నువ్వొంటరివే!

861_10203100224966079_1515021072_n

ఒక ఆశ్చర్యాన్ని వేటాడుతున్నప్పుడు

ఒళ్ళు మరిచిన పరవశంలో

నువ్వు ఒంటరివే-

ఒక ఆనందాన్ని సముద్రంలా కప్పుకున్నప్పుడు

అలల వలల్లో తుళ్ళిపడే

ఒంటరి చేపవు నువ్వే-

ఒక పాట వెంట కాందిశీకుడిలా పరుగు తీసినప్పుడు

నిశ్శబ్ద అగాధంలోకి జారిపడ్డ

ఒంటరి అక్షరానివి నువ్వే-

చీకటిని తెరిచినప్పుడు

వెలుతురును మూసినప్పుడు

కాంతిరేఖల రహస్యం తెలుసుకుని మాడి మసైపోయిన

ఒంటరి మిణుగురు నువ్వే-

ఎవరినో కోరుకున్నప్పుడు

ఎవరూ కోరుకోనప్పుడు

నీ పగిలిన గాజుకన్నుకు గుచ్చుకుని వేలాడే

ఒంటరి కల… నువ్వే!

ఒక భయానికి ముక్కలుగా తెగిపోతున్నప్పుడు

వికల శకల సకలమైన ఒంటరివే నువ్వు!

ఒక విజయానికి రెక్కలతో ఎగిరిపోతున్నప్పుడు

శూన్యంలో పక్షిలానూ

నువ్వొక్కడివే-

20140715_190028-1

ఒక దిగులు… నల్లని మల్లెల తీగలా పెనవేసుకున్నప్పుడు

నెత్తుటిని బిగపట్టిన గాయాల చెట్టులా

నువ్వొంటరివే…

ఒక స్వప్నం ఇసక తుపానులా

నిన్ను చీకట్లోకి విసిరిపారేసినప్పుడు

వెన్నెల ఒయాసిస్సు కోసం అర్రులు చాస్తూ

ఒక్కడివే… ఒంటరివే!

పుటకలోంచి బతుకులోకి

బతుకులోంచి చితిలోకి

చితిలోంచి చింతనలోకి

దేహంలానో

ధూపంలానో

ధూళిగానో

వెళ్తున్నప్పుడు

వెళ్ళి వస్తున్నప్పుడు

వస్తూ పోతున్నప్పుడు

ఒంటరివే…

నువ్వొంటరివే-

***

(సాయంత్రం 5.30 గం.లు, 30 జూన్, 2014)

 

-పసునూరు శ్రీధర్ బాబు

మీ మాటలు

  1. alluri gouri lakshmi says:

    సో నైస్ శ్రీధర్ గారూ ! చాలా అద్భుతంగా ఉంది ! అవును అందరమూ ఒంటరిగానే వస్తాము వంటరిగానే పోవాలి. ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే !

  2. అది విజయం అయినా.. విఫలం అయినా మనిషి ఎప్పుడూ ఏకాకి!

    చాలా బావుందండీ! ముఖ్యంగా ఐ లైన్స్…

    “ఒక పాట వెంట కాందిశీకుడిలా పరుగు తీసినప్పుడు

    నిశ్శబ్ద అగాధంలోకి జారిపడ్డ

    ఒంటరి అక్షరానివి నువ్వే- “

  3. dasaraju ramarao says:

    ఎవరినో కోరుకున్నప్పుడు

    ఎవరూ కోరుకోనప్పుడు

    నీ పగిలిన గాజుకన్నుకు గుచ్చుకుని వేలాడే

    ఒంటరి కల… నువ్వే!…సో నైస్ పోయెం . అభినందనలు పసునూరు గారు

  4. Sumana Sri says:

    అవును శ్రీధర్! కవిత్వంలోనూ జీవితంలోను నువ్వు నిజంగా ఒంటరివాదివే!

    • అవును… మీతో మాట్లాడి చాలా కాలమైంది. ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తున్నా “ఇది ఒంటరివాదం కాదు..ఒంటరితనం బహుముఖాలతో ముఖాముఖి తలపడడం ఎలాంటిదో నలుగురితో పంచుకోవాలని తపించే సమూహవాదం” అని చెప్పడానికి.

  5. ఔను ఎంతటి సామూహిక చింతన కలిగిన మనిషైనా చాలావరకు ఒంటరే. అయితే ఎంత సామూహికుడవుతుంటే అంత ఆనందంగా ఉంటాడన్నది మాత్రం నిజమని నా అభిప్రాయం.

Leave a Reply to పసునూరు Cancel reply

*