు పాలయినట్లు చదివాము. ఇదంతా కల్పనా సాహిత్యమేమో అనిపిస్తుంది శ్రీనివాస్ గారి వ్యాసం చూసినతర్వాత !
  అధికారాలు దొరలకు , అధికారులకు అప్పగించి , వారు ప్రజలను బాధించి కొల్లగొట్టిన సొమ్ముతో పాలన చేసిన వాడు , వారిని అదుపు చేయలేనివాడు ఎలా మంచి రాజు అవుతాడో అర్ధం కాలేదు.

 6. నిజాం ప్రభువును కీర్తించేవాళ్ళు , ఆయన పాలనే బాగుంది అనుకునేవాళ్ళు చాలామంది వున్నారు యిప్పటికి.
  ఒకరు నిజాం కాలంలో జరిగిన అభివ్రుధ్ధి తరువాతి కాలంలో జరుగలేదంటారు. ఇంకొకరు నిజాం ప్రభుత్వాన్ని కూలద్రొసి , కొన్ని లక్షలమందిని హతమార్చి , బలవంతంగా భారత్ లో విలీనం చేశారంటారు. మరొకరు తన మాత్రుదేశమయిన హైదరాబాద్ ను దుర్మార్గంగా ,సైనికచర్యతో భారత్ లో కలిపారంటారు. తెలంగాణా భారత్ లో అంతర్భాగం కాదని , మొదటినుండి ప్రత్యేక దేశం గా వుండేదని , భారత్ లో బలవంతంగా కలిపారంటారు మరొకరు.
  దేశభక్తి అనేది ఒక బ్రహ్మ పదార్ధమని మరొకరు విశ్లేషిస్తారు.ఇవన్నీ ఆలోచించదగ్గ విషయాలే మరి!!

 7. భారతదేశం లో చరిత్రకు హిందూత్వ చెద పట్టింది.! ప్రపంచం లో చరిత్రకు మరో మతతత్వ చెద పట్టింది !!
  ఎవరి మతాన్ని వారు వ్యాప్తి చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు , చేస్తున్నారు.యుధ్ధాలు కూడా జరిగినట్లు చరిత్రలో చదువుకున్నాము.అయినా ఏ మతమూ నశించలేదు.ఆయా మతాలను భుజాలపై మోసేవాళ్ళు మోస్తూనే వున్నారు , వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకిస్తూనే వున్నారు.
  ప్రతి మతం వల్ల అమాయకపు ప్రజలు అణగద్రొక్కబడ్డారు , అగ్నానం లోనే వుంచబడ్డారు. ప్రత్యేకించి యే మతాన్ని విమర్శించాల్సిన పని లేదనుకుంటాను !!

 8. srinivas sangishetty says:

  “అందరితో పాటు 1944-48 సంవత్సరాల మధ్య కాలంలో జరగకూడని సంఘటనలకు, జరిగిన సంఘటనలకు నిజామ్ని బాధ్యుడ్ని చేస్తూనే ఆ కాలంలో జరిగిన సంఘటనల్ని సంయమనంతో, ఇతర అంశాలతో సమన్వయం చేస్తూ అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.” అని రాసాను. ఇది లెక్కలోకి తీసుకోకుండా తీర్పులివ్వదమ్ భావ్యం కాదు. 224 సంవత్సరాల అసఫ్జాహి పాలనలో 1944-48 ఇంకా చెప్పాలంటే 1946-48 మధ్య కాలములో జరిగిన (జరగకూడనివి) వాటికి మాత్రమే ఏడో నిజాం ని బాద్యుడిని చేయాలి. అంతే కాని కాళోజి, దశారధి, ఆళ్వార్ (ఆళ్వార్ కథలన్నీ ప్రచురితమైతే ఈ భ్రమా తొలుగుతుంది) తమ కాలపు పరిస్థితిని ఉద్యమావసరాల కోసం రాసిండ్రు. దాన్ని తప్పు పట్టలేము. అయితే ఈ విషయాన్ని మొత్తం నిజాం పాలన పేరిట 224 ఏండ్ల పాలనకు వర్తింప జేయడం తప్పు.
  దాశరాజు గారు “హిందుత్వ” అనే పదాన్ని “హిందూ మతోన్మాదానికి” పర్యాయ పదంగా దేశవ్యాప్తంగా వాడుతున్నారు. నేను అదే అర్థములో వాడాను. ధన్యవాదాలు.

  • ari.sitaramayya says:

   “కాళోజి, దశారధి, ఆళ్వార్ (ఆళ్వార్ కథలన్నీ ప్రచురితమైతే ఈ భ్రమా తొలుగుతుంది) తమ కాలపు పరిస్థితిని ఉద్యమావసరాల కోసం రాసిండ్రు.” అంటే ఉద్యమాలు అంటూ చేసే వారు వాళ్ళ అవసరాల కోసం అబద్ధాలు రాస్టుంటారా?

   “224 సంవత్సరాల అసఫ్జాహి పాలనలో 1944-48 ఇంకా చెప్పాలంటే 1946-48 మధ్య కాలములో జరిగిన (జరగకూడనివి) వాటికి మాత్రమే ఏడో నిజాం ని బాద్యుడిని చేయాలి”
   224 సంవత్సరాల పాలనలో 46-48 మధ్యలో మాత్రమే ఏదో అనుకోకుండా తప్పులు జరిగిపోయినట్లు రాస్తున్నారు.
   ఈ 224 సంవర్సరాల పరదేశీ పాలనలో స్థానిక భాషలను అణగదొక్కారు. అసఫ్ జాహీల కాలంలో మొదట పార్సీ రాజ భాషగా ఉండేది. తర్వాత ఉర్దూ రాజ భాష అయింది. స్థానిక ప్రజలు ఎక్కువగా తెలుగు, మరాఠీ, కన్నడ వారు. 1930 లో సూరవరం ప్రతాపరెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మొదటి ఆంధ్ర మహా సభలో స్థానిక భాషల్లో పాఠశాలలు ఏర్పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యటం జరిగింది. తెలుగు భాష మీద ప్రభువులకు ఎంతో ప్రేమ అని మీకు తెలిసినంతగా ఆరోజుల్లో బ్రతికిన వారికి తెలిసినట్లు లేదు.

   నిజాం ప్రభుత్వం అనుసరించిన రెవెన్యూ ఫార్మింగ్ పధ్ధతి వలన జమీందారీ బలపడి మామూలు ప్రజల జీవితాలు దుర్భరం అయ్యాయి. నిజాం రాజ్యంలో వెట్టి చాకిరి చేస్తూ తరతరాలు బతికిన కుటుంబాలు కొల్లలు. “కాని ఇవ్వాల్టి కన్నా గొప్పగానే ఉండింది. అందరికి చెయ్యడానికి పని తినడానికి తిండి దొరికింది,” అని మీ అభిప్రాయం. ఇది ఊహించిన చరిత్ర.

 9. శ్రీనివాస్ గారి వుద్దేశ్యం ప్రకారం కాళోజీ , దాశరధి , ఆళ్వార్ గార్లు తెలంగాణా లోని రెండున్నర జిల్లాలకు చెందిన వాళ్ళయి వుంటారు. అందుకే వారు తమ కాలపు పరిస్థితిని వుద్యమాల అవసరాల కోసం వ్రాశారనుకోవాలి. మిగిలిన జిల్లాలన్నీ సుభిక్షం గానే వుండి వుంటాయి.!

  అంటే ఆ రచయితల కథలన్నీ అతిశయోక్తులుగా , వుద్యమాన్ని ప్రేరేపించేయిగానే వున్నవన్నమాట !!

  బాగుంది సార్ మీ వివరణ !!!

 10. మంజరి లక్ష్మి says:

  చారిత్రకంగా చూస్తే రాజులు ప్రజలను పీడించకుండా అన్నన్ని ధనరాసులు, వైభవాలు ఎట్లా అనుభవించ గలుగుతారు. ఒక వేళ రాజు గారు పైకి మంచిగా కనపడుతున్నట్లు ఉన్నా ఆయనకు సమకూర్చవలసిన ధన రాసుల కోసం ఆయన అనుయాయులు ప్రజా పీడకులుగా ఉండవలసిందే కదా. చరిత్రలో ఎక్కడైనా అదే కదా జరిగింది. ఆ పీడనలమీద తిరుగుబాటు గానే కదా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చింది. దానికి ఇంత మంది తెలంగాణ కవుల, రచయితల రచనలు ప్రమాణంగా ఎదురుగా కనపడుతున్నా అప్పుడు ప్రజా పీడన లేదనటం విడ్డూరంగానే ఉంది. చరిత్రలో ఒక దశలో పీడన అధికమైతేనే ప్రజలు దాన్ని వదిలించుకొని ఇంకో దశకు చేరుకోవటం జరుగుతుంది కదా!

 11. శ్రీనివాస్ గారు వ్రాసిన దాని ప్రకారం 224 సంవత్సరాల నిజాం వారసుల పాలనా కాలంలో ఏదో కొద్దికాలంలో మాత్రం , అదీ రెండున్నర జిల్లాలలోనే , అనుకోకుండా జరగకూడనివి జరిగినంత మాత్రాన మొత్తం పరిపాలనే సరిగా లేదనడం సరిగాదు. ప్రజలంతా సుఖ సంతోషాలతోనే వున్నారు. కొద్ది కాలంలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకొని రచయితలు ఏవో వూహించుకొని వ్రాస్తే దానికి భారత ప్రభుత్వం తెలంగాణా ప్రజలను ఏకంగా పొయ్యి లోకి వేసేలా చర్యలు తీసుకొంది.
  మొత్తానికి భారత ప్రభుత్వ పాలనకన్నా నిజాం పాలనలోనే ప్రజలు హాయిగా వున్నారన్నమాట ! అందుకే వారు యింతలా కీర్తించడం !!

 12. SIVARAMAPRASAD KAPPAGANTU says:

  మీరు వ్రాసిన వ్యాసం విలువను పోగొట్టుకునే శీర్షిక పెట్టారు. వ్యాసంలో విషయాలకు మీరు పెట్టిన శీర్షికకూ సంబంధం లేదు. మీకు ఒక పార్టీ మీద ఉన్న అక్కసంతా తీర్చుకోవటానికి ఈ వ్యాసం వ్రాసినట్టుగా ఉన్నది. ఆ కార్యక్రమంలో హిందూ మతం పేరు ఎందుకు వాడతారు. మీ దృష్టిలో బి జె పి అంటె హిందు మతమా ఏమిటి కొంపతీసి!

  హిందూత్వ చెద అనే పేరేమిటి??! హిందువులకు మనోభావాలు లేవనుకుంటున్నారా లేక మీ సెక్యులరిస్టులకు మాత్రమే మనోభావాలుంటాయా? మన దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత భారత చరిత్రకు వామ పక్షపు చెద పట్టింది అంటే మీ ప్రతిస్పందన ఏమిటి. స్వతంత్రం రాక మునుపు మన చరిత్రకు ఏ చెద పట్టిందని మీ అభిప్రాయం. స్వతంత్రం వచ్చినాక మన చరిత్రకు పట్టిన చెదలన్నీ మీకు బాగానే ఉన్నాయి, ఇప్పుడు మీకు హిందూ చెద కనిపిస్తున్నదే? విదేశీ ఇజాలను దిగుమతి చేసుకుని వామ పక్ష చెద పట్టించుకునే కన్న మీరనుకునే హిందూత్వ చెద ఎంతైనా క్షేమకరమైనది తెలుసుకోండి, వెర్రి మొర్రి వ్యాసాలూ ఆపైన వాటికి ద్వేషపూరిత శీర్షికలు పెట్టి లేని విద్వేషాన్ని పెంచే ప్రయత్నం చెయ్యకండి.

  మీ లాంటివారి వల్లే సెక్యూలరిజానికి విలువ లేకుండపోయి, సెక్యూలర్ ఫండమెంటలిస్టులు అనే పేరు వాడుకలోకి వచ్చింది.

 13. తెలంగాణావాదుల వాదనాపటిమ అనన్యసామాన్యం!! మొత్తానికి కమ్యూనిస్టులను కూడా హిందుత్వవాదులుగా చిత్రీకరించేసారు! నిజమే, అప్పట్లో చెదురుమొదురుగా జరిగిన కొన్ని ఘర్షణలను ఊతంగా చేసుకొని అనవసరమైన ఉద్యమాలకి పాల్పడ్డారు కమ్యూనిస్టు హిందుత్వవాదులు. నిజాము రాజ్యంలో హాయిగా అనుభవిస్తున్న స్వేచ్ఛా, స్వాంతంత్ర్య, సౌభ్రాతృత్వాలనుంచి తెలంగాణావారిని విముక్తులను చేసి, వలసవాదుల దోపిడీకి గురిచేయించారు ఈ కమ్యూనిస్టు హిందుత్వవాదులు. ఆయనే ఉంటే మంగలి దేనికన్నట్లు, నిజాము రాజే ఉండి ఉంటే….

 14. శ్రీ కాంచనపల్లి చిన వెంకట రామారావు గారు వ్రాసిన ` చెరువొడ్డున ‘ కథ పై శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్ గారు వ్రాసిన సమీక్ష. – విపుల మాస పత్రిక – సెప్టెంబర్ ,2014.
  దొరల దౌర్జన్యాల చిట్టా.
  ————————–
  ఇది 1945 లోని కథ. స్వయంగా తెలంగాణ సాయుధ పోరాటం లో పాల్గొన్న కాంచనపల్లి తన అనుభవం లోని సంఘటనలే కథగా మలిచిండు.చెరువులోని నీళ్ళు రైతులందరికీ న్యాయంగా , హక్కుగా దక్కాలంటే పోరాటమే శరణ్యమని , ఉద్యమాలతో అది సాధ్యమేనని , ఆనాటి ` తెలంగాణ రైతాంగ పోరాట వీరుల ‘ కు స్ఫూర్తినిచ్చేలా కథను తీర్చి దిద్దిండు. దొరలు , మజ్లీస్ నాయకులు కలిసి సామాన్య జనాలకు చేస్తున్న అన్యాయాలను కులాలకు , మతాలకు అతీతంగా ప్రజలందరూ ప్రతిఘటించి విజయం సాధించిన తీరుని చెప్పిండు.
  “ వాళ్ళది దోపిడి మతం. మనది బతుకుదెరువు మతం ” అంటూ సోయి తెచ్చుకొని ప్రజల పక్షాన నిలబడ్డ లతీఫ్ చేత ఈ మాటలు చెప్పించిండు కాంచనపల్లి. ఊరి రైతుల్లో చాకలి రాముడు , మాదిగ ముత్తయ్య , రైతు వెంకయ్య లను ఒక్క తాటి మీదికి తీసుకురావడం ద్వారా తెలంగాణ రైతాంగ పోరాటం పురిటి దశలో ఎలాంటి స్ఫూర్తితో పనిచేసిండో చెప్పిండు. ఆ స్పూర్తిని ఆవాహన చేసుకోవడం లో కథలు , సాహిత్యం ప్రధాన భూమిక పోషించాయి.
  మతమార్పిడులు , వివక్ష , వెట్టి చాకిరీ , కుమ్మక్కు రాజకీయాలు , పైరవీలతో కేసుల మాఫీ , ప్రజలను భయభ్రాంతులకు గురి చెయ్యడం , రాజకీయ ఎత్తుగడలు , మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే నాయకులు , ప్రజల ఆగ్రహావేశాలు – అన్నింటిని కళ్ళకు కట్టినట్టుగా కాంచనపల్లి చిత్రిక గట్టిండు.
  నాటి తెలంగాణ సమాజంలో వాడుకలో వున్న లెవీ , ఖుష్ , ఖరీదు , రివాజు , దేడ్ నాగిచ్చి , పెండ్లాం , పుస్తెలు , గత్తర తదితర పదాలను వాడడం ద్వారా తన కథలను సామాన్య జనం లోకి కూడా కాంచనపల్లి తీసుకెళ్ళగలిగాడు.
  — సంగిశెట్టి శ్రీనివాస్.

  • తెలంగాణ కథకుల గురించి , వారి కథల గురించి శ్రీనివాస్ గారు రెండు రకాల అభిప్రాయాలను కలిగి వున్నారు. మరి వారిని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు.

   • మంజరి లక్ష్మి says:

    పోనీ ఒక సంవత్సరం తరువాత అభిప్రాయం మారిందేమో అనుకుంటానికి కూడా లేకుండా ఒక్క నెలలోనే (ఒకే రోజు కూడానేమో) ఇంత విరుధ్ధమైన అభిప్రాయాలను రాయగలగటమంటే సామాన్యుల వల్ల కాదేమో. ఆ ప్రక్క తెలంగాణా సాయుధ పోరాట నవలలను నమ్మటానికి లేదంటూనే ఈ ప్రక్క ఆ పోరాటం ఎలా జరిగిందో చూపించటం! సింగిశెట్టి శ్రీనివాస్ గారి లాంటి చరిత్ర పరిశోధకులకే చెల్లింది.

 15. నిజాం పాలనలో ప్రజలు తెగ సుఖపడి వుంటే, బ్రిటిష్ పాలనలో యావద్దేశ ప్రజలు స్వర్గం అనుభవించారని కూడా చెప్పుకోవాలి మరి. రైళ్ళు, బస్సులు, విమానాలు, ఫోన్లు, పత్రికలూ, చట్టాలు, బళ్ళు, ఆస్పత్రులు, పన్నులు, తుపాకులు, జలియన్వాలాబాగ్లు… అబ్బో.. ఎన్నెన్ని..
  1857 అమరులు మూర్ఖులు.. లాల్, బాల్, పాల్, భగత్, రాజ్గురు, సుఖ్దేవ్, అల్లూరి, కొమరం భీమ్, ఇలమ్మ, బందగి, సుభాష్.. మరెందరో పిచ్చిపట్టి ఉత్తినే కొట్లాడి ప్రనాలపైకి తెచ్చుకుని, తమాషా కోసం నెత్తురు చిన్దించీ, బాలిపీటాలు ఎక్కిన వెర్రివాళ్ళు.. స్వామిద్రోహులు..దేశద్రోహులు..ప్రజాకంటకులు.. !!!!!! సంగిసెట్టి ఈ అత్భుతమైన కోణంలో చరిత్రను తన అసమాన, అనితరసాధ్య ప్రజపాక్షపాత విశ్లేషణతో తెలంగాన చరిత్రతో పాటు దేశ చరిత్రను కూడా రాయాలని, కొట్లాది కళ్ళున్న కబోదుల కళ్ళు తెరిపించాలని మనసారా కోరుకుంటున్నాను..

 16. సంగిసెట్టి సారంగలోనే రాసిన.. సీమాంధ్ర కత్తికి ఎన్నాళ్ళు ధారపడదాం? వ్యాసంలోంచి..

  …….. శ్రీ.శ్రీ నిజాం ప్రభుత్వ పోలీసు శాఖలో పౌరసంబంధాల విభాగంలో ఉంటూ ప్రభుత్వ ఎన్‌కౌంటర్ల గురించి, ఉద్యమ కారుల మరణాల గురించీ ఆంగ్లంలో ఇచ్చే వివరణలను తెలుగులో తర్జుమా చేసేవాడు. ఎంత మనసు చంపుకున్నా బూటకపు ఎన్‌కౌంటర్లనీ తెలుస్తూనే ఉన్నా శ్రీ.శ్రీ వాటిని ఎదురుకాల్పులుగా మార్చి రాసే పనిలో ఉన్నాడనే విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకోవాలి…….

  నిజాం పాలన బూటకపు ఎన్‌కౌంటర్లు, ఉద్యమ కారుల మరణాలతో ఎంత హాయిగా పరిడవిల్లిందో….
  అవును మరి.. నిజాం వేరు, అతని పోలీసులు వేరు.. అతని దానాలు వేరు, అతని అయుదాగారాలు వేరు…. అతడు నిమిత్తమాత్రుడు, తెలంగాణా దీనజనోద్ధారకుడు, అవతారపురుషుడు, పుణ్యపురుషుడు, చీమకు అపకారం చేయనివాడు, గాంధిని మించిన అహింసామూర్తి, అపర కరుణామయుడు…. కేసీఆర్కు చెప్పి భారత రత్న మాదిరి తెలంగాణ రత్న ఇప్పించి, ప్రతి బడి, గుడి, ప్రభుత్వ ఆఫీసులో గాంధీ పాఠం పక్కన నిజాం పటాన్ని కూడా పెట్టిన్చాలే..

  ….

 17. లౌకికతత్వంతో , అభివ్రుధ్ధిపధం లో సాగిపోతున్న నిజాం ప్రభుత్వాన్ని , తెలంగాణా సాయుధ పోరాటాన్ని సాకుగా చూపి , అగ్రకుల , హిందూ ఫాసిస్టు భావజాలం గల పటేల్ అత్యంత దారుణంగా లక్షలాది ప్రజలను హతమార్చి , దుర్మార్గంగా ,దురాక్రమణ చేశాడని ఈమధ్య ఒక సమావేశంలో ఒక మేధావి చెప్పారు !!

 18. మేధావులకు జోహర్లు. లాంగ్ లివ్ నిజాం రూల్…. లాంగ్ లివ్ బ్రిటిష్ రూల్…..!!!!!!

 19. తెలుగులో చదువు చెప్తే ఆ పన్తుళ్ళని తన్నే వారుట. తెలుగు స్కూల్లే లెకుండా చేశారట.
  తెలంగాణా లో చేతబడి చేసె వాళ్ళ ను అరికట్టే వంకతో స్వదేశీయులైన హిందువుల పై దారుణంగా pallUdagottadu , నోట్లో ఉచ్చ పోయడం,తదితరాలు చేయించే వాళ్ళు ఆ విదెశి పందులు.
  ఎక్కడ ఆడవాళ్లు నదురుగా కనపడ్డ ఏ విదేశి కామ కుక్క ఎత్తుకుపోతున్దో నని భయ పదే వాళ్ళు. ఇదా మాట సామరస్యం,అభివృద్ధి.
  దేశాన్నే పాకిస్తాన్ లో కలిపేస్తానన్న వాడు నీకు బెల్లమ థూ! దేశ ద్రోహి.సిగ్గులేదు ఇంకా బ్రతికి వున్నందుకు.నీ అమ్మనో నీ ఇంటి ఆడవాల్లనో ,నీ కులపోల్లనో ఎత్కపోయున్తే అది నీకు తెల్సుంటే నువ్విట్ల మతిలేని విషపు రాతలు రాయవు.నీ లాన్తోల్ల వల్లనే ఇంకా ఇక్కడ ఆ పందులు ఉండగలుగుతున్నై.

 20. చాలా కొత్త సంగతులున్నాయి ఈ వ్యాసంలో.
  ముఖ్యంగా “ఇలా ఉద్యమం చేసిన వారిలో పీసరి వీరన్న అనే దళిత నాయకుడు ముఖ్యుడు. ఈయన హైదరాబాద్లో గాంధీని బహిరంగ సభలో నిలదీసిండు. ‘హరిజనులు’ అనే పదం వాడకం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిండు. ”
  ఇలాంటి వీరన్నల గూర్చి మరిన్ని వివరాలు స్వాతంత్ర్య సమర కాలపు వ్యక్తులు కానుమరుగు కకముందే సేకరించాలి.

మీ మాటలు

*