యుగకవి పాల్కురికి సోమనాథుడు

sangisetti- bharath bhushan photo

    ప్రథమాంధ్ర ప్రజాకవి పాల్కురికి సోమనాథుడు. ఇదే విషయాన్ని ప్రథమాంధ్ర కవి పాల్కురికి సోమనాథుడు అని డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ ఉద్యమం ఊపుమీద ఉన్నదశలో 2012లో ఆంధ్రజ్యోతిలో చర్చకు పెట్టారు. దీనికి ప్రతిస్పందిస్తూ ముత్తేవి రవీంద్రనాథ్‌, రామినేని భాస్కరేంద్రరావులు అసలు పాల్కురికి తెలంగాణ వాడే కాదు, మరొకరు తొలికవి ఎందుకు గారు? అంటూ తెలంగాణ ఉద్యమం మీద అక్కసుతో బురద పూసే పనిచేసిండ్రు. ఈ చర్చలో నేనూ పాల్గొన్నాను. వారు చేసిన తప్పుడు వాదనలు సాక్ష్యాధారలతో తిప్పి కొట్టడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగువారితో సామరస్య పూర్వకంగా చర్చలు జరిపి, అక్కడి పండితులు ఇప్పటి వరకూ ప్రచారంలో పెట్టిన అసత్యాలు, అర్ధసత్యాలపై వెలుగుని ప్రసరించి వాస్తవాలను  అందరికీ తెలియజెప్పాలి. ఇప్పటి వరకూ పాల్కురికి సోమనాథుడి రచనలు, రచనలపై విశ్లేషణ, పరిశోధన దాదాపు పదివేల పేజీలకు పైగా అచ్చు రూపంలో వచ్చాయి. అయితే ఇవన్నీ అందరికీ అందుబాటులో లేవు. ప్రత్యక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రస్తుత సందర్భంలో సోమనాథుడి మూర్తిమత్వాన్ని తెలంగాణ సోయితో మరొక్కసారి స్మరించుకునేందుకు ఈ సదస్సు కచ్చితంగా ఒక మైలురాయిగా నిలబడుతుంది.
‘యుగకవి’ పాల్కురికి సోమనాథుడి గురించి బండారు తమ్మయ్య మొదలు వేన రెడ్డి వరకూ, ఇప్పటికీ ఏదో ఒక విశ్వవిద్యాలయంలో ఆయన రచనలపై పరిశోధన జరుగుతూనే ఉన్నది. ప్రతి పరిశోధనలోనూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ తెలుగు సాహితీ చరిత్రకారులు సోమనాథుడికి ‘యుగకవి’ హోదా ఇవ్వలేదు.  ఇందుకు ప్రధానంగా ఆయన బ్రాహ్మణాధిపత్యాన్ని, బ్రహ్మణత్వాన్ని, జపతపాలను త్యజించి సామాన్యుడికి గౌరవమివ్వడమే కారణం. తెలుగు సాహిత్యంలో భాష, విషయము, ఛందస్సు ఈ మూడిరటిలోనూ నూతన పంథాలో రచనలు చేసి ప్రజా క్షేత్రంలో తిరుగుబాటు జెండా ఎగురేసిండు. ఆయన సృష్టించిన నూతన ప్రజా ఒరవడి ఆయన తర్వాతి తరం కూడా కొనసాగించింది. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది.
తెలుగు సాహిత్యంలో ఎన్నో ‘మొదళ్ళ’కు ఆయనే పునాది. దేశీ చంధస్సులో తొలి తెలుగు కావ్యంగా  ‘ద్విపద’గా బసవపురాణాన్ని రచించిండు. రాజులు, రారాజుల చరిత్రగాదు, మడివాలు మాచయ్యలు, బొంతల శంకరదాసుల జీవిత చరిత్రలే ఆయన కథా వస్తువులు. జాను తెనుగు, దేశీ చంధస్సులోనే గాదు తీసుకున్న వస్తువులోనూ నూతన ఒరవడి సృష్టించిన ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ప్రగతిశీలి. అభ్యుదయవాది. శతక సాహిత్యానికి బ్రతుకుగా, ఉదాహరణ వాఙ్మయానికి దిక్సూచిగా, గద్యలకు కొలబద్దలుగా, వచనాలను అనిర్వచనీయాలుగా, జీవిత చరిత్రలను సామాజిక చరిత్రలుగా తీర్చిదిద్దిన అసలైన ఆధునికుడు. సామాన్యుడు కేంద్రంగా చరిత్రను తిరగరాసిన సంస్కరణాభిలాషి.
నన్నయాదుల కాలం నుండి బాగా వేళ్ళూనుకొని పోయిన వైదిక మతాన్ని తిరస్కరించిండు. అరూడ గద్యాది  రచనలు సంస్క ృత భాషా భూయిష్టమై కేవలం పండిత లోకంలో ఆదరణ పొందిన సాహిత్యాన్ని సామాన్యుడే మాన్యుడని తలంచి అందరికీ అందుబాటులోకి తెచ్చిన వాడు పాల్కురికి. సంస్క ృత వృత్తాలను వదిలి ‘ద్విపద’లో బసవ పురాణాన్ని రచించిండు. ద్విపదలో రచనలు చేసిన మొట్టమొదటి సాహితీవేత్త. ఈ ఛందస్సుకు ‘ద్విపద’ అని నామకరణం చేసింది కూడా పాల్కుర్కియే! ‘‘ఆంధ్రావళి నాలుకపై నాట్యమాడుతున్న ఈ ఛందస్సు వేదంలోని ‘‘ద్విపద’’వలె పవిత్రమైనది. ప్రాచీనమైనది సుమా అన్నట్టు ‘ద్విపదు’ అని విలక్షణమైన పేరు పెట్టినవాడు సోమన. కొందరపోహ పడుతున్నట్టు ఈ ద్విపదకు ప్రాకృతంలోని ద్విపదితోను, హిందీలోని దోహాతోను పొత్తు లేదు. ఇదిక స్వతంత్రమైన తెలుగు దేశీ ఛంధస్సు’’ అని నిడుదవోలు వెంకటరావు ‘సోమన సృష్టించిన ఛందస్సు’ అనే వ్యాసంలో నిరూపించిండు.  ప్రాచీన పురాణాలను వదిలి గురువు కేంద్రంగా రచనలు చేసిండు. సోమనాథుడి భాషతో పాటు, రచనా ప్రక్రియలు కూడా సామాన్య ప్రజలకు సులభంగా గ్రాహ్యమయ్యేటివే! ఈయన రచనలు తెలుగు జాతి తొలి విజ్ఞానసర్వస్వాలుగా చెప్పుకోవచ్చు. ఈయన తర్వాతి తరం వారయిన తిక్కన మొదలు అన్నమాచార్యతో పాటుగా 20వ శతాబ్దం వరకు కూడా కవులపై సోమనాథుడి ప్రభావముంది.
‘‘ఉరుతర గద్య పద్యోక్తులకంటె
కూర్చెద ద్విపదల కోర్కె దైవార
అరూఢగద్య పద్యాది ప్రబంధ
పూరిత సంస్కృత భూయిష్ఠ రచన
మానుగా సర్వ సామాన్యంబు గామి..’’ అంటూ జాను తెనుగు విశిష్ఠతను వివరించిండు. నన్నయ తెలుగు కవితలో ప్రవేశపెట్టిన మార్గ పద్దతిని నిరసిస్తూ దేశీ కవితా విధానాన్ని ఒక తిరుగుబాటు సాహిత్యంగా సోమనాథుడు సాహిత్యంలోకి తీసుకు వచ్చాడు. ‘‘అమల సువర్ణ శృంగ యుత కపిల గోశతంబు దానమిచ్చిన ఫలంబు భారత శ్రవణంబున గల్గునని తలంచి భారత శ్రవణాభిరతులైన రాజన్యులను మెప్పించుటకు గాక’ అంటూ భారతానికి తాయిలాలు ఇచ్చి ప్రచారంలో పెట్ట చూడడాన్ని పాల్కురికి నిరసించిండు. శైవ మతమును సామాన్యుడు పునాదిగా ప్రచారంలోకి తీసుకొచ్చిండు. అంతే కాదు త్రిపురుషా పూజా విధానాన్ని, జప హోమాదులతో కూడిన వైదిక మతమును’ తూలనాడి కులాలకు అతీతమైన వీరశైవ మతాన్ని ఆచరించి ప్రచారం చేసిండు. అనువాదాలైన భారతాన్ని వదిలి, నన్నయ నిరాకరించిన ద్విపదలోనే బసవ, పండితారాధ్యుల జీవితాలను చరిత్రలుగా రచించిండు. అంతే గాకుండా దేశీ రచనా ప్రక్రియలను కూడా చేపట్టిండు. అంతకు ముందు ఈ ప్రక్రియలు కేవలం చంధోగ్రంథాల్లో మాత్రమే ఉన్నాయి. వాటికి కావ్య గౌరవాన్ని ఈయన కల్పించిండు. ఉదాహరణములు, రగడ, సీసములు, శతకము, గద్యము, అష్టకములు మొదలైన వాటిలో రచనలు చేసిండు.

ఈ దేశీయ రచనా రీతులకు ఒక అస్తిత్వాన్ని కల్పించిన వాడు పాల్కురికి. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి దేశీ రచనలను చేయడమే గాకుండా దేశీయ సంప్రదాయాలను, భాషా, సాహిత్య, నాట్య, సంగీత, చారిత్రక, స్థానికాచార వ్యవహారాలు, జీవితాలను, సామాజిక పరిస్థితులను ఈయన రచనల్లో చోటు చేసుకున్నవి. శ్రీశైల వర్ణనలతో పాటుగా దేశీయుల ఆచార వ్యవహారాలు, శివరాత్రి జాగారము, పాటలు, పద్యాలు, గీతాలు, స్తవాలు మొదలగు సాహిత్య సామాగ్రిని, నాట్య భంగిమలను, నాటక ప్రదర్శన పద్ధతులను, భరత నాట్య ప్రయోగాలు, సంగీత శాస్త్రంలోని 108 రాగాలను తాళములు, మూర్ఛనలు, మద్దెళ్ళు గురించి తాను జీవించిన 1160`1240ల నాటి తెలుగు/కన్నడ సమాజాన్ని పాఠకుల ముందుంచాడు. ఆయన కాలంనాటి ఆటలు`పాటలు, విద్యలు`వినోదాలు, పత్తిరులు`పండ్లు, కొండలు, నదులు, మకుటములు, వస్త్రములు, వీణలు, రాగములు ఇలా ఒకటేమిటి అనేక విషయాల్ని తన రచనల్లో తెలిపిండు. ముఖ్యంగా పండితారాధ్య చరిత్రలో. సోమనాథుని కాలం నాటి సాంఘిక జీవనాన్ని తెలుసుకోవడానికి పండితారాధ్య చరిత్ర ఒక విజ్ఞానసర్వస్వం లాంటిదని తిమ్మావరa్జల కోదండరామయ్య తన ‘తెలుగుజాతి తొలి విజ్ఞాన సర్వస్వం’ అనే వ్యాసంలో చెప్పిండు.

‘‘తెలుగు కవులలో ఈయన వలె ప్రజలకు యింత సన్నిహితంగా వుండిన కవీ, తెలుగు ప్రజా జీవనమును యింత చక్కగా న కావ్యంలో ప్రదర్శించిన కవీయ యీయన ఒక్కడు మాత్రమే’’ అని కూడా తిమ్మావరa్జల అన్నడు. ఆనాటి ఆభరణాలైన ‘కంచు మట్టెలు, ఉంగరములు, వల్దయూరులు, నల్ల గాజులు, తగరపు కడియములు, పచ్చ గాజు పూసలు, సంకు పూసలు, నల్లపూసల బన్నసరము’ మొదలైన వాటి గురించి ఈయన రచనల ద్వారా తెలుస్తుంది. ‘రాగుంజు పోగుంజులాట, కుందెన గుడిగుడి గుంజంబులాట, అప్పల విందుల యాట, చప్పట్టు, సరిగుంజులాట, పేరబొంతల యాట, సిట్ల పొట్లాట, గోరంటాలాట, దాగుడు మూతలాట, దిగు దిగు దిక్కొనునాట’ అనే క్రీడా విశేషాలు ఆనాటి కాలంలో ఉండేవని పాల్కురికి రచనల ద్వారా తెలుస్తుంది. కేవలం ఆటలు తెలుసుకొనుట కాదు. ఇది ఆనాటి తెలుగు సమాజం నడిచి వచ్చిన దారిని పట్టిస్తుంది. చరిత్రను చిత్రిక గడుతుంది. ఈయన రచనలు తరచి తరచి చదివిన కొద్దీ ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ స్థానిక శూద్రకులాలకు చెందిన వారైన కుమ్మరి గండయ్య, బెజ్జ మహాదేవి, మడివాళ మాచయ్య, మాదర చెన్నయ్య, తదితర  జీవితాలను కథలుగా బసవపురాణంలో చెప్పిండు. తెలంగాణ ఆచార వ్యవహారాలే గాకుండా ఇప్పటికీ నిఘంటువుల్లోకి ఎక్కని ఎన్నో పదాలు ఈయన రచనల్లో కనిపిస్తాయి. పదాలు, పద బంధాలు, సామెతలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయంటే వాటి ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సోమనాథుడు అవసాన దశలో రాసిన ‘పండితారాధ్య చరిత్ర’  తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వంగా పండితులు పేర్కొన్నారు.

రాజులకు, దేవుళ్ళకు పుస్తకాల్ని అంకితమియ్యడం తెలుగు సాహిత్యంలో కొత్తేమి కాదు. అయితే సోమనాథుడు శివభక్తుడైన గోడగి త్రిపురారికి తన అన ‘అనుభవసారము’ గ్రంథాన్ని అంకితమిచ్చాడు. బవవేశ్వరుడు ప్రచారం చేసిన శైవమతములో భక్తియే ప్రధానమైనది. జాతి, మత, లింగ వివక్షలు లేవు. వేదోక్త కర్మల నిరసన, శివోత్కర్ష, భక్తిచే భగవంతుని పలికించుట ఈ వీరశైవము లక్షణాలు. గురులింగ, జంగమ, ప్రసాదాదులు, విభూతి, రుద్రాక్షాది చిమ్నాలు ఈ మతముతో ముడి పడి ఉన్నాయి.
సోమనాథుడు ప్రచారం చేసిన వీరశైవము వేదకర్మలను నిరసించినదనేది ఒక పార్శ్వం. దానికి రెండో ముఖం స్త్రీ పురుషుల సమానత్వానికి, సర్వమానవ సౌభ్రాత్రమును కోరుకున్నది. నేటికీ స్త్రీ సమాన హక్కు ఇవ్వ నిరాకరింపబడుతుండగా, 900ల యేండ్ల క్రితమే సాహిత్యంలో సమానత్వాన్ని పాటించిన అభ్యుదయ వాది పాల్కుర్కి. పండితారాధ్య చరిత్ర పురాతన ప్రకరణములలో ‘గురుభక్తాండారి కథ’లో అజ్ఞాని అయిన గురుభక్తాండారికి వేశ్యచే శ్వేతుని కథ, మహహుణుని కథ చెప్పించి ‘హితలగు కాంతల బుద్ధులేవెంట హితము కాకేల యొండగున’ని నిరూపించినాడు. స్త్రీలకు పురుషులతో సమానంగా దీక్షాధికారములిచ్చి గౌరవించినాడు. నిమ్న జాతి భక్తులకు కావ్య గౌరవం కల్పించిన దార్శనికుడు పాల్కురికి. వీరశైవములో భక్తుల కష్టార్జితాలకు విలువెక్కువ. ప్రతి భక్తుడు ఏదో ఒక శారీరక శ్రమతో కూడిన పనిని చేయాల్సిందిగా సోమనాథుడు నిర్దేశించిండు. శ్రమైక జీవన సౌందర్యాన్ని గుర్తించిండు. అందుకే మడివాలు మాచయ్య భక్తుల బట్టలుతకడం వృత్తిగా, శంకరదాసి బొంతలు కుట్టి జీవించే వృత్తిని స్వీకరించిండు.
ఈయన రచనలన్నీ గురువు కేంద్రంగా రాసినవే! అందుకే పాల్కురికి రచనల్లో బసవేశ్వరుడు, పండితారధ్యుడు ఇద్దరూ ప్రముఖంగా కనిపిస్తారు. వీరిలో ఒకరు వీరశైవాన్ని మరొకరు ఆరాధ్య మతాన్ని ప్రచారం చేసిండ్రు. సోమనాథుడు సంస్కృతాంధ్ర, కర్నాట భాషల్లో అనేక రచనలు చేసిండు. వీటిలో ‘బసవ పురాణం’, పండితారాధ్య చరిత్ర, అనుభవసారం, చతుర్వేద సార సూక్తులు, సోమనాథ భాష్యం, రుద్ర భాష్యం, బసవ రగడ, గంగోత్పత్తి రగడ, శ్రీ బవసాధ్య రగడ, సద్గురు రగడ, చెన్న మల్లు సీసములు, నమస్కార గద్య, వృషాదిపశతకం, అక్షరాంక గద్య పద్యాలు, పంచప్రకార గద్య, అష్టకం, పంచక, బసవోదాహరణం, మల్లమదేవి పురాన: (అలభ్యం), మొదలైన రచనలున్నాయి. తొలి తెలుగు శతకం ‘వృషాధిప శతకము’ రచయిత కూడా ఈయనే. ‘బసవా, బసవా వృషాధిపా!’ అనే మకుటంతో 108 చంపక, ఉత్పలమాలలతో ఈ పుస్తకం రాయబడిరది. ఇందులో బసవుడి జీవితానికి సంబంధించిన ఘటనలు రికార్డయ్యాయి.  బసవన కేవలం మతాచార్యుడు, భక్తుడే కాదు, ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవనాన్ని సంస్కరించిన సంఘ సంస్కర్తగా, భక్త శిఖామణిగా, వృషాధిపుని అవతారంగా పాల్కురికి రచనలు చేసిండు. నిజానికి వీరశైవ మత ప్రచారానికి సోమనాథుడు ఒక ఉద్యమకారుడిగా పనిచేశాడు. పాటల ద్వారా, రచనల ద్వారా, సభల ద్వారా, సంచారల ద్వారా మత ప్రచారం చేసిండు. సర్వస్వాన్ని శివుడికి, శివ భక్తులకు సమర్పించాలని ప్రచారం చేసిండు. నిజానికిది సామాజిక స్పృహకు పునాది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాట ముందు వరుసలో నిలిచింది. అయితే ఇందుకు ఆద్యుడు పాల్కుర్కియే! భక్తి ప్రచారానికి ప్రధాన వాహికగా పాటను/ గేయాన్ని ఎంచుకున్నాడు. ఇవి రగడ రూపంలో ఉన్న వీటికి యతి ప్రాస లక్షణాలున్నాయి. అక్షరాంక గద్యలో అ మొదలు క్ష వరకు మొత్తం 50 అక్షరాల్లో వనరుసగ నీ గద్యపాద ప్రథమాక్షరములు గూర్చి ఈ రచన చేసిండు. వీటిలో కొన్ని ఇప్పటికీ గ్రంథ రూపంలో రాలేదు. మరికొన్ని అలభ్యం.

index
యుగకవికి ఉండాల్సిన ప్రధాన లక్షణాల్లో తర్వాతి కాలం వారు కూడా అనుసరించగలిగిన మార్గాన్ని ఏర్పాటు చేయడం. ఈ పనిని పాల్కురికి సమర్ధవంతంగా నిర్వహించాడు. ఉదాహరణ, ద్విపదలు, వచనములు, వ్యాఖ్యానములు, శతక వాఙ్మయానికి ఆద్యుడైన పాల్కురికి వేసిన దారుల్లో తర్వాతి కవి పండితులు నడిచిండ్రు. భాష, భావన, రచన, విషయం అన్నింటిలోనూ ప్రత్యేకతను చాటుకుండు. పాల్కురికి ప్రభావం తిక్కన, రంగనాథరామాయణము రాసిన గోన బుద్ధారెడ్డి, గౌరన, చిన్నన రచనలపై ద్విపదల ప్రభావం, శ్రీనాథుడు కొంతమేరకు వస్తువులో, చంధస్సులో  పాల్కురికిని అనుసరించాడు. శ్రీనాథుడి హర విలాసానికి మూలం బసవపురాణమే! ధూర్జటి కాళహస్తి మహాత్మ్యము నందలి తిన్నని కథకు మూలం కూడా బసవ పురాణంలోనే ఉన్నది. హంసవింశతి, శుకసప్తతి రచయితలు కూడా పాల్కురికినే అనుసరించారు. ‘‘ఈతని (పాల్కురికి) సీసపద్యమలందుగల సొగసైన తూగు, సమత శ్రీనాథ పోతనల సీసపద్యముల చక్కని నడకకు దారి చూపినట్లు తోచు చున్నది. ‘మందార మకరంద’ యను సుప్రసిద్ధమైన పోతన సీసములో గనుపించు భావము, పోలిక సోమనాథుడివే.’’ అని వేటూరి ఆనందమూర్తి ‘తిక్కనాదులపై పాల్కురికి ప్రభావం అనే వ్యాసంలో తేల్చి చెప్పిండు. ప్రబంధకారులైన తెనాలి రామకృష్ణుడు, తాళ్ళపాక వారు, కృష్ణమాచార్యులకు మాతృకలు కూడా పాల్కురికి రచనలో ఉన్నాయనే విషయాన్ని సోదాహరణంగా ఆనందమూర్తిగారు వివరించారు.
ఈ దేశీ ప్రక్రియను తర్వాతి కాలంలో తాళ్ళపాక కవులు కూడా అనుసరించారు. వీరు మంజరీ ద్విపదలు, శతకములు, సీసములు, ఉదాహరణములు, రగడలు, గద్యలు మొదలైన ప్రక్రియల్లో రచనలు చేసిండ్రు. అంటే సోమనాథుడి రచనా ప్రభావం తర్వాతి తరం వారిపై ఎలా ఉండిరదో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు బ్రౌన్‌, కొమర్రాజు, నిడుదవోలు సుందరం పంతులు, వేటూరి ప్రభాకర శాస్త్రి, చిలుకూరి నారాయణరావు, బండారు తమ్మయ్య, నిడుదవోలు వెంకటరావు, నేలటూరి వేంకటరమణయ్య, శిష్టా రామకృష్ణశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, ఎమ్‌.ఆదిలక్ష్మి. వేనరెడ్డి, మహంతయ్య, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, తదితరులెందరో పాల్కురికి సోమనాథుడి ప్రతిభా పాఠవాలను పాఠకులకు తెలియజెప్పిండ్రు.
దక్షిణాదిలో ఒక వైపు రామానుజ మతం, వైష్ణవ మతం విజృంభిస్తున్న తరుణంలో దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నది వీరశైవం. సొంత ఆస్తి లేకుండా, ఉన్నదంతా శివభక్తులకు పంచాలనడమే గాకుండా, ప్రజల భాషకు కావ్య గౌరవం కల్పించిండు. అట్టడుగు వర్గాల ప్రజలే ఆయన రచనా వస్తువులు. కులాలకు అతీతంగా అందరిలో చైతన్యాన్ని ప్రోది చేసిన పాల్కురికి సోమనాథుడు తెలుగు సాహిత్యంలో తొలి కవి. ప్రజల పక్షాన నిలబడి అన్ని రకాల వివక్షలపై అక్షరాన్ని కరవాలంగా మలిచిండు. అలాంటి మహనీయుడి గురించి దేశ ప్రజలందరికీ తెలియాల్సిన అవసరముంది. అందుకుగాను ఆయన జీవిత చరిత్రను సాహిత్య అకాడెమీ/ జాతీయ బుక్‌ట్రస్ట్‌ ప్రచురించాలి. అలాగే ఆయన సమగ్ర రచనలు కూడా తెలంగాణ కల సాకారమైన సందర్భంగా పునర్ముద్రణ కావాలి. ఇంకా అలభ్యంగా ఉన్న రచనల్ని వెతికి పట్టుకోవాలి. తెలంగాణ జీవద్భాషకు అక్షర రూపమిచ్చిన ఆయన రచనల్లో ఇంకా నిఘంటువుల్లోకెక్కని పదాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని నిఘంటు రూపంలో తీసుకు రావాలి. తెలంగాణ సోయితో ఈ పనిచేయాల్సిన అవసరముంది.

-సంగిశెట్టి శ్రీనివాస్‌

మీ మాటలు

 1. ఆగష్టు 1,2 తేదిల్లో నెహ్రూ స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (జోగిపేట,మెదక్ జిల్లా) జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సులో చదివిన పత్రమిది.

 2. kavali raghavender says:

  చాల బాగా ఉంది సార్ మీ పత్ర సమర్పణ కాని తెలంగాణా కవులను ఇంకా గుర్తించే పరిశోదనలు జరగాలి

 3. ari sitaramayya says:

  పాల్కురికి తెలుగులో రాశాడు కాబట్టి తెలుగువాడు అనవచ్చు. కానీ తెలంగాణా వాడు అనటానికి ఆధారాలేంటో నాకైతే అర్థం కాలేదు. “తెలంగాణ ఉద్యమంలో పాట ముందు వరుసలో నిలిచింది. పాల్కురికి పాటలు రాశాడు. భక్తి ప్రచారానికి ప్రధాన వాహికగా పాటను/ గేయాన్ని ఎంచుకున్నాడు.” అందువల్ల ఆయన తెలంగాణా వాడు అంటున్నట్లుగా ఉంది మీ వాదన.

  చరిత్ర గురించి కొంచెమైనా అవగాహన ఉన్న వారికి ఎవరికైనా దేశాల, రాష్ట్రాల, ప్రాంతాల సరిహద్దులు తాత్కాలికమేనని తెలుస్తుంది. ఎప్పుడో ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాలనాటి కవిని, అసలు తెలంగాణా అనేమాట కూడా ఎప్పుడూ వాడని, తెలియని కవిని ఆయన మావాడు అనటం నాకైతే అర్థరహితంగా కనిపిస్తుంది.

  • మంజరి లక్ష్మి says:

   నాకు కూడా మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది.

 4. srinivas sangishetty says:

  తెలంగాణాలో పుట్టిన వాడిని తెలంగాణా వాడు అనకుండా తెలుగు వాడు అనడం కరెక్ట్ కాదు. ఇక్కడి కవులను తీసుకొని పోయి ఆంధ్రా వాడుగా ప్రచారం చేస్తున్న తరుణములో పాల్కురికి తెలంగాణా వాడే అని చెప్పడములోనే ఔచిత్యం ఉంటుంది. ఇప్పటికి పోతనను ఒంటిమిట్ట వాడిగా చెబుతున్న సంగతిని దృష్టిలో ఉంచుకుంటే ఈ విషయం అర్థమవుతుంది. మీ తెలుగువాడు అనే వాదనలో తెలంగాణా అస్తిత్వ నిరాకరణ ఉద్దేశమున్నట్లుగా అనుమానం కలుగుతోంది.

  • ari sitaramayya says:

   శ్రీనివాస్ గారూ, నా అభిప్రాయాల వెనుక ఉద్దేశాలేంటో నాకే స్పష్టంగా తెలియని పరిస్థితి నాది. మీకు నా మాటలేగాక వాటి వెనుక ఉన్న ఉద్దేశాలుకూడా అంత సులభంగా అర్థమైనందుకు మీ మానసిక శాస్త్రజ్ఞానానికి జేజేలు.

   యేసు క్రీస్తు మా బెతేల్హెం వాడు అని ఆ నగరం వాళ్ళు అనవచ్చు. మా మధ్య ఆసియా వాడు అని లెబనాన్ వాళ్ళు అనవచ్చు. మా వాడు అని యూదులు అనవచ్చు. మా వాడు అని క్రైస్తవ మతస్తులు అనవచ్చు.

   మా చిన్న నగరంలో పుట్టిన వాడిని ప్రపంచం అంతా మా వాడు అంటున్నారని బెతేహం వాళ్ళు గర్విస్తారు గాని లేదు మీ వాడు కాదు మా వాడే అని సంకుచితంగా మాట్లాడరు.

   ప్రతి మనిషి అస్తిత్వంలో రకరకాల పార్శ్యాలుంటాయి. మగవాడు, శైవుడు, తెలంగాణా వాడు, ఆంధ్రావాడు, తెలుగువాడు, తాగేవాడు, ఇలాగా. వీటిలో కొన్ని నిర్దిష్టమైనవి, కొన్ని కావు. ఈ రోజు తెలంగాణా వాడు ఆంద్రా వాడు కాడు. కాని తెలంగాణా వాడు తెలుగు వాడు కాకుండాపోడు (తెలుగు వారు కాని వారున్నారు. మాది తెలుగు కాదు అనేవారున్నారు. ఇది వారి గురించి కాదు.)

   “తెలంగాణాలో పుట్టిన వాడిని తెలంగాణా వాడు అనకుండా తెలుగు వాడు అనడం కరెక్ట్ కాదు,” అన్నారు మీరు. పాల్కురికి తెలంగాణాలో పుట్టలేదు. ఆయన పుట్టినప్పటికి తెలంగాణా లేదు. ఆపదమే లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే ఆయన పుట్టిన వూరు ఇప్పటి తెలంగాణాలో ఉంది అనండి.

   “ఇక్కడి కవులను తీసుకొని పోయి ఆంధ్రా వాడుగా ప్రచారం చేస్తున్న తరుణములో” … ఆయన పుట్టిన రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఏమని పిలిచేవారో నాకు తెలియదు. దాన్ని ఆరోజుల్లో ఆంధ్రా అనివుంటే, ఆతను ఆంధ్రా వాడు. తిరకాసు అని వుంటే ఆతను తిరకాసువాడు.

   “తెలంగాణా వాడు అనకుండా తెలుగు వాడు అనడం కరెక్ట్ కాదు.” మరోసారి. క్రైస్తవులు క్రీస్తు “మావాడు, బెతేల్హెం వాడు”, అనరు. తెలుగు వారు “పాల్కురికి మావాడు, తెలంగాణా వాడు,” అనరు. తెలుగు మాట్లాడేవారు తెలంగాణాలో ఉన్నా ఆంధ్రాలో ఉన్నా తెలుగు వారే. “ఆంధ్రా వాడు అనకుండా తెలుగువాడు అనటం కరెక్ట్ కాదు” అనటం ఎంత అర్థరహితమో, “తెలంగాణా వాడు అనకుండా తెలుగువాడు అనటం కరెక్ట్ కాదు” అనటం కూడా అంతే అర్థరహితం.

   సంకుచితత్వం వదిలేసి ఇంకోసారి ఆలోచించండి. మలేసియాలో ఉన్నా సింగపూర్ లో ఉన్నా స్వామినాథన్ తమిళుడే. అతని ప్రాంతీయ సంబంధం గురించి మాట్లాడేటప్పుడే అతన్ని సింగపూర్ వాడనో మలేసియా వాడనో చెప్తాం. అతని తమిళతనం ప్రాతీయతని అధిగమించే అస్తిత్వపార్శం.

   ముగించే ముందు, నాకు బాగా ఇష్టమైన రచయితల్లో పాల్కురికి ఒకడు. ఎప్పుడో నేను బసవపురాణం మీద రాసిన
   చిన్న వ్యాసం ఇక్కడ ఉంది.
   http://creative.sulekha.com/life-in-the-time-of-basava_99628_blog

 5. srinivas sangishetty says:

  అయ్యా సీతారామయ్య గారు మా వాడిని మా వాడు అనటమే సంకుచితమంటే ఎట్లా? అసలు విషయాన్ని కావాలని మీరు తప్పుతోవ పట్టిస్తున్నారు.
  పాల్కురికి తెలంగాణా వాడు. ఆయన్ని ఇప్పటి ప్రాంత పరంగా తెలంగాణవాడు అంటే అభ్యంతరమెందుకు? కేవలం ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆ పదం వాడడం జరిగింది. “ఆదికవి నన్నయ్య అవతరించెనట నిచట” అని రాజమండ్రి లో నన్నయ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చెసుకుండ్రు. మీకు రాజమండ్రి ఎట్లా గొప్పదో మాకు పాల్కురికి అంతే గొప్పది అని చెప్పడమే నా ఉద్దేశం. సోమనాథుడు ఒక్క తెలుగులోనే కాదు ఎనిమిది భాషల్లో రచనలు చేసిండు.అట్లాంటప్పుడు ఆయన్ని ఒక్క తెలుగుకు పరిమితం చేయడం సబబు కాదేమో! అయినా జాను తెనుగులో రాసినందుకు పాల్కురికిని తెలుగులో తొలి కవిగా గౌరవించుకుందాం.
  మీరు ఎన్ని చెప్పినా, “తెలుగువాడు” అనే విశాల వాదము ముసుగులో తెలంగాణా అస్తిత్వాన్ని నిరాకరిస్తున్నారు తప్ప మరేమి కాదు. ఒక సారి ఆంధ్రాతో దోస్తాని మూలంగా నాలిక కాలింది కాబట్టి ఇప్పుడు సల్ల కూడా వూదుకొని తాగాలి అన్న సోయి తోటే ఇక్కడ “ఆంధ్ర” ఊసు రాలేదు. ఇక మీరు చెప్పిన బెత్లేహాం కథలో బెత్లేహాం ని ఒక ప్రాంతంగానే చూశారు. కాని క్రీస్తు మాట్లాడిన భాష అరామిక్ (aramaic) గురించి చెప్పలేదు. ఇక్కడ కూడా ప్రాంత పరంగా తెలంగాణ గురించిచెబుతూ భాషా పరంగా తెలుగు గురించి చెప్పలేదు అనే విషయాన్ని గుర్తించగలరు. ధన్యవాదాలు..

  • ari sitaramayya says:

   శ్రీనివాస్ గారూ,

   మీ అభిప్రాయాన్ని మార్చాలనే ప్రయత్నంతో కాదు (ఉద్దేశంతో అసలే కాదు), నా అభిప్రాయాన్ని సమర్థవంతంగా చెప్పలేకపోయానేమో అనిపించి మరోసారి చెప్పే ప్రయత్నం చేసి విరమిస్తాను.

   “ఆదికవి నన్నయ్య అవతరించెనట నిచట” అని రాజమండ్రి లో నన్నయ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చెసుకుండ్రు. మీకు రాజమండ్రి ఎట్లా గొప్పదో మాకు పాల్కురికి అంతే గొప్పది అని చెప్పడమే నా ఉద్దేశం,” అన్నారు మీరు.

   ఇలా చెప్తే మీకు అర్థమౌతుందేమో. నన్నయ ఆంధ్రప్రదేశ్ వాడు కాదు. పాల్కురికి తెలంగాణా వాడు ఎలా కాడో, నన్నయ కూడా అలాగే అంధ్రప్రదేశ్ వాడు కాదు. నన్నయ ఎక్కడ పుట్టాడో, ఆయన పుట్టినప్పుడు ఆ ప్రాంతాన్ని ఏమని పిల్చారో నాకు తెలియదు. ఆంధ్ర ప్రదేష్ అనిమాత్రం పిలవలేదని తెలుసు. ఆయన ఆంధ్రప్రదేశ్ వాడు కాడు.

   ఇక విశ్వవిద్యాలయాల ఏర్పాటు గురించయితే, రాజహ్మండ్రిలో నన్నయ విశ్వవిద్యాలయం అని కాకుండా సోమనాథ విశ్వవిద్యాలయం అని పెడితే ఇంకా సంతోషంగా ఉండేది.

   ఇక గొప్పల విషయానికొస్తే నాకు ఆ గోల పట్టదు. ఇష్టం గురించి చెప్పమంటే మాత్రం నన్నయ కంటే పాల్కురికే ఇష్టం నాకు. ఆయన సంసృతంలో రాశాడు (అక్కడక్కడా తెలుగు మాటలు వాడాడు నిజమే), ఈయన తెలుగులో రాశాడు (అక్కడక్కడా సంస్కృతం వాడాడులెండి).

   “మీరు ఎన్ని చెప్పినా, “తెలుగువాడు” అనే విశాల వాదము ముసుగులో తెలంగాణా అస్తిత్వాన్ని నిరాకరిస్తున్నారు తప్ప మరేమి కాదు.” ముసుగుల్లో ఎందుకండీ, అలా రాయాల్సిన అవసరం కానీ, సమర్థత కానీ నాకు లేవు. మీరు నాకు లేనిపోని తెలివితేటలు అంటగడుతున్నారు. ఒక పాతిక సంవత్సరాలు పోయాక, ఇంకా తొందరలోనో, తెలంగాణా అస్తిత్వం అంటూ ఏదీ లేదని మీకే తెలుస్తుంది. ఆంద్రప్రదేశ్ అస్తిత్వం అనేది కూడా ఏదీ లేదంటేగాని మీకు అర్థం కాదేమో. అస్తిత్వాలు మనుషులకు ఉంటాయి, మానవ సమూహాలకు ఉంటాయి, రాష్ట్రాలకు ఉండవు.

   ధన్యవాదాలు.

 6. ఎశాల శ్రీనివాస్ says:

  ari sitaramayya garu

  భాష, ప్రాంతం, మతం మూడింటిని కలగలిపి మాట్లాడుతున్నారు -తెలంగాణా ప్రాంతం ఆరు దశాబ్దాల ఆదిపత్యాన్ని వదిలించుకుని స్వీయ అస్తిత్వం వైపు నడుస్తున్న వర్తమానాన్ని భాష పేరు మీద మాట్లాడుతున్నారు. భాష గురుంచి
  బాలగోపాల్ ఒక సారి మాట్లాడుతూ – కాటన్ బ్రిడ్గిని గోదావరి మీద కాకుండా అనంతపురంలో కట్టినట్లైతే ప్రామాణికమైన భాషగా అనంతపురం భాష ఉండేది, ఉభయ గోదావరి జిల్లాల భాష మాండలికంగా మిగిలిపోయేది. ఇది నిజం, భాష వాహిక మాత్రమే కాదు ఆదిపత్యాన్ని కూడా నిలబెడుతుంది. ఇది గుర్తించటానికి నిరాకరిస్తూనే తెలంగాణా మాండలికాల్ని ఉపయేగించిన పాల్కుర్కిని తెలంగాణా వాడు కాదు తెలుగు వాడనటం తెలంగాణాకు ఒక మాండలిక భాష అస్తిత్వమున్దని గుర్తించటానికి నిరాకరించటమే.
  ‘అస్తిత్వాలు మనుషులకు ఉంటాయి, మానవ సమూహాలకు ఉంటాయి, రాష్ట్రాలకు ఉండవు”
  మీకు అస్తిత్వం అంటేనే అర్థం తెలిసినట్టు లేదు. వైయుక్తిక అస్తిత్వాలే కాదు ఉమ్మడి అస్తిత్వాలు ఉంటాయి. రాష్ట్రాలకు ఉంటాయి కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాలలో నడుస్తున అస్తిత్వ ఉద్యమాలు మీ దృష్టికి ఇప్పటి వరకు రాకపోవడం అశ్యర్యంగా ఉంది.
  రెండవది ప్రాంతం- ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం మీద ఆదిపత్యం చేయాలంటే కేవలం ఆర్ధిక, రాజకీయ అణిచివేత ఒక్కటే సరిపోదు, దానితో పాటుగా మానసిక అణిచివేత కూడా కావాలి, అంటే నీ భాష మంచిది కాదు, మీకు తెలివిలేదు, మీదంతా చెత్త సాహిత్యం, మీదగ్గర గొప్ప సాహిత్య కారులె లేరు. అని నల్లవాళ్ళ మీద తెల్లవాళ్ళు ఆదిపత్యం చేసినా, తెలంగాణా మీద సీమంధ్ర ఆదిపత్యం చేసింది కూడా ఈ అణిచివేత తోటే.
  మూడవది మతం- ఈ భూమిమీద ఒక్క భ్రాహ్మనాది పత్యంలోని హిందూ మతం మాత్రమే నిచేన మెట్ల వ్యవస్థ తో తలుపులు మూకోంది. మిగిలిన మతాలు ముక్యంగా క్రిస్తియానిటి, ముస్లిం మతాలు ప్రాంతంతో సంభందం లేకుండా విస్తరించాయి. ఈ మతాలకు ప్రాంతం, భాషలతో సంబంధం లేదు.

  చివరగా- నీది, నీది కాదు, పేరుంటే మాత్రం నీవాడు కాదు, నీదగ్గర వెలుగు లోకి వచ్చిన ఏ అంశమైన అది నీది కాదు, అనే భావజాలం ఆదిపత్యం లోంచి వచ్చే భాష మత్రమే

  • ari sitaramayya says:

   అస్తిత్వాలు మనుషులకు ఉంటాయి, మానవ సమూహాలకు ఉంటాయి, రాష్ట్రాలకు ఉండవు – ఇవి నా మాటలు.

   “మీకు అస్తిత్వం అంటేనే అర్థం తెలిసినట్టు లేదు. వైయుక్తిక అస్తిత్వాలే కాదు ఉమ్మడి అస్తిత్వాలు ఉంటాయి.” ఇవి మీ మాటలు.
   జవాబు రాసే ముందు నా మాటలు మరొక సారి చదివుంటే బాగుండేది. మానవ సమూహాలకు అస్తిత్వాలుంటాయంటే ఉమ్మడి అస్తిత్వాలనే గదా సార్? కాదా?

   “రాష్ట్రాలకు ఉంటాయి కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాలలో నడుస్తున అస్తిత్వ ఉద్యమాలు మీ దృష్టికి ఇప్పటి వరకు రాకపోవడం అశ్యర్యంగా ఉంది.” నా దృష్టికి రాని విషయాలు చాలా ఉన్నాయి. నిజమే. కాని మీరు ప్రస్తావించిన విషయాల గురించి కొంచెం తెలుసు. కాశ్మీర్ లో ఉద్యమం రాష్ట ప్రజలందరిదీ కాదు. కొందరిది. ఈశాన్య రాష్టాల్లో ఉద్యమాలకు ఒక్కోదానికి ఒక్కొక ప్రాతిపదిక ఉంది. జాతి, మత, భాష, రాజకీయ ఆధారమైనవి. ఏ రాష్ట్రంలోనూ అందరి భావాలూ ఒకే విధంగా ఉండవు, అందరిదీ అని చెప్పదగిన అస్తిత్వం అంటూ ఉండదు. లేదు.

 7. ఎశల శ్రీనివాస్ says:

  ari sitaramayya గారు
  మెజారిటీ ప్రజలు కోరుకోనేదే అస్తిత్వం అంటారు అంతేకాని నూటికి నూరు శాతం ఎకాభిప్రయము భూమి మీద ఎక్కడ ఉండదు

మీ మాటలు

*