చిన్ననాటి మిత్రురాల్ని చూసేక

కె. గీత

కె. గీత

 

చిన్ననాటి మిత్రురాల్ని

ఇన్నేళ్లకి చూసేక

ఏ బరువూ, బాదరబందీ లేని

తూనీగ రోజులు జ్ఞాపకం వచ్చాయి

నచ్చినప్పుడు హాయిగా ముసుగుతన్ని

నిద్రపోగలిగిన, నిద్రపోయిన రోజులు

జ్ఞాపకం వచ్చాయి

చిన్ననాటి చిక్కుడు పాదు

గులాబీ మొక్కలు

సన్నజాజి పందిరి

కళ్లకు కట్టాయి

అక్కడే ఎక్కడో

పుస్తకాల అరల్లో చిక్కుకున్న

మా అలిబిల్లి ఉత్తరాలు

పుస్తకాల అట్టలో

పిల్లలు పెడుతుందనుకున్న

నెమలీక

మనసు నుండి వద్దన్నా

చెరగకున్నాయి

మేం కోతులమై వీర విహారం చేసిన జాంచెట్టు

అందని ఎత్తుకెదిగి పోయిన కొబ్బరి చెట్టు

మమ్మల్ని చూసి

అలానే భయపడుతున్నాయి

నీళ్ల బిందెనెత్తేసిన చెరువు మెట్లు

గొబ్బి పూల పొదల్లో గుచ్చుకున్న ముళ్లు

అలానే పరిహసిస్తూ ఉన్నాయి

పుట్టిన రోజు నాడు

నెచ్చెలి కట్టి తెచ్చిన

కనకాంబరం మాలని

గీతాంజలి మొదటి పేజీలోని

తన ముత్యాల చేతి రాతని

ఇన్నేళ్లు భద్రంగా దాచిన

మా ఇనుప బీరువా ప్రశంసపు చూపు

నేస్తం చెమ్మగిల్లిన చూపయ్యింది

ఇంట్లో పోయాయని అబద్ధం చెప్పి

తెలిసో తెలీకో

చెలికి బహుమతిచ్చేసిన

ఇత్తడి జడగంటలు

ఇప్పటికీ మురిపెంగా దాచుకున్న

తన వస్తువుల పెట్టె కిర్రుమన్న శబ్దం

నా గుండె చప్పుడయ్యింది

జాబిల్లి వెన్నెట్లో డాబా మీద చెప్పుకున్న కబుర్లు

జాజిమల్లెలు చెరిసగం తలల్లో తురుముకున్న క్షణాలు

10502193_607503336032256_2773154159787632762_n

ఇళ్ల వాకిళ్లలో కలిసి వేసిన కళ్లాపి ముగ్గు

పెరటి నూతి గట్టు కింద నమిలి ఊసిన చెరుకు తుక్కు

అన్నీఅన్నీ…విచిత్రంగా

మేం నడుస్తున్న ప్రతీ చోటా

ప్రత్యక్షమవుతూ ఉన్నాయి

అదేమిటో ఎప్పుడూ జ్ఞాపకం రాని నా వయస్సు

ఈ పుట్టిన రోజు నాడు

చిన్ననాటి మిత్రురాల్ని చూసేక జ్ఞాపకం వచ్చింది

ఆరిందాల్లా కబుర్లు చెప్తూ

సరి కొత్త యౌవనం దాల్చి

మమ్మల్ని మేం అద్దం లో చూసుకున్నట్లు

అచ్చం ఒకప్పటి మాలా

చెంగున గెంతుతున్న నేస్తం కూతుళ్ళని చూసేక జ్ఞాపకం వచ్చింది

రంగెయ్యని తన  జుట్టుని

జీవిత పర్యంతం కాయకష్టం

ముడుతలు వార్చిన  తన చెంపల్ని చూసేక

నా వయస్సేమిటో జ్ఞాపకం వచ్చింది.

-కె.గీత

painting: Anupam Pal (India)

మీ మాటలు

  1. ఎంత బాగుందో!

  2. రాజశేఖర్ గుదిబండి says:

    బాల్యం ఎంత అందమైన జ్ఞాపకం!!
    మీ కవిత అంతే అందంగా ఉంది ..
    అప్పటి మన బాల్యం జ్ఞాపకాలంత అనందం, వైవిధ్యం ఇప్పటి పిల్లలలు రాబోయే కాలంలో తమ జ్ఞాపకాల్లో పొందగలుగుతారా!!
    “పుస్తకంలో నెమలీక, చిక్కుడు పాదు, గొబ్బి పూలు, కనకాంబరం మాల, ఇత్తడి జడగంటలు, జాబిల్లి వెన్నెట్లో డాబా మీద చెప్పుకునే కబుర్లు, కళ్లాపి ముగ్గు, నమిలి ఊసిన చెరుకు తుక్కు…..” ఇవన్నీ ఇప్పటి పిల్లలకి తెలుసా… వాళ్ళ జ్ఞాపకాలలో ఏం ఉండబోతున్నాయి….

  3. madhavi mirapa says:

    గీత గారు నేను చెప్పాలనుకున్న చిన్న నాటి మిత్రురాల గురించి మీరు చెప్పెసారు… మీ కవిత చాల బావుంది. చిన్ననాటి స్నేహితురాళ్ళతో ఇప్పకీ వున్న అనుబంధం….నెమలి కన్నులు, నమిలి ఊసెసిన చెరుకు పిప్పి, జామ చెట్లు, జాజి పూల పరిమళ్ళాల్లా అలానే ఉంటుంది….మధ్యలో ఎంత మంది మిత్రులు కలిసినా …. చిన్ననాటి మిత్రురాలకి సాటి ఎవ్వరూ రారేమో……ఎందుకంటే మనతో మన బాల్యాన్ని పంచుకున్న నేస్తం కదా……అవసరవాద స్నేహాల కాలంలొ ఇలాంటి కవిత ఆహ్వానించ దగ్గది…

  4. Thirupalu says:

    బాల్యం దేవతల ధర స్మితం!
    చిన్నారి! పెదవిమీద సింగారించు!

  5. కవిత నచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు-
    కవిత కు ప్రేరణ నిచ్చి కవితలోనూ, నిజంగానూ నాతో బాటూ వయసుదాల్చిన నా మిత్రురాలు రాజ్యలక్ష్మికి ఈ కవిత అంకితం-
    -గీత

  6. NS Murty says:

    Lovely poem

  7. Veloori Krishnamoorthy says:

    చిన్ననాటి స్నేహితాన్ని గుర్తు చేసుకొని ఎంతబాగా చెప్పారండి కవిత గీతగారూ. అభినందనలు !

Leave a Reply to NS Murty Cancel reply

*