మ్యాచీస్

drushya drushyam 37..
పంచుకునే క్షణాలు.అవి మామూలు క్షణాలే కావచ్చును. అత్యంత సర్వసామాన్యమైన క్షణాలే కావచ్చును.
కానీ, విలువైన సమయాలు. ఏదైనా ‘పంచుకునే’ ఆ కొన్నిఘడియలు అపూర్వమైనవి.

క్షణకాలమే కావచ్చు.
కానీ, అవి బతికిన క్షణాలు. తర్వాత మామూలే.

అవసరం ఉన్నప్పుడు మాత్రం అవి మామూలు క్షణాలు కావు.

జీవితంలో అంత ప్రాధాన్యంగా తోచని ఆయా క్షణాలను సహజంగా, అవలీలగా ఛాయా చిత్రాల్లో పదిల పరచడం నిజంగా ఒక భాగ్యం.
సంబురం. సవాల్ కూడా.

ఈ చిత్రం చూడండి.
సిగరెట్టు లేదా బీడీ కాల్చడం.
అందుకు అగ్గిపెట్ట అవసరం కావడం.
ఇద్దరు. మ్యాచీస్.
అదే ఈ చిత్రం. ఒక లఘు చిత్రం.

+++

‘మ్యాచీస్ ఉందా?’
జవాబు ఉండదు. వినిపించదు.
కానీ, క్షణం తర్వాత చేతికి అగ్గిపెట్టె అందుతుంది.
అంతే.

చిత్రం పూర్తవుతుంది.
వారిద్దరూ సినిమా విడిచి పెట్టినాక ఎవరి దోవన వారు పోయే ప్రేక్షకుల్లా మళ్లీ మాయం.
మామూలే.

ఏమీ జరగనట్టు.

నిజానికి ఇటువంటి క్షణాలను బంధించడానికి సారస్వతం బాగుండదు.
కవిత్వం ‘అతి’ అవుతుంది.
దృశ్యమే పదిలం.

అవును.
కొన్నింటి అనుభూతి మాటల్లో చెబితే తేలిపోతయ్.
అక్షరాల్లోకి అనువదిస్తే భారమైతయ్.
ఛాయాచిత్రమే మేలు. పదివేలు.

ఈ వారం అదే. మ్యాచీస్. అడగ్గానే అగ్గిపెట్టెను అందిస్తున్నప్పటి అనుభూతి.

+++

నిజానికి చాలా ఉంటై.
ఇలాంటి ఔదార్యపూరిత క్షణాలు చాలా ఉంటై.
వాటిని అలవోకగా పదిల పర్చడానికి దృశ్యమానమే మహత్తరం.

కాకపోతే సమ్మతి ఉండాలి.
ఒక అలవాటును అంగీకరించే చేవ….ఒక అనుభూతిని అర్థం చేసుకోగల సమ్మతి. సానుకూలత తప్పనిసరి.
అప్పుడు మాటలేమీ ఉండవు, అభిమానంగా పంచుకునే క్షణాలు తప్ప!.

అందుకే అనడం…
ఒక మాధ్యమంగా లేదా యానకంగా ఛాయాచిత్రలేఖనం నిజంగా బతికిన క్షణాలను పదిలపర్చే అద్భుతమైన రచన అని!

+++

మరొక్కసారి ఈ ఛాయాచిత్రం చూడండి.
ఆ కళ్లు.
చిత్రంలో మూసుకున్నకళ్లు దేనికి చిహ్నం?

మళ్లీ మళ్లీ చూడండి.
అగ్గిపెట్టె తగిలినప్పటి దృశ్యం కదూ అది!

మీరు కళ్లు మూసుకున్నా లేదా తెరిచినా
జేబులోకి చేయుంచగానే ఆ వస్తువు తగిలితే అది చూపు.
కళ్లు అక్కడ తగులుతై.
అందుకే మూసుకున్న ఆ కళ్లు వస్తువు దగ్గర తెరుచుకోవడం ఒక దృశ్యం.

గమనించి చూడండి.

దృశ్యం దగ్గర చూపు ఆగనవసరం లేదు. స్పర్శ తగిలినా అది చూపే.
అప్పుడు కళ్లు అరమోడ్పులైతయి. మూసుకుంటై.
ఆనందానికీ, విషాదానికీ స్పందిస్తయి.
అట్లే ఒక సాహచర్యం. ఒక ఔదార్యం. పంచుకోవడం.
ఆ సమయంలోనూ కళ్లు జేబులోకి వెళుతై.
అప్పటి చిత్రమే ఇది.

మ్యాచీస్.

+++

అయితే, సాధారణంగా ఇద్దరి అనుభవంలో ఉన్నదే ఇది.
అగ్గిపెట్టెను షేర్ చేసుకోవడం ఎవరికైనా తెలిసిందే.
ముఖ్యంగా స్మోకర్స్ కు.

చిత్రమేమిటంటే, అదొక అదృశ్యం.
బయటకు తెలియనే తెలయదు.
అయితే, ఇద్దరి అనుభవంలో ఉన్నదాన్ని మూడవ అనుభవంలోకి తేవడమే ‘దృశ్యాదృశ్యం’.

పంచుకోవడం. ఆ క్షణాలు.
ఏమైనా ‘పంచుకునే’ ఆ కొన్నిఘడియలు అపూర్వమైనవి.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

మీ మాటలు

  1. భలే నచ్చింది.
    ఇంకో సంగతి. సామాన్యంగా అగ్గిపెట్టె అరువు అడిగేవాళ్ళు అగ్గిపెట్టె వుందా అని అడగరు. బొటనవేలికి చూపుడువేలుకి మధ్య అగ్గిపెట్టె వుంచుకోని గలగల లాడిస్తూ ఊపినట్లు చేసి చూపిస్తారు. అవతల వ్యక్తికి అర్థం అయిపోతుంది. భాష అవసరంలేదు. ఎక్కడో ఒరిస్సా నుంచో, బీహార్ నుంచో వచ్చిన కూలీకి అగ్గిపెట్టె అనే (తాత్కాలిక) అవసరం తీరడానికి భాష అక్కరలేదు. పైగా అడిగిన తరువాత అవతల వ్యక్తి అగ్గిపెట్టి తీసి ఇస్తాడని ఎంత నమ్మకం అంటే కనీసం అటు వైపు కూడా చూడడు. (ఈ చిత్రంలో లాగ). “క్షణం తర్వాత చేతికి అగ్గిపెట్టె అందుతుంది” అని మీరు రాసింది కరెక్ట్. అదే నమ్మకం కూడా. తిరిగి ఇచ్చేటప్పుడు కూడా ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకోక్కరలేదు. అగ్గిపెట్టె మళ్ళీ చేతులు మారుతుంది. ఎవరి పొగలో వారు మాయం అయిపోతారు.

మీ మాటలు

*