Between the Lines

Drushya drushyam 39

చాలాసార్లు దూరతీరాలకేసి చూస్తం.
కానీ, దగ్గరే మన కోరికలు తీర్చేవి ఉంటై.చూపుకు మామూలుగా అందవు. తేలికగా కనపడవు. కొద్దిగా శ్రమించాలి.
ఒక్కోసారి ‘చంకలో బిడ్డలాగా’ మరపు వల్ల ఉన్నదాన్ని ఉన్నచోటే వెతుక్కోవలసే వస్తుంది.కానీ చిత్రం.
ఒకానొక శుభవేళ ఒకరు దయతో చెప్పారు. తల్లి చుట్టు మూడు చుట్లు తిరిగితే చాలని! తులిసమ్మ పూజ చేసినట్లే అనీనూ! కొద్దిగా మేలుకున్నట్టయింది.

ఇక కన్నతల్లి చుట్టూ కొంగు పట్టుకుని తిరిగే పిల్లవాడివలే ఉన్నఊరును, పట్టణంలోని బస్తీలను కిలోమీటరు పరిధిలో తిరగడం మొదలెట్టాను, అవును. కెమెరా చేత బట్టుకునే. ఇదొక అధ్యయనం. అన్వేషణ. సఫలత.

కెమెరాతో రోజురోజుకూ మెలమెల్లగా విస్తరించాను.
పది, పదిహేను, ఇరవై కిలోమీటర్ల మేరా తిరగసాగాను.

అట్లా తిరగాడటంలో చూపు నిదానించింది.
ఉన్నది ‘ఉన్నది’ అనిపించడం మొదలైంది.
లేనిది “లేదులే’ అన్న విచారమూ మటుమాయం అయింది.

ఒక రోజు, ఆరున్నరకు హైదరాబాద్ లోని పార్సిగుట్ట నుంచి బయలుదేరి ఇందిరా పార్కుకు చేరుకున్నాను.
కొన్ని రాలి పడిన పువ్వులు తీశాను. ఎంత బాగా వచ్చాయో! దూరంగా కొలను ఆకర్శించింది. సరోవరమా? ఏమో!
బాతులు ఎంత ముద్దుగ వచ్చాయో! యు అన్న ఆంగ్ల అక్షరంలో ఒకదాంతో ఒకటి ఇమిడినట్టు వాటి నీడలు కూడా కొత్త భాషలు పోయేట్టు తీశాను. చూసిన మిత్రులు ఇవి నీ చిత్రాలేనా అన్నారు. మురిసిపోయాను.

ఇంకా కొన్ని అడుగులు వేశాను. మరీ దగ్గరయ్యాను అనుకుని వెనక్కి వెనక్కి నడిచి ఈ చిత్రాన్ని చిత్రీకరించాను.
ఆశ్చర్యం. కోనసీమలో ఉన్నట్లుంది, సీనరీ!
నాకూ అదే అనుభవం. చూసిన వారికీనూ.

పెద్ద ప్రింట్ వేసి ప్రదర్శిస్తే ఒకరిద్దరు ఇంట్లో వుంచుకున్నారు.
వారి దృష్టిలో నేను లేను. ఒక పరిధి పెట్టుకుని తిరుగాడే ఫొటోగ్రాఫర్ అస్సలు లేడు. వారి అనుభవమే అట్లా చల్లగా, హాయిగా ఉదయం వలే ఆ డ్రాయింగ్ రూములు.

ఒక రోజు చూసిన వాళ్లు అది, ‘కేరళనా?’ అని అడిగారు.
ఇంకొకరు అడిగారు, ‘ఆడమ్ అండ్ ఈవ్ కదా!’  అని.

దృశ్యాదృశ్యం.

అవును. నిజం. ఒకరు ఆ దృశ్యంలోని ప్రకృతిని ఇదివరకు తమ దృక్పథంలోంచి పోల్చుకుని చూసి కేరళకు వెళ్లినట్లుంది అన్నారు. ఇంకొకరు ఆ సరోవరంలో అట్లా నిశ్చలంగా ఉన్న ఆ పడవల కేసి చూసి, పక్కపక్కనే ఉన్న వాటి ఉనికిని గాఢంగా ఫీలయి, ఒక పురాతన దృశ్యం… ఎపుడో అదృశ్యమైన మన పరంపరకు మూలం, జీవం అన్నట్టు, అవి రెండూ మన ఆదిమ వారసత్వానికి ప్రతీకలా అని అడిగినారు.
అచ్చు’ఆడం ఈవ్ వలే ఉన్నార’నీ అన్నారు.

ఆశ్చర్యం.
ఆ కొబ్బరి చెట్ల నీడలు సరేసరే…
ఆ పడవల నీడలూ వారిని సరాసరి అక్కడకు తీసుకెళ్లాయనీ అన్నరు.

అప్పుడర్థమైంది, చిత్రానికి పరిధి లేదని!
జీవనచ్ఛాయలు మనుషుల వల్లే ఏర్పడవని!
మనిషిని పయణింపజేసే ప్రతి ఆవిష్కరణలోనూ మనిషి ఉన్నడని!

మరో అనుభవం.
ఒకాయన అన్నరు, ఈ చిత్రంలో హ్యూమన్ ఎలిమెంట్ లేదని!
దానికి జవాబుగా మరొకరు చెప్పనే చెప్పారు…. ‘ఈ చిత్రంలో మనిషి లేకపోవచ్చు. కానీ, ఈ ‘చిత్రీకరించడం అన్నది ఉన్నదే…అదే మానవ అంశం…హ్యుమన్ ఎలిమెంట్’ అని!

అలా ఇలా పరిపరి విధాలు. చిత్రవిచిత్రాలు.
పాఠక ప్రపంచం మాదిరే ప్రేక్షక ప్రపంచానికి ఒక చదువు వుంటుందన్న నమ్మకం క్రమంగా అనుభవంలోకి వచ్చింది.
ప్రేక్షకుడికి అనుభవం నుంచి ఒక చదువు వుంటుంది. వారిదైన చదువరితనం వల్ల ఆ వస్తువు లేదా దృశ్యం అందులోని ప్రతి అంశం విభిన్నం, విస్తృతం, విశేషమూ అవుతుందని!

‘బిట్విన్ ది లైన్స్’ మాదిరే ‘బిట్వీన్ ది ఇమేజ్’ ఒకటున్నదని అనిపించడం మొదలైంది.
అన్నిటికీ మించి ఒక ‘విస్తృతి’ పరిచయం అయింది.
నేను ఒక స్థలం పెట్టుకుని తిరగాడటం ఒకటి ఉన్నది. కానీ, ఆ ఒకదానితో చిత్రానికి సంబంధం ఉండవచ్చూ ఉండకపోవచ్చును.
ఈ చిత్రానికి వస్తే, అది తీసిన స్థలం ఇందిరాపార్కు అని అనుకోవడం నా కథనం.
కానీ, అది ప్రేక్షకుడి అనుభవంలో ఇంకొకటి గుర్తు చేస్తే అదీ రీడింగే!
ప్రేక్షక సమయం అది. వారి సందర్భమూ ముఖ్యమే.

చిత్రమేమిటంటే, ఈ చిత్రం చూస్తూ ఒకరు కేరళకు వెళ్లడం. ఇంకొకరు మనిషి పుట్టిన కాడికి వళ్లడం.
నేనేమో మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకుని ఊరు చుట్టూ తిరిగి ఒక తులసీదళం వంటి చక్కటి చిత్రం తీద్దామనుకుంటే, వారు మహత్తరంగా విస్తరించారు. నన్నూఅసాధారణంగా విస్తారం చేశారు.
ఇదంతా బిట్విన్ ది ఇమేజ్.

అందుకే చిత్రాలు చదవరారండి…
దయవుంచి నన్ను మా ఊరునుంచి బయట పడేయండి.

 

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

మీ మాటలు

 1. ఫోటో చూడడం ఒకటైతే..మీ కామెంటరీ చదవడం మరోటి…ఏది ముందు ఏది తరువాత అని చెప్పడం అంటే చెట్టు ముందా విత్తుముందా అని ప్రశ్నించినట్టే ఉంటుంది…మొదట ఫొటో అతి మామూలుగా ఉంటుంది..కానీ మీ వ్యాఖ్యానం చదివిన తరువాత కొత్త హొయలు పోతుంది..ఫొటోలను ఇలా కూడా వర్ణించవచ్చని..మీరు చేస్తున్న ఈ ప్రయోగం చాలా బాగుంది.

 2. చాలా థాంక్స్ సుజల గారు. నిజం. చెట్టు ముందా విత్తుముందా అన్నది నిజంగా నిజం. నాకు మంచి పోలిక అందించారు.

 3. అద్భుతమైన చిత్రాలకు మీ వ్యాఖ్యానం జీవం పోస్తోంది రమేష్ అన్నా.. బిట్వీన్ ది ఇమేజెస్ యు డ్రా ఏ లాట్..

 4. మణి వడ్లమాని says:

  జీవనచ్ఛాయలు మనుషుల వల్లే ఏర్పడవని!
  మనిషిని పయణింపజేసే ప్రతి ఆవిష్కరణలోనూ మనిషి ఉన్నడని!

  అవును ఏదైనా భావన లో ఉంటుంది.ఒక్కొకళ్ళది ఒక్కో దృక్పథం .
  దృశ్యం చిత్రీకరణ ఒక ఎత్తైతే దానిని భావన చేస్తూ వ్యాఖ్యానం చేయడం మరోఎత్తు.

  అలా మమ్మల్ని ఎక్కడో ఎత్తున ఉన్న ఊహాలోకం లోకి తీసుకెళ్ళిన రమేశ గారికి ధన్యవాదాలు

  • ఒక రకమైన చిత్ర అనువాదం, నన్ను నేను అనుసరణలు ఇవి. మీకు నచ్చుతున్నదుకు చాల సంతోషం మని గారు. థాంక్స్ ఏ లాట్.

మీ మాటలు

*