నిజమైన చరిత్ర ‘బహుజన’ తెలంగాణాలో వుంది!

sangisetti- bharath bhushan photo
    షరతులు, మినహాయింపులు, ఆంక్షలతోనైతేనేమి ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. ఇవ్వాళ భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. తెలంగాణ ప్రజలు కోరుకుంది కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే కాదు ‘బంగారు తెలంగాణ’ కావాలని కోరుకుండ్రు. ఈ బంగారు తెలంగాణ కేవలం ‘బహుజన తెలంగాణ’ ఇంకా చెప్పాలంటే సామాజిక న్యాయం ద్వారానే సాధ్యమౌతుంది. సామాజిక న్యాయం అంటే సమాజంలోని అట్టడుగు వర్గానికి సైతం వారి జనాభా దామాషాలో చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం. ఒక్క ప్రాతినిధ్యమే కాదు అభివృద్ధిలో భాగస్వామ్యమూ కూడా కావాలి. 60 యేండ్ల తెలంగాణ పోరాటానికి  నిజమైన గుర్తింపు, గౌరవం, న్యాయం ‘బహుజన తెలంగాణ’తోనే సాధ్యమౌతుంది.

ప్రత్యేక తెలంగాణ న్యాయమైన డిమాండ్‌ అని చెబుతూ ఏ విధమైన సిద్ధాంతాలు, వాదనలు, ప్రాతిపదికలు, పోరాట ప్రతీకల్ని ముందుకు తీసుకొచ్చి, చారిత్రిక, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కవులు, రచయితలు, పరిశోధకులు, బుద్ధిజీవులు చైతన్యాన్ని కలిగించారో ఈనాడు ‘బహుజన తెలంగాణ’ కోసం కూడా అదే విధమైన ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరముంది. ఒక ప్రాంతంగా తెలంగాణ అస్తిత్వం ఖాయమైంది. ఇప్పుడు అస్తిత్వానంతర దశలో 90శాతంగా ఉన్న బహుజనులకు రాజ్యాధికారం ఎలా దక్కాలనే అంశంపై దృష్టి సారించాలి. న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన వాటాని యాచించకుండా శాసించే స్థాయికి సమాజంలో అణచివేతకు గురైన వర్గాలు ఎదగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణకు  సార్ధకతా వస్తూంది.
ఇప్పటికే తెలంగాణ పౌరుషం, పోరాట పటిమ, త్యాగాల చరిత్ర అంటే చాలు సమ్మక్క సారలమ్మ మొదలు, సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, మియాసాహెబ్‌, జంబన్న, తుర్రెబాజ్‌ఖాన్‌, బందగీ, కొమురం భీమ్‌, దొడ్డి కొమురయ్య, షోయెబుల్లాఖాన్‌, చాకలి ఐలమ్మలు, సదాలక్ష్మి, సంగెం లక్ష్మిబాయి తదితరులు రికార్డయ్యారు. వీరికి సరిసమానులైన బహుజన వీరులు, వీర వనితలు వందలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరెవ్వరూ ఇంతవరకూ చరిత్ర పుటల్లో కెక్కలేదు. పాఠ్యపుస్తకాల్లో అసలే లేరు. వీరిని వెలుగులోకి తీసుకొచ్చి కొత్త చరిత్రను బహుజన దృక్కోణంతో తిరగరాయాలి. కొత్త రాష్ట్రంలో విద్యార్థులందరూ వీరి ఘనతను తెలుసుకోవాలి. ఈ పని ఇప్పుడు చేయనట్లయితే భవిష్యత్తులో మరింత కష్టతరమైతుంది. భౌగోళిక తెలంగాణ కోసం అగ్రవర్ణాలతో కలిసి బహుజనులు కొట్లాడిరడ్రు. ఇప్పుడు ‘సామాజిక తెలంగాణ’ కోసం అవసరమైతే అగ్రవర్ణాల వారితో సైతం తలపడాలి. ఇందుకోసం బహుజన సమాజాన్ని మరింతగా చైతన్య పర్చాల్సిన అవసరముంది.

ఈ బాధ్యత బుద్ధిజీవులు, ఉద్యమకారులపై మరింత ఎక్కువగా ఉంది. సమాజంలో అణచివేతకు గురైన అట్టడుగు వర్గాల వారి చరిత్రను, ఘనతను ఎలా వెలుగులోకి తేవాలో, తద్వారా ప్రజల్లో ఎంతటి ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుందో ఉత్తరప్రదేశ్‌లో మాయావతి అమల్లో చేసి చూపెట్టింది. తెలంగాణలో న్యాయంగానైతే పీడిత ప్రజల పక్షాన నిలబడుతామని చెబుతున్న ప్రభుత్వం విస్మరణకు గురైన బహుజన వీరుల్ని వెలుగులోకి తేవాలి. ఒక వేళ ప్రభుత్వం ఆ పని చేపట్టనట్లయితే బుద్ధిజీవులు అందుకోసం ముందుకు రావాలి. కేంద్ర, రాష్ట్ర పరిశోధక సంస్థలు ఈ విషయమై దృష్టి సారించాలి. పరిశోధన చేయించాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందుకు తోడ్పడాలి. మాయావతి అధికారంలో ఉన్న కాలంలో 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న దళితుల చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి చరిత్రలో చిరస్మరణీయమైన స్థానాన్ని కల్పించింది.
ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలో బహుజనసమాజ్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బహుజన చరిత్రకు గౌరవం దక్కింది. అప్పటి వరకు మరుగునపడ్డ మహనీయుల చరిత్రను వెలుగులోకి తేవడానికి ప్రభుత్వం నిధులు కేటాయించి మరీ పరిశోధన చేయించింది. వాటిని అందరికీి అందుబాటులోకి తెచ్చింది. వివక్షకు, విస్మరణకు గురైన వీరులను జ్ఞాపకం చేసుకునేలా ‘సామాజిక్‌ పరివర్తన్‌ కే లియే సంఘర్ష్‌ కర్నేవాలే మహాపురుషోంకా సమ్మాన్‌’ పేరిట మాయావతి ప్రభుత్వం పుస్తకం ప్రచురించింది. విస్తృత ప్రచారం కల్పించింది. జిల్లాలకు బహుజన యోధుల పేర్లు పెట్టడం తద్వారా ఆ వర్గాల వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడిరప జేసింది. అప్పటి వరకూ ఆదరణ లేకుండా పోయిన మహాత్మ బుద్ధ, మహర్షి వాల్మీకీ, ఏకలవ్య, కబీర్‌దాస్‌, అహల్యాబాయి హోల్కర్‌, ఛత్రపతి సాహూ మహరాజ్‌, జ్యోతి బాఫూలే, నారాయణగురు, పెరియార్‌ రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్‌ల గురించి విరివిగా ప్రచారం జరిగింది. వారి రచనలన్నింటిని పునః ప్రచురించడమైంది.

1380399_10201616179779262_1021311603_n

1857 పోరాటంలో వీరాంగనలు పోషించిన పాత్రను కూడా ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బుందేల్‌ఖండ్‌లో రాణీ లక్ష్మీబాయికి మారుగా యుద్ధం చేసిన బహుజన వనిత రaల్కారీ బాయితో పాటుగా స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న బహుజన పులి బిడ్డలు ఉదాదేవి, మహవీరి దేవి, అవంతీబాయి లోధీ, పన్నాధాయిల చరిత్ర బిఎస్పీ అధికారంలో ఉన్నప్పుడే వెలుగులోకి వచ్చాయి. బిఎస్పీ మొదట 1995 జూన్‌లో అధికారంలోకి వచ్చింది. అప్పటికే మండల్‌ కమీషన్‌ అమలుకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలు చేసిన అలజడిని నిరసిస్తూ దళిత, బహుజనులు ఒక్కటై ఉద్యమం చేసిండ్రు. ఈ చైతన్యం తర్వాతి కాలంలో మాయావతి అధికారంలోకి రావడానికి తోడ్పడిరది. 1984 నుంచి బిఎస్పీ ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ అధికారం దక్కించుకోవడానికి ఒక దశాబ్దం వేచి ఉండాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కవులు, రచయితలూ పాటలు, కవిత్వం, వ్యాసాలు, రచనల ద్వారా తామూ చరిత్రకెక్కదగిన వారమే అని నిరూపించుకున్నారు. ప్రతి తాలూకా కేంద్రం నుంచి ఉత్తరప్రదేశ్‌లో దళితులకు సంబంధించిన చిన్న చిన్న పత్రికలు ప్రచురితమయ్యాయి. ఇవన్నీ దళిత అస్తిత్వ ఉద్యమానికి ఊతమిచ్చాయి. ఇదే తర్వాతి కాలంలో అధికారం అందుకోవడానికి సోపానమయ్యాయి. దాదాపు ఇవే పరిస్థితులు తెలంగాణలో ‘టీఆర్‌ఎస్‌’ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాయి. వందలమంది బహుజన కవి, గాయకులు వేల పాటల్ని కైగట్టి పాడిరడ్రు. విస్మరణకు గురైన వీరుల్ని/వీర వనితల్ని వెలుగులోకి తెచ్చిండ్రు. సమాధి చేయబడ్డ ప్రతిభకు పట్టం కట్టిండ్రు.
1995 నుంచీ మరీ ముఖ్యంగా 2005 నుంచీ దళిత చైతన్యం`స్ఫూర్తి, చరిత్రకు సంబంధించిన సాహిత్యం ఇబ్బడి ముబ్బడిగా వెలుగులోకి వస్తోంది. పెద్ద ఎత్తున ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న దళితుల గురించి రచనలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న రాణీ లక్ష్మీబాయికి తోడ్పడిరది రaల్కారీబాయి. ఈమె బహుజన వనిత. ఇప్పటికీ తెలంగాణ మాదిరిగానే ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేస్తున్న బుందేల్‌ఖండ్‌లో జానపద గాయకులు ఆమె యశస్సును గానం చేస్తారు. మోహన్‌దాస నైమిశ్రాయ్‌ ఆమెపై హిందీలో పుస్తకం అచ్చేశాడు. తెలుగులో కూడా ఆమె జీవిత చరిత్రను హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ ఇటీవల ప్రచురించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బద్రినారాయణ దళితుల ఔన్నత్యం, చరిత్రకు సంబంధించిన అనేక వ్యాసాలు, సోషల్‌సైంటిస్ట్‌, ఇపిడబ్ల్యూ లాంటి ప్రసిద్ధిగాంచిన పత్రికల్లో వెలువరించాడు. ఇటీవలే దళితోద్యమ చరిత్రను వెలువరించాడు.‘విమెన్‌ హీరోస్‌ అండ్‌ దళిత్‌ అస్సర్షన్‌ ఇన్‌ నార్త్‌ ఇండియా ` కల్చర్‌, ఐడెంటిటీ అండ్‌ పొలిటిక్స్‌’ పేరిట బద్రినారాయణ పుస్తకాన్ని 2006లో వెలువరించాడు.
సరిగ్గా ఇదే పద్దతిలో తెలంగాణలోని బహుజనుల జీవిత చరిత్రలు వెలుగులోకి రావాల్సిన అవసరముంది.    కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న వీర వనితలు సమ్మక్క, సారలమ్మలు, గోల్కొండ కోట మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న, పరాయి వారి పాలన పోవాలంటూ బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు తుర్రెబాజ్‌ఖాన్‌ల గురించి ‘ఈటన్‌’లాంటి విదేశీయులు పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చిన విషయాల్నయినా తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. చెరువులు తవ్వించి పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టిన రాబిన్‌హుడ్‌లు పండుగ సాయన్న, మియా సాహెబ్‌ల గురించి ఇప్పటికీ పాలమూరు జిల్లాలో క్యాసెట్ల రూపంలో కథలు ప్రచారంలో ఉన్నాయి. అధికారులు వీరిని గజదొంగలు అని ముద్ర వేసినప్పటికీ వీరు ప్రజోపయోగమైన పనులు చేసి ప్రజల మన్ననలకు పాత్రులయ్యారు. చార్మినార్‌ కొమ్ములకు తాడేసి ఉయ్యాల ఊగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ప్రజా వీరుడు బండ్లోల్ల కురుమన్న ఈ గడ్డ బిడ్డలే అన్న సోయితో మెలగాలి.
నవచోళ చరిత్ర, మల్హణ చరిత్ర, శంకర దాసమయ్య, వీర సంగమయ్య దేవ చరిత్ర, శిష్యప్రబోధము అనే ద్విపద కావ్యాలను రాసిన కుమ్మరి కులానికి చెందిన పోశెట్టి లింగకవి, నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం, జనార్ధనాష్టకము తదితర గ్రంథాలను రచించిన నల్లగొండ జిల్లావాడు కందుకూరు రుద్రకవి, 1417లోనే ‘తెలంగాణ పురము’ అనే పదాన్ని మొదట శాసనాల్లో వేయించిన తెల్లాపూర్‌ (మెదక్‌ జిల్లా) పంచాణం వారి గురించి గానీ, ‘సీమంతిని విలాసం’ కావ్యాన్ని రాసిన ‘గాండ్ల’ తెలిక కులానికి చెందిన వరంగల్‌ జిల్లా మహేశ్వరం గ్రామానికి చెందిన సుంకరనేని ఫణికుండలుడు, ఈతని తమ్ముడు ‘విజయ విలాసం’ అనే కావ్యాన్ని, సుభద్రా పరిణయమనే యక్షగానాన్ని రాసిన సుంకరనేని రాజమౌళి, ఇబ్బడి ముబ్బడిగా తత్వాలు, కీర్తనలు రాసి, పాడి వందలాది మంది భక్తులకు మార్గదర్శనం చేసిన మాదిగాయిన దున్న ఇద్దాసులకు చరిత్రలో న్యాయమైన స్థానము దక్కలేదు. వీరే కాదు ఇంకా వేపూరి హనుమద్దాసు, గుజ్జరి యెల్లాదాసు, ఏలె ఎల్లయ్య, కైరం భూమాదాసు, మఠం మహంతయ్య, ఆయన భార్య మఠం మహంతమ్మ, గడ్డం రామదాసు, గవండ్ల రాజలింగకవి, కంసాలి సుబ్బకవి లాంటి అనేకమంది కవులకు తెలుగు సాహిత్య చరిత్రలో అనామకులుగా మిగిలారు. గోలకొండ కవుల సంచికలో ప్రతి కవీ ఏ కులానికి చెందిన వాడో విడిగా వివరంగా పేర్కొన్నారు. వారి గురించి లోతైన పరిశోధనలు జరిపినట్లయితే ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి.
తెలంగాణ బహుజనుల్లో చైతన్యం తీసుకురావడానికి తమ జీవిత కాలం కృషి చేసిన ఎందరో మహానుభావుల గురించి తెలుసుకోవాల్సిన తరుణమిది. కల్లు డిపోల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ మొదలు, గౌడ విద్యార్థులు చదువుకునేందుకు 1925 ఆ ప్రాంతంలోనే లక్షల రూపాయలు వెచ్చించిన చైతన్య స్ఫూర్తి చిరాగు వీరన్న గౌడ్‌, ఆంధ్రమహాసభ మూడ్రోజుల పాటు నిజామాబాద్‌లో 1937లో సమావేశాలు నిర్వహించింది. ఇందులో దాదాపు వెయ్యిమంది వివిధ ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే గాకుండా వచ్చిన వారందరికి ఆ మూడ్రోజులు ఎలాంటి లోటు రాకుండా భోజన వసతి కల్పించిన వారు నర్సాగౌడ్‌,  దేశంలోనే మొట్టమొదటి సారిగా డిచ్‌పల్లిలో కుష్టువ్యాధి చికిత్సా కేంద్రం ఏర్పాటుకు కారణం కూడా ఈయనే. నర్సాగౌడ్‌ వందేళ్లకు పూర్వమే 100ల ఎకరాల స్థలాన్ని అందుకోసం ఉచితంగా ఇచ్చిన వితరణశీలి. ఆంధ్రప్రాంతం నుంచి ఏ పండితుడు వచ్చినా తన ఇంట్లో అతిథి మర్యాదలు చేసిన దర్జీ నాంపల్లి గౌరీశంకరవర్మ. భారతదేశానికి ‘సింగర్‌’ కుట్టు మిషన్‌ని పరిచయం చేయడమే గాకుండా, తాను బాగా డబ్బు సంపాదించడమే గాకుండా, ధనాన్నంతా సాహిత్య, సాంస్కృతిక రంగానికి వెచ్చించాడు.

శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి ఎంతో సేవచేసిండు. హైదరాబాద్‌ నగరంలో వందేండ్లకు పూర్వమే పాఠశాలను స్థాపించి బహుజనుల కోసం కృషి చేసిన యదటి సత్యనారాయణ సాగర్‌, ఆవుశెట్టి మంగయ్య, యాదటి పుల్లయ్యలుకూడా సగర వంశస్థుల అభివృద్ధికి పాల్పడ్డారు. పిక్టోరియల్‌ హైదరాబాద్‌ రెండు సంపుటాలుగా వెలువరించి హైదరాబాద్‌ ఘనతను ప్రపంచానికి చాటిన మాజీ హైదరాబాద్‌ మేయర్‌ కృష్ణస్వామి ముదిరాజ్‌, ఇదే కులానికి చెందిన కేశవులు, బి.వెంకట్రావ్‌, బి.వెంకటస్వామి, బి. రంగయ్య, చింతల వెంకటనర్సయ్య, నవాడ ముత్తయ్య, కేవల్‌కిషన్‌ తదితరుల గురించి అందరికీ తెలియాలి. శ్యామరాజు, కామరాజు లాంటి భట్రాజు సోదరుల ప్రతిభ అందరికీ తెలియదు. 1920 నాటికే యాదవ సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగెం సీతారామయ్య యాదవ్‌, ఆంధ్రమహాసభలు ఎక్కడ జరిగినా ఆర్థికంగా ఆదుకున్న వారిలో ముందువరుసలో నిలిచేది పద్మశాలి వితరణశీలురు హకీం నారాయణదాస్‌, హకీం జనార్ధన్‌ దాస్‌. వీరిద్దరూ నిజాంకు రాజవైద్యులుగా పనిచేశారు. అలాగే గుంటుక నరసయ్య పంతులు, మాటేటి పాపయ్య ఆయన తనయుడు సికింద్రాబాద్‌ తొలి కమీషనర్‌ మాటేటి రామప్పలు కూడా తెలంగాణలో ప్రజా చైతన్యానికి దారులు వేసిండ్రు. నిజాం రాష్ట్రాంధ్ర ‘మున్నూరు కాపు మహాసభ’ను స్థాపించిన బొజ్జం నర్సింలు, సింగంశెట్టి బాబయ్య, శ్రీపతి రంగయ్య, గిరి పెంటయ్య తదితరులు సంఘాల్ని పెట్టడమే గాకుండా హాస్టల్స్‌ స్థాపించారు. పేద విద్యార్థుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసిండ్రు. గ్రంథాలయాల్ని కూడా స్థాపించిండ్రు.

1932లోనే విశ్వబ్రాహ్మణ మహాసభ నిర్వహించిన చింతపల్లి రాఘవాచార్యులు, కొల్లాపురం లక్ష్మినరసింహాచారి, ముమ్మడి లక్ష్మణాచారిల గురించి కనీస సమాచారం కూడా  అందుబాటులో లేదు. సమాజంలో అణచివేతకు గురైన ఆడబాపల గురించి పట్టించుకోవడమే గాకుండా సంఘసంస్కరణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహామనీషి సిద్దాబత్తుని శ్యామ్‌సుందర్‌. సికింద్రాబాద్‌లో పాఠశాలలు స్థాపించడమే గాకుండా, కళావంతుల సభలు పేరిట ఆడబాపల ఆత్మగౌరవం కోసం ఉద్యమం చేసిన ఉదాత్తుడు. దక్కన్‌ మానవసేవా సమితిని ఏర్పాటు చేసి జంతుబలికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాడు. గ్రంథాలయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో ‘నాయి సభ’ను ఏర్పాటు చేసి తమ వర్గం వారి అభ్యున్నతికి ఆంధ్రమహాసభల్లో సైతం పాల్గొని గొంతుని వినిపించిన ‘జనపాల రఘురాం’ ఇంకా అనేకమంది బహుజనుల అభ్యున్నతికి అలనాటి తెలంగాణలో పోరాటాలు చేసిండ్రు.
తెలంగాణలో దళితోద్యమానికి పునాదులు వేసిన భాగ్యరెడ్డి వర్మతో పాటుగా హైదరాబాద్‌ అంబేద్కర్‌గా పేరు పొందిన బి.ఎస్‌. వెంకటరావు, గోలకొండ కవుల సంచికలో కవిత్వాన్ని వెలయించిన అరిగె రామస్వామి,  (ఈయన బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో పనిచేశారు), 1957లోనే అంబేద్కర్‌ విగ్రహాల ఏర్పాటుని ఉద్యమంగా చేపట్టిన శ్యామ్‌సుందర్‌, సుతారి బాబయ్య, సుబేదార్‌ సాయన్న, గుంటిమల్ల రామప్ప, బందెల చిత్తారయ్య, జె.ఎస్‌. ముత్తయ్య తదితరులు దళిత చైతన్యానికి ప్రతీకలు. వీరికన్నా ముందు వల్తాటి శేషయ్య, ఎం.ఎల్‌ ఆదయ్య, రాజారామ్‌ భోలే తదితరులు హైదరాబాద్‌లో పేద, దళిత విద్యార్థుల కోసం పాఠశాలల్ని ఏర్పాటు చేసిండ్రు. సభలు, సమావేశాలు, గ్రంథాలయోద్యమం, రాత్రి పాఠశాలల ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిండ్రు. 1952లో హైదరాబాద్‌ శాసనసభకు ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో  పోటీ చేసిన దళిత నాయకులందరికీ ఫైనాన్స్‌ చేసిన వితరణశీలి ముదిగొండ లక్ష్మయ్య. ఈయన కంపెనీలో తయారైన 555 బ్రాండ్‌ పాదరక్షల్ని దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడు పోయేవి. టి.వి. నారాయణ, టి.ఎన్‌.సదాలక్ష్మి, సుమిత్రాదేవి, ఈశ్వరీభాయి తదితరులు తర్వాతి కాలంలో దళితోద్యమానికి బాసటగా నిలిచారు. ఉర్దూలో మొదటి సారిగా రచనలు చేసిన నాట్యగత్తె, విదుషీమణి మహలఖాభాయి చాందా గురించి అమెరికా వారు పరిశోధన కోసం డబ్బులు వెచ్చించిండ్రు. ఎఫ్లూలో ఆమె తవ్వించిన బాయిని కాపాడ్డానికి ఆర్థిక సహాయం అందజేసిండ్రు. ఈమె ఉర్దూలో రాసిన కవిత్వాన్ని వెలుగులోకి తీసుకురావడమే గాకుండా ఆమె విశేషమైన నాట్య ప్రతిభను, నేటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడ్డ ఆమె జాగీరు గురించీ, మౌలాలిలోని ఆమె సమాధి గురించీ అందరికీ తెలియజెప్పాలి.
వహబీ ఉద్యమాన్ని దక్షిణాదికి తీసుకొచ్చిన మౌల్వీ విలాయత్‌ అలీ సలీం, దీనికి అండగా నిలిచిన స్వయాన నిజాం రాజు నాసిరుద్దౌలా తమ్ముడు ముబారిజ్‌ద్దౌలా, ముస్లిం మహిళల కోసం ( ఆమాట కొస్తే మొత్తం స్త్రీల కోసం) దేశంలోనే మొట్టమొదటి పాఠశాల స్థాపించిన షమ్సుల్‌ ఉమ్రా, బ్రిటీష్‌ వారికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడని సాలార్జంగ్‌పై హత్యా ప్రయత్నం చేసిన సైనికుడు జహంగీర్‌ఖాన్‌, హైదరాబాద్‌ జర్నలిజానికి పితామహుడి లాంటి వారు మౌల్వీ మొహిబ్‌ హుసేన్‌, నిర్బంధ విద్యను, స్కాలర్‌షిప్‌లను ప్రతిపాదించిన సంస్కర్త ముల్లా అబ్దుల్‌ ఖయూం, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన అబిద్‌ హుసేని, సఫ్రాని, ముల్కీ ఉద్యమాన్ని 1919లోనే చేపట్టిన మౌల్వీ అబుల్‌ హసన్‌, సయ్యద్‌ అలీ, సయ్యద్‌ అబిద్‌ హుసేన్‌ తదితర ముస్లిం చైతన్య మూర్తుల గురించి కూడా మనం తెలుసుకోవాల్సి చాలా ఉంది. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొంటూనే ప్రజల కోసం పాటు పడ్డ వారి స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకం కావాలి. పఠాన్‌ యోధుడు తుర్రెబాజ్‌ఖాన్‌ గురించీ, ఆయనకు తోడ్పడ్డ మౌల్వీ అల్లాఉద్దీన్‌ గురించీ, బందగీ, షోయెబుల్లాఖాన్‌, మగ్దూం మొహియుద్దీన్‌లతో పాటు వందలాదిగా ఉన్న స్థానిక ఉర్దూ సాహిత్యకారుల ప్రతిభనూ అందరికీ తెలియజేయాలి.
కళా రంగాల్లో ఆర్టిస్టులు కాపు రాజయ్య మొదలు కంభాలపల్లి శేఖర్‌ వరకూ, చిందు ఎల్లమ్మ, ఒగ్గు కళాకారులు మిద్దెరాములు, కవి గాయకులు సుద్దాల హనుమంతు, రాజారామ్‌, బండి యాదగిరి, పెయింటర్‌, కవి, రచయిత మడిపడగ బలరామాచార్య, సాహితీవ్తే సామల సదాశివ, జానపద సాహిత్యానికి గౌరవం, గుర్తింపు కలిగించిన జాతీయ ప్రొఫెసర్‌ బిరుదురాజు రామరాజు తదితరులు తెలంగాణకు చేసిన కృషి చిరస్మరణీయమైనది. రాజకీయ రంగంలో 1952లో రాజకీయ దిగ్గజం మాడపాటి హనుమంతరావుని ఓడిరచిన పెండెం వాసుదేవ్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, బొమ్మగాని ధర్మభిక్షం, రావి నారాయణరెడ్డితో పాటుగా దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఆనాటి నల్లగొండ పార్లమెంటు సభ్యుడు సుంకం అచ్చాలు, ఎం.ఆర్‌.కృష్ణ, ఎమ్మెల్యేగా ఎన్నికైన బుట్టి రాజారాం, భాగ్యరెడ్డి వర్మ తనయుడు హైదరాబాద్‌ అసెంబ్లీ సభ్యుడు ఎం.బి. గౌతమ్‌లు తెలంగాణ సాయుధ పోరాటంలో తమ సత్తా చాటిన నల్లా నర్సింలు, ఉప్పల మల్సూర్‌, చీమ గురువయ్య, బిజ్జ వెంకన్న, అనుముల లింగయ్య, మధిర తిరపన్న, వడిశాల పిచ్చయ్య, ఆవుల పిచ్చయ్య తదితరులందరూ తెలంగాణ వికాసోద్యమానికి దారులు వేసిండ్రు. వీరితో పాటుగా దళితోద్యమ చరిత్రను రాయడమే గాకుండా స్వయంగా ఉద్యమాల్లో పాల్గొన్న పి.ఆర్‌. వెంకటస్వామి, రజాకార్ల చేతిలో హతుడైన బత్తిని మొగిలయ్య, వైద్య రంగంలో హైదరాబాద్‌ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన డాక్టర్‌ మల్లన్న, డాక్టర్‌ ముత్యాల గోవిందరాజులు నాయుడు, న్యాయ రంగ నిపుణుడు జస్టిస్‌ కొమ్రన్న, స్వాతంత్య్ర సమరయోదులు కోత్మీర్‌ ప్రేమ్‌రాజ్‌ యాదవ్‌, కాటం లక్ష్మినారాయణ ఇంకా కొన్ని వేల మంది గురించి విపులంగా చర్చించుకోవాలి. చరిత్రకెక్కించాలి.
గోండ్వానా రాష్ట్రపు అంకమ రాజులు మొదలు రాంజీ గోండు వరకూ చరిత్రలో స్థానంలేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న బహుజన, ఆదివాసీ, గిరిజన వీరుల సాహస చర్యల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. దీనికి పాక్షిక మినహాయింపు ‘మనకు తెలియని మన చరిత్ర’. బహుజనులు కాపాడిన కళలు పెంబర్తి ఇత్తడి పనులు, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చీరలు, ఆదిలాబాదు రంజన్లు, నిర్మల్‌ బొమ్మలు, చేర్యాల నకాషీ పెయింటింగ్‌లు, జోగిపేట గొంగళ్లు ఇలా తెలంగాణలోని ప్రతి ఊరికీ చరిత్ర ఉంది. అది చారిత్రక కట్టడాలు కావొచ్చు, ఆలయాలు కావొచ్చు, వీరగల్లులు కావొచ్చు. ఈ చరిత్రను వెలుగులోకి తేవాలి.
తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించింది సబ్బండ వర్గాల వారు. సకల జనులు. జయశంకర్‌ సార్‌ మార్గదర్శనం, కొండాలక్ష్మణ్‌ బాపూజీ పోరాట స్ఫూర్తి, శ్రీకాంతాచారి, యాదయ్యల ఆత్మ బలిదానం ఇవన్నీ చరిత్రలో రికార్డు చేయాల్సిన సందర్భమిది. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని రూపొందించిన ఎక్కాయాదగిరి, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసిన అందెశ్రీ, తెలంగాణ లోగోని తీర్చి దిద్దిన ఏలె లక్ష్మణ్‌లు బహుజన ఆలోచనల నుంచి వచ్చిన వారే!
ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్ర చాలా ఉంది. ఇవ్వాళ మళ్ళీ ఆదివాసీలను ఆగం చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మరో వైపు స్వయం పాలన కోసం కొట్లాడిన తెలంగాణ బిడ్డల ఆశలకు గండి వేస్తూ హైదరబాద్‌లో గవర్నర్‌ పాలన పేరిట ‘కేంద్ర పాలిత ప్రాంతం’ తద్వారా సీమాంధ్ర కబ్జాదారుల కొనసాగించేందుకు, పెట్టుబడిదారులకు పట్టం కట్టేందుకు మోడీ సర్కార్‌ యోచిస్తోంది. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తూ మన ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. ఇలాంటి సందర్భంలో గతంలో కన్నా ఎక్కువ సోయితో వ్యవహరించాల్సిన అవసరముంది. ఇన్నాళ్ళు ఇన్నేండ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన తీరుని, గతకాలపు వీరుల్ని కూడా స్మరించుకోవాలి. ఈ పనిని బహుజనులు ప్రాధాన్యత క్రమంలో చేపట్టనట్లయితే ఉద్యమానికి దూరంగా ఉండి, రాళ్లేసిన వారు రాసే చరిత్రగా మారే ప్రమాదముంది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే గాకుండా ‘మనము కూడా చరిత్రకెక్క దగిన వారమే’ అనే స్పృహతో తెలంగాణ చరిత్రను రికార్డు చేయాలి. అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌ మాదిరిగా పరిశోధనలు జరిపించి పోరాట వీరుల్ని వెలుగులోకి తీసుకు రావాలి. వెలుగులోకి తీసుకువచ్చిన వారి ప్రతిభ/చైతన్యాన్ని పదుగురికి తెలిసే విధంగా పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఈ పని ఎంత ఆలస్యమైతే తెలంగాణ బహుజనులకు అంత నష్టం జరుగుతుంది. తెలంగాణ చరిత్రను బహుజన దృక్కోణంతో తిరగరాద్దాం.

    – సంగిశెట్టి శ్రీనివాస్‌

మీ మాటలు

 1. rajaram says:

  మీరు రాసిన వ్యాసం నిజంగా నిజమైన చరిత్ర వున్న తెలంగాణాను నాముందు నిలబెట్టింది.బంగారు తెలంగాణ కోసం చేయాల్సిన మరో యుద్ధం జరుగుతుంది.

 2. gade venkatesh says:

  అన్న దెప్థ్ గ ఉన్న హత్సుప్

 3. RamuluChanda says:

  తెలంగాణలో ఒక వార పత్రికను తెచ్చినందుకు అభినందనలు.ఇది ప్రింట్‌లోకూడ వస్తున్నదా? తెలుపగలరు.ఇప్పుడు బహుగోళిక తెలంగాణ వచ్చింది.అది ఇంకా సంపూర్ణంగా రాలేదు.పదేండ్లు ఉమ్మడి రాజధాని ,ఉమ్మడి హైకోర్టు,ఉమ్మడి గవర్నర్ పేరుతోటి ఇంకా సంకెళ్ళలోనే ఉంచారు.ఇటీవలి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో వచ్చింది 2000వేల సంవత్సరమునుండి మాత్రమే.ఈసామాజిక తెలంగాణగురించి,ప్రజాస్వామ్య తెలంగాణ,బహుజన తెలంగాణ, బంగారుతెలంగాణల గురించిన వాదనలు ఈరెండువేల సంవత్సరం తరువాతమాత్రమే ఎందుకొచ్చినయో నాకు అర్ధం కాలేదు.అంటే అంతకుముందు 44ఏండ్లకాలంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో(ఆంధ్రప్రదేశ్‌లో) ఎందుకు సామాజిక ఆంధ్రప్రదేశ్,ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్,బహుజన ఆంధ్రప్రదేశ్ కావాలనే వాదనలురాలేదో నాకేకాదు చాలామందికి అర్ధం కాలేదు.ఇప్పుడు ఇంకా ఆంధ్ర ప్రదేశ్‌గా పిలువబడుతున్న సీమాంధ్ర ప్రదేశ్‌లో అధిక సంఖ్యాకులు బహుజనులు లేరా?వారుకూడా సమాంతరంగా ఎందుకు సామాజిక రాష్ట్రం,ప్రజాస్వామ్యరాష్ట్రం,బహుజన రాష్ట్రం కావాలని అడుగుతలేరు? వాళ్ళు అడుగుతలేరని మన తెలంగాణలో అడుగొద్దని నాఉద్దేశం కాదు. కాని అటువంటి బహుజన తెలంగాణ కొరకు జరిగే పోరాటాలు ఇంకా పూర్తిగా ఏర్పడని భౌగోళిక తెలంగాణకు అడ్డు రాకుండ చూసుకోవాలె.నా అభిప్రాయాలకు తార్కికంగా చర్చించేవాళ్ళతో ముందు ముందు మరికొంత చర్చిస్తాను.కనుక ఇప్పుడు ముగిస్తున్నాను.

  • ఇదంతా ఏకపక్ష ఆర్టికల్, తెలంగాణా చరిత్ర లో సిమ్హ భాగం దొరలు, దేశ్ముఖ్ ల పాలన లోనే ఉంది. దొరలు ఎంత చక్కగా (చాలా మంది) బహుజనులను తమ బిడ్డలు గా చూసుకొని, ఇవాళ ఇన్ని అస్తిత్వ ఉద్యమాలు రావటానికి తారు రోడ్ వేసారో మీరు వివరించక పోవటం మాత్రం దారుణం, ఇవాల్టి ఫలాలన్నీ ఆనాటి మంచి దొరల గడీల పుణ్యమే అయితే వారిని విస్మరించి మీరు తెలంగాణా చరిత్ర అంటే నవ్వు వస్తుంది. వీటి మీద ఏమయినా అనుమానాలు, చర్చ కావాలంటే తెలంగాణా ముఖ్యమంత్రి గారు నాకంటే బాగా వివరణ ఇవ్వగలరు, అలాగే నిజాం లాంటి చాలా గొప్ప రాజు వలన మొత్తం తెలంగాణా అంతా ఎంత పచ్చగా వర్ధిల్లిందో, తెలుగు భాష ఎంత అభివ్రుద్ది చెందిందో, ఇంక సదువులు అందరకీ ఎంత బాగా ఆనధ్రా ప్రాంతం కంటే అందాయో KCR గారు చాలా సారు మా మంచి రాజు అంటూ వివరించినా, మీరు ఆ చరిత్ర ను కూడా విస్మరించటం, కేవలం ఏకపక్షమే!!

 4. buchi reddy gangula says:

  తిమ్మిని బమ్మి –బమ్మి ని తిమ్మి —చేసింది దొరలే .
  చరిత్ర చెప్పే సత్యం .అధికారాలు ,హక్కులు ,పదవులు , రాజరికం
  గుప్పెట్లో పెట్టుకొని ఏళ్ళతరబడి రాష్ట్రాని ఏలుతున్నది doralu,అగ్రకులాలు –
  లక్షలాది బహుజనులు యింకా ధరిద్రరేఖ కు చాల దిగువన ఉంటూ
  చదువు -కూడు – గూడు లేక అలమటిస్తూ ,చావలేక బతుకుతున్నారు
  ఎందుకు ?? ఎంతకాలం ??మార్పు రావాలి —
  ఆర్థిక వత్యాసాలు —తొలిగి పోవాలి .బూపంపకాలు జరుగాలి –దున్నేవా డి కె
  బూమి — నిజం కావాలి .రయితు రాజ్యం రావాలి
  యింకేంతకాలం — struggle-for-existence,survival-of-the- fittest–
  బడుగు వర్గాలు , దళితులు —ఎకం అయ్యి సామాజిక ,బ హు జన తెలంగాణా రాష్ట్రం
  కోసం పోరాటం ,తిరుగుబాటు చేయక తప్పదు .
  doralu,అగ్రకులాల వాళ్ళు ఏదో చేస్తారని నమ్మ డం — గొర్రె కసాయి వాణ్ని నమ్మినట్టు —-
  కుల గజ్జి ని రూపుమాపాలి .మతం స్వంత విషయం –దాన్ని రాజకీయం చేయడం దేనికి ??
  డ్రామాలు ఎందుకు ??
  శ్రీనివాస్ గారు ,స్పష్టం గా ,ని జాలని కెలుకుతూ —చాల గొప్పగా రాశారు
  సాల్యుట్స్ సర్
  ———————————-బుచ్చి రెడ్డి గంగుల

 5. అవకాశం వచినప్పుడు వదులుకుని … కెసిఆర్ ని గద్దె మీద కూర్చోపెట్టి మల్ల ఇప్పుడు పోరాటం అంటారేమిటి? అసలు అభ్యర్థులు ప్రకటించినప్పుడు చూసారా? సామాజిక న్యాయం ఉందొ లేదో? మరల మంత్రివర్గం అప్పుడు చూసారా సామాజిక న్యాయం ఉందొ లేదో…? ఎప్పడు reactive mechanism పనికిరాదు…అంటే జరిగిపోయినాక పోరాడుదాం అనే పద్దతి. అదే ఈ సమాజానికి శాపం. అవకాశం ఉండి కూడా ప్రశ్నించలేదు KCR ని. పదండి ఇక పోరాటం మొదలు పెడదాం….ఈ జీవితాలే పోరాటాల మయం అయిపోయాయి.

 6. మహోజస్ మర్రిపూడి says:

  చరిత్ర….చరిత్ర….చరిత్ర…

  హే భగవాన్! ఆ పేరుతో నిరంతరం గతంలో బతకడం తప్ప మనుషులు ఇంకేం చేస్తారు? గతానికి సంబంధించిన ఆవేశ కావేశాల్ని కొనసాగించడం. బయాసుల్నీ, ప్రిజుడీసుల్నీ అట్టిపెట్టుకోవడం, వాటిని పాఠ్యపుస్తకాల ద్వారా పెర్పెచ్యువేట్ చేయడం, తమ ఎమోషన్సుకి వారసుల్ని సృష్టించుకోవడం, వీలైతే గతాన్ని గురించిన వాదాలతో కొట్టుకుచావడం – ఇవి తప్ప ఇంకేం జరుగుతుంది? ఏం జరిగిందో అని కాదు. ఇకముందు ఏ జరగాలో చూడండి. చూసి ముందుకు పోండి.

 7. buchireddy gangula says:

  ఏ దేశం లో ఉన్నా చరిత్ర ను తిరిగి వేసుకోవడం —గుర్తించుకోవడం –న్యాయం –సత్యం
  తప్పు లేదు —-స్వాతంత్రం వచినప్పటి నుండి , మార్పు ఎక్కడుంది .
  మార్పు కోసం పోరాటం , తిరుగుబాటు అవసరం .
  సమానత్వం రావాలి -కావాలి
  దేవుడు ఎక్కడ ??
  యిప్పటి కి కులం –మతం అంటూ ???
  ముస్లిమ్స్ అంటే పరాయి వాళ్ళు –Desha ద్రోహులు అన్న భావన తో —దేనికి ??
  మార్పు రాక పోదు
  పుట్టినపుడు పెట్టిన పేరు తెలుపుకుంటే తప్పా —??

  ——————————-బుచ్చి రెడ్డి గంగుల

 8. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం అనేది అక్కడి ప్రజల చిరకాల వాంచ . దానిని సాధించుకోవడంలో వారు క్రుతక్రుత్యులైనారు.
  కాని అక్కడి సామాన్య ప్రజలకు నాయకులు ఎన్నో ఆశలు కల్పించి వారిని వుద్యమంలోనికి రప్పించడంలో విజయం సాధించారని భావించాలి. దళిత ముఖ్యమంత్రి , సామాజిక తెలంగాణా , బంగారు తెలంగాణా మొదలైనవి వాటిలో కొన్ని !
  కాని తెలంగాణా కూడా భారతదేశంలో అంతర్భాగమని , ఇక్కడ ప్రజాస్వామ్య ముసుగులో పెట్టుబడీదారీ వ్యవస్థ రాజ్యమేలుతున్నదని , సామ్రాజ్యవాద సంస్క్రుతికి , దోపిడికీ అది వీలు కల్పించిందని వారికి తెలియపరచలేదనిపిస్తుంది.
  శ్రీనివాసుగారు కోరుకున్నట్లు అక్కడి ప్రజలకు గత చరిత్ర తెలిపి , అధిక సంఖ్యాక వర్గానికి రాజ్యాధికారం వచ్చేలా వారిని కార్యోన్ముఖులను చేసే వ్యక్తులు గాని , సంస్థలు గాని ప్రస్తుతం కనబడుటలేదు. క్షమించాలి ! పరిస్థుతులను ఏకరువు పెట్టినంతమాత్రాన ప్రజలలో మార్పు వస్తుందని ఆశించలేము.
  ప్రపంచీకరణ పుణ్యమాని ప్రస్తుత సమాజంలో సామూహికతత్వం కనిపించడంలేదు.వ్యక్తిగత స్వార్ధం ఎక్కువైంది.కనుక పోరాటలకు కలిసివచ్చేవారు కనిపించడంలేదు.
  అదీగాక సంపద – అంటే భూమి , వుత్పత్తి సాధనాలు – ఎవరి ఆధీనంలో వుంటవో వారిదే అధికారం అనేది మనం చూస్తున్నాం! ఈ స్థితి మారాలంటే ప్రజలను చైతన్యపరిచి పోరాడితేనే సాధ్యమవుతుంది. కాని ఇపుడా పరిస్తితి వుందా , ఆలోచించాలి.
  సమాజంలో నెలకొన్న అసమానతల కారణంగా కొందరు స్వార్ధపరులు ప్రజల మధ్య మతపరంగా , కులపరంగా , ప్రాంతీయపరంగా విద్వేషాలు రగిల్చి , ప్రజలను ఐక్యపరిచేబదులు విడగొడుతున్నారు. ఈమధ్య యన్.వేణుగోపాల్ గారు `నా మాత్రు దేశమైన హైదరాబాద్ ను భారత సైన్యం దురాక్రమణ చేసి భారత్ లో కలుపుకుంది ‘ అని వ్రాశారు. ఇలాటి ప్రకటనలవల్ల ప్రజలలో కలిసి వుండాలనే భావం నశించి , విడిపోతే బాగుపడతామని భావించడం జరుగతుంది అని నా వుద్దేశ్యం. అనేక దేశాలుగా విడిపోయిన సోవియట్ రష్యా పరిస్థితిని మనం గమనించాలి.
  రాజకీయనాయకులు , మేధావులు ఈ స్థితి నుండి సమాజాన్ని రక్షించి , అధిక సంఖ్యాక ప్రజలు కోరుకునే సమసమాజ స్థాపనకు క్రుషి చేయాలని నా భావన !!

  • వేణుగోపాల్ గురించి చాలా గొప్పగా ఊహించాను. చాలా పుస్తకాలు డబ్బులు పెట్టి కొన్నాను ఆయన వ్రాసినవి. ఇప్పుడు అనిపిస్తుంది చాలా తప్పు చేసానని….

   ఎప్పుడో వ్రాసిన శ్రీ శ్రీ గురించి ఏవేవో వ్రాసారు ఇదే platform మీద. మరి వీళ్ళకు వేణుగోపాల్ లాంటి వాళ్ళ కామెంట్స్ గుర్తుకు రావా? Good for nothing

  • Manjari Lakshmi says:

   తెలంగాణలో యదార్ధంగా జరిగింది ఏమిటనేది బాగా చెప్పారు. అక్కడ ప్యూడల్ సంస్కృతిని మళ్ళీ ప్రోది చేయాలనే సంకల్పం మేధావులకు కూడా కలగడం మరీ అన్యాయమైనదిగా తోస్తోంది. మన బూర్జువా ప్రజాస్వామ్యంలో సామ్రాజ్య దోపిడీ అనేది ఎక్కడైనా జరుగుతుంది అని బాగా చెప్పారు. పెట్టుబడికి, దాని దోపిడీకి ఎల్లలు లేవు కదా! చాలా బాలన్స్ గా చెప్పారు.

 9. N . Venugopal gaaru said –“My own country, Hyderabad was occupied by Indian army in an action in 1948 and incidentally, almost all the newspapers of that day said India invades Hyderabad”!!!!”

 10. Jammu an Kashmir and Telamgana were both forcefully and at the same time annexed to the Indian Union. When I say I feel strongly , it`s because we were both seperate countries , but were merged with the Indian Union after independence in 1947 , we were not a part of India. After 1947 , we became a part of India. Then the troubles really started. ……….” — K. Kavitha gaaru , M.P. , Telamgana. – The New Indian Express , Dt. 21-07-2014.

 11. మంజరి లక్ష్మి says:

  నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిష్టులు(అభిమానులు?), పెట్టుబడిదారి వ్యవస్థలో ఫ్యూడల్ కల్చర్ను ప్రవేశపెట్టాలని చూస్తున్న T.R.S. ఇద్దరు ఒకే రకంగా మాట్లాడటం, నిజాం పాలనను సమర్ధించటం భలే ఆశ్చర్యంగా ఉంది.

 12. తెలంగాణా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసడర్ గా ఉండటానికి శ్రీనివాస్ గారు పేర్కొన్న వారెవరూ పనికిరారేమో !

 13. Kashmir,Telangana not India’s parts: Indian MP
  APP
  July 22, 2014, 1:51 pm
  28 COMMENTS
  NEW DELHI – Indian lawmaker K Kavitha, who is member of Lok Sabha, the lower house of the Indian parliament, has categorically stated that Jammu Kashmir and Telangana are not parts of India and New Delhi has forcibly occupied these territories.
  Kavitha, who represents Telangana Rashtra Samithi (TRS) party in the parliament, during a newspaper said that Telangana and Kashmir were both separate territories but were forcefully merged into India after independence. “We need to come out clean on Jammu Kashmir. Few parts were not ours, we should agree, we should redraw the international lines, and move on,” she added.
  Kavitha is daughter of Telangana Chief Minister K Chandra Sekhar Rao. India’s Congress party took strong exception to certain ‘controversial’ remarks made by Kavitha on Jammu Kashmir and Telangana, which the party believes could inadvertently cast serious doubts on the integrity and legitimacy of the Indian union.
  Congress spokesperson Abhishek Singhvi said the stand of the Congress and even of parliament was that the (erstwhile) princely state of Kashmir in its entirety is an ‘integral, invisible, inalienable’ part of India, according to the ‘Accession Instrument’ of 1947. He asserted that it was important to clarify these things because the foreign leaders, institutions or bodies coming across such statements by an elected representative.

 14. ఆంధ్రజ్యోతి దినపత్రిక [ ది. 24-07-2014 ] లో కె. శ్రీనివాస్ గారు వ్రాసిన “మాట్లాడితేనే మహాపరాధమా ? ” చదివిన తర్వాత , ఇంతమంది మేధావులు ఇంత గొప్పగా ఆలోచిస్తుంటే నాలాంటి సామాన్య మానవులు ఎందుకని ఆ దారిలో ఆలోచించటంలేదో నాకు అర్థం కాలేదు.
  అఖండ భారతదేశం అనీ , దేశభక్తి అనీ , మేరా భారత్ మహాన్ అనీ , సారా జహాసే అచ్చా… అనీ — ఇలా చిన్నప్పటినుండి విని వుండటం వల్లనేమో ![ ఈమధ్య విరసం సభలో ఖాశిం గారు కూడా ఈ విషయమై చాలాసేపు మాట్లాడారు !! ].
  ఇన్ని సంవత్సరాలయినా ప్రజలలో `మన ‘ అనే భావాన్ని కలగజేయడం లో రాజకీయనాయకులూ , మేధావులూ ఎందుకు విఫలమయ్యారో అర్ధం కాలేదు !!!.
  స్వతంత్ర దేశాలుగా వుండాలనుకునే భావాలు కలిగిన తర్వాత ఆపాలనుకుంటే అవి మరో కాశ్మీర్ లాగా నిరంతరం మండుతూనే వుంటాయని అర్ధమవుతుంది.
  అందుకని ప్రజల ఆకాంక్ష మేరకు , మేధావులు కోరుకున్నట్లు అలాటి యేర్పాట్లు కావడమే మేలేమో !!.రాజకీయ నాయకులు , మేధావులు ఈ దిశగా ఆలోచిస్తే నష్ట నివారణ జరుగుతుందనుకుంటా !!.
  మిగతా రాష్ట్రాలతో పోలిస్తే , KCR గారు అన్నట్లు , సీమాంధ్ర లో మేధావులు లేరోమో అనిపిస్తుంది. తెలంగాణా లోని మేధావుల , రాజకీయనాయకుల ఆలోచనలు భిన్నంగా వుంటవి. చాలా బలంగా తమ వాదనలు వినిపిస్తారు.బహుశా వారు మొదటినుండీ స్వతంత్ర భావాలు కలిగి వుండటమే అందుకు కారణమేమో!!.
  భవిష్యత్తులో స్వతంత్రదేశాలుగా వుండాలనుకునేవారి ఆకాంక్షలు సఫలీక్రుతమవ్వాలనీ , వారు వారి వారి దేశాలలో ప్రశాంతంగా వుండాలనీ కోరుకుందాం !!.

మీ మాటలు

*