వచనాన్ని నిండుగా ప్రేమించిన మాస్టారు చేరా

Image - Copy (2)

చేకూరి  రామారావు గారి  చేరాతలంటే భలే  యిష్టం – అని  త్రిపురనేని  శ్రీనివాస్  కి చెప్పాను.

అప్పుడు శ్రీను మాస్టార్ గారి భలే ఆసక్తిగా చెప్పారు. అప్పటికి శ్రీను విజయవాడ లో వుండేవారు. హైదరాబాద్ లో వున్నప్పటికి చేరా మాస్టార్ ని  సభల్లో చూడటం , పలకరించటం  తప్పా సాహిత్యం గురించి  మాటాడింది లేదు. వొక  రోజు ఆంద్రజ్యోతి ఆదివారం అనుబంధం వుత్తరాల పేజిలో  మసిగుడ్డ కథ మెచ్చుకొంటూ  చేరా మాస్టార్ రాసిన వుత్తరం వుంది. శ్రీనుతో  ‘అరే భలే  రాసారే’ అంటే ‘స్పార్క్ ని  బాగా పట్టుకొంటారు’ అన్నా.

ఆ వుత్తరం సంతోషంతో  పాటు బాధ్యతని తీసుకొచ్చినట్టు అనిపించింది.అదే శ్రీనుతో చెపితే గట్టిగా నవ్వి నీకే కాదు యెవరికైనా  ఆ స్పృహ వుండాల్సిందే అన్నాడు.  ఆయన గమనిస్తుంటారు. ‘మాస్టార్  మెచ్చుకోపొతే బాగుండదు కదా’ అని మనసుకి అనిపించింది. “మనసుకో దాహం పుస్తకాన్ని చేరాతల్లో పరిచయం చేద్దామని రాసాను. జ్యోతికి పంపిద్దాం అనుకుంటుండగా ఆ కాలమ్ యిక ముందు రాదని తెలిసింది. కాని యీ వ్యాసాన్ని ప్రచురణకి యిస్తాను” అని ఫోన్  చేసి చెప్పారు.

‘అగాధ నీలిమ’ కథ వచ్చినప్పుడు కథ మొత్తాన్ని వొక వాతావరణంలోకి  తీసుకెళ్ళి కథ స్థాయిని  భలే పెంచావ్… యీ టెక్నిక్  నీ కథలకి చాలా బాగా అమిరింది’ అని  మాస్టార్ అన్నప్పుడు అవే 24 గంటలు కదా అందరికి. వచ్చినవన్ని చదువుతారు. అంతకు ముందు వచ్చినవి చదువుతారు. ప్రపంచ సాహిత్యాన్ని చదువుతారు. సభలకి వస్తారు ,మాటాడతారు. శ్రోతగా వస్తారు. స్నేహితులతో గడుపుతారు. యింట్లో నేలపై పరచిన బేతం చర్ల  టైల్స్ ని  యెంత బాగా పరిచారో చెపుతారు. వంట చెయ్యగలరు. ముఖ్యంగా మనుష్యులని రోజు కలుస్తుంటారు. టైం మేనేజ్ మెంట్  భలే  చేస్తారు – అంటే మొదట్నుంచి  అలా అలవాటైపోయింది అంటారు. మాస్టర్ గారి స్నేహంతో  నాకు రంగనాయకి గారు అమ్మ అయ్యారు.  సంధ్య తో  స్నేహం. హేమంత్ ని మాస్టర్ ని చూస్తుండటం భలే వుండేది. చేరాగారి  అబ్బాయి క్రిస్ నాకు యిష్టమైన స్నేహితుడు. యింటికి యెప్పుడు వెళ్ళినా సాహిత్యం, కమ్మని ఆహారం తో సంతోషమే సంతోషం.

మాస్టార్గారి ఫెమినిజం గురించి చాలా విలువైన విషయాలని  చెప్పేవారు. ఫెమినిస్ట్ థీయరి, ఫిలాసఫిని  బాగా  అర్ధం  చేసుకోడానికి మాస్టర్ చెప్పే విషయాలు , ఆయనతో సంభాషణ  చాల  వుపయోగపడేవి.  Instant Life కధ పై మాస్టర్ రాసిన  విశ్లేషణ నాకెంతో అపురూపం. అలానే ‘శీతవేళరానీయకు’ పై  ఆయన స్పందన నాకెంతో యిష్టం.

వచనాన్ని ప్రేమించే మాస్టార్ ,భాష – సాహిత్యం  శిఖరమంత యెత్తున తెలిసిన మాస్టర్, తెలుగు సాహిత్యానికి – భాషకి చేసిన మేలు అనంత ఆకాసమంతా.

ఆకాశం యెప్పుడు మనకి కనిపిస్తూనే వుంటుంది. అంత మాత్రాన మనకి ఆకాశం పూర్తిగా తెలుసని కాదు. యెప్పటికప్పుడు కొత్తగా ఆకాశాన్ని తెలుసుకొంటున్నట్టు మాస్టార్  రాసిన పుస్తకాలన్నీ మళ్ళిమళ్ళి చదువుకొంటుండాలి.

నిన్న మాస్టార్ గది షల్ఫ్ లో అనేకానేక పుస్తకాలు అటుయిటు వాలి వున్నాయి నిరంతరం చదువుతున్నట్టు… అంతే కాకుండా కొత్తవాటికి చోటిస్తు…!!!!

-కుప్పిలి పద్మ

మీ మాటలు

  1. మొత్తానికి భలే గా ఉంది.

మీ మాటలు

*