వీలునామా – 45, 46 భాగాలు

veelunama11

కిం కర్తవ్యం?

మర్నాడే ఫ్రాన్సిస్ ఎడిన్ బరో బయల్దేరి వెళ్ళి గ్రంథాలయాలల్లో పాత పేపర్లన్నీ తిరగేసాడు. ఎక్కడైనా ఆ తేదీన బయల్దేరిన పడవల వివరాలో, పిల్లాణ్ణి పారేసుకున్న తల్లి వివరాలో దొరుకుతాయేమోనని. పడవల కార్యాలయానికెళ్ళి ప్రయాణీకుల వివరాలు సంపాదించి చూసాడు. కానీ ఆ సంఘటన జరిగి ముఫ్ఫై అయిదేళ్ళు గడిచిన కారణంగా అతనికి వివరాలేవీ దొరకలెదు, దొరికిన కొద్ది సమాచారమూ అతనికి నమ్మదగింది గా అనిపించనూ లేదు.
ఆఖరికి అతను లండన్ నగరానికి వెళ్ళి మిసెస్ పెక్ చెప్పిన హోటలు చిరునామాకి కూడా వెళ్ళాడు. అక్కడ ఆ హోటేల్ కూల్చేసి ఇంకేదో కట్టడాన్ని కట్టారు. లండన్ మున్సిపల్ కార్యాలయానికెళ్ళి అక్కడ పాత చిఠ్ఠాలన్నీ తిరగేస్తే ఆ హోటల్ యజమానురాలి పేరుకీ మిసెస్ పెక్ చెప్పిన పేరుకీ పొంతనే లేదు! చాలా నిరాశ చెందిన ఫ్రాన్సిస్, చీకట్లోబాణం లా ఒక పేపరు ప్రకటన మాత్రం ఇచ్చాడు. ముఫ్ఫై అయిదేళ్ళ క్రితం జరిగిన విచిత్రమైన సంఘటన పేర్కొంటూ, ఈ సంఘటన గురించి ఏ మాత్రం వివరాలు తెలిసినా తనని సంప్రదించవలసిందని ఆ ప్రకటన సారాంశం.
లండన్ నించి ఎడిన్ బరో తిరిగొచ్చిన ఫ్రాన్సిస్ తన స్నేహితుడూ సలహాదారూ అయిన సింక్లెయిర్ ని కలిసాడు. సింక్లెయిర్ కొన్నాళ్ళు అమెరికాలో వుండొచ్చాడు. అతనీ సంగతి ఏ పేపర్లోనైనా చూసి వున్నాడేమో అన్న ఆశతో ఫ్రాన్సిస్ అతనికి సంగతంతా చెప్పాడు. ఇదే ఏ ప్రేక్షకాదరణ పొందిన గొప్ప నవలలో అయితే సరిగ్గా సింక్లెయిర్ కి ఆవిడ తెలియడమో, మరీ మాట్లాడితే సింక్లెయిర్ ఫ్రాన్సిస్ తండ్రి అని తెలిసిపోవడమో జరిగి వుం డేది. అదేమీ కాలేదు సరికదా అసలీ కథంతా నిజమేనా అన్న అనుమానం కూడా వచ్చింది సింక్లెయిర్ కి. ఆఖరికి నిట్టూర్చి,
“ఏం చేస్తాం! నువ్వన్నట్టు ఆ రోజు బయల్దేరిన మూడు పడవల్లో పిల్లాడుమరణించిన తల్లి ఎవరైనా వున్నారా అని ఒక ప్రకటన ఇచ్చి వూరుకోవడమే. నాకైతే ఆ ప్రకటనకి జవాబొస్తుందన్న నమ్మకం లేదనుకో! అయినా మానవ ప్రయత్నం మానలేం కదా! అది సరే కానీ, ఇప్పుడు ఆ మిసెస్ పెక్ నీ తల్లి కాదు అని తేలిపోయినంత మాత్రాన నీకొరిగేదేమిటి?”
“అప్పుడు జేన్ మెల్విల్ కీ నాకూ ఎటువంటి సంబంధమూ లేదని తెలిసిపోతుంది కదా? నేనా అమ్మాయిని హాయిగా పెళ్ళాడి రాజకీయాల్లో వుండొచ్చు. లేదంటే ఎస్టేటూ, పార్లమెంటులో సీటూ అన్నీ వొదులుకోని ఆమెని పెళ్ళాడక తప్పదు.”
“హమ్మ్! అదా సంగతి? అయినా నువు పెళ్ళాడనే దలచుకుంటే మనూళ్ళో అమ్మాయిలకి కొదవా? ఆలోచించుకో!”
“ఇహ ఆలోచించుకోవడానికేం లేదు సింక్లెయిర్. ఈ పని అసలు ఇంతకు ముందే చేసి వుండాల్సింది. నేను ముందుగా వకీలు మెక్ ఫర్లేన్ దగ్గరికెళ్తున్నా. నువ్వూ వొస్తావా నాతో?”
“పద వెళదాం.”
ఇద్దరూ వకీలు దగ్గరికెళ్ళారు. వీరి వృత్తాంతం విని వకీలు చాలా ఆశ్చర్యపోయాడు. ఎల్సీ పంపిన కాగితాలు శ్రధ్ధగా చదివాడు.
“ఇది నిజమే అయుంటుంది ఫ్రాన్సిస్. ఎలిజబెత్ ఆర్మిస్టవున్ నాకు తెలుసు. ఒకసారి ఆమెని వూళ్ళో చూసాను. అయితే ఇప్పుడీ కాగితాలు మాత్రం కోర్టులో చెల్లవు ఫ్రాన్సిస్! నిన్ను పారేసుకున్న మీ అమ్మ వొచ్చి చెపితే తప్ప ఈ కాగితాలకి వేరే ఆధారం లేదు. ఇప్పుడావిడ ఎక్కడుందో, అసలు బ్రతికుందో లేదో! అయినా ఇప్పుడిదంతా ఎందుకు?”
“హొగార్త్ గారి వీలునామాలో నేను బంధువుల్లో అమ్మాయిలను పెళ్ళాడరాదనీ, పెళ్ళాడితే ఎస్టేటు ఆస్తులన్నీ అనాథాశ్రమాలకు చెందాలని రాశారు. కోర్టును కాకపోతే కనీసం ఆ శరణాలయాల మేనేజర్లనైనా ఒప్పించలేమంటారా నేను జేన్ కి రక్త సంబంధీకుండిని కానని?”
“ఒక్కరినైతే ఒప్పించగలిగే వారిమేమో కానీ నలుగురైదుగురిని కష్టమేమో!”
“నేను జేన్ ని పెళ్ళాడితే అడ్డుపడేది వాళ్ళే తప్ప ఇంకెవరూ లేరు. నిజానికి వాళ్ళదీ తప్పనలేం కదా!”
“అసలు ఆస్తి పాస్తులని ఇలా పెళ్ళిళ్ళతో ముడిపెట్టే వీలునామాలతో మహా చిరాకు! అవి వ్యక్తిగత స్వేఛ్ఛని కూడా హరించివేస్తూన్నట్టనిపిస్తుంది నాకయితే!” సింక్లెయిర్ అన్నాడు.
“హెన్రీ చాలా తెలివైన వాడు కానీ అప్పుడప్పుడూ తెలివి తక్కువ పన్లు చేసే వాడు. ఎలిజబెత్ ని పెళ్ళాడుతున్నాను అని నాతో అనగానే నేను అదే అనుకున్నాను. ఆ తరవాత మేన కోడళ్ళని చిల్లి గవ్వ లేకుండా వీధిలో నిలబెట్టాడు. ఇప్పుడీ పెళ్ళి క్లాజు! పిల్లలని వొద్దన్న పనే చేస్తారని హెన్రీకి అర్థమే కాలేదు. అతనీ వీలునామాలో ఈ క్లాజు పెట్టి వుండకపోతే, నువ్వసలు జేన్ గురించి అలా ఆలోచించేవాడివే కాదు! పందెం!” అన్నాడు వకీలు నవ్వుతూ.
“అయితే, మీ వుద్దేశ్యం ప్రకారం నేనూ జేన్ పెళ్ళాడితే అనాథాశ్రమాల మేనేజర్లు తప్పక మమ్మల్ని కోర్టు కీడుస్తారు!”
వకీలు మళ్ళీ తన దగ్గరున్న వీలునామా ప్రతిని తీసి ఆసాంతం చదివాడు.
“హెన్రీ ఈ వీలునామా రాయడం వెనక ముఖ్య ఉద్దేశ్యం తన మేన కోడళ్ళను తమ కాళ్ళపై నిలబడేటట్టు చేయడం కాబోలు. ఆయన అనుకున్నట్టే ఆ అమ్మాయిలిద్దరూ చక్కగా స్థిరపడ్డారు. నాకైతే వా ళ్ళనలా ఒదిలేయడం అన్యాయమే అనిపిస్తూంది, కానీ ఇప్పుడేం చేయగలం?”
“అయితే ఇప్పుడేం చేయాలంటారు?”
“ఏమీ లేదు. ఆ అయిదు శరణాలయాలు నిజంగా పేద పిల్లల కోసం నడుస్తూన్నవి. వారందరికీ సంఘంలో మంచి పేరూ పలుకుబడీ వున్నవి. ఒకవేళ నువ్వు జేన్ ని పెళ్ళాడి కోర్టులో వాళ్ళు నీమీద దావా వేసారే అనుకో, వాళ్ళే నెగ్గే అవకాశం ఎక్కువ. నీ రాజకీయ ప్రతిష్ఠా అనవసరంగా మంట గలిసిపోతుంది.”
“ఎంత విచిత్రమైన పరిస్థితి! మా ఇద్దరికీ పెళ్ళాడడానికి ఏ అడ్డూ లేదని తెలిసినా పెళ్ళాడలేని పరిస్థితి!”
“ఒక పని చేయ్యొచ్చు! నువ్వు పెళ్ళాడెయి. వాళ్ళు కోర్టులో దావా వేసిన అది తెగే సరికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఈ లోగా నువ్వు రాజకీయంగా నిలదొక్కుంటే ఎస్టేటు పోయినా దిగుల్లేదు.”
“లేదు, లేదు వకీలు గారూ! నేను రేపే ఆస్తి పాస్తులన్నీ శరణాలయాల పేర రిజిస్టరు చేస్తాను. ఆ తరవాత జేన్ ని పెళ్ళాడతాను. ఆ డబ్బంతా వకీళ్ళ జేబులు నింపడానికంటే పేద పిల్లలకి పనికి రావడం మంచిది. ఎస్టేటుకోసం నేను పెట్టిన ఖర్చులన్నీ నయా పైసాతోసహా లెక్కలు రాసే వుంచాను.”
అదిరిపడ్డాడు వకీలు.
“తొందరపడకు ఫ్రాన్సిస్. ఎన్నో కష్టాలనుభవించాక నీమీద అదృష్టానికి దయకలిగింది. దాన్నంతా అలా తోసేస్తానంటావే? డబ్బే కాదు, ఎస్టేటు తో పాటు నీ పార్లమెంటు సీటూ పోతుంది. నీ రాజకీయ భవిష్యత్తు మొదలవకముందే ముగిసిపోతుంది. నిదానంగా ఆచి తూచి అడుగేయాలి.”
సింక్లెయిర్ కూడా గొంతు కలిపాడు, “అవును ఫ్రాన్సిస్! అంత దూకుడు వ్యవహారం మంచిది కాదు,” అంటూ.
“అసలు నీ గురించి పార్టీలోనూ పార్లమెంటులోనూ ఎంత మంచిగా చెప్పుకుంటున్నారో తెలుసా? నువ్వు హెన్రీ కొడుకైతె ఎంత కాకపోతే ఎంత? అసలు ఎలిజబెత్ చెప్పిందాంట్లో నిజమెంతో కూడా ఎవరికీ తెలియదు. మంచి భవిష్యత్తూ, డబ్బూ ఒక అమ్మాయి కోసం వదులుకుంటావా? అట్లాంటి అమ్మాయిలు లక్ష మంది కనబడతారు. అసలేముందా జేన్ లో, ఆలోచించు? అందమా చందమా?”
“వాటి సంగతేమో కానీ, ఒక మంచి మనసూ ఒక తెలివైన మెదడూ కూడా వున్నాయి కదా? అవి చాలు నాకు.” నవ్వుతూ అన్నాడు ఫ్రాన్సిస్.
” నువ్వు చేసిన పనికి జేన్ సంతోషిస్తుందనుకుంటున్నావా?”
“చచ్చినా ఒప్పుకోదు. అందుకే నేను ఆమెకి అంతా పూర్తయ్యాకే చెప్తాను. ఇద్దరం కలిసి మళ్ళీ హాయిగా జీవితం మొదలు పెడతాము. ఏదో సంపాదించుకోని బ్రతకలేకపోము”
“జేన్ ఈపాటికే ఎవరినైనా పెళ్ళాడేసి వుంటే? చిన్నదాని పెళ్ళి ఆస్ట్రేలియాలో జరగబోతుందని విన్నాను.”
“అప్పుడే ఆ వార్త మీదాకా వచ్చిందీ? జేన్ ఇంకా పెళ్ళాడలేదు. ఒకవేళ ఆమెకి ఎవరినైనా పెళ్ళాడే వుద్దేశ్యం వుంటే ఈపాటికి నాతో చెప్పేదే.” ఫ్రాన్సిస్ నమ్మకంగా అన్నాడు, ఎల్సీ తనకు రాసిన వుత్తరాన్ని తలచుకుంటూ.
నిట్టూర్చాడు వకీలు మెక్ ఫర్లేన్.
“నీ ఇష్టం ఫ్రాన్సిస్. నాకైతే నువ్వు తొందరపడుతున్నావనిపిస్తుంది.”
“ధన్యవాదాలు వకీలు గారూ. నేను ఇవాళే శరణాలయాల మేనేజర్లని సంప్రదించి వివరాలు వాళ్ళ ముందుంచుతాను. ఈ విషయంలో నాకొక వకీలు కూడా అవసరమవుతాడనుకుంటా. ఎస్టేటు వ్యవహారాలన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి వేరే వకీలుని నా ప్రతినిధిగా వుంచుకోవడం మంచిదేమో. మీరేమంటారు?”
“అవునవును. నాకు తెలిసిన ఇంకొక వకీలున్నాడు. ఆయనకి ఉత్తరం రాసి నిన్ను పరిచయం చేస్తాను. వెళ్ళి ఆయనని కలువు.”
అనుకున్నట్టే ఫ్రాన్సిస్ అయిదు శరణాలయాల యాజమాన్యాలకీ తను ఎస్టేటూ మిగతా ఆస్తి పాస్తులూ వారి పరం చేయదలచుకున్నట్టూ, అందుకు తనకు గల కారణాలనూ తెలుపుతూ ఉత్తరాలు రాసాడు.

ఆ పనైన తరవాత ఫ్రాన్సిస్ పెగ్గీ వాకర్ ను చూడబోయాడు. పెగ్గీ అతన్ని సంతోషంగా పలకరించింది.
“బాగున్నారా బాబూ? ఈ మధ్య పిల్లల దగ్గర్నించి ఉత్తరాలే లేవు. అందరూ బాగున్నారా?”
“పెగ్గీ! ఒక మంచి వార్త మోసుకొచ్చాను!”
“ఆగండాగండి, నేనే ఊహిస్తాను! హ్మ్! చిన్నమ్మాయి గారు బ్రాండన్ ని పెళ్ళాడబోతున్నారు, అవునా?”
“అరే!భలే కనిపెట్టేసావే!”
“ఆయనసలు ఇక్కడుండగానే అడుగుతాడనుకున్నా ఆయన వాలకం చూసి, కాని బాగా ఆలస్యం చేసాడే! పెద్దమ్మాయిగారెలా వున్నారో తెలుసా?”
“ఆమె దగ్గర్నించి నాకూ ఉత్తరాలు రాలేదు ఈ మధ్య. ఎల్సీ వుత్తరం రాసి సంగతంతా చెప్పింది. మిమ్మల్నందరినీ అడిగినట్టు చెప్పిందిద్. అది సరే, మీ పెద్దమ్మాయి గారికి పెళ్ళి జరిగిపోతే ఎలా వుంటుందంటావ్?” ఫ్రాన్సిస్ కుతూహలంగా అడిగాడు.
“పెద్దమ్మాయిగారా? ఆవిడసలు ఎవరినైనా పెళ్ళాడేందుకు ఒప్పుకుంటుందంటారా?”
“ఏమో మరి, అంతా అనుకున్నట్టు జరిగితే ఆవిడ పెళ్ళీ జరగొచ్చు మూడు నాలుగు నెలలో. మనం వెళ్ళే పడవ ఇంకా నెలకి గానీ బయల్దేరదు కదా!”
“ఏమిటి బాబూ మీరంటున్నది. మనం వెళ్ళడేమిటి?”
“పెగ్గీ! నీతో పాటు నేనూ వచ్చేస్తున్నా ఆస్ట్రేలియా! నెల రోజుల్లో ఇక్కడ అన్ని పనులూ చక్కబెట్టుకొని, బాధ్యతలు తీర్చుకొని వెళ్ళిపోదాం. నీకు అసలు సంగతి చెప్పనేలేదు.”
ఫ్రాన్సిస్ పెగ్గీకి ఎల్సీ పంపించిన కాగితాలు అందజేసాడు. పెగ్గీ అన్నిటినీ కూడబలుక్కోని ఓపికగా చదివింది.
“ఎంత పని జరిగింది! అయితే మీరసలు పెద్దయ్యగారి సంతానమే కాదన్నమాట.” ఆశ్చర్యంగా అంది.
“ఇదంతా నిజమేనంటావా పెగ్గీ?”
“భలేవారే, ఎందుకు కాదు. ఎలిజబెత్ ని నేనూ చూసాను. ఆ తల్లీ బిడ్డలు ఎంతకైనా తగుదురు. వాళ్ళు బిడ్డలని మార్చేసారంటే నమ్మలేని విషయమేమీ కాదు.”
“వింతేమిటో తెలుసా? ఈ కాగితాలు చదివినవారందరూ అది నిజమే అయి వుండొచ్చు అంటున్నారు, కానీ దీనిని కోర్టు నమ్మదంటున్నారు. సరే, అదంతా నాకెందుకు? నేను ఈ ఆస్తీ ఎస్టేటూ వొదిలేసిజేన్ ని పెళ్ళాడతాను. ఆయన రక్తసంబంధీకులేమో వీధుల్లో వుంటే ఎవరో పరాయివాణ్ణి నేను ఆస్తి అనుభవించడం ఏమిటి? నాకదేం బాగుండలేదు. ఇక్కడ పొట్ట పోషించుకోగలిగిన వాణ్ణి ఆస్ట్రేలియాలో ఏదో పని చేసుకోలేకపోను.”

***

46 వ భాగం

అంతా మన మంచికే..

 

సాధారణంగా మేనేజర్లూ, అందులోనూ అనాథ శరణాలయాలు నడిపే వారూ ప్రేమ కథలు చదివే అవకాశం తక్కువ. ఏదో దారి తప్పి మంచి ప్రేమ కథ వున్న పుస్తకం వాళ్ళ చేతికందినా అక్కడక్కడా తిరగేసి పుస్తకం పక్కన పారేసే రకాలు వాళ్ళు. అందుకే వారికి ఫ్రాన్సిస్ అయిదుగురినీ ఒకేసారి రమ్మని వర్తమానం పంపితే, దానికి కారణం ఏమై ఉంటుందో కొంచెం కూడా ఊహించలేకపోయారు.
ఫ్రాన్సిస్ చెప్పిన సమయానికి అయిదుగురు మేనేజర్లూ అక్కడికి చేరుకున్నారు. ఉపోద్ఘాతం ఏదీ లేకుండానే ఫ్రాన్సిస్ వారికి మిసెస్ పెక్ సంతకం చేసిన కాగితాలు ఇచ్చాడు. అందరూ గబ గబా వృత్తాంతం చదివారు తప్పితే ఏ వ్యాఖ్యానమూ చేయలేదు.
“అందులో వుండేది నిజమే అయి వుండొచ్చంటారా?” ఫ్రాన్సిస్ అడిగాడు. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఆఖరికి అంథ విద్యార్థుల శరణాలయం అధికారి గొంతు సవరించుకొని,
“ఏమో మరి, మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అయి వుండొచ్చు!” ఎటూ తేలకుండా అన్నాడు.
వకీలు మెక్ ఫర్లేన్ కలగజేసుకున్నాడు. ఫ్రాన్సిస్ తొందరపడి ఎక్కడా దూకుడు నిర్ణయాలు తీసుకుంటాడో అని ఆయన కూడా వచ్చారు, కేసు ఇంకొక వకీలుకి అప్పజెప్పినా కూడా.
“అసలు ఈ వృత్తాంతం వల్ల ఫ్రాన్సిస్ పరిస్థితిలో ఏ మార్పూ వుండదనుకోండి! ఆస్తీ ఎస్టేటూ అతనికి హెన్రీ రాసిన విల్లు ద్వారా సంక్రమించాయే గానీ, పిత్రార్జితమైన ఆస్తిలా కాదుగా? అటువంటప్పుడు ఫ్రాన్సిస్ హెన్రీ కొడుకైనా, కాకపోయినా తేడాలేదు. ”
“అవునవును. ఆ సంగతి మాకూ గుర్తుంది. అది సరే, ఇప్పుడు మమ్మల్ని పిలిచి మరీ ఈ సంగతి చెప్పడం దేనికి?” మూగ-చెవిటి శరణాలయం అధికారి అడిగాడు.
“ఎందుకంటే, వీలునామాలో నేను దగ్గరి బంధువులని పెళ్ళాడనంతకాలం ఆస్తికి హక్కుదారుణ్ణని రాసి వుంది. ఇప్పుడు మరి నాకూ జేన్ కీ ఏమీ సంబంధం లేదు. ఆమెకి నేను మేన మామ కొడుకునేమీ కానూ. ఆమెని పెళ్ళాడాలని నాకెంతకాలం గానో ఆశ. ఇప్పుడు నేను ఆమెని పెళ్ళాడినా వీలునామా నిబంధనలేమీ అతిక్రమించడంలేదుగా?” ఫ్రాన్సిస్ అడిగాడు.
“ఆ!! అదీ సంగతి. మీకు అమ్మాయీ కావాలి, ఆస్తీ కావాలన్నమాట.”
“చట్టరీత్యా సాధ్యమైతే! పెద్దాయన హెన్రీ హొగార్త్ ఇప్పుడు బ్రతికి వున్నట్టైతే, తప్పక ఈ పెళ్ళికి ఒప్పుకునేవాడు.” “చూడండి ఫ్రాన్సిస్! ఇక్కడ మా వ్యక్తిగత అభిప్రాయాలతో పనిలేదు. మేం నడుపుతున్న శరణాలయాల్లో ఎందరో అనాథ బాల బాలికలుంటున్నారు. ఆ నిర్భాగ్యుల కోసమైనా, మీరు వీలునామాలోని నిబంధనలని అతిక్రమించిన మరుక్షణం మీమీద కోర్టులో దావా వేయాల్సిన బాధ్యత మాపైన వుంటుంది. ఇందులో మా స్వార్థం ఏమీ లేదు.” మూగ-చెవిటీ శరణాలయం అధికారి అన్నాడు.
“ఊ…! సరే అయితే, ఇక నాకు వేరే దారి ఏదీ లేదు. నా అంతట నేను ఆస్టి పాస్తులూ, ఎస్టేటూ అన్నీ శరణాలయాలకు దానం ఇవ్వడం మినహా. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ ఆస్తి పాస్తులూ ఎస్టేటూ రాకముందు హాయిగా నా మానన నేను బాంకులో గుమాస్తా ఉద్యోగం చేసుకుంటూండేవాణ్ణి. ఇప్పుడు, రెండేళ్ళ తర్వాత, కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. పైగా, భార్యని పోషించాల్సిన కొత్త బాధ్యత! కాబట్టి మీరు నాకెంతో కొంత సొమ్ము ముట్టచెప్తే నేను మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టడానికి వీలవుతుంది.”
“మీరన్నదీ నిజమే!” మొదలుపెట్టాడు వృధ్ధాశ్రమం మేనేజరు. మిగతా వారు ఇంకా ఫ్రాన్సిస్ ప్రతిపాదన ఇచ్చిన ఆశ్చర్యం నించి తేరుకోనేలేదు. “ఒకవేళ మీరు పెళ్ళాడి, మేమూ కోర్టుకెక్కి ఆస్తంతా స్వాధీనం చేసుకోవడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. మీరు పెద్ద మనసుతో మాకా ఖర్చు తప్పిస్తున్నారన్నమాట! మీ దయార్ధ్రహృదయానికీ, బాధ్యతా పూరితమైన వ్యక్తిత్వానికీ మా జోహార్లు. అయితే ఒట్టి జోహార్లతో ఒరిగేదేమీ ఉండదు కాబట్టి, నేననేదేమిటంటే- మా అయిదు సంస్థలూ నాలుగు వందల పౌండ్ల చొప్పున రెండు వేల పౌండ్లు మీకు బహుమతిగా ఇస్తాం. అంతేకాదు, క్రాస్ హాల్ ఎస్టేటూ, భవంతీ నుంచి మీకిష్టమైన పుస్తకాలూ, సామానూ, బట్టలూ, రెండు వందల పౌండ్ల విలువ మించకుండా మీరు పట్టికెళ్ళొచ్చు! ఏమంటారు?”
“మీరనేది చాలా అన్యాయంగా వుందటాను!” వకీలు మెక్ ఫర్లేన్ రంగంలోకి దుమికాడు. ఫ్రాన్సిస్ అమాయకత్వాన్నీ మంచి తనాన్నీ అందరూ వాడుకుంటున్నారనిపించిందతనికి.
“ఆ ఎస్టేటూ, భవంతీ, అందులో వున్న సామానూ ఎంత విలువైనవో, దాంతో మీ సంస్థలెంతెంత లాభ పడతాయో మీకూ తెలుసు. అయినా చెప్తాను వినండి! దాదాపు యాభైవేల పౌండ్లు. దానికి మీరిచ్చేది ముష్ఠి రెండు వేలా? ఇంకో ఇంకోరయితే గుట్టు చప్పుడు కాకుండా నచ్చిన అమ్మాయితో ప్రేమ వ్యవహారం సాగిస్తూ ఆస్తినీ అనుభవించేవారు. ఫ్రాన్సిస్ మంచివాడూ, నీతికి నిలబడే మనిషి కాబట్టి నిజంతో మీ ముందుకు వచ్చాడు. కోర్టు కెళ్తే మీకయ్యే ఖర్చెంతో తెలుసా? అక్షరాలా పది వేల పౌండ్లకి పైనే! అదయినా మీరు కేసు గెలుస్తారన్న నమ్మకం లేదు నిజానికి. ఇప్పటికే ఇటువంటి నిబంధనలతో కూడిన వీలునామాల పట్ల ప్రజల్లో సంఘంలో నిరసన పెరుగుతోంది. వ్యక్తి స్వేఛ్ఛకి భంగం వాటిల్లకూడదని కోర్టు మీకేసు కొట్టేస్టే ఏమవుతుందో ఆలోచించుకోండి! పైగా ఫ్రాన్సిస్ పార్లమెంటులో, రాజకీయాల్లో మంచి పేరూ ప్రతిష్ఠలూ సంపాదించుకున్నాడు. అతని కోసం పార్టీ జోక్యం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. అందుకని మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించండి.” వకీలు ధాటీగా అన్నాడు. ఆసుపత్రి మేనేజరు ఆఖరికి రంగంలోకి దిగాడు.
“అవును వకీలు గారూ! నేనూ మీతో ఏకీభవిస్తాను. ఒక్కొక్కరమూ నాలుగు కాదు, అయిదు వందల పౌండ్లిస్తాము, సరేనా? ఎస్టేటు లైబ్రరీలో వున్న పుస్తకాల విలువే వెయ్యి పౌండ్లకి పైగా వుందట. ఫ్రాన్సిస్, జేన్ ఇద్దరూ విద్యాధికులేకాబట్టి రెండు వందల పౌండ్ల విలువ గల పుస్తకాలూ, ఏడు వందల పౌండ్ల విలువ గల సామానూ తీసికెళ్ళొచ్చు. ఇది సరేనా?”
ఈ ప్రతిపాదనకి అందరూ అంగీకరించారు.
“సరే, అయితే ఎస్టేటుని అమ్మకానికి పెట్టి, అమ్మగా వచ్చిన డబ్బుని అయిదు సంస్థలూ సమానంగా పంచుకోవాలి. ఫ్రాన్సిస్ హోగార్త్ కిచ్చే డబ్బు ముందుగానే ఇచ్చేసి, ఎస్టేటు ఆదాయంలో మినహాయించుకోవచ్చు,” అని తీర్మానించారందరూ.
“అవునవును. ఎందుకంటే నేను వీలైనంత తొందరలో ఆస్ట్రేలియా వెళ్తాను,” అన్నాడు ఫ్రాన్సిస్.
ఎస్టేటుని ఎవరు కొంటారో, ఎలా చూసుకుంటారో అని ఒక్క క్షణం బెంగ పడ్డాడు ఫ్రాన్సిస్. పార్లమెంటుకీ, పార్టీకి తన రాజీనామా లేఖలు పంపాడు. స్నేహితులకీ, ఎస్టేటు పనివారికీ భారమైన గుండెతో వీడ్కోలు చెప్పి ఆస్ట్రేలియా బయల్దేరాడు ఫ్రాన్సిస్.
*******************
ఎల్సీ తనకు చెప్పిన ఫ్రాన్సిస్ జన్మ వృత్తాంతం విని జేన్ చాలా ఆశ్చర్యపోయింది. తనతో సంప్రదించకుండా సంగతంతా ఫ్రాన్సిస్ కి చెప్పేసినందుకు చెల్లెల్ని కోప్పడింది కూడా. అయితే అదంతా తెలిసిన తరవాత ఫ్రాన్సిస్ ఏమాలోచిస్తున్నాడో మాత్రం ఆమెకి అంతుబట్టలేదు. అతని వద్దనించి మాటా పలుకు లేదు మరి.
అనుకున్నట్టే చెల్లెలి పెళ్ళి బ్రాండన్ తో జరగడం తో జేన్ సంతోషానికవధుల్లేవు. మెల్బోర్న్ లో ఎల్సీ ఒప్పుకున్న కొద్ది రోజులకే బ్రాండన్ పెళ్ళి ఏర్పాట్లు చేసాడు. ఫిలిప్స్ కూతురు ఎమిలీ తోడు పెళ్ళికూతురూ, బ్రాండన్ మేనల్లుడు ఎడ్గర్ తోడు పెళ్ళికొడుకూ అవతారాలెత్తారు. పెళ్ళి జరిగి ఎల్సీ ఇంటి పగ్గాలందుకోగానే మొదట సంతోషపడ్డది ఎడ్గర్ తల్లి మేరీ! కొడుకుకి బ్రహ్మచారి తిండి తినే గతి తప్పి కాస్త ఆడ దాని పోషణలో బాగుంటాడని ఆశపడిందామే.
ఫిలిప్స్ కుటుంబం వున్న విరివాల్టాకీ, బ్రాండన్ పొలం వున్న బారాగాంగ్ కీ మధ్య ఇరవై మైళ్ళే అవడంతో అక్క చెల్లెళ్ళు తరచుగా కలుసుకోవడం వీలవుతూ వుంది. ఎల్సీ ఇప్పుడు తమ ఇంట్లో పనిమనిషి కాదు, తన లాగే ఇంకొక వ్యవసాయదారుడి భార్య! ఈ ఙ్ఞానంతో లిల్లీ ఫిలిప్స్ ఎల్సీతో మునుపటికన్నా మర్యాదగా మెలగసాగింది. హేరియట్ మనసులో ఏముందో కానీ, పైకి బాగానే వుంది.
అన్నట్టు ఈ హడావిడిలో డాక్టర్ గ్రాంట్ హేరియట్ తో పెళ్ళి కుదుర్చుకోగలిగాడు! అయితే అతను వుంటున్న ఇల్లు హేరియట్ వుండడానికి వసతిగా లేదని ఇంటి మరమ్మత్తు మొదలుపెట్టాడతను. ఆ మరమ్మత్తు అయేవరకూ పాపం, ఆ ప్రేమ పక్షులు విరహ గీతాలు పాడుతూ గడిపారు. ఎట్టకేలకు ఇంటి మరమ్మత్తు ముగిసి పెళ్ళిరోజు దగ్గరపడింది. ఎల్సీ పెళ్ళిలా కాకుండా ఇది చాలా ఘనమైన పెళ్ళి. చుట్టుపక్కల వూళ్ళనుంచీ విచ్చేస్తున్న ఆహూతులు, పెళ్ళి పనులతో విరివాల్టా హోరెత్తిపోసాగింది. చెల్లెలికని స్టాన్లీ ఫిలిప్స్ ఖరీదైన బట్టలు తెప్పించాడు. మొదటిసారి ఆ ఇంట్లో లిల్లీ కంటే ఇంకొకరు అందంగా వుండడం సంభవించింది!
ఆరోజు ఉదయం జేన్ వంటింట్లో పని వాళ్ళని సంబాళిస్తూ తీరుబడిలేకుండా వుంది. మర్నాడే పెళ్ళి. ఇంతలో అమ్మాయిగారు పిలుస్తున్నారంటూ వచ్చి చెప్పారెవరో. లేచి హేరియట్ గదిలో కెళ్ళింది జేన్.
“జేన్, ఈ మేలి ముసుగు ఇలా పెట్టుకుంటే బాగుందా?” జేన్ అభిప్రాయం అడిగింది హేరియట్.
“నన్నడిగి లాభం లేదు హేరియట్. ఇలాటి వాటి గురించి నాకసలేమీ తెలియదు. నాకన్నీ ఒకలానే అనిపిస్తాయి!”
“అబ్బా! ఇప్పుడెలా? ఇన్ని మేలి ముసుగుల్లో ఏది బాగుంటుందో తెలియక చస్తూంటే నువ్వు సహాయమైనా చేయవు!” విసుక్కుంది హేరియట్.
“లేకపోతే రేపంతా హడావిడై పోతుంది. మీ చెల్లెలి పెళ్ళికి అంతా మామూలు బట్టలు కొన్నాడు బ్రాండన్ కాబట్టి తేలిగ్గా అయిపోయింది. ఇది అలా కాదు, అన్నయ్య ఎంతో ఖరీదైన గౌను తెచ్చాడు. మేలి ముసుగు సరిగ్గా లేకపోతే గౌను అందమంతా పాడైపోతుంది కదూ? ఎల్సీలా గబగబా పెళ్ళాడినా ఐపోయేది. వాళ్ళిద్దరూ హాయిగా వున్నారు, ఈ హడావిడీ ఆర్భాటమూ లేకుండా!”
“ఊమ్మ్..”
“బ్రాండన్ మంచి వాడే కాదనను, కానీ, నువ్వే చూస్తున్నావుగా, డాక్టర్ గ్రాంట్ ఎక్కడా, అతనెక్కడా? నాకు చదువూ సంధ్యలు లేని వాళ్ళంటే పెద్ద ఇష్టం వుండదు. అందుకే బ్రాండన్ పట్ల మనసు మార్చుకున్నాను. గ్రాంట్ లాటి మేధావీ, విద్యాధికుడూ నా భర్త అవాలని రాసి పెట్టి వున్నప్పుడు అందులో ఆశ్చర్యమేముంది? బ్రాండన్ మొరటుతనానికీ నాకు పొసిగేదే కాదు. అతనికసలు గొర్రెలు బర్రెల ధ్యాసే తప్ప కాస్త జీవితాన్ని చవి చూద్దామన్న కళాత్మక దృష్టే లేదు. ఎల్సీ అదృష్టవంతురాలే లే మొత్తం మీద. అందులోనూ మీ పరిస్థితిలో, బ్రాండన్ లాటి భర్త దొరకడం..”
ఇంకేమనేదో కానీ, జేన్ తన వైపు చూసిన చురుకైన చూపుతో నోరు ముసుకుంది హేరియట్. అసలు చడా మడా తిడదామనుకుంది జేన్, కానీ పెళ్ళి కూతురి మనసు పాడు చేయడం ఇష్టం లేక అక్కణ్ణించి బయటికి వెళ్ళిపోయింది. బయటికొచ్చేసరికి రెండు పెద్ద జాగిలాలు ఆనందంగా మొరుగుతూ ఆమె మీద పడ్డాయి. సంతోషంతో కెవ్వుమంది జేన్!
“నెప్! ఫ్లోరా! మీరిక్కడా? ఎలా? ఎలా వొచ్చారసలు?” వాటిని ఆనందంతో కౌగలించుకుంది. అవి రెండూ ఆపకుండా మొరుగుతూ ఆమెని చుట్టుకున్నాయి. పకపకా నవ్వుతూ చుట్టూ చూసింది జేన్.
“ఎవరివీ కుక్కలు? ఇక్కడికెలా వచ్చాయి? జేన్, వీటిని బయటికి తీసికెళ్ళు.” అసహనంగా అరిచింది హేరియట్.
“అలాగే, అలాగే!” వాటిని తీసుకుని బయటికి నడిచింది జేన్. వీధి తలుపు దగ్గర నిలబడి ఫ్రాన్సిస్ లోపలికి తొంగి చూస్తున్నాడు.
“ఫ్రాన్సిస్!” పరుగున అతన్ని చేరుకుంది జేన్. దగ్గరకొచ్చిన ఆమెని రెండు చేతుల్లో చుట్టేసాడు ఫ్రాన్సిస్.
“జేన్, నీకోసమే వచ్చేసాను. ఇక నువ్వేం చెప్పినా నేను వినను. ఆస్తీ ఎస్టేటు పార్లమెంటు సీటూ నాకివేవీ వొద్దు. ఇహ పోగొట్టుకోడానికి నా దగ్గరేమీ లేదు. ఇప్పుడు నువ్వు నిరభ్యంతరంగా నన్ను పెళ్ళాడతావుగా జేన్?”
“ఫ్రాన్సిస్! నేను నిన్ను చాలా ప్రేమించాను. ఎంతంటే, నీ మంచి కొసం జన్మంతా నీకు దూరంగా వుండేంత! కానీ, ఇది చెప్పు. ఆ కథంతా నిజమేనా? నిజంగా నువ్వు అన్నీ వొదిలేసి ఆస్ట్రేలియా వచ్చేసావా?”
“అన్నీ చెప్తా, బయట తోటలో కూర్చుందాం పద. ఇక మన జీవితాల్లో సంతోషం తప్ప ఏమీ లేదు జేన్. నాకెంత హాయిగా వుందో చెప్పలేను. అన్ని సంకెళ్ళూ తెగిపోయినట్టూ, స్వేఛ్ఛగా ఎగిరిపోతున్నట్టుంది. నీక్కూడా సంతోషమేగా జేన్?”
మనస్ఫూర్తిగా నవ్వింది జేన్.
“చాలా, చెప్పలేనంత! మనం సంపాదించని ఆ ఆస్తిపాస్తులు మనకెందుకు?”
“అది సరే, ఇప్పుడు నా పేరేమిటంటావ్? ఫ్రాన్సిస్ హొగార్త్ అని చెప్పాలా? అసలు నేను ఫ్రాన్సిస్ నే కాను, నా నిజం పేరేమిటో కూడా నాకు తెలియదు!”
“నేను నిన్ను ప్రేమించింది ఫ్రాన్సిస్ హొగార్త్ అన్న పేరుతోటే, కాబట్టి అదే నీ పేరు. మా మావయ్య వున్నా చాలా గర్వంగా తన పేరు నీకిచ్చేవాడు.అది సరే, ఎస్టేటు, ఆస్తి అంతా ఏం చేసావ్?”
హాయిగా నవ్వాడు ఫ్రాన్సిస్.
“అంతా ఆ శరణాలయాలకి ధారాదత్తం చేసాను. అయినా నువ్వేం బెంగపడకు. యేడాదికి మూడొందలొచ్చే ఉద్యోగం చూసుకున్నా మెల్బోర్న్ లో. వాళ్ళందరూ ఇచ్చిన డబ్బూ వుంది. క్రాస్ హాల్ ఎస్టేటు నించి మన ఇంటికి అవసరమైన సామానూ కొంచెం తీసుకున్నాను. అసలు గుర్రాలూ తెద్దామనుకున్నా కానీ పడవ మీద వీలు పడలేదు. ఈ రెండు కుక్కలు మాత్రం తేగలిగాను. అన్నట్టు సూసన్ గుర్తుందా? ఎస్టేటులో మీ ఇంట్లో పని చేసేది? తనకీ దారి ఖర్చులు చెల్లించి నీకోసం తెచ్చాను. మెల్బోర్న్ లో మనం సుఖంగా బ్రతకొచ్చు జేన్. చెప్పు జేన్ మెల్విల్, నన్ను పెళ్ళాడతావా?”
“తప్పక పెళ్ళాడతా ఫ్రాన్సిస్ హొగార్త్!” నవ్వింది జేన్.

(వచ్చే వారం- ముగింపు)

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం  తరువాయి)

శారద

శారద

మీ మాటలు

*