నీడ భారం


vijay

నేను మీ ముందుకు వొచ్చినపుడల్లా
నా లోపలి నీడ ఒకటి
నన్ను భయపెడుతూ వుంటుంది
ఈ నీడ ఎక్కడ మీ ముందు పడి
నన్ను అభాసుపాలు చేస్తుందో అని
అపుడపుడూ కంగారు పడుతుంటాను

నీడ చిక్కటి చీకటి లాంటి నీడ
రంగులు మార్చుకునే రాకాసి నీడ
తన అస్తిత్వాన్ని గుర్తించినపుడల్లా
నాకు మరింత భారంగా పరిణమించే నీడ

నీడ బయట కదా కనిపించేది
అని మీరంటున్నారు గానీ
నేను చెప్పేది నా లోపలే తిరుగాడే నీడని గురించి
అందు వలన చేత అది మీకు కనిపించదు లేక,
మీకది కనిపించకుండా నేను జాగ్రత్త పడతాను

ఈ నీడ ఇలా నాలో ఎప్పుడు జొరబడిందో మరి ?

నా పసితనపు అమాయకపు రోజుల్లో
నాలో స్ఫటిక స్వచ్చమైన నాకు తప్ప
మరే చీకటి నీడకీ స్థానం లేని జ్ఞాపకం
పెరిగే కొద్దీ నీడలేవేవో కమ్ముకుని ఇపుడిలా
నేనొక నీడకు ఆవాసమై వుంటాను

అప్పుడప్పుడూ
ఏ ఒంటరి గదిలోనో ఒక్కడినే వున్నపుడో, లేక,
వీధి కుక్కలూ , నేనూ తప్ప
మరొక జీవి యేదీ మేల్కొని వుండని ఏ అర్థరాత్రో
ఈ నీడ నాలో జడలు విప్పి నాట్యమాడుతుంది

1540514_505395279575961_1379096292_o

* * * * *

ఈ నీడని పూర్తిగా వొదిలించుకుని
నా పురా స్ఫటిక స్వచ్చ తనంతో
మీ ముందుకు రావాలనే నా ప్రయాస అంతా!

సరే గానీ
మీ లోపలి నీడ
మీకెపుడైనా తారస పడిందా ?

–      కోడూరి విజయకుమార్

painting: ANUPAM PAL

మీ మాటలు

 1. rajaram.t says:

  పురా స్ఫటికస్వచ్ఛదనంతో నీ నీడను వదిలించుకొని రావాలనే నీ తపన కవిత్వంగా అద్భుతమై అమరింది.

 2. దాసరాజు రామారావు says:

  అన్యాపదేశంగా అసహజ సమాజ క్రీడల్ని నీడ లా పోల్చడం బాగుంది.మచ్చపడని పసితనపు ఊహే కవిని ఈ కవిత రాయించింది కావొచ్చు. అభినందనలు ….

 3. కోడూరి విజయకుమార్ says:

  రాజారాం గారు …. రామారావు గారు …. మీ ఆప్త వాక్యాలకు ధన్య వాదాలు !

 4. ramakrishna says:

  విజయ్ కూమార్ గారూ..ఎప్పటిలాగానే మీపోయం సరళ గంభీరంగా ఉండి నన్ను ఆకర్షించింది.లోపలి నీడల్ని గుర్తించటమె ఒక అడుగు ముందుకేసినట్లుగా భావిస్తాను.బాగుంది. అభినందనలు

 5. లోపటి నీడ లేని మనిషి గానీ ఉన్నాడంటే
  ఆతను ఖచ్చితంగా వెలుపట నీడ లేని మనిషే …
  లోపల నీడ లేదని గానీ అన్నాడంటే
  అతను ఖచ్చితంగా లోపటి నీడను దాచాడన్న మాటే …

  with regards …

మీ మాటలు

*