వీలునామా – 40 వ భాగం

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

లిల్లీ మనశ్శాంతి

 

లిల్లీ ఫిలిప్స్ చెప్పా పెట్టకుండా ఇంట్లో కొచ్చిన బ్రాండన్ ని చూసి తత్తరపడింది. ఇంట్లో ఎల్సీ లేదనీ, పైగా మిసెస్ పెక్ తో కలిసి బయటికెళ్ళిందనీ తెలిస్తే ఏమంటాడో నన్న భయం ఆమెది. ఏమీ అనకున్నా తప్పక స్టాన్లీ తో చెప్తాడు. స్టాన్లీ కోపాన్ని తలచుకుని ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. పైగా వచ్చీ రావడమే “ఎల్సీ ఏది?” అంటూ అడిగాడు. ఏదైనా అబధ్ధం చెప్పి తప్పించుకోవాలనీ అనుకుంది కూడా.
అయితే, నిజానికి లిల్లీ అమాయకురాలు, కల్లా కపటం తెలీని మనిషి. తన తల్లికి మల్లే అప్పటికప్పుడు నోటి కొచ్చిన కథలల్లే సామర్థ్యం ఆమెకి కొంచెం కూడా అబ్బలేదు. దాంతో ఏం చేయాలో తేల్చుకోలేకపోయింది కాసేపు. ఎలాగైనా మిసెస్ పెక్ బ్రాండన్ కళ్ళ పడకుండా చేయగలిగితే తర్వాత ఎల్సీని ప్రాథేయపడితే సరిపోతుంది, అనుకుంది లిల్లీ.

“బ్రాండన్! నాకోసం ఒక చిన్న పనిచేసి పెడతారా? కొంచెం రిచ్ మండ్ దాకా వెళ్ళి రావాలి, చిన్న పని,” అని మొహమాటంగా అడిగింది. ఆశ్చర్యపోయాడు బ్రాండన్. ఇలా ఆమె ఎప్పుడూ అడగలేదు. ఇంతా చేస్తే ఆమె తెచ్చి పెట్టమన్నది ఒక పూల దండ. పూల దండ కిప్పుడంత తొందరేమొచ్చింది?

ఏదో అనుమానం మొలకెత్తింది బ్రాండన్ మనసులో. అయితే అతను అనుమానించిన విషయం వేరు. అప్పుడప్పుడూ లిల్లీ ఎల్సీ పట్ల మొరటుగా ప్రవర్తిస్తూందని అతనికొక అనుమానం. ఇవాళ కూడ ఎల్సీని అలాగే ఏదో మొరటుగా బరువులెత్తే పని మీద దుకాణానికి పంపి వుంటుంది. అందుకే ఎల్సీ వచ్చేసరికి నేనింట్లో వుండకుండా బయటికి పంపిస్తూంది, లేకపోతే ఇప్పుడు పూల దండతో పనేమిటి, అనుకున్నాడు బ్రాండన్. ఆమె అందీ పొందని సమాధానాలూ, పాలిపోయినట్టున్న మొహం, ఎంత సేపు కూర్చున్నా బయటకి రాని ఎల్సీ, అన్నీ కలిసి అతని అనుమానాన్ని బలపర్చాయి.

‘సరే పూల దండ తీసుకొస్తా’నని బయటపడ్డాడు బ్రాండన్. అయితే ఆమె అడిగినట్టు రిచ్ మండ్ కాకుండా ఇంకో వైపు వెళ్ళాడు, ఒకవేళ లిల్లీ ఎల్సీ ని ఏదైనా పనికి బయటికి పంపి వుంటే, ఇటు వైపే పంపి వుండాలి అనుకుంటూ. అదృష్టవశాత్తూ అతను సరిగ్గా ఎల్సీ మిసెస్ పెక్ తో కలిసి వస్తున్న దార్లోనే వెళ్ళి వాళ్ళకి ఎదురయ్యాడు. దూరం నించి వాళ్ళిద్దరినీ చూసి,
“ఆ అమ్మాయినెక్కడో చూసినట్టుందే” అనుకుంటూ దగ్గరకొచ్చాడు.

***

veelunama11

ఎల్సీతో కలిసి ఇంటికొస్తూన్న బ్రాండన్ చూసి లిల్లీ ఇంకా బెంబేలెత్తి పోయింది. ఇంట్లోకొస్తూనే ఏమీ మాట్లాడకుండా ఎల్సీ లోపలికెళ్ళిపోయింది. లిల్లీ ఒంటరిగా బ్రాండన్ తో నిలబడిపోయింది. ఆమె అనుకున్నట్టే బ్రాండన్,
“మిసెస్ పెక్ లాటి ఆవిడతో ఎల్సీ లాటి అమాయకురాల్ని పంపుతావా? ఆ అమ్మాయికేదైనా అయితే వాళ్ళ అక్కయ్యకేం జవాబు చెప్తావు?” అని అడిగాడు కోపంగా. బావురుమంది లిల్లీ.

“నాకు తెలుసు బ్రాండన్. కానీ ఆమెకి ఎదురాడలేను నేను. ఆమెని ఇంట్లోకి రానిచ్చానని తెలుస్తే స్టాన్లీ మండిపడతాడు. ఆమెని ఆపడానికి ఎంత ప్రయత్నించానో చెప్పలేను. కానీ ఆమె నా తల్లి! నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపొమ్మని చెప్పలేకపోయాను. నా ఖర్మకి ఆమెకెందుకో ఎల్సీతో ఎడతెగని కబుర్లు. స్టాన్లీకీ సంగతి తెలిస్తే నేను బ్రతకలేను.”
ఆమె దుఃఖం చూసి బ్రాండన్ కరిగిపోయాడు.
“పోన్లే లిల్లీ! బాధ పడకు. కానీ నువ్వామెకి భయపడడం మానేయాలి. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే అలాటి ఆడవాళ్ళు ఇంటికి రావడం ఏ మగవాడికీ ఇష్టం వుండదు. స్టాన్లీ చాలా మంచి వాడు. నువ్వు భయపడకు,” ఆమెకి సర్ది చెప్పాడు.
“నేనెప్పుడూ స్టాన్లీ నించి ఏదీ దాచను. స్టాన్లీ కాకపోతే ఈ ప్రపంచం లో నాకింకెవ్వరున్నారు? అసలు ఎప్పుడు స్టాన్లీ నన్నొదిలి ప్రయాణాలకెళ్ళినా నాకేదో ఆపద చుట్టుకుంటుంది. అందుకే నాకు స్టాన్లీ పక్కన లేకపోతే భయం నాకు. ఆయన మాట విని విరివాల్టా వెళ్ళిపోయినా ఈవిడ పీడ తప్పేది నాకు.”

లిల్లీ ఆవేదన చూసి బ్రాండన్ ఆశ్చర్యపోయాడు. అతనింకా లిల్లీకి భర్త పట్ల అంత ప్రేమా అభిమానాలూ వున్నట్టు ఊహించలేకపోయాడు. నిజానికి బ్రాండన్ కి లిల్లీని చూస్తే అంత ఇష్టం వుండేది కాదు. స్టాన్లీ లాటి మంచి మనిషికీ, కష్టపడే మనస్తత్వానికీ ఆమె సోమరితనమూ, నిర్లక్ష్యమూ ఏవీ సరిపడవని అతననుకుంటూ వచ్చాడు. స్టాన్లీ లాటి భర్త లభించడం తన అదృష్టమన్న గుర్తింపు లిల్లీకి ఏమాత్రమూ లేదని అనుకుంటూ వచ్చాడతను. నిజంగా లిల్లీ మనసులో స్టాన్లీ కున్న విలువ చూసి ఆశ్చర్యపోయాడు.

అసలెప్పుడూ లిల్లీ తన మనసులోని మాటలని పొందికగా చెప్పగలిగేదీ కాదు. అయితే మిసెస్ పెక్ లాటీ అపభ్రంశపు తల్లి చేతుల్లో పెరిగిన ఆడకూతురుకి అంత కంటే ఎక్కువ సంస్కారం ఎలా అలవడుతుంది, అనుకున్నాడు. కొంతవరకూ అ విషయం నిజమే అయినా తన తల్లిని చూసినప్పణ్ణించీ లిల్లీకి కొంచెం అవగాహన పెరిగింది. తనకన్ని సుఖాలూ సౌకర్యాలూ కల్పిస్తూ తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన పెంకితనాన్నీ, చిన్న పిల్లల మనస్తత్వాన్నీ ఓపికగా భరిస్తున్న భర్తనీ, ఇంకా తననించి ఏదైనా లాభం వస్తే పొందుదామని ఎదురు చూస్తున్న తల్లినీ అప్రయత్నంగానే బేరీజు వేసిందామె మనసు. భర్త మీదా ప్రేమా గౌరవమూ రెట్టింపయ్యాయి! తన తల్లినించి రక్షించగలిగే ఒకే ఒక నీడ లా అనిపిస్తున్నాడామె భర్తకి. ఇప్పటికిప్పుడు స్టాన్లీ ఇక్కడికొచ్చి నన్ను ఇక్కణ్ణించి తీసికెళ్ళిపోతే బాగుండనుకుంది ఆమె. కన్నీళ్ళు తుడుచుకుంది.
ఆమె మనసు మళ్ళించాలనుకున్నాడు బ్రాండన్.

“అదంతా వొదిలెయ్యి లిల్లీ! అసలు నేను పెళ్ళాడబోయే అమ్మాయిని దుకాణాలవెంట తిప్పడానికి నీకెంత ధైర్యం!” నవ్వుతూ అన్నాడు.
“నువ్వు పెళ్ళాడ బోయే అమ్మాయి?” అయోమయంగా చూసింది లిల్లీ! అంతలోనే అర్థమయి సంతోషంతో కెవ్వుమంది.

“అమ్మ దొంగా! మరి చెప్పవేం ఇంతసేపూ? అబ్బ! ఎంత చక్కటి వార్త చెప్పావు బ్రాండన్! ఎల్సీ చాలా మంచి పిల్ల. నీకు అన్నివిధాలా తగిన భార్యా! హేరియట్ లాటి గర్విష్టి తో ఎలా సర్దుకుంటావో నని అప్పుడప్పుడూ బెంగ పడ్డాననుకో! పన్లో పని, జేన్ టీచర్ క్కూడా పెళ్ళి కుదిరితే బాగుండు. ఆ అమ్మాయిని చూసి మగవాళ్ళందరూ బెదిరి పోతారెందుకో! హేరియట్ ఎటూ డాక్టరు గ్రాంట్ ని పెళ్ళాడే టట్టుంది,” నవ్వింది లిల్లీ.
“అవునట. నేనూ విన్నా. అందుకే ఆ అమ్మాయిని అన్యాయం చేస్తున్నానేమో నన్న భయం కూడా లేకుండ హాయిగా ఎల్సీని అడిగాను.”
” అయితే ఒక్క మాట! డాక్టరుని పెళ్ళాడతానని హేరియట్ నాతో ఒక్క మాట కూడ అనలేదు. ఇద్దరూ కలిసి ఎడ తెగని కబుర్లు చెప్పుకునేవారంతే. కాబట్టి ఏ సంగతీ జాగ్రత్తగా కనుక్కోవడం మంచిది.”

“అదే నేను చూడు! పెళ్ళాడాలన్న నిర్ణయానికొచ్చిన అరగంటలో నికే ముందుగా చెప్పేసాను.”
“మంచి పని చేసావు. ఎల్సీ లేకపోతే నాకు చేయి విరిగినట్టుంటుందనుకో. ఇంతకీ పెళ్ళెప్పుడు?”
“ఎల్సీ ఎప్పుడంటే అప్పుడే!”
“తోడు పెళ్ళి కూతురు మాత్రం మా ఎమిలీ నే! అది ఎప్పణ్ణించో నీ పెళ్ళి కోసం ఎదురు చూస్తోందందుకనే”
నవ్వాడు బ్రాండన్. “ఆహా అలాగే! అది సరే కానీ, లిల్లీ, మిసెస్ పెక్ మీ అమ్మ అన్న సంగతి నేను ఎల్సీతో చెప్పలేదు. నువ్వు చెప్తావా నేను చెప్పనా?”
“నేనే చెప్తాలే. ఇప్పుడే లోపలికెళ్ళి తనతో మాట్లాడి వొస్తా. అప్పడిదాకా ఇక్కడే వుండు,” లేచి నిలబడింది లిల్లీ.
లోపలికెళ్ళి ఎల్సీని గట్టిగా కౌగలించుకుంది సంతోషంగా!
“ఎల్సీ! బ్రాండన్ సంగతంతా చెప్పాడు. భలే సంతోషంగా వుంది నాకు. స్టాన్లీ కూడా సంతోషిస్తాడు. అది సరే కానీ, ఎల్సీ, నీకొక రహస్యం చెప్పాలి.మిసెస్ పెక్ మా అమ్మ! అందుకే ఆవిడకి గట్టిగా ఎదురాడలేకపోయాను. ఆవిడ మనింటికొచ్చిన సంగతి తెలిస్తే స్టాన్లీ మండి పడతాడు. నువ్వీ విషయం దయచేసి నీలోనే దాచుకో. మీ అక్కయ్యకి కూడా చెప్పొద్దు!”
ఆశ్చర్యపోయింది ఎల్సీ.
“అవునా? అదన్నమాట సంగతి. పోన్లెండి, జరిగిందేదో జరిగిపోయింది. నేను ఎవ్వరికీ చెప్పకుండా దాచుకుంటాను,” లిల్లీని సమాధాన పరచింది ఎల్సీ.
“ఇంత మంచి విషయం తెలిసాక నాకిక్కడ కాలు నిలవడం లేదు. హాయిగా మన ఎస్టేటు కెళ్ళిపోదాం. ఎల్సీ, నేను నిన్నెప్పుడైనా నొప్పించి వుంటే అదంతా ఎమీ మనసులో పెట్టుకోవు కదా?” అమాయకంగా అడిగింది లిల్లీ.
“అదేం లేదండీ! అదంతా గతం, మర్చిపొండి,” అనునయంగా అంది ఎల్సీ.
“అబ్బ, పెళ్ళంటే ఎన్ని పనులో! ముందు ఎమిలీకీ పిల్లలకీ మంచి బట్టలు కొని కుట్టించాలి. ఇందాకే బ్రాండన్ తో కూడా చెప్పాను, మా ఎమిలీ యే తోడు పెళ్ళికూతురు! ఇప్పణ్ణించే మొదలుపెడితే కానీ పన్లన్నీ కావు. ఇంతకీ పెళ్ళెప్పుడనుకుంటున్నారు?”
సిగ్గుతో నవ్వేసింది ఎల్సీ.
“ఏదీ, ఇంకా ఏమీ అనుకోందే! అసలు నేను నమ్మలేకుండా వున్నాను, నాకు పెళ్ళి నిశ్చయమైందంటే!”
“అన్నట్టు చెప్పడమే మర్చి పోయాను. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటూ బ్రాండన్ ముందు గదిలోకి రమ్మన్నాను. వెళ్ళు, వెళ్ళు! వెళ్ళి పెళ్ళి ఎప్పుడన్నది నిశ్చయించుకుని నాకొచ్చి చెప్పు!” హడావిడి పడింది లిల్లీ.

అయితే బ్రాండన్ పిలిచింది పెళ్ళి గురించి మాట్లాడడానికి కాదు. మెల్బోర్న్ విడిచి తన ఎస్టేటుకెళ్ళే ముందే పెళ్ళాడేయాలన్నది అతని అభిమతమే అయినా, అంతకంటే ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయతనికి.

ముందుగా మావయ్య వీలునామా గురించి. అందులో అక్షరం పొల్లు పోకుండా తనకి గుర్తుందన్నది ఎల్సీ. తర్వాత మిసెస్ పెక్ ని పట్టుకోవడం. ఇంకా తమ భవిష్యత్తు గురించి చర్చలు! అన్ని కబుర్లూ అయి గడియారం చూసుకుని ఉలిక్కిపడ్డాడు బ్రాండన్. తను ఆ ఇంట్లో దాదాపు రెండు గంటలపైగా కూర్చున్నాడు. మళ్ళీ మర్నాడు కలుద్దామని చెప్పి వెళ్ళిపోయాడు.

***
(సశేషం)

మీ మాటలు

*