రక్తంలో డ్రమ్స్ మోగించే ఊరేగింపు!

Vv_writing

“ఖమ్మం సుబ్బారావు పాణిగ్రాహి నగర్ లో అక్టోబర్ 1970 దసరా రోజు సాగిన విప్లవ రచయితల సంఘం ఊరేగింపు యీనాటికీ నాకు కళ్లకు కట్టినట్లుగా రక్తంలో డ్రమ్స్ ను మోగిస్తుంది… ఒక చిన్న పోరాట రూపంగా ఊరేగింపు నాకనిపిస్తుంది.

ఉపన్యాసాలు మనిషిని వేదికి మీదికి తీసుకపోతే ఊరేగింపులు మనుషుల్లోకి తెస్తాయి. సంకోచం, బెట్టు, సిగ్గు, పోజ్, ఇన్హిబిషన్స్, కాంప్లెక్సులన్నీ పటాపంచలు చేసి పెటీబూర్జువా వయ్యక్తిక ఆలోచనల నుంచి గుంపు మనస్తత్వంలోకి, మంది ఆలోచనల్లోకి తెచ్చే డీక్లాసిఫయింగ్ లక్షణం ఊరేగింపుకు ఉన్నది.”

1974 జనవరిలో నా మూడవ కవితా సంకలనం ‘ఊరేగింపు’ వెలువడినపుడు నేను రాసుకున్న మాటలివి. ఇవ్వాళ ఖమ్మం వర్తక సంఘం హాల్ – వర్తక సంఘం హాల్ గానే మిగిలిందో, ఇంకా రూప సారాలు మార్చుకున్నదేమో గాని ఆనాడు మాకు అది పాణిగ్రాహినగరే. నీరుకొండ హనుమంతరావు రూపుకట్టిన పాణిగ్రాహి నగర్. నేనింకా ఆ హాల్ ముందు ఆయనతోనూ, రావెళ్ల వెంకటరామారావు తోనూ, ‘కౌముది’తోనూ ఊరేగింపు ముగిసిన శరద్రుతు సంధ్యాకాలం అస్తమిస్తున్న అరుణకాంతుల్లో ఉద్వేగంగా పరిచయం చేసుకుంటున్న జ్ఞాపకం.

అంతకుముందు నేనేమైనా ఊరేగింపుల్లో పాల్గొన్నానా? 1952-53లో ముల్కీ ఉద్యమం రోజుల్లో హనుమకొండ మర్కజీ విద్యార్థిగా మొదటిసారి క్లాసు బాయ్ కాట్ చేసి పాల్గొన్నాను. కనుక వ్యక్తిత్వం వికసించే క్రమంలో కలిగే తొలి అనుభవం ఏదైనా హృదయానికి హత్తుకుని ఎన్నటికీ చెరగని ముద్ర వేసినట్లుగా ఖమ్మం ఊరేగింపు ఎప్పుడూ నా జ్ఞాపకాల్లో కదం తొక్కుతూనే ఉంటుంది.

అప్పటికిప్పటికి వందల వేల ఊరేగింపుల్లో పాల్గొని ఉంటాను. ఒక అనుభవం – అధిక ధరలకు వ్యతిరేకంగా 1973 ఆగస్టులో వరంగల్ పోచమ్మ మైదానం నుంచి సుబేదారి కలెక్టరాఫీసుకు సాగిన వేలాది మంది ఊరేగింపు. మా ఊరేగింపులో మఫ్టీలో పాల్గొని, మాకన్న ఆవేశపూరితమైన నినాదాలిచ్చి, డిఐజి ఆఫీసు ముందుకు రాగానే మమ్మల్ని ఎంచుకొని లాఠీ చార్జ్ రూపంలో చితుకబాది పడేసిన అనుభవం.

varavara.psd-1

మరొక మరపురాని ఊరేగింపు కరీంనగర్ లో రైతుకూలీ సంఘం రెండవ మహాసభల సందర్భంగా 1983లో సాగిన ఊరేగింపు నాతో ‘భవిష్యత్తు చిత్రపటం’ రాయించింది. అంతకన్న చరిత్రాత్మకమైనది 1990 మే 6 న వరంగల్ జగదీశ్ నగర్ నుంచి కాజీపేట దగ్గు రాయలింగు, గోపగాని ఐలయ్య నగర్ దాకా సాగిన సుదీర్ఘమైన లక్షలాది మంది ఊరేగింపు. సందర్భం రైతుకూలీ సంఘం మహాసభలు. పద్నాలుగు లక్షల మంది పాల్గొన్న సభలు. ఊరేగింపు నక్కలగుట్ట దాకా వచ్చిన తర్వాత నేను, చలసాని ప్రసాద్ వచ్చి మిమ్మల్ని తీసుకపోతాం – అని కాళోజీకి మాట ఇచ్చాం. కాని ఆ ఊరేగింపు నుంచి ఎంత ప్రయత్నించీ బయటికి వెళ్లలేకపోయాం. అంత గొప్ప అవకాశం మావల్ల కోల్పోయినందుకు కాళోజీ కన్ను మూసేదాకా ఆ విషయం గుర్తుకు వస్తే మమ్ములను తిట్టేవాడు.

హైదరాబాదులో చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా టిడిపి తప్ప మిగతా పార్టీలు, ప్రజాసంఘాలు అన్నీ కలిసి చేసిన ఊరేగింపులో విరసం క్రియాశీలంగా పాల్గొన్నది. బషీర్ బాగ్ చౌరస్తాలో నేను, విమల మొదలైన సభ్యులం చూస్తుండగానే మా కళ్లముందే పోలీసు ఫైరింగ్ జరిగి ఊరేగింపు చెల్లాచెదరైంది. కళ్లల్లో నిండిన గంధకధూమం పొగలు, కసి, కన్నీళ్లతో బయటపడడమే కష్టమైపోయింది.

ఇంక కాళోజీ శతజయంతి, విరసం 44వ మహాసభల సందర్భంగా 2014 జనవరి 11న హనుమకొండ అంబేడ్కర్ భవన్ నుంచి ఆర్ట్స్ కాలేజి ఆడిటోరియం దాకా ఊరేగింపు బీటలు వారిన నేల పులపుల మొలకెత్తిన అనుభవం. నమ్మలేని పునరాగమనం. ప్రతి అడుగూ అమరుల నెత్తుటితో తడిసిన బాట.

–          వరవరరావు

 

మీ మాటలు

  1. balasudhakarmouli says:

    గురువు గారూ…. చాలా ప్రేరణాత్మకమైన ఊరేగింపులను తెలియజేసారు… .. !

    ”ఊరేగింపు…
    నెత్తురు మండే ఆలోచనలకు
    కొనసాగింపు – ”

మీ మాటలు

*