మా

hrk photo

ఆగు ఒక్క క్షణం, ఆపు ఖడ్గ చాలనం, రణమంటే వ్రణమే, ఆపై మరేమీ కాదు

నువ్వు కత్తి తిప్పడం బాగుంది నువ్వు హంతక ముఖం ధరించడం బాగుంది
ఇంతకూ మనం ఎందుకు యుద్ధం చేస్తున్నామో నీకేమైనా జ్ఙాపకం వున్నదా?
నా కోసం కాదు నీ కోసం కాదు మరెందు కోసం మట్టి కోసమా గోడల కోసమా?
ఎవరి మాట సత్యమో, అందువలన ఇక్కడ పెత్తనమెవరిదో చెప్పడం కోసమా?

మనమెందుకు కొట్లాడుకుంటున్నామో

అందుకు కొట్లాడుకోవడం లేదు
నిజానికి మనం కొట్లాడుకోడం లేదు
చెకిముకి రాళ్లు విసురుకుంటున్నామ
వి ఒకదానికొకటి కొట్టుకుని నిప్పులెగిరి
దూది వుండలు రగిలి నల్లని పొగలెగసి
జ్వాలలై చీకటి దగ్ధమవుతుందని ఆశ

ఆ మాట చెప్పం ఒకరు చెప్పినా మరొకరు వినం
నిజానికి మనం ఒకరినొకరం వెదుక్కుంటున్నాం
వట్ఠి సందేహాలు దేహాలైన వాళ్లం, దేశాలైన వాళ్లం
ఒకరికొకరం దొరికి ఒకరింకొకరి దీపాలమై, చీకటి
చీలి, ఇల్లు వెలుగవుతుందని బతుకవుతుందని

నేను నువ్వూ, నువ్వు నేనూ… అవుతుందని
ప్రపంచం వెంట మనం, మన వెంట ప్రపంచమై
ఒక అద్భుత యాత్ర మళ్లీ మొదలవుతుందని

లేకుంటే
రోజూ ఒక రణం రెండు మరణాలే అవుతాయని…

-హెచ్చార్కె

మీ మాటలు

  1. Sir,
    చాలా బాగుంది .
    మనమెందుకు కొట్లాడుకుంటున్నామో అందుకు కొట్లాడుకోవడం లేదు – జంతర్ మంతర్ స్టేట్ మెంట్

  2. ‘రోజూ ఒక రణం రెండు మరణాలే అవుతాయని…’
    ‘ఆ మాట చెప్పం ఒకరు చెప్పినా మరొకరు వినం’ …

    వినం మనం …
    విన్నామా, మనమెలా అవుతాం
    మనం మనం
    ఇతరత్రా మనకెందుకేం??? …

    చాలా బాగుందండి …
    విత్ రిగార్డ్స్ …

Leave a Reply to nmraobandi Cancel reply

*