వీలునామా – 42

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.Hogarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

“పారిస్ లో మేమిద్దరం పెళ్ళీ పెటాకులూ లేకుండానే ఒకే ఇంట్లో కలిసి వున్నాం. అక్కడెవ్వరూ ఏదీ పట్టించుకోరు! అక్కడ నాకు బానే వుండేది. అన్నిటికంటే డబ్బుకి కొదవ వుండకపోవడం లోని హాయి తెలిసొచ్చింది. నన్ను హేరీ అప్పుడప్పుడూ, ‘ఆశ పోతూ!’ అని పిలిచేవాడు. కానీ నేనేది అడిగితే అది కొని పెట్టేవాడు.

ఇంతలో అతనికి వాళ్ళ అన్నయ్య ప్రమాదం లో మరణించాడనీ, దాంతో తండ్రి గుండె పగిలి మంచం పట్టాడనీ కబురొచ్చింది. వెంటనే బయల్దేరి ఇంటికెళ్ళిపోయాడు. కొంచెం వెనకగా నేనూ ఇల్లు చేరుకున్నాను. ఒంటరిగా పారిస్ లొ నేను మాత్రం చేసెదేముంది?

అసలు ఇంటికి అమ్మ దగ్గరకెళ్ళాలంటే భయంతో ఒణికిపోయాను. కానీ హేరీ నచ్చచెప్పి పంపాడు. తను తప్పకుండా ఒచ్చి చూస్తుంటాననీ, కావలసినంత డబ్బిస్తాననీ చెప్పాడు. నేననుకున్నట్టుగానే అమ్మ నా మీద విరుచుకుపడింది. పెళ్ళి కాకుండా పరాయి మగాడితో లేచి పోయానని చావ బాదింది.

అయితే హేరీ గురించి నేను చెప్పగానే కొంచెం శాంతించింది. అంత డబ్బున్న అబ్బాయి పెళ్ళాడితే చాలని, ఎలాగైనా అతన్ని పెళ్ళికొప్పించాలనుకుంది. అందుకొక పథకం వేసింది అమ్మ. నన్ను తిండీ తిప్పలు పెట్టక చిక్కి శల్యమై పోయేలా చేసి, అతనికి కబురు పెట్టించింది. ఆ కబురందుకొని ఆఘ మేఘాలమీద వచ్చేసాడు హేరీ. అప్పటికే వాళ్ళ నాన్న గారు కూడా మరణించారట, ఊళ్ళో చెప్పుకున్నారు. వస్తూనే, మంచం మీద పడుకున్న నన్ను చూసి,

“బేస్సీ! ఏమైంది? ఇలా అయిపోయావెందుకు?” అని అడిగాడు. నేను అమ్మ చెప్పినట్టే మూలుగుతూ పడుకున్నా.

“ఏముంది, అంతా అయిపోయింది నాయనా! ఇహ మన బెస్సీ మననొదిలి వెళ్ళిపోతుందన్నాడు వైద్యుడు!” మా అమ్మ యథా శక్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ అంది.

నా నాడి పట్టుకుని చూసాడు హేరీ. అతను డాక్టరు పరీక్షకి చదివేవాడన్న సంగతి మర్చిపోయినందుకు అమ్మ తనని తనే తిట్టుకుంది. నాడి చూసి, నవ్వేసాడు.

“మరేం భయం లేదు. కొంచెం తిండి తింటే చాలు. బెస్సీ, నీ ఆరోగ్యానికేం ఢోకా లేదు. లే, లేచి కూర్చో!” అన్నాడు.

“వ్యాధి ఒంటిక్కాదు నాయనా, మనసుకి. పెళ్ళి కాకుండా పరాయి మగాడితో వున్న ఆడపిల్ల మనసెలా వుంటుంది బాబూ? నా కుతురి మొహాన అందరూ ఉమ్మేస్తున్నారు.”

“అయ్యో! ఆర్మిస్టవున్ గారూ! నేను మీ అమ్మాయిని లేవదీసుకెళ్ళలేదు. తనే నాతో లేచి వచ్చేసింది, అసలు తీసికెళ్ళేదాకా ప్రాణలు తోడిందంటే నమ్మండి!” నవ్వుతూ అన్నాడు.

“బెస్సీ కేమీ ప్రమాదం లేదు, మంచి తిండి తిని విశ్రాంతి తీసుకుంటే తనే లేచి తిరుగుతుంది!” నవ్వుతూ అని లేచి వెళ్ళిపోయాడు. అమ్మకి ఒళ్ళు మండిపోయింది.

“చావుకి పెడితే కానీ, లంఖణానికి రాదు,” అనుకుని నా ఆరోగ్యం క్షీణించాలనీ ఏవేవో మందులు తినిపించింది. నిజం చెప్పొద్దూ, ఆ మందులూ మాకులూ తిని నేనెంత అనారోగ్యం పాలయ్యానంటే నిజంగా చచ్చిపోతానేమోనని భయ పడ్డాను కూడా.

మళ్ళీ కబురు పెట్టింది అమ్మ హేరీకి. ఈ సారి నిజంగానే మంచం పట్టిన నన్ను చూసి హేరీ ఆశ్చర్యపోయాడు.

“పిల్ల బెంగతో చచ్చిపోయేటట్టుంది బాబూ! మీరు దాన్ని భార్యగా అంగీకరిస్తే మనశ్శాంతితో పోతుంది. లేకపోతే ప్రపంచం దృష్టిలో తాను కులటననే బాధతో పోతుంది.” అమ్మ వీలైనంత ఏడుపు గొంతుతో అంది.

నిజంగా నేను తన ప్రేమా పెళ్ళీ కోసం అంత బెంగటిల్లిపోతానని హేరీ ఊహించలేదు. నన్ను అక్కడికక్కడే పెళ్ళాడడానికి ఒప్పుకున్నాడు. అమ్మ వెంటనే ఇద్దరు బంధువులనీ, ఒక చర్చి ఫాదరునీ పిలిచి అప్పటికప్పుడు చట్టబధ్ధంగా భార్యా భర్తలనిపించింది. ఇదిగో ఆ కాగితం. దీంతో హేరీని దిగ్బంధనం చేసాననుకొంది అమ్మ.

అ తర్వాత హేరీ ఎస్టేటు పన్ల మీద లండన్ వెళ్ళాడు. అతనక్కడుండగానే ఫ్రాంక్ పుట్టాడు. ఆ సంగతి ఉత్తరంలో చెప్పాను. హేరీ పిల్లాణ్ణి చూడటానికి హుటాహుటిని బయల్దేరి మా వూరొచ్చాడు. దురదృష్టవశాత్తూ, సరిగ్గా హేరీ ఇంట్లో అడుగుపెడుతూన్నప్పుడు నేను చిన్ననాటి స్నేహితుడు జేమీతో మాట్లాడుతూ వున్నాను. నాకూ హేరీకీ పెళ్ళయిన సంగతి తెలిసి జేమీ చాలా బాధపడ్డాడు. పాపం నా కొసమే వూరొదిలి వెళ్ళిపోయి ఉద్యోగం సంపాదించుకోని స్థిరపడ్డాననీ, నన్ను పెళ్ళాడడంకోసమే తిరిగి వూరొచ్చాననీ చేప్పాడు జేమీ. నేనూ, తననెప్పుడూ మర్చిపోలేదనీ, హేరీతో పెళ్ళి కేవలం మా అమ్మ చేసుకున్నాననీ చెప్తూ వుండగా వొచ్చాడు హేరీ.

ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. నేను తనని ప్రేమ పేరుతో మోసం చేసాననీ, ఇంకెన్నడూ నా మొహం కూడా చూడననీ ఉత్తరం రాసాడు.”

ఊపిరి పీల్చుకోవడానికని ఆగింది మిసెస్ పెక్.

“ఆహ్హా! అయితే ఫ్రాంక్ హేరీ హొగార్త్ గారి కొడుకు కాదన్నమాట. ఆ జేమీ స్టీవెన్సన్ కొడుకు. ఇదేనా నువ్వు నాకు చెప్పదల్చుకొన్న రహస్యం?” ఆత్రంగా అడిగాడు బ్రాండన్.

“నీ తెలివి సంతకెళ్ళా! అలాటిదేమీ లేదు. ఫ్రాంక్ ముమ్మాటికీ హేరీ హొగార్త్ కొడుకే! చెప్పేది పూర్తిగా విను మరి. వెళ్ళిపోయిన హేరీ అప్పుడప్పుడూ పిల్లాడి కోసం డబ్బు పంపుతూ వుండే వాడు, కానీ ఎన్నడూ నన్ను చూడడానికి రాలేదు. ఫ్రాంక్ యేణ్ణర్థం పిల్లవాడుగా వుండగా హేరీ ఇంకొక అన్నయ్య కూడా మరణించాడు. పాపాం, చాలా అల్పాయుష్కులు వాళ్ళందరూ. అప్పుడే హేరీ ఎస్టేటు సొంతదారుడయ్యాడు. అంత డబ్బున్న అల్లుడు చిక్కినట్టే చిక్కి చేజారిపోయినందుకు అమ్మ లబలబ లాడింది. ఏది ఏమైనా చట్ట రీత్యా నేను అతని పెళ్ళాన్ని కాబట్టి కొంతైనా డబ్బివ్వాలని హేరీ మీద ఒత్తిడి తెచ్చింది అమ్మ. దానికి హేరీ సరేనన్నాడు. అయితే నేను స్కాట్ లాండు వదిలి వెళ్ళి ఇంకెక్కడైనా స్థిరపడితేనే డబ్బు ఇస్తానన్నాడు. ముందు మేమిద్దరమూ ఒప్పుకోలేదు. కావాలంటే న్యాయస్థానానికీ వేళ్తామని బెదిరించాము. కానీ హేరీ యే మాత్రమూ లొంగలేదు. పైగా, అనారోగ్యం నటించి అతనిపై వత్తిడి తెచ్చి పెళ్ళి జరిపించామని తానే న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తానని మమ్మల్నే బెదిరించాడు. దాంతో మేము సరేననక తప్పలేదు. ఆ మాటకొస్తే ఆ వూళ్ళో మాకంత ఏముంది గనక?

సిడ్నీకి వెళ్ళే పడవ మీద మా ఇద్దరికీ టిక్కట్లు హేరీ యే కొనిచ్చాడు. మా మీద అతనికేమాత్రం నమ్మకం లేకపోవడంతో, లండన్ వరకూ వచ్చి మమ్మల్ని పడవ యెక్కిస్తానని అన్నాడు. నేనూ అమ్మా చంటి పిల్లాణ్ణేసుకుని లండన్ చేరుకున్నాము. లండన్ లో ఒక చిన్న హోటల్లో బస చేసాము. ఆ రోజు అక్కడ చచ్చేంత జనం వున్నారు.

మళ్ళీ దురదృష్టం నన్ను కాటేసింది. పిల్లాడికి జ్వరం తగిలింది. వాడసలే అర్భకంగా వుండి అప్పుడప్పుడూ అనారోగ్యం పాలవుతూ వుండడంతో మేము పెద్దగా పట్టించుకోలేదు. అమ్మ యేదో మందు వేసి వాణ్ణి పడుకోబెట్టింది. సరిగ్గా హేరీ రావడానికి గంట ముందర పిల్లాడు జ్వర తీవ్రతలో మరణించాడు. అమ్మ లబో దిబో మంది. ఇప్పుడు పిల్లాడు లేడంటే హేరీ పైసా విదల్చడు, అని అమ్మ ఏడుస్తూ వుంటే పిల్లాణ్ణి పోగొట్టుకొని నేనేడుస్తున్నాను.

“హయ్యో! హయ్యో! ఎంత పని జరిగిందే అమ్మా! ఈ ముదనష్టం పిల్లాడు పడవ ఎక్కింతరవాతైనా పోలేదు. ఇప్పుడు హేరీకి ఏం చెప్తాం? ఎవరి దగ్గరైనా పసివాడు దొరికితే ఈ గండం గట్టేక్కొచ్చేమో! అన్నట్టు, ఈ పక్క గదిలో అమ్మాయి పిల్లాడి తల్లి. ఒక్క గంట సేపు పిల్లాణ్ణి ఆడిస్తానని చెప్పి ఏదో మాయ చేసి ఆమె పిల్లాణ్ణి తీసుకొస్తా! హేరీ ఇంతవరకూ ఫ్రాంక్ ని చూడలేదు కాబట్టి గుర్తు కూడా పట్టలేడు,” అంటూ అమ్మ పక్క గదిలోకి పరిగెత్తింది.

ఆ గదిలో ఎవరో ఒక బీదరాలు అమెరికా వేళ్ళే పడవ ఎక్కి వెళ్ళబోతోంది. ఒక్క పౌండు ఇస్తే పిల్లాణ్ణి గంట సేపు తప్పకుండా అరువిస్తుంది, అన్న నమ్మకంతో అమ్మ ఆమె గదికి వెళ్ళింది. విచిత్రంగా, తల్లి పిల్లాణ్ణి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఎటో వెళ్ళినట్టుంది. అమ్మ చకచకా పిల్లల బట్టలు మార్చి, పిల్లలనీ మార్చేసింది.

కనీసం నాకు ఏడ్చేందుకు కూడా తీరిక నివ్వకుండా అమ్మ, గుర్రబ్బండిలో నన్నూ పిల్లాణ్ణీ ఎక్కించింది. ఆ తర్వతే తెలిసింది నాకు, అమ్మ మా సామాను కూడా బండిలోకెక్కించిందనీ, మేము సత్రం తిరిగి రాగలమన్న నమ్మకమూ, ఉద్దేశ్యమూ ఆమెకెంత మాత్రమూ లేవని!

అలాగే ఏడుస్తూ హేరీని కలుసుకున్నాను. పిల్లాడు పోయిన సంగతి అతనికి చెప్పలేకపోవడం నాకింకా బాధగా వుంది. కానీ హేరీ నా ఏడుపుని నటన అనుకున్నాడు. నాతో ఒక్క మాటైనా మాట్లాడకుండా ఆ పిల్లాణ్ణి చేతులోకి తిసుకున్నాడు. ఎందుకో అతని కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.

నా కడుపున పుట్టిన ఫ్రాంక్ ని ఒక్కనాడూ చేరదీసిందీ లేదు, ముద్దాడిందీ లేదు, ఇప్పుడీ అనామకుడెవర్నో చేతుల్లోకి తిసుకొని కన్నీళ్ళు కారుస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, ఆ క్షణం నా ఒళ్ళూ మనసూ ఈర్ష్యతో ఎంత భగభగ లాడాయో చెప్పలేను. అమ్మ భయం లేకపోతే అక్కడే నిజం చెప్పేసేదాన్నే. అయితే ఆ పిల్లాడి పట్ల అతని అనురాగం చూసి అమ్మ మొహం ఎందుకో కళకళ లాడింది.

“అయితే, మీరిద్దరూ ఈ పడవ ఎక్కి వెళ్తున్నట్టే గా?” అనుమానంగా అడిగాడు.

“నువ్వు చెప్పాక వెళ్ళక తప్పుతుందా నాయనా? ఇంతకీ మా సంగతేం చేస్తావో చెప్పావు కాదు. కొత్త స్థలం లొ మేం పొట్ట ఎలా పొసుకోవాలి? ఎలా నిలదొక్కుకోవాలి? పైగా నీ పెళ్ళాం బాలింతరాలు, చేతిలో చంటి పిల్లాడూ…”

“పిల్లాడిని నాకొదిలేయండి. మీ ఇద్దరికీ నెలకింతని పంపుతాను,” ఆలోచిస్తూ అన్నాడు హేరీ. నాకు పగలబడి నవ్వాలనిపించింది. నేనేదో అనేలోపలే అమ్మ అందుకుని,

“ఏమిటీ? దానికి వున్న ఒకే ఒక్క ఆసరా ఆ పిల్లాడు. తల్లినీ పిల్లాణ్ణీ వేరు చేస్తావా? ఏమ్మనిషివయ్యా? పెళ్ళానికి దిక్కులేదు గానీ పిల్లాణ్ణి ప్రేమగా పెంచుతాడట! ఎవరైనా వింటే నవ్వి పోతారు! అయితే ఆ పిల్లాణ్ణి నీ కొడుకని ఒప్పుకుంటావా? అది చెప్పు ముందు! “

అయితే అమ్మ మాటల ధాటీకీ హేరీ ఏమీ తడబడలేదు. నెమ్మదిగా, దృఢంగా అన్నాడు,

“పిల్లాణ్ణి ప్రేమగా చూస్తానో లేదో చెప్పలేను. కానీ చక్కటి చదువు సంధ్యలు చెప్పించి మనిషిని చేస్తాను. నీ దగ్గరుంటే వాడు జేబు దొంగ అయేది ఖాయం. ఆలోచించుకోండి!”
“సరే ఏం చేస్తాం! బెస్సీ! గుండె దిటవు చేసుకోమ్మా! తల్లిగా పిల్లాడి మంచి కోసం నువ్వా మాత్రం త్యాగం చేయక తప్పదు. బాబుగారు డబ్బున్న మారాజులు, మనకేమీ లోటు చేయరనుకో! నువ్వు చేసే త్యాగానికి ఎంతో కొంత ప్రతిఫలం ముట్టచెప్పకుండా వుంటారా చెప్పు…”

నాకు నిజానికి వాళ్ళిద్దరి మీదా ఎంత అసహ్యం వేసిందో చెప్పలేను. ఒక్క మాటా మాట్లాడకుండా తల తిప్పేసుకుని నిలబడ్డాను.

హేరీ ఒకసారి అమ్మ వైపు చురుగ్గా చూసి నా వంక చూసాడు. నా కన్నీళ్ళని నమ్మలేదు కానీ, జాలిపడ్డాడు. అమ్మ అనుకున్నట్టే మా ఇద్దరికీ నెల నెలా సరిపడా డబ్బు పంపుతానని మాట ఇచ్చాడు. ఆ డబ్బు మాట వినగానే అతనికి నిజం చెప్పాలన్న కోరిక నాకూ చచ్చిపోయింది. ఆ రాత్రే అతనికీ ఆ పిల్లాడికీ వీడుకోలు చెప్పి అమ్మా నేనూ వెళ్ళిపోయాము.

తన మాట ప్రకారమే హేరీ నెల నెలా డబ్బు పంపుతూ వచ్చాడు.

అయితే ఒకసారి ఆశతో నేను పదిహేను వందల పౌండ్లు అడగడంతో, ఆ తరవాత ఇహ ఎప్పుడూ డబ్బు అడగనని నాతో పత్రం రాయించుకుని పదిహేను వందలూ పంపాడు. నేనెంత తెలివి తక్కువ పని చేసానో ఆ పదిహేను వందలూ ఖర్చయిపోయింతరవాత కానీ అర్థం కాలేదు నాకు. బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకున్నట్టయింది.”
—————————————————————————

మీ మాటలు

*