సాయం

radhamanduva1

 

ఫెళ ఫెళ ఉరుములూ, మెరుపులతో పెద్ద వర్షం. ఆకాశం అంతా నల్లని కాటుకగా మారి నా చుట్టూ ఉన్న చెట్లనీ, నా ఒడ్డున ఉన్న ఇళ్ళనీ అంధకారం లోకి నెట్టేసింది. రివ్వున వీస్తున్న చలిగాలికో మరి అక్కడ నుండి కదలడం ఇష్టం లేకో నాలోని ప్రతి నీటి అణువూ వణికిపోతూ ముడుక్కుని కూర్చున్నట్లు నిశ్చలంగా ఉంది.

 

‘రత్తో! అన్నం తింటివా?’ అనో, ‘నరిసీ పనిలోకి బోలా?’ అనో, ‘ఒరేయ్! ఆడకూతురికి సాయం చెయ్యకుండా అట్లా చూస్తా నిలబడినావేందిరా – ఇట్ల పట్టియ్ ఆ కోడిని!?’ అనో గోలగోలగా ఏవేవో మాట్లాడుకునే జనం నా గట్టు మీద ఒక్కళ్ళు లేరు. వానకి దడిసి అందరూ ఇళ్ళల్లో దూరి కూర్చున్నారు. చెట్లల్లో నుండి నా అంచుల్లోకి దుమికి దుమికి ఆడుకునే జీవాలు కూడా ఎక్కడివక్కడ దాక్కున్నాయి.

రంగమ్మవ్వ రాత్రి ఆమెని సముదాయించి ఆమెనీ, ఆమె కూతురునీ తనింట్లోకి తీసికెళ్ళినప్పుడు విముక్తమైనట్లుగా ఉరిమిన ఆకాశం సన్నని తుంపర్లను విదిలించింది. నాలుగో ఝాము నుంచీ మరీ క్షణం తీరిక లేకుండా బిందెలతో పోసినట్లుగా కుమ్మరిస్తూ నా ప్రయాణానికి సన్నాహాలు చేస్తుంది. చెట్లు, పుట్టలు, దార్లు అన్నీ నీళ్ళమయమై నాలోకి చేరుతున్నాయి. మెరుపు మెరిసినప్పుడల్లా నీటి బిందువులు మిరుమిట్లు గొలుపుతున్నాయి.

ఎన్నో చోట్లలో నాకు ఆనుకుని ఉన్న చెట్లనీ, దుబ్బులనీ, రాళ్ళనీ, రప్పలనీ తాకుతూ చెంగుచెంగున పరిగెత్తాలనే నా కోరిక ఇంకాసేపట్లో తీరబోతోంది. దీని కోసం నాలుగేళ్ళ నుండీ ఎదురు చూస్తున్నాను. నిజమే – కాని నాకు ప్రస్తుతం ఇక్కడ నుండి వెళ్ళాలని లేదు.

పుట్టినప్పటి నుండీ సంతోషంగా పరుగులు తీస్తూ ఆడుకున్నాను. ఎప్పుడూ గలగలా నవ్వుతూ ఉండేదాన్ని. నా ప్రక్కనున్న చెట్లనీ చేమలనీ అడిగి వాటి రంగురంగుల ఆకులతో, పువ్వులతో రోజుకో రకంగా అలంకరించుకునేదాన్ని.   ఒడ్డునున్న రాళ్ళని కావాలని తాకి నవ్వేదాన్ని. అవి నేను పెట్టే గిలిగింతలకి నాతో పాటు నవ్వి నవ్వి అలిసి అరిగిపోయేవి.

ఎంత బావుండేవి ఆ రోజులు!? వర్షం ఎక్కడికెళ్ళిందో మరి ఐదేళ్ళనుండీ…. నాకు కనపడకుండా పోయింది. నాలోకి చేరవలసిన నీరు సంగతి అలా ఉంచి, ఉన్న నీరే సూర్యుని దాహానికి సరిపోవడం లేదు. అందరినీ, అన్నింటినీ పలకరిస్తూ పారుతూ పోవలసిన నేను నాలుగేళ్ళుగా ఇక్కడే ఆగిపోయాను. శుష్కించిన శరీరంతో మడుగులాగా పడి ఉన్నాను.

ఆశాదృక్పథంతో జీవితాన్ని సాగించాలనుకునే నేను ఇక్కడ కొచ్చిన కొత్తల్లో పెద్దగా బాధ పడేదాన్ని కాదు. నిజానికి ఈ కొత్త రకమైన నిశ్చలతకి సంతోషంగా ఉండేది.   నా చుట్టూ ఉన్న వాటిని పరిశీలించడం మంచి అలవాటుగా అలవడింది.

నేను ఇక్కడ ఆగాకే నా ఎదురుగ్గా ఇందిరమ్మ ఇళ్ళు లేచాయి. నా ఒడ్డు పై నుంచి మెట్లు ఏర్పరచుకోని ఆడవాళ్ళు బిందెలతో నా దగ్గర కొచ్చి నవ్వుతూ, తుళ్ళుతూ నా నీళ్ళని తీసికెళుతుంటే భలే ఆనందపడేదాన్ని.

తరవాత్తర్వాతే నాలో ఓ రకమైన నిర్లిప్తత ఏర్పడింది. ఏమీ చేయలేని నిస్సహాయత, నిస్పృహలతో బాధపడేదాన్ని.

రెండేళ్ల క్రితం – ఆ రోజు …. నాకు బాగా గుర్తుంది. పడమటింట్లో విశ్రాంతి కోసం సూర్యుడు వేగిరపడుతున్నాడు. ఆర్ర్తత లేశమాత్రమైనా లేని నన్ను గమనిస్తున్న నింగి మందంగా మేఘాలను కదిలిస్తుంది. నేను దిగులుగా ఆకాశాన్ని చూస్తున్నాను. బహుశా ప్రార్థిస్తున్నానేమో!

ఆ సమయంలో నా ఒడ్డు పైన మెత్తని పాదాల చప్పుడు వినిపించింది. తల తిప్పి చూశాను.

అడుగులో అడుగేస్తూ నడుస్తున్న ఆమెకి 24 ఏళ్ళుంటాయి – పుష్టిగా, బొద్దుగా ఉంది. నల్లని నీల మేఘ ఛాయ మేని. పసుపులో అద్దిన తెల్లని పెళ్ళి చీర, మెడలో పసుపుతాడు. దానికి వేళ్ళాడుతూ ఆమె గుండెలని తడుముతున్న మంగళ సూత్రాలు. గోరింటాకుతో ఎర్రగా పండిన చేతులు. కుడి చేతి చిటికెన వ్రేలిని భర్త ఎడమ చేతిలో ఉంచి పారాణి ఆరని పాదాలతో సన్నని అడుగులు వేస్తూ దించిన కళ్ళని మరింత దించి నా వైపు చూసింది.   నా కళ్ళు ఆమె కళ్ళతో కలిసి ఒక్కసారిగా జిగేలుమన్నాయి. చిత్రమైన అనుభూతి నాలో గాఢంగా.

సాయంకాలపు ఎండ కెంజాయ రంగు ఆమె బుగ్గలను తాకి నా నీళ్ళల్లో ప్రతిఫలించింది. చల్లని మలయ మారుతం ఆమె తలలోని మలె్లల పరిమళాన్ని నింపుకొని నా మీదకి వాలింది.   నా వైపు అలాగే చూస్తూ నడిచి తూర్పు దిక్కున నేను ఆగిన చోట ఆగి ఎదురుగ్గా ఉన్న ఇంట్లోకి వెళ్ళింది.

సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. పనుల నుండి జనం ఇళ్ళకి చేరారు. “మ్మే సుజాతా! మన సూరి గాడు పెళ్ళాన్ని పిలచకొచ్చినాడంట సూసేసొద్దాం దా” అంది రత్తి.

“అవునంట. మూడు నిద్దర్లన్నా చేయించకుండా అట్లెట్లా పంపిచ్చేసినారక్కా! సవితి తల్లి వదిలిచ్చేసుకుందనుకో కన్నతండ్రి అన్నా చెప్పగూడదా?” అంది సుజాత కోపంగా.

“ఆఁ! సరేలే పా! వాడొక తండ్రా? తల్లి చచ్చిపోతే సాకాల్సొస్తుందని చిన్నప్పుడే హాస్టల్లో చేర్పించినాడు. పది గూడా చదువుకోనీకుండా ఆ పాప తావున సంపాదిచ్చల్లని మిల్లులోకి కుట్టు పనికి అంపించినాడు. కూతురికి పెండ్లి చేయకపోతే నలుగురూ మొకానూస్తారని చేసినాడు…. ఆ పాప సంపాదించిండే డబ్బుతో తాళిబొట్లు కొని. – తల్లిలేని పిల్ల పాపం, ఈ తాగుబోతు సూరెదవేం బాదలు పెడతాడో? – తొందరగా పోయొద్దాం పద. తెల్లవారి చేసిండే కూర రొంతే ఉంది. ఈ పూట రసం పెట్టాల్ల” అంది రత్తి.

వింటున్న నాకు నా గుండె గొంతుకలో కొట్టాడినట్లయింది.   కళ్ళ నిండా కలలు నింపుకుని సిగ్గుపడుతూ అతని ప్రక్కన సున్నితంగా నడిచి వెళ్ళిన ఆ అమ్మాయిని తల్చుకుని ‘పాపం’ అనుకున్నాను.

అప్పటినుండీ ఆమెనే గమనిస్తున్న నాకు సమయం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదు. ఆమె నవ్వినప్పుడు నేను నవ్వుతూ, ఆమె దిగులుగా ఉన్నప్పుడు ఏమయిందో అని ఆశ్చర్యపోతూ ఆమెలో ఒక భాగమయ్యాను.

నీళ్ళకి అమ్మలక్కలతో వస్తే ఆమె గురించిన విషయాలు తెలుస్తాయనుకుంటే ఎప్పుడూ ఒక్కతే అందరూ పనులకి పోయాక ఏ మధ్యాహ్నమో వస్తుంది. అది నాకు విశ్రాంతి సమయం. నేను పడుకుని ఉంటే నా ప్రక్కనే కూర్చుని నా వైపే కన్నార్పకుండా చూసేది. అప్పుడప్పుడూ సన్నగా నవ్వేది.

2010-10-18

ఆమెని అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. మరీ ఆమె పక్కింట్లో ఉండే రంగమ్మవ్వ ఆమెని తన సొంత కూతురు లాగా చూసుకుంటుంది. కొడుకు కోడలు పనికి పోయాక రంగమ్మవ్వకి ఆమెతోనే కాలక్షేపం.

ఒకరోజు రంగమ్మవ్వ ఆమె పొట్ట వైపు చూస్తూ “పాపా! ఎన్నో నెల?” అంటుంటే నాకు చాలా సంతోషం కలిగింది.

రోజులు గడిచేకొద్దీ నిండుగా మారుతున్న ఆమెని చూస్తూ ఆందోళన పడ్డాను. పిల్ల పుట్టింది. ఆ పిల్ల పుడుతున్నపుడు ఆమె పెట్టిన కేకలకి నేను ఎంతగా వణికిపోయానో!   ఇక ఆ రోజు నుంచీ ఆమె తప్పేమీ లేకుండానే ఆమె జీవితంలోకి చీకటి, దు:ఖం నిర్దాక్షిణ్యంగా అడుగుపెట్టాయి.

“ఆడపిల్లని కనడం నేరమా అవ్వా!” అని బిడ్డని ఒళ్ళో పెట్టుకొని ఆమె అవ్వని అడుగుతుంటే ఇటు నేను అటు రంగమ్మవ్వ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం.

“నీ కర్మ పాపా! ఈ తాగుబోతోడి సంగతి మాకు ముందే తెలుసు. ఆడపిల్లని కాదు పాడు కాదు, ఏదో ఒకటి వంక పైకి దూకి కొట్టడానికి. లోపలికి పద – తుంపర్లు పడతాండాయి – బిడ్డ తడిసిపోతంది” అంది అవ్వ.

నేను గలగలలు మర్చిపోయి ఇక్కడ ఆగిపోయినప్పుడు నాకు కలిగిన దు:ఖం ఆమెలో చూశాను. చీకటి పడుతుందంటే ఇప్పుడు భయంగా ఉంటోంది . మత్తుని తాగి తూలిపోతూ వచ్చే అతను ఇంట్లోకి వెళ్ళిన కాసేపటికే దబదబ ఆమెని కొడుతున్న చప్పుడు, పసిపాప రోదన హృదయ విదారకంగా. ఆ ఏడుపుని వినీ వినీ నా గుండెలు ఎండిపోతున్నాయి. రోజు రోజుకీ క్షీణించిపోతున్నాను. తూర్పు వైపు నుండి పడమర వైపుకి – ఆమె ఇంటి నుంచి దూరంగా – ఇవతలకి జరిగిపోతున్నాను.

ఈమధ్య అతను ఇంటికి సరిగ్గా రావడం లేదు. అతను రాని రోజు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అతను ఇంటికి కావలసినవి కూడా ఏమీ తేవడం లేదులా ఉంది. రోజు రోజుకీ ఆమె నాలాగే కృశించి పోతోంది. మోకాళ్ళ చుట్టూ చేతులు వేసుకొని బరువెక్కిన ముఖంతో నా ఒడ్డున నిశ్శబ్దంగా కూర్చునేది. నాతో ఆమె బాధలన్నీ చెప్పుకొని సాంత్వన పొందేదేమో లేచి లోపలకి వెళ్ళేప్పుడు నన్ను చూసి మెల్లిగా నిర్లిప్తంగా నవ్వేది.   నాకు ఆమె ఏమైపోతుందోనన్న ఆందోళన కలగసాగింది.

నింగిని వేడుకొని వేడుకొని వేసారి పోయి నేను నిష్టూరాలకి దిగిన ఆ రోజుల్లో ఆమె ముఖంలో ఏదో నిర్ణయం తాలూకు ఆలోచనలు కదలాడటం గమనించాను. నాలోని విచారం మాయమై ఆసక్తి చోటు చేసుకుంది.   ఆమెకి మంచి రోజులొచ్చాయన్న భావం నాలో కలిగి ఉప్పొంగిపోయాను.

ఆరు నెలల క్రితం అనుకుంటా పొద్దున్నే ఆమె పాపని రంగమ్మవ్వకి ఒప్పచెప్పి ఎక్కడికో వెళ్ళింది. సాయంకాలం వచ్చేప్పుడు చేతిలో సంచులు. “అవ్వా! పని దొరికింది. ఇంతకు ముందు నా చేత చీరలు కుట్టించుకున్నోళ్ళంతా తలా ఒక చీరిచ్చినారు కుట్టమని” అంది. ఆమెలో, ఆమె మాటల్లో మునుపెన్నడూ లేని ఆత్మవిశ్వాసం నాకు కనపడింది. గర్వపడ్డాను. ఆరోజు ఆకాశం నన్ను సన్నని జల్లులతో తడిపింది. పోయిన ప్రాణం వచ్చినట్లయింది.

ఆమె ముఖంలో ఈ మధ్య ఓ తృప్తిని చూస్తున్నాను.   రెండు నెలల క్రితం పెద్ద బంకు తెచ్చి ఆమె ఇంటికి ఆన్చి షాపులాగా పెట్టుకుంది. కారుల్లో పెద్ద పెద్ద ఇళ్ళ ఆడవాళ్ళు వచ్చి ఆమెకి చీరలు ఇచ్చి పోతున్నారు. రకరకాల పూసలతో, ముత్యాలతో, దారాలతో ఆమె ఆ చీరలని అందంగా అలంకరిస్తుంటే నేను చెట్ల ఆకులతో, పువ్వులతో అలంకరించుకునే రోజులు గుర్తొచ్చి ఆనందం కలుగుతోంది.

పగలంతా అంత పని చేస్తూ కూడా వెలిగి పోయే ఆమె ముఖం చీకటి పడుతుందంటే చాలు నల్లబడిపోయేది. ప్రతిరోజూ అతని చేతిలో ఆమె తన్నులు తినవలసిందే. ఎప్పుడూ వర్షం కురవాలని ప్రార్థించే నేను ఇప్పుడు ఆ సంగతే మర్చిపోయి ఆమె ఏడవకుండా ఉండాలని ప్రార్థించసాగాను.

రోజులు గడుస్తున్నాయి. నాకేదో సంతోషం కలిగించాలని అప్పుడప్పుడూ చిన్న చిన్న జల్లులు తప్ప ఆకాశం నా ఏ కోరికా తీర్చడం లేదు.

ఆ రోజు మొదటి ఝాము వరకూ వెన్నెలని కురిపించిన పౌర్ణమి చంద్రుడు క్రమంగా మందగిస్తున్నాడు. నీడలు పొడుగ్గా పడుకుని విశ్రమిస్తున్నాయి. ఆ సమయంలో అతను తూలుతూ వచ్చాడు. రోజూ అతన్ని చూసి అసహ్యంతో కనులు ముడుచుకునే నేను ఆ రోజు ఏదో అగాధమైన మానసిక స్థితిలోకి నెట్టబడినట్లుగా అభావంతో చూస్తుండిపోయాను.

ఆమె వాకిట్లో కూర్చుని దీపపు వెలుగులో చీర కుట్టుకుంటోంది. ఆమెని అలా చూస్తున్న నాలో ఏదో చైతన్యం లోపల లోలోపల అంతరాంతరాలలో మొదలై మెల్లమెల్లగా నా హృదయాన్ని శాంతిమయం చేస్తోంది. కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ఏం జరగబోతుందో వినడానికి ఆయత్తపడుతున్నాను.

ఒక్కసారిగా భగ్గుమంటూ వెలుగు, వెనువెంటనే ఆమె ఆక్రందన. అతనంతగా ఆమెని హింసిస్తున్నా ఎప్పుడూ కూడా అలాంటి అరుపు ఆమె నోటి వెంట రాలేదు.   దిగ్భ్రాంతితో కూడిన అదురుతో అదాటున కళ్ళు తెరిచి చూశాను. ఆమె అరుస్తూ తన కాళ్ళ దగ్గర మండుతున్న చీరని వంగి చేతులతో ఆర్పుతుంది.

అప్పటికే ఆమె కేక విన్న ప్రక్క ఇళ్ళ వాళ్ళూ, నా ఒడ్డున ఒళ్ళు మరిచి నిద్రిస్తున్న వాళ్ళూ లేచి పరిగెత్తుతున్నారు.   ఏం జరిగిందో అర్థం కాక ఉద్వేగంతో నా ప్రాణం పోతున్నట్లయింది. ఉన్నట్లుండి హోరుగా చలిగాలి వీచసాగింది – చెట్ల వేళ్ళని కదిలించేంత బలంగా. నేను ఆమెకేమయ్యిందో తెలుసుకోవాలని గాలి సాయంతో ఊపు తెచ్చుకొని ఆమె ఇంటి వైపుకి జరిగాను.

ఆమె ఇంటి ముందు జనం గుంపుగా చేరి గందరగోళంగా అరుచుకుంటున్నారు. గుంపులోంచి దారి చేసుకోని రంగమ్మవ్వ, ఒక చేతిలో లాంతరు మరో చేతిలో ఆమె రెక్కా పట్టుకొని నడిపించుకుంటూ నా దగ్గర కొచ్చింది. వాళ్ళ వెనకే నలుగురైదుగు ఆడవాళ్ళు. అవ్వ లాంతర్నికింద పెట్టింది. గాలికి లాంతరు రెపరెపలాడుతోంది. రంగమ్మవ్వ నా మీదకి వంగి నా అంచునున్న బురద మట్టిని తీసి ఆమె అరచేతులకి పూసింది. కాలి బొబ్బలెక్కిపోయి ఉన్నాయి ఆమె చేతులు.

“అవ్వా! చీర కాలిపోయింది.   మేడమ్ కి ఏం సమాదానం చెప్పాల్ల? ఇట్లని తెలిస్తే ఇంకెవురూ పనియ్యరవ్వా!” ఆమె కదిలి కదిలి ఏడుస్తోంది పేగులు కదిలిపోయేట్లుగా.

“ఏం జరిగింది పాపా అసలు?” అంది రంగమ్మవ్వ.

“కరెంటు పోయిందిగా అవ్వా. రేపు మద్దేనానికంతా చీర ఇచ్చెయ్యాల్లని చెప్పింది మేడమ్. గుడ్డి దీపంలో కనిపిచ్చకపోతే ఎన్నెల ఎలుతురుండాదని వాకిలి తీసి చీర కుట్టుకుంటున్నా. ‘వాకిలి తీసి పెట్టి ఎవుడికి గేలమేస్తన్నావే’ అంటా నా మీద కొచ్చాడు కొట్టడానికి. తూలి దీపం బుడ్డి మీద పడ్డాడు. దీపం చీర మీద పడి మంటలు లేచినాయి. ఆర్పినాను గాని ఆపాటికే చీర పైట కొంగంతా కాలిపోయింది. బయమేస్తాందవ్వా! ఆ మేడమ్ కేం చేప్పేది? ఏమంటాదో?” అంది. ఆమె గొంతులో నిస్సహాయతని విన్న నా హృదయం ద్రవించిపోయింది.

వెనగ్గా వస్తున్నోళ్ళు కూడా గబగబా ఆమె చుట్టూ చేరారు.

“అందురూ మొకానూసినా సిగ్గులేకుండా ఎద్దులాగా పడి నిద్రపోతాన్నాడు ఎదవ సచ్చినోడు” అంది రత్తి.   రత్తి చేతిలో ఆమె బిడ్డ ఉంది.

“నీకేం కర్మమొచ్చిందే ఈ మొగుడితో పడి ఏడవడానికి. చీరలు కుట్టుకోని సంపాదిచ్చుకుంటాండావు. వాడికి నువ్వు కూడేస్తండావు గాని నీకు వాడు కూడేస్తాండాడా? నేనైతే లెయ్యరా నా బట్టా! నీతో నాకేం పని? అని అనుండేదాన్ని. నువ్వు గాబట్టి వానితో యాగతావుండావు” అంది నరిసి.

“తాగినోడి తావున తన్నులు తినే దాన్ని నిన్నే చూసినా. వాన్నీడ్చి పాడేయలేనిదానివి నువ్వేమి ఆడదానివమ్మే? చేతిలో కట్టె పట్టుకో రేపటినిండి – పైకి దూకితే ఎయ్యి సచ్చినోడిని కాళ్ళిరిగేట్టు” అంది రత్తి కసిగా.

“ఊరుకోండమ్మే కొట్టుకుంటా ఉంటే సంసారాలేం బాగుపడతాయి? రేపు వాడిని పంచాయితీకి లాగి బయం పెట్టిచ్చాల్ల ఇంకోసారి పాప ఒంటి మీద సెయ్యి ఎయ్యకుండా వార్నింగిప్పిచ్చాల్ల” అంది రంగమ్మవ్వ.

ఆ మాటలు విన్న ఆమె ఏడవడం ఒక్కసారిగా మర్చిపోయి తల ఎత్తి వాళ్ళ వైపు చూసింది. వేదనతో కమిలిన ఆమె బుగ్గల మీద నుండి అప్పటి వరకూ ధారాపాతంగా కారిన కన్నీళ్ళు ఆగిపోయాయి.

“మీరందురూ నా తావున నిలబడుంటే నాకు బయం పోయిందవ్వా! మా అమ్మకి గూడా అప్పుడు పక్కిళ్ళోళ్ళు ఇట్లా దైర్యం చెప్పిండింటే మందు తాగి చచ్చిపోయుండేది కాదేమో అవ్వా! ” అంటూ భుజంతో కన్నీళ్ళని తుడుచుకుంది.   తల్లిని తలుచుకోవడం వల్ల అయుంటుంది ఆమె తుడుచుకుంటున్నా కూడా ఆగకుండా కన్నీళ్ళు కారిపోతున్నాయి.

“ఏడవగాకమ్మే మేమంతా ఉళ్ళా” అంది రత్తి ఆమెకి దగ్గరగా వచ్చి.

“రత్తక్కా! చీర నువ్వు పని చేసి పెట్టే మేడమ్ దే” అంది ఆమె.

“చీరని గూర్చి గూడా దిగులొద్దులే పాపా! రేపు పంచాయితీ అయినాక బజారుకి పోయి అలాంటి చీరే ఒకటి కొని కుట్టిద్దువుగాన్లే. దొరక్కపోతే దాని కరీదు కడుదువుగాని” అంది రంగమ్మవ్వ.

“చాలా కరీదుంటదవ్వా! అంతేడదెచ్చేది?” రత్తి దగ్గరున్న బిడ్డని తీసుకొని భుజాన వేసుకొంటూ అంది ఆమె.

“ఎట్లోకొట్లా చేద్దాం లేమ్మే!” అంది సుజాత. ఆ ఏరియాలో సుజాతే కాస్త కలిగినది.

“నేను గూడా చెబుతాలే మేడమ్ కి, ఆయమ్మ మంచిది” అంది రత్తి

‘ఇవుళ్ళా’ అన్నట్లు బిడ్డ ఆమె మెళ్ళో ఉన్న పసుపుతాడుని పట్టుకుంది నిద్రలో. మంగళ సూత్రాలు తన అరచేతిలోకి తీసుకుని వాటి వైపే తదేకంగా చూసి తల ఎత్తి రంగమ్మవ్వ వైపు చూసింది. ఆ చూపుని, ఆ చూపులోని నిశ్చయాన్ని గుర్తించిన ఆ ఆడవాళ్ళ ముఖాలు తెరిపిన పడ్డట్లయ్యాయి.

నేను గిర్రున సుళ్ళు తిరుగుతూ ఆనందబాష్పాలతో ఆకాశాన్ని చూశాను.

ఫెళ ఫెళ మంటూ ఆకాశం ఉరిమింది. ‘వర్షం వచ్చేట్లుంది పదండి పదండం’టూ జనం గబగబా అక్కడ నుండి కదిలారు. రంగమ్మవ్వ ఆమెని ఆమె బిడ్డతో సహా తనింట్లోకి నడిపించుకు వెళ్ళింది.   సన్నని జల్లుగా మొదలైన ఆ వర్షం తెల్లవారేప్పటికి బలపడి ఏకధారగా కురుస్తోంది.

సంతోషంగా ప్రయాణించవలసిన నేను ఆమె జీవిత పయనాన్ని కళ్ళారా చూడాలని కదలకుండా ముడుక్కున్నట్లుగా కూర్చుని ఉన్నాను. అంతా అర్థం అయ్యి కూడా అర్థం లేకుండా ఆతృత పడుతున్న నన్ను చూసి ఆకాశం మెరుపు ముఖమేసుకుని ఆప్యాయంగా నవ్వుతోంది.

ఆ నవ్వు చూసిన నా మనసు నెమ్మదించి నిండుగా మారింది.   ఆమెని, ఆమె చుట్టూ ఆమెకి రక్షణగా ఉన్న స్రీ్తలని తల్చుకుంటూ నేను నిదానంగా, గంభీరంగా అక్కడ నుండి సాగిపోయాను.

మీ మాటలు

  1. కథ బాగుంది పిన్నీ. పేదవాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఒకరికొకరు సాయంగా ఉన్నట్లు మధ్యతరగతి ఇంకా పైస్తాయి వాళ్ళ ఇళ్ళల్లో ఉండరేందుకో

  2. నీ అబ్జర్వేషన్ కరెక్టే దీపూ…. కథ నచ్చినందుకు థాంక్స్.

మీ మాటలు

*