లెమనేడ్

Kadha-Saranga-2-300x268

పదకొండు గంటలవేళప్పుడు నేను ఇంటిబయట నిమ్మకాయల బండి దగ్గర్నించి లోపలి కెళ్ళబోతుంటే వీధిమలుపు దగ్గర కనిపించింది మా అక్కయ్య.

“అయ్యో, వెళ్ళిపోయాడే! నేను కూడా తీసుకునేదాన్ని నిమ్మకాయలు” అంది దగ్గరికి రాగానే. నేనేం మాట్లాడకుండా అక్క చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళాను.

“ష్ష్…” అంటూ ఆయాసపడుతూ కుర్చీలో కూర్చుంది అక్క. “దగ్గర్లోనే ఉంటున్నా వారానికోసారైనా కలవడానికి కుదరట్లేదు. ఇవాళ మీ బావ ఎవరిదో పెళ్ళని వెళ్ళారు. ఇంట్లో ఒక్కదాన్నేకదాని ఇట్లా వచ్చాను” అంది.

మంచినీళ్ళు తెచ్చిచ్చి “కాఫీ పెట్టనా?” అని అడిగాను.

“అబ్బ! ఏం ఎండలే తల్లీ! ‘నాలుగు వీధులు దాటడమేకదా! అంతమాత్రమైనా నడవకపోతే ఎట్లా?’ అనుకుని రిక్షా ఎక్కలేదు. నోరెండిపోయి నాలుక పిడచకట్టుకుపోతోంది. కాఫీ వద్దుగానీ చల్లగా కాసిని నిమ్మకాయనీళ్ళు కలిపివ్వు” అంది అక్క.

“ఇంట్లో నిమ్మకాయలు లేవే” ఇబ్బందిగా చెప్పాను.

“అదేమిటే, నేను వచ్చేటప్పటికి నిమ్మకాయలబండి దగ్గరే ఉన్నావు?” ఆశ్చర్యంగా అడిగింది అక్క.

“ఎక్కడ కొన్నాను? బేరం కుదరందే” అన్న నా సమాధానానికి ప్రశ్నార్థకంగా నావైపు చూసింది అక్క.

“ఆకురాపిడి మచ్చల్తో కసుగాయల్లా ఉన్నాయి, ఒక్కోటి మూడురూపాయలు చెప్పాడు. ఎక్కువ తీసుకుంటే రేటు కాస్త తగ్గిస్తాడేమోనని’ డజనెంతకిస్తావు?’ అనడిగాను. ‘ముప్ఫైయారు ‘ అన్నాడు నిర్లక్ష్యంగా. ‘ముప్ఫై కిస్తావా?’ అన్ననంతే, నావైపు చూడనుకూడా చూడకుండా బండి నెట్టుకుని వెళ్ళిపోయాడు” ఉక్రోషంగా చెప్పాను.

“హ్హు…!”  అంటూ దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలింది అక్క. “ఎండవేళప్పుడు చల్లగా తాగొచ్చు, ఎవరైనా ఇంటికొస్తే ఇవ్వడానికి కూడా బాగుంటుంది, నిమ్మకాయ షర్బతు చేసి పెట్టుకుందామని బుద్ధి పుట్టింది మొన్న. నిమ్మకాయలు కొనుక్కొద్దామని బజారు కెళ్ళాను. రోడ్డుపక్కన గంపలో పెట్టుకుని అమ్ముతున్నాడు గోళీక్కాయలంత నిమ్మకాయలు. వాణ్ణేదో ఉద్ధరిస్తున్నా ననుకుంటూ ‘యాభైకాయలు తీసుకుంటాను. కరెక్టు రేటు చెప్పు’ అన్నాను. వాడు నన్నో అడవిమృగాన్ని చూసినట్టు చూశాడు. ‘యాభైకాయలు నువ్వు తీసుకుంటే వాళ్ళందరికీ ఏమమ్మాలి?’ అన్నాడు చుట్టూ నిలబడి ఉన్నవాళ్ళను చూపిస్తూ. వాడి మాటలు అర్థంకాక నేను వెర్రి చూపులు చూస్తుంటే ‘మనిషికి పదికాయలు మించి ఇచ్చేది లేదు ‘ అన్నాడు. నేను ఆ షాకులోంచి బయటపడి ‘పోనీ, ఆ పదికాయలే తీసుకుందాం’ అనుకునేటప్పటికీ వాడు గంప ఖాళీ చేసుకుని వెళ్ళిపోయాడు. ‘ఎట్లాంటి రోజులొచ్చాయి?’ అనుకున్నాను. ఇక్కడికి వస్తుంటే ఎదురుగా నిమ్మకాయలబండి కనిపించగానే ప్రాణం లేచొచ్చింది. కానీ… ఏం చేస్తాం? ప్రాప్తం లేదు” అంది అక్క ఇంకా దీక్ఘమైన మరో నిట్టూర్పు వదిలి.

అక్క మాటలకి బిత్తరపోయిన నేను అసంకల్పితంగా టీవీ పెట్టాను.

ఏదో సినిమా పాట వస్తోంది. హీరో, హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి పచ్చికబయల్లో కింద పడుకున్నారు. పైనెక్కడో లారీల్తో గుమ్మరించినట్టు నిమ్మపళ్ళు దొర్లుకుంటూ వచ్చి వాళ్ళ చుట్టూ చేరిపోయాయి. లాంగ్షాట్లో అప్పటిదాకా ఆకుపచ్చని బ్యాక్గ్రౌండ్ మీద ఇద్దరు మనుషుల ఆకారాలున్నట్టు కనిపిస్తున్న సీనల్లా పసుపుపచ్చని బ్యాక్గ్రౌండ్ మీదికి మారిపోయింది.

చిరాగ్గా ఏదో గొణుక్కుంటూ అక్క నా చేతిలోంచి రిమోట్ లాక్కుని ఛానల్ మార్చింది.

అక్కడ వ్యాపార ప్రకటనలు వస్తున్నాయి. నల్లగా నిగనిగలాడుతున్న ఒకమ్మాయి సబ్బంతా అరగదీసి ఒళ్ళు రుద్దీ రుద్దీ స్నానం చేసి మిలమిలా మెరిసిపోతూ బయటికొచ్చి అందాలరాణి కిరీటం గెలుచుకుంది. కిరీటం ఆ అమ్మాయి శిరస్సు నలంకరించగానే నిమ్మకాయల వాన కురిసింది. ‘శ్రేష్ఠమైన నిమ్మకాయల రసంతో మీ చర్మసౌందర్యంకోసం ప్రత్యేకంగా తయారుచేసిన మా సబ్బునే వాడండి’ అనే బ్యాక్గ్రౌండ్ ఎనౌన్స్మెంట్తో ప్రకటన ముగిసింది.

అక్క మొహంలో చిరాకు ఇంకా ఎక్కువైంది. మళ్ళీ ఛానల్ మార్చింది. అక్కడా ప్రకటనలే వస్తున్నాయి.

పనిమనిషి అంట్లు తోముతూ సబ్బుని విసిరికొట్టింది. యజమానురాలు పనిమనిషిమీద చెయ్యెత్తింది. పనిమనిషి యజమానురాలిని దూరంగా నెట్టేసి బొడ్లోంచి ఇంకో సబ్బు తీసి దాంతో అంట్లు తోమి తళతళా మెరిపించింది. యజమానురాలు నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూస్తుంటే పనిమనిషి “ఒక్కో సబ్బులో పది నిమ్మకాయల రసముంటుంది అమ్మగారూ! ఎంత జిడ్డుపట్టిన గిన్నెలైనా, మాడిపోయిన అంట్లైనా దీని దెబ్బకి లొంగాల్సిందే” అంది. ఇద్దరూ కలిసి నిమ్మకాయలు ఎగరేసుకుంటూ డాన్సు చెయ్యడం మొదలుపెట్టారు.

అక్క మొహం చూస్తే రిమోట్ని టీవీమీదికి విసిరేస్తుందేమోనని భయమేసి, రిమోట్ అక్క చేతిలోంచి పీక్కుని, ఛానల్ మార్చి, రిమోట్ దూరంగా పెట్టి వంటింట్లో కెళ్ళాను.

నేను కుక్కరు పెట్టి బయటికి రాగానే “ముందా టీవీ ఆపు” అని అరిచింది అక్క. నేను బెదిరిపోయి గబుక్కున టీవీ ఆపేశాను.

“పళ్ళు తోముకునే పేస్టులో నిమ్మకాయట, లెట్రిన్ కడుక్కునే లిక్విడ్లో నిమ్మకాయట, నాలుగురోజులు పోతే ‘మీరు బూట్లకి వేసుకునే పాలిష్లో నిమ్మకాయ ఉందా? కళ్ళకు పెట్టుకునే కాటుకలో నిమ్మకాయ ఉందా?’ అని కూడా అడుగుతారు. వాళ్ళకి పిచ్చో, మనకి పిచ్చో అర్థం కావట్లేదు” కోపంతో బుసలు కొడుతోంది అక్క.

‘అక్కని చల్లబరచడం ఎట్లాగా’ అని ఆలోచిస్తూ లోపలికెళ్ళి, అట్నించి ఎకాఎకిని బయటికి గెంతి, కాసేపట్లో అదే వేగంతో ఇంటికొచ్చాను.

“ఏమిటే ఆ పరుగులు?” కంగారుగా అడిగింది అక్క.

“ఉండు, ఇప్పుడే వస్తా” అంటూ వంటింట్లోకి దూరాను.

పదినిముషాల తర్వాత వంటింట్లోంచి ఇవతలికి వచ్చిన నన్ను “ఇప్పుడే వస్తానని ఇంతసేపు చేశావేంటి?” అయోమయగా అడిగింది అక్క.

మాట్లాడకుండా నా చేతిలోని గ్లాసు అక్క చేతిలో పెట్టి ఎదురుగా కూర్చున్నాను.

“ఏమిటీ…ఇది?” అంది అక్క గ్లాసు తీసుకుంటూ.

“రస్నా! లెమన్ ఫ్లేవర్” అన్నాను.

“మనకింక ఈ ఆర్టిఫిషియల్లీ ఫ్లేవర్డ్ డ్రింకులే గతి” అంది అక్క ఒక్క గుక్కలో గ్లాసు ఖాళీ చేసేసి.

Jyothiపాలపర్తి జ్యోతిష్మతి

మీ మాటలు

 1. మణి వడ్లమాని says:

  చిన్న విషయమే కాని అది మన కి దొరకనప్పుడు మన దగ్గ్రరలేనప్పుడు పడే చిరాకు,కోపం అసహనం లాంటిభావాలని పట్టి బాగా రాసారు జ్యోతిష్మతి గారు. అభినందనలు

 2. raghava says:

  ఆహ్లాదం గా ఉంది..నిమ్మరసం లాగే!

 3. సహజంగా దొరికే వాటిని కూడా దొరకకుండా ఎలా వ్యాపారాత్మకం చేస్తున్నారో ఈ కథ సులువుగా వివరించింది

 4. venkat munnangi says:

  addanki aahlaadam. maa oori maadhuryam.

 5. ఎట్లాంటి రోజులొచ్చాయి?మంచి కథనం ..

మీ మాటలు

*