జీవించడం కోసం పరిమళించు!

Krish.psd

అశోకారోడ్ నుంచి ఫెరోజ్‌షా రోడ్‌లోకి ప్రవేశించి, మండీహౌజ్ వద్ద సాహిత్య అకాడమీ భవనం వద్ద దుమ్ముపట్టిన పుష్కిన్ విగ్రహం చూస్తూ సర్కిల్ తిరుగుతున్నప్పుడు గుర్తుకు వచ్చింది.. కేదార్ నాథ్ సింగ్‌కు జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించారని. ఒక కవికి ఏదో ఒక అవార్డు లభిస్తే కవిత్వం అంటే ప్రేమించే నాకెందుకు మనసులో ఏదో ఒక మూల కదలిక రావాలి? జర్నలిస్టుగా ఎన్నికల ముందంటే ఏదో ఒక బిజీ. ఎన్నికలై, కొత్త సర్కార్లు ఏర్పడ్డ తర్వాత కూడా పని ఒత్తిడి తగ్గిన తర్వాత కూడా మనసు విప్పి రాయాలంటే ఎందుకు మనస్కరించడం లేదు? ప్రపంచం ఎప్పుడూ మనం అనుకున్నట్లు ఉండదు. మనం అనుకున్నట్లు ఉండేందుకు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా లేవు. ప్రయత్నాలు, పోరాటాలు, ఉద్యమాలు చేసిన వారే ఏమీ సాధించినట్లు కనపడడం లేదు. అంతా మళ్లీ మొదలైనట్లు, ఏదీ ప్రారంభం కానట్లు అనిపిస్తోంది. మరి ఎందుకింత అసంతోషం? ఎందుకింత నిర్లిప్తత? ఏదో రాయాలనుకుని ఏదీ రాయలేని నిస్సహాయత ఎందుకు? ఎవరిమీద ఈ కోపం? ఎవరిమీద ఈ అసహనం? నీ స్తబ్ధతకు కారణమేమిటో ఎవరికీ ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? ఎందుకు కన్నీళ్లు ఘనీభవిస్తున్నాయి? ఎందుకు రక్తం నరనరాల్లో నిదానంగా చల్లగా ప్రవహిస్తోంది? పాదాలు ఎందుకు ప్రయాణించడానికి మొరాయిస్తున్నాయి? నేనే ఇలా ఉంటే ఉన్నచోటే ఉంటూ స్తంభించిపోయి, ఆకులు రాలుస్తూ, చిగురుస్తూ వసంతాలు, గ్రీష్మాలు అనుభవిస్తూ జనాల్ని నిర్లిప్తంగా చూసే ఈ చెట్లు ఏమి ఆలోచిస్తున్నాయో?

ఐటీఓ క్రాస్ రోడ్‌లో రెడ్‌లైట్ వద్ద మల్లెపూల వాసన గుప్పున చుట్టుముట్టింది. ఇద్దరో ముగ్గులో తమిళ మహిళలు కార్ల కిటీకీల వద్దకు పరుగిడితూ మల్లెపూల దండలు కొనమని బతిమిలాడుతున్నారు. ఫుట్‌పాత్‌పై మరికొందరు మాలలు కడుతున్నారు. ప్రక్కనే నేలపై కాళ్లూ చేతులూ ఊపుతున్న పాప నోట్లో పాలపీక. అప్పుడు మళ్లీ గుర్తొచ్చాడు కేదార్ నాథ్ సింగ్. ఒకటా, రెండా.. దాదాపు ఆరు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారాయన. ఎలా రాయగలుగుతున్నారాయన? ఎప్పుడూ ఆయన నాలా నిరాశలో , నిస్సహాయతలో కూరుకుపోలేదా? కవిత్వం రాసేందుకు ఆయన చేయి ఎప్పుడూ మొరాయించలేదా? ‘ఒక్క మల్లె దండ కొనండి సార్..’  అని చిన్న పిల్ల పదోసారి నన్ను బతిమిలాడింది. నాలాంటి దుర్భర జీవికి మల్లెపూలెందుకు? ఏం చేసుకుంటాను? అయినా.. ఆలోచనల్ని ప్రక్కన పెట్టి తల ఊపి జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చి ఒక మల్లెపూదండ కొని కారులో ఒక మూల పడేశాను.కారంతా పరిమళం అలుముకుంది. ఆ పిల్ల ముఖంలో ఏదో సాధించినట్లు పరిమళం లాంటి ద రహాసం. అప్పుడర్థమైంది కేదార్ నాథ్ ఇన్నేళ్లుగా కవిత్వం ఎలా రాస్తున్నారో.. అవును. జీవితం ఆయనతో కవిత్వం రాయిస్తోంది. 


1934లో ఉత్తరప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన కేదార్ నాథ్ సింగ్ వారణాసి,గోరఖ్‌పూర్, దేవరియా, పాడ్రానా లాంటి పలు ప్రాంతాల్లో అధ్యాపకుడుగా పనిచేస్తూ చివరకు ఢిల్లీలోని జెఎన్‌యులో ప్రొఫెసర్‌గా చేరి 23 ఏళ్ల బోధన తర్వాత 99లో పదవీవిరమణ చేశారు. దాదాపు 16 ఏళ్ల వయస్సులో ఆయన తొలి కవిత రాశారు. కాని 1954లో ఫ్రెంచ్ కవి పాల్ ఎలార్డ్ కవితను అనువదించడం కేదార్ జీవితంలో కేదారం సస్యశ్యామలమైనట్లనిపించింది. ఎలార్డ్ ఆయనకు కవిత్వంలోని జీవన్మరణ రహస్యాలను విప్పిచెప్పారు. అంతే కేదార్ కవిగా అవతరించారు. ప్రముఖ కవి ఆజ్ఞేయ తన సాహిత్య పత్రికలో కేదార్ కవితలనెన్నిటినో ప్రచురించారు. 1960లో కేదార్ తన తొలి కవితా సంకలనం ‘అభీ బిల్కుల్ అభీ’ ప్రచురించారు. 

విచిత్రమేమంటే ఆ తర్వాత 1980లో కాని కేదార్ రెండో సంకలనం ‘జమీన్ పఖ్ రహీహై’  రాలేదు. ఈ సుదీర్ఘ విరామానికి ఆయనే జవాబు చెప్పారు. ‘ఇది నన్ను నేను లోతుగా ఆత్మపరిశీలన చేసుకుంటున్న కాలం. పెద్దగా ధ్వనించకుండా నా ప్రతిఘటనను ఎలా చిత్రించాలో అన్వేషిస్తున్న సమయం అది..’ అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆయన వెనక్కు తిరిగి చూడలేదు. వందలాది కవితలను పుంఖానుపుంఖాలుగా రాస్తూ పోయారు. ఏ అవార్డూ ఆయన దాహార్తిని తీర్చలేకపోయింది. 

కేదార్ నాథ్ కవితల్ని మనం బయటినుంచి అలవోకగా పేజీలు తిప్పుతూ అర్థం చేసుకోలేం. కవితల్లోకి మనం ప్రవేశించాలి. మనల్ని మనం ఆయన కవితల్లోకి ఒంపుకోవాలి. ఆయన నడిపించిన దారుల్లో నడవాలి. అదొక అద్భుత ప్రపంచం. పాడుపడిన కోట గోడల మధ్య, గంగానదీ ప్రవాహాల మధ్య, దట్టమైన అరణ్యాల మధ్య, నిశ్శబ్దనదిపై ప్రతిఫలిస్తున్న వెన్నెల కాంతి మధ్య, కడుపులో దహించుకుపోయే ఆకలి మధ్య, చితిమంటల మధ్య ఆయన మనను మెల్లగా నడిపించుకుని తీసుకువెళతారు. 

‘ఈ నగరంలో వసంతం ఉన్నట్లుండి వస్తుంది.’అని ఆయన వారణాసి గురించి రాసిన కవిత మనం ఆ నగరంలో నడిచినట్లే అనిపిస్తుంది. ‘సంతం ఖాళీ పాత్రల్లో దిగి రావడం నీవెప్పుడైనా గమనించావా? ఈ నగరంలో దుమ్ము మెల్లగా ఎగురుతుంది, జనం మెల్లగా నడుస్తారు, గుడిగంటలు మెల్లగా మోగుతాయి. పొద్దు వాలుతుంది మెల్లగా.. ఇదొక సామూహిక లయ. ఈ నగరంలో ఉదయమో, సాయంత్రమో ప్రవేశించు ప్రకటించకుండా.. హారతి వెలుగుల్లో అద్భుత నగరాన్ని చూడు. అది సగం నీళ్లల్లో, సగం మంత్రాల్లో, సగం పూలల్లో, సగం శవంలో, సగం నిద్రలో, సగం శ ంఖంలో.. జాగ్రత్తగా చూడు.. సగమే కనబడుతుంది. మిగతా సగం ఉండదు. కనపడిన సగానికే ఊతం అవసరం. మిగతా సగానికి అండ బూడిద, కాంతి, అగ్ని, నీరు, పొగ, పరిమళం, ఎత్తిన మాన హస్తాల స్తంభాలు..’ అంటారు కేదార్ నాథ్. 

‘నేను ఆమె చేయిని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ప్రపంచం ఆమె చేయిలా వెచ్చగా, అందంగా ఉండాల్సిందేననుకున్నా.’ అన్న ఒక చిన్న కవిత్వంలో ఒక ఆహ్లాదకరమైన అనుభవాన్ని వర్ణించగల కేదార్ ‘అక్షరాలు చలితో మరణించవు.. అవి ధైర్యం లేక మరణిస్తాయి.. ఉక్కబోసే వాతావరణంలోనే అక్షరాలు తరుచూ నశిస్తాయి… అని రాయగలరు. ‘నెత్తుటితో తడిసిన చిన్నారి అక్షరం తనను ఇంటికి తీసుకువెళతానని పిలుస్తోంది..’ అని రాస్తారాయన. 

‘ఖాళీ కాగితంపై ఉదయమూ ఉండదు, అస్తమయమూ ఉండదు.. అక్షరాలు మనకెప్పుడూ ఖాళీ కాగితాన్ని వదిలిపెడతాయి..’ అనే కేదార్ నాథ్ అక్షరాలతో అలవోకగా ఆడుకోగలరు. ‘సూ ర్యకాంతి, ఆకుల సంభాషణ మధ్య ఒక కవితా వాక్యం అణిచివేతకు గురైంది.. ఈ రోజుల్లో వీధుల్లో ఎవరూ మరొకరి సమకాలీనులు కాలేరు..’ అని ఆయన తప్ప ఎవరనగలరు? 

కవిత్వం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు కేదార్ నాథ్ చాలా సులభంగా సమాధానం చెబుతారు. ‘కవిత్వం అంటే ఏమిటి? ఒక చేయి మరో చేయిని అందుకోవడం. ఒక ఆత్మ దేహంవైపు మొగ్గడం. కళ్లు మృత్యు దిశగా చూడడం, కవిత్వం అంటే ఏమిటి? అదొక దాడి. దాడి తర్వాత నెత్తుటితో తడిసిన పాదరక్షలు తమను ధరించేందుకు పాదాలకోసం అన్వేషించడం. ఒక వీరుడి మౌనం.. ఒక విదూషకుడి ఆర్తనాదం..’

290025541_640
ఈ కవిత్వం చూడండి.. ‘కేదార్ నాథ్ సింగ్, నీకు నూర్ మియా గుర్తుండా? గోధుమ ముఖం నూర్ మియా, చిన్న నూర్ మియా.. రామ్‌ఘర్ బజార్ నుంచి సుర్మా అమ్మినవాడు..చివరగా తిరిగొచ్చిన వాడు,ఆ నూర్‌మియా గురించి ఏమైనా గుర్తుందా కేదార్ నాథ్‌సింగ్..ఆ స్కూలు గుర్తుందా..చింత చెట్టు, ఇమాంబరా,19వ ఎక్కంవరకూ మొదట్నుంచీ చెప్పగలవా,నీ మరిచిపోయిన పలకపై కూడికలు, లెక్కలు 
చేయగలవా..ఒకరోజు ఉన్నట్లుండి నూర్‌మియా మీ గల్లీని వదిలి వెళ్లిపోయాడో చెప్పగలవా, అతడెక్కడున్నాడు? ఢాకాలోనా, ముల్తాన్ లోనా.. పాకిస్తాన్‌లో ప్రతి ఏడాది ఎన్ని ఆకులు రాలుతాయో చెప్పగలవా..ఎందుకు మౌనంగా ఉన్నావ్?కేదార్ నాథ్ సింగ్, నీకు లెక్కలతో సమస్యేమైనా ఉందా చెప్పు? ‘ – ఈ కవిత శీర్షిక ‘1947ను గుర్తు చేసుకుంటూ..’

మరో కవిత- ‘హిమాలయం  ఎక్కడుంది? స్కూలు బయట గాలిపటం ఎగురవేస్తున్న ఆ బాలుడిని అడిగా. అదిగో.. అదిగో అక్కడుంది.. అని వాడు ఆ గాలిపటం ఎగురుతున్న వైపు చూపించాడు. ఒప్పుకున్నా. నాకు మొదటి సారి తెలిసింది. .హిమాలయం ఎక్కడుందో.. ‘


నల్ల నేల. అన్న కవితలో ఆయన నల్లదనం ఈ యుగం దృశ్యం అయిందని వాపోతారు. ‘నల్ల న్యాయం, నల్ల చర్చలు.. నల్ల అక్షరాలు. నల్ల రాత్రి.. నల్ల జనం.. నల్ల ఆగ్రహం..’అని రాస్తారు. 

కేదార్‌నాథ్ గురించి, ఆయన అక్షరాల గురించీ. ఆయన సాహిత్య విమర్శ గురించీ చెప్పాలంటే సుదీర్ఘం అవుతుంది. ‘మేరే సమయ్, మేరే శబ్ద్’ అన్న వ్యాస సంకలనంలో ఎజ్రాపౌండ్, రిల్కే, రెనె చార్ లాంటి కవుల గురించే కాక, భారతీయ కవులు, కవితోద్యమాల గురించి రాశారు. ఆయన ప్రజాస్వామిక ఆకాంక్షలను, సృజనాత్మకతను అర్థం చేసుకోవాలంటే ‘ఖబరిస్తాన్ మే పంచాయత్’అన్న సంకలనాన్ని చదవాల్సిందే. 

కేదార్‌నాథ్ ఎక్కడా వాస్తవిక రేఖల్ని దాటిపోలేదు. ‘ముక్తీకా జబ్ కోయా రాస్తా నహీ మిలా.. మై లిఖ్‌నా చాహుతాహు.. యహ్ జాన్‌తా హు కీ లిఖ్‌నే సే కుచ్ నహీ హోతా. మై లిఖ్‌నా చాహ్‌తా హూ.. (ముక్తి మార్గం ఎక్కడా దొరకకపోతే నేను రాయాలనుకుంటాను… రాయడం వల్ల ఏదీ జరగదని తెలిసి కూడా నేను రాయాలనుకుంటాను)..’ అని ఆయన ఒక కవితలో రాశారు. 

అవును. రాయడం వల్ల ఏదీ జరగదని తెలిసినా రాస్తూనే ఉండాలి. ఏదైనా జరిగేంతవరకూ రాయాలి.. జ్ఞానపీఠ్ అవార్డు నాకు కేదార్‌నాథ్, శివారెడ్డి లాంటి అక్షరాల్నే జీవితంగా మార్చుకున్న వారిని గుర్తుకు తెచ్చింది. క్రాస్ రోడ్ వద్ద మల్లెపూలు అమ్మిన తమిళ బాలిక నాకు జీవిత పరిమళాన్ని ఆఘ్రాణింపచేసింది. ఏది జరిగినా, ఏది జరగ కపోయినా శవం మాత్రం కాకూడదు. ఇదే తాజాగా నేను నేర్చుకున్న గుణపాఠం. 


కృష్ణుడు

మీ మాటలు

 1. కృష్ణుడు గారూ

  ఎంత గొప్పగా కేదార్ సింగ్ గారి కవిత్వాన్ని కలవరించి పలవరించారు. అంత గొప్ప భారతీయ రచయితను నాబోటి సామాన్య పాఠకుడికి చాల గొప్పగా పరిచయం చేసినందుకు థాంక్స్.
  మీరు కేదార్ సింగ్ గారి కవిత్వం గురించి ఇంకా రాస్తే చదవాలి ఉంది.

  నమస్సులతో
  మో

 2. చక్కటి వ్యాసం. పరిచయం చేసిన కవితలన్నీ గుర్తుండిపోతాయి. వారణాసి కవిత వెంటాడుతోందింకా. రాయడం వల్ల ఏమీ జరగదన్నా రాస్తూనే ఉంటానన్న కవిత్వ ప్రేమికుడిని పురస్కారాలు వెదుక్కుంటూ రావడంలో ఆశ్చర్యం లేదు.
  “इस शहर में वसंत
  अचानक आता है
  और जब आता है तो मैंने देखा है
  लहरतारा या मडुवाडीह की तरफ़ से
  उठता है धूल का एक बवंडर
  और इस महान पुराने शहर की जीभ
  किरकिराने लगती है “- వండర్ఫుల్ లైన్స్!
  థాంక్యూ!

  • krishnarao says:

   మో, మానస గారికి కృతజ్ఞతలు. కేదార్ నిన్నటి ప్రగతివాద కవి. నేటి ఆధునిక కవి. కాలమే కాదు కవిత్వం కూడా ఆయనతో నడిచింది. అవును. ఆయన కవిత్వం గురించి ఇంకా, ఇంకా రాయాలని వుంది.

 3. ‘ఏది జరిగినా, ఏది జరగ కపోయినా శవం మాత్రం కాకూడదు.’

  మన దేశంలో కోటానుకోట్లమందికి ప్రతినిత్యం అనుభవమవుతున్న వాస్తవం ఇదేననుకుంటాను. మీ కవితానుభూతి ఒక కొత్త లోకంలో విహరింపజేసింది. అభినందనలండీ…

మీ మాటలు

*