మా పురపాలకోన్నత పాఠశాల – భలే రోజులూ – జ్జాపకాలూ

chitten raju

రామారావు పేట శివాలయం దగ్గర మ్యునిసిపల్ మిడిల్ స్కూల్ లో మూడో ఫారం పూర్తి అయ్యాక పాక లో నించి పక్కా సిమెంట్ బిల్దింగ్ లో జరిగే నాలుగో ఫారం లో ప్రవేశించగానే నాకు హిమాలయా పర్వతాలు ఎక్కిన ఫీలింగు వచ్చేసింది. ఎందుకంటే అంత వరకూ నేను “బెంచీ ఎక్కిన” పాపాన పోలేదు. ఒకటో క్లాసు నుంచీ మూడో ఫార్మ్ దాకా నెల మీదే కూచుని చదువుకున్నాను కానీ నాలుగో ఫారం లో స్కూలు బెంచీలు ఉండే క్లాసులో ప్రవేశించాను అన్నమాట. అందులోనూ మొదటి బెంచీలో మధ్య సీటులో మేష్టారికి సరిగ్గా ఎదురుగా కూచునే వాడినేమో, ఇంకా గర్వంగా ఉండేది. అది 1956-57 వ సంవత్సరం. నాకు ఆ సంవత్సరమే పురరపాలక సంఘం వారు మా గాంధీ నగరంలో హైస్కూల్ మొదలుపెట్టడానికి నిర్ణయించారు. అప్పుడు ముందు పార్కుకి ఉత్తరం వేపు ఉన్న ఖాళీ స్థలం లో ఒక పెద్ద పాక వేయించి అందులో ఎస్.ఎస్.ఎల్.సి క్లాసులు, తాత్కాలికంగా నాలుగో ఫార్మ్, ఐదో ఫార్మ్ క్లాసులు రామారావు పేట మిడిల్ స్కూల్ లోనూ నిర్వహించడం మొదలుపెట్టారు.

1958 లో ఇప్పుడున్న పెద్ద సిమెంటు భవనం కట్టి మొత్తం అన్ని క్లాసులూ గాంధీ నగరం ప్రాంగణానికి తరలించారు. నా హైస్కూల్ ప్రహసనంలో నాలుగో ఫార్మ్ మటుకు రామారావు పేట, మిడిల్ స్కూల్ ప్రాంగణం లోను తరువాత ఐదో ఫార్మ్, ఎస్.ఎస్.ఎల్.సి పార్కు వెనకాల గాంధీ నగరం ప్రాంగణం లోనూ మహదానందంగా చదువుకున్నాను. అవి భలే రోజులు. అంత కంటే భలే జ్జాపకాలు. 1959-60 లో ఆ స్కూల్ నుంచి S.S.L.C. పాస్ అయిన సుమారు ముఫై మంది మూడో బేచ్ లో నేను ఒకణ్ణి. నేను మా సెక్షన్ కి ఫస్ట్..కానీ మూడు మార్కుల తేడా తో స్కూల్ మొత్తానికి సెకండ్.
ఇక వివరాల్లోకి వెళ్తే, నా ఫోర్త్ ఫారం టీచర్లలో నాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉన్న టీచర్లలో లంక వెంకటేశ్వర్లు గారు ఒకరు. ఆయన అప్పుడే టీచర్ గా చేరి, మాకు లెక్కలు చెప్పేవారు. ఆయనతో తమాషా ఏమిటంటే, ఒక లెక్కల సిధ్ధాంతం ప్రతిపాదించి, దానికి విలోమ సిధ్ధాంతం, ఉప పత్తి మొదలైన అంశాలు చెప్పి, మాకు ఒక లెక్క చెయ్యమని ఇచ్చేవారు. దానికి మేము పధ్ధతి ప్రకారం లెక్క పూర్తి చేసి ఆన్సరు రాసిన తరువాత, మా పేపర్లు దిద్దే వారు. పొరపాటున ఆ ఆన్సర్ కి మేము యూనిట్స్ రాయక పోయామో. అంతే సంగతులు. మార్క్లులు సున్నా. పైగా….”ఏరా, ఈ ఆన్సరు గాడిదలా, గుర్రాలా, నీలాగా కోతులా?…ఆ ఆన్సరు పాతిక 24.55 అంగుళాలు అనో, పౌనులు అనో, రాయక్కర్లేదూ, రాత్రి నేను ఇంటికె వెళ్ళాక కలగన మంటావా?” అని చెడామడా తిట్టే వారు. అయన లెక్కల పాఠాలు అద్భుతంగా చెప్పే వారు. అలాగే దీక్షితులు గారు సైన్స్ చెప్పేవారు. ఆయన పాపం చాలా దూరం నుంచి వచ్చేవారు.

ఆ రోజుల్లో మా ఇంట్లో అలవాటు ప్రకారం, మా తోటలో పండిన కూరగాయలన్నీ మా టీచర్లందరికీ మా అమ్మ ఒక్కొక్కరికీ ఒక్కొక్క సంచీ చొప్పున మా చేత పంపించేది. ప్రతీ వారం వంకాయలో, బెండ కాయలో, మొక్క జొన్నలో….అన్నీ మా నాన్న గారు స్వయంగా పండించినవే..లేక పోతే మా పొలం నుంచి మా పెద్దన్నయ్య పంపించినవో…అందరికీ ఇచ్చేవారు. ఒక వారం తాతబ్బాయి గారికి వంకాయలు ఇస్తే, దీక్షితులు గారికి బెండకాయలు ఇచ్చేది మా అమ్మ. ఒక సారి దీక్షితులు గారు “విత్తనాలు నాటడం ఎలా, వాటికి మొట్ట మొదటి ఆకు ఎలా వస్తుందీ, మూడో ఆకు కూడా వచ్చే దాకా దానికి పురుగు పట్టకుండా ఎలా జాగ్రత్త పడడం” అనే విషయాల మీద మాకు సైన్స్ పాఠం చెప్పి, దానికి ప్రాక్టికల్ మా తోటలో చేయించారు. అంటే, ఆయనే మా ఇంటికి వచ్చి, మా అమ్మతోటీ, నాన్నగారితోటీ మాట్లాడి, మా తోటలో ఒక పది చదరపు అడుగుల స్థలం అడిగి తీసుకున్నారు. మా చేత అది దున్నించి, కలుపు తీయించి, జపాను పధ్ధ్దతిలో బెండ విత్తనాలు నాటించి, వాటికి కాయలు కాసే దాకా సుమారు ఆర్నెల్లు మమ్మల్ని తోటపనిలో ఆసక్తి కలిగేలా చేశారు.

 

ఇవాళ, అమెరికాలో మా ఇంటి వెనకాల తోటలో బెండ కాయలు, దొండ కాయలు, అరటి కాయలు, కరివేపాకు, టొమేటోలు, కేబేజీ, కాలీ ఫ్లవరు, బచ్చలి, గోంగూర ..ఇలా ఏ కూర గాయలు నేను కష్టపడి పండించగా మా క్వీన్ విక్టోరియా మనసారా ఆరగించినా, మా స్నేహితులకి పంచి పెట్టినా ..అదంతా మా నాన్న గారు, అమ్మా, దీక్షితులి మేస్టారి చలవే. ఆయన్ని నేను 1958 తరువాత చూడ లేదు, కానీ ఆయన డొప్ప చెవులు నాకు ఇంకా గుర్తే!

School Entrance OK

ఇక నా నాలుగో ఫారం లో ఉండగానే తులసీ దేవి గారు, ఇ.వి. రామ్మోహన్ రావు గారు టీచర్లు గా చేరారు అని నాకు గుర్తు. నా ఐదో ఫారం లో తులసీ దేవి గారు మాకు సైన్స్ చెప్పగా, రామ్మోహన్ రావు గారు చరిత్ర చెప్పేవారు. రామారావు పేట స్కూల్ లో చిన్న సైన్స్ లాబ్ కూడా ఉండేది. అది దొర గారి హయాం లో ఉండేది. నాకు తెలిసీ తులసీ దేవి గారు చేరే దాకా ఆయనే స్కూల్ అంతటికీ పెద్ద సైన్స్ మేష్టారు. దొర గారు చాలా స్ట్రిక్ట్ గా ఉండే వారు కాబట్టి ఆయనంటే అందరికీ భయమే! తులసీ దేవి గారికి ఎందుకో తెలియదు కానీ, నేనంటే చాలా ఆప్యాయంగా ఉండే వారు.

నేను అమెరికా వచ్చాక ఒక సారి కాకినాడ వెళ్ళినప్పుడు….మా చెల్లెళ్ళు భానూ, పూర్ణా, ఉషారేవతీ ల తో తులసీ దేవి గారిని చూడ్డానికి వెళ్ళాను. అంటే, నాకు ఆవిడ సైన్స్ పాఠాలు చెప్పిన తరవాత సుమారు నలభై ఏళ్ళు దాటాక అనమాట. అప్పటికి ఆవిడ రిటైర్ అయిపోయారు. మమ్మల్ని చూడగానే ఆవిడ చాలా సంతోషించి, మా చెల్లెళ్ళతో “ఒక సారి ఏమయిందో తెలుసా. నేను మీ అన్నయ్య క్లాస్ కి మనం లోతైన నూతిలోంచి నీళ్ళు తోడుకోడానికి వాడే చేతి పంపు శాస్త్ర ప్రకారం ఎలా పని చేస్తుందో చెప్పాను. వారం తరువాత క్లాసులో తిరిగి చెప్పమని అందరినీ అడిగితే, మీ అన్నయ్య ఒక్కడే ఆ పంపులో ముషలకము, చిన్న గొట్టాంలో దాన్ని మనం పైకి లాగినప్పుడు కిందనున్న అక్కడి గాలి ఎలా శూన్యంగా మారి, ఆ శూన్యంలోకి నూతి నీళ్ళూ ఎలా చొచ్చుకుని వస్తాయో, మనం పంపు కొట్టిన కొద్దీ అదే పదే పదే మళ్ళీ ఎలా పునరావృతం అవుతుందో ఎక్కడా ఒక్క ఇంగ్లీషు మాట లేకుండా చెప్పాడు” అని అప్పటికి నలభై ఏళ్ళ క్రితం నాటి సంగతులు గుర్తు చేసుకుని, తన పాత విద్యార్ధిని కలుసుకున్నందుకు మహదానంద పడ్డారు.

ఈ నాటి విద్యార్ధులు ఎవరికైనా ఆ ముషలకము (పిస్టన్), శూన్య ప్రదేశమూ (వేక్యూమ్) లాంటి పదాలు తెలుసునో, తెలియదో నాకు అనుమానమే. కానీ అప్పటికీ, ఇప్పటికీ పంప్ అనే ఆంగ్ల పదానికి తెలుగు మాట లేదు అనే నేను అనుకుంటున్నాను. కానీ అప్పటి గొట్టాం ..అనగా సిలిండర్ ..అనే మాటని మటుకు “గొట్టాం గాడు” అని నా మీద ప్రయోగిస్తూ ఉంటారు నా గాఢ మిత్రులూ-గుఢ శత్రువులూ కొంతమంది. అన్నట్టు తులసీ దేవి గారి తమ్ముడు తులసీ దాసూ, నేనూ కాకినాడ ఇంజనీరింగ్ క్లాస్ మేట్స్. నాకు తెలిసీ, తులసీ దేవి గారు పెళ్ళి చేసుకో లేదు.
ఇక ఇ.వి.ఆర్ రామ్ మోహన రావు గారు చాలా విశిష్టమైన, విలక్షణమైన టీచరు. ఎందుకంటే, ఆయన పాఠాలు చెప్పే పధ్దతి తాతబ్బాయి గారిలాగా నీరసంగా ఇదెక్కడి గోలరా బాబూ, హాయిగా ఇంటికెళ్ళి పడుకోకుండా?” అనే పధ్ధతిలో కాకుండా యువ రక్తంతో ధాటీగా, హావభావాలతో. నవరసభరితంగా ఉండేది. అంతకంటే ముఖ్యంగా ఆయన షేక్స్ పియర్ ఇంగ్లీషు నాటకాలు వేసే వారు. నా ఐదో ఫారంలో స్కూలు వార్షికోత్సవాలలో జూలియస్ సీజర్ ని బ్రూటస్ మొదలైన రోమ్ సెనేట్ సభ్యులందరూ హత్య చేసినప్పుడు సీజర్ శవం ముందు ఆయన మార్క్ ఏంటొనీ ప్రసంగం అత్యద్భుతంగా నటించే వారు. అదే నాటకం నేను ఒక సారి న్యూయార్క్ బ్రాడ్వే లో చూసినా నాకు ఇప్పటికీ, అంటే సుమారు యాభై ఐదు సంవత్సరాల తరువాత మన ఇ.వి.ఆర్ గారి ఆ సీను మటుకు ఇంకా నా కళ్ళలో మెలుగుతూ ఉంటుంది. అప్పటికి ఆయనకి పెళ్ళి కాలేదు కానీ, మా క్లాస్ లోనే ఉన్న ఒక అమ్మాయి తో పెళ్ళి కుదిరింది అని చెప్పుకునే వారు. అంటే, తన శిష్యురాలినే ఆయన వివాహం చేసుకున్నారన మాట.
నా ఫోర్త్ ఫారం లో మాకు కృష్ణమాచార్యులు గారు తెలుగు చెప్పేవారు. ఆయన సాధారణంగా తెలుగు మేష్టారు అనగానే అందరికీ స్ఫురించే లాగానే… అనగా పంచె కట్టూ, కండువా, తిలకం బొట్టూ పెట్టుకుని ఉన్నప్పటికీ, అస్సలు చిరు బొజ్జ అయినా లేకుండా బాగా కసరత్తు చేసిన శరీరంతో బలంగా ఉండేవారు. బహుశా అందుకే నేమో ఆయన నిక్ నేమ్ “గునపం” గారు. చాలా శ్రావ్యంగా తెలుగు పద్యాలు చదివే వారు. ఐదో ఫార్మ్ లోకి రాగానే యజ్ఞేశ్వర శాస్త్రి గారు ఒక తెలుగు సెక్షనూ, కృష్ణమాచార్యులు గారు మరొక సెక్షనే కాక, ఒకరు డిటైల్డూ, మరొకరు నాన్-డిటైల్డు చెప్పేవారు. వారిద్దరూ, వేదుల సత్యనారాయణ గారూ, వర్మ గారూ నా బోటి వాళ్లకి ఇప్పటికీ తెలుగు భాష మీద అభిమానం, ప్రేమ ఉండడానికి ప్రధాన కారకులు. వారి ఆప్యాయతకీ, నేర్పిన తెలుగు పాఠాలకీ మా జన్మ అంతా ఋణపడే ఉంటాం.

వర్మ గారి వాక్కు, వర్చస్సు, పాఠాలూ చెప్పే విధానం మనస్సుకి హత్తుకిపోయేవి. ఉదాహరణకి ఆయన లెక్కలు చెప్తూ, పైథాగరస్ సిధ్ధాంతం చెప్తూ ఉంటే, ఆ పైథాగరస్ వచ్చి మా ముందు నుంచుని వివరిస్తున్నాడు అనే మాకు అనిపించేది. పైగా ఆయన ఖద్దరు పంచె కట్టుకునే వారు. లెక్కలే కాకుండా ఆయన ఏ సబ్జెక్ట్ అయినా చెప్పగలిగే వారు. గాంధీ నగరంలోనే, అచ్యుతాపురం గేట్ దగ్గర ఉండేవారు అని జ్ఞాపకం. ఇక నాలుగో ఫారం నుండి అన్ని తరగతులలోనూ హిందీ కంపల్ సరీగా ఉండేది. ఆ మూడేళ్ళూ మాకు సునందినీ దేవి గారు హిందీ చెప్పేవారు. ఆవిడ సన్నగా. పొడుగ్గా హుందాగా ఉండే వారు. హిందీలో హై అనే మాటని పొడిగా కాకుండా కొంచెం ముక్కుతో పలకాలి అని ఆవిడ మమ్మల్ని సరిదిద్దినప్పుడల్లా, అందరం ముక్కుతో “హై, హై” అనేసి నవ్వుకునే వాళ్ళం. ఆవిడ నిక్ నేమ్ “బలాక్”. హిందీలో బలాక్ అంటే అంటే కొంగ అని అర్థం ట. మరి ఆవిడ సన్నగా, పొడుగ్గా ఉంటారుగా, బహుశా అందుకే! నిజానికి హిందీ కంపల్ సరీ యే కానీ ఆరోజుల్లో చాలా మంది పిల్లలు హిందీ లో ప్రశ్నాపత్రాన్ని కొంత తిరిగి రాసేస్తే చాలు, పేస్ మార్కులు ఇచ్చేసే వారు. సమాధానాలు రాయక్కర లేదు. అది ఇప్పుడు తల్చుకుంటే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు కి ఆ ఖర్మ పట్టింది…అసలంటూ తెలుగు అనే పాఠ్యాంశం ఏ స్కూల్ లో ఇంకా ఉంటే, గింటే!
మా నాలుగో ఫారం పూర్తి అయ్యేదాకా రామారావు పేటలో సెకండరీ స్కూలు లేనే మేము చదువుకున్నాం. రోజూ పొద్దున్నే చద్దన్నం, కొత్తావకాయ తినేసి, పార్కు మీదుగా ఆచారి గారి ఆయుర్వేదం ఆసుపత్రి దాటుకుని, అక్కడ బట్టలు ఉతుక్కుంటూ అరుచుకుంటూ దెబ్బలాడుకుంటున్న చాకలి వాళ్ళ మధ్య నుంచీ, శివాలయం దగ్గర రోడ్డు మీద నుంఛే అరక్షణం దణ్ణం పెట్టేసుకుని స్కూలికి వెళ్ళిపోయే వాళ్ళం. 1957 లో అనుకుంటాను, ఒక రోజు మేము క్లాసు లో మా డవాలీ బంట్రోతు హెడ్మాస్టర్ గారి సర్క్యులర్ పట్టుకొచ్చాడు. సాధారణంగా ఏదైనా పరీక్షల ప్రకటనలో, లేక పోతే ఎవరో పెద్దాయన పోతే ఆ మర్నాడు శలవు అని చెప్పడానికో అలాంటి సర్క్యులర్ లు వచ్చేవి.

ఈ సారి ఎవరు పోయారో అనుకుని మేము పుస్తకాలు సద్దేసుకుంటూంటే “ఇక వచ్చే యేటి నుంచి ఐదో ఫారం క్లాసులు, ఆ తరువాత క్లాసులూ అన్నీ కొత్తగా పార్కు వెనకాల కడుతున్న హైస్కూల్ బిల్డింగులో జరుగుతాయి అనీ, ఆ విషయం మా తల్లి దండ్రులకి ముందే తెలియ జెయ్యవలసినదిగా హెడ్మాస్టర్ గారి హెచ్చరిక”…అని ఇంచుమించు ఆ హెచ్చరిక సారాంశం. “హమ్మయ్య, ఇక రోజూ పొద్దున్నే ఇంత దూరం నడవక్కర లేదు. ఇంకో పది నిముషాలు పడుకుని, పార్కు దాటేస్తే, స్కూల్ కి వచ్చేస్తాం” అని మాత్రమే నాకు అప్పుడు అర్థమైన విషయం.

సారాంశం ఏమిటంటే, ఇప్పటి హైస్కూల్ భవనంలో ఐదో, ఫారమూ, ఎస్సెస్సెల్సీ చదువుకున్న మొట్ట మొదటి విద్యార్ధులు సుమారు ముఫై మంది ఉండేవాళ్ళం. ముమ్మిడి సూర్యనారాయణ (అచ్యుతా పురం గేటు), నండూరి వెంకటేశ్వర్లు (దేవాలయం వీధి), రాట్నాల హరనాథ్ (స్టేషన్ రోడ్), ఏడిద ముని సామ్రాట్ (శంకరాభరణం సినీ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు తమ్ముడు, అచ్యుతాపురం గేటు), పి.యస్.కె. సోమయాజులు ( మా ఇంటి పక్కనే పార్కు దగ్గర ఇల్లు), విన్నకోట గాడు (రెడ్ క్రాస్ రోడ్), ఆచారి (గాంధీ నగరం మార్క్టెట్ దగ్గర), రాయవరపు సత్యనారాయణ, అతని తమ్ముడు ఆదినారాయణ రావు (రామారావు పేట మూడు లైట్ల జంక్షన్) అప్పటి నా క్లాస్ మేట్స్ లో ఈ క్షణంలో నాకు జ్ఞాపకం వస్తున్న కొన్ని పేర్లు. వీళ్ళల్లో అందరికంటే పొడుగ్గా ఉంటాడు కాబట్టి నండూరి గాడు మా క్లాస్ మానిటర్ అయితే, పొట్టిగా ఉన్నా ఫస్ట్ మార్కులు వస్తాయి కాబట్టి నేను అసిస్టెంట్ మానిటర్ ని.

S.S.L.C. Certificate
ఇక ఎవరైనా నవ్వుతారేమో నాకు తెలియదు కానీ అప్పుడు మా క్లాస్ లో ఉన్న ఆరుగురి ఆడపిల్లల పేర్లూ ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకమే…ముఖ్యంగా అనంత లక్ష్మి (నిక్ నేమ్ పేపర్ షాట్..ఎల్విన్ పేట.), సుశీల, శ్రీ లక్ష్మి (అప్ప చెల్లెళ్ళు, నూకాలమ్మ గుడి) చాగంటి లక్ష్మి (గాంధీ నగరం), మరుద్వతి (శివాలయం దగ్గర), రమా గున్నేశ్వరి (శివాలయం వీధి), ర్యాలి సరళ. నేనూ, ఈ ఆడపిల్ల్లలూ రామారావు పేటలో చదువుకున్న మాధ్యమిక పాఠశాలలో మూడేళ్ళూ, ఆ తరువాత 1960 లో గాంధీ నగరం పురపాలకోన్నత పాఠశాల మొట్ట మొదటి బేచ్ లో ఎస్సెస్సెల్సీ పాస్ అయిన దగ్గరనుంచీ, ఇప్పటి దాకా..అంటే యాభై ఏళ్ళలో నేను వాళ్ళలో ఎవరినీ చూడ లేదు….ఒక్క సరళని తప్ప. అదైనా ఆ అమ్మాయి ఎక్కడో మా హాయ్ స్కూల్ మీద నేను వ్రాసున ఇదే మోస్తరు వ్యాసం చదివి, అమెరికా తన కొడుకు ని చూడ్డానికి వచ్చినప్పుడు నేను తనని గుర్తు పడతానో, లేదో అని అనుమానంగానే ఫోన్ లో పిలిచింది.

నా చిన్నప్పటి స్నేహితురాలు పిలవగానే నేను సహజంగానే ఎగిరి గంతులు వేశాను. ఆ తరువాత నేను హైదరాబాదులో 2013 అక్టోబర్ లో యువ సాహితీ సమ్మేళనం నిర్వహించినప్పుడు తనూ, వాళ్లాయనా వచ్చి, నాకు ఒక విలువైన బహుమతి ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు తన ఇంటి పేరు అడవి వారు. మిగిలిన వారు నన్ను ఎప్పుడైనా టీవీ లోనూ, పత్రికా వార్తలలోనూ చూసి ఉంటే, నా మొహం గుర్తుపట్టకపోయినా, నా పేరు మర్చిపోరు అనే అనుకుంటాను. పైగా మా ఎస్సెస్సెల్సీ అయిన తరువాత స్కూల్ పార్టీలో అందరం వీడ్కోలు పుచ్చుకుంటూ ఇచ్చిపుచ్చుకున్న ఆటోగ్రాఫ్ పుస్తకంలో వాళ్ళందరూ కూడ బలుక్కుని “మేము నిన్నెన్నడూ మరువము. మమ్ము నువ్వు కూడా మరువకుము” అని ఒకే వాక్యం వ్రాశారు. నేను స్కూల్ లో ఉండగా ఆరేళ్ళలో వాళ్ళతో కేవలం ఐదారు సార్లే మాట్లాడినా, మా అమ్మా, చెల్లెళ్ళూ వాళ్ళని మా ఇంట్లో పేరంటాలకీ పిలిచే వారు. ఆ రోజులే వేరు. స్పష్టంగా ఎందుకో తెలియకపోయినా అవి తెర చాటునుంచే వెయ్యి సార్లు ఆడపిల్లలని చూసే రోజులు.

ఇక మా రోజుల్లో అతి ముఖ్యమైన, చాలా మంది ఉపాధ్యాయుల కన్నా విభిన్నమైన వారు చక్రపాణి గారు. ఈయన నాకు అదో ఫారంలోనూ, ఎస్సెల్సీలోనూ చరిత్ర, ఇంగ్లీషు చెప్పారు. ఆయన చెప్పలేని సబ్జెక్టు లేదు. ఏదో మొక్కుబడికి క్లాస్ లో పాఠం చెప్పేసి, విద్యార్ధులని ఎవరిమానాన్న వాళ్ళని వదిలెయ్యకుండా, వాళ్ళు పరీక్షలకి ఎలా చదవాలీ అనే విషయంలో ప్రత్యేక శ్రధ్ధ పెట్టడం చక్రపాణి గారి ప్రత్యేకత. అందుకని ఆయన ప్రతీ రోజూ, మామూలు క్లాసు అయిపోయాక, అందరినీ తన ఇంటికి పిలిచి, సాంపుల్ ప్రశ్నా పత్రాలు ఇచ్చి శిక్షణ ఇచ్చే వారు. ముఖ్యంగా రాష్ట్రమంతటా ఒకే సారి అందరు విద్యార్ధులకీ జరిగే S.S.L.C పరీక్షలో మన స్కూల్ వాళ్ళు అందరూ నెగ్గాలనే పంతంతో ఉండేవారు. అంటే, కాకినాడ ప్రాంతంలో కాంపిటీషన్ పరీక్షలకి క్లాసుల్లోనే కాకుండా ప్రైవేటుగా శిక్షణ ఇచ్చే తొలి ఉపాధ్యాయులు గా ఆయన పేరు పొందారు.

Conduct Certificate

ఆ రోజుల్లో చాలా మంది టీచర్లు మామూలుగా వచ్చే జీతాలు సరిపోక పాపం ప్రెవేట్లు చెప్పినా, చక్రపాణి గారు ఆ పధ్ధ్దతిని మరొక స్థాయికి పెంచారు. అందుకే కాకినాడ లో ఉన్న అన్ని పాఠశాలల విద్యార్ధులూ ఆయన దగ్గరకి ట్యూషన్ కి వెళ్ళేవారు. అలాంటిదే మరొక ప్రవేటు స్కూల్ శివాలయం పక్కనే ఉండే “కుంటి మేష్టారి స్కూలు”. ఒక సారి మా నాన్న గారు చక్రపాణి గారిని “ఏమండీ మేష్టారూ, మా రాజా ని కూడా మీ దగ్గర ప్రెవేట్ కి చేర్చుకుంటారా?” అని అడిగితే ఆయన నవ్వేసి “ఆ వెధవే అందరికీ ప్రెవేటు చెప్పగలడు. వాడికి అక్కర లేదు. నాదంతా 40 శాతం లోపు వాళ్ళకి సహాయం చేద్దామనే” అని తిరస్కరించారు. అది చక్రపాణి గారి ఉన్నత సంస్కారం. అదే మరొకరైతే, ట్యూషన్ డబ్బు కోసం ఠకీమని ఒప్పేసుకునే వారు. అఫ్ కోర్స్, ఎందుకైనా మంచిదని మా నాన్న గారు అయోధ్యారామం అనే ప్రెవేటు మేష్టారి దగ్గర నన్నూ, మా తమ్ముణ్ణీ, చెల్లెళ్ళనీ ట్యూషన్ కి పెట్టారనుకొండి. అది వేరే విషయం. ఆయన ప్రెవేటు కన్నా శొంఠి పిక్కలకి ప్రఖ్యాతి.

గాంధీ నగరం స్కూల్ కి వచ్చిన తరువాత మాకు చాలా నచ్చిన మరొక టీచర్ నరసాయమ్మ గారు. ఆవిడ చరిత్ర, ఇంగ్లీషు చెప్పేవారు అని జ్ఞాపకం. అంతకంటే ముఖ్యంగా మంచి కథలు చెప్పేవారు. పైగా ఆవిడ భర్త గారు మా నాన్న గారి లాగానే లాయర్ గారు. పి,ఆర్. కాలేజ్ గోడలో గుండ్రంగా తిరిగే చిన్న గేటు దగ్గర రామారావు పేటలో మూడు లైట్ల జంక్షన్ రోడ్డు చివర ఉండేవారు. ఇప్పుడు ఆ గేటు లేదు. మా టీచర్లందరిలోకీ కొంచెం తమాషాగా ఉండేది మా డ్రిల్ మేస్టారు. ఆయన పేరు వెంకటేశ్వర రావు గారు అని జ్ఞాపకం. బహుశా ఈండ్రపాలెం..ఇప్పుడు ఇంద్రపాలెం అని షోగ్గా పిలవడం విన్నాను… నుంచి రోజూ సైకిల్ మీద మా ఇంటి మీద నుంచే స్కూల్ కి వెళ్ళేవారు. “ఒరేయ్, నువ్వు బ్రేమ్మల పిల్లాడివి. నాజూకు వెధవ్వి. నీకు ఇలాంటి ఆటలు పనికి రావు. ఆడితే చస్తావ్. కావాలంటే చదరంగంలో కూచో” అని నన్ను కబాడీ, కోకో లాంటి ఆటలు ఎక్కువ ఆడనిచ్చేవారు కాదు. ఉట్టి డ్రిల్ మాత్రం చేయింఛే వారు. అప్పుడు ముమ్ముడి సూర్యనారాయణ గాడు “పరవా లేదు సార్, నేనే వాడి తరఫున ఆడతాను..వాడు ఉట్టినే ఆటలో అరటి పండే” అని నన్ను కబాడీ టీములో వేయించే వాడు. వాడు పరిగెడుతుంటే నేను కూత కూసే వాణ్ణి. అలాంటి కూతలు ఇంకా కూస్తూనే ఉన్నానని మా క్వీన్ విక్టోరియా అప్పుడప్పుడు వాపోతూ ఉంటుంది.

గాంధీ నగరం స్కూల్లో హెడ్మాస్టారి రూము పక్కనే దొర గారి రూమూ, సైన్స్ పరిశోధన శాలా ఉండేవి. మా ఎస్.ఎస్.ఎల్.సీ లో దొర గారే మా సైన్స్ టీచరు. నా జీవితంలో ఆయన చెప్పినంత ఆసక్తి కరంగా అటు భౌతిక శాస్త్రం కానీ, రసాయన శాస్త్రం, బోటనీ, బయాలజీలు కానీ బోధించగలిగే మరొక ఉపాద్యాయులు ఉంటారని అనుకోను. పైగా ఆయన చండశాశనుడు. అర క్షణం ఆలస్యంగా వచ్చినా, క్లాస్ జరుగుతుండగా కిటికీలోంచి రోడ్డు మీద వెళ్తున్న బస్సు ని చూసినా, ప్రశ్నలకి తడబడుతూ సమాధానం చెప్పినా, హోమ్ వర్క్ చెయ్యకపోయినా, చేసిన హోమ్ వర్క్ లో నిర్లక్ష్యం కనిపించినా, అమ్మాయిల బెంచీకేసి అరక్షణం తలతిప్పినా, ..ఇలా ఒకటేమిటి….ఎప్పుడు, ఎక్కడ ఎలా క్రమ శిక్షణ కి లోపం వచ్చినా అయిందే మన పని. అలా అని, అయన ఎవరినీ కొట్టడం, ఘట్టిగా తిట్టడం ఉండేది కాదు.

ఏ విద్యార్ధి అయినా చిన్న తప్పు చేసినా దొరగారు చూశారేమో అనే భయం వెంటాడేది. అయినా, ఆయనంటే ఎంతో గౌరవంగా ఉండే వాళ్ళం. ఆయన పాఠాలంటే ప్రపంచం మర్చిపోయి వినేవాళ్ళం. నేను రెండేళ్ళ క్రితం మా స్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల తొలి సమావేశానికి హాజరయ్యాను. ఎవరో ఒకరిద్దరు నిర్వాహకులకి నేను తెలిసినప్పటికీ నా హోదా ఆటలో అరటిపండే. అప్పుడు నేను వేదిక మీద ఉన్న దొర గారికి భయం, భయంగా పాదాభివందనం చెయ్యగానే ఆయన నన్ను చూసి “ఏరా. రాజా ఎలా ఉన్నాడు రా?” అని అడిగారు. అది నాకు మహదానందాన్ని కలిగించింది ఎందుకంటే…నన్ను చూసి మా తమ్ముడు అనుకుని, యాభై ఏళ్ళ తరవాత కూడా వాణ్ణి గుర్తుపట్టి, వెను వెంటనే నా యోగక్షేమాలు దొర గారు అడిగారూ అంటే….నేనూ, మా తమ్ముడూ ఎంత అదృష్టవంతులమో కదా అనిపించింది. అదే సభలో ఇ,వి.ఆర్. రామ్ మోహన్ రావు గారూ, అలనాడు నా ఫోర్త్ ఫారం లో నా క్లాస్ మేట్ అయిన ఆయన అర్ధాంగినీ కూడా కలుసుకున్నాను. ఎక్కువ మాట్లాడే అవకాశం కలగ లేదు.

ఆ రోజుల్లో ప్రతీ క్లాస్ కీ విధిగా దొర గారూ, ఇ.వి.ఆర్ రామ్మోహన్ రావు గారూ, చక్రపాణి గారూ, ఇతర ఉపాధ్యాయుల నిర్వహణలో జరిగే వక్తృత్వ పోటీలూ, వ్యాస రచన పోటీలూ మొదలైనవి తలుచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇవి ఏడాదికి కనీసం రెండు, మూడు సార్లు జరిగేవి. ప్రతీ పోటీకీ ఏదో ఒక సబ్జెక్ట్ ఇచ్చి, దాని మీద వాద. ప్రతివాద పోటీలు పెట్టే వారు. ఈ పోటీలు తెలుగు, ఇంగ్లీష్, హిందీలలో విడి విడిగా ఉండేవి. ఇక “కత్తి గొప్పదా, కలము గొప్పదా?”, లేక ’స్త్రీలకు విద్య అవసరమా, అనవసరమా?” లాంటి సాధారణమైన అంశాల నుండి, “సూయెజ్ కెనాల్ ఎవరి ఆధ్వర్యంలో ఉండాలీ?” లాంటి అలనాడు అంతర్జాతీయంగా అత్యంత కలకలం సృష్టిస్తున్న సమస్యల మీద చర్చావేదికలు మా ఉపాధ్యాయులు నిర్వహించే వారు. ఇలాంటి చర్చలు ఐక్యరాజ్య సమితి వేదికలు గా తీర్చి దిద్ది, ఒక్కొక్క విద్యార్ధీ ఒక్కొక్క దేశం తరఫున తమ వాదనలు వినిపించే వారు. అందులో నాది ఎప్పుడూ భారత దేశం తరఫున నెహ్రూ గారి పాత్రే!. అందు చేత నేను రోజూ పేపర్లు చదువుతూ, నెహ్రూ గారి ఉపన్యాసాలన్నీ కత్తిరించుకుని దాచుకుంటూ, రేడియోలో వార్తలు ఖచ్చితంగా వింటూ ఉండేవాణ్ణి. ఆ వార్తలు కూడా పార్కులో ప్రతీ సాయంత్రం ఆరు గంటలకి వచ్చినప్పుడు మొత్తం గాంధీ నగరం జనాభా అంతా అక్కడే ఉండే వారు.

మా స్కూల్ లో ఐక్యరాజ్య సమితి వేదిక పెట్టినప్పుడు నేను కాంగ్రెస్ టోపీ పెట్టుకుని, కోటు వేసుకుని, గులాబీ పువ్వు పెట్టుకుని మాట్లాడేవాడిని. ఇక రష్యా ప్రధాని కృశ్చెవ్, అమెరికా తరఫున ఐసెన్ హోవర్, యుగోస్లావియా ప్రెసిడెంట్ టిటో, ఈజిప్ట్ ప్రెసిడెంట్ గమాల్ అబ్దుల్ నాజర్ లాంటి అత్యంత ప్రతిభావంతుల పాత్రలు మిగిలిన విద్యార్ధులు వేసే వారు. ఆ నాటి ఆ అనుభవాలే ఈ నాడు నన్ను ఈ విధంగా తీర్చిదిద్దాయి అనడంలో అతిశయోక్తి లేదు. అప్పుడు నేను గెలుకున్న వెండి పతకాలు పాతిక పైగా ఇంకా నా దగ్గర అమెరికాలో ఉన్నాయి.

ముక్తాయింపు:

ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతయినా ఉంది కానీ, సుమారు నాలుగేళ్ల క్రితం నేను కాకినాడ వెళ్ళినప్పుడు, నేను చదువుకున్న మ్యునిసిపల్ హైస్కూల్ ఎలా ఉందో అని చూడడానికి వెళ్ళాను. గుమ్మంలో ఉండగానే ఒక దుండగీడులా ఉండే గుండు కుర్రాడు కనపడ్డాడు. పైన ఇంగ్లీషు లో ఉన్న బోర్డ్ చూసి అనుమానం వచ్చి “ఇది గాంధీనగరం పురపాలకోన్నత పాఠశాలే కదా?” అని పలకరించాను. “ఏమో సార్, దిస్ ఈజ్ Mahatma Gandhi Memorial High School, సార్” అన్నాడు. “ఓహో, మరి నువ్వేం చదువుతున్నావ్, అబ్బాయ్?” అని అడిగాను. ఆ కుర్రాడు నా మొహం చూసి “అయామ్ ఇన్ ఫోర్త్ ఫారం. సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్.” అని గర్వంగా గుండు తల ఎగరేశాడు.

నేను కొంచెం జుట్టు పీక్కుని “నేను తెలుగులో అడిగాను కదా. మరి నువ్వు ఇంగ్లీషులో సమాధానం చెప్పావేం?” అని అడిగాను. వాడు చిన్న నవ్వు నవ్వి “మీ మొహం ఎన్నారై మొహం సార్.” అని కిచ కిచలాడాడు. “ఒహో, ఆ రూట్లో వచ్చావా?” అని స్కూల్ లోపలికి అడుగుపెట్టాను. చుట్టూ చూడగానే నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. స్కూల్ గోడలన్నీ వెల, వెలబోతూ, నల్లటి వర్షం నీటి చారకలతో కళావిహీనంగా ఉంది. ఒక గదిలో పిల్లలు నేల మీద కూచుని చదువుకుంటున్నారు. ఎక్కడా స్కూల్ బల్లలు లేవు. మేష్టారి కోసం మాత్రం ఒక పాత కాలం కుర్చీ ఉంది. అదే గదిలో నేను నా ఎస్.ఎస్.ఎల్.సీ చదువుకున్నాను. అప్పుడు బల్లలూ, మంచి బ్లాక్ బోర్డూ, అన్నీ ఉండేవి. వెంటనే హెడ్మాస్టారి గదికి వెళ్ళి పరిచయం చేసుకుని పరిస్థితి తెలుసుకున్నాను. పదవ తరగతి ఎంట్రెన్స్ పరీక్షలకి బల్లలు లేక ఆయన తన స్వంత ఖర్చుతో అద్దెకు తీసుకునే పరిస్థితిలో స్కూల్ ఉంది అనీ, అన్నింటికీ కార్పొరేషన్ వారే బాధ్యత అనీ వివరించారు. వెంటనే కార్పొరేషన్ మేయర్ గారిని కలిశాను.

MGMh 2

“కేవలం ఉపాధ్యాయులకి జీతం ఇవ్వడానికి తప్ప, గోడలకి వెల్లవెయ్యడానికీ, బల్లలు కొనడానికీ, సైకిల్ స్టాండ్ కీ, ఆఖరికి ఆడపిల్లలకి టాయిలెట్ సౌకర్యానికీ కూడా బడ్జెట్ లేదు” అని మేయర్ గారు చేతులెత్తేశారు. అదే స్కూల్ లో చదువుకుని కార్పొరేషన్ లో కౌన్సిల్ మెంబర్లగా ఉన్న వారిదీ అదే డైలాగు. అసంకల్పిత చర్యగా “మేము ఎలాగో అలాగ డబ్బు సంపాదించి, మా పాఠశాలకి కనీస సౌకర్యాలు కలిగించడానికి మీరు సహాయం చెయ్యలేకపోయినా, అడ్డు పడకుండా ఉండండి” అని వారి హామీ పుచ్చుకున్నాను. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఏమీ తోచ లేదు. కేవలం యాదృచ్చికంగా, దైవేఛ్చగా, ఇంచుమించు అదే సమయంలో మా స్కూల్ చూడగానే మరొక పూర్వ విద్యార్ధి, మా పక్కింటి వాడు, మా తమ్ముడి క్లాస్ మేట్ అయిన తురగా చంద్ర శేఖర్ కూడా అవే ఆలోచనలు వచ్చి నాలా బాధ పడి ఆగి పోకుండా వెంటనే కార్యాచరణకి దిగాడు. అతనితో చెయ్యి కలిపి అందరం కలిసి మా పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం స్థాపించాం.

హెడ్మాస్టారినీ, ఉపాధ్యాయులనీ, విద్యార్ధులనీ కలుసుకుని అర్జంటుగా కావలసిన సౌకర్యాల లిస్టు తయారు చేసుకుని, రెండేళ్ళలో, స్కూల్ బెంచీలు కొనడం, గోడలకి రంగులు వేయించడం, మంచి నీళ్ళ సదుపాయం, పిల్లల కాళ్ళకి చెప్పులు సప్లై మొదలైన మొదటి విడత పనులన్నీ పూర్తిచేశాం. నేను ఎక్కడో అమెరికాలో ఉన్న కారణం చేత కేవలం విరాళాలు పోగెయ్యడంలో సహాయం చెయ్యడం తప్ప, ఈ బృహత్కార్యం మా ట్రస్ట్ అధ్యక్షుడు చంద్ర శేఖరూ, సభ్యులు అబ్బూరి విఠల్, నరసింహా రావూ, రామకృష్ణ రాజూ, లక్ష్మణ రావూ (కార్పొరేటర్), బి.వి. రమణ (యెమెన్ దేశం) తదితరులూ హెడ్మాస్టార్ వేణుగోపాల రావు గారి సహకారంతో పూర్తి చేశారు. మేం అందరం డిశంబర్ 2012 లో మా ఉన్నత పాఠశాల డైమండ్ జూబిలీ సగర్వంగా జరుపుకుని, అప్పటి మా ఉపాధ్యాయులని గౌరవించుకున్నాం. అప్పటి కొన్ని ఫోటోలు ఇందుతో జత పరుస్తున్నాను. పూర్తి వివరాలూ, మా స్కూల్ వివరాలూ ఈ క్రింది వెబ్ లంకె లో చూడండి.
http://www.mgmh-alumni-trust.org/index.html
అలాగే నా ఎస్.ఎస్.ఎల్.సి. పట్టా కాపీ, ఆ రోజుల్లో ఇచ్చే కాండక్ట్ సర్టిఫికేట్ కూడా ఇందుతో జతపరుస్తున్నాను….ఎందుకంటే ….ఇవి అలనాటి తీపి గుర్తులు. కానీ
, ఈ కాండక్ట్ సర్టిఫికేట్ లో మొదటి మాటలు…అంటే..very fluent in speech, very rapid in speed of work, accurate observer, avove in ability అన్నవి చదవగలిగాను కానీ, ఆఖరి మాట ఇప్పటికీ చదవ లేక పోతున్నాను. బహుశా “బట్, టోటల్లీ యూస్ లెస్ ఫెలో” అని మా హెడ్ మాష్టారు అభిప్రాయపడ్డారేమో అని నా అనుమానం.
(ఈ వ్యాసం లో కొన్ని భాగాలు మా స్కూల్ వజ్రోత్సవ సందర్భంగా ఇది వరలో కౌముది లో వ్రాయడం జరిగింది)

-వంగూరి చిట్టెన్ రాజు,

హ్యూస్టన్, టెక్సస్ (అమెరికా)

మీ మాటలు

 1. బాలాంత్రపు వేంకట రమణ says:

  చిట్టెన్ రాజు అన్నయ్యా,
  మీ ఆత్మకథ అత్యద్భుతంగా నడుస్తోంది. ఒక్క మీ, మీ కుటుంబ సభ్యుల జీవిత విశేషాలే కాక, అలనాటి సాంఘిక, చారిత్రిక స్థితిగతులులన్నీ అతి చక్కగా, అత్యంత ఆసక్తికరంగా వివరిస్తున్నారు. పూర్తి అయిన తరవాత పుస్తక రూపంలో వచ్చితీరవలసిన ఆత్మ కథ ఇది.

  కాకినాడ లో మీరు చదువుకున్న బడి, PUC చదివిన కలేజి, ఇంజనీరింగ్ చదివిన కళాశాల – వీటన్నిటికీ మీరు చేస్తున్న సేవ అమోఘం, నిజంగా ఆదర్శప్రాయం. మిమ్మల్ని చూసి కాకినాడ గర్వపడుతోంది అంటే అతిశయోక్తి కాదు.
  భవదీయుడు
  రమణ బాలాంత్రపు
  సనా, యెమెన్ రిపబ్లిక్

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు నాయనా…

   ఇలాంటి పొగడ్తలు వింటూ ఉంటే సిగ్గేస్తుంది కానీ…బాగానే ఉంటుంది! అదే పెద్ద విచిత్రం….

మీ మాటలు

*