Sudden Fiction లో ముగింపు చదువరిదే: బి. పి. కరుణాకర్

nadustunna katha

మే నెల కథల్లో ఉత్తమ కథ ‘ఇరుకు పదును’ రచయిత శ్రీ బి పి కరుణాకర్ తో ఇంటర్వ్యూ

B P Karunakar

మీ గురించీ, మీ రచనా వ్యాసంగం గురించి చెప్పండి

పుట్టింది పెరిగింది గుంటూరులో. ఖమ్మం జిల్లాలో, పూణేలో పని చేసి 1983లో సికింద్రాబాద్ BHEL చేరి అక్కడే పదవీవిరమణ చేశాను. భార్య హేమలత ఇప్పుడు లేదు. కూతుళ్ళు ఒకరు అమెరికాలో, మరొకరు సంగారెడ్డి లో స్థిరపడ్డారు. నేను ఒంటరిగా ఈ ఇంట్లో వుంటాను. ప్రస్తుతం నా వయస్సు 71 సంవత్సరాలు.

1962 చిత్రగుప్తలో మొదటి కథ అచ్చైంది. 96 దాకా రచనలు చేశాను. ఆ తరువాత కుటుంబ బాధ్యతల వల్ల పదకొండేళ్ళ విరామం తీసుకోని 2007 నుంచి రెండో అంకం మొదలుపెట్టాను. “అంబాలీస్”, “నిర్నిమిత్తం”, “రాజితం” ఇప్పటివరకు ప్రచురింపబడ్డ నా కథాసంపుటాలు. నాలుగో కథల సంపుటి సిద్ధం అవుతోంది. ఇప్పటివరకూ నా కథల మీద నాలుగు పరిశోధనలు జరిగాయి.

మీరు రాసిన కథలు రెండు మూడు పేజీలు దాటవు. ఇలా రాయాలని మీరే ఎంచుకున్నారా?

ఇలా రాయలని అనుకోని రాయలేదు. చిన్నప్పటినుంచి చదవటం అలవాటు. గైడిమపాస, మామ్, మార్క్ ట్వైన్, ఎమిలీజోలా, ఓ హెన్రీ ఇలాంటి రచయితల కథలు అనువాదాలై విరివిగా వస్తుండేవి. వాటితో పాటు చలం, ధనికొండ హనుమంతరావు వంటి రచయితలనీ చదివాను. వీరిలో బహుశా సోమర్ సెట్ మామ్ ప్రభావం కొంత వుందేమో. కానీ నేను రాస్తున్న పద్దతిని Sudden Fiction అంటారని ఆ తరువాత ఎప్పటికో కానీ తెలియలేదు.

Sudden Fiction గురించి ఇంకా వివరంగా చెప్పండి

మామ్ కథలు చూడండి. పూర్తిగా చెప్పాల్సిన పనిలేదు. ముగింపు పాఠకుడికే వదిలివేయటం. కథలలో దృశ్యస్ఫురణ జరగాలి. పూర్తిగా చెప్పనప్పుడు క్లుప్తత వస్తుంది. ముగింపు పాఠకుడికే వదిలేస్తే ఆ గాఢత చాలా కాలం వెంటాడే లక్షణం వస్తుంది. గోప్యత వస్తుంది. అదే సడన్ ఫిక్షన్ – ఓపెన్ ఎండెడ్. నిడివి తక్కువగా రాయడం ఈ పద్ధతిలో ముఖ్య వుద్దేశ్యం. ఈ విషయం తెలియకుండానే చాలా కాలం క్రితమే ఈ రకంగా రాశాను. నా కథలలో తొంభై శాతం ఇదే పద్ధతిలో వుంటాయి. ఇరుకుపదును కథ కూడా సడన్ ఫిక్షన్ కథే.

“ఇరుకు పదును” అన్న పేరే చిత్రంగా వుంది. అలా ఎందుకు పెట్టారు?

కథకు శీర్షిక చాలా ముఖ్యమైనది. నేను రాసే ప్రక్రియ (Sudden Fiction)లో పాఠకుడికి ముగింపు పూర్తిగా తెలియకుండా వదిలిపెట్టాలి. అక్కడక్కడ కథలో కొన్ని సూచనలు వుంటాయి. కానీ కథ శీర్షిక కథాసారాన్ని చెప్పేయకూడదు. ఇది నా పద్ధతి. అండుకే నా కథలకు పెట్టే పేర్లు అర్థం కావటంలేదని అంటారు. “కోచెరగు”, “ముమ్మూర్తి”, “తూనికనీళ్ళు”, “నిర్నిమిత్తం”, “నీటిబీట” ఇవన్నీ అలాంటి పేర్లే. ఈ కథ విషయానికి వస్తే సరస్వతి పాత్ర నన్ను (కథలో కథకుణ్ణి) పదునైన ప్రశ్నలతో ఇరుకున పెడుతోంది. అందుకే “ఇరుకు పదును” అన్నాను.

ఈ కథా నేపధ్యం ఏమిటి?

దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నిజంగా జరిగిన కథ ఇది. నేను నేనే ఈ కథలో. చాలా వరకు పాత్రల పేర్లతో సహా వాస్తవాలు. “నర్సింగరావు” నాకు మంచి స్నేహితుడు. ఎంత స్నేహితుడైనా ఇంటికి పిలిచేవాడు కాదు. ఉద్యోగరీత్యా కలుస్తుండేవాళ్ళం. ఇంట్లో నేను ఒక్కణ్ణే కాబట్టి తరచుగా వస్తుండేవాడు. సొంతింట్లో వున్నట్లే స్వతంత్రంగా వుండేవాడు. కానీ అతని ఇంటికి మాత్రం తీసుకెళ్ళేవాడు కాదు. అతను చనిపోయిన రోజునే నేను మొదటిసారి అతని భార్యని చూడటం. తరువాత ఆమె వుద్యోగంలో చేరటం, నన్ను కలవటం అన్నీ నిజంగానే జరిగాయి.

మేము ఈ కథలో చాలా కోణాలని చూసి మా వ్యాసంలో రాసాము. ఇవన్నీ ఓ సాధారణ పాఠకుడికి చేరుతాయని మీరు అనుకుంటున్నారా?

చేరకపోవచ్చు. అంతే కాదు ఇంకా కొన్ని వున్నాయి. అసలు సరస్వతి నర్సింగరావు తాలూకు గతం కూపీలాగటానికే ఉద్యోగంలో చేరింది. ఆమెకు భర్తమీద ముందు నుంచే అనుమానం వుంది. ఈ విషయం కథలో ఎక్కడా చెప్పలేదు. కానీ చేర్చేందుకు అవకాశం వుండింది. పాఠకులు కథ గురించి ఆలోచించి, కొత్త కోణాన్ని వెతుక్కోవటంలోనే కొత్త అనుభూతిని పొందుతారు. నా కథలలో మొదటి రెండు పేరాల వరకే నేను పాఠకుడి చెయ్యి పట్టుకోని తీసుకెళ్తాను. మూడో పేరా నుంచి పాఠకుడు కథలో లీనమైన తర్వాత నేను తప్పుకుంటాను. కథ పూర్తైన తరువాత పాఠకుడు ముగింపు అర్థం కాక నా కోసం చూస్తాడు, కానీ నేను కనిపించను. దాంతో పాఠకుడే సమాధానాలు వెతుక్కుంటాడు.

ఇది యధార్థంగా జరిగిన కథ అయినప్పుడు, చెప్పని వివరాలన్నీ చేర్చుకుంటూ పెద్ద కథ రాయచ్చు. ఉదాహరణకి సరస్వతికి మొదట్నుంచి అనుమానం వుంది అని ఇందాక చెప్పారు. ఈ కోణాన్ని కథలో ఎందుకు చెప్పలేదు?

ఎంతవరకు చెప్పాలి అన్నది తెలియాలి. ఇది చాలు అనుకుంటే అక్కడ ఆపేయచ్చు. నేను రాసిన కథలు చూడండి. ఒకే ఒక్క సంఘటనను తీసుకోని మొత్తం జీవితాన్ని చిత్రంచే ప్రయత్నం చేశాను- ఒక పెద్ద కాన్వాస్ తీసుకోని అందులో మూడు చుక్కలు పెట్టినట్టు. చెప్పవలసినదానికంటే ఎక్కువగా నేను చెప్పను. దానివల్ల ఏం ఉపయోగం వుండదు. ఇంకా నిర్మాణం దెబ్బతినే అవకాశం వుంది. కథలో కొన్ని విషయాలను దాచిపెడుతూ, కొద్దిగా చెబుతూ వస్తుంటే కథకి పరిపూర్ణత వస్తుందని నా అభిప్రాయం.

నిజంగా జరిగిన సంఘటనలను కథలుగా రాయడానికి ఊహని ఎంత పాళ్లలో కలుపుతారు?

నేను రాసిన కథలు దాదాపుగా అన్ని జరిగినవే. ఎక్కువశాతం నా అనుభవాలు. కథగా మార్చేటప్పుడు మూడొంతులు ఊహ కలపాల్సివస్తుంది. ఊహని జోడింఛకపోతే అది కథగా మారదు. కేవలం ఒక సంఘటనగానో, వార్తగానో మిగిలిపోతుంది.

ఇరుకు పదును గురించి పాఠకుల రెస్పాన్స్ ఎలా వుంది?

చాలా మంది అభినందించారు. రెండువందల యాభై దాకా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఓ డెబ్భై ఎనభై మెసేజులు వచ్చాయి. ఒక నలుగురు మాత్రం మాకు అర్థం కాలేదన్నారు. ఒకావిడ లోకల్ ఫోన్ నుంచి చేసింది. పేరు కళ అని చెప్పింది. నిజమో కాదో తెలియదు. ఈ కథలో మీరు ఫొటోలు ఎవరివో సరస్వతికి ఎందుకు చెప్పలేదు? అంటూ అడిగింది. దాని వల్ల సమస్యలు వస్తాయని చెప్పలేదు అన్నాను. మీకు కథలు రాయడం చాతకాదు అంది. వాదన తరువాత ఫోన్ పెట్టేసింది. బహుశా సరస్వతి వున్న స్థితిలోనే ఆమె కూడా వుందేమో అనుకున్నాను!

కథ బాగున్నది అన్నవాళ్ళందరికి కథ అర్థం అయ్యిందని అనుకోడానికి కూడా లేదు. వారిలో కొంతమందికి కథ పూర్తిగా అర్థం కాలేదు. అర్థం కానివాళ్ళు చాలా వరకు మెసేజిల ద్వారా అడిగారు. నేను వివరంగా చెప్తే ఇప్పుడు అర్థం అయ్యింది అన్నారు.

మీ కథలో చాలా పొరలూ, దానికి తోడు ఒక ఆకస్మిక (abrupt) ముగింపు ఉన్నాయి. ఇలాంటి కథని పాఠకుడు అర్థం చేసుకోలేకపోవచ్చు. లేని అర్థాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని కోణాలే తెలుసుకోని తృప్తిపడచ్చు. ఒక కథా రచయితగా ఈ ప్రక్రియలో ఉన్న లోపమేమో అనిపించడం లేదా?
లోపం అనుకోవడం లేదండీ. అయితే, అలా జరుగుతుందని ఒప్పుకుంటున్నాను. కానీ పాఠకుణ్ణి మన స్థాయికి తీసుకొచ్చే రచనలే చెయ్యాలి. మనం పాఠకుడి స్థాయికి వెళ్ళి రచనలు చెయ్యకూడదు. పాఠకుణ్ణి తయారు చేసుకోవాల్సిన బాధ్యత కూడా రచయితకు వుంది. పాఠకుణ్ణి పైకి లాగండి. ఇంకా చందమామ దగ్గరే వుంటే ఎట్లా?

ఇప్పటి కథలు, పాఠకుల గురింఛి మీ అభిప్రాయం ఏమిటి?

మునుపటి పాఠకులు వేరు. ఇప్పటి పాఠకులు వేరు. అప్పుడు వచ్చిన కథలు వేరు, ఇప్పుడు వస్తున్న కథలు వేరు. ఇప్పుడు వస్తున్న కథలు చాలా బాగుంటున్నాయి.

ఇప్పటి రచయితల గురించి –

ఒక సంవత్సరం పాటు అమెరికాలో వున్నాను. అక్కడ చాలా పుస్తకాలు చదివాను. ఇంగ్లీషుతో పాటు, చైనీస్, మెక్సికన్, ఇటాలియన్ ఇలా ఎన్నో భాషల కథలు చదివాను. చాలా సినిమాలు కూడా చూశాను. ఆ సంవత్సరం చాలా గొప్ప కథలు చదివాను. ఇప్పటికీ నేను మా అమ్మాయి దగ్గరకు వెళ్ళినప్పుడల్లా ఆమె లైబ్రరీ కార్డు వాడి డెభై అయిదు పుస్తకాలు తెచ్చుకుంటాను. అన్నీ కథల పుస్తకాలే. అవన్నీ చదవడం వల్ల ఆయా భాషల కథాసాహిత్యంలో వస్తున్న పోకడలు తెలుస్తాయి. ఇతర భాషల కథలను అర్థం చేసుకోగలిగితే రచయితలో పరిపక్వత వస్తుంది. ఇప్పుడు కొంత మంది రచయితలు పట్టుమని పది కథలు రాస్తే పట్టడానికి లేకుండా పోతున్నారు. ప్రపంచసాహిత్యాన్ని, మన పాతతరం సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. It is a must. ఇప్పుడు ఎవరైనా కుర్ర రచయితని “చాసో చదివావా” అంటే చాసో ఎవరు అంటున్నారు. బుచ్చిబాబు కథలు చదివావా? అంటే “ఆయన మైదానం చదివానండీ” అంటున్నారు. ఈ పద్దతి మారాలి. చదవాలి. చదివితే మనసు పదునెక్కుతుంది. రాయాలన్ని కుతూహలం కలుగుతుంది. మాలతీ చందూర్ ఏదో సందర్భంలో “వెయ్యి కథలు చదివినప్పుడు ఒక్క మంచి కథ రాయగలుగుతాను” అని చెప్పారు.

ప్రపంచకథలతో బేరీజు వేస్తే తెలుగు కథ ఎక్కడ వుందని మీకనిపిస్తోంది?

చాలా మంచి కథలు వస్తున్నాయి. కాకపోతే ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ఇతర భాషల రచనలు అనువాదాలై అన్ని భాషల పాఠకుల దగ్గరకు చేరుతున్నాయి. తెలుగు కథలకు ఆ అవకాశం లేకుండాపోతోంది. అదే జరిగితే ఇప్పుడొస్తున్న తెలుగు కథలు ఏ ప్రపంచసాహిత్యానికి తీసిపోవు.
ధన్యవాదాలు, కరుణాకర్ గారూ! మీరు పరిపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని మంచి కథలు రాయాలని ‘సారంగ’ తరఫునా, మా పాఠకుల తరఫునా మీకు శుభాకాంక్షలు.

థాంక్ యూ..!

మీ మాటలు

  1. Rajesh Yalla says:

    ఔత్సాహిక రచయితలకు, ఇప్పుడు రాస్తున్న వారికి ఉపయోగపడే చక్కని ముఖాముఖీ! ధన్యవాదాలు కరుణాకర్ గారూ, సత్యప్రసాద్ గారూ!

  2. sai padma says:

    చాలా బాగుంది .. హాయిగా ఇంటర్వ్యూ

  3. మణి వడ్లమాని says:

    చక్కటి ఇంటర్వ్యూ కరుణాకర్ గారు,. నిర్మొహమాటంగా మీరు చెప్పినా విషయాలు చాలా బాగా ఆకట్టుకొన్నాయి. నిజం చెప్పాలంటే చక్కటి గైడ్లైన్స్ లా ఉపయోగ పడతాయి. ధన్యవాదాలు

  4. బాగుంది.

  5. చాలా బాగుందండి.

  6. ari sitaramayya says:

    ఇంటర్వ్యూ బావుంది.
    ఈ కథ లింక్ లో మొదటి పేజీ మాత్రమే ఉంది. కథ అంతా ఉన్న లింక్ ఎవరైనా పోస్ట్ చెయ్యగలరా?
    లేక నాకు మాత్రమే పంపించినా సంతోషం. ari.sitaramayya@gmail.com.

  7. విస్తారంగా చదవడం, కథలు రాయడానికి ముందు చేయాల్సిన పనని నొక్కి చెప్పారు, బావుంది.

మీ మాటలు

*