అమ్మాయి వెళుతోంది

dasaraju

నా ఇంటిని నా ఇష్టానికే వదిలేసి
సర్దిన తీరులో తన ఇష్టాన్ని ముద్దరేసి
కాలానికి నా ఎదురుచూపు లానించి

అమ్మాయి వెళుతోంది

కట్ చేస్తే

గుండెల మీద ఆడినప్పుడు
అ ఆ లు నేర్చుకోవాలన్నానేమో
వీధిలోకి ఉరికినప్పుడు
పట్టుకుపోయేటోడొస్తాడన్నానేమో
చంకనెక్కి, చందమామని చూపినప్పుడు
తెచ్చిస్తనని, మాట తప్పానేమో
ముద్దులొలకబోసినప్పుడు
మూట గట్టుకోవడం మరిచినానేమో

కట్ చేస్తే

రెండుజడలు వేసుకొన్నప్పుడు
పేరొందే కవయిత్రి కావాలని అని వుంటాను
అక్క చున్ని వేసుకొని గొడవ పడినప్పుడు
అక్క దిక్కే మొగ్గు చూపివుంటాను
సినిమాల మీద మోజు చూపినప్పుడు
సమాజం చర్చ చేసివుంటాను
అమ్మ ఒళ్ళో తలపెట్టి గొప్పలు పోతున్నప్పుడు
నా వాటా ఏమీ లేదాని ప్రశ్నించి వుంటాను

కట్ చేస్తే

విద్యార్హతలను ఉద్యోగంతో తూచ ప్రయత్నించానేమో
టాలెంటే సర్వాధికారి, సర్వాంతర్యామి అయినప్పుడు
వీక్ పాయింట్ దగ్గర వీక్ నెస్ ని రెట్టించానేమో
సెల్ చార్జింగ్ కి కరెంట్ కోతలున్నట్లు
సెల్ రీచార్జీలకి రూల్స్ పెట్టానేమో
రుచులను, అభిరుచులను
బ్రాకెట్లో బంధించానేమో

కట్ చేస్తే

కాబోయే సరిజోడును
కలల వూహల్తో కొలుస్తున్నప్పుడు
అతిశయోక్తి నుచ్చరించి వుండొచ్చు
వయసు దాటుతోందని
ఆప్షన్ల సంఖ్య కుదించి వుండొచ్చు
కాలం కఠినంగా గడుస్తోందని
హెచ్చరికలు చేసి వుండొచ్చు
తన కాలం కఠినంగా గడుస్తోందని
కన్ను ఒత్త్తిగిల్లిన సంగతి కని,విని వుండకపోవచ్చు
కట్ చేస్తే

అమ్మాయి వెళుతోంది
ఈ భూమి నుంచి ఆ భూతలస్వర్గానికి
డాలర్ల పక్కన చేరిన ఆయన సందిట్లోకి

తను ఏమడిగినా
సృష్టించైనా ఇవ్వడానికి సిద్దమైనా
తను పూదిచ్చిన ఇంటిని
చిటికెనవేలుతోనైనా మలుపకుండా వుంచడానికే నిర్ణయించిన

ఈసారి కట్ చేయొద్దు

అయ్య చేతిలో తనను పెట్టినప్పుడు
చేతులతో పాటు మనసూ వణికింది
అరుంధతి నక్షత్రం చూపించినవాడు
అమెరికాకి రమ్మంటున్నడు

పెళ్ళి రోజున
నా ఇంటి గడప కడిగి
కడుపు తడి చేసి
కనిపెంచిన రుణం తీర్చుకొని

అమ్మాయి వెళుతోంది

రుణాలని తేర్పుకోవచ్చు
ప్రేమలని తేర్పుకోవడముంటదా…

—దాసరాజు రామారావు

మీ మాటలు

  1. buchi reddy gangula says:

    కనిపెంచిన ఋణం తీర్చుకొని
    అమ్మాయి వెళుతుంది ***************రావు గారు
    చాలా బాగుంది సర్
    =—————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  2. మంగు శివ రామ ప్రసాద్ says:

    చక్కటి అనుభూతి కవిత. తండ్రీ కూతుళ్ళ మధ్య అనుబంధాన్ని అందులోని మాధుర్యాన్ని హృదయాన్ని స్పందింపజేసేలా అందించినందుకు ధన్యవాదాలు రామారావుగారు.

  3. bhasker koorapati says:

    అన్నా! దాసన్నా!!
    చాలా ఆర్ద్రమైన కవిత రాసావ్.
    ఇంక మీరు కవిత్వం రాయకున్నా ఫరవలేదన్నంత ఆర్ద్రంగా ఉంది.
    గుండెల్ని పిండివేసే కవిత ఇది.
    ముకుందరామారావు వలసపోయిన మందహాసాన్ని గుర్తు చేసారు.
    ప్లీజ్ కీప్ ఇట్ అప్. హాట్స్ ఆఫ్ టు యు అన్నా!!
    మీ ప్రియమైన సాహితీ మిత్రుడు,
    –భాస్కర్ కూరపాటి.

  4. సార్! మంచి కవిత. బిడ్డ పెళ్లి చేసిన తలిదండ్రులను కదిలించే కవిత. ఇటువంటి కవితలే సందర్భ శుద్ధిగా కవిత్వం అంటని సామాన్యులకు కూడా నచ్చుతయి కదా?

  5. dasaraju ramarao says:

    సహృదయులు, సాహితీ ప్రేమికులు అయిన బుచ్చిరెడ్డి , శివరామప్రసాద్, భాస్కర్, మడిపల్లి గారల ఆత్మీయ స్పందనలకు చాల ధన్యవాదాలు..

Leave a Reply to buchi reddy gangula Cancel reply

*