‘ఎగిరే పావురమా’! ….. రెండవ భాగం

GD banner part 2

“దసరాలయ్యి వారమైనా, ఈ తడవ మిగులు పనులు అవ్వనే లేదు. అమ్మోరికి భక్తులిచ్చుకున్న కానుకలు, చీరలు సగమైనా సర్దలేదు,” అంది రాములు మాల కడుతూ.

పదిరోజుల దసరా పూజలకి గుడి హుండీలో తరగని చిల్లర చేరిందంట.
పూల పనులయ్యాక చిల్లర పట్టుకెళ్ళి వేరుచేయమని పంతులుగారు పిలిస్తే వెళ్ళింది రాములు.

చిల్లరతో నిండున్న పళ్ళాలు దొంతిగా పేర్చి పట్టుకొని, అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలా వస్తున్న రాములుని చూసి నవ్వొచ్చింది.
అరుగు మధ్యగా పరిచిన తెల్లటి తుండు మీద చిల్లర పోసుకొని, కాసుల్ని వేరు చేయడం మొదలెట్టాము.
“ఆ చిల్లరంతా అయ్యేంతమటుకు రోజూ కాసేపు చెయ్యాలంట ఈ పని,”… అంది రాములు.

మధ్యానం ఒంటిగంటకి ముందే, కూరల బడ్డీ కాడ ఉండాల్సిన తాత గుడిలోకి రాడం అగుపడింది మాకు. వెనకాల ఓ పెద్దాయన, ఓ ఆడమనిషి కూడా ఉండారు.

“గుడి మూయడానికి ఇంకా అరగంటైనా ఉందే! సత్యమయ్య ఇయ్యాళ కాస్త పెందరాళే తినడానికి వస్తున్నాడా?” అంది రాములు అటుగా చూస్తూ. అప్పటికే ఆ పూట తినడానికి మాకు ప్రసాదాలు, తాగడానికి కొబ్బరినీళ్ళు తెచ్చి పక్కనెట్టింది.
“కాదులే, ఆయనెంట ఇంకెవరో కూడా ఉండారుగా,” అంది మళ్ళీ తనే.

మాకు దగ్గరగా వచ్చాక, ‘ఇప్పుడే వస్తా’ అన్నట్టు సైగ చేసి వచ్చినోళ్ళని గుళ్ళోకి తీసుకుపోయాడు తాత.
**
చిల్లర సంచులు అప్పజెప్పడానికి రాములటెళ్ళగానే, అరుగుల కాడికొచ్చాడు తాత.
తన వెంటున్నోళ్ళని ఆయుర్వేద డాక్టర్లు – లలితమ్మ, శివయ్యలుగా చెప్పాడు.
వాళ్లకి దణ్ణాలెట్టాను.

శివయ్య నాకు ఎదురుగా కూకుంటూ, ”బాగా ఎదిగావు పాప! నిన్ను మూడేళ్ళప్పుడు మా వద్దకు తెచ్చాడు మీ తాత. నిన్ను పరీక్షించి – ఆరోగ్యం, ఎరుక, తెలివితేటలు వయసుకి తగ్గట్టుగానే అనిపించడంతో, నీ కాళ్ళల్లో చలనం, నీ నోటెంట మాట తప్పక వస్తాయనే చెప్పాము,” అన్నాడు.

లలితమ్మ నా పక్కనే కూకుని నా కాళ్ళు పరీక్షించింది. ఎదురుగా నిలబడ్డ తాత వంక చూసి, “చూడు సత్యం, మేము గాయత్రిని చూసి కూడా అప్పుడే ఐదేళ్లవుతుంది. ప్రస్తుతం ఎనిమిదేళ్ళ వయస్సుకి తగ్గట్టుగానే ఉంది. పెరుగుదల విషయంగా ఏ లోటు లేదనిపిస్తుంది,” అన్నదామె.

“మరి నేనిచ్చే తైలం, పసరు కాళ్ళకి పట్టిచ్చి కాస్త మర్దన చేస్తున్నారా గాయత్రీ?” అని ఆమె నన్నడిగిన దానికి తలాడించాను. వారానికి ఒకసారే చేస్తున్నామన్న సంగతి ఆమెకి నచ్చలేదు.

తాత వంక తిరిగి, “పిల్లకి పద్దెనిమిదేళ్ళ వయస్సు వరకు పెరుగుదల ఉంటుంది.
ఈ లోగానే, ముందైతే, గాయత్రిని ఒకసారి మావద్దకి తీసుకొనిరా.
కాళ్ళకి వ్యాయామం చేయడం నేర్పిస్తాను,” అంది డాక్టరమ్మ.

చిల్లరప్పజెప్పి తిరిగొచ్చిన రాములు, ఆమె మాటలింటూ కాస్త ఎడంగా నిలబడుంది.

ఇక వెళ్లాలంటూ అరుగుల మీద నుండి లేచారు లలితమ్మ, శివయ్య.
“ఏమ్మా గాయత్రీ, నువ్వు ఈ పరిమితులు అధిగమించి వృద్ధిలోకి రావాలని కోరుకుంటాము,” అంటూ నన్ను ఆశీర్వదించి వెళ్లారు..

రాములు దగ్గరగా వచ్చి నా భుజం తట్టింది…

“అంటే నీ ఇక్కట్లని దాటి, అందరిలా నువ్వూ నడవాలని, మాట్లాడాలని అంటుంది ఆ డాక్టరమ్మ,” అంది అరుగు మీద పక్కకెట్టిన ఫలారాలు అందుకుంటూ….

**

 

సామాను అప్పజెప్పి మేము ఇంటి దారి పడుతుండగా, మరునాడు సాయంత్రం గుళ్ళో పురాణ కాలక్షేపం ఉందని మాకు గుర్తు చేసాడు పంతులుగారు.
మూడు నెలలకోసారి జరిగే పురాణ కాలక్షేపంకి ఊరంతా కదిలి వస్తది. అదయ్యేంత మటుకు నేను, తాత గుళ్ళోనే ఉండిపోతాము కూడా.

**

మధ్యానం నాలుగింటికి ఇంకోసారి అరుగులు శుభ్రం చేయించారు పూజారయ్య.
నేను, రాములు ముందుగానే పుజసామాను పంతులుగారికి అప్పజెప్పి అరుగుల మీద ఓ పక్కగా కూకున్నాము.
ఆరింటికి మొదలయ్యే కాలక్షేపం కోసం, గంట ముందే – అరుగుల కాడ ప్రత్యక్షమయ్యారు సుబ్బి, మాణిక్యం.

“కాసేపు నీతో కూచుని మాట్లాడచ్చని ముందుగా వచ్చామమ్మా ఓ రాములమ్మా,” అంది నవ్వుతూ సుబ్బి. “ఇదిగో నీకోసం మిరపకాయ బజ్జీలు చేశాను,” అంటూ రాములికి పొట్లం అందించింది మాణిక్యం.
ఆ పొట్లం నా ముందుంచి, ఎదురుగా అరుగు మీద స్నేహితురాళ్ళకి దగ్గరగా కూకుంది రాములు.
నేను ముగ్గుల పుస్తకం ముందేసుకుని, బజ్జీ తింటూ వాళ్ళ మాటలు వింటున్నాను.
కాసేపు ముగ్గురూ కబుర్లు, నవ్వుల్లో గడిపారు.

“కబుర్లకేముంది కాని రాములూ, నీ మామతో సంగతి తేల్చుకున్నావా? లేదంటే నిన్నింకా కాపురానికి పిలుస్తాడన్న భ్రమలోనే ఉంటావా? అడిగింది సుబ్బి.

రాములు తలొంచుకొని నేలచూపులు చూస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

రాములలా కంటతడి పెట్టడం నాకు చాలా బాధేసింది. ఆమె కష్టం ఏంటని తెలియకున్నా, రాముల్ని అలా చూడలేకపోయా.
మాణిక్యం మాత్రం, లేచి రాములికి దగ్గరిగా వచ్చింది.

ఆమె భుజం మీద చేయివేసి, “ఏడవమాకే రాములు. నీకు సాయపడదామన్న ధ్యాసతో గట్టిగా అడిగింది సుబ్బి. నిన్ను కష్టపెట్టాలని కాదు. నువ్వు కళ్ళు తుడుచుకో. తరువాత మాట్లాడుదాములే,” అని సర్దేసింది మాణిక్యం.

“నువ్వుండవే మాణిక్యం. ప్రేమించానంటూ మేనమామని ఈ గుళ్ళోనే కదా! ఏడేళ్ళ కిందట మనువాడింది రాములు. అతనేమో దీన్నొగ్గేసి అప్పుడే నాలుగేళ్ళగా మరెవ్వత్తినో కట్టుకొని వేరే కాపురమెట్టాడు. ఇదేమో అతన్ని గదమాయించి అడగదు. పాతికేళ్ళకే ఒంటరిదై ఎలా బతుకుతుంది ఇది?” అంటూ మండిపడింది సుబ్బి.

‘ఏందో ఇదంతా? వాళ్ళ ముగ్గురి మధ్య గొడవ’ నాకొకింత భయమేసింది.

‘వాళ్ళిద్దరూ తన మేలు కోరేవాళ్ళని, తనకన్నా బాగా చదువుకున్నాకే పెళ్ళిళ్ళు చేసుకొన్నారని చెబుతుంటుంది రాములు. పాలెంలోనే ఉంటూ, కేవలం తన మీద ఆపేక్ష కొద్దీ వచ్చి పోతుంటారంటుంది కూడా.
‘మరి ఇంతలా ఈ తగువులెందుకో, ఈ కేకలెందుకో వీళ్ళ మధ్య’ అనుకున్నాను.

పురాణంకి జనం రాడం మొదలవడంతో, ముగ్గురూ కాస్త సర్దుకున్నారు.

egire-paavurama-2-inside
**
పురాణ కాలక్షేపంలో – మధ్యన కూసేపు, నా ఈడు పిల్లలు పాటలు పాడారు. వాళ్ళల్లో ఎనిమిదేళ్ళ కవలలు చక్కగా పాడారని జనమంతా మెచ్చుకున్నారు. వాళ్ళు పంతులమ్మ మహలక్ష్మిగారి కూతుళ్ళంట.
శిష్యులందరి తరఫునా, ఆమె మెప్పులందుకుంది.
**
ఇలా గుడికొచ్చే నా తోటి పిల్లల్ని చూసినప్పుడు మాత్రం వాళ్ళకీ-నాకు మధ్య తేడా గుర్తొస్తది. అంతే కాదు పోను పోను నా స్థితి ఏమిటో ఎరుకయింది. ‘నేను అందరిలా మాట్టాడలేనని, నడవలేననే కాదు. ఎన్ని రోజులు గడిచినా నాకు మాట, నడక ఇక రావనిపిస్తది. ఎప్పటికీ ఇక ఇంతేనని’ గుబులుగా కూడా ఉంటది.

వెంటనే తాత గుర్తొస్తాడు. నన్ను తాత ఎంతో ప్రేమతో సాకుతున్నాడన్నదీ గుర్తొస్తది.
పసిబిడ్డగా దిక్కులేని నన్ను తాత దయతో దగ్గరికి తీసాడని నాకెరుకే. మరి నాకు అమ్మా నాన్న లేనట్టేగా! అని బాధగా ఉంటది. ఒకవేళ ఉన్నారేమో! ఉంటే ఏమయ్యారు? అని కష్టంగా అనిపిస్తది.

నా చుట్టూ లోకాన్ని చూస్తుంటే, రోజంతా ఈ మధ్య ఇలాంటి ఆలోచనలే కమ్ముతున్నాయి. ఒక్కోసారి పావురాళ్ళు వచ్చి నా ఆలోచనలని మళ్ళిస్తాయి. ఒకటైనా వచ్చి నా భుజం మీద కూడా వాలుతుంది.
పావురంలా ఎంచక్కా నేనూ ఎగిరిపోగలిగితే? నడవలేను-మాట్లాడలేను అన్న ఆలోచనే ఇక ఉండదుగా అనుకొని నవ్వొస్తది.
**
“కోవెల్లో మళ్ళీ దీపాల పండుగ సందడి రాబోతుంది,” అంది అరుగులు కడుగుతూ రాములు.
అరుగులు కాడ తచ్చాడి, అప్పుడే ఆకాశంలోకి ..దూసుకుపోతున్న పావురాళ్ళ వంక చూస్తూ, మా కాడికి వచ్చాడు పంతులుగారు.

చేతుల్లోని ప్రసాదం దొన్నెలు నా పక్కనే అరుగు మీదెడుతూ, మా దినచర్యలో భాగమయిపోయిన పావురాళ్ళు నిజానికి పెంపుడు పక్షులేనన్నాడు ఆయన.
“పావురాయి – శాంతికి, ప్రేమకి, చిహ్నం. నిష్కళంకమైనది కూడా. మీ ఇద్దరూ వాటిని దయతో చూస్తున్నారుగా! మంచిదే,” , “అలాగే ఆ గాయత్రీ దేవిని నమ్ముకోండమ్మా. మిమ్మల్ని ఆ తల్లి కాపాడుతుంది,” అంటూ నా వంక చుసాడాయన.

“ఏమ్మా గాయత్రీ, ఈ మధ్య పూలదండలు కూడా తయారు చేస్తున్నావుగా! ఇవాళ తులసిమాల నీవు చేసిందేనని చెప్పింది రాములు. చక్కగా ఉందమ్మా. కానివ్వు, మంచి పనే,” అంటూ వెనుతిరిగాడు పంతులుగారు.

రాములు వచ్చి నా పక్కనే కూచుని, ప్రసాదం అందుకుంది.
“అంటే, మన పావురాళ్ళు నీకు మల్లేనే అమాయకమైనవి, చాలా మంచివని చెబుతున్నాడు మన పంతులుగారు,” అంది నవ్వుతూ రాములు.
**
దీపాల పండుగ అనంగానే, బారులు తీరే పెమిదలు, రకరకాల తీపి మిటాయిలు, ప్రసాదాలు గుర్తొచ్చాయి. పండుగ బాగుంటుంది.

దీపాల పండుగప్పుడే నా చేత రాములుకి, పిన్నికి కూడా చీర, రవిక, గాజులు ఇప్పిస్తాడు తాతని గుర్తొచ్చింది.

“మా అయ్య జబ్బుపడి మంచాన ఉంటే, మరి మీ తాతే నా మనువు జరిపించాడు. అందుకే సత్యమయ్య నాకు తండ్రితో సమానం,” అని రాములు, గుర్తు చేసుకుంటే,
“సవితితల్లి బిడ్డనైన నన్ను, తన బిడ్డలా చూసుకుంటాడు మా అన్న,” అంటూ కంటతడి పెడుతుంది చంద్రం పిన్ని.
తాతంటే వాళ్ళిద్దరికీ ఎంతో ప్రేమ అని కూడా గుర్తొచ్చింది.

**

వర్షం మూలంగా గుడి కాడనే, ఒకింత ఆగినంక ఇంటిదారి పట్టాము.
కొట్టాం చేరగానే, కాళ్ళు చేతులు కడుక్కొని, పొయ్యికాడ మూతేసున్న ముద్దపప్పుతో బువ్వ తింటుండగా వచ్చారు చంద్రం పిన్ని, రాంబాబాయి.

“ఏందన్నా? ఆలస్యంగా వచ్చారా ఇయ్యాళ? తొందరేం లేదు. మేమాగుతాములే. నింపాదిగా తినండి,” అంటూ మాకు కాస్త దూరంగా గట్టు మీద కూకున్నారు.

గబగబా తినేసి వాళ్ళ కాడికెళ్ళాడు తాత.
“ఇదిగోనే చంద్రమ్మా, నీ లెక్క. ఈ తడవ నువ్వన్నట్టు, చిల్లరంతా పోగేసి నోట్లుగా మార్చి ఉంచాను,” అంటూ తన చొక్కా జేబు నుండి డబ్బు నోట్లు తీసాడు తాత.
“ఇదేమో నీకియ్యాల్సింది. ఇదేమో మన గాయత్రి చెక్క హుండీ లోది. మరి చిన్నదాని లెక్కంతా నీ చేతుల్లోనే ఉంది,” అంటూ వేరువేరుగా ఆ డబ్బుని చంద్రం పిన్ని చేతికిచ్చాడు.

ఆమెనా డబ్బు లెక్కెట్టుకోనిచ్చాడు.
“ఏమైనా, నీ మేలుకి రుణపడి ఉంటానే చంద్రమ్మా. ఇంటి లెక్క, వంట, మా బాగోగులు అన్నీ నీవు చూడకపోతే, మేమెట్టా బతుకుతామో కదా!,” అన్నాడు తాత.
లెక్కెట్టిన డబ్బుని చెంగున ముడేసుకొంది చంద్రమ్మ.
“ఊర్కో అన్నా. ప్రతిసారి నువ్వీ మాటనాలా? తల్లొగ్గేసిన నన్ను ఆగమైపోకుండా కాపాడావన్న విశ్వాసమే అనుకో నాకు,” అంటూ లేచి, వెంట తెచ్చిన వెచ్చాలు పొయ్యికాడ ఉంచొచ్చింది పిన్ని.
రాంబాబాయి కూడా లేచెళ్ళి, పొయ్యి ఎనకాతల కిటికీలో మేకులు కొట్టి, ఏదో చెక్కపని చేడం మొదలెట్టాడు.

“సరేలే గాని, ఇక నుంచి గాయత్రిని రిక్షాలో గుడికి చేర్చన్నా. మా ఆయన కూడా అదే అంటున్నాడు.
నీ వయస్సుకి, ఇంత పిల్లని రెండు ఆమడల దూరం బండి మీద లాగడం మామూలు విషయం కాదు. చిన్న చక్రాలతో తేలిగ్గా ఉండేట్టు నువ్వు గూడురిక్షా చేయించినా, లాగాలిగా! నీ ఆరోగ్యం చూసుకో మరి. లేదంటే, గాయత్రికే కష్టమవుతది.
ఎల్లుండి నుంచి నేను మాట్లాడి పెట్టిన రిక్షాబ్బాయి వస్తాడు,” అని నా స్నానానికి బట్టలు, తుండు అందుకొంది పిన్ని.

“నీకు తెలిసిన రిక్షానా?” అడిగాడు తాత.
“అవును, మా ఆయన పని చేసే రవాణా ఆఫీసులో ఆటోరిక్షా ఇప్పించమని అర్జీ పెట్టాడంట ఒక తెలిసినబ్బాయి. ప్రస్తుతం పాలెంలోనే రిక్షా నడుపుతున్నాడులే అన్నా. మా ఆయన ఈ విషయం నాకు చెబితేనే ఇలా ఏర్పాటు చేసాను,” అంటూ భరోస ఇచ్చింది పిన్ని.

ఈ లోగా మా పొయ్యి ఎనకాతల కిటికీలో, వాళ్ళ కొట్టాం వైపుగా ఒక బడిగంట లాంటిది బిగించాడు రాంబాబాయి. నాకది చూపెట్టి, ‘గణగణా’ దాన్ని మోగించి ఇనిపించాడు కూడా. అత్యవసరంగా వాళ్ళని పిలవాలంటే “గంట మోగించడమే,” అంటూ చేతులు దులుపుకొని, పొలం సంగతి మాట్లాడాలని తాతని బయటికి తీసుకుపోయాడు.
“కాసేపు బాతాఖానికేమో, అట్టా బయటకెళ్ళారు. ఇద్దరికీ మంచి స్నేహితంలే. ఈలోగా నీ పని, నీ బట్టల పని కానిద్దాం పద ,” అంటూ కదిలింది పిన్ని.

**
శుక్రవారాలు అలవాటుగా అమ్మవారికి తులసి మాలలు కడుతుంది రాములు…
మాలలు అందించడానికి వెళ్ళినామె, చేతుల్లో రెండు గ్లాసులతో తిరిగొచ్చింది.
బెల్లం పాయసం నైవేద్యం పెట్టి ప్రసాదం ఇచ్చాడంట పంతులుగారు. నా కిష్టమని తెచ్చానంటూ గ్లాసు చేతికిచ్చింది.
“తాతక్కూడా కాస్త తీసి అట్టే పెట్టాలే, నువ్వు కానిచ్చేయి,” అంది రాములు నా పక్కనే కూకుంటూ.
**

పాయసం తాగాక నా చేతి నుండి గ్లాసందుకుంది.
“నీకు రెండు జడలు ఎయ్యాలని ఉంది. అట్లతద్ది కదా! మధ్యాహ్నం వరకు గుడికి భక్తుల రద్దీ ఉండకపోవచ్చు. గుడిలోని పెద్దదీపాలు బయట పెట్టించారు పూజారయ్య. అవి శుభ్రం చేయడమే ఈ పూట పని. అంటే రద్దీ లేదు, పనీ లేదు, పొద్దూ పోదు,” నవ్వింది రాములు

“నీకు నా ‘అట్లతద్ది’ బహుమానంగా తలకి కొబ్బరి నూనె రాసి, తల దువ్వి ఈత జడెయ్యనా? లేదా రెండు జడలేసి యువరాణికి రిబ్బన్లు కట్టనా?” అని అడిగింది రాములు నా తలపైన మొట్టి.
రాములు తల దువ్వితే నాకిష్టమే. అందుకే రెండు జడలు కావాలని సైగ చేసాను.
నా భుజాల మీద చేతులేసి తలపైన ముద్దెట్టుకుంది రాములు.

”నీ జుట్టు ఇంత ఒత్తుగా, పొడుగ్గా అందంగా ఉంది. నీ బుగ్గన చొట్టలు, చారడేసి తేనెరంగు కళ్ళు, ముద్దొచ్చే నవ్వులు. యువరాణి అందమే. ఎవరి పోలికో గానీ,” అంటూ ఛటక్కున మాటలు ఆపేసింది రాములు.

వెనక్కి తిరిగి లోనికెళ్లి నూనె, రిబ్బన్ల పెట్టి తీసుకొనొచ్చింది. అరుగు మీద నన్ను ముందుకి జరిపి కూకోబెట్టి, జుట్టు చిక్కుదీడం మొదలెట్టింది.

“సరేలే, తిన్నగా కదలకుండా కూకోవాలి మరి. నీ జుట్టు బారెడు. పెద్ద పని కదా. గంట పడుతుందేమో!” అంది రాములు.

ఒకింత సేపటికి విసుగనిపించింది. కూనిరాగాలు తీస్తున్న రాముల్ని సైగలతో ఏదన్నా కథ చెప్పమన్నాను.

ఒక్క క్షణం ఆగి, “ఇయ్యాళ మీ తాత కథ నాకు తెలిసినంత మటుకు సెబుతాను,” అంది రాములు.
తాత గురించి నాకు తెలియని ఊసులు వినడం నాకెంతో ఇష్టం. అసలు, తాత కథ అంటూ రాములు మునుపెన్నడూ చెప్పనేలేదు. వినాలని సంతోషంగా ఉంది. (ఇంకా ఉంది)

**

మీ మాటలు

  1. Sudharani.Machineni says:

    Hi Uma Garu,

    Congrats for nice serial.Never heard of Nakusa, when reading it is a very interesting story and a wonderful creation from your heart.Keep on writing.

    • Kosuri Uma Bharathi says:

      సుధా గారు,
      Thank you much for taking time to read it and for those encouraging words… do continue to read….

  2. Satyam Mandapati says:

    ఉమాభారతిగారు: నేను మొదటి రెండు సంచికలోని మీ నవల చదివాను. విషయపరంగా నాకెంతో ఇష్టమైన సబ్జెక్టు. కథనం కూడా బాగుంది. మంచి ప్రయత్నం చేస్తున్నారు.

    • Kosuri Uma Bharathi says:

      సత్యం గారు, నమస్తే,
      మీరు చదువుతున్నందుకు, మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు. తప్పక అన్ని భాగాలు చదవమని రిక్వెస్ట్….
      ఉమా

  3. కథ కంటకి కనిపిస్తున్న్నట్లుగా ఉంది ….

    • Kosuri Uma Bharathi says:

      అనుపమ గారు,
      మీరు చదివి ఆదరిస్తున్నందుకు, చాలా థాంక్స్. ఈ కథ ఎలా ముగుస్తుందో అని ఆలోచించకండి. చదువి, ఫీడ్బాక్ ఇవ్వడం కంటిన్యూ చేయమని రిక్వెస్ట్..

  4. కథ కంటికి కనిపిస్తున్నట్లుగా ఉంది

  5. My compliments on the way you are dealing with the characters. it caught me in an emotional moment, pushing me to think a lot ….and then I smiled .
    well established story line till the end…

Leave a Reply to Kosuri Uma Bharathi Cancel reply

*