లోపలిదేహం

 734305_498249500226884_2100290286_n

సుడులు తిరిగే తుపానులాగానో

వలయాల సునామీలాగానో

దు:ఖఖండికల్లోని పాదాల్లాగానో

సుఖసాగర అలల తరగలలాగానో

కదులుతూ గతస్మృతులేవో లోపలిదేహంలో!

కొన్నింటికి లేదు భాష్యం

భాష్యంకొన్నింటికిమూలాధారం

చీకటిగుహలూ

ఉషోసరస్సులక్కడ

ఎండాకాలపు సెగలూ

చిరుగాలుల చల్లటి నాట్యమక్కడ

ఎడారి ఏకాంతం

పూలపానుపుపై ప్రియురాలి విరహపు కదలికలక్కడ

స్నేహలతలకు అల్లుకున్న మల్లెపూలపరిమళాలక్కడ

శతృవైరుధ్యాల వేదికపై అగ్నిపూలయుద్ధాలక్కడ

దు:ఖ

ఆనందడోలికల్లోమోమునుముంచితీసేవాళ్ళూ

కష్టసుఖాలసమాంతరజాడలక్కడ

ఎవరివోభావాలుమనవై

మనభావాల విహంగాలెగురుతాయి పరాయి ఆకాశాలపై

ఒంటరితనంలో విరహం కోరుకునేతోడు

సమూహానందంలో నవ్వుకోరుకునే ఒంటరితనం

ఒకదాని తర్వాత ఇంకోటి

తపనల తీరని అన్వేషణలక్కడ

అన్వేషణల తండ్లాట లోపల మొదలై

బహిరంగ విన్యాసమయ్యే విశాలశాఖల చైతన్యం

స్మృతి అదృశ్యదేహం, దేహం లోపలిదేహం!

ఎన్ని స్మృతులు లోపలికింకితే నువ్వునువ్వు

ఎన్నిస్మృతులు కన్నీళ్ళ సముద్రాలైతే ఒక నీ నవ్వు

ఎన్నికాలగతాలూ, ఎన్నెన్ని స్వగతాలు నీలో అంతరంగమై నీవో నడిచేమనిషివి

అలుపెరగని, అలుపు తీరని సమరగీతాలవి

సజీవజీవనయానంలో నీకై పోరాడుతూ విడిచిన ప్రాణాలప్రతిమలవి

ప్రాణంలోనే పోరాటం నింపుకున్న ప్రజాసమూహాలవి

స్మృతులు ఎండిపోని రుధిరవనాలు

మరణంలేని మహాకావ్యాలు.

మహమూద్

 

మీ మాటలు

  1. “స్మృతులు ఎండిపోని రుధిర వనాలు” – ఎంత చక్కని భావన. మన లోపలి దేహన్ని ఇంత చక్కగా వ్యక్తీకరించిన కవిత ఇటీవలి కాలంలో నేను చూడలేదు. మహమూద్‌లోని తపనల తీరని అన్వేషణ గమ్యం ఈ ‘లోపలి దేహం’ అనుకుంటాను.

  2. లోపలి దేహం దేశం నడిబొడ్డున నిబ్బరంగా నిలబడి యుద్ధం చేస్తున్న ఆదివాసీ లోలోపలి శక్తిని కంటిముందు నిలిపింది. అభినందనలు మిత్రమా..

  3. Dadala Venkateswara Rao says:

    ఎవరివోభావాలుమనవై

    మనభావాల విహంగాలెగురుతాయి పరాయి ఆకాశాలపై

    స్మృతి
    విహంగాలు మనభావాలై
    పరాయి ఆకాశాలపై
    ఎగురుతాయి
    స్మృతి
    ఒంటరితనంలో
    విరహం కోరుకునేతోడు
    స్మృతి
    సమూహానందంలో
    నవ్వుకోరుకునే ఒంటరితనం
    స్మృతి
    లోపలిదేహం!
    స్మృతి అదృశ్యదేహం,
    స్మృతి దేహం లోపలిదేహం!
    స్మృతులుఎండిపోని రుధిరవనాలు
    స్మృతులు మరణంలేని మహాకావ్యాలు.
    స్మృతులు లోపలికింకితే నువ్వునువ్వు
    స్మృతులు కన్నీళ్ళ సముద్రాలైతే ఒక నీ నవ్వు
    స్మృతులు అలుపెరగని, అలుపు తీరని సమరగీతాలు
    స్మృతి బహిరంగ విన్యాసమయ్యే విశాలశాఖల చైతన్యం
    స్మృతులు ప్రాణంలోనే పోరాటం నింపుకున్న ప్రజాసమూహాలు
    స్మృతులు సజీవజీవనయానంలో నీకై పోరాడుతూ విడిచిన ప్రాణాలప్రతిమలు

    మీ లోపలి దేహాన్ని నా స్మృతిలో ఇలా ద్యానిన్చుకున్నాను. – మహమూద్ గారు

  4. ఎన్ని స్మృతులు లోపలికింకితే నువ్వునువ్వు …
    ఎన్నిస్మృతులు కన్నీళ్ళ సముద్రాలైతే ఒక నీ నవ్వు …
    ఎన్నికాలగతాలూ, ఎన్నెన్ని స్వగతాలు నీలో అంతరంగమై నీవో నడిచేమనిషివి …

    kudos …

మీ మాటలు

*