నామినీ ఏమిటీ పని?

10256494_783790284967578_2755423526937258553_nనామినికి  తను గొప్ప రచయితనని నమ్మకం. అది నిజం కూడా!

గోర్కీలాగా తెలుగులోరాయగల రచయిత ఎవరు? అని ఎవరయిన ప్రశ్నిస్తే  నూటికి డెభ్భైమందిసాహిత్య పాఠకులయిన సందేహం లేకుండా నామిని పేరు  చెపుతా  రు అది కూడా నిజమే! నామిని తాజా సృజన  ‘‘మూలింటామె’’ చదివిన తరువాత ఎవరికైనా  పైన వివరించినవన్నీ ప్రశంశలు కాదు అతిశయోక్తులు అనిపిస్తే  బహుశా తప్పే మీ  వుండకపోవచ్చు.

నామిని ఇంతకు  ముందుకు రాసిన పుస్తకాలన్నీ ఒక ఎత్తు, ఈ మూలింటామె ఒక్కటి ఒక ఎత్తు. పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు, మిట్టురోడి  కతలు, ఇస్కూలుపిల్లకాయల కతలు, ముని కన్నడి  సే ద్యం ఇవన్నీ నామిని  బాల్యం చుట్టూ, నామిని  నోస్టాల్జియా చుట్టూ తిరిగితే, మూలింటామె మాత్రం అందుకు  విరుద్ధంగాసమాజం మీద అందున సమకాలీన సమాజం మీద, ఒక పదునయిన వ్యాఖ్యానం  చేయడానికిప్రయత్నం చేసింది. అంటే నామిని  రచయితగా సమాజం తనను గుర్తించిన జానర్‌నుండి వేరే జానర్‌ లోకి ప్రవేశించాడ న్నమాట  మాట. ఒక ఉత్తమ శ్రేణికి చెందిన రచయిత సమాజంతో పాటు తనూ మారుతూ, రూపాన్నీ , సారాన్నీ  మార్చుకుంటూ, పదే పదే అంతర్‌ బాహిర్  రంగాలతో యుద్ధం చేయటాన్ని అభిలషించవలసిందే! అది సమాజానికి అవసరం కూడా !

కానీ ఆ పని సమర్ధవంతంగా చేయకపోతే, అప్పటిదాకా పేరుకు  ముందు వున్న విశేషణాలు అన్నీ కేవలం అవశేషాలుగా మారిపోయే ప్రమాదం వుంది. నామినికి ఇప్పుడా ప్రమాదం ఎదురయింది.

‘‘మూలింటామె’’ ఒక కథ కాదు. రెండు కథల సమాహారం. మొదటి భాగాన్ని మూలింటామె నడిపిస్తే  రెండవ భాగాన్ని మూలింటామె కోడలు పంది వసంత, లేదూ పందొసంత నడిపిస్తుంది.

మిట్టూరులో ఒక మూలమీద విశాలమయిన ఇంట్లో మూలింటామె వుంటుంది. మూల మీద ఇంట్లో వుంటుంది కనుక ఆమె మూలింటామె అయింది  కానీ ఆమె పేరు  కుంచమమ్మ.
మూలింటామెకు భర్త చిన్న వయసులోనే చనిపోతే, కొడుకునీ, కూతురునీ, రెండెకరాల పొలాన్నీ ఒంటి చేత్తో  సాకుతూ వస్తుంది. కొడుకుకి యుక్త వయసు వచ్చాక , మనవరాలు రూపావతిని ఇచ్చి పెళ్ళి చేస్తుంది. మూలింటామె, ఆమె కూతురు నడిపామే , మనవరాలు  రూపావతి, కొడుకు నారాయుడు  ఇదీ ఆ కుటుంబం. నారాయుడుతో  కాపురం చేసి ఇద్దరు పిల్లలను కన్నాక  రూపావతి, ఒకరోజు చెప్పా పెట్టకుండా ఒక అరవ మాదిగాయనతో వెళ్ళిపోతుంది. రూపావతి నే కొనమ్మి అనికూడా పిలుస్తారు.

కొనమ్మి వెళ్ళిపోయిందన్నవార్త  నడిపామేకి,, మూలింటామెకి తెలియడంతో నవల మొదలవుతుంది. మొదటి భాగమంత , రూపావతి కనపడకుండా కథను నడిపిస్తుంది.

ఊరుఊరంతా, రూపావతి కన్నతల్లి నడిపామే తో సహా, కొనమ్మిని నానా  మాటలు అంటున్నా అసహ్యించుకుంటున్నా  మూలింటామెకు మాత్రం మనవరాలు  మీద  ప్రేమ  తగ్గదు. ఆమె కోసం  తపన పడుతూ ఉంటుంది.

కొనమ్మి వెళ్లిపోయిన పది రోజులు  తిరగకుండానే,నడిపామే,, నడిపామే  పెద్దమ్మ ఎర్రక్క కలసి నారాయుడికి  కి రెండో పెళ్ళిచేస్తారు. నిండా ఇరవై ఏళ్లులేని పందొసంత మూలింటామె ఇంట్లోకి కోడలు రూపంలో అడుగుపెడుతుంది.

పందొసంత  అడుగు పెట్టాక కథ వేగాన్ని అందుకుంటుంది. వ్యవసాయం దండగని గ్రహించిన వసంత ఇంటిముందు కిరాణా  షాపు పెడుతుంది. అత్తింటింకి వచ్చీరాకుండానే  భర్తకు వరుసకు తమ్ముడయ్యే రంగ బిళ్ళతో సంబంధం పెట్టుకుంటుంది. ఆ సంబంధం నెల రోజులు కూడా నిలవదు. మూడు ట్రాక్టర్లున్న చంద్రారెడ్డితో సంబంధం పెట్టుకుంటుంది. చంద్రారెడ్డి  అండతో వడ్డీవ్యాపారం మొదలుపెడుతుంది. చిట్టీలు నడుపుతుంది.

విశాలమైన ఇంటిచుట్టూ ఉన్న చింత, సీమ చింత లాంటి చెట్లన్నీ అమ్మేస్తుంది. పనిలో పనిగా నారాయుడికి  కి సిగరెట్‌ త్రాగడం  నేర్పుతుంది. మందు కొట్టడం నేర్పుతుంది. ప్యాంట్‌ షర్టూ  వేసుకొని మోపెడ్‌ నడపడం నేర్పుతుంది.
అన్నింటినీ  మించి తన ప్రియుడిని   తమ్ముడు అనడం నేర్పుతుంది.

చివరకు నారాయుడికి  ఉన్న బండిని , ఎడ్లను, రెండేకరాలని  అమ్మేస్తుంది. రెండెకరాలు  కొనుక్కున్న వారికి  పొలం రిజిష్టరు చేయడానికి మూలింటామెను రమ్మంటే, మూలింటామె రానంటే  రానని  మొండి  కేస్తుంది.
మూలింటామెను బెదిరించడానికి ఆమె ఇష్టంగా పెంచుకొనే నాలుగు  పిల్లుల్లో రెండింటిని  చంపేసి  రిజిస్ట్రేషన్ కి  రాకపోతే  ఏం జరుగుతుందో అన్యాపదేశంగా చెప్తుంది. మూలింటామె విషపు ఆకుతిని చనిపోతే ఇంట్లోనుండి  శవం లేచీ లేవకుండానే రెండెకరాల  పొలం రిజిస్ట్రేషన్  చేసేస్తుంది.

Mulintame600

ఇది మూలింటామె కథ. ఈ కథ ద్వారా  నామిని  రెండు విషయాలను పదునుగా వ్యాఖ్యానించాలి  అనుకున్నాడు . ఒకటి సమాజంలో నీతి, నైతికత అనే రెండు బ్రహ్మ పదార్ధాలను  వర్ణం, వర్గం ఆధారంగా సమాజం ఆమోదించడమో, తిరస్కరించడమో
చేస్తుంది. రెండు అభివ ద్ధి అనే జగన్నాధ  రధ చక్రాల క్రింద అన్ని రకాల విలువలూ పడి  నలిగిపోయి నశించి పోతాయి . నిజానికి ఇవేమి కొత్త విషయాలు కావు.
ప్రపంచీకరణ దుష్పలితా లు భారత, మరీ ముఖ్యంగా తెలుగుదేశ గ్రామీణ సమాజాన్ని కబళించడం మొదలైన దగ్గర్నుండీ   ఎంతో మంది చెప్తువస్తున్నవే కానీనామిని  ఈ సబ్జెక్టును ఎన్నుకోవడమే కొత్త.

ఈ కథ 1984 లో జరుగుతుంది. మొదటి దశ ఆర్ధిక సంస్కరణలు భారతదేశంలో మొదలుకావడానికి కనీసం అర్థ దశాబ్దం ముందు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు నాయుడు  చెప్పడానికి కనీసం పదేళ్ళముందు. 2014 కళ్ళతో 1984 నాటి  సమాజాన్ని వ్యాఖ్యానించడం లోని కాలిక స్ప హ గురించి చెప్పుకోవలసింది ఏం ఉంటుంది?
కొనమ్మి అనే కమ్మ సామాజిక వర్గానికి  చెందిన స్త్రీ  కళాయి పోసుకొనే అరవ మాదిగ పురుషుడుతో వెళ్ళిపోతే మిన్నూ , మన్నూ  ఏకంచేసి గొడవ చేసిన సమాజమే,అదే సామాజిక వర్గానికి  చెందిన మరొక స్త్రీ , మరో బలమైన రెడ్డి  సామాజిక
వర్గానికి  చెందిన పురుషుడుతో సంబంధం పెట్టుకొని సరాసరి  ఇంటికే రప్పించుకుంటే కిక్కురుమనదు పైగా ఆ స్త్రీ కి అండగా నిలుస్తుంది.అటువంటి సమయంలో బాధ్యత గల రచయిత ఏం చేయాలి?

సమాజంలోని అవలక్షణాలను, దుర్నీతిని ఎండగడుతూనే సమాజానికి దిశా నిర్దేశం చేయాలి. మామూలు మనుషులు లాగా ఒక తప్పును మరొక తప్పుతో సరిచేయాలి. అనుకోకూడదు. కానీ నామిని  చేసింది అదే. పందొసంతను సమర్ధించడానికో, కొనమ్మిని విమర్శించడానికో, సమాజం యొక్క దుర్నీతిపైన యుద్ధం ప్రకటించి పొయెటిక్‌ జస్టిస్‌ సాధించడానికో  ఆ సమాజం మొత్తం కలుషితమైపోయిందని చెప్పి ఒక జీవం లేని నవ్వు నవ్వాడు.

జీవితంలో త్వర త్వరగా పైకి ఎదగడానికి అడ్డువచ్చిన ప్రతి దాన్నీ తొక్కేస్తూ వెళ్లిపోవడం అనే ఆధునికి జీవన వ్యాపార  సూత్రాన్ని  కరతలామలకం చేయడానికి పందొసంతను సృష్టించిన , నామినికి  ఆ పాత్ర పట్ల  ఉన్న  ప్రేమ  మిగతా పాత్రలకు అన్యాయం  చేసింది. సమర్ధుడైన రచయితకు ఇది తగదు.
చివరకు మిగిలేదిలో బుచ్చిబాబుకి కోమలి పట్ల, కాలాతీత వ్యక్తుల్లో పి. శ్రీదేవికి ఇందిర పట్ల రవ్వంత  ప్రేమ  ఎక్కువగా ఉంది అన్న విషయం. పాఠకుడికి తెలుస్తూనే ఉంటుంది. బుచ్చిబాబు కానీ, పి. శ్రీదేవి ,కానీ మిగత పాత్రలకు అన్యాయం చేయలేదు .

రచయిత ఒక ప్రపంచాన్ని  సృష్టించాక  పాత్రలను వాటి  మానాన  వాటిని ఎదగనిస్తే ,వాటి  సంతోషాలను, వాటి  దు:ఖాలనువాటిని  అనుభవించనిస్తె మంచి నవల పుడుతుంది.
రచయిత ఎప్పుడైతే తన పాత్రలను నియంత్రించడం మొదలుపెడతాడో  అప్పుడు అవి తమ సహజ సిద్దమైన పరిమళాన్ని కోల్పోతాయి . బుచ్చిబాబు దయానిధి, విశ్వనాధ ధర్మారావు , గోపీచంద్‌ అసమర్ధుడు ఇన్నాళ్ళు  బతికి వున్నారంటే  వారి  మీద ఆయా రచయితల నియంత్రణ లేదు.

ఇందులోని నారాయుడు  పాత్ర రచయిత నియంత్రణ ఉంటే ఎలా నిష్క్రియాపరంగా  తయారవుతాయో  తెలియజేయటానికి ఒక మంచి ఉదాహరణ. ప్రతి పాత్ర ప్రవర్తన  వెనుక ఉన్న కార్య కారణ సంబంధాలు తెలివైన పాఠకుడి  కి ఛాయా మాత్రంగానైన గోచరమౌతూఉండాలి.

అప్పుడు మాత్రమే ఆ పాత్రలను పాఠకుడు సానుకూల దృక్పధంతో  హృదయంలోకి తీసుకుంటాడు. అలా కానప్పుడు నవలలో పాత్ర అయితే  ఉంటుంది కానీ, అందులో ఆత్మ ఉండదు.
మొదటి భార్య కొనమ్మి అరవ మాదిగ ఆయనతో వెళ్ళిపోయినప్పుడు నారాయుడు  ప్రతి స్పందన మనకు తెలియదు. రెండో భార్య ప్రియున్ని ఇంట్లోకే తెచ్చిపెట్టుకుంటే అతని స్పందన  ఏంటో కూడా మనకు తెలియదు. నారాయుడి  మౌనానికి , నిష్క్రియా పరత్వానికి  ఏదో ఒక బలమైన కారణం ఉండాలి కదా. లేక పోతే మామూలు మనుషులు లాగే అతడి కి కోపం, దు:ఖం, నిస్ప హ లాంటి భావోద్వేగాలు ఎందుకు కలగలేదు. అనే సంశయం పాఠకుడి  ని వేధిస్తుంది. దురదృష్టం  ఏమిటంటే ఇక్కడ బలమైన కారణం రచయితే.

రచయిత దృష్టి  ఎంత సేపటికి  పందొసంత మీద ఉంది తప్పిస్తే  నారాయుడి  మీదకు మళ్ళలేదు. పందొసంత పాత్ర చదువుతుంటే నాకు  రావూరి  భరద్వాజ పాకుడు రాళ్ళు నవలలోని మంజరి గుర్తుకొచ్చింది. మంజరి కార్యస్థానం వేరు. పందొసంత కార్యస్థానం వేరు. చిత్రసీమలో తప్పనిసరి పరిస్థితులలో తన లక్ష్యాన్ని చేరడం కోసం అందరికి శరీరాన్ని  అప్పగించి అత్యున్నత స్థాయికి వెళ్ళి అధమ స్థాయికి పడి  పోతుంది మంజరి. కానీ, ఈ నవలలో పందొసంతకి శరీరాన్ని  రంగ బిళ్ళకి, చంద్రారెడ్డికి అప్పగించాల్సినంత  బలీయమైన కారణాలను పాఠకుడి  కి రేఖామాత్రంగానైనా నామని చెప్పలెదు. పాకుడు రాళ్ళూ నవలలో  భరద్వాజ చెప్పాడు కనుక మంజరి పట్ల పాఠకుడ కి సానుభూతో, సహానుభూతోకలుగుతుంది. పందొసంత విచ్చలవిడి  తనానికి , విశృంఖలత్వానికి ఉండవలసిన తాత్త్విక   భూమిక ఏదీ నవలలో కనిపించదు. పోనీ ఆతాత్త్విక  భూమిక గ్లోబలైజేషన్‌ అనుకోవాలనుకున్నా , ఈ కథ నడ చింది మొదటి దశ ఆర్ధిక సంస్కరణలు మొదలుకావడానికి దశాబ్దం ముందు. పాతికేళ్ల క్రితం ఆంధ్రదేశంలోని పల్లెటూళ్లు ఇప్పుడు కలుషితమైనంతగా అప్పుడైతే కాలేదు. కనుక పొయెటిక్‌ లిబర్టీ ఇక్కడ అస్సలు అన్వయించదు.

ఈ నవల అంత కామంతో నిండి  పోయిన చీకటి పాఠకుడి  ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దానికి తోడు రచయిత ధారాళంగా , యధేచ్ఛగావాడిన  బూతు, అశ్లీల పదజాలం కొంచెం కఠిన మైన మాటేమోకానీ, రోత కలిగిస్తుంది. ఈ బూతు వాడటం  ఏ శిల్ప సౌందర్యం కోసమో నాకయితే  అర్ధంకాలేదు. ఈ బూతు పురాణం  గురించి నామిని ఏమంటున్నాడో  చూడండి.
‘‘నా  పుస్తకంలో బూతులుంటాయనే మాట గురించి. కొన్ని కొన్ని పదాలను పట్టుకొని బూతులనేంత దుర్మార్గం  ఇంగొకటుండదు. నేను పల్లెటూరోడి  ని, యం.ఎస్సీ దాకా చదువుకున్న . మళ్ళా కతలు రాసేసిన  . అదే ఊళ్ళో వాళ్ళ  మింద. మా ఊళ్లో పి.జీ. చేసిన మా ఎత్తిరాజులు  బావ తమ్ముడు జయ చంద్ర నాయుడు  అని ఎకనమిక్స్‌ లెక్చరర్‌గా ఇప్పుడు ఉండాడు. మరేదస్తుడు. ఒక్క బూతు పదం మాట్లాడంగా ఎవరూ ఇనిండరు. నేను మా మేనత్త అయిన వాళ్ళమ్మను  జుట్టుకు ముడేసుకున్న గుడ్డ పీలికను  పెరికేసి ‘‘నువ్వు బోయే లంజా’’ అనే వాడిని . మా జయచంద్ర బావకు మా అమ్మ మేన మామ పెండ్లాం కదా. అత్తా , చిన్నత్తా  అని మరేదగా పిలిచేవోడు.
ఎమ్మేస్సీ చదవంగానే నేను ఊళ్లో ఆడోళ్ళందరి దగ్గర మరేదలు పొందుతా, వాళ్ళకు పిలుపుల్లో మరేదలిస్తా, వుండా ననుకోండి  , నేనేంది పుస్తకం  రాసేది  బొచ్చులో కొంచెం’’

ఇవి నా  మాటలు కావు. నామిని  ఆత్మకథ.  నామిని  నెం. 1 పుడింగి  అనే పుస్తకంలోవి. పుస్తకం నిండా బూతులురాయడానికి  చెప్పిన కారణమేమీ నాకు కన్విన్‌సింగ్‌గా లేదు. కొన్ని పదాలను పట్టుకొని బూతులనేంత దుర్మార్గం  ఇంగొకటుండదు అనే బుకాయింపు ఒకటి.
‘‘మొగోడన్నాక , మొగోడి  గా పుట్టినాక  మొగోడి  ఆటలే ఆడాల. మొగోడు తిరక్కపోతే, తిరక్కపోతే  ఏరిగే ఆడది కూడ ముడ్డినట్టా  పైకి లేపదు. నువ్వు తాగితే  చూడాలని, ఒక లంజని పెట్టుకుంటే చూడాలని ఉండాది. నువ్వియ్యాళకు ఒక లంజని పెట్టుకునేది కూడా నేర్వలేదని ఊరంత నవ్వుకుంటుండారు’’ ఇలాంటి మాటలు ఈ నవల నిండా కోకొల్లలు. వీటిని ఏవో కొన్ని మాటలు అని నామిని  అంటే నామినికో నమస్కారం.

ఈ పుస్తకాన్ని ఆంధ్రజ్యోతిలో సమీక్షిస్తూ జి.ఎస్‌.రామ్మోహన్  ‘‘నామిని మూలింటామెను కావ్య నాయిక  చేశారు. ధర్మారావు , ధయానిధి ప్రక్కన పీట వేసి కూర్చోబెట్టారు.’’ అని చెప్పారు. ధర్మారావు  అంటే నాకు  వేయి పడగలలోని ధర్మారావే  గుర్తుకొచ్చాడు . వేయి పడగలు నవల ఇలా ముగుస్తుంది.
చివరకు ఏమి మిగిలింది?
నీవు మిగిలితివి. నేను మిగిలితిని అంటూ చిన్న ధర్మారావు , చిన్న అరుంధతి వైపు చూస్తాడు.
విశ్వనాధ  ఎంత అభివ ద్ధి నిరోధకుడు అయినా కానీ , ఒక సంప్రదాయ వ్యవస్థను నిలబెట్టడం కోసం చిన్న ధర్మారావుని  నిలిపాడు.
మరి నామిని  ఏ విలువలను కాపాడటం కోసం మూలింటామెను చంపేశాడు ?
‘‘ఒక పుస్తకం చదివాక , మనలో మంచి రసాయన ఊరాల ’’ అని నామిని  తన ఆత్మ కథలో అన్నాడు . నాలో  అయితే ఈ పుస్తకం చదివాక  ఏ రసాయనము ఊరలేదు. కాముకత్వపుచీకటిలో దారీ తెన్నూ  కనపడక కూలపడి  పోయాను.
నామినీ  ఏమిటీ పని?

-వంశీకృష్ణ

మీ మాటలు

  1. alluri gouri lakshmi says:

    అద్భుతమైన విశ్లేషణ …వంశీ..గారూ అభినందనలు

  2. మంజరి లక్ష్మి says:

    ‘‘ఒక పుస్తకం చదివాక , మనలో మంచి రసాయన ఊరాల ’’ అని నామిని తన ఆత్మ కథలో అన్నాడు . నాలో అయితే ఈ పుస్తకం చదివాక ఏ రసాయనము ఊరలేదు. కాముకత్వపుచీకటిలో దారీ తెన్నూ కనపడక కూలపడి పోయాను.
    నామినీ ఏమిటీ పని? – బాగా చెప్పారు పేజీ కొకసారి లంజలు అనే పదం వాడటం మీరు చెప్పినట్టు రోత పుట్టించింది. ఎంత గ్రామీణ వ్యవస్థ మార్కెట్ వ్యవస్థగా మారిపోతున్న పరిణామ క్రమం చూపించాలని రాసినా మిట్టూరులోని ఇంత మంది ఆడవాళ్ళను పైన చెప్పిన వాళ్ళుగా ఇంత హీనంగా చూపించాలా! అదీ ఒక కులం మొత్తం ఆడవాళ్ళు, ఇంకో కులం మొగవాళ్ళతో పోయినవాళ్లుగా చెప్పినట్లు నాకర్ధమైంది. నేను రామ్మోహన్ గారి సమీక్ష చదివి ఈ పుస్తకం చదివాను. ఆడవాళ్ళు ఎలా చదివి ఎలా ఆనందించారో నాకైతే అర్ధం కాలేదు.(కొంతమంది ఈ పుస్తకాన్ని మెచ్చుకున్నారు)

    • మంజరి గారూ: మీ ఆవేదన అర్థమవుతున్నప్పటికీ, ఒక వాక్యం అభ్యంతరకరంగా వుంది. అది ఆ రచయిత మనసుని గాయపరిచేదిగా వుందని అనుకుంటున్నాం. మీ కామెంట్ డిలీట్ చేయాల్సి వచ్చినందుకు సారీ.

      పాఠకులకు మనవి: అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్చ మీద సారంగకి గౌరవమూ, నమ్మకమూ వున్నాయి. కాని, ఒక మాట అనే ముందు ఒకటికి రెండు కోణాల నించి ఆలోచించుకొని అంటే బాగుంటుందనీ, అది మంచి చర్చకి అవకాశమిస్తుందనీ అనుకుంటున్నాం.

  3. చాలా బాగా చెప్పారు వంశీ కృష్ణ గారూ. వ్యాసం చాలా బావుంది.

  4. వంశీకృష్ణ గారూ,
    టెక్ట్స్‌ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థం కావచ్చు. అందరూ ఒకే రకంగా తీసుకోవాలని లేదు. సామాజిక నేపథ్యాలు, భావజాలం, ఎక్స్‌పోజర్‌ వగైరా చాలా విషయాలు పనిచేస్తాయి. రసాయనాలు ఊరడంలో కూడా ఇవన్నీ పనిచేస్తాయి.నాకు అర్థమైన పద్థతిలో నేను వ్యాఖ్యానించినట్టుగానే మీకు అర్థమైన పద్ధతిలో మీరు వ్యాఖ్యానించారు. కాకపోతే రెండు విషయాలు మీ దృష్టికి తేవడం అసవరం అనుకుంటున్నాను. మొదటిది-భాష. వ్యవసాయ, వ్యవసాయ కూలీ కుటుంబాలు మాట్లాడుకునే భాషకు శిష్ట కుటుంబాల్లో మాట్లాడుకునే భాషకు తేడా ఉంటుంది. నాకు తెలిసిన జీవితంలో శూద్రుల కుటుంబాల్లో స్నేహితుల మధ్య లంజకొడకా, నీయమ్మ అనేది వారి స్నేహపు గాఢతకు చిహ్నంగా ఉండేది. అది అవసరమా అనేది వేరే ప్రశ్న. పొలిటికల్లీ కరెక్ట్‌నెస్‌ వేరు. శూద్రకుటుంబాల రోజువారీ సంభాషణల్లో ‘బూతులు’ చాలా సాధారణం. మూలింటామెలో పద ప్రయోగం కాస్త ఎక్కువైంది అంటే చర్చించవచ్చు గాని రోత భాష అంటే అర్థం చేసుకోవడం కష్టం. ‘ఆడవి నోరెత్తితే మర్యాదగుండదు. ..మీద తన్నడమే’ అని ఎవరో ఒక వయసు మళ్లిన పెద్దమనిషి అనకుండా మా పల్లెల్లో ఏదైనా పంచాయితీ జరిగినట్టుగా నాకైతే గుర్తులేదు. తండ్రిని కోపగించుకోవాలంటే గు..ంతా నెరిసిపోయినా ఇంకా బుద్దులు పోలే అనే కొడుకులే ఎక్కువ తెలుసు. నేను దాదాపు పదేళ్లక్రితం ఆంధ్రజ్యోతిలో మార్నింగ్‌ వాక్‌ అనే ఇంటర్య్వూ వారం వారం నడిపాను. అప్పట్లో పెను సంచలనం సృష్టించి ఇప్పటికి టాప్‌గేర్‌లో ఉన్న ఒక దర్శకుడు సినిమా సంస్కృతి గురించి మాట్లాడిన ప్రతిసారీ లకాల ప్రయోగమే చేశారు. చివరకు ఆయన భార్యను పరిచయం చేస్తూ మా ముందే ప్రేమగా “ఈ లంజె ” అని సంబోధించాడు. ఒక్కసినిమా ప్లాపయితే ఈ లంజాకొడుకులెవరూ నా మొకం చూడరు సర్‌ అన్నపుడూ, ఈ లంజెనెట్లా పెళ్లి చేసుకున్నానంటే అన్నపుడూ, కోపం-ప్రేమ రెంటికీ ఒకటే పదాన్ని వాడారు. ఇంకొక ముదురు సినిమా నిర్మాత ఆఫ్‌ది రికార్డ్‌గా ఆయన రాసలీలలన్నీ వివరిస్తూ -అంటే సినిమా రంగంలో నీకు పవర్‌ ఉంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే చిట్కాలను గౌరవనీయమైన భాషలోనే వివరిస్తూ- చివరకు మనం బయట ఎన్నిచేసినా ఇంట్లో భార్యను తల్లిలా చూసుకోవాలండీ అని పవిత్రంగా ముగించారు. ఈ రెంటిలో ఏది బూతు! బూతు ప్రధానంగా భావనలో ఉంటుందా, భాషలో ఉంటుందా! కమలాకుచ చూచుక కుంకుమతో…అని రోజూ తన్మయత్వంతో వినే నేల మీద నిలబడి నామిని రాతల్లో రోతను చూడడం ఇబ్బందికరం. అర్థంతో సంబంధం లేకుండా ప్రేమకు ద్వేషానికి కొన్ని పదాలు సంకేతాలుగా మారిపోతాయి. ఆ మాటకొస్తే చాలా పదాలు వాడుకలో వాటి అర్థాలను కోల్పోయి ఏదో ఒక భావావేశపు వ్యక్తీకరణ సంకేతాలుగా మారిపోతాయి. ప్రేమ, ద్వేషం రెంటిని వ్యక్తీకరించడానికి వాడే పదాల్లో శూద్రులకు శిష్టులకు చాలా తేడా ఉంటుది. ఆ పాత్రల గురించి రాస్తున్నపుడు సహజమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఆ భాష వాడడంలో నాకైతే తప్పు కనిపించలేదు.
    ఇక రెండో అంశం..ఏ విలువలను నిలబెట్టడం కోసం అనే ప్రశ్న. తాను కోరుకున్న విలువలను ఆధిపత్యంలో పెట్టడానికి రచయిత చేసిన ప్రయత్నమేమిటి అనేది. కొందరు రచయితలు ఎలాగైనా సరే మంచికి విజయాన్ని సాధించి పెట్టాలనుకుంటారు. కొందరు కేవలం వాస్తవాన్నిచిత్రిస్తే చాలు, మిగిలింది పాఠకులకు వదిలేద్దాం అనుకుంటారు. నామిని లాంటివారు ఈ కోవకు చెందుతారు. ఇంకొందరు మధ్యేమార్గంగా సంకేతరూపంలోనో సంభాషణల రూపంలోనో తాము కోరుకున్న దాన్ని చిత్రించే ప్రయత్నం చేస్తారు. అది రచయితల వైఖరిని బట్టి ఉంటుంది. ఫలానాదే కరెక్ట్‌ అని మనం తీర్మానించనక్కర్లేదు. రెండు పద్ధతుల్లోనూ గొప్ప రచయితలున్నారు. వర్తమానం భయానకంగా ఉందని రచయిత అనుకున్నపుడు భయానకమైనదే సంపూర్ణ ఆధిపత్యం అన్ని రంగాల్లో చెలాయిస్తుందని అనుకున్నపుడు దానికి భిన్నంగా తన వాదనను గెలిపించుకోవాలంటే రచయితకు ఎన్ని గుండెలు కావాలి? ఏ ఆశా కనుచూపు మేరలో కానరాని గాడాంధకారంలో రచయితలు మాత్రం కథల్లో చిరుదివ్వెలు వెలిగించే తీరాలి అని కోరుకోవడం దురాశ కాదూ!

    • రామ్మోహన్ గారూ,
      మీ అభిప్రయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

      నామిని చేసింది ఒక చిత్రణే గానీ మంచికో చెడ్డకో కొమ్ముగాయడం కాదు. ఇక బూతుల విశయానికి వస్తే పాఠకుడి నేపథ్యాన్ని బట్టి వాటి తీవ్రత వుంటుంది. ఇక్కడ వాటిని ఏవగించుకునేవాళ్ళు బహుశా పట్టణ పాఠకులో లేదా తమ ముందు తరం నుండీ చదువుకున్న వాళ్ళో అయుంటారు.

      ఏ చదువూసామూ లేని ఇంటిలో పల్లెలో పెరిగిన పాఠకుడికి ఇందులోని బూతు సర్వ సహజంగా వుంటుంది. ఉదాహరణకు “కొట్టరా వాణ్ణి!”, “తీసుకురా దాన్ని”, “తీసుకుపో దాన్ని” మొదలైన అన్ని మాటలకు మా వూరిలో సహజంగా వినిపించే మాట “దెం*రా వాణ్ణి”, “దెంకరా దాన్ని”…

      వీటిని వినేవాడు, అనేవాడు ఎవరికీ అది బూతుమాట అనే స్పృహే వుండదు. చదువుకున్న మనకు తప్ప!

      ఈ శిష్ట పాఠకులకి వున్నది వున్నట్టుగా అన్న మాటలు గిట్టవు. వాటికి సానపట్టి, మెరుగుపట్టి, మొరటుతనం పోగొడితేగానీ నచ్చవు. ఏంచేద్దాం!

  5. జీయెస్ రామమోహన్ గారూ

    మీరు first నవల లోపభూయిష్టంగా వుందని అంగీకరించండి. శిష్టులను please చేయడానికే నామిని లంజ అనే wordను అధికంగా వుపయోగించడం start చేసారు అని అనుకున్నా తప్పు లేదు. పై వర్గాల వారి కోసం సత్యజిత్ రే గర్భదరిద్రం చూపినట్టు నామినిగారు లంజ ప్రయోగాలను విపరీతం చేసారు. bed room, toiletలలో చేసేదంతా రాయవచ్చా. literatureలో ఒక హద్దు వుంటుంది. దానిని జంప్ చేసిన రచయిత కోసం దబాయిస్తున్నారు మీరు. వంసీక్రిష్ణ మంచి అబ్సర్వేషన్ చేసారు. నామిని charactersని control చేసారు. అదీ మీరు మాట్లాడడం లేదు. మీలాటి చెడ్డ భక్తుల వల్ల మంచి writers కూడా నాశనం అవుతున్నారు.

  6. vamsykrishna says:

    మల్లాది వెంకట కృష్ణ మూర్తి అనే పాపులర్ తెలుగు రచయత సరదాగా ఒక మాట చెప్పాడు.రచయత రాసేది చెయ్యకూడదు. చేసేది రాయకూడదు అని. దానికి ఒక విశ్లేషణ కూడా ఇచ్చాడు. రచయత దొంగతనం గురించి రాయవచ్చు. కానీ చెయ్యకూడదు. రచయత సెక్స్ చేయవచ్చు కానీ రాయకూడదు. ఇది వినడానికి చదవడానికి సరదాగా వున్నా, అంతర్గతం గా ఒక సూచన కూడా వుంది. ఏది రాయాలి ఏది రాయకూడదు అనే విషయం మీద రచయతకి స్వీయ నియంత్రణ వుండాలి. లేక పొతే ఏది పడితే అది అచ్చు లోకి వచ్చి లెజిటి మసి పొందాలని ప్రయత్నం చేస్తుంది.

    గ్రామీణ ప్రాంతాలలో భాష లో బూతు సర్వ సాధారణం కనుక నవలలో బూతు ఆమోదనీయం అనే ఆర్గుమెంట్ సరి అయింది కాదు. నేను గత ముప్పయి ఏళ్ళ నుండి గ్రామీణ ప్రాంతాలలోనే పని చేస్తున్నాను. కానీ నా అనుభవం రామ్మోహన్ గారి అనుభవం కంటే భిన్నం గా వుంది. బూతు అశ్లీల పదజాలం అన్నాను కానీ రోత భాష అని నేను అనలేదు. రోత అనే పదం కొంచం పెద్ద పదం అని కూడా అని నేను అన్నాను. బూతు భాష లో వుండదు. భావన లోనే వుంటుంది. కానీ ఆ భావన ల ని ప్రేరేపించే వుపాంగం గా ఒక ఆయుధం గా భాష ప్రధాన పాత్ర పోషిస్తుంది.

    భార్యా భర్తల మధ్య ఏకాంతం లో చోటు వెతుక్కునే భాషకీ సామాజిక జీవన వ్యవహారం లో చోటు వెతుక్కునే భాషకి తేడా వుంటుంది. భాష దాని వినిమయ కాలం, ప్రాంతం. సందర్భం అనుసరించి మారాలి. అలా మారక పొతే ఆ భాష వినియోగించే వారీలొ ఏదో లోపం వున్నట్టు లెక్క. కమలా కుఛ చూచుక కుంకుమ అనే సుప్రభాతం లో బూతు వుంది కనుక ఇందులో బూతు వుంటే తప్పేమిటి అంటే నా దగ్గర జవాబు లేదు. సుప్రభాత శ్రుంగారం , నామిని బూతు రెండూ తప్పే. ఒక తప్పు మరొక తప్పుని ఒప్పు చేయదు.

    నామిని వాస్తవాన్ని మాత్రమె చిత్రించి వదిలి వేసే రెండవ రకం రచయత అయితే పాఠకుడికి ఎలాంటి ఇబ్బంది లేదు. నామిని ఏ విలువల వైపు నిలబడుతున్నాడు అనేది ప్రధాన ప్రశ్న. దానికి సూచన మాత్రమైన హింట్ నవలలో లేదే అనేదే బాధ.

    వంశీ కృష్ణ

    • ప్రశ్నా రచయితే వేసి, సమాధానమూ రచయితే చెప్పాలంటారు?

      పందొసొంత వైపా, కొనమ్మి వైపా అనేది పాఠకుడే తేల్చుకోవాలి దానికి రచయిత ఎటోవైపు నిలబడ్డమెందుకు?

  7. gangadhara says:

    గ్రామీణశైథల్య చిత్రీకరణ -నామిని మూలింటామె
    – మన్నవ గంగాధరప్రసాద్

    ప్రముఖ రచయిత నామిని ఇటీవల మూలింటామె అని ఓ నవల రాశారు. వెంటనే ఒక పేరున్న రచయిత ఈ నవలను ఓ పత్రికలో చీల్చి చెండాడడం చూశాను. ఈ నవల్లో (కాముకత్వపు చీకటి- కానరాని వెలుతురు) చీకటే- వెలుతురు లేనే లేదన్నాడు. అందువలన తిరుపతిలో నా మిత్రుడు ఒకాయనుంటే పోన్ జేసి, అనా, నామిని కొత్త నవల కావాలన్నాను. ఆయన పాపం, కాదనలేకపోయాడు. డెబ్బైరూపాయలతో పుస్తకం కొనిందే కాకుండా, సెల్లో రోమింగనికూడా చూడకుండా ఫోన్ చేసి, అడ్రస్ కనుక్కోని, మరో ముప్పైరూపాయలు కట్ట్టి కొరియర్లో పంపించారు. ఈ రోజు తిరుపతిలో వేస్తే, ఆ మరునాడు తెల్లావారేసరికే ఆ నవల నా చేతికొచ్చేసింది. అది సితా, అయిపోయేవరకూ, తిండీ, నీళ్లూ లేకుండా ఏకబిగిన చదివేసినా. ఇపుడు చెబుతున్నా, పూర్తిగా చదివిన తరువాత.. ఈ నవల్లో కొత్తగా ఏమీ లేదు. అన్నీ అవే 56 తెలుగు అక్షరాలే ఉండాయి. నామిని కొత్తగా అక్షరాలు ఆవిష్కరించలేదు. కానీ నాకే నవల చదువుతూ ఉంటే, కడుపులో తిప్పుతూనే ఉంది. పలుమార్లు వెక్కి వెక్కి ఏడస్తూ ఉంటే, మూలింటామేమో యాస్టపోయి. కొడకా, నాకంటే ఇదిగా కుమిలిపోతావుండావే, కాసేపు చదివేది పక్కనబెట్టి, నాలుగురోజుల్లో కాలేజీకిపోబోతా ఉండే నీ బిడ్డతో నాలుగు మాటలు మాట్లాడు, మనసు నెమ్మదిస్తాది. నాయనా, నేనేడికిబోతా? పుస్తకం బోర్లాపెట్టిపో నాయనా, ఈడ్నే ఉంటాలే అని ఓదార్చేది.

    వరుసగా ఐదుపేజీలు చదివే సరికి నాకు ఊపిరాడేది కాదు. గుక్క తిప్పుకోలేకపోయేవాణ్ని. ఈ నవల్లో ఏం ఉందంటే, చిత్తూరు జిల్లా గ్రామీణ జీవితం ఉంది. ఓ సిగ్గుమాలిన బాసాలి మనసుపడే ఘోష ఉంది. ముప్పై సంవత్సరాల క్రితం మా గ్రామాల వద్ద నరికేస్తా ఉండిన భారీ వృక్షాల కింది జాడలేని నీడ ఉంది. బాయికాడ మడికి నీళ్లు పారతా ఉంటే. గెనింమీద గొంతు కూచోని గుక్కెడు నీళ్లుతాగి, ముంజేత్తో మూతి తుడుచుకున్న పల్లెల పాతకాలం జ్ఞాపకాలుండాయి. నిజానికి ఇది పుస్తకం కాదు. దారుణంగా మోసపోయిన పల్లె లంజాముండ. ప్రపంచం అంతా మారిపోతా ఉందని నమ్మి, ఊరుచుట్టూ ఉండే పచ్చని చెట్లుకొట్టేసుకున్న బోడిలంజ. బంగారం పండగలిగిన మంచి నేలలను రియలెస్టోడికి తెగనమ్మిన మిండగోడిచేత దగాపడ్డ బాసాలి. ఇది నవల అంటారే అటువంటి మామూలుగా చెప్పిన కథగాదు. నాయాల్ది, మా చిత్తూర జిల్లా మాటల్తో మనిషిలోతు కొలిచిన పసందైన తొలుబొమ్మలాట. ఇది కథ కాదు.. కళ్లముందర నుంచీ నడుచుకుంటా వెళ్లిపోయిన పల్లె బతుకు. ఇది వట్టి నామిని పైత్త్యం గాదు… డబ్బు కళ్లజూడాలన్న మనుషుల వికారపు కోరికలు షికారు తిరిగే మరుభూమి.. ఇది కాగితాల్లో నల్లరంగేసి అమ్మేసుకోవడానికి తెచ్చిన కథ కాదు. ఒక కాలంలో ఒక ఊరు, ఆ ఊర్లో చొక్కాలు, పంచెలు, చీరా-జాకెట్టూ తగిలించుకోని తిరిగిన మనుషుల ఆనవాలు ఈ నవల. దీనికే బహుమతీ వద్దు. ఇవ్వొద్దు. ఏదిచ్చినా తక్కవే కదా. అందుకే ఏదీ ఇవ్వకపోతేనే బాగుంటుంది.

    ఒక గ్రామంలో, ఒక మూలింట్లో, ఒక ఆడమనిషి పడిన జీవన వేదనానాదం అంతా పెన్నులోకి దించి, కాగితాలకు అతికించిపచుతున్న నామినే.. సేద్యగాడు. మనిషి మనసులో, అనుభూతుల మొలకలెత్తించిన కృషీవలుడు కాదూ నామిని!? ఒక కుటుంబం కథను ఆయన నడిపించిన తీరు చూసినపుడు కళ్లలో నీళ్లు తిరిగినాయి. ఈ మాదిరిగా ఎదుటి మనిషిని కళ్లమ్మట నీళ్లు బెట్టించడం గతంలో ముళ్లపూడి రమణ చేసేవాడు కోతీ కొమ్మచ్చిలో.. ఇపుడు నామిని అందుకున్నాడు. డబ్బిచ్చి పుస్తకం కొని చదవుతూ ఏడ్చి దొబ్బించుకోవడం ఎందుకంటే.. మనం మనుషులం కదా, మడిసన్నాక కాస్త కలాపోసనుండాల కదా!.. అందుకు. కూసోని తినేసి, పక్కనోడిమీద చీమిడేసి పోతే ఏ మొస్తాది. మూలింటామె అన్ని పిల్లులను ఎందుకని కనిపెట్టుకున్నట్లు. వాటితో అన్ని మాట్లు అన్ని నంగనాచి మాటలు ఎందుకు మాట్లాడినట్లు. కథ చదువుతూ ఇవన్నీ ఏలా ఆలోచించాలి.

    నారాయణ లాంటివాణ్ని నేను స్వయంగా చూశాను. నామినికూడా చూసే రాసుంటాడు. అందువలననే ఈ నవల్లో జీవం ఉబుకుతూ ఉంది. నారాయణ వంటి మౌనమునులు గుంభనంగా జీవించి, తనువుచాలించినపుడు వారి మనోగతం వారికే ఎరుక, వాళ్లను పుట్టించిన బ్రహ్మదేవునికి ఎరుక. పక్కన పిడుగులుపడ్డా, పదరకుండా ఉండే నారాయణ గుణం మనుషుల్లో లేదని ఇప్పటి తరం అంటే మనం చేయగలిగేది ఏమీ లేదు. ఇప్పటికీ ఉంటారు. ఎక్కడో ఒక చోట ఉంటానే ఉంటారు. మరి నడిపమ్మి. ఈ అమ్మి అనడం ఎంత సొంపుగా ఉందో, పెదమ్మి, చినమ్మి.. అనే పేర్లు ఇంకెక్కడన్నా ఉంటాయా! అమ్మీ అని పిలవడం మధురంగా లేదూ… సరే. ఈ మూలింటామె నవల్లో పందొసంత, నడిపామె,రంగబిళ్ల, రంజకం గానీ, ఎవరైనా నామిని చెప్పినట్టు నడుచుకోలేదు. అట్టా జరిగుంటే, మరోలా ఉండేది. ఇదంతా నిజానికి గ్రామీణజీవనచిత్రరచన (ఎ లైవ్ పెయింటింగ్ ఆఫ్ విలేజ్ లైఫ్) అందులో చిత్రకారుడి పాత్ర ఎంతుంటది? ఈ నవల్ల్లో నామిని పాత్రగూడా అంతే ఉంటుంది. అనుభవించిన జీవన సౌందర్యాన్ని తులం తగ్గకుండా కాగితంపై పెట్టడం నామిని సాహసం, లేదా ప్రత్యేకత. కాదంటే లక్షణం. కన్యాశుల్కంలో మధురవాణి, బుచ్చెమ్మ లంజరికం జేయలేదా, అవి క్లాసిగ్గా మిగల్లేదా… మరి నామిని నవల్లో మాత్రం అంతా ప్రతివొతలే ఉండాలా. ఇదేం విడ్డూరం?

    నారాయడు సంగతేమో, లేచిపోయిన నారాయణ పెళ్లాం సంగతేమో గానీ, మూలింట్లో ఉన్న ముసలామె, ఆమె కూతురు, కడుపులో కుళ్లి కుళ్లి ఏడ్చిన తీరు, వారి పరిణితికి తార్కాణం. గ్రామీణ మహిళల జీవితాన్ని ఇంత లోతుగా చిత్రించడం నామినికే చెల్లింది. చాలా చిన్న వయసులో భర్తపోయినపుడు, మూలింటామె, తన ఇద్దరు బిడ్డలను పెంచుకున్న తీరు. కుటుంబాన్ని నిలుపుకున్న తీరు పట్టుదలకు, దీక్షకు గుర్తు. కష్టేఫలే అన్న నానుడికి చిహ్నం. ఏమో, తన మనవరాలిపై అవ్యాజమైన ప్రేమబంధం కారణంగా చివరికి మూలింటామె తన శీలానికీ మచ్చ ఆపాదించికోని ఉండవచ్చు. ఒక గీత ముందు మరింత పెద్ద గీత గీయడానికి ఆ ముసల్ది ప్రయత్నించి ఉండవచ్చు. తద్వారా మనవరాలి తప్పును చిన్నదిగా చూపెట్టాలనుకుని ఉండవచ్చు. ఆ వయసులో ఆ నిజం వెలుగు చూడ్డం, అందువలన ఆమెకు వచ్చేనష్టం ఏమిటి? తను పెంచుకునే పిల్లి పిల్లలకోసం తను వక్కా, ఆకు వేసుకోవడం మానుకున్న మనిషి మనసు అర్థంజేసుకోగలగాలి. తాంబూలం కోసం పెట్టే ఖర్చుతో పిల్లులకు కోడిగుడ్డో, ఉప్పుచేపో కొనిపెట్టాలనుకునే మూలింటామె ఒబ్బిడి తనం పాఠకున్ని కదలించివేస్తుంది. గ్రామ జీవితంలో ఒకనాడు ఉండేది. ఈ ఆధునిక నగర జీవితంలో నేడు లేనిది ఈ ఇబ్బిడి కదా. ఆ ఒబ్బిడి తనం లేని పందొసంత వలన జరిగిన అనర్థం ఏమిటో ఈ నవల చివర్లో తెలుస్తుంది.

    కేవలం ఓ ఏడాదిలో మూలింటిపరిసరాల్లో వచ్చిన మార్పులు. ఈ ముప్పై ఏళ్లలో జిల్లా అంతటా వచ్చేసింది. ఈ మార్పు గుర్తించాలంటే, పరిశీలన అవసరం. ఇపుడు జిల్లాలో పెద్ద మాన్లు ఎక్కడా లేవు. ఏ గ్రామంలోనూ బండి, ఎద్దులూ లేదు, ఎవరూ సంగటి తినడం లేదు. అసలు చేయడానికి చాలా మందికి తెలియదు. అన్ని వంట గదుల్లోనూ మిక్సీలు, వొవెన్లూ, ఇడ్లీలు, దోశలే.. అంతువల్లా వాతవారణంలో ఎంత మార్పు వచ్చింది. వేసవి తీవ్రత ఎంత పెరిగింది. బూముల్లో నీళ్లు ఎంత కిందకు పోయాయి ఇవన్నీ పందోసంత బృందం వంటి వారి అకృత్యాల వలనే కదా. ఇది గుర్తించాలి ఈ నవల్లో ….

    చిత్తూరు జిల్లా గ్రామీణజీవనం. నాస్టాల్జియా రేకెత్తించే మూలింటామె . . . నామిని రచనా చమత్కృతిమయత్వం అందుకుని ఆవిష్కుృతమైన ఆందమైన నవలా భవనం ఈ మూలింటామె. కన్నుచెదిరే జిల్లా మాండలికాల సొగసుజిలుగు చూసి అవాక్కు కావలసిందే. తెలుగు నుడికారానికి ఆకారాన్నిచ్చి నవరత్న ఖచిత కిరీట ధారణ చేయించిన సామెతలు, జాతీయాలు, పలుకుబళ్ల ప్రయోగయోగవిద్యా విశారదుడు నామిని.

    ఈ నవల్లో కనిపించే ప్రధాన పాత్రలు – మూలింటామె, నడిపమ్మి, కొనమ్మి, చినమ్మి, నారాయణుడు, ఇద్దరు మగ, ఆడ బిడ్లు. వీరు కాకుండా ఎర్రక్క, పందొసంత, రంజకం, చీమంతమ్మ, గుడుగుడుచంద్రం వంటి కొన్ని పాత్రలు. కథ.. .. ప్రధానంగా మూలింటామె కుటుంబానికి చెందింది. ఈ ఇంటికి చెందిన మొదటి ముసలిది, ఆమె కూతురు, ముసలామె మనవరాలు, కొడుకు నారాయణనాయుడు, అతని రెండో పెళ్లాం పందొసంతలే కథ నడిపిస్తాయి. కాబట్టి వీళ్లనే చూద్దాం.

    కథాగమనం ప్రకారం ముసల్ది, మనవరాలు, రెండో కోడలు, అక్క ఎర్రక్క మొగుడితో పాటూ ఇతర వ్యక్తులతో కూడా శారీరిక సంబంధాలు పెట్టుకుంటారు. అవన్నీ వివరంగా చెబుతాడు నామిని. బహుశా నారాయుడి శృంగార రాహిత్యం ఎవరూ గుర్తింలేదు. తాను తన భార్యలను తగిన విధంగా రమించడం లేదనే నగ్నసత్యం నారాయుడికే బాగా తెలిసుండాలి.. మొదటి భార్య (అక్క కూతురు) మరొకడితో వెళ్లిపోయినపుడు గాని, ఆ తరువాత పెళ్లయిన కొన్ని రోజులకే రెండో భార్య ఇంకో మగాడితో ఉండడాన్నిగానీ అతను పెద్ద ఇబ్బందిగా చూడకపోవడం గమనించాలి. ఏ బలహీనత కారణంగా నారాయుడు మౌనంగా ఉండేవాడో. నవల్లో రెండు వ్యభిచార వృత్తాంతాల మధ్య వెలుగెత్తిన మహిళల మనోవికాశం పాఠకుడు గుర్తిస్తాడు. మనవరాలి సిగ్గుమాలిన పనిని మూలింటామె ఎందుకు కడుపులోనే దాచుకుంది, నడిపామె ఒక్క మాటతో కన్నకూతుర్ని ఎందుకు చచ్చినదానితో సమంగా భావించుకుంది. ఒక మహిళకు సంబంధించిన సంఘటన, ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు ఆడవారిలో రెండు పరస్పర విరుద్ద భావాలు ఎందుకు కలిగించింది? దీని నేపథ్యం ఏమిటి? ఇదే ఈ నవలకు సంబంధించిన మనోవైజ్ఞాక విశ్లేషణ. కథ చిన్నది. అందులో నామిని నడిచి వెళ్లిన జాడ తీరు తెన్నులు లెక్కించ వలసి ఉంది. చివర్లో ముసలమ్మమరణం, మనవరాలి ఆత్మహత్య వంటివి లోతైన వ్యక్తిత్వాలకు నిదర్శనం.

    నా వరకూ వ్యభిచారాంశాలు ఈ కథలో పెద్దగా ప్రాముఖ్యంలేనివి. కూరలో ఉప్పు వంటివి. కుటుంబంపైన, జీవితం పైనా మూలింటామెకున్న దృష్టి, రైతు కుటుంబాల్లో ఉండే మట్టిపై ప్రేమ, కారుణ్యమూ వెలకట్టలేనివి. అంతేనా.. ఒక దశకంలో గ్రామీణ జీవితం ఎంత వేగంగా పతనమయిందో నామిని కూడా కథలో అంత వేగంతో ఆ పతనాన్ని చివర్లో చూపెట్టిన తీరు గ్రామాలు శిథిలమైపోయిన రీతిని, మనిషిలోని అత్యాశ విశ్వరూపమెత్తిన సందర్భాలను ఆవిష్కరిం చింది. తన కళ్లెదుట కుప్పకూలిన గ్రామాలయాల విగత జీవితాన్ని చూచిన నామిని, నిలువెళ్లా కుంగిపోయి, మొదలంటా కదిలిపోయి రాసుకున్న మనోవేదనే ఈ మూలింటామె నవల. ప్రపంచం అంతా విస్తరించిన విచ్చల విడి మార్కెట్ శక్తుల విషపు కత్తులు లేత పల్లెబాలికలను హతమారుస్తున్న దృశ్యాలను, హెచ్చరికలూ నామిని యొక్క మూలింటామె నవలలో చూడలేక పోతే, ఇక పుస్తకాలు చదవడం వృధా. నవలలోని 73వపేజీలో చివరి పేరా చదవండి. ఇవ్వాళ నడుస్తున్న నయా మార్కెట్ పోకడలన్నీ పందొసంత రూపంలో నామిని ఎట్లా చెప్పాడో తెలుస్తుంది. మనిషిని మోసగించే కళకు ఏ విధంగా పేరు పెట్టారో అవగతమవుతుంది. ఇవన్నీ చూడకుండా చీకటే, వెలుతురు లేదనడం చూస్తున్న కళ్ల నాణ్యతపై అనుమానాలు కలిగిస్తుంది. అనాదిగా వస్తున్న జనపదాలు ఆధునిక ఆర్థికప్రలోభాలకోసం అనాధలుగా మారి, మరణించడం, ఆ సమయంలో ఆ పల్లెలోని మనుషుల మధ్య చోటు చేసుకున్న సంఘర్షణకు అక్షర రూపమే నామిని, మూలింటామె. Transformation form heaven to hell… అన్నదానికి అక్షరరూపం ఈ మూలింటామె నవల.

    – మన్నవ గంగాధరప్రసాద్
    0-9840411274

  8. gangadhara says:

    • Thirupalu says:

      //బహుశా నారాయుడి శృంగార రాహిత్యం ఎవరూ గుర్తింలేదు. తాను తన భార్యలను తగిన విధంగా రమించడం లేదనే నగ్నసత్యం నారాయుడికే బాగా తెలిసుండాలి//
      నే నింతకు మునుపు ఈ నవల చదలేదు. ఇక్కడ ఈసమీక్ష చూసే చదవటం మొదలు పెట్టి అర పూటలో పూర్తీ చేసాను . పైన మీరన్నది నిజమే అయితే దానికి కావలసిన నేపధ్యాన్ని కొంచమైన నామిని చూపించలేదు. మొదటి భార్య లేచి పోయినపుడు అతని మౌనాన్ని అర్దం చేసుకోవచ్చు. రెండో భార్య తనుండగానే పరాయి మగాడితో పక్క పక్క మంచమిద కూచోనుండడం ‘ మీరిద్దరు అందమ్ములనడం, ఆయప్పను మంచమీద దుపాటెసి కూర్ఛో బెట్ట మంటం- లాంటివన్ని మీ మాటకు ఊతమిస్తున్నా, దానికి కావలైసి ఏ వాతవర్ణం సృష్టిక పోవడం రచాయిత విపలం కాదా?
      పందొసంత పాత్రను ఇంతకు మునుపే కొడవటిగంటి కుటుంబర్రావు ర సృష్టిచాడు అని నే అనుకుంటున్నాను. ఆ నవల పేరు గుర్తు లేదుకానీ, పరstiతితులు కలిసి రాక పోతే తమకు కావాల్సిన అవకాశాలను తామే వేతుక్కునే స్తీ పాత్రను ఆయన్‌ చూపించాడు. మగతనం లేని వాన్ని పెళ్ళీ ఛెసుఖొవాల్సి వచ్చినపుడు అందుకు అమె ఎటువంటి సంకోచం దిగులు లేకుండ పెళ్లికొడుకు తమ్ముడు వరసైన వాని ఆ పెళ్ళి లోనే సొంతం చేసుకుంటుంది. అక్క డ రచయిత వ్యాఖ్యాణం ఇలా వుంటుంది ” కొందరు మగ వాల్లు తాము స్త్రీలను ఆకర్షించగలమని అనుకుంటారు, కానీ కొందరికి తాము ఎందుకు ఆకర్షించబడుతున్నా తెలియక ఉక్కిరిబిక్కి అవుతుంటారు” అని. అక్కడ పందోసంతకు డబ్బే కారణం కాదు, నారాయడుకి తనకు ఇరవై ఇరవై అయిదు ఏళ్ళు తేడావుమ్డటమ్ కూడా దోహదం చేసి ఉంటుంది.

      • తిరుపాలు గారూ,
        ప్రతిదీ రచయిత ఒలిచి పాఠకుడి చేతిలో పెట్టక్కర లేదు. చిన్నమ్మి లేచిపోయిన మరుసటి ఎందరు ఎన్ని అంటున్నా నారాయుడు పొలానికెళ్ళిపోతడు. నేనయితే అతని మౌనాన్ని చూసి ఆత్మహత్య చేసుకుంటాడేమొ అనుకున్నా, ఆ తర్వాత అతని వాలకం చూశాక అనిపించింది, ఇలాంటి వాడితో వుండలేకే గదా అభిమానమున్న కొనమ్మి అరవమాదిగోడితో వెళ్ళిపోయింది అని.

    • గంగాధరం గారూ,
      ఇక చెప్పాల్సిందేం లేదు. మీర్ వాఖ్య చదువున్నంత సేపు “మూలింటామె” చదువుతున్నట్లనిపించింది. మీరు పడ్డ ఇదే బాధ నవల చవినంతసేపూ నేనూ పడ్డా! కన్నీళ్ళు తుడుచుకోవడానికి ఎన్ని పేపర్ టవళ్ళు వాడానో!

      నాకర్థం అయ్యింది ఒకటే, మూలింటామె అర్థం కావాలంటే గ్రామీణ నేపథ్యం వుండి వుండాలి. కొంతమంది తమకు వుంది అనుకుంటున్నారు గానీ లేదు.

  9. రాముడుండాడు రాజ్జెముండాది- కేశవరెడ్డి నవలను వంశీకృష్ణగారు పోస్టుమోడర్నిష్టు దృక్కోణం నుండి వివరిస్తున్నప్పుడు ఆయనను నేను విన్నాను. ఇప్పుడు మూలింటామె నవల స్థల కాలాదులతో పాటుగా ఇతరేతర సాంకేతిక విషయాలను కలుపుకొని బూతు గురించి తను రాయడాన్ని చదువుతున్నాను.
    మిగిలిన విషయాలను పక్కకు నెట్టి ఆయన ఇచ్చిన ఊపుతో చర్చ ఇప్పుడు నామిని బూతు గురించి మాత్రమే నడుస్తోంది.

  10. suhaasini says:

    మన్నవ గంగాధరప్రసాద్ అన్నారు….

    నిజానికి ఇది పుస్తకం కాదు. దారుణంగా మోసపోయిన పల్లె లంజాముండ. ప్రపంచం అంతా మారిపోతా ఉందని నమ్మి, ఊరుచుట్టూ ఉండే పచ్చని చెట్లుకొట్టేసుకున్న బోడిలంజ.

    డబ్బిచ్చి పుస్తకం కొని చదవుతూ ఏడ్చి దొబ్బించుకోవడం ఎందుకంటే.. మనం మనుషులం కదా, మడిసన్నాక కాస్త కలాపోసనుండాల కదా!.

    కన్యాశుల్కంలో మధురవాణి, బుచ్చెమ్మ లంజరికం జేయలేదా, అవి క్లాసిగ్గా మిగల్లేదా… మరి నామిని నవల్లో మాత్రం అంతా ప్రతివొతలే ఉండాలా. ఇదేం విడ్డూరం?

    నా వరకూ వ్యభిచారాంశాలు ఈ కథలో పెద్దగా ప్రాముఖ్యంలేనివి. కూరలో ఉప్పు వంటివి…..

    మీరేంటో తెలుస్తొంది సార్.

  11. ఏదో ఒక విలువ వైపు నిలబడి తీర్పులు ఇవ్వటం (వాల్యూజడ్జిమెంట్స్) కావాలంటే పైన చెప్పిన మల్లాది, యండమూరి లాంటి పాపులర్ రచయితల దగ్గర కూడా దొరుకుతుంది. అదే రెండవరకం రచయితని పట్టిచ్చే సూచన. నామిని దగ్గర అది ఆశించి దొరక్క ఆయన్ని రెండవరకం రచయిత అనడం నిజానికి ఆయన గురించి కన్నా ఈ సమీక్ష గురించి ఎక్కువ చెప్తోంది.

    Mannava Gangadhara Prasad గారూ, వంశీకృష్ణ గారి సమీక్ష రెండు మూడు వాక్యాలు చదవగానే వృథా ప్రయాస అనిపించి పై నుంచి కింద దాకా పైపైన లాగించేశాను. మీ కామెంటు (లాంటి సమీక్ష) మాత్రం చదివించింది. కొంత hyperbolic tone, పడికట్టు భావనలూ మినహాయిస్తే పుస్తకం గురించి చదివినవాడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడినట్టనిపించింది.

    ==============
    “The books that the world calls immoral are books that show the world its own shame.” – Oscar Wilde

  12. Chandra Kanneganti says:

    ఈ విమర్శ ఒక తప్పుల తడక.
    – ప్రపంచీకరణ జరిగాకనో, చంద్రబాబు అన్నాడనో కాదు, పట్టణాల, నగరాల ప్రభావం చుట్టుపక్కల గ్రామీణ జీవితాలపై అంతకు ముందూ ఉంది. ఎట్లాగో పైకెగబాకాలనే రంధి తేదీలేమీ గుర్తు పెట్టుకుని పుట్టలేదు. మనకు తెలిసిందే లోకమూ కాదు.
    – ఈ నైతికత వర్గాలకీ, వర్ణాలకీ మాత్రమే చెందింది కాదు. లేచిపోవడం పరువు చేటు అనీ, మొగుడి చాటు లంజరికానికి సమాజం అభ్యంతరపెట్టదనీ ఏ వూళ్ళో వాళ్లయినా గమనించే ఉంటారు.
    – నామినికి ఉన్నది పందొసంత మీద ప్రేమ కాదు, కచ్చ. ఆమె చేష్టలను వెక్కిరిస్తూ బయటపడిపోయాడు కూడా. ఆమె మీద జాలీ, సానుభూతీ పుట్టించాలనుకోవడం మూలోద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోవడమే.
    – నారాయుడి పాత్రను అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. నారాయుడూ, పందొసంతల చాయలున్న మనుషులు నాకు ఆరోజుల్లోనే తెలుసు.
    – అక్కడ ఉన్నది భయపెట్టే స్వార్థపు చీకటే కానీ కాముకత్వపు చీకటి కాదు.
    – మనకు అనువయిన నాజూకు మాటల్లో చెప్పుకొచ్చిన పల్లెల కథలన్నీ ఆ జీవితాలకు అన్యాయం చేసినట్టే. ఊళ్ళల్లో బూతు మాటలన్నిటినీ బూతు అర్థంలో వాడరు. మన నాగరికపు సున్నితపు త్రాసుల్లో తూచి వాళ్ల భాష అశ్లీలమనడం వాళ్ళను అవమానించడమే.
    ( ఏ మేరకయినా అసహజత్వం ఉందీ అంటే అది ఊళ్ళో వాళ్లంతా పందొసంతకి దన్నుగా నిలబడటం. ఆర్థికంగా ఆమె ఒక మెట్టు పైకెక్కాక అది సహజంగా జరిగిపోతుంది)

    • “అక్కడ ఉన్నది భయపెట్టే స్వార్థపు చీకటే కానీ కాముకత్వపు చీకటి కాదు” – ఈ ఒక్క వాక్యం చాలు చంద్ర గారూ నవల యొక్క ఉద్దేశం ఇదే అని తెలుసుకోవడానికి. ఒక్క వాక్యంలో ఎంతో బాగా చెప్పారండీ!

  13. Manjari Lakshmi says:

    రాధగారు
    నామిని గారు ఆడవాళ్ళ మీద ఉన్న తన వ్యతిరేకతనంతా తన బూతుల ద్వారా సాహిత్యీకరించటం కోసమే ఈ నవలలోని పాత్రలను సంఘటనలను నియంత్రించుకుంటూ, నడుపుకుంటూ పోయారని పుస్తకం చదివిన ఎవరికైనా అర్ధమై పోతూనే ఉంది. దాన్ని పైకి కనపడనీయకుండా ఉంచటానికి ఒక ఎత్తుగడగా మూలింటామెను, మార్కెట్ శక్తులను ఈ నవలలో ఒక కవరింగ్ గా వాడుకున్నారు నామిని గారు. మిట్టూరులో వున్న ఆడవాళ్ళు మొత్తం మొత్తం కూడా ఏ పని పాటలు చేసుకోకుండా రంకులతోను, బూతులతోనూ కాలక్షేపాలు చేస్తూ బతుకులు బతుకులు వెళ్లదీసుకుంటున్నట్లుగా చిత్రీకరించారు. మన ఆడవాళ్ళకు ఆత్మ గౌరవం అనేది ఉంటే మిట్టూరులోని ఆడవాళ్లందరకు బహిరంగంగా క్షమాపణ చెప్పుకొని, ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకోమని మనందరం కలిసి నామినిగారిని డిమాండ్ చెయ్యాలి. మీరు దానికొప్పుకుంటే, నేను నా మాట వెనక్కి తీసుకోవటానికి నాకెటువంటి అభ్యంతరము లేదు.
    ఇట్లు
    మంజరి లక్ష్మి

    • మంజరి గారూ, నేను మీ మాటను వెనక్కి తీసుకోమని ఏమైనా అన్నానా? రచయితలని పర్సనల్ గా విమర్శిస్తే బాధ పడతారు కదండీ…. అన్నాను. అదీ ….. మీరు ఏమీ అనుకోరని రాశాను. మీకు నేనేమైనా బాధ కలిగించినట్లనిపిస్తే క్షమాపణలండీ…..

  14. చాలా బాగా రాశారు గంగాధర ప్రసాద్ గారూ, నేను కూడా ఈ నవల చదివి చాలా ఏడ్చాను. ఆ రోజంతా నిద్రలో కూడా బాధ పెట్టిన నవల ఇది. “నా వరకూ వ్యభిచారాంశాలు ఈ కథలో పెద్దగా ప్రాముఖ్యంలేనివి. కుటుంబంపైన, జీవితం పైనా మూలింటామెకున్న దృష్టి, రైతు కుటుంబాల్లో ఉండే మట్టిపై ప్రేమ, కారుణ్యమూ వెలకట్టలేనివి. అంతేనా.. ఒక దశకంలో గ్రామీణ జీవితం ఎంత వేగంగా పతనమయిందో నామిని కూడా కథలో అంత వేగంతో ఆ పతనాన్ని చివర్లో చూపెట్టిన తీరు గ్రామాలు శిథిలమైపోయిన రీతిని, మనిషిలోని అత్యాశ విశ్వరూపమెత్తిన సందర్భాలను ఆవిష్కరిం చింది. తన కళ్లెదుట కుప్పకూలిన గ్రామాలయాల విగత జీవితాన్ని చూచిన నామిని, నిలువెళ్లా కుంగిపోయి, మొదలంటా కదిలిపోయి రాసుకున్న మనోవేదనే ఈ మూలింటామె నవల. ప్రపంచం అంతా విస్తరించిన విచ్చల విడి మార్కెట్ శక్తుల విషపు కత్తులు లేత పల్లెబాలికలను హతమారుస్తున్న దృశ్యాలను, హెచ్చరికలూ నామిని యొక్క మూలింటామె నవలలో చూడలేక పోతే, ఇక పుస్తకాలు చదవడం వృధా” – నా అభిప్రాయం కూడా ఇదే. అయ్యో! ఆ కొనమ్మి ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయింది? అని ఏడ్చాను నేనైతే. ఒక తప్పు ఎంత మందిని ఆవేదనకి గురి చేస్తుందో తెలియచేసే ఈ నవల కాలానికి నిలబడే నవల.

  15. Thirupalu says:

    ప్రజల భాషతో ప్రజల కళ్లుపొడిచాడు నామిని! ప్రజల భాషను ఏ ప్రజల ను సంస్కరించడానికి, లేక వారి జీవితాలు చైతన్యవంత మవడానికి ఉపయోగించాడు?

  16. Chandra Kanneganti says:

    అది బూతయినా, నీతయినా రాయొచ్చో లేదో తేల్చుకోడానికి రెండు సూత్రాలు ఉన్నాయి. అది సమాజానికి హానికరమా కాదా అన్నది మొదటిదయితే అది relevant అవునా కాదా అన్నది రెండోది. రచయిత జాగ్రత్త చూసుకోవలసింది ఈ రెండు విషయాలే కానీ అది సర్వ జనామోదం పొందుతుందా, అశ్లీలంగా భావించబడుతుందా అని కాదు.
    పల్లెల్లో పుట్టి మట్టిలో చేయి పెట్టినవాడెవడయినా నోట ఒక్క బూతు మాటా దొర్లకుండా పెరిగి ఉండడు. ఆమాట వినగానే అది సందర్భాన్ని బట్టి తిట్టుగానో ముద్దుగానో తీసుకుంటారే కానీ వాళ్ల తలపుల్లోకి వచ్చేది బూతు భావన కాదు. ఆ సంస్కృతికి దూరంగా పెరిగిన వాళ్లకూ, అది తప్పని బ్రెయిన్ వాష్ చేయబడినవాళ్లకూ అది బూతుగా తోచడంలో ఆశ్చర్యం లేదు. విచారకరమైన విషయమేమిటంటే నాగరిక సమాజం తమ శిష్టప్రమాణాలననుసరించి అది అశ్లీలమనీ తోసి పుచ్చడం, పాలిష్ చేసి అసలు జీవితాన్ని మరుగుపర్చడం. ఇది ఆధిక్య భావనా, సాంస్కృతిక ఆధిపత్య ధోరణీ కాక మరేమిటి? ఈ లెక్కన లోకాన అన్ని నగ్న చిత్రాలకూ, నగ్న శిల్పాలకూ ముసుగులు కప్పుతూ పోవాలి.

    బూతు అనేది సాపేక్షికం. సంస్కృతి సంస్కృతికీ మారుతుంది. ఉపసంస్కృతుల్లో తేడాలుంటాయి. ఒకే పదానికి వేరే వేరే అర్థాలుంటాయి. అశ్లీలానికి ప్రమాణాలు వేరే వేరే ఉంటాయి. దాని వల్ల ముంచుకొచ్చిన ప్రమాదమేదీ లేదు. కాలం, ప్రాంతం, సందర్భం – వీటిని బట్టి అవి ఎదురయిన వాళ్లు మారతారు గానీ, ఒక పల్లెటూరి వాడి దగ్గరికి వెళ్ళి వాడు మనల్ని “నువ్వు” అంటే వాడికి మర్యాద తెలియదని తిట్టుకోనవసరం లేదు, “వాడెమ్మ” అని ఎవర్నో అంటే బూతులు మాట్లాడేస్తున్నాడని చెవులు మూసుకోనవసరం లేదు.

    • E sambukudu says:

      చంద్ర కన్నెగంటి గారూ చాలా బాగా చెప్పారు. వావ్ ..”విచారకరమైన విషయమేమిటంటే నాగరిక సమాజం తమ శిష్టప్రమాణాలననుసరించి అది అశ్లీలమనీ తోసి పుచ్చడం, పాలిష్ చేసి అసలు జీవితాన్ని మరుగుపర్చడం. ఇది ఆధిక్య భావనా, సాంస్కృతిక ఆధిపత్య ధోరణీ కాక మరేమిటి? ఈ లెక్కన లోకాన అన్ని నగ్న చిత్రాలకూ, నగ్న శిల్పాలకూ ముసుగులు కప్పుతూ పోవాలి” .చాలా కష్టమేనండి.మీరన్నదే రైటు.

      అన్నింటిని కప్పుకుంటు పోవడం ఎందుకు మనిషి బట్టలు విప్పుకుంటూ పోతే పోలా !..బట్టలు కట్టుకోమని ఎవరు చెప్పారండి బాబూ ..ఎందుకొచ్చిన నాగరీకం..నాజూకు తనం చెప్పండి .చదువు..సంస్కారము..యిలాంటివన్ని ఎందుకు చెప్పండి.మన పూర్వీకులు జీవించిన సహజజీవితాన్ని మనం కొనసాగించకుండా అనవసరంగా నాగరీకము పేరున పాడుపని చేస్తున్నాం .అందరం కలసి ఆలోచించవలసిన విషయమే.

      • Chandra Kanneganti says:

        శంబూకుడు గారూ,
        .
        మీరు కనీసం పేరన్నా సరయింది ఎంచుకోవలసింది :-)
        మీ ఆవేశం తెలుస్తుంది కానీ మీరు చెప్పదలచుకున్నది స్పష్టంగా లేదు. ఆపైన వ్యంగ్యంతో చిక్కు ఉండనే ఉంది; చర్చకీ, తర్కానికీ దూరంగా లాక్కెళుతుంది.
        సందర్భాన్నించి పక్కకి ఎటూ వచ్చేశాం కనక ఇంకొంచెం కొనసాగిస్తాను.
        నేనర్థం చేసుకున్నది బట్టలు నాగరికతకీ, సంస్కారానికీ చిహ్నమని మీరనుకుంటున్నారని. లేదా అవి లేకుండా ఉండటం అనాగరికత అనీ, కుసంస్కారమనీ.
        మీరు దేన్ని సంస్కారంగా భావిస్తున్నారో తెలియదు. చలీ ఎండలనుంచి రక్షణా, అందంగా కనపడాలన్న, హోదా తెలుపుకోవాలన్న ఆకాంక్షా – వీటి సంగతి వదిలేస్తే బట్టలకీ సంస్కారానికీ సంబంధం లేదు. (చదువుకూ సంస్కారానికీ ఎటూ లేదు) కాలాన్ని బట్టీ, ప్రాంతాన్ని బట్టీ వస్త్రధారణ మారుతుంది. వందేళ్ళ క్రితం ఇక్కడ బికినీ లేదు. అక్కడ మన ముత్తాతలకి పై చొక్కా లేదు. పిల్లలు నీళ్ళల్లో మునిగిపోతుంటే బికినీ అమ్మాయి దూకి రక్షిస్తుంది. ఆకలేసిన వాడికి పైచొక్కా లేని వాడు పట్టెడన్నం పెడతాడు. మనిషికి మనిషి విలువ ఇవ్వడమే సంస్కారమయితే అది చాలదా? నిండా బట్ట వేసుకోవడమే సంస్కారమయితే ప్రతివాడూ బురఖా వేసుకు తిరగడా?
        మీకర్థం కాలేదో పట్టించుకోలేదో కానీ నేను చెప్పింది రెండు విషయాలు –
        ఒకటి: బట్టలకీ, బూతు మాటలకీ intrinsic value లేదు. మనకు చిన్నప్పటినుంచీ అలవాటు కావడం వల్ల, చుట్టూ చలామణీ అవుతుండడం వల్ల, expectationsకి అనుగుణంగా ఉండాలనుకుంటాం కనుక మనం ఇచ్చే విలువ అది. మనకంటే భిన్నంగా వస్త్రధారణ చేసినా, భిన్నంగా మాట్లాడినా వాళ్ళ మానవత్వపు విలువలు మనకంటే భిన్నంగా ఉండవు.
        రెండు: కళ జీవితాన్ని ప్రతిబింబించాలి, దాని అన్ని చీకటి కోణాలతో, మనకు offensive అనిపించే విషయాలతో సహా. అది జనసంక్షేమానికి హాని కలిగించనంతవరకూ. అలా చేయనప్పుడు సాహిత్యం విఫలమయినట్టే. ఒకప్పుడు నిషేధించినా ఇప్పుడు నగ్న చిత్రాల్నీ, శిల్పాల్నీ ప్రదర్శనశాలల్లో చూస్తున్నాం. అది అనాగరికం అనీ, కుసంస్కారమనీ అనుకోం.
        మీ అభిప్రాయాలు వేరే ఉండొచ్చు. కానీ ఇటువంటి ఆలోచనలూ ఉన్నాయని తెలుసుకుంటే చాలు.

  17. అవి says:

    ఎడిటరు గారూ,

    ఏమిటీ విచిత్రం?

    అభ్యంతరకరమైన (మీ దృష్టిలో ) వాక్యాన్ని, మీ జవాబులో వుంచి, మిగిలిన అభ్యంతరం కాని వాక్యాల్ని మొత్తం తీసేశారా? ఏమన్నా అర్థం వుందా? ఆ వాక్యం తీసేసి మిగిలిన వ్యాఖ్యని వుంచకూడదూ? ఎడిట్ చేసే హక్కు మీకు ఎలాగూ వుంది కదా?

    చాలా ఏళ్ళ కిందట, వాసిరెడ్డి సీతాదేవి రాసిన, “మరీచిక” అనే నవలని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు నిషేధించిందట, కొన్ని అభ్యంతరకరమైన విషయాలున్నాయని. ఆ అభ్యంతరకరమైన విషయాలన్నిటినీ, గెజిట్‌లో ప్రచురించారట, ఎందుకు నిషేధించారో తెలియజెయ్యడానికి. అందరూ ఆ విషయం చెప్పుకుని, నవ్వుకునే వారు. అలా వుంది ఈ విషయం.

    – అవి

  18. SATEESH BABU says:

    ఈ మూలింటామె నవల గురించి రాసినవి చదువుతుంటే నాకు ఇంకో విశేషం కనపడింది. ఆ ఊరిలో మొగవాళ్లందరూ చాలా మంచివాళ్ళుగా మారిపోయారు. నారాయుడు తన రొండవ భార్య ప్రియులతో గడపటానికి ఆమెకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటాడు. కొంచెం సెంటిమెంట్ ఎక్కువున్న రంగబిళ్ళ అనే అతను తన్ని నారాయుడి రొండో భార్య వదిలేసినా ఆమెనేమీ చేయకుండానే ఆత్మహత్య చేసుకుంటాడు. చంద్రారెడ్డి భార్య అన్నదమ్ములు, బాబాయిలు అటువంటి వాళ్ళు వచ్చి నారాయుడు రొండో భార్యను ఎటువంటి హింసలకు గురిచెయ్యరు. అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళుగా మారిపోయారన్నమాట. భవిష్యత్తులో చంద్రారెడ్డి, అంత సెంటిమెంట్లు లేకపోతే, ఈమె వదిలేస్తే ఇంకో ఆమెతో పోతాడని ఈమెను ఏమీ చెయ్యడని ఈజీ గానే ఊహించొచ్చు. ఇంతగా మారిపోయారా మగవాళ్ళు? నా చిన్న తనంలో తనతో ఉన్న మనిషి వేరే వ్యక్తితో వెళ్లిందని చెప్పి బహిర్భుమికెళ్లిన ఆమెను అలా వెళుతున్నప్పుడే ఆమె తల కొడవలితో నరికి ఊళ్ళోకి పట్టుకొచ్చినట్లుగా చదివాను. ఈ అక్రమ సంబంధాల విషయాలలో ఎన్నో హత్యలు జరిగినట్లుగా వినే వాళ్ళము. కానీ ఈ ఊళ్ళో మొగవాళ్ళందరూ మంచివాళ్లే. ఆడవాళ్లందరికీ లైంగిక స్వేచ్చ విపరీతంగా ఉంది. ఏదో కొద్ది కులం పట్టింపున్నట్లుగా రాసారనుకోండి. అదీ మార్కెట్ శక్తులు భయంకరంగా ప్రవేశిస్తే పోతుందని పైకులాల వాళ్ళు ఇంక కత్తెర్లని ఎగరెస్తూ కటింగులు చేయటానికి సెలూన్ల వద్ద నిలబడతారని మన gs రామ్మోహాన్ గారు ఎలాగూ శలవిచ్చారు కదా. ఈ ఆడవాళ్లెవరికీ మొగవాళ్ళ వల్ల ఏ బాధలు కలగటం లేదు. ఆడవాళ్లలోనే కొందరు మంచి వాళ్ళు కొందరు చెడ్డవాళ్లు ఉన్నారు. చెడ్డ ఆడవాళ్ళ వల్లే మంచి ఆడవాళ్ళకు కష్టాలొచ్చాయి అంతే. మార్కెట్ శక్తుల ప్రవేశం వల్ల ఇంత మంచి జరిగిపోయిందన్నమాట. స్త్రీలపై పురుషుల అణచివేత, దోపిడీ, లైంగిక అణచివేత, లైంగిక అత్యాచారాలు, భర్తలవల్ల కూడా ఆడవాళ్ళకు లైంగిక హింసే ఎదురవుతోంది అని ఈ స్త్రీవాదులిచ్చే నినాదాలన్నీ ఉట్టివేనన్నమాట. ఇది నాకు భలే నచ్చింది. రేపు మా ఆవిడ ఈ స్త్రీవాదుల మాటలు ఎప్పుడన్నా చెవిన పడి ఆవేశ పడితే ఓసీ పిచ్చిదానా మార్కెట్ శక్తుల వల్ల అంతా మారిపోయాము. పురుషస్వామ్యం పోయి స్త్రీస్వామ్యం వచ్చేసింది. కావాలంటే నామిని గారి మూలింటామె చదువుకో అని చెప్పేయొచ్చన్న మాట. జయహో నామినీ జయహో

  19. వంశీకృష్ణ గారు

    మెహర్ గారు వ్రాసింది ఒకటి రెండు పదాలు చూశాక ఇందులో పెద్ద సరుకు లేదులే అని పైపైన లాగించేశాను. ఏదో కాస్త అద్దె పరిగ్నానం పుక్కిట పట్టిన కొన్ని కొటేషన్స్ వున్న వాడు ఎలా రాస్తాడో అలాగే రాశాడు. ఆయన కోసం.

    “Bad writing is more than a matter of shit syntax and faulty observation; bad writing usually arises from a stubborn refusal to tell stories about what people actually do― to face the fact, let us say, that murderers sometimes help old ladies cross the street.”
    ― Stephen King, On Writing: A Memoir of the Craft

  20. Thirupalu says:

    // ఏదో కాస్త అద్దె పరిగ్నానం పుక్కిట పట్టిన కొన్ని కొటేషన్స్ వున్న వాడు//
    అద్దె పరిజ్ఞానం నుండే సొంత పరిజ్ఞానం నుండే సొంత పరిజ్ఞానం ఏర్పడుతుంది. కాదా ? తల్లి గర్భం లోనే నేర్చుకొని వస్తారా అభిమన్యుడిలా?

    • pavan santhosh surampudi says:

      ఆ వ్యాఖ్యలో మెహర్ గారు ఏ విశ్లేషణా చెయ్యకుండా.. ఇది చదవాల్సిన సరుకు కాదని గాఠిగా తీర్మానించేసి, జనం చదువుకునేందుకు ఓ కొటేషన్ పారేసి వెళ్ళిపోయారు. అందుకే రత్నాకర్ గారు అట్లా అన్నారు. ఎవరూ అభిమన్యులం కాదు. అయినా మహాభారతం నుంచి ఎందుకు ఉదాహరణలు నామినివో, రావి శాస్త్రివొ వుంటె చూడండి.

  21. pavan santhosh surampudi says:

    మొత్తానికి ఈ వివాద సాహిత్యం నుంచి నాకొక్కటే గట్టిగా తగులుతోంది-నారాయుడు పాత్రలోని సంభావ్యత ఏమిటని వ్యాసకర్త వేసిన ప్రశ్నకు మాత్రం ఎవరూ విశ్లేషణతో కూడిన సమాధానం ఇవ్వలేదు.
    వ్యాసకర్త అన్న వాటిలొ అత్యంత ముఖ్యమైనది అది. పాత్రలపై రచయిత కంట్రొల్ ఉండడం ఉండకపోవడం అన్నదే మంచి రచయితకూ, మిగిలినవారికీ మధ్య ఒకానొక సరిహద్దు. అందుకే వ్యాస మహర్షి యుధిష్ఠిరుడు అశ్వత్థామ హతః కుంజరః అన్నా ఊరుకోగలిగాడు-మార్చకుండా. ఆయుధం పట్టనని కురుక్షేత్రానికి వచ్చిన కృష్ణుడు ఆవేశాన్ని అణచుకోలేక చక్రాన్ని పట్టుకుని భీష్ముణ్ణి చంపబోయాడు. మనుషులు మనుషుల్లా ప్రవర్తించాలి. మరీ ఫార్స్, ఫాంటసీ రచనలైతే తప్ప పాత్రలు కీలుబొమ్మలు కాకూడదు. రచయిత ఎంత వేదన పడుతున్నా వేయిపడగలులో అపురూపమైన పాత్రలన్నీ మరణిస్తోంటాయి. అవి పొందింది సహజమరణం. ఆ చావును రచయిత ఆపలేడు, ఒకవేళ ఆపితే అప్పుడు నిజంగా మరణిస్తాయవి సారస్వత యవనికపై. మూలింటామే అలాంటి సహజ మరణమే పొందిందా?
    వేయి పడగలుతోనో, కాలాతీత వ్యక్తులుతోనో పోల్చాలంటే ఒక సంధి యుగాన్ని నిర్దిష్టంగా చర్చించిన నవల కావాలి.(ఆ రెండూ భిన్న పార్శ్వాలలో ఆ ప్రయత్నం చేసాయి.) ఇందులో ఆ స్థాయి ఉందా? ప్రశంసకులు ధర్మారావు పేరో, దయానిధి పేరో అనుకోకండా వాడితే ఎలా?

మీ మాటలు

*