ఎగిరే పావురమా! ఐదవ భాగం

serial-banner5

ఐదవ భాగం

గడిచిన రెండేళ్ళల్లో, రాములు నాలుగు తడవలన్నా వాళ్ళ మామని చూడ్డానికని ఊరికి పోయింది. ఎప్పుడెళ్ళినా పొద్దున్నే పోయి సాయంత్రానికి తిరిగొచ్చేస్తది.

 

వచ్చాక మాత్రం ప్రతిసారి రెండు మూడు రోజులు ఏడుస్తూనే ఉంటది.

నాకు రాములుని అట్టా చూడ్డం కష్టంగా అనిపిస్తది.

తాతైతే ఇంకా ఎక్కువే బాధపడతాడు.

 

నెలకిందట  రాములు ఊరికి పోయొచ్చాక మాత్రం తాత ఆమెని కోప్పడ్డాడు.

 

“ఎందుకు పోయి భంగపడి వస్తావే? నీకు కనీసం ఒక్కపూట తిండి కూడా పెట్టించే ధైర్యం చేయని పెనిమిటి కోసం ఏందే నీ పరుగులు రాములు? “ అన్నాడు తాత కఠినంగా.

 

“కాదు సత్యమయ్యా, మామ నా ఇషయంలో చేసిన తప్పు తెలుసుకున్నాడు. బాధ పడుతున్నాడు. ఆరోగ్యం బాగా చెడింది. మనిషి సగమయ్యాడయ్యా.

తాగుడు, పొగాకు బాగా వ్యసనమైపోయాయి వాడికి.   ఏమౌతాడో?

ఆరోగ్యం చెడినా సంపాదన తగ్గద్దని, ఇంకా రేత్రిళ్ళు లారీ నడుపుతున్నాడు.

మామకి కాపలాగా తమ్ముణ్ణి పెట్టింది ఆ పెళ్ళాం. అందుకే నేనే పోయి కనీసం కళ్ళతో మామని చూసుకొనొస్తున్నా,” అంది రాములు తాతతో.

 

ఓపిగ్గానే విని, “ఈ తడవ నాకు నీ కష్టం చెప్పమాకు, నా కాడ ఏడవమాకు. నేనూ బాధపడాలా?” అన్నాడు తాత విసుగ్గా.

**

తాత ఈ మధ్య బాగా నీరసపడ్డాడు. తినడం బాగా తగ్గించాడని పిన్ని కూడా గోలెడుతుంది.. గత ఆర్నెల్లలో తాత రెండు తడవలు జబ్బుపడ్డాడు. బాగా చిక్కిపోయాడు.

మూన్నెళ్ళ కిందట ఆసుపత్రి వైద్యులు మందులిచ్చిన కాడినుండి గంజి, మజ్జిగల మీదే తాత బతుకుతున్నాడు.

 

తాతనట్టా చూడ్డం చాల దిగులుగా ఉంది.  నీరసించి, చేతనవక వారమేసి రోజులు ఇంటికాడే ఉండిపోతున్నాడు.

తోడుగా ఉంటానని నేను అడిగినా, “అమ్మో నువ్వు లేకపోతే పూజసామాను కాడ ఎవరుంటారు? పూజారయ్య ఊరుకోడు తల్లీ. నువ్వెళ్లాల్సిందే,” అని నన్ను గుడికి పంపేస్తున్నాడు తాత.

**

పొద్దున్నే పడక మీంచి లేస్తూనే, తాతకి కడుపులో మంట, దగ్గు, తట్టుకోలేనంతగా ఎక్కువయ్యాయి. ఎప్పటిలా బలవంతంగా నన్ను గుడికి పంపేసి చంద్రమ్మతో హడావిడిగా ఆసుపత్రికి పోయాడు తాత.

**

పగలంతా తాత గురించే గుబులు పడ్డాను. పనయ్యాక తాతని చూడాలని ఆదుర్దాగా కొట్టాం చేరేప్పటికి, తాత బయట నులక మంచం పైన తొంగొనున్నాడు. కాస్త ఎడంగా కూచుని చాటలో రాగులు చెరుగుతూ పిన్ని తాతతో గొడవ పడుతుంది.

 

తాత కాడికెళ్ళి కూచున్నాను. మాటలాపి చాట తీసుకొని పిన్ని లోనికెళ్ళింది.

తాతని చేత్తో తట్టి, “నొప్పి తగ్గిందా? మందులేసుకొన్నావా?” అని సైగతో అడిగాను. లేచి కూచున్నాడు తాత. నా చేయందుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొన్నాడు.

 

“అయ్యో చిట్టితల్లీ, బాగున్నానే. పనికెళ్ళలేక ఇప్పటికే చానా రోజులయింది. ఖర్చుకి, తిండికి, నా వైద్యానికే డబ్బులన్నీ అయిపోతున్నాయే,” అన్నాడు తాత దిగులుగా.

‘పర్లేదు తాత, నేనున్నాగా. చంద్రం పిన్ని ఉందిగా,’ అని సైగ చేసాను.

egire-pavurama5

 

ఉడికించిన అలసందలు ఉప్పేసి తెచ్చి తాత కందించింది పిన్ని.

“అన్నా, ఇటు నా మాట కాస్త విను. ఇక నీవిలా కష్టపడి పని చేయడానికి లేదు. డబ్బు లేదంటూ దిగులు పడుతూ మందులు కొనడానికి వెనకాడితే నేనూరుకోను. చేతనయినన్నాళ్ళు బాధ్యతలు మోసావు,” అంటూ నన్ను కాస్త జరగమని, నాకు – తాతకి మధ్యన చతికిల పడింది పిన్ని.

“ఇటు సూడన్నా, నువ్వే కాదా మాకున్న పెద్ద దిక్కు?

నీకేమన్నా అయితే నేనూ, గాయత్రి ఏమవ్వాలి?” అంది పిన్ని దిగులుగా.

 

“పోతే, వకీలు నీ వరిపొలం విడిపించగానే అమ్మేద్దాములే. నీ వైద్యానికి, అవసరాలకి అక్కరకొస్తుంది,” అని తాతతో అంటూ నా వైపు తిరిగింది చంద్రమ్మ.

 

“నీ కోసం రాగి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు మూతేసి పొయ్యి కాడ ఉంచానురా. నువ్వు తిన్నాక, గిన్నెలోకి తీసిపెట్టిన రాగిజావ తాత చేత తాగించు,” అంటూ తాతని లేపి, మెల్లగా కొట్టాంలోకి సాయం పట్టింది పిన్ని.

 

“నేనెళ్ళి ధర్మాస్పత్రిలో అన్నకి మందులు తీసుకొని రేపొస్తా. ఆడైతేనే కాస్త చవక. ఉచిత వైద్యమే ఐనా మనకీ ఖర్చవుతుంది,” అంటూ గబగబా వెళ్ళిపోయింది పిన్ని.

కాసేపు తాత కాడ కూచుని, పుస్తకం చదువుకున్నాకే, నేను తిని తాతతో జావ తాపించాను.

**

తెల్లారకముందే తడికలవతల వైపు నుండి పిన్ని మాట వినిపించింది. కళ్ళు విప్పి తొంగి చూస్తే వాకిట్లో కూచునున్నారు తాత, పిన్ని. తాత టీ తాగుతూ ఆమె చెప్పేది వింటున్నాడు.

“అన్నా, రేత్రి మా ఆయనతో మాట్లాడాను. నీ పొలం విడిపించడానికి డబ్బు ఖర్చవుతదంట. నీతిమాలిన నీ సవిత్తల్లి, పొలం కబ్జా చేయడంతో నీకీ దరిద్రం పట్టింది.

నువ్వేమో గాయత్రి డబ్బు దేనికీ ముట్టుకోనంటావు. పసిబిడ్డగా కాపాడి, పెంచి పెద్ద చేసి, దానికి ఒక బతుకు తెరువు కూడా ఏర్పాటు చేసావు.

ఇకనైనా గాయత్రి చింత మాని, నీ బాగోగులు చూసుకోవయ్యా.

నీ ఫించను డబ్బులున్నా, రోగం ముదిరితే మాత్రం, నీ మందులకి కూడా కష్టమౌతాదేమో,” అంది చంద్రం పిన్ని.

 

ఆమె మాటలు మెదలకుండా విన్నాడు తాత.

“లేదులేవే చంద్రం. నేను పనిలోకెడతా. గాయత్రి డబ్బు అలాగే ఉండనీ. పద్నాలుగేళ్ళు నిండాక గాయత్రిని పట్నంలో వైద్యుల కాడ సూపెట్టాలన్నారు పూజారయ్య. బోలెడంత ఖర్చవుతుందంట.

గాయత్రి విషయంగా పట్నంలో ఏదో వికలాంగుల సంస్థ ఉందంట. ఈ నెలలో ఆడికి కూడా పోయి మాట్లాడి వస్తాలే. నా పొలం సంగతికి నేనెళ్ళి వకీలు బాబుని కలుస్తాలే,” అన్నాడు తాత..

 

“అది కాదన్నా నేననేది,” అంటున్నామెని ఆపాడు తాత.

“అయినా ఆ పసిదాన్ని ఇంటికి తెచ్చినప్పటి పరిస్థితి నీ కెరుకే.

కన్నతల్లో, మరెవరైనా కసాయో? ఆ పసిదాని గొంతుకి గుడ్డ చుట్టి మరీ కాలువ గట్టున వదిలేసారు. అట్టాగని, పెంచిన నేను దాన్ని గాలికొదిలే లేనుగా!.

ఆ తల్లి దయలేని చర్య వల్లే, ఆ అఘాతం వల్లే, బిడ్డకి మాట రాకుండా అయిపోయిందని నా అనుమానం. ఆ పసిది పాపం! నలిగి నెత్తురోడే కాళ్ళతో, ఆ తుఫానులో ఒక్కరోజన్నా అలా పడుందేమో కదా,” అని కళ్ళు తుడుచుకున్నాడు తాత.

“అందుకే, నా ఊపిరి ఉన్నంత దాకా బిడ్డ జీవనం సరిచెయ్యాలనే ప్రయత్నం చేస్తానే చంద్రమ్మా. అయినా నా చిట్టితల్లి చిరునవ్వులు, నీ ఆప్యాయత చాలు – నా జీవనానికి,” అంటూ నన్ను నిద్ర లేపడానికన్నట్టుగా పైకి లేచి నా వైపుకి నడిచాడు తాత.

 

‘నన్ను కన్నతల్లి వదిలించుకుందని, తాత నన్నాదుకుని ఇంటికి తెచ్చాడని అప్పుడప్పుడు పిన్ని మాటల్లో ఇదివరకే తెలుసును.   కాని ఇప్పుడు తాత నా గురించి అన్నది వింటుంటే, పసిపిల్లగా అట్టాంటి బాధలో దొరికానా తాతకి? అని చానా కష్టమనిపించింది…..

 

ఇక పిన్ని కూడా ఏమనలేక పోయింది. “సరేలే అన్నా మళ్ళీ పనిలోకెడుతుండావు. రవ్వంత గమనించుకొని విశ్రాంతిగా ఉండు,” అంటూ లోనికొచ్చి పొయ్యి కాడికెళ్ళింది.

**

ఎన్నో రోజుల తరువాత పనిలోకొచ్చాడు తాత. కోవెల ఆవరణంతా ఊడ్చి వచ్చిన తాతకి, మంచి నీళ్ళిచ్చి పక్కనే కూచుంది రాములు.

 

క్షణమాగి, “అయ్యా, నేను నా మామ కాడికి ఎళ్ళిపొతున్నా. మంచాన ఉండాడంట.   వాడిని చూసుకోడానికి నన్ను రమ్మని ఇన్నాళ్ళకి ఆడి పెళ్ళాం కబురెట్టింది.   ఎళ్ళడం మటుకేనయ్యా. మరి మళ్ళీ ఎప్పుడొస్తానో, అసలొస్తానో లేదో తెలీదయ్యా. కాళ్ళాడ్డం లేదు,” అంది రాములు జీరబోయిన గొంతుతో.

 

తాత జవాబుగా ఏమంటాడో అని వింటున్నా. నిట్టూర్చాడు.

“వెళ్ళిరాయే. చూద్దాం ఏదేమవుతాదో.   పదైదేళ్ళగా ఓ బిడ్డలా మెలిగావు. గాయత్రికి ఇన్నేళ్ళగా తోడు-నీడ అయ్యావు. నువ్వు లేకుండా మా జీవనం ఈడ ఎలా సాగుతుందో ఇకపైన చూడాలి మరి,” అన్నాడు దిగులుగా.

‘నిజమే, అసలు ఎట్టా?’ తాత మాటలు విన్న నాకూ అనిపించింది. రాములు అన్నిటికి మాకు సాయపడ్డం, నన్ను ప్రేమగా చూసుకోడం తలుచుకున్నాను. మరి ఇప్పుడు రాములు వెళ్ళిపోతే ఎట్టా? అని దిగులేసింది.

కన్నీళ్లు పెటుకున్న రాములుని సముదాయించాడు తాత.

**

మధ్యాహ్నం, ప్రసాదం తినేసి తాత బడ్డీకి పోబోతుండగా, ఉమమ్మ హడావిడిగా వచ్చింది మా కాడికి.

 

“శుభాకాంక్షలు సత్యమయ్యా, మన గాయత్రి ఐదవ తరగతి లెక్కలు, తెలుగు, సాంఘికం, యాభై శాతం మార్కులతో పాసయింది తెలుసా? నా మొదటి శిష్యురాలు. చాలా గర్వంగా ఉంది. ఇంతకన్నా సంతోషం నాకైతే లేదు,” అంటూ నిలుచునున్న తాతని నా పక్కనే కూచోబెట్టింది ఉమమ్మ.

 

నాయుడన్న, పంతులుగారినే కాక వాళ్ళ నాన్నగారిని కూడా అరుగు కాడికి రమ్మని రాములు చేత కబురెట్టింది.

 

ఉమమ్మ చేస్తున్న హడావిడికి పూజారయ్య సైతం మా కాడికి చేరాక, అందరినీ చుట్టూ కూచోబెట్టి మరోసారి నేను పరీక్షలు పాసయిన విషయం చెప్పిందామె.

“గత వారం గాయత్రికి మాస్టారు పెట్టిన ఐదో తరగతి పరీక్షా ఫలితాల పత్రం ఇదిగో,” అంటూ మార్కుల పత్రం నాకిచ్చి, తాను తెచ్చిన లడ్డు అందరికి పంచింది. తాత చాలా ఆనందపడ్డాడు.

చేతిలోని లడ్డు కొద్దికొద్దిగా తింటూన్న వాళ్ళ నాన్నగారి పక్కనే వెళ్ళి కూచుంది ఉమమ్మ.

“నాన్నా, నేను రెండు నెలల్లో మంగళగిరి డిగ్రీ కాలేజీకి వెళతాను కదా!

అక్కడే  బి.ఇ.డి కూడా చేసి ఉపాధ్యాయిని అవ్వాలని నిశ్చయించుకున్నాను. ఆ తరువాత వికలాంగులకి ప్రత్యేక విద్యాభ్యాస విధానంలో పై చదువులకి వెళతాను.

గాయత్రి లాంటి తెలివైన వారికే కాదు, ఇంకా ప్రత్యేకమైన అవసరాలున్నవారికి నా వంతు సేవ, సాయం చేయాలనుంది. నానమ్మకి చెపితే సంతోషించింది. అమ్మ నేనేమన్నా ఒప్పుకుంటుందని తెలుసుగా,” అంది ఉమమ్మ ఒకింత సంబరంగా.

 

కూతురి వంక చూసి, “ఇంకా సమయం ఉందిగా! ఆ విషయం మాట్లాడుదాములే,” అన్నారు ఓపిగ్గా పూజారయ్య.

 

ఇంతలో అందరికీ మంచినీళ్ళు తెచ్చిచ్చింది రాములు.

మరో రెండు రోజుల్లో రాములు ఊరికెడుతుందని, అందునా ఆరోగ్యం బాగోలేని పెనిమిటికి సేవ చేయడానికని విని సానుభూతి చూపించారందరూ. అతని పేరిట ప్రత్యేక పూజ చేయించి అమ్మవారి కుంకుమ ప్రసాదాలు తీసుకెళ్ళమన్నారు పంతులుగారు.

 

ఇంతలో ‘మీ సంబరంలో మేము కూడా’ అన్నట్టు దూసుకొచ్చాయి పావురాళ్ళు.

 

“అబ్బో మీ గువ్వల సంఖ్య పెరిగిందే? శాల్తీలు కూడా మారాయి,” అంది ఉమమ్మ.

 

“అలవాటుగా వచ్చేవి పదికి పైనే ఉన్నాయి, ఉమమ్మా. చిట్టి పావురాళ్ళు కూడా ఎకువయ్యాయి ఈ మధ్య,” అంటూ పక్కనే ఉన్న గింజల డబ్బా అందుకుని కాస్త దూరంగా పావురాళ్ళ వైపు వెళ్ళింది రాములు.

**

కాసేపు ఆ మాట, ఈ మాట చెప్పి అందరూ తిరిగి తమ పనుల్లోకి వెళ్ళిపోయారు. కొళాయి వద్ద చేతులు కడుక్కుని, నా కాడికి వచ్చి కూచుంది ఉమమ్మ.

కొత్త పుస్తకాలున్న సంచి నా కందించింది.

“ఇందులో ఆరో తరగతి పుస్తకాలతో పాటు ఆంగ్లభాష అక్షరాల పుస్తకం కూడా ఉంది,” అన్నది ఆమె నా భుజం మీద తడుతూ. నాకెంతో గర్వంగా అనిపించింది.

 

“నువ్వు సంతకం చేయడం కూడా నేర్చుకోవాలి. ఇంకెవ్వరూ కాపీ చెయ్యకుండా ఉండాలి. నీ సంతకం నీ ఇష్టం.   నీకు నచ్చింది ఒకటి కాస్త సాధన చేయి.

పోతే, నాకు కాలేజీ మొదలయ్యాక కూడా, ఇప్పటి లాగే బుధవారం, ఆదివారం రాగలుగుతాను. నీ చదువు ఆటంకం లేకుండా సాగుతుందిలే,” అంది ఉమమ్మ.

**

తెల్లారితే రాములు ప్రయాణమనగా రాత్రి నాకు నిద్ర పట్టలేదు. సాయంత్రం ఆరింటికి బయలుదేరి వెళ్ళిపోతుంది రాములు.

రాములు కోసమని చంద్రం పిన్ని చేత తెప్పించిన ఎర్రరంగు చీర, రవిక, గాజులు సంచిలో సర్దుకొని పొద్దున్నే కోవెల చేరాము.

**

ఎప్పటిలా మేము పూలపని చేస్తుండగా, ఊరెళుతున్న రాముల్ని చూడ్డానికి సుబ్బి, మాణిక్యం వచ్చారు.

ఎదురుగా అరుగు మీద కూచుని, పెనిమిటి ఆరోగ్యం కుదుట పడగానే జాప్యం చేయకుండా తిరిగొచ్చేయమని రాములికి చెప్పారు.

 

“మరీ బెంబేలెత్తకు రాములు. మీ మామకి సేవ చెయ్యి. అసలు నిన్ను అధోగతి పట్టించింది అతనేనని మాత్రం మరవకు. అతను నిన్నొగ్గేసినందుకే, గతిలేక నువ్వీడ స్వీపరుగా కొలువు చేస్తున్నావనీ మరవకు. వీలయినంత త్వరగా నీ బతుకు నువ్వు చూసుకో,” అంది సుబ్బి.

రాములు ఏదో అనబోయేలోగా, “నువ్వు బాధపడకు రాములు. ఊరికి పోయిరా. సుబ్బి అంటున్నది కూడా నిజమే కదా. మేమే నీకు మళ్ళీ మనువు చేస్తాము,” అంటూ రాముల్ని సముదాయించింది మాణిక్యం.

దుఃఖంలో ఉన్న రాములు మాట పెంచలేదు.

**

నా చేత రాములికి చీర ఇప్పించాడు తాత. రాములు బయలుదేరే సమయానికి ఉమమ్మ, చంద్రం పిన్ని కూడా గుడికొచ్చి, ఆమెని సాగనంపారు. నా తల మీద ముద్దెట్టుకుని, కన్నీళ్ళతో వెళ్ళింది రాములు. నా మనసంతా గుబులుగా అయిపోయింది.

(ఇంకా ఉంది)

 

 

మీ మాటలు

  1. Very good style. And the narration is apt with the story line.
    Keep up the good work.

మీ మాటలు

*