“ఫ్రిజ్ లో ప్రేమ” అనువాద నాటకం – 6 వ భాగం

friz

దృశ్యం-2

వర్షాకాలం

 

(స్టేజ్ మీద వెలుగు వచ్చే వరకు ప్రసన్న మున్షీ డెస్క్ దగ్గర కూర్చుని రాసుకుంటూ కనపడతాడు. ఫ్రెష్ గా)

ప్రసన్న: నేనీ మానసిక పరిస్థితిలో ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు వారివారి జీవితాలతో, వాళ్ళతో నాకు సంబంధించినంతవరకు లాజిక్ కుదురుస్తుంటారు. ఇది నాకు చాలా ఆలస్యంగా అర్థమయింది. నాకింకొకటి కూడా అర్థమయ్యింది. ఏంటంటే….

మిత్రుడు: …. నేనొక…. అర్థంకాని వాణ్ణి. అర్థం చేసుకోవడం కష్టమయిన మనిషిని అయుండాలి. నాలాంటి ఓ మనిషిని అర్థం చేసుకోవడానికి ఎంతయితే సమయం పడుతుందో అంత సమయం ఈ జగంలో ఎవరి దగ్గరా లేదు. ఇందులో వాళ్ళ తప్పు లేదు.

ప్రసన్న: (రాస్తూ) వాళ్ళ తప్పు లేదు. చేతిలోకొచ్చిన తాజా పుస్తకం లాంటి వాళ్ళు ఎదురొచ్చిన ప్రతి మనిషీనూ! వాళ్ళకి కాస్త సమయం ఇవ్వాలి. పుస్తకమయినా, మనిషయినా!

మిత్రుడు: నాకా సమయం ఇచ్చేవారే ఎవరూ లేరు.

ప్రసన్న: అందుకే నాకీ మధ్య నేనంటేనే భయం పట్టుకుంది. చుట్టుప్రక్కల వాళ్ళ గురించి ఏమీ అన్పించదు.

మిత్రుడు: ఇక్కడి వరకు బాగానే ఉంది; కానీ ముందు ముందు తెలుగులో రాయడం కష్టం. ఇంత భావాత్మకంగా, ఉత్కృష్టంగా వీటిని మించి శారీరక సుందరత గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు…. తెలుగులో కష్టం అవుతుంది.

ప్రసన్న: కానీ, ఎందుకు?

ఇద్దరూ: కాస్త ఆగుదాం.

(ప్రసన్న ఓ రెండు క్షణాలు అస్వస్థతగా కూర్చుని ఉంటాడు. ఆ తర్వాత చేతిలోని కాగితాలని చింపి పడేస్తాడు. ఏడవడం మొదలెడతాడు. మిత్రుడు పరుగున వెళ్లి అతన్ని దగ్గరికి తీసుకుంటాడు.)

మిత్రుడు: ఏమయింది?

(ప్రసన్న ఏడుస్తూనే ఉంటాడు.)

మిత్రుడు: అన్నీ సర్దేసుకొని మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చును. ఏదీ బలవంతంగా చేయాల్సిన పని లేదు ఎవరూ. మనం రాగానే మన వెనక తలుపులు మూసుకోలేదు.

(ప్రసన్న ఏడుస్తూనే లేదు లేదంటాడు.)

(కాసేపయిన తర్వాత కళ్ళు తుడుచుకొని ఏడవడం ఆపుతాడు; కానీ వెక్కిళ్ళు వస్తుంటాయి.)

మిత్రుడు: ఏ విధమైన బలవంతం లేదు. రాయాలన్న నిబంధన లేదు. సమయం నిర్దేశమూ లేదు. మనసుకెలా తోస్తే అలా…. కాబట్టి ప్రశాంతంగా రాయి.

ప్రసన్న: మంచినీళ్ళు.

(మిత్రుడు నీళ్ళు తేవడానికి లోపలి వంటగదిలో కెళతాడు. ఇంతలో ఫోన్ మ్రోగుతుంది. మిత్రుడు ఫోన్ వైపుకెళ్తుంటాడు. ప్రసన్న అతడికి వద్దు వద్దని చెప్పే అంతలో అతడు ఫోన్ ఎత్తుతాడు.)

మిత్రుడు: ఎవరూ మాట్లాడేది? శ్రేయ….

(ప్రసన్న పరుగున వెళ్ళి రిసీవర్ తీసికొని చిన్న పిల్లాడి గొంతులో మాట్లాడడం మొదలుపెడతాడు.)

ప్రసన్న: హలో…. హలో…. ఎవలూ…. ఎవరు మాటాడేదీ? నేనా…. నేను నీళ్ళు తాగుతున్నాను ఎవలూ? శ్లేయా…. శ్లేయక్క బజారు నుండి సీట్లు తేవడానికెల్లింది చాలా శ్లేయక్క ఆచ్చిపోయింది…. మీరూ పోండి.

(ఫోన్ పెట్టేస్తాడు.) (మళ్ళీ ఫోన్ మ్రోగుతుంది.)

హలో…. ఎవలూ మాటాడేది?

(ఫోన్ కట్ అవుతుంది. ప్రసన్న గట్టిగా నవ్వుతాడు. మిత్రుడు కూడా నవ్వుతాడు.)

మిత్రుడు: ఏంట్రా ఇదంతా?

ప్రసన్న: శ్రేయ వాళ్ళమ్మ ఫోన్ చేస్తారు. General …. watch ఉంచడానికి, నేనొచ్చిన రోజే శ్రేయ చెప్పింది ఫోన్ ఎత్తవద్దని. నేన్నీకు చెప్తూనే ఉన్నంతలో నువ్వు ఫోన్ ఎత్తేసావు.

మిత్రుడు: మరిప్పుడు?

ప్రసన్న: శ్రేయ చెప్పుకుంటుందిలే, ఏమైనా…. చూద్దాం!

(ఒక్కసారిగా ఇద్దరూ కాసేపటి వరకు Block అయిపోతారు.)

ప్రసన్న: మా అమ్మ ఫోన్ వచ్చింది ప్రొద్దున్న. నాన్నా కూడా మాట్లాడారు.

మిత్రుడు: ఏమన్నారు?

ప్రసన్న: నా గురించి పడే బెంగ బయట పడనివ్వకుండా మాట్లాడారు. పోయినసారి మూటాముల్లె సర్దుకొని ముంబాయి నుండి తిరిగి వెళ్ళిన వాణ్ణి కదా! బెంగ పడడం సహజమే కదా? కానీ వాళ్ళకూ ఎక్కడో తెల్సిపోయింది నేనా ఇంట్లో ఉండలేనని…. వాళ్ళతో నాకేం గొడవ లేదు; పైగా నాతో నాకే గొడవ. ఈ మధ్య నేనిలా అసంబద్ధంగా మాట్లాడుతున్నానా ?

మిత్రుడు: నాకెందుకు కన్పిస్తుందలా?

ప్రసన్న: ఒక్క నాన్నకి మాత్రం నాకిక్కడేం ప్రాబ్లం లేదని అర్థమయిందనుకుంటాను.

మిత్రుడు: ఏమన్నారు?

ప్రసన్న: నాన్నన్నారు, ‘వెళ్ళు! నీ మనసులో ఏముందో నాకు తెలీదు. ఏదో మంథనం జరుగుతుందని మాత్రం అన్పిస్తుంది. వేరే ఇంట్లో ఉంటే నువ్వు ముందుకెళ్తావ్ అనుకుంటే, అలాగే వెళ్ళు!’ కాకపోతే రాసుకునేందుకు అనువుగా నాకు వీలయిన వాతావరణం తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

మిత్రుడు: ఇక్కడనుండి సూర్యాస్తమయం కన్పిస్తుందా?

ప్రసన్న: శ్రేయ నడిగాను నేను. తన గదిలోని కిటికీ నుండి కన్పిస్తుంది. పద….

(ప్రసన్న, మిత్రుడు లోపలికెళ్తారు. స్టేజ్ కొన్ని క్షణాల వరకు ఖాళీగా ఉంటుంది. మిత్రుడు లోపట్నుండి బయటకొస్తాడు. హాల్లోని lamp shades ల్లోని bulb on చేస్తాడు. నీలం రంగు చిత్రం మీద వెలుగు. అతడు రాసిన కాగితాలన్నీ సరిగ్గా అమర్చి బొత్తుగా పెడుతుండగా ఒక కాగితం పెడుతు పెడుతూ ఆగుతాడు. ఆ కాగితం పట్టుకొని ధ్యాసగా చదువుతుంటుంటే అతడి మొహంలో ప్రసన్నని గురించిన ఆదుర్దా.)

మిత్రుడు: గబ్బిలం….

సరిగ్గా నా కిటికీ ఎదురుగా రెండు విద్యుత్ తీగెల మధ్య చిక్కుకుని ఓ గబ్బిలం చచ్చిపోయింది. రాత్రిపూట ఆ తీగెలకానుకొని విద్యుత్ ఘాతంలో పోయింటుంది. అప్పట్నుండి నాకు తెలీకుండానే అంతా తలక్రిందులుగా జరుగుతూపోయింది. ఆ తీగల మీది గబ్బిలం చాలా బాగుండేది. అందుకనే దాని ఫోటోలూ తీయబడ్డాయి. దాని శరీరం నుండి అతివేగవంతమైన విద్యుత్ ప్రవాహం జరుగుతుండడం మూలాన అది అతి మెల్ల మెల్లగా పాడవుతూ వచ్చింది. ఓ ఆర్నెల్ల పాటు నేను దాన్ని చూస్తున్నప్పుడల్లా అయోమయంలో రకరకాల భావాలకు గురయ్యేవాడిని. మూడు నాలుగు నెలల్లో మధ్యలో ఆకారం అంతా ఎండిపోయింది. బక్కచిక్కిపోయింది. కానీ ఆ తీగల మధ్య చిక్కిన నల్లటి రెక్కలు అలానే ఉండిపోయాయి. అంతా అయిపోవచ్చాక వర్షాకాలం దాన్లోని ఒక్క రెక్క మాత్రం రాలి పడింది. ఇంకో రెక్క మాత్రం ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ అలాగే ఆ తీగలకి అతుక్కుని ఉంది. అది రాలడానికి ఇంకా సమయం పడ్తుందని నాకన్పిస్తుంది.

(మిత్రుడు చీకట్లో కనీకన్పడకుండా ఉండిపోతాడు. ఫోన్ మ్రోగుతుంటుంది. ప్రసన్న లోపలనుండి మెల్లిగా వచ్చి ఫోన్ ప్రక్కన శాంతంగా కూర్చుంటాడు. అతడి మొహం మీద అప్పుడే సూర్యాస్తమయం చుసిన ప్రశాంతత. ఫోన్ మ్రోగి మ్రోగి ఆగిపోతుంది. శ్రేయ ఇంట్లోకి వస్తుంది మెల్లగా.)

(అలసిపోయింటుంది.)

(ఒంటి మీద పూలపూల కాటన్ చీర. బొమ్మలా ఉంటుంది.)

శ్రేయ: ఎలా ఉన్నావ్? ఇంట్లోనే ఉన్నావా?

ప్రసన్న: నేనెక్కడికెళ్తాను?

శ్రేయ: సారీ, ఇలా లంచ్ ముగించుకొని వచ్చే నా అలవాటు మారదు.

ప్రసన్న: It doesn’t matter . అలసిపోయినట్టున్నావ్, చాయ్ పెడతాను.

శ్రేయ: పనెలా జరుగుతుంది? రోజంతా రాసుకున్నావా?

ప్రసన్న: ఆ….

శ్రేయ: అమ్మ ఫోన్…. నాకివాళ కాస్త ఆలస్యం అయింది.

ప్రసన్న: మీ ఇంటికి పక్కింటి చిన్న పిల్లాడు వస్తుంటాడు. మధ్యమధ్యలో ప్రక్కింటి వాళ్ళు అప్పుడప్పుడూ వాణ్ణి నీ దగ్గరుంచి వెళ్తుంటారు. నీకు పిల్లలంటే ఇష్టమని.

(శ్రేయ చురుక్కున చూస్తుంది.)

…. ఇవాళ ఆ పిల్లవాడు ఫోన్ ఎత్తాడు.

శ్రేయ: No …. ఏమంటున్నావు నువ్వు?

ప్రసన్న: పొరపాటున ఇవాళ నేను ఫోన్ ఎత్తాను.

(ఇద్దరూ గలగలా నవ్వుకుంటారు.)

శ్రేయ: ప్రసన్నా, ఒక గుడ్ న్యూస్.

ప్రసన్న: ఏంటి?

శ్రేయ: నాకివాళ ఒక ad assignment దొరికింది.

ప్రసన్న: Oh wow ! Great ! నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వివాళ ఈ చీరెందుకు కట్టుకున్నావా అని!

శ్రేయ: నాలుగు ఆడిషన్స్ తీసుకున్నారివాళ. మధ్యాహ్నం మూడున్నర వరకు నా షూటింగ్ అయిపోయింది. కానీ వాళ్ళు ఉండమన్నారు. మళ్ళీ రెండు టెస్ట్ షూట్స్ తీసికొని మరీ ఈ న్యూస్ చెప్పారు.

రెండు నెలల కాంట్రాక్ట్. నా కన్నిటికన్నా ఇందులో నచ్చినదిదే. నేను చాలాకాలం వీటిల్లో ఇరుక్కుని ఉండలేననిపిస్తుంది.

ప్రసన్న: ఎందుకు?

శ్రేయ: ఏం లేదు.

(ప్రసన్న చాయ్ ఇస్తాడు.)

ప్రసన్న: ఇదేమన్నా బాగుందా? నీకింత మంచి assignment దొరికిన రోజు మన మిలా కూర్చుని చాయ్ తాగడం, ఏం బాలేదు.

శ్రేయ: పార్టీ కావాలా ? పోదాం పద బయటికి.

ప్రసన్న: బయటికా? బయటికెందుకు? కాస్తాగు.

(ప్రసన్న లేస్తాడు. సామాన్లనుండి ఒక CD వెదికి తీసి Player లో వేస్తాడు. Wild music వస్తూంటుంది. అతడు ఆమె ముందుకెళ్ళి తనని లేవమన్నట్టుగా సైగ చేస్తాడు. ఆ ఇద్దరూ ఒళ్ళు మరిచి నృత్యం చేస్తారు. ఇద్దరూ very graceful dancers . శ్రేయ ఒక్క క్షణం అలసిపోయి కూర్చుంటుంది. ప్రసన్న తన ముందు కూర్చుంటాడు. ఇద్దరూ నవ్వుతారు.)

శ్రేయ: పిచ్చా…. ఎంత మంచి music పెట్టావ్! నా అంత నేను….

(తనకు మాట్లాడడం రాదు.)

ప్రసన్న: కాసేపయాక మళ్ళీ చేద్దామా?

శ్రేయ: పిచ్చి పట్టిందా ఏమిటి? ఎంత బాగా డాన్స్ చేస్తావ్!

ప్రసన్న: నేను రాక పూర్వం, సాయంత్రం ఇంటికొచ్చాక ఏం చేసే దానివి?

శ్రేయ: అంటే….ఆ…. చెప్తా నుండు. నేను…. ఇలా వచ్చేదాన్ని.

(ఆమె లేచి గుమ్మం దగ్గరికి వెళ్తుంది. ఏం చెప్తూ ఉంటుందో అది చేసి చూపిస్తూ ఉంటుంది.)

నేనిలా వచ్చేదాన్ని సీదా లోపలికి వెళ్ళిపోయేదాన్ని. ఈ గదిలో ఆగేదాన్ని కాదు. అమ్మతో ఫోన్లో మాట్లాడేదాన్ని. తినాలనిపిస్తే తినే దాన్ని…. ఏదో ఒకటి తినేదాన్ని…. అటుకులు, మురమురాలు, పేలాలు ఈ గదిలో లైట్ కూడా వేసేదాన్ని కాదు. ఒక్కళ్ళం ఉన్నప్పుడు చిన్న గదుల్లోనే సురక్షంగా అన్పిస్తుంటుంది కదూ! చుట్టుప్రక్కల గదులన్నీ చీకటిగానే ఉంచేదాన్ని. ఈ గదులన్నీ లేవనుకొని లోపలి గదిలో మాత్రం దీపం ఉంచుకొనేదాన్ని…. ఒక్కటే…. ఏడ్చేదాన్ని.

ప్రసన్న: ఏడవడం దేనికి?

శ్రేయ: ఏడ్చేదాన్ని. ఒంటరి మనిషి. మాట్లాడతాడా, నవ్వుతాడా? కేవలం ఏడవడమే చేయగలదు. నువ్వెప్పుడన్నా ఒక్కడివి ఉన్నావా ?

ప్రసన్న: చాలాసార్లు.

శ్రేయ: చాలాసార్లు?

ప్రసన్న: ఆ…. ఆ తర్వాతేం చేసేదావి ?

శ్రేయ: రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా దీపం ఉంచుకునేదాన్ని. లోపలనుండి తలుపు మూడు గడియలు పెట్టేసుకునేదాన్ని. నల్లాలన్నీ గట్టిగా కట్టేసేదాన్ని.

ప్రసన్న: చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మా ఇంటి కందరూ వచ్చేవాళ్ళురా, బాబాయి పిల్లలు, మేనత్త పిల్లలు, మామయ్యగారి అబ్బాయి, అమ్మాయిలు అందరూ. రోజంతా ఎంత కొట్టుకొని తిట్టుకున్నా రాత్రయేసరికి అందరూ కల్సి ఒక్క గదిలో పడుకోవాలని ఆరాటపడేవాళ్ళం. ఎలాగోలా. ఎలా పడితే అలా పడుకునేవాళ్ళం మేం. ఒకరు తలుపు దగ్గరయితే, ఒకరు కిటికీ అరుగు మీద పడి నిద్రపోయేవాళ్ళం. నేనేమో ఇంతుండే వాణ్ణి. బక్క పలచగా. ఓ మూలకొదిగి పడుకునే వాణ్ని. కానీ అలా అందరం కల్సుండడం ఎంత బాగనిపించేదో, అలా గది నిండా మన వాళ్ళ మధ్య ఎప్పటికీ ఉండిపోవాలన్పించేది.

శ్రేయ: ఏమయింది మరి?

ప్రసన్న: ఏముంది, అందరం పెరిగిపెద్దవాళ్ళమయాం.

శ్రేయ: ఊ…

(కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా ఉంటారు.)

శ్రేయ: (ఉన్నట్టుండి) ‘ఒక తప్పుడు సహవాసం కన్న ఒంటరితనం మేలు’ అనుకుంటూ అనుకుంటూ ఒంటరితనం అనుభూతిలోకి రావడం మొదలుపెడుతుంది.

(శ్రేయ అలసటగా తన మొహం మీద, జుట్టులో చేతులు కప్పుకొంటుంది.)

ప్రసన్న: మధ్యాహ్నం వంట ఎక్కువ చేసిపెట్టాను. పద, భోంచేద్దాం.

(ప్రసన్న kitchenett వైపుకి వెళ్తాడు. శ్రేయ అతడు రాసిన కాగితాలు పరిశీలిస్తుంటుంది.)

శ్రేయ: ఏంటీ వాక్యం…. ఇంత పొడుగ్గా.

ప్రసన్న: చాలాసార్లు నేను పూర్ణవిరామం మర్చిపోతాను వాక్యం చివరలో. శ్రద్ధగా చదువు. నిజం చెప్పాలంటే, ప్లీస్…… ఉండనీయ్ ఇప్పుడు చదవడం. దానిమీద ఇంకా పని కావాల్సి ఉంది. ఇంకా మార్పులూ, చేర్పులూ ఉన్నాయి.

శ్రేయ: ఈ పరిమళ్ పశ్చిమానికి వెళ్ళాడూ అంటే విదేశాలకు వెళ్ళాడనా ?

ప్రసన్న: పెట్టెయ్ శ్రేయా, Please .

శ్రేయ: సర్లే, పెట్టేస్తాను. ఇంతకీ నీ నవలలో ఏం రాస్తున్నావ్ ?

ప్రసన్న: నా వల్ల కావట్లేదు. ఇవాళ చెప్పుకోదగ్గ పని జరగనే లేదు. రాయలేకపోయాను అనుకున్నట్టుగా!

(అతడు భోజనం పళ్ళాలు తెస్తాడు. ఇద్దరూ మౌనంగా తలలు వంచుకొని తింటూ ఉంటారు.)

శ్రేయ: నువ్వు రాసేదంతా ఎక్కడయినా ఎప్పుడయినా చెప్పగలగాలి. నేను.

ప్రసన్న: నువ్వు నటివి, నేను రాస్తుంటాననా! కానీ నేను నాటకాలు, సినిమా రాయను కదా! అప్పుడప్పుడు ads కోసం రాస్తాను. అది పెద్దగా రచనల క్రిందికి రాదు.

( ఫోన్ మ్రోగుతుంది.)

శ్రేయ: మ్రోగనీ…. రోజూ అదే అదే reporting ఏమనివ్వాలి తనకు.

(ప్రసన్న వెళ్ళి ఫోన్ ఎత్తి మళ్ళీ చిన్న పిల్లాడిలాగా మాట్లాడడం మొదలు పెడ్తాడు. మాట్లాడుతూనే ఉంటాడు.)

(శ్రేయ అతని చేతుల్లో నుండి రిసీవర్ లాక్కుంటుంది.)

శ్రేయ: చెప్పమ్మా…. అవును. పక్కింట్లోని కాళే వాళ్ళ అబ్బాయి. ఆడుకోవడాని కొస్తుంటాడు. అవునమ్మా…. రెండు…. రెండున్నరేళ్ళ పిల్లాడు. అవును…. ఈ మధ్యే వచ్చారు కొత్తగా. మంచివాళ్ళు. కాస్త మనిషి తోడుగా ఉంటారు. అమ్మా, నాకివాళ ఒక ad దొరికింది. నూనెది. నాన్నకి కుడా చెప్పు. Thank you . పదిహేను రోజుల్లో షూటింగ్ ఉంటుంది. అ…. ఆ సినిమా అయిపోయింది. నావి ఓ తొమ్మిది పది scenes ఉండొచ్చు. అంతే. కానీ హాయిగా జరిగిపోయింది షూటింగ్. రేపా…. రేపు ఎల్లుండి ఆడిషన్స్ ఉన్నాయి. అమ్మా, నేను భోంచేస్తున్నాను. రేపు మళ్ళీ మాట్లాడతాను. Okay మంచిది!

ప్రసన్న: అమ్మ తెలుగు సీరియల్స్ చూస్తుంటుంది, నాన్న…. నాన్నేమో ఆవరణలో పచార్లు చేస్తుండొచ్చు. గులామ్ ఆలీ గజల్స్ వింటారాయన రోజూ.

శ్రేయ: నువ్వొక్కడివేనా ?

ప్రసన్న: ఇప్పుడొక్కణ్ణే. అన్న పోయాడు. నిద్రమాత్రలు మింగేసాడు తను.

శ్రేయ: ఎప్పుడు ?

ప్రసన్న: నేను తొమ్మిదో తరగతిలో ఉన్నాను. అన్నకి ఇరవై- ఇరవై ఒకటి ఉండొచ్చు. అసలు అమ్మ మంచి ధైర్యస్థురాలు. అప్పట్నుండి ఎలాగో అయిపోయింది. నాన్న ఏమీ పట్టనట్టుగా వట్టి కోపిష్టిగా ఉండేవారు, ఇప్పుడు శాంతంగా అయిపోయారు. అప్పుడప్పుడు నా వైపు అదో తరహాగా నేనేమయిపోతానో అన్నట్టు చూడడం అస్సలు చూడబుద్ధవదు.

అన్న నా హీరో. నాకు బైక్ నేర్పాడు. మొదటి బీర్ తనతోనే తాగాను. తన పాకెట్ మనీలో నుండి ప్రతి నెలా నాకు పది రూపాయిలిచ్చేవాడు. అన్న పోయినప్పుడు అమ్మానాన్నల ఆగని ఏడుపు చూసి నాకు కన్నీళ్ళే రాలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత కూర్చుని అన్న గురించి అంతా రాసుకుని పెట్టుకున్నాను. అది శుభ్రంగా మరోసారి రాస్తున్నప్పుడు అర్థమయింది నాకు, అన్న పోవడమంటే ఏమిటో, ఆ పోవడం ఏమేం తీసుకెళ్ళిందో!

శ్రేయ: రాస్తే అర్థమవుతుందా ఏం కోల్పోయామో!

ప్రసన్న: నాకు.

శ్రేయ: ఎలా…. ఎలా రాస్తావ్ నువ్వు? అంటే ఏం అన్పిస్తుంది? రాసే ముందు ఏం చేస్తావ్?

ప్రసన్న: కొత్త స్టేషనరీ సామాను తెచ్చుకుంటాను. ఎప్పుడు రాసినా రాసే ఆరంభం నేను కొత్త స్టేషనరీ తోనే చేస్తాను. కొత్త కాగితపు ఫోల్డర్స్, నోట్స్ కి పెట్టే చిన్న చిన్న రంగురంగుల క్లిప్స్…. కొత్త కాగితాలు. ఇంతకు ముందు నేను దేని మీద పడితే దాని మీద రాసేవాడిని. ఫోన్ ప్రక్కనుండే రాయని పెన్నులని దులిపి దులిపి మరీ రాసేవాడిని.

ఓ చిత్రకారుడు నా మిత్రుడు. అతనీ ఫౌంటెన్ పెన్ నాకు తెచ్చిచ్చాడు. ఇక ఇప్పుడు నేనీ పెన్ను నిబ్ శుభ్రం చేస్తాను. పెన్నులో సిరా పోసుకుంటాను. ఆ తర్వాత అన్నీ ముందు పెట్టుకు కూర్చుంటాను. సత్యనారాయణ వ్రతం పూజా సామాగ్రి అమర్చుకొంటున్నట్టుగా!

శ్రేయ: ఆ తర్వాత కుదురు వస్తుందా?

ప్రసన్న: ఆ…. ఒక్కోసారి…. ఒక్కోసారి అస్సలు కుదరదు.

శ్రేయ: సినిమాకి ఆక్టర్స్ ని ఇలా స్వచ్ఛంగా తెచ్చి పని చేయించడం కుదరదు… అసలు చెప్పాలంటే సినిమా పనంతా ముక్కలు ముక్కల్లో అవుతుంది. అది కాక చుట్టుప్రక్కల అంతా జనం…. అస్తవ్యస్తంగా…. వస్తువులు….! వేలాడే వైర్లు, థర్మాకోల్స్…. ధగధగలాడే లైట్స్…. ఏ క్యారెక్టర్ తో పని చేయాలో చాలాసార్లు వాళ్ళని మనం కలుసుకోలేం.

నా మొదటి సినిమా అప్పుడు నేను చాలా భయపడిపోయాను. ఎక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఆ తర్వాత మెల్లిమెల్లగా నేర్చుకున్నాను. ఆ గందరగోళంలో మనమే మన స్పేస్ వెతుక్కోవాల్సి ఉంటుందని నా కర్థమయింది. నాకు నా వంతు స్థలం దొరికింది.

ప్రసన్న: మేకప్ రూమ్?

శ్రేయ: ఛ…. ఛ…. అస్సలు కాదు. షాట్ ప్రారంభించే ముందు కొన్ని క్షణాలు మన మొహం ముందు క్లాప్ తీస్తారు. మనకీ జనాలకీ మధ్య. అప్పుడు సెట్ మీద ఒక momentary silence ఉంటుంది. అప్పుడు నేనోక్షణం కళ్ళు మూసుకుంటాను. ఆ తర్వాత అన్నీ వదిలేస్తాను. నన్ను నేను కూడా.

(ఒక్కసారిగా వెళ్ళి కూలబడినట్టుగా కుర్చీలో కూర్చుంటాడు.)

ప్రసన్న: పని చేస్తూండడం ఎంత బాగుంటుంది కదా! అదీ ఇష్టమయిన పని. నాకో స్నేహితుడు ఉన్నాడు.

శ్రేయ: చిత్రకారుడు?

ప్రసన్న: అవును-చిత్రకార మిత్రుడు…. అతనంటుంటాడు. పనిలో మనసు లగ్నం చేసిన మనుషులు అందర్లోకి అందంగా కన్పిస్తారు. అతి అందమైన వాళ్ళ కన్నా అందంగా!

శ్రేయ: నీ స్నేహితుడి పేరేంటి?

ప్రసన్న: పేరొద్దు. వట్టి చిత్రకార మిత్రుడు.

శ్రేయ: ఎక్కడుంటాడు అతను?

ప్రసన్న: బయటికి వెళ్ళాడు, వస్తాడు.

శ్రేయ: అసలు నీతో పరిచయం అయినట్టుగానే అన్పించదు నాకు. అప్పుడప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఆపేస్తావ్.

ప్రసన్న: చాలా విషయాల్లో మనమిద్దరమూ ఒకేలాంటి వాళ్ళం శ్రేయా, మనలాంటి ఒకేతీరు వాళ్ళకి చాలాసార్లు ఒక్కళ్ళనొకళ్ళం ఎరగమేమోననే భావన కలుగుతుంటుంది ప్రతీసారి. ఎందుకంటే మన ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. మనం బయటి ఊర్ల నుండి, ఇంచుమించు ఒకే లాంటి ఇంటి పద్ధతుల నుండి అంతా వెనకాల వదిలేసి వచ్చిన వాళ్ళం మనం. ఒంటరులం.అందుకే నిన్ను అర్థం చేసుకో గలుగుతాను నేను.

శ్రేయ: My God ! ఏం అర్థం చేసుకున్నావ్ నువ్వు నన్ను?

ప్రసన్న: ఏముందీ, నువ్వు మంచి అమ్మాయివి. కష్టజీవివి. ఇంటి నుండి బయటపడిం తర్వాత ఈ గజిబిజి నగరంలో కలిసిపోతావ్ అయినప్పటికీ నీ ఎనర్జీ ని అలాగే కాపాడుకుంటావ్. ప్రొద్దున్న ఇంటి నుండి బయల్దేరేప్పుడు ఏదయితే మంచితనం ఉందో దాన్ని నవ్వు మొహంతో తీసికెళ్ళి మళ్ళీ సాయంత్రం అలాగే కాపాడుకుని తిరిగి సాయంత్రం ఇంటికొస్తావ్. నీకేం కావాలో నీకు తప్పక దొరుకుతుంది శ్రేయా!

శ్రేయ: నిజంగా?

ప్రసన్న: నిజంగా!

శ్రేయ: నేనేం ఏదో పెద్ద దిగివచ్చానని కాదు; కానీ చాలా కష్టపడ్డాను నా కాళ్ళమీద నేను నిలద్రోక్కుకోవడానికి!

కేవలం acting మాత్రమే కాదు కదా. అన్నీ…. అన్ని విషయాల్లో. నా పద్ధతిలో నేను బ్రతుకుదాం అనుకున్నాను గనక! ఈ ముంబాయి, పుణే మహానగరాల సంగతే తెల్సు నీకు…. కానీ చిన్న పట్టణాల్లో, ఊళ్ళల్లో ఆడపిల్లల్ని సరిగ్గా చూడరు ప్రసన్నా…. ఏ నిర్ణయమూ ఆడపిల్ల తీసుకోలేదు. ఆమె తరపున నిర్ణయాలన్నీ ఆమె బంధుజనమే తీసుకుంటారు. నేను కాలేజ్ చదువుకోసం వచ్చిందాన్ని ఇక తిరిగి వెళ్ళలేదు నేను. నా గూడు నేను ఏర్పరచుకొందామని తాపత్రయం.

(కాసేపు ఒక్కసారిగా విచారంగా మారిన మొహంతో ప్రసన్న వైపు చూసి, నవ్వి మెల్లిగా లోపలికెళ్తుంది.)

(కొన్ని క్షణాలు అంధకారం)

(మళ్ళీ ప్రకాశం వచ్చేవరకు మధ్య రాత్రి.)

(శ్రేయ లోపలనుండి దిండూ దుప్పటి తీసికొని వస్తుంది. ప్రసన్న గాఢ నిద్రలో ఉంటాడు. అతని కేసి చూసి గదిలో ఓ వైపుకి పక్క వేసుకొని పడుకుంటుంది.)

(చీకటి)

( సశేషం)

సచిన్ కుండెల్కర్

సచిన్ కుండెల్కర్

మరాఠీ మూలం : సచిన్ కుమ్డల్కర్

గూడూరు మనోజ

గూడూరు మనోజ

తెలుగు అనువాదం : గూడూరు మనోజ

మీ మాటలు

  1. చాలా..చాలా..చాలా..చాలా.. బావుంది! అనువాదనికైతే నూటికి నోరు మార్కులు…ఏంటో సరళమైన అనువాదం. ఎక్కడా రాజీపడ్డట్టు అనిపించలేదు!

Leave a Reply to aparna Cancel reply

*